ఒకానొక అజ్ఞానపు క్షణంలో. . . నాకు తెలీకుండా నేనే జన్మించి,  అమ్మ చనుబాలలో ఆది సంవేదన అనుభవించి. . .ఆటపాటలలో అద్వితీయుడనై రాణించి. . .సంఘ విద్యా సముపార్జనలో సారస్వత చక్రవర్తినై, పుస్తకాల్ని పఠించి. . .పరీక్షల్ని పరివీక్షించి. . .ఆత్మజ్ఞాన అవలోకనంలో విలువల వలువలు వూడదీసి. . .విశ్వతత్వాలు స్మరించి. . . మానవ శ్రేయస్సు మహా లక్ష్యమై పోగా. ."ఈ ప్రపంచపు దొడ్డబిడ్డగా ఉద్భవించాల"నీ, "ఒక పూర్తి మానవుడిగా పరిణమించాల"నీ, నేను కంటున్న కల,  కడుతున్న కోట. . .ఒహ్ ఇంతెందుకు కనుచూపు మేరలో. . . నా జీవితం ఒక వేద సంకలనం!!  నేనొక ఈశ్వరుడిని!!! ( ఇది ఈ బ్లాగులోని ప్రసంగి కథలో ఒక పాత్ర మనోభావాలు __ రచయిత )

Thursday, September 18, 2008

అహంకారి (కథ)...3

(భార్యాభర్తల మధ్య సున్నితమైన మానసిక సంబంధాల మీద అల్లబడి, జూన్ నెల 'పొద్దు' ఇంటర్నెట్ పత్రికలో ప్రచురించబడిన నా కథ)

అహంకారి (కథ)...3

సురేఖ విచిత్ర విడాకుల ఉదంతం విని నేను నిర్ఘాంతపోయాను.

మానవ సంబంధాలు, విలువలలోని ఔచిత్యం, సున్నితత్వం గురించి నేను తెలీనివాడ్ని కాదు. అయినా సురేఖ వైవాహిక జీవితం పరిశీలించాక నాకవన్నీ మళ్ళీ మరింత విశదంగా భోదపడినట్టయింది. మనం తప్పు చేయకపోవడం పెద్ద గొప్పనుకుంటాం. కానీ కాదు. ఆవతలి వ్యక్తులు మన చర్యలకి ఏ విధంగా స్పందిస్తున్నారో, ఏ విధమైన బాధననుభవిస్తున్నారో గ్రహించుకుని మసలుకోవడం అంతకన్నా గొప్పగా, ముఖ్యంగా నాకు తోచింది.

అంతలోనే సురేఖ, “ఇప్పుడు చెప్పు. నేను చేసింది తప్పంటావా?” అంది. ఆపైన, పక్కకి తొలగిన చున్నీని వతైన ఛాతీ మీదికి లాక్కుంది.

నేనామె ప్రశ్నకి సమాధానం యివ్వకుండా, “ఇంతకీ ఏ కారణాలతో అంటే ఏ ‘గ్రౌండ్స్’ ని ఆధారం చేసుకుని యిచ్చింది నీకు కోర్టు విడాకులు?” అన్నా.

“ఏదో! చెత్తాచెదారం. అన్నీ అబద్దాలే. ఆ లాయరు చెప్పమన్నవన్నీ కోర్టులో చెప్పాను. మొత్తం మీద సుబ్బారావుని చేయకూడనంతటి దోషిని చేస్తేనే వచ్చాయి విడాకులు.” అందామె బాధగా.

ఎవరో పనిగట్టుకుని తీర్చిదిద్దినట్టుండే సురేఖ మృదువైన పెదాలు అసత్యాలు పలికి, అసలుని నకిలీ చేయడం నాకు నచ్చలేదు. అందుకే__

“సుబ్బారావుని దోషిని చేయడం నీకు తప్పనిపించలేదూ?” అడిగాను.

“అనిపించింది. కానీ అలా అనుకుంటూ పోతే నాకు విముక్తి లభించదే. అయినా నాకు తెలిసిందొక్కటే. ముందు నా జీవితం నాకు ముఖ్యం. నా మనసు__ దాని బాగోగులు__ దానికి నొప్పి కలుగకుండా చూసుకోవాల్సిన బాధ్యత, నాదేనని నా ప్రగాఢ నమ్మకం. నా జీవితానికీ, నా మనసుకీ, సుబ్బారావు బాధలతో నిమిత్తం ఉందని నేననుకోను. ఇక మా బాబు జీవితం అంటావా? వాడికేం? సుబ్బారావు జీవించివున్నంత కాలం వాడికేలోటూ వుండదు!” అంది నమ్మకంగా.

“పోనీ, నువ్వు ప్రపంచానికి సుబ్బారావుని దోషిగా చూపడం అతడికి కోపం తెప్పించలేదా?”

“లేదు. కోర్టు విడాకులకు అనుమతిచ్చిన రోజు రాత్రి సుబ్బారావు మా యింటికొచ్చాడు. నన్ను పట్టుకుని పసివాడిలా వలవలా ఏడ్చాడు. నేను లేకుండా జీవించలేనన్నాడు. తన బిడ్డని తల్లిలేనివాడిగా చేయొద్దని వేడుకున్నాడు.”

“నువ్వేమన్నావు?”

“అతడ్ని కోర్టుకీడ్చి విడాకులు సంపాదించిన దాన్ని ఏమంటాను? కుదరదన్నాను. విసిగించకుండా వెళ్ళమన్నాను. ఏం చేయగలడు సుబ్బారావు? అలాగే ఏడుస్తూనే, బాబుని భుజాన వేసుకుని వెళ్ళిపోయాడు. బాబు కూడా వెళ్తుంన్నంతసేపూ నన్ను చిత్రంగా చూస్తూనే వున్నాడు. ఆ దృశ్యం చూసి నా కడుపు తరుక్కుపోయింది. ఆ తర్వాత, రెండురోజులపాటు ఏడుస్తూనే గడిపాను.” అంది సురేఖ. ఆమె కళ్ళలో కన్నీరు పొంగింది. మళ్ళీ తనే __

“చెప్పు! నేను చేసింది తప్పేనంటావా?” అడిగింది.

ఆమెకి తన ప్రవర్తన కొంత అనిశ్చితికి గురిచేసినట్టుంది. తన ప్రవర్తనలోని మంచిచెడుల్ని నిగ్గుదేల్చుకునేటందుకు ఆమె నా అభిప్రాయానికి స్వాగతం పలుకుతూ, ఆతృత కనబరుస్తోంది. ఎందుకంటే సురేఖ దృష్టిలో నేనొక పరిణతి చెందిన వ్యక్తిని. అందుకే __

“ఏం చెప్పను సురేఖా. కవితలల్లీ, రచనలు చేసీ, విలువలేమిటో కళాత్మకంగా పదిమందికీ వివరించగలదానవు. మనసు కష్టపెట్టుకోడం తప్పని తెలుసుకునే స్థాయికి ఎదిగిన స్త్రీవి. మనసు__ దాని పరిమితులెరిగిన వాడిగా నీకు తప్పుని ఆపాదించలేను. అలాగని, జీవితం ప్రాక్టికాలిటీతో, జీవించడంలో వున్న సౌందర్యంతో అంతటి నీ కళాహృదయాన్ని సైతం అథః పాతాళానికి తొక్కేయగలిగిన సుబ్బారావు క్రమశిక్షణనూ నేను తప్పు పట్టలేను.” అన్నా.

సురేఖ మాట్లాడలేదు. కానీ, నా మాటలు చాలా శ్రద్ధగా ఆలకిస్తోంది.

మళ్ళీ నేనే__ “వ్యక్తులు విప్పిచెప్పుకోలేని తప్పొప్పుల్ని కాలం, భవిష్యత్తూ విశదపరుస్తాయంటారు. చూద్దాం. అంతవరకూ మనం వేచివుండక తప్పదు.” అంటూ వెళ్ళడానికన్నట్టు లేచాను.

* * *

ఓ ఏడాది గడిచింది.

మళ్ళీ సురేఖ నుండి అర్జంటుగా విజయవాడ రమ్మని నాకు ఫోనొచ్చింది. ఏదో ఒక విశేషమైన పని లేనిదే సురేఖ నన్ను విజయవాడ రమ్మనదు. ఉన్నఫళాన బయలుదేరి విజయవాడ చేరా. సురేఖని వాళ్ళింట్లో కలుసుకున్నా.

నేను వెళ్ళేసరికి సురేఖ మంచమీద పడుకుని వుంది. ఎప్పుడూ లేనిది ఆమె ఈసారి చీర కట్టుకుని వుంది. ఏదో సుస్తీ చేసిన దానికి మల్లే ఆమె శరీరం నీరసంగా వుంది. నన్ను చూడగానే మంచంమీంచి బలవంతంగా లేవలేనట్టుగా లేచి కూర్చోబోయింది. ఆమె వాలకంలో ఏదో కృత్రిమత్వం తోచి నేను వలదని వారించాను. ఆమె మళ్లీ పడుకుంది. అంత నీరసంలోనూ నన్ను చూసిన ఆనందం ఆమె ముఖంలో కన్పిస్తూనే వుంది. మొదటగా__

“బావున్నావా?” అంది. పమిటని గుండెలమీదికి సర్దుకుంటూ.

“బాగానేవున్నా.” అన్నా.

“బానేవుంటావులే. కష్టాలు పడను నన్ను కట్టుకోలేదుగా.” విషాదంగా నవ్వింది.

“ఏంటా మాటలు. అసలేమయింది నీకు?” అన్నా.

“ఏమవుతుంది? నువ్వప్పుడో మాటన్నావు గుర్తుందా? మనుషులు తేల్చుకోలేని సమస్యలు భగవంతుడే తేలుస్తాడని---గుర్తుందా?” అంది సురేఖ. స్వేదంతో ఆమె శరీరం తడిసింది. జాకెట్టుకీ, చీరకీ మధ్యభాగంలోని నడుము భాగం రెట్టింపు కాంతితో నాజూగ్గా కన్పిస్పోంది.

“భగవంతుడని నేననలేదు. కాలం అన్నాను.” అన్నా.

“ఏదో ఒకటిలే. అదిప్పుడు తెలిసొచ్చింది నాకు.” అందామె.

“ఏమైంది నీకు?” అడిగా భయంగా.

“పాపిష్టిదాన్ని నాకేమవుతుంది? సుబ్బారావుకే పాపం మూత్రపిండాలు దెబ్బతిన్నాయి. నావల్ల ఎంత వేదన అనుభవించాడో ఏమో?” కన్నీరు ఆమె కనతలమీది నుంచి చెవులమీదికి కారుతోంది.

నేను చలించిపోయా. “మూత్రపిండాలెందుకు దెబ్బతిన్నాయి సుబ్బారావుకి?” అన్నా అసంకల్పితంగానే.

సురేఖ మళ్ళీ నవ్వింది. “ఆర్నెళ్ళ పసివాడికి కాన్సర్ ఎందుకొస్తుందంటే ఏం చేపుతావు? సుబ్బారావు కూడా పసివాడే కదా! అందుకే వచ్చుంటుంది.” అంది కాళ్ళు ముడుచుకుని. చీరని పాదాలమీదికి లాక్కుంది. పాలవంటి ఆ తెల్లటి పాదాల దగ్గర బంగారు రంగు పట్టీలు మెరుస్తున్నాయి.

“అయితే ఏమంటున్నారు డాక్టర్లు?”

“ఏమన్నారు? అతడు బ్రతకడానికి మూత్రపిండం కావాలన్నారు. ఎవరిస్తారు సుబ్బారావుకి. అందుకే నేనే యిచ్చా.” అంది సురేఖ.

“నువ్విచ్చేవా మూత్రపిండం సుబ్బారావుకి?” బాధగానూ, ఆశ్చర్యంగానూ అడిగా.

“మరి నేనతడి దేవతని కదా నేనివ్వక మరొకరినివ్వనిస్తానా?” అని, మళ్ళీ తనే స్వగతంలో అనుకుంటున్నట్టుగా, “సుబ్బారావు ప్రేమని సంపాదించగలిగిన నేనెంతటి ధన్యురాలిని?” అంది.

“అయితే యిప్పుడెలా వుంది?” అన్నా ఆతృతగానే.

“ఆయనకేం మహారాజు. వెంటనే కోలుకున్నాడు. నాకే గ్యారంటీ లేదన్నారు డాక్టర్లు.”

“ఏమన్నారు?” శరీరం గగుర్పాటు చెందగా ప్రకంపించిపోతూ అడిగాను.

“బ్రతకనన్నారు. చూసేవా? కంటి ఆపరేషన్ లో నెగ్గుకు రాగలిగేను గానీ ఇక్కడ ఓటమి తప్పలేదు.”

నా చిరకాల నేస్తం మృత్యువు పాలవబోతుందన్న విషయం నన్ను నిర్వీర్యుడ్ని చేసింది. శోకోన్మత్తత నా శరీరాన్ని ముప్పిరిగొనగా నేనామె తల దగ్గర కూర్చుని ఆమె నుదుటిమీద చెయ్యేశా.

సురేఖ నవ్వింది. “చూశావా! నీలో ప్రేమని ఈనాటికి నాతో చెప్పుకోగలిగావు.” అంది__ నా చేతిని తన రెండు చేతుల్తో ఆప్యాయంగా పట్టుకుంది.

నేను నాచేతిని గబుక్కున లాక్కోబోయి, ఏదో అనుమానం వచ్చినవాడిలా ఆమె కళ్ళలోకి చూశాను.

“నీ ప్రేమ గురించి నాకు తెలుసు. నా ఈ శరీరం మీద నీకున్న వ్యామోహం, ఆకర్షణ ఎంత బలమైనవో కూడా నాకు తెలుసు.” అంది సురేఖ.

కన్నీరు తుడుచుకుంటూ ఆమె వైపు చిత్రంగా చూశా.

“నిజమే. ఓ పదినిముషాలపాటు ఈ శరీరాన్ని నీకు అర్పించుకునివుంటే ఈ ప్రపంచానికేం నష్టం. నాకూ పోయేదేముందిగానీ, ఆ పని చేయను ఈ శరీరం మీద నాకేం అధికారం వుందని. ఈ శరీరం నాదీ నీదీ కాదు. సుబ్బారావుదే!” అంది మళ్ళీ కన్నీరు పెట్టుకుంటూ.

నేనేమె వైపు నిశ్చలంగా చూస్తున్నాను.

“కోర్టులకెళ్ళి మంచోళ్ళతో విడివడిపోవడమే తెలుసుగానీ మొద్దుమాలోకం ఈమెకేం తెలుసు ప్రేమ గురించి అనుకుంటున్నావు. కదూ?” తల పక్కకు వాలుస్తూ ప్రశ్నించింది. మెడ ప్రక్కన పుట్టుమచ్చ ఆమెమీది ప్రేమతో అక్కడే ఆమె చర్మాన్ని కౌగిలించుకుని అందంగా కన్పించసాగింది.

‘కాద’న్నట్టు తలూపాను. అంతటి బాధలోనూ.

“నిజంగానే నాకు తెలీదు. పెళ్ళయినాక సుబ్బారావే చెప్పాడు ఒకరోజు. నీ కళ్ళూ, నీ చూపులూ, నన్ను ఆరాధించే తత్వం కలిగివుంటాయట. నువ్వు కూడా తనలాగే నా భక్తుడివట. భర్త ఎవరైనా భార్యకట్లా చెపుతాడా? అంతటి ఉదార హృదయుడూ, మంచివాడూ, తెలివైనవాడూ సుబ్బారావు.” అంది.

అంత విషాదంలోనూ నేను దిగ్భ్రాంతికి గురయ్యా.

సురేఖ మాట్లాడుతూనే వుంది.

“చూశావుగదూ? ఎన్ని కన్నీళ్ళు పెట్టించాను సుబ్బారావు చేత! అవన్నీ యిప్పుడు నన్ను చుట్టుముట్టాయి” అంది-- కన్నీటిని వ్రేలితో తొలగిస్తూ.

పశ్ఛాత్తాపంలో ప్రక్షాళన పొంది ఆమె కన్నుల నుండి జాలువారుతున్న అశ్రుధారలు అవి. నాకెందుకో అవి నాకలా అన్పించలా. పవిత్ర తీర్ధంలా తోచాయి.

“నేను సుబ్బారావుతో విడిపోయినందుకు పశ్ఛాత్తాపపడుతున్నా ననుకుంటున్నావు నువ్వు. లేదు. ఆ విషయంలో నేనెప్పటికీ వెనక్కిచూసుకోడమనేది లేదు. స్త్రీ అనే పదం యిక్కడెందుకుగానీ, వ్యక్తిగా అతడితో సంబంధం వదులుకుని నేను నా ఆత్మగౌరవం కాపాడుకున్నాననే భావిస్తా. మరి ఈ ప్రేలాపన, ఈ మూత్రాపిండాల దానం యివన్నీ ఎందుకంటావా? మానవత్వంగల మనిషిగా నా క్షేమంకోసం పరితపించిన సుబ్బారావు మీద నాకు అచంచలమైన భక్తి. అలాగే దయ కూడా” సురేఖ దుఃఖాన్ని నిగ్రహించుకుంది. “అన్నట్టు నిన్నెందుకు పిలిపించానో తెలుసా?” అడిగింది.

“తెలీదు.” అన్నా.

“సుబ్బారావుకి ఆపరేషన్ సక్సెస్ అయింది. అతడు బతుకుతాడు. నాకు తెలుసు. కానీ, ఒకవేళ దురదృష్టం వెన్నాడి అతడికేదైనా అయితే. . .?” సురేఖ కంఠం దుఃఖంతో పూడుకుపోయింది.

“ఏదైనా అయితే బాబు బాధ్యత నన్ను తీసుకోమంటావు. అంతేకదా?” అనడిగా.

“అంతేగాదు. బాబు పేరు కూడా మార్చాలి నువ్వు.”

“అలాగే. ఏం పేరు పెట్టమంటావు చెప్పు.” అన్నా. వంగి, అనునంయంగా ఆమె తలమీద చెయ్యేస్తూ.

“ఇంకేం పెడతావు? సుబ్బారావని పెట్టు. అంతకుమించిన అందమైన పేరు తెలుసా నాకీ లోకంలో. తండ్రి గుణంలో సగం లక్షణాలొచ్చినా చాలు. మెరుపులా బ్రతికేస్తాడు నా బాబు.” అంది సురేఖ నా చేతిని తన చేతిలోకి తీసుకుంటూ.

“అలాగే. సురేఖా!” అన్నా__దుఃఖోద్విగ్నుడనై ఓదార్పుగా ఆమె చేతుల మీద నేను చేయ్యేస్తూ.

క్షణం తర్వాత సురేఖ మళ్ళీ, “నేను ఇతివృత్తం చెబితే కథ రాస్తానంటావుగా. ఇప్పుడు రాయి కథ” అంది.

ఆమె చెప్పబోయేదేమిటో నాకు తెలుసు. అందుకే నేను మాట్లాడలేదు.

మళ్ళీ సురేఖే అంది. “నా బ్రతుకే నీ కథకి ఇతివృత్తం. రాయి. బహుశా మంచి కథవుతుందనుకుంటా” అటువేపు తిరిగి కన్నీరు విడిచింది.

నేను మళ్ళీ మాట్లాడలేదు. ఎందుకంటే ఆమె మాట నాకేమీ తప్పుగా అన్పించలా. నిజంగానే జీవితాన్ని కథకి కావలసినంత అతిశయంతో నింపుకుంది సురేఖ. కాదంటారా?

(నా కథలు చదివి, అభినందించి, నన్ను ప్రోత్సహించి, ఆరు సంవత్సరాల తర్వాత మళ్ళీ నాచేత కథ రాయించిన “కల్హార” బ్లాగు రచయిత్రి ‘స్వాతి’గారికి కృతజ్ఞతలతో¬__రచయిత)
( సమాప్తం )

Tuesday, September 16, 2008

అహంకారి (కథ)...2

( భార్యాభర్తల మధ్య సునిశితమైన మానవ సంబంధాల మీద అల్లబడి, జూన్ నెలలో పొద్దు ఇంటర్నెట్ పత్రికలో ప్రచురించబడిన నా కథ)
అహంకారి కథ..2

“చెప్పు సురేఖా!” అన్నాను. టీ తాగడం అయినాక. కప్పు టీపాయ్ మీద ఉంచుతూ.

“అతడితో కలిసి జీవించలేననిపించింది. అందుకే దూరం జరిగా.” అంది సురేఖ తలొంచుకుని. ఆమె నా ఎదురుగా సోఫాలో కూర్చుంది. ఆర్గండీ కాటన్ సెల్వార్ కమీజ్ వేసుకుని వుంది. బంగారు వర్ణంలో వున్న మెడమీద అదే వర్ణంలో వున్న గోల్డు చెయిన్ తళుక్కుమని మెరుస్తోంది---తనలోని లోహతత్వాన్ని తెలుపుకుంటూ.

“ఏమైంది? సుబ్బారావు బాధలుపెడ్తున్నాడా?” అన్నా.

ఆమె ‘ఔన’న్నట్టు తలూపింది. ఆపైన ముఖం పక్కకి తిప్పుకుంది. కలువరేకుల వంటి ఆ కనుల కొలనుల్లో నీళ్ళు మెరుస్తున్నాయి. అనాదినుండీ స్త్రీ విలాపానికి చిహ్నంగా ఆమె వెన్ను విరిచి బయటకు పొర్లుకొచ్చే విషాదపు కన్నీళ్లు__ మళ్ళీ మెరుస్తున్నాయి.

నేను క్షణం సేపు మాట్లాడలేదు. తర్వాత, “తిట్టడం కొట్టడం లాంటివి చేసేవాడా?” అన్నా.

సురేఖ నవ్వింది విషాదంగా. నా వేపు తిరిగి, “హింసంటే గిట్టదు సుబ్బారావుకి. అది శారీరకమైనా మానసికమైనా. అయినా సుబ్బారావు అనాగరికుడు కాదు కొట్టడానికీ, తిట్టడానికీ.” అంది. సన్నగా, నేర్పుగా కత్తిరించబడిన ఆమె కనుబొమలు భృకుటివద్ద విచ్చుకున్న రేకుల్లా విడివిడిగా కన్పిస్తూ, ఆమె అందాన్ని ద్విగుణీకృతం చేస్తున్నాయి.

“మరి. తాగుడు, డ్రగ్స్ లాంటి అలవాట్లు. . .?”

“అటువంటివీ లేవు. అతడు టీ తాగడంకూడా నేను చూసెరగను--మా పెళ్ళయిన తర్వాత.” అంది . నుదుటిమీది నల్లటి చిన్న ఫ్యాన్సీ బొట్టుని తీసి, చూపుడు వేలుతో మళ్ళీ అతికించుకుంది. అక్కడి నుదుటిమీది చర్మం బిగుతుగా కాంతివంతంగా మెరుస్తోంది.

“పోనీ డబ్బాశతో పేకాట, గుర్రప్పందాలూ వంటివి?” సుబ్బారావు అంతమాత్రం మనిషి కాదని తెలిసినా కావాలనే అడిగాను.

ఆ మాట సురేఖకి కోపం తెప్పించినట్టుంది. పలుచనైన ఆమె చెంపలు కోపంతో రక్తాన్ని నింపుకుని గులాబీ వర్ణం దాల్చాయి. ముక్కు చక్కదనానికి తామేమీ తీసిపోమని ముక్కుపుటాలు సరిపడినంత వంపుని తీసుకుని పెదిమల పై భాగంలో చర్మంలోకి చొచ్చుకుపోయాయి. క్షణం తర్వాత ఆమె మామూలుగా అయిపోతూ__

“అవీ లేవు. ఒకవేళ గుర్రప్పందాలకని వెళ్ళినా డబ్బు సంపాదించగలడే గానీ, పోగొట్టుకుని వచ్చే మనిషిగాదు సుబ్బారావు. నువ్వు నమ్మలేవేమో గానీ రేస్ కోర్స్ లో గుర్రాల జాతుల దగ్గర్నుండి, ట్రాక్ మీద కిలోమీటర్ దూరానికి ఎన్ని లెంగ్తులో, ఏ గుర్రం ఎన్ని మైక్రో సెకన్లలో ఎన్ని లెంగ్తులు దాట గలదో. కేజీ బరువు ఎక్కువ వేస్తే ఏ గుర్రం ఏ క్షణంలో ఎంత వెనకబడిపోగలతో అన్నీ చెప్పగలడు. కానీ, గుర్రప్పందాలు ఆడడు. అంతటి తెలివితేటలు సుబ్బారావుకి.”

సురేఖ విడాకులిచ్చిన భర్తని పొగుడుకోడం నాకు ఆశ్చర్యం కల్గిస్తోంది.

“మరేమిటి. స్త్రీ వ్యసనం. . .?” నేనింకా మాట పూర్తిచేయనేలేదు.

సురేఖ అందుకుని, “నేనంటే పిచ్చిప్రేమ సుబ్బారావుకి. నిజానికి అతడు నా భర్త కాదు. భక్తుడు. నన్ను కాదని మరొక స్త్రీని తాకిన గాలి కూడా తనని తాకడానికి యిష్టపడడు.” అంది. ఆపైన, జడని భుజం మీదుగా ముందుకి వేసుకుంది. పైన రబ్బరుబాండు బిగించిన ఆ జడ మిగిలిన భాగం స్వేచ్ఛగా వదిలేసి చివర్లో గుర్రం తోకలా సమంగా కత్తిరించి, మృదువుగా వుంది.

“అయితే యింకేముంటాయి విడాకులదాకా వచ్చే కారణాలు__ ఇక మిగిలినవి కోపం, విసుగూ, మొండితనం వంటి లక్షణాలు తప్ప” అన్నాను. ఈసారి నా ఈ మాటని సురేఖ తప్పకుండా ఒప్పుకుంటుందన్న నమ్మకంతో.

ఆ నమ్మకం కూడా విఫలమైంది. తర్వాత, సురేఖ సమాధానంతో__

“విడాకులు తీసుకున్న తర్వాత కూడా ‘ఒసే నా బ్రతుకు నాశనం చేశావుగదే నీచురాలా!’ అన్న ఒక్కమాట కూడా అనలేని మనిషికి కోపం, విసుగూ, మొండితనం ఉన్నాయనగలమా?” ఆమె నన్నే ప్రశ్నించింది. ఫ్యాను గాలికి ఆమె మెడ దగ్గర చున్నీ పక్కకి తప్పుకుంది. అక్కడ మెడక్రిందుగా ఛాతీకి పైభాగంలో చదునుగా, బిగుతుగా వున్న చర్మలోకి రక్తనాళాలు లేత ఆకుపచ్చరంగులో వ్యాపించుకుపోయి ఆ ప్రదేశం కాంతివంతంగా, ఆకర్షణీయంగా కన్పించసాగింది.

నాకేం అర్థం కాలేదు. నాకు తెలిసినంత వరకూ భార్యాభర్తలు విడిపోవడం వెనుక నేను చూపించిన ఇటువంటి కారణాలే నూటికి నూరుపాళ్ళూ వుంటాయి. వాటికి భిన్నమైన సురేఖ సమాధానాలు నాకు విడ్డూరంగా తోస్తున్నాయి. అందుకే నేనిక ఆమెని ప్రశ్నించదలచుకోలేదు. అందుకే__

“మీ గొడవలేమిటో నువ్వే చెప్పు సురేఖా. నాకు అర్థం కావడం లేదు.” అన్నా.

ఆ మాటకి సురేఖ నిట్టూర్చింది. ఆపైన బాధగా, “సుబ్బారావుకీ నాకూ గొడవలెప్పుడూ వుండవు. ఈరోజు ఉదయం కూడా అతడితో, బాబుతో ఫోన్లో మాట్లాడా అరగంట సేపు.” అంది.

నాకు మండింది. “ఏదీ లేకుంటే నీకు తిక్కరేగి విడాకులిచ్చేవా?” అందామనుకున్నా. మళ్ళీ ఎందుకులే ఆ సమయంలో బాధపెట్టడమని ఏమీ తోచనట్టు మౌనంగా వుండిపోయా.

నన్ను చూసి సురేఖ నవ్వింది. ఆపైన నా కళ్ళలోకి చూస్తూ, “నిన్ను బాధిస్తున్న ప్రశ్నలేమిటో నాకు తెలుసు. నా విడాకుల గురించి నేనే చెబుతాలే విను.” అంది. మళ్ళీ తనే, “అంతా విన్నాక నాకు నువ్వు నీతులు చెప్పకూడదు.” అంది__ సన్నటి నాజూకైన వేళ్ళతో నన్ను వారిస్తూ.

“నేను నీతులూ చెప్పను. చెప్పదలిస్తే నువ్వు ఆపనూలేవుగానీ జరిగిందేమిటో చెప్పు!” అన్నా.

సురేఖ చెప్పడం ప్రారంభించింది.

* * *

“నాదీ సుబ్బారావుదీ అన్యోన్యమైన దాంపత్యమో కాదో నాకు తెలీదుగానీ నేనన్నా, నా రూపమన్నా పంచప్రాణాలు సుబ్బారావుకి. అలాగే, పసుపు పచ్చటి రంగుతో ఆరడుల పొడవుండే ఇంజనీరు, ముగ్దమనోహరరూపుడు సుబ్బారావుని ఒక్కసారైనా ముద్దెట్టుకోవాలని కనీసం మనసులోనైనా భావించుకోని స్త్రీ ఈ లోకంలో వుంటుందంటే నేను నమ్మను. పెళ్ళయిన ఏడాది లోపే మాకు బాబు పుట్టాడు. నువ్వడిగిన ఏ అవలక్షణాలూ సుబ్బారావులో లేవుగానీ ఎందుకో అతడి సమక్షంలో నేనెప్పుడూ ఆత్మన్యూనతా భావంలో బ్రతికేదానిని. నాకు అందని, నేను పసిగట్టలేని, నేను తెలుసుకోలేని మహత్తరమైన శక్తి ఏదో సుబ్బారావులో వుంది. అదే మమ్మల్ని విడదీసింది.” అంది సురేఖ ప్రారంభంగా.

“నీకర్థం అవడం కోసం ఉదాహరణకి ఓ నాలుగు విషయాలు చెప్తా__

బాబుకప్పుడు వయసు రెండేళ్ళు. ఆరోజు సాయంత్రం ఏడుగంటలప్పుడు సుబ్బారావు ఆఫీసునుండి ఇంటికొచ్చాడు. నాతో ఆటలాడుకుంటున్న బాబుని చూశాడు. మామూలుగానైతే రోజూ నన్ను “గుడ్ ఈవెనింగ్ రేఖా!” అంటూ విష్ చేస్తాడు. ఆరోజు మాత్రం అతడు నాతో ఏం మాట్లాడలేదు. బాబుని చూడగానే ఏదో సందేహం వచ్చిన వాడిలా కప్ బోర్డ్ లోంచి థర్మామీటరు తీసి బాబు జ్వరం చూశాడు. ఆ తర్వాత, థర్మామీటరు పక్కన పెట్టి, బాబుని భుజాన వేసుకుని కార్లో డాక్టరు దగ్గరకి తీసుకువెళ్ళాడు. అతడు వెళ్ళిన తర్వాత నేను థర్మామీటరు చూస్తే నూట రెండుంది బాబు ఒంట్లో జ్వరం. నేను ఆశ్చర్యపోయాను. వాడితో అరగంట నుంచీ ఆటలాడుతున్నదాన్ని, పైగా డాక్టరు వృత్తిలో జీవిస్తున్నదాన్ని, నేను గ్రహించలేకపోయిన బాబు ముఖంలోని ‘పేథటిక్ ఫీలింగ్’ అప్పుడే ఇంటికొచ్చిన సుబ్బారావెలా పసిగట్టాడో నాకిప్పటికీ అర్థంకాదు.” సురేఖ ఆగింది.

డాక్టరు దగ్గర్నుంచి వచ్చాక నన్నేమైనా అంటాడని భయపడ్డాను.

నేననుకున్నట్టుగానే అన్నాడు గానీ అయితే ఆ అనడం నన్నుగాదు. “భోజనం రెడీ అయిందా?” అన్నాడు. అయిందన్నాను. అంతే. బాబుకి టాబ్లెట్లు వేసి, తనూ సుష్టుగా భోంచేసి పడుకున్నాడు. ఆ రాత్రి నా మనసంతా ఏదో వెలితి. ఆలోచిస్తూనే ఓ గంట తర్వాత నేనూ నిద్రలోకి జారుకున్నాను. సగం రాత్రివేళ ఎందుకో మెళకువవొచ్చి లేచి చూద్దునుగదా నాపక్కలో బాబూ, సుబ్బారావూ ఇద్దరూ లేరు. బెడ్ రూమ్ తలుపు తీసివుంది. వెతుక్కుంటూ డ్రాయింగ్ రూమ్ లోకెళ్ళాను. అక్కడ వాలుకుర్చీలో బాబు ఒళ్ళంతా తడిగుడ్డతో చుట్టేసి, నుదుటిమీద నిముషానికో తడిగుడ్డ పట్టీ వేస్తూ, బాబుని తన గుండెలమీద పడుకోబెట్టుకుని వున్నాడు సుబ్బారావు. తప్పుచేసినదానిలా నేను అతడి సమీపంలోకి వెళ్ళి, “ఏమైంది బాబుకి?” అన్నాను.

“ఏమీ కాలేదులే కంగారు పడకు. జ్వరం కంట్రోల్ అవుతోంది. ఇందాక నూట అయిదుంది. ఇప్పుడు నూట మూడుకొచ్చింది.” అన్నాడు నా చేతికి థర్మామీటరు అందిస్తూ.

సిగ్గుపడుతూనే దాన్నందుకుని చూస్తే అతడన్నట్టు నూటమూడు దగ్గరుంది టెంపరేచర్ రీడింగు.

“మైగాడ్! మీరు మెలకువగా లేకుంటే ఏమైవుండేదండీ అన్నా.” అతడి కాళ్ళ దగ్గర నేనూ చతికిల బడుతూ.

“ఏమౌతుంది రేఖా! నేనున్నాను గనుక ఆదమరిచావు గానీ, లేదంటే జాగ్రత్త పడవూ?” సుబ్బారావు తన స్వభావరీత్యానే అన్నా ఆమాట నాకు ‘నేనున్నాను గనుక బలిసి ప్రవర్తిస్తున్నావుగానీ లేదంటే జాగ్రత్తగా వుండవూ’ అన్నట్టు తోచి, చెంప ఛెళ్ళుమనిపించినట్టయింది. మళ్ళీ నాలో అదోరకం పశ్ఛాత్తాప భావన. అలాగే సుబ్బారావు మోకాలుమీద తలాన్చి ఆరాత్రి అలా కూర్చుండిపోయా. ఇక నిద్రపోకుండా.

మరోరోజు బాబు కంట్లో ఏదో నలుసు పడింది. వాడు ఏడుస్తున్నాడు. నేనెంత ప్రయత్నించినా ఆ నలకని తీయలేకపోయా. వాడ్ని సముదాయించలేకనూ పోయా. నైటీ విప్పేసి, గబగబా వేరే డ్రెస్ వేసుకుని బాబుని డాక్టరు దగ్గరకి తీసుకుపోబోతుండగా సుబ్బారావు ఎదురయ్యాడు బయటనుండి. విషయం తెలుసుకుని “అన్నింటికీ డాక్టరేనా రేఖా? ఓ గ్లాసు మంచినీళ్ళు తీసుకురా!” అంటూ బాత్రూంలోకెళ్ళి, మౌత్ లోషన్ తో నోరు శుభ్రపరచుకొచ్చాడు. నేనిచ్చిన మంచినీళ్లు నోట్లో పోసుకుని బాబు నలుసు పడ్డ కంటిరెప్పలు తెరిచి, నీటిని కంట్లోకి వేగంగా పంప్ చేశాడు. అట్లా రెండు సార్లు చేశాడోలేదో అప్పటికి అరగంట నుండీ గుక్కపెట్టి ఏడుస్తున్న బాబు ఠక్కున ఏడ్పు ఆపేసి ఆటల్లో పడ్డాడు. సుబ్బారావు బాబుని వదిలి నావైపు చూస్తూ, “ఇదే పని మీ డాక్టర్లు సిరంజితో, రెండొందల రూపాయల ఫీజుతో పూర్తి చేస్తారు. ఔను కదూ?” అన్నాడు నవ్వుతూ.

“అవును. ఇంట్లో సిరంజి వుంది. అయినా నాకు ఐడియా రాలేదు.” అన్నా.

“భయంలో ఏదీ తోచదులే!” అంటూ షర్టు విప్పుతూ స్నానం కోసం బాత్రూమ్ వైపు నడిచాడు. మరోసారి నాలో చిన్నతనపు భావన--పదంతస్తుల భవంతి పక్కన పూరి గుడిసెలో జీవించేవాడి మనసులా.

మాకు ఇంట్లో ఉదయం టిఫిన్ చేయడం, మధ్యాహ్నం మామూలు భోజనం, రాత్రి చపాతీలు తినడం అలవాటు. ఒకరోజు మధ్యాహ్నం వేళ నేను చపాతీలు తినడం గమనించి సుబ్బారావు, “ఎందుకు చపాతీలు?” అని అడిగాడు.

“డైటింగ్ చేస్తున్నా”నన్నాను.

అతడు ఆశ్చర్యపోయాడు. “నీది పలుచని శరీరం. చక్కగా, ఆరోగ్యంగా వున్నావు నీకెందుకు డైటింగ్?”అన్నాడు.

“ఏమో ముందు ముందు లావవుతానేమోనని” అన్నా.

“అయితే అందుకు తిండి మానకు. మధ్యాహ్నం కూడా భోంచేయలేదంటే నీరసపడతావు. శరీరంలో రక్తం తగ్గిపోతుంది. నీకు తెలీనిదేముంది? అసలే ఆడవాళ్ళకి రక్తం అవసరం ఎక్కువ. కావాలంటే మధ్యాహ్నం రైస్ కొద్దిగా తగ్గించి దానికి బదులుగా రోజూ ఆకుకూరలూ, ఫ్రూట్సూ తిను.” అన్నాడు.

“ఈ మామూలు వంటకాలతో పాటు ఆ ఆకుకూరలు కూడా చేయడం నావల్ల కాదు బాబూ!” అన్నా. అతడు చెప్పింది నిజమే అయినా వృత్తిరీత్యా డాక్టరునైన నాకు అతడు ఆరోగ్య సలహాలివ్వడం నచ్చలేదు. బహుశా యిటువంటి ‘ఇగో’ ఫీలింగులతోనే భార్యాభర్తల మధ్య స్ఫర్థలేర్పడతాయనుకుంటా.

ఏమనుకున్నాడో ఏమో ఆ మరుసటి రోజున నేను ఓ ఆపరేషన్ కి అటెండయి మధ్యాహ్నం యింటికొచ్చేసరికి తనే ఏదో ‘లీఫీవెజిటబుల్ కర్రీ’ వండి, దాన్ని డైనింగ్ టేబుల్ మీద వుంచి ఆఫీసుకి వెళ్ళిపోయాడు. నాకు సిగ్గనిపించింది. ఆ రాత్రి అదే మాట అడిగా. “ఎందుకలా వండి పెట్టార”ని.

“నీకు ఓపిక లేదన్నావుగా?” అన్నాడు సుబ్బారావు.

“అయితే మీరంత శ్రమ తీసుకుని. . .?”

“ఇందులో శ్రమేముంది రేఖా. పనిమనిషి ఆకులు తుంచి యిచ్చింది. ఉదయం పూట నేనెలాగూ ఓ అర్థగంట ఖాళీ గదా. అట్లా ఖాళీగా వుండడంకన్నా మన ఆరోగ్యం కోసం ఏదైనా చేయడం మంచిదనే చేశా. నువ్వూ బాగానే అలిసిపోతున్నావు.” అన్నాడు.

భార్యని అలా చూసుకునే భర్తలు చాలా అరుదుగా ఉంటారని నాకు తెలుసు. సుబ్బారావు నాపై తన ప్రేమను చాటుకునే ప్రతిక్షణం నాలో ఏదో వెలితి ద్యోతకమయ్యేది. ప్రతిక్షణం నన్ను అధిగమిస్తూ అతడలా చేయకుండావుండాల్సిందనే భావన. ఆ మరుసటి రోజు నుండీ అతడికా అవకాశం యివ్వకుండా నేనే ఆకుకూరలు వండడం మొదలెట్టా.

తర్వాత, మా హాస్పిటల్ లో కో-సర్జెన్ డాక్టర్ ప్రదీప్ నాతో బాగా చనువుగా వుండేవాడు. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ నన్ను ‘ఎంటర్ టెయిన్’ చేస్తూండేవాడు. ఆపరేషన్లు జరిగేటప్పుడు చాలా సార్లు అతడి చేతులూ, కాళ్లూ నాకు తగిలించేవాడు. నన్ను రాసుకుంటూ, నా చుట్టే తిరుగుతూ చాలా ‘క్లోజ్’ గా మూవ్ అయ్యేవాడు. అదంతా వృత్తిలో మాకు సహజమే గనుక నేను దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఓరోజు నేను ఓ ఆపరేషన్ కి ముందు నా ‘డ్రెస్సింగ్ రూమ్’ లో కుర్చీలో కూర్చుని, కళ్ళు మూసుకుని వెనక్కివాలి రిలాక్సైవుండగా, ఎక్కడ నుండి వచ్చాడో ఎప్పుడు వచ్చాడో తెలీదుగానీ డాక్టర్ ప్రదీప్ నా వెనుకనుండి వచ్చి నా ముఖాన్ని తన రెండు చేతుల్లోకి తీసుకుని నుదుటిమీద, చెంపలమీద గట్టిగా ముద్దులు కురిపించేశాడు. భయంతో ఉలిక్కిపడి, అతడి చేతులు వదిలించుకున్నా. చటుక్కున లేచి వెనక్కి చూసేటప్పటికి వెకిలిగా నవ్వుతూ నాకు దగ్గరగా డాక్టర్ ప్రదీప్__ అతడి వెనుక తలుపు దగ్గర నాతో పనుండి నాకేదో చెప్పడానికని సడన్ గా అక్కడికొచ్చిన సుబ్బారావు. సుబ్బారావు ముఖం పాలిపోయి వుంది. నేనా షాక్ నుండి తేరుకునే లోపలే సుబ్బారావు వెనుదిరిగి మౌనంగా అక్కడ్నుండి వెళ్ళిపోయాడు.

ఆ తర్వాత, నేను డాక్టరు ప్రదీప్ గురించి హాస్పిటల్ ‘మేనేజ్ మెంటుకి’ కంప్లెయింట్ చేసి అతడ్ని మరో హాస్పిటల్ కి ట్రాన్స్ ఫర్ చేయించాను. కానీ, మా యింట్లో మాత్రం ఆరోజు మౌనం రాజ్యమేలింది. జరిగిందేమిటో నేను సుబ్బారావుకి వివరించబోయాను. అతడు నన్నేమీ చెప్పొద్దన్నట్టు వారిస్తూ, ఒకటే మాటన్నాడు.

“చూడు రేఖా! మనం మన గురించి అనుకునేప్పుడు మనం ఒక్కళ్ళమే ఒంటరి మనుషులం అనుకుంటాం. కానీ కాదు. పెళ్ళికిముందు, మనం అంటే మనం ఒక్కరమే కాదు. మన తల్లిదండ్రులూ, అక్కచెల్లెళ్ళూ, అన్నదమ్ముళ్ళూ అందరం. అంటే మన వృద్ధికి సంతోషించేవాళ్ళూ, కష్టానికి బాధపడేవాళ్ళూ అందరితోనూ మనకి బాధ్యత ముడివడివుంటుందన్నమాట. అలాగే పెళ్ళయిన తర్వాత, మనం అంటే మన జీవిత భాగస్వామీ, మన పిల్లలూ అందరూ కలిసి అన్నమాట. ఇప్పుడు నువ్వంటే నువ్వు మాత్రమే కాదు. నేనూ, బాబూ కూడా. మా ఇద్దరి జీవితాలూ నీతోపాటు ముడివడివున్నాయి. నువ్వు తప్పు చేశావూ అంటే దాని ఫలితం మేమూ అనుభవించక తప్పదు. దీని భావం ఈ రోజు జరిగినదాన్లో నీ తప్పు ఉందని నేనంటున్నట్టు కాదు. అలాగే నాకు తెలీదు గనుక, లేదనీ అనుకోను. కానీ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా హామీ ఇవ్వగలను. ఈ సంఘటన మనిద్దరి జీవితాల్లో ఎటువంటి ప్రభావం కలిగించదు. మనం దీన్నిక్కడే ఇప్పుడే మర్చిపోతున్నాం. కానీ, మున్ముందు నీ వెనుక మేం ఇద్దరం నిల్చునివున్నామనే విషయం నువ్వు ఎప్పటికీ విస్మరించకూడదు. సరేనా? రా భోంచేద్దాం గానీ! అన్నాడు నా చేయి పట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గరకి నడుస్తూ.

గుండెని ఏదో బలమైన సాధనంతో పెళ్ళగించినట్టుయింది అతడన్న ఆ చివరి మాట విని. అన్ని మాటలు చెప్పిన సుబ్బారావు ఆఖరున ‘భవిష్యత్తులో జాగ్రత్తపడ’మనే సలహా యివ్వకపోతే ఎంత బాగుణ్ణు అనిపించింది. దానికి బదులుగా ‘బెల్టు’ తీసుకుని ఆ రాత్రి నా ఒళ్ళంతా పగులగొట్టివున్నా, ఆ ఏడ్పులో జరిగిందేమిటో చెప్పుకుని సమాధానపడివుండేదాన్ని.

ఇటువంటి సంఘటనలతో నాకు తెలీకుండానే నాకు సుబ్బారావు మీద ఓ విధమైన వేర్పాటు భావన పెరిగిపోయింది. అంతకుముందులా నేను ఎక్కువగా మాట్లాడలేకపోయేదాన్ని. అవసరమైతే తప్ప అతడితో మాట్లాడేదాన్ని కాదు. ఎక్కువ సమయం మౌనంగానే గడిపేదాన్ని. నాలో ఆ నిర్లిప్తతని పసిగట్టి సుబ్బారావు ఒకటి రెండుసార్లు అడిగాడు కూడా.

“మౌనంగా ఉంటున్నావు రేఖా ఈ మధ్య. నా వల్ల ఏదైనా పొరపాటు జరిగిందా?” అని.

“అటువంటిదేం లేద”ని సర్దిచెప్పి, తప్పించుకున్నా.

ఇక మా విడాకులకు దారితీసిన విషయం గురించి చెపుతా శ్రద్ధగా విను.

నాకు ఈ మధ్యనే చాలామందికి చిన్నవయసులోనే వచ్చే దూరదృష్టి లోపం ఏర్పడింది. దానికి ‘గ్లాసెస్’ వాడమన్నారు డాక్టర్లు. ఎందుకో అప్పుడే గ్లాసులు వాడడం నాకిష్టం లేకపోయింది. అందుకే ‘కాంటాక్టు లెన్సులు’ తీసుకున్నా. రెండు కంటిపాపల మీద జాగ్రత్తగా అమర్చుకోవలసిన ఆ లెన్సులు వాడడం కూడా నాకు చేతకాలేదు. అందుకే నా ‘సైట్’ ని శాశ్వతంగా నివారించే ‘లేజర్ ట్రీట్ మెంట్’ గురించి సుబ్బారావుతో చెప్పి, ఆ ట్రీట్ మెంట్ తీసుకోడానికి అతడ్ని పర్మిషన్ అడిగా.

ఆ మాటకి సుబ్బారావు ససేమిరా “ఒప్పుకోన”న్నాడు. “‘లేజర్ ట్రీట్ మెంట్ కొంతమంది విషయంలో ఫెయిలవుతుందనీ, దురదృష్టవశాత్తూ ఆపరేషన్ ఫెయిలై నేను అంధురాలైతే తను జీవించలేడనీ, కనుక ఆ విషయంలో మాత్రం తను రాజీపడే ప్రసక్తే లేద”నీ ఖరాఖండిగా చెప్పేశాడు.

కానీ, మా హాస్పిటల్ డాక్టర్లు మాత్రం ‘ఎక్కడో కొన్ని కేసులు ఫెయిలయినంత మాత్రాన ట్రీట్ మెంట్ ని తప్పు పట్టడం సరికాద’న్నారు. ‘అటువంటిదేం వుండబోద’ని నాకు ధైర్యం చెప్పారు. సుబ్బారావుకి తెలీకుండా ఓ రోజు లేజర్ ట్రీట్ మెంటు ద్వారా ఆపరేషన్ ముగించుకుని, ఏమీ ఎరుగని దానికి మల్లే సాయంత్రానికి యిల్లు చేరాను. ఎందుకంటే ఆ ఆపరేషనుకి ఎక్కువ సమయం అవసరం లేదు.

ఆపరేషన్ ఆయితే సక్సెస్ అయి నా కళ్లు పూర్వంలా బాగా కన్పించసాగాయిగానీ, ఎట్లా తెలిసిందో ఏమో ఈ విషయం కాస్తా సుబ్బారావుకి తెలిసిపోయింది. అది తెలిసిన రోజున సుబ్బారావు చాలా వేదనకి గురైనట్టున్నాడు.

ఆ సాయంత్రం ఇంటికి రాగానే నావైపోసారి చూసి, మౌనంగా వెళ్ళి బాల్కనీలో కూర్చున్నాడు. ఎప్పుడూ ఉత్సాహంగా కన్పించే అతడలా మౌనం దాల్చడం చూసి, దగ్గరకెళ్ళి, “ఏమైంద”ని అడిగాను. సుబ్బారావు సూటిగా నా కళ్ళలోకి చూస్తూ, “లేజర్ ట్రీట్ మెంట్ తీసుకున్నావటగా?” అన్నాడు.

నేను అదిరిపడ్డాను. సమర్ధింపుగా ఏదో చెప్పబోయాను. అంతలోనే అతడి కళ్ళలో నీళ్ళు, ముఖంలో సీరియస్ నెస్ చూసి భయంతో ఆగిపోయాను. తప్పుచేసినదానిలా తలదించుకున్నాను. ఎందుకంటే తన తల్లి చనిపోయిన రోజున కూడా సుబ్బారావు కంట తడిపెట్టగా నేను చూసెరగను.

నా మౌనం చూసి సుబ్బారావే అన్నాడు.

“చూడు రేఖా! ఆపరేషన్ చేయించుకోడం తప్పుకాదు. ఇలా నన్ను ఛీట్ చేయడం తప్పు. ఎందుకంటే ఇంతకుముందొకసారి చెప్పాను__ “నీతో మా జీవితాలు కూడా ముడివడివున్నాయ”ని. అయినా, నేనెందుకు ఆ ఆపరేషన్ కి సుముఖత చూపలేదో ఆపరేషన్ సక్సెస్ అయింది గనుక నీకిప్పుడు అర్ధంకాదుగానీ, ఒకవేళ అదే ఫెయిలయివుంటే ఏమయ్యుండేది? జీవితాంతం గ్రుడ్డిదానిగా జీవించేదానివి. అప్పుడు మా గతేమిటి? నేను మాత్రం నిన్ను నా జీవితంలోకి ఖచ్చితంగా రానిచ్చేవాడ్నికాదు. ఎందుకంటే భర్తను ఏమార్చి ఆపరేషన్ కెళ్ళడం, ఒక అక్రమ సంబంధం పెట్టుకోవడం కన్నా తక్కువ పనిగా నాకు అన్పించదు.” చెప్పి సుబ్బారావు అక్కడ్నుంచి లేచి, వెళ్ళిపోయాడు.

విభ్రాంత మనస్కురాలై చేష్టలుడిగి నేనక్కడే నిల్చుండిపోయాను.

ఆ సంఘటన తర్వాత సుబ్బారావు మళ్ళీ మామూలుగానే వుండగలిగాడు గానీ, ఆ పని నావల్ల కాలేదు. ఎప్పుడూ ఏదో అపరాధ భావనలో గడిపేదాన్ని. దానికి తగ్గట్టుగానే సుబ్బారావు నేను ఆదమరచి నిద్రబోతున్న ఉదయం వేళల్లో తనే కాఫీ కలుపుకొచ్చి నన్ను నిద్ర లేపేవాడు. నేను పూలమొక్కలకి నీళ్ళుపోయడం మరచిన రోజున, ఆ పని తను చేసి చూపించేవాడు. అలాగే బాబుకి కాంప్లాన్ యివ్వడం మరచినప్పుడు, తనే పాలలో కాంప్లాన్ కలిపి, తాగిస్తూ కన్పించేవాడు.

ఏంతైనా సుబ్బారావు అహంభావి. బాబు జ్వరం తనే చూసి, తనే డాక్టరుకి చూపించకపోతే__ ఆ జ్వరమేదో నన్నే చూడమని చెప్పి, నేనూ డాక్టర్నేగా? నన్నే పరీక్షించమనొచ్చుగా? లేదంటే డాక్టరు దగ్గరకి నన్నూ వెంటబెట్టుకు వెళ్ళొచ్చుగా? అదంతా తన ఆధిక్యత చూపుకోడం కోసం. అలాగే రాత్రికి రాత్రి బాబుకి జ్వరం పెరిగి వుండొచ్చు. ఒకవేళ అప్పటిదాకా మేలుకునున్న నేను అప్పుడే నిద్రలోకి జారుకునీ వుండొచ్చు. అంతమాత్రాన బాబు బాధ్యతంతా సుబ్బారావు తనమీదే వేసుకోకుండా నన్ను నిద్రలేపి ఆ తడిబట్ట పట్టీ వేసే పనిలో నన్నూ భాగస్వామిని చేయవచ్చు. కానీ చేయడు. అంతా తనే చేయాలనే స్వార్థం సుబ్బారావుది. తను తెలివైనవాడిననే అహంభావం. మంచితనం ముసుగులో ఎదుటివ్యక్తిని వంచించే తత్వం.

ఆలా ఒకటనేమిటి? ప్రతి పనిలోనూ సుబ్బారావు తన ఆధిక్యతని చాటుకునేవాడు. పైగా ‘అటువంటి క్రమశిక్షణ ప్రతిమనిషి జీవితంలోనూ వుండాల’నేవాడు. నేను అతడిని చూసి సిగ్గుపడని రోజు లేదంటే అతిశయోక్తికాదు. చివరకి బాబు కూడా నాకు దూరమయ్యేడు. వాడూ వాళ్ళ డాడీతోనే ఎక్కువగా గడుపుతూ ‘అటాచ్ మెంట్’ పెంచుకున్నాడు.

కానీ, ఇంత తెలిసిన సుబ్బారావు, శాస్త్రీయమైన ‘లేజర్ ట్రీట్ మెంట్’ ని దేనివల్లనో అంగీకరించలేకపోయాడు. ఆ విషయంలో మాత్రం పక్కా నిరక్షరాస్యుడిలా ప్రవర్తించాడు.

ఎందుకో సుబ్బారావుతో కలిసి జీవించడం యిక నాకు సాధ్యం కాదనిపించింది. విడిపోవాలని నిశ్చయించుకున్నా. ఎందుకంటే అతడి పక్కన నిల్చుని, అతడితో సహజీవిస్తూ, అనుక్షణం మనసును కష్టపెట్టుకుంటూ జీవించడం నావల్లకాదని నాకు తెలుస్తూనే వుంది. అలాగని బాబుని అతడికి దూరం చేయదలచుకోలేదు. వాడ్ని సుబ్బారావుతోనే ఉండనిచ్చా. మా మమ్మీ, డాడీలకెలాగో సర్దిజెప్పుకుని, నేను మా యింటికొచ్చేశా.

“ఆది నా విడాకుల వృత్తాంతం!” అంది. సురేఖ చెప్పడం అయిపోయిందన్నట్టు.

* * *

(సశేషం)