ఒకానొక అజ్ఞానపు క్షణంలో. . . నాకు తెలీకుండా నేనే జన్మించి,  అమ్మ చనుబాలలో ఆది సంవేదన అనుభవించి. . .ఆటపాటలలో అద్వితీయుడనై రాణించి. . .సంఘ విద్యా సముపార్జనలో సారస్వత చక్రవర్తినై, పుస్తకాల్ని పఠించి. . .పరీక్షల్ని పరివీక్షించి. . .ఆత్మజ్ఞాన అవలోకనంలో విలువల వలువలు వూడదీసి. . .విశ్వతత్వాలు స్మరించి. . . మానవ శ్రేయస్సు మహా లక్ష్యమై పోగా. ."ఈ ప్రపంచపు దొడ్డబిడ్డగా ఉద్భవించాల"నీ, "ఒక పూర్తి మానవుడిగా పరిణమించాల"నీ, నేను కంటున్న కల,  కడుతున్న కోట. . .ఒహ్ ఇంతెందుకు కనుచూపు మేరలో. . . నా జీవితం ఒక వేద సంకలనం!!  నేనొక ఈశ్వరుడిని!!! ( ఇది ఈ బ్లాగులోని ప్రసంగి కథలో ఒక పాత్ర మనోభావాలు __ రచయిత )

Showing posts with label హాస్య కథ. Show all posts
Showing posts with label హాస్య కథ. Show all posts

Thursday, September 13, 2007

సామెతలరాయుళ్ళు!..3

సామెతలరాయుళ్లు! (హాస్యకథ)

(కేవలం ఎనిమిది పేజీల కథలో 35 పై చిలుకు సామెతల్ని, యింకా జాతీయాల్నీ ఉపయోగించి రాసిన ప్రయోగాత్మకమైన హాస్య కథ!)


సూపర్నెంటు కూడా తనని తప్పు పట్టేసరికి సుబ్బలక్ష్మికి అరికాలిమంట నెత్తికెక్కింది.

“ఉలవలు తిన్నమ్మకి ఉలుకెక్కువైనట్టు చేసేవారికి లేని బాధ మీకెందుకండీ?” అంది వనజాక్షిని మూతి ముఫై వంకర్లు తిప్పుతూ.

“శభాష్!” అన్నాడు శాస్త్రి మెల్లగా వనజాక్షికి వినిపించకుండా.

వనజాక్షి గింజుకుంది. “అవున్లేమ్మా! నాకెందుకూ. . . ఎల్లపాములూ తలెత్తితే ఏలికపాము కూడా తలెత్తిందనీ ఈ మధ్య నీక్కూడా నోరు బాగానే పెరిగింది.” అంది మెటికలు విరుస్తూ.

“ఓ.కే! సైలెన్స్! సైలెన్స్!” గుర్నాధం పెద్దగా అరిచాడు.

శాస్త్రి మాత్రం సుబ్బలక్ష్మిని మెచ్చుకుంటూ, “ఏదియేమైనా సుబ్బలక్ష్మి మంచి అమ్మాయయ్యా!” అన్నాడు.

కామేశం ఎత్తుకున్నాడు. “అవును పాపం! నంగకి నాలుగు అట్లు యిస్తే నమలకుండా మింగిందనీ చాలా చాలా మంచిది.” శాస్త్రి చెవిలో మంటగా చెప్పాడు.

“మరి నువ్వు లైటింగ్ యిస్తున్నావుగా?” అడిగాడు శాస్త్రి కామేశం చెవిలో.

“ఏం లైటింగ్? నా బొంద! లాటరీ ప్రయత్నం లాగా ఎంతకీ తెగదు.” అన్నాడు కామేశం.

“బాగానే మాట్లాడుతుందిగా?” శాస్త్రి అడిగాడు.

“ఏం మాట్లాడ్డంలెండి శాస్త్రిగారూ! ఓడ ఎక్కేదాకా ఓడ మల్లన్న ఓడ దిగినాక బోడి మల్లన్న రకం. పని వున్నప్పుడు మాత్రం బాగానే మాట్లాడుతుంది.” కామేశం తన గోడు వినిపించుకున్నాడు.

మొత్తానికి వనజాక్షీ, సుబ్బలక్ష్ముల సంవాదం కారణంగా ఆ తర్వాత అక్కడి వాతావరణం కొద్దిసేపు బరువుగా, నిశ్శబ్దంగా మారింది.

ఆ నిశ్శబ్దాన్ని భగ్నంచేస్తూ జోగినాధం అన్నాడు. “ఓ అయిదొందలుంటే అప్పుగా యిద్దురూ సూపర్నెంటుగారూ? ఫస్టున జీతం రాగానే యిచ్చేస్తాను!” అని.

గుర్నాధం అదిరిపడి, “నా దగ్గర డబ్బెక్కడిదయ్యా బాబూ! అసలే నెలాఖరు! ఆ పెళ్ళిగాని కుర్రోడు కామేశాన్నడగండి పుష్కలంగా వుంటాయి.” అంటూ ఓ సలహా పారేశాడు ఉచితంగా.

“మా ఆయనేవుంటే మంగలాయనెందుకనీ కామేశాన్ని అడిగింతర్వాతే మిమ్మల్నడిగాను మహాశయా!” జోగినాధం సూపర్నెంటు మీద మండిపడ్డాడు. ఆ తర్వాత శాస్త్రి వైపు తిరిగి, “పోనీ మీ దగ్గరుంటే సర్దండి శాస్త్రిగారూ!” అన్నాడు.

అటువంటి విషయాల్లో శాస్త్రి చాలా జాగరూకుడై వ్వవహరిస్తాడు.

ఠడబ్బు నాదగ్గరెక్కడిదయ్యా జోగినాధం? ఆ అయిదొందలే వుంటే ఈ నడుమీడ్పూ, ఈ కాళ్ళపీకుడూ ఎందుకూ డాక్టర్ దగ్గరకెళ్ళి చూపించుకోనూ!” వెంటనే చెప్పాడు తడుముకోకుండా.

“ఆరావులమ్మ మూడావులమ్మ యింటికి నేతికి వెళ్ళినట్టు బాగానే వుందయ్యా మీ జంఝాటం!” అవధాని నవ్వేడు. ఆ తర్వాత, “పోనీ సుబ్బలక్ష్మిని అడిగి చూద్దురూ!” అన్నాడు నేర్పుగా సుబ్బలక్ష్మికి అంటగడుతూ.

తన వంతు వచ్చిందన్న విషయం సుబ్బలక్ష్మికి బాగా స్ఫురించింది. ఇక లాభంలేదని ‘హ్యాండ్ బ్యాగ్’ ఓపెన్ చేసి, అందులోంచి ఓ అయిదొందల రూపాయలు తీసి జోగినాధం కిచ్చింది. “మళ్ళీ ఫస్టుకిచ్చేయండీ!” అంటూ.

“ఇచ్చేయండి మరి. ఆవిడ రేపు పెళ్ళిలో మొగుడ్ని కొనుక్కోవాలి పాపం!” కామేశం గొంతు తగ్గించి జోగినాధం చెవిలో వూదాడు.

సుబ్బలక్ష్మి సహాయానికి జోగినాధం తెగ సంబరపడిపోయి, “అయినవాళ్ళ మూతి వెనుక కానివాళ్ళ తోక ముందన్నట్టు వీళ్ళందరి కంటే నువ్వే మేలమ్మా సుబ్బలక్ష్మీ రేపు నీ పెళ్ళికి ఏదైనా మంచి గిఫ్టు యిస్తాన్లే.” అన్నాడు.

“ఇంగ్లీషు డిక్షనరీ ఒకటి కొని యిచ్చేయండి సరిపోతుంది.” కామేశం గొణిగాడు.

జోగినాధంకి అప్పు లభించడం సూపర్నెంటుకి కూడా సంతోషం కలిగించినట్టుంది. “ఇందామ్మా తీయగూర అంటే యిందామ్మా పుల్లగూర అన్నట్టుగా ఒకరికొకరు సెక్షన్లో సహాయంగా వుండండయ్యా.” అన్నాడు.

ఇంతలో. . . ఆ సెక్షన్లోకి ఓ అరవైయేళ్ళ ముసలాయన ఒకాయన వచ్చాడు. వచ్చీరాగానే, సూపర్నెంటు టేబుల్ దగ్గరికి వెళ్ళి, “మా పుల్లిగాడు ఎక్కడండీ?” అన్నాడు.

సూపర్నెంటు ఆ ముసలాడ్ని ఎగాదిగా పైనుండి కిందికి పరికించి చూస్తూ “పుల్లిగాడెవరయ్యా. . .? కన్నెరికపు పెళ్లికొడుకా ఏంటి?” అడిగాడు అర్థంగాక.

ఆ ముసలాడు కూడా చమత్కారి లాగే వున్నాడు. “పుట్ట గొడుగంటే గుడ్డదా తాటాకుదా? అన్నాట్ట మీలాంటి ఒకాయన. అదేనండీ మీ అటెండరు పుల్లారావు గురించి నేనడుగుతున్నది.” అన్నాడు ఆయన ముక్కుమీది కళ్ళజోడు ముఖం మీదికి లాక్కుంటూ.

సూపర్నెంటుకి అర్థమైంది. “పుల్లారావు పాపం వాళ్ళ నాన్నగారు పోయారని సెలవు మీద వెళ్ళాడండీ.” అన్నాడు.

“ఓహో. . ! అలాగా? పుల్లారావు వస్తే కాస్త నేను వచ్చి వెళ్ళానని చెప్పండి.” అంటూ ఆ ముసలాయన కదిలి వెళ్ళబోయాడు.

“ఇంతకీ తమరెవరండీ?” అన్నాడు గుర్నాధం మామూలుగా.

“ఆ పుల్లారావుగాడి చచ్చిపోయిన నాన్నగారు నేనేనండి.” ముసలాయన చావు కబురు చల్లగా చెప్పాడు.

జోడుగుళ్ల తుపాకీ దెబ్బ తగిలినట్టు ఉలిక్కిపడ్డాడు గుర్నాధం. ఆ తర్వాత, “మరి నాకెందుకు పుల్లారావు అబద్దం చెప్పినట్టు?” అన్నాడు అయోమయంగా తలగోక్కుంటూ.

“ఏమీ లేదుసార్! పిల్లి గుడ్డిదైతే ఎలుక ముడ్డి చూపిస్తుందనీ ఓ సామెతుందిలే అందుకు.” చెప్పి ఆ ముసలాయన అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు.

గుర్నాధం చిందులు తొక్కాడు. “తాళిబొట్టు బలం తలంబ్రాల వరకేననీ ఈ రోజుతో ఈ పుల్లారావు పని అయిపోయింది. రానీ చెబుతా.” అన్నాడు.

“మరేం చేయమంటారండీ! అతి లోభి రాజుకి అడగనివాడే మహా పండితుడన్నట్టు తమరికి సెలవడిగితే కోపమాయే.” అవధానికి ఛాన్సొచ్చింది.

ఆ మాటతో గుర్నాధంకి గుటక పడింది. అందుకే మాట మారుస్తూ, “ఏది ఏమైనా ఈ రోజు మన మాటల్లో దొర్లిన సామెతలతో ఒక సామెతల శతకమే రాయొచ్చయ్యా!” అని, “సరేగానీ టైమ్ అయిదయింది. ఫైళ్లు కట్టేసి, యిక కదలండి యిళ్ళకి.” అన్నాడు.

అంతా లేచి అక్కడ్నుంచి కదిలారు. అట్లా కదిలి అందరూ వెళుతున్నప్పుడు యిక ఆరోజుకి ఉపసంహారంగా గుర్నాధం గంభీర వదనుడై ఒక మాట చెప్పాడు.

“చూడండి! మనమంతా ప్రభుత్వ ఉద్యోగులం. ప్రభుత్వమనే మహారథానికి మనం నిండు చక్రాల్లాంటి వాళ్లం! ప్రజల సొమ్ముతిని బ్రతికే మనం. . .ఆ ప్రజల కోసం. . . ఇట్లా మాటలతో, నవ్వులతో కాలం వెళ్ళబుచ్చకుండా పని బాగా చేసి దేశం సర్వతోముఖాభివృద్ధికి మన వంతు సహకారం అందిద్దాం. రేపట్నుంచి కలసి యింకా ఎక్కువ పని చేయడానికి ప్రయత్నిద్దాం!”

“సూపర్నెంటుగారు చూడండి. ఎంత మంచి మనిషో. .?” అంది వనజాక్షి గుర్నాధాన్ని చూసి మురిసి ముష్టెత్తుకుంటూ.

“అవున్లేమ్మా! గోడ దూకొచ్చినమ్మ గోత్రం మహాత్మ్యం చెప్పుకుందనీ ఆయన చాలా మంచి మనిషి. . .నీలాగే!” అన్నారెవరో ఆ గుంపులో నుండి.

( సమాప్తం )

Wednesday, September 12, 2007

సామెతలరాయుళ్ళు!..2

సామెతలరాయుళ్లు! (హాస్యకథ)

(కేవలం ఎనిమిది పేజీల కథలో 35 పై చిలుకు సామెతల్ని, ఇంకా జాతీయాల్నీ ఉపయోగించి రాసిన ప్రయోగాత్మకమైన హాస్య కథ!)

“ఇప్పుడేమయిందండీ మీకు?” అడిగాడు గుర్నాధం జోగినాధాన్ని.

“కాకపోతే ఏందండీ యిది? ఏదో పది రూపాయల పై ఆదాయం కోసం నేనిక్కడికి ట్రాన్స్ ఫర్ మీదొస్తే గాడిద చాకిరీ తప్ప పైగా టికాణా లేకుండా పోయింది. ఏదో సామెతుందిలే ఊరుకోలేక ఉప్పరోడ్ని చేసుకుంటే తట్టకొక తన్ను తన్నాడనీ అట్లాగయింది నా పరిస్థితి!” అన్నాడు జోగినాధం ఈసడింపుగా.

“నిజమేనండీ ఈ సెక్షన్లో పనిచేయడానికి ఒక్క గాడిదకున్నంత ఓపిక వుండాలంటే నమ్మండి. అన్నాడు శాస్త్రి జోగినాధంకి సపోర్టుగా.

సూపర్నెంటుకి మండింది. “అవును. నాకు ఆరు గాడిదలకున్నంత ఓపిక వుండాలి మరి!” అన్నాడు తెలివిగా.

‘ఏమిరా వెర్రిముఖమా అంటే ఏముందిలే చిన్నాయనా’ అన్నట్టు కొట్టిన దెబ్బ తిరిగి తమకే తగలడంతో కొంచెం సేపు అంతా కిక్కురుమనకుండా వుండిపోయారు.

కొద్దిసేపు తర్వాత అవధాని వివరించేడు. “అదిగాదండీ సూపర్నెంటుగారూ. . .అసలు విషయం! మొన్న ఆ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు ముకుందరావుకి ఆయన తాలూకూ కాన్ఫిడెన్షియల్ రిపోర్టుల్లో బ్యాడ్ రిమార్కులన్నీ దాచేసి, ప్రమోషన్ యిచ్చినందుగ్గాను ఆయనగారు తమకి సమర్పించుకున్న కట్నం బాపతు సొమ్ము అంతా తమరే నొక్కేసి, తన వాటా యివ్వలేదని జోగినాధంకి బాధ.” అన్నాడు.

“చాదస్తం ముదిరిందిరా అంటే చెరిసగం పంచుకుందామన్నాట్ట జోగినాధం లాంటోడు. ఆ ముకుందరావు నాకెప్పుడు యిచ్చి చచ్చాడయ్యా. . .వాడు ఇస్తానన్జెప్పి మోసంజేసి పోతేనూ.” గుర్నాధం యిమ్మీడియట్ గా రెడీమేడ్ సంజాయిషీ యిచ్చేశాడు.

“మరి ఆయనగారు మొన్న కొత్తగా కొన్న వాషింగ్ మెషీన్ ఎక్కడనుండి వచ్చిందో దాని సంగతి చెప్పమనండి.” జోగినాధం అవధానినడిగాడు ఉక్రోషంగా.

గుర్నాధం సీరియస్ అయిపోతూ, “అది మా బామ్మర్ది పిల్లకి పురుడు పోసుకుంటూ నాకు ప్రజంటేషన్ గా యిచ్చాడయ్యా.” అన్నాడు.

ఆ మాట అందరూ నమ్మారో లేదోగానీ జోగినాధం మాత్రం యిసుమంత కూడా నమ్మలేదు. అందుకే. . .

“ఆ అల్లంమురబ్బా అమ్ముకునే ఈయన బామ్మర్ది వాషింగ్ మెషీన్ గిఫ్టు యిచ్చాట్ట. . .అబద్దం ఆడినా అతికినట్టుండాలి!” అన్నాడు మెల్లగా.

ఇంతలో. . .వనజాక్షి సీట్లోంచి లేచి, సూపర్నెంటు టేబుల్ దగ్గరికి వెళ్ళింది. ఆమెకి నలభై ఏళ్ళుటాయి. మనిషి కొద్దిగా లావు! అందం కాస్త మందం అయినందువల్ల ఈకల తోకలు దులిపి నూకలలో కలిపినట్టు ఎక్కడలేని అలంకారాలూ చేసుకుంటుంది. ‘ఊగీ ఊగీ ఊయెల వున్నచోటికే వచ్చినట్టు’ ఎన్నిచేసినా ఆవిడగారి బోడిముఖం మారేదీ లేదు మండేదీ లేదని జోగినాధం అభిప్రాయం. ఆఫీసులో కూడా వనజాక్షి నవల్లు చదవడం మానదు. ‘సిద్దారెడ్డోళ్ళ చద్దన్నం తిని, శివారెడ్డోళ్ళ ఆవులు మేపినట్టు’ ఆవిడ ప్రభుత్వం సొమ్ముతిని పత్రికలవాళ్ళని పోషిస్తుందని ఆమెపై అవధాన్లు అభియోగం!

ఏదియేమైనా. . . ‘సూర్యుడు తనవాడైతే చుక్కలన్నీ తన కుక్కలని’ వనజాక్షి మాత్రం మొత్తానికి సూపర్నెంటుని బుట్టలో వేసుకోగలిగింది. ఇక ఆ విషయం పక్కన పెడితే. . .

వనజాక్షి సూపర్నెంటు టేబుల్ మీద చేతులానించి, “నాకు రేపు సెలవు కావాలండీ!” అంది గారాలుపోతూ.

“ఎందుకుట?” అడిగాడు గుర్నాధం వనజాక్షి చేతుల సోయగాలు చొంగగార్చుకుంటూ పరికిస్తూ.

“ఒళ్ళంతా ఒహటే నొప్పులండీ. కనీసం ఒక్కరోజైనా విశ్రాంతి లేందే తగ్గేట్టు లేవు.” అంది వనజాక్షి. జారిన పైటని జాకెట్లోకి దోపుకోకుండానే.

శాస్త్రికి తన కసి తీర్చుకోడానికి అవకాశం దొరికింది. “దంచేది ఒకరైతే పక్కలెగరేసేదింకొకరని మీకెందుకండీ ఒళ్లునొప్పులు. . .పనంతా మీ అత్తగారు చేస్తుటేనూ?” అన్నాడు.

“అదేమిటండీ శాస్త్రిగారూ అట్లా అంటారు. నేను యింట్లో లేకుంటే మా ఆయనకి ఒక్కరోజయినా జరుగుతుందా.” అని, “మా అత్తగారేం చేస్తారు. . . పాపం ఆవిడ ముసలావిడ.” అంది వనజాక్షి.

“ఆహా! గప్పాల పోతిరెడ్డికి ముఫ్ఫై మూడు దొడ్లూ, మూడు ఎడ్లూ అనీ ఈవిడగారు లేకపోతే ఆ హెజ్బెండ్ గారికి జరగనే జరగదట! మరి ఆఫీసులో లేకపోతే సూపర్నెంటుకి జరుగుతుందా? ఆ మాట చెప్పదేం?” అవధాని చెవిలో రహస్యంగా అన్నాడు జోగినాధం.

“నిజమే మరి ఓపలేని అత్తకి వంగలేని కోడలు.” అన్నాడు అవధాని అంతే రహస్యంగా.

“ఓ.కె. లీవ్ గ్రాంటెడ్!” గుర్నాధం వనజాక్షికి లీవిచ్చేశాడు.

“థాక్సండీ!” అంది వనజాక్షి మెలికలు తిరిగిపోతూ.

అవధానికి అస్సలు గిట్టనివాళ్ళలో వనజాక్షిది ఒకటో నెంబర్. “అలివిగానమ్మకి అన్నీ ఎక్కువేననీ అబ్బ. . . ఆ మెలికలు తిరిగడం చూడండి.” అన్నాడు జోగినాధం చెవిలో.

ఈ లోపల సుబ్బలక్ష్మి లేచింది.

లేచి, కామేశం వైపు చూస్తూ, “ఎక్స్యూజ్ మీ! ఏమనుకోకుండా ఏఫోర్ సైజు పేపర్లు ఓ పాతికవుంటే అప్పుగా యిస్తారా కామేశంగారూ?” అంది.

ఆ మాత్రం పలుక్కి కామేశం పరవశించి పోయాడు. “దాందేముందండీ భలేవారే. మనకీ మనకీ మధ్య అప్పేంటి లక్ష్మిగారూ?” అంటూ తన టేబుల్ డ్రా లోని పేపర్లు తీసుకెళ్లి సుబ్బలక్ష్మికి అందించాడు.

“థాంక్యూ అండీ!” సుబ్బలక్ష్మి సిగ్గుల మెగ్గయింది.

సుబ్బలక్ష్మి సిగ్గు వనజాక్షికి ఎల్లప్పుడూ ఒళ్ళుమంటే. అందుకే సుబ్బలక్ష్మి వైపు ఈర్ష్యగా చూస్తూ, “ఏమ్మా సుబ్బలక్ష్మీ. ఎత్తేవారుంటే ఏకులబుట్ట కూడా బరువేననీ ఆ కుర్రవాడ్నెందుకట్టా తిప్పుతావ్. వెళ్ళి యిండెంట్ తెచ్చుకోలేవూ?” అంది.

“అదీ అట్లా చెప్పండి!” అన్నాడు గుర్నాధం వనజాక్షితో.

జోగినాధం శాస్త్రి చెవి దగ్గరకి వంగి, “ముక్కిడిదాని పాటకి ముండోడి మెచ్చుకోలనీ ఆవిడ మాటకి ఈయన సపోర్టు చూడండి.” అన్నాడు.

( సశేషం )

Tuesday, September 11, 2007

సామెతలరాయుళ్ళు! 1

సామెతలరాయుళ్లు! (హాస్యకథ)

(కేవలం ఎనిమిది పేజీల కథలో 35 పై చిలుకు సామెతల్ని, యింకా జాతీయాల్నీ ఉపయోగించి రాసిన ప్రయోగాత్మకమైన హాస్య కథ!)

నిర్భంధ విధానపు గడబిడలో తద్దినం మంత్రపు లొడలొడలా హైదరాబాదు నగరానికి నడినెత్తిమీద వున్నట్టుంటుందా గుట్టమీది అదేదో కమీషనరాఫీసు. సదరు ఆఫీసులోని ఒకానొక సెక్షన్ కి గుర్నాధం సూపర్నెంటు! ‘చెవిగొరుకువారు. . .తార్పుడు సేయువారు. . .కొంటెకూతలవారు. . .కోడెగాండ్రు’ అన్నట్టు అన్ని రకాల మనస్తత్వాలూ వున్న తన క్రింది వుద్యోగుల్ని తను ‘కంట్రోల్’ చేయలేకపోతున్నాడేమోనని ఆయనగారికొక అనుమానం. చత్వారం హేతువుగా లభించిన కళ్ళజోడుతోనూ, నిగనిగలాడే నిండారు బట్టతల తోనూ గుర్నాధం. . .నల్లగా, గుండ్రంగా, అచ్చు గునపంలాగా వుంటాడు.

‘జుట్టు మూడు పాళ్లే అయినా అధికారం ఆరు పాళ్ళన్నట్టూ’. . . ‘నాన్ గెజిటెడ్ ఆఫీసరే’ అయినా ఆఫీసరాఫీసరే అయినట్టూ’ గుర్రుగా, గంభీరంగా వుంటాడు.

“వెధవది! గంభీరమే కాదాయనకి. . .కొసవెర్రి, కొంకనక్కతనం పాళ్ళు కూడా కాస్త ఎక్కువేనం”టాడు. అతనంటే గిట్టని హెడ్ గుమాస్తా ఆవకాయల అవధాన్లు.

“మరదే సూపర్నెంటంటే! సాతాని జుట్టుకి సన్యాసి జంద్యానికి ముడి పెట్టగలిగి వుండాలి గదా.” అంటాడు మరో గుమాస్తా జోగినాధం అవధానికి వత్తాసుగా.

గబ్బువాడు గదరువాడు వియ్యమందుకుంటుంటే మురికి వాడొచ్చి ముద్దాడినట్టుగా, “నిజమే సుమండీ! యిన్నాళ్ళకి నిజం పలికారు మీరు.” అంటూ తిట్టాడో పొగిడాడో కూడా తెలీనీకుండా తన వంతు తలూపుతాడు యింకో గుమాస్తా శాస్త్రి.

ఏది ఎట్లా ఏడ్చినా. . .ముండకి మొగుళ్ళు యిద్దరన్నట్టు గుర్నాధం వాళ్ళ సెక్షన్ కి రెండు గదులున్నాయి. ఒక గదిలో గుర్నాధం, ఆయనగారికి ఎదురుగా. . .సరిగ్గా ఎదురుగానున్న సీట్లో వనజాక్షి అనబడే ఒకానొక పెళ్ళయిన చంచలాక్షి, ఆమెకి అటుపక్కగా మరో పెళ్ళిగాని చిగురుబోడి సుబ్బలక్ష్మి కూర్చుంటారు.

ఇంకో గదిలో శాస్త్రి, జోగినాధం, అవధాన్లు మరో పెళ్ళీ పెటాకులూ రెండూ లేని ‘స్టెనోగ్రాఫర్’ కామేశం కూర్చుంటారు. పూటకొక్కసారి మేత మాటకొక్కసారి సామెత అన్నట్టుగా ఆ సెక్షన్లో ప్రతివాళ్ళకీ మాటకి ముందు సామెతలు వాడడం బాగా అలవాటు!

వనజాక్షి జూనియర్ అసిస్టెంటు! “ఆవిడ జూనియర్ అసిస్టెంటు కానేగాదనీ గుర్నాధమే ఆమెకి సీనియర్ అసిస్టెంటు అయ్యుంటాడ”నీ ఛలోక్తిగా అంటూంటాడు జోగినాధం. ఇకపోతే. . .సుబ్బలక్ష్మి టైపిస్టు! “ఆమె టైపిస్టే గానీ. . . టైపురైటింగంతా ఉద్యోగం వచ్చాకే నేర్చిందం”టాడు ఆ కన్నెని ఆమూలాగ్రం పరిశీలించిన కామేశం.

ఇక మనం పరిచయాలాపేసి, ప్రస్తుతంలోకి ప్రయాణిస్తే. . .గూనివాడు గోచీ బిగించి గుర్రంమీదెక్కి గదాయుద్ధం చేసినంత సీరియస్ గా ఆరోజు మద్యాహ్నం మూడు గంటలప్పుడు గుర్నాధం వాళ్ళ సెక్షన్ లో అంతా ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నమయ్యారు. శాస్త్రికి మాత్రం పనిమీద ఏకాగ్రత లేదు. కడుపులో కొద్దిగా ఆరాటంగా వున్నట్టుంది.

“జోగినాధం గారూ!” అన్నాడు మెల్లగా పెన్నుతీసి పక్కన పెడుతూ.

“ఊ!” అన్నాడు జోగినాధం ఫైల్లోంచి తలెత్తకుండానే

“నాకు ఒంట్లో ఏమీ బాగుండలేదయ్యా” చెప్పాడు శాస్త్రి ప్రారంభంగా.

ఆ మాటకి ఆ పక్కనేవున్న ఆవధానికి విసుగొచ్చినట్టుంది. “అందరికీ అన్నీరోగాలే గానీ అయిదుసోల కుండకి ఏ రోగం లేదని నీ ముఖానికి ఎప్పుడూ రోగాలే.” అన్నాడు తను కల్పించుకుంటూ. ఎక్కువ కాలం కలిసి పనిచేయడం వల్ల అవధానికి శాస్త్రితో కాస్త చనువెక్కువ.

“ఏమయిందేమిటి?” అడిగాడు జోగినాధం.

“ఎలుకలూ పందికొక్కులూ కలగలిసి పరుగెట్టినట్టు కడుపులో ఏవో అంతా రణగొణ ధ్వనులండీ!” కడుపు నొక్కుకుంటూ చెప్పాడు శాస్త్రి.

“చేతికందిన ఛెండాలమంతా చెడదింటే పైత్యం చేయదూ?” అన్నాడు అవధాని.

“ఇంతకీ ఏం తిన్నారో శాస్త్రిగారు?” తెగ క్యూరియాసిటీతో ప్రశ్నించింది వనజాక్షి అవతల గదిలోనుండి.

శాస్త్రికి తన గొప్ప చెప్పుకోడానికి కాస్త వీలు చిక్కినట్టయింది. “ఆ. . . మా ఆవిడ కాస్త చిత్రాన్నం, చిట్టిగారెలూ చేసిపెట్టింది లెండి.” అన్నాడు కొద్దిపాటి గర్వంగా మరింత ముక్తసరిగా.

“వాళ్ళావిడ కాస్త ప్రేమగా నోటికందించే సరికి కాదనలేక ఒక మోతాదు ఎక్కువ బిగించినట్టున్నారు. అంతేనంటారా సూపర్నెంటుగారూ!” అంది వనజాక్షి గుర్నాధంతో ముసి ముసిగా నవ్వుకుంటూ.

“అవునవును!” అన్నాడు గుర్నాధం గుడ్డి అద్దాల్లోంచి చూస్తూ.

“వీడి జబ్బు అదిగాదులెండి వనజాక్షిగారూ!” అన్నాడు అవధాని తనకి అంతా తెలుసునన్నట్టు.

“మరేదో?” అడిగాడు శాస్త్రి వెటకారంగా.

“నీ జబ్బు అదిగాదులేవయ్యా. నాకు తెలుసు.” అన్నాడు అవధాని మళ్ళీ వత్తి పలుకుతూ.

“మరి నీకు తెలిసిందేదో చెప్పి చావరాదూ.” శాస్త్రి అడిగాడు.

“ఆహార నిద్రావ్యత్యస్త పరిస్థితుల వల్లా, వాత పిత్త శ్లేష్మ దోషాల వల్లా నీకు కడుపులో బాధలు ప్రకోపిస్తున్నాయని నా అనుమానమయ్యా.” అన్నాడు అవధాని పెద్ద వైద్యుడిలాగా.

శాస్త్రికి మండింది. “మంగలి గొరిగి నేర్చుకుంటే వైద్యుడు చంపి నేర్చుకుంటాడని వీడి దరిద్రగొట్టు వైద్యం నామీద ప్రయోగిస్తాడెందుకండీ సూపర్నెంటూగారూ!” అన్నాడు రిపోర్టు చేస్తున్నట్టుగా.

“ఆయన వైద్యం కూడా ఒకసారి చేసి చూడొచ్చు కదండీ!” అన్నాడు . . .కామేశం సుబ్బలక్ష్మి పైనుండి కన్ను తిప్పకుండానే శాస్త్రిని ఏడిపించాలన్నట్టు.

“అద్గదీ. అట్లా గడ్డి పెట్టండి!” అన్నాడు అవధాని.

ఇక శాస్త్రి రెచ్చిపోయాడు. “ఏమిటండీ వీడిబొంద వైద్యం. గాడిద గడప చెట్టు ఆకులు తెచ్చి, కూతురు బుడమ చెట్టు రసంలో కలిపి, కల్పంలో వేసి నూరి తలకి పట్టిస్తే కడుపులో బాధలు తగ్గుతాయట. ఇదీ వైద్యం! అది వైద్యమో వీడి ఛాదస్తమో కూడా అర్థంగాదు.” అన్నాడు.

ఆ మాటతో అవధానికి కోపమొచ్చి, “బొండుమల్లెల గోడు బోడిముండ కెందుకనీ నీ దిక్కుమాలిన పిష్టపేషణ వ్యాపారం నాకెందుకులే.” అంటూ శాస్త్రి మీద అలిగి అటువైపు తిరిగాడు.

అంతా నవ్వారు. సుబ్బలక్ష్మి మాత్రం ముఖం పక్కకి తిప్పి ప్రత్యేకంగా కిల కిలా నవ్వింది. ‘ఈరక్క పెళ్ళి సందట్లో పేరక్క గర్భాదానం చేయించుకున్నట్టు’ ఏమాత్రం ఛాన్సొచ్చినా వదులుకునే రకంగాదు కామేశం. అందుకే వెంటనే అలర్టయి. . .

“ఏది ఎట్లాగున్నా సుబ్బలక్ష్మిగారు నవ్వితే మాత్రం సెక్షనంతా కళ కళ లాడిపోతుందండీ.” అన్నాడు.

సుబ్బలక్ష్మి కామేశం వైపు కొరకొరా చూసింది. ‘అందమా అందానికి పట్టిన పీడా’ అన్నట్టు సుబ్బలక్ష్మి పుటక్కి బాగానే వుంటుంది. గుణానికి మాత్రం. . . ‘ఎందుకొచ్చావే ఎల్లమ్మా అంటే అందుక్కాదులే అగ్గికొచ్చాన’న్నట్టు ప్రవర్తిస్తుంది. కామేశం అట్లా మాట్లాడడం ఆమెకీ ఇష్టమే. అయినప్పటికీ, ‘బావా అని చూడబోతే రావా అంటూ కొంగుబట్టుకుంటాడేమో’నని భయం. అందుకే పైకి బింకంగా వుంటుంది.

ఆ విషయం అటుంచితే. . .ఈ లోపల జోగినాధంకి రేగింది.

“అచ్చిగాడు చావనీ అంటే బుచ్చిగాడే చచ్చాడనీ శాస్త్రిగారి సంగతేమోగానీ నేను మాత్రం ఈ పని చేయలేక చచ్చేటట్టే వున్నానండీ.” అన్నాడు చేతిలో పెన్ను విసిరి టేబుల్ మీద కొడుతూ పెద్దగా సూపర్నెంటు వినేట్టుగా.

( సశేషం )