ఒకానొక అజ్ఞానపు క్షణంలో. . . నాకు తెలీకుండా నేనే జన్మించి,  అమ్మ చనుబాలలో ఆది సంవేదన అనుభవించి. . .ఆటపాటలలో అద్వితీయుడనై రాణించి. . .సంఘ విద్యా సముపార్జనలో సారస్వత చక్రవర్తినై, పుస్తకాల్ని పఠించి. . .పరీక్షల్ని పరివీక్షించి. . .ఆత్మజ్ఞాన అవలోకనంలో విలువల వలువలు వూడదీసి. . .విశ్వతత్వాలు స్మరించి. . . మానవ శ్రేయస్సు మహా లక్ష్యమై పోగా. ."ఈ ప్రపంచపు దొడ్డబిడ్డగా ఉద్భవించాల"నీ, "ఒక పూర్తి మానవుడిగా పరిణమించాల"నీ, నేను కంటున్న కల,  కడుతున్న కోట. . .ఒహ్ ఇంతెందుకు కనుచూపు మేరలో. . . నా జీవితం ఒక వేద సంకలనం!!  నేనొక ఈశ్వరుడిని!!! ( ఇది ఈ బ్లాగులోని ప్రసంగి కథలో ఒక పాత్ర మనోభావాలు __ రచయిత )

Showing posts with label నా మనోభావాలు. Show all posts
Showing posts with label నా మనోభావాలు. Show all posts

Saturday, March 29, 2008

మానవ జీవితానికి మహాతాత్పర్యం!

మానవ జీవితానికి మహాతాత్పర్యం!

ప్రాచ్య, పాశ్చాత్య వాజ్ఞయంలో మహోన్నత మానవమూర్తులు ప్రవచించిన ఎన్నో వాదాలూ, ఎన్నో ‘యిజా’లూ, మరెన్నో నిజాలూ మనం చదువుకున్నా, యింకెన్ని నేర్చుకున్నా, మరెన్ని వున్నాయనుకున్నా, తత్వశాస్త్రం యావత్తూ క్షుణ్ణంగా పరిశీలించిన మీదట మనకి కడకి అర్థమయ్యేదీ, మిగిలేది మూడే మూడు వాదనలు. అందులో. . . భగవంతుడున్నాడనే అస్థిత్వవాదం ఒకటి. లేడనే నాస్తికవాదం మరొకటి, ఇంకేదో వుందనే వాదం. . .ఉదాహరణకి హేతువాదం తరహాలో. ఇటువంటివి చాలా మంది చాలా రకాలుగా నిర్వచించారు.

కాగా, ఆధునిక తత్వవేత్తలలో ఒకరైన భారతీయులూ మరియూ తెలుగువారైన కీ.శే. జిడ్డు కృష్ణమూర్తి గారి తత్వం యిటీవలి కాలంలో బాగా ప్రాచుర్యం పొందడమే గాక, యావత్ ప్రపంచాన్నీ ఆ తత్వం ఆలోచింపజేసింది. ప్రభావితం చేసింది. ఆయన తత్వానికనుగుణంగా దేశంలోనూ, యితరత్రా ఎన్నో రచనలూ, మరెన్నో గ్రంథాలూ ఉద్భవించి, వెల్లువెత్తాయనే చెప్పవచ్చు. ఆయన తత్వానికి ప్రభావితులయే కీ.శే. బుచ్చిబాబు గారు తెలుగులో “చివరకి మిగిలేది” గ్రంథాన్ని రచించారనే విషయం ప్రచారంలో వుంది. ఈ రచనలో ఒక పాత్ర ఒక ఖాళీ కవరును కథా నాయకుడి చేత విప్పించడం ద్వారా బుచ్చిబాబు గారు జీవితానికి అర్థం ఏమీ లేదనే విషయాన్ని ప్రస్థావిస్తారు. కానీ బుచ్చిబాబు గారు తన నవల పీఠికలో తన “నవలలోని పాత్రల అభిప్రాయాలన్నీ తను జీవితంలో నేర్చుకున్న పాఠాలుగా భావించవద్ద”ని వేడుకున్నారు. కనుక, ఆయన నవలలోని ఆ పాత్ర ద్వారా చెప్పించిన జీవితానికి అర్థం ఏమీ లేదన్న విషయం బుచ్చిబాబు గారి స్వీయభావనగా మనం పరిగణించరాదు.

ఇదిలా వుండగా, జీవితానికి అర్థం ఏమీ లేదనే వాదన ఈ మధ్య కాలంలో ప్రబలంగా వినపడుతున్నది. ఇలా చెప్పడం, చెప్పుకోవడం గొప్పగానూ, passion గానూ కన్పిస్తున్నది. అసలింతకీ జిడ్డు కృష్ణమూర్తి గారు గానీ, బుచ్చిబాబు గారు గానీ జీవితానికి అర్థం ఏమీ లేదనే వాదనని గానీ, తత్వాన్ని గానీ ఎక్కడ చెప్పారో, ఎప్పుడు చెప్పారో ఎవరికీ తెలీదు. వాళ్ళలా నిర్వచించారని ఎవరైనా అంటే అది సత్య దూరమైన మాట.

నిన్నటికి నిన్న ‘పొద్దు’ పత్రికలో ప్రచురితమైన శ్రీ ఫణీంద్ర గారి ‘కలం కలలు’ బ్లాగు మీద ప్రముఖ బ్లాగరు పప్పు నాగరాజుగారి ‘కలం కలల ఘలం ఘలలు’ అన్న సమీక్షా వ్యాసంలో ఫణీంద్ర గారన్న మాట యిది.

“మానవ అస్థిత్వానికి అర్థం లేదు. అర్థమేదో ఉందన్న అన్వేషణలో మనం పడే నిష్ఫలమైన సంఘర్షణే ఈ అస్థిత్వానికి కడకు మిగిలే అర్థం. అస్థిత్వానికి అర్థమే లేదంటే ఇక మిగిలేది జీవితమంత పొడవైన ఖాళీ; భీతి గొలిపే శూన్యత.”

ఈ మాట శ్రీ ఫణీంద్రగారు ఎందుకన్నారో, ఎటువంటి సందర్భంలో అన్నారో నాకు తెలీదుగనుక, నేను ఆయనను గానీ, మరొకర్నిగానీ తప్పు పట్టేదేమీలేదు గానీ, సరిగ్గా యిటువంటి భావనే యిటీవలి కాలంలో సర్వత్రా వ్యాపించుకుని వుందని చెప్పడానికి ఎంతో విచారిస్తున్నాను. ఇదెంతో బాధాకరమైన భావన. ఈ విషయం సవివరంగా ప్రస్థావించడానికే ఈ వ్యాసంలో ఫణీంద్రగారి మాటలు నేను వాడుకుంటున్నాను.

అసలు కీ.శే. జిడ్డు కృష్ణమూర్తి గారు ఏమన్నారు? “భగవంతుడనే విషయాన్ని ఒకరు మనకి చెప్పడం ద్వారా కాకుండా మనల్ని మనమే ఆత్మశోధన చేసుకోవడం ద్వారా, ప్రపంచ శోధన చేయడం ద్వారా మనమే నిగ్గుదేల్చుకోవలసివుంద”న్నారు. “మనిషి జీవితంలోని మంచిచెడులూ, ఆవేశకావేశాల వంటి మానసికోద్రేకాలనూ మనం తరచి, తరచి చూసి వాటి స్వరూప స్వభావాలను తెలుసుకోవాల”న్నారు. “వాటి స్వరూపం గురించి తెలిసినప్పుడే ఆయా ఉద్రేకాలు మనిషి చెప్పుచేతల్లో వుంటాయనీ, అలాగే, వ్యసనాలూ, వాటి మూలాలూ గ్రహిస్తే, మనం వ్యసనాలకు భయపడాల్సిన అవసరం లేదనీ, వాటంతటవే అంతరిస్తాయ”నీ అన్నారు. అలాగే “దైవం, భగవంతుడు వంటి కల్పిత భావనలు మనిషిలో ఆశను రేకెత్తించి, అతడ్ని పరాధీనుడిగా (dependable) చేసి, భ్రమల్లో వుంచి అతడి భవిష్య జీవితానికి గొడ్డలి వ్రేటుగా పరిణమించి, పాడుచేస్తాయనీ, ఆశ, దాని సంపూర్ణ స్వరూపాన్ని మనం తెలుసుకున్నప్పుడు దానంతటదే నశించి మనిషి భ్రమల్లో బ్రతకకుండా సత్యంతో ప్రత్యక్ష సంబంధం కలిగివుండే చురుకైన వర్తమానంలో జీవించడమే నిజమైన జీవితమ”నీ ఉద్ఘాటించారు.

“ఆలోచన పక్వత చెందినప్పుడు దానంతటదే తన పరిమితులెరిగి సద్దుమణుగుతుందనీ, అప్పుడే ప్రశాంతత సాధ్యమనీ, అటువంటి జీవితంలో అనుభవించేవాడూ, అనుభవించబడేదొటీ అంటూ విభజన వుండదనీ, అనుభవించడం అనే మైమరపు స్థితియే అసలైన జీవితమ”నీ వెలుగెత్తి చాటారు.

“మన కంటికెదురుగా వున్న సత్యాన్ని విస్మరించి, దైవం, భగవంతుడని ఎవరో చెప్పిన అభూత కల్పనలనీ, నమ్మకాలనూ, భావనలను విడనాడి, వర్తమానంలో ప్రతిక్షణం మానవుడు సత్యాన్ని సాక్షాత్కరింపజేసుకోవాలని ఆక్రోశించినారు. మానసికంగా ఏకాకియైన మనిషి (ఇది మనుషులందరికీ వర్తిస్తుంది) సత్యంతో సంబంధం కలిగివుండడం ద్వారా ఏకాకి తనాన్ని గిరవాటు వేయాల”ని ఉద్బోధించినారు.

ఈ ప్రకారం, ఫణీంద్రగారి యిది వరకటి ఈ మాటలను. . .

“మానవ అస్థిత్వానికి అర్థం లేదు. అర్థమేదో ఉందన్న అన్వేషణలో మనం పడే నిష్ఫలమైన సంఘర్షణే ఈ అస్థిత్వానికి కడకు మిగిలే అర్థం. అస్థిత్వానికి అర్థమే లేదంటే ఇక మిగిలేది జీవితమంత పొడవైన ఖాళీ; భీతి గొలిపే శూన్యత.”

ఇప్పుడు, ఈ మాటలకి జిడ్డు కృష్ణమూర్తి గారి తత్వాన్ని మేళవించి సరికొత్త అర్థంతో ఉటంకిస్తాను.

“మానవ అస్థిత్వానికి అర్థం వున్నది. అర్థమేదో ఉందన్న అన్వేషణలో మనం పడే సంఘర్షణే (నిష్ఫలమైనది కాదు. ఇదే చివరకి ఫలిస్తుంది) ఈ అస్థిత్వాన్ని కడకు మనకి తెలుపబోయే సాధనం. అస్థిత్వానికి అర్థం వుందనుకున్నప్పుడు, అసలు అస్థిత్వానికి అర్థం తెలుసుకున్నప్పుడు మిగిలేది జీవితమంతటా పొడవైన నిండుదనమే; భీతికి తావులేని నిండుదనం.”

ఇది అసలు నిజం. మీరేమంటారు?

(ఇది ఎవరినైనా కించపరచాలనో, వివాదాలు సృష్టించడానికో రాసిన వ్యాసం కాదు. మందుకి అలవాటు పడ్డ తాగుబోతుకి "యింక మందు లేదూ, లభించదూ" అంటే జీవితం ఎంత నిరాశాజనకంగా మారుతుందో, అలాగే భగవంతుడి మీద ఆధార పడిన మనిషి "భగవంతుడు లేడ"నే నిజం తెలిసుకున్నప్పుడు నిరాశాపూరితుడిగా, క్రియాశూన్యుడిగా మారకుండా, అసలా నిజం తెలుసుకున్నప్పుడే నిజమైన, నిండైన జీవితం గడపగలడనీ, గడప సమర్థుడనీ, భగవంతుడనే స్థితి లేకపోయినా సత్యంమనబడే అద్భుతమైన స్థితి, వర్తమానం మనకి ఎల్లప్పుడూ వున్నవనీ చెప్పడానికి ఉద్దేశించిన టపా యిది. ఇది నా స్వీయ ఛాదస్తం ఎంత మాత్రమూ కాదు. కాకుంటే శ్రీ పప్పు నాగరాజు గారి సమీక్ష, శ్రీ ఫణీంద్రగారి ఏ కథలోనివో, కవితలోనివో మాటలూ ఈ వ్యాసానికి ప్రేరకాలు)

(సమాప్తం)

Saturday, March 15, 2008

నేనెవరో తెలుసుకోండి!

‘నేనె’వరో తెలుసుకోండి!

నేను నేననుకుంటా. నిజానికి నేను నేనేనా? ఇది అసలు ప్రశ్న.

నా శరీరానికి నేను ఫలానా అని ఓ పేరెట్టుకుంటా. లేదంటే మా పెద్దలు పెట్టిన పేరుని అంగీకరించి, స్వీకరిస్తా. జననావయవాల కనుగుణంగా నేను స్త్రీననో, పురుషుడిననో అభివర్ణించుకుంటా. నా కుటుంబం ఫలానా అనీ, నా ఊరూ యిది అనీ, నా దేశం అది అనీ, నేనున్న గ్రహం . . . ఇలా విభజించుకుంటూ పోతా. నా బంధువులు ఫలానా వారనీ, నా స్నేహితులు ఫలానా వారనీ గుర్తించుకుంటా. నిజానికి నా ఊహలో తప్ప నాకూ నా బంధువులకి మధ్య బంధుత్వమనే గొలుసో, దారమో ఏదీలేదు. అయినా నన్ను నేను మోసగించుకుంటూనే వుంటా. ఎందుకంటే బంధువులు, స్నేహితులు లేకుండా నేను జీవించలేను. నాకు భయం. నేను నేజూసిన దృశ్యాల నుండీ, చదివిన పుస్తకాల నుండీ, విన్న మాటలూ, శబ్దాలనుండీ, స్పృశించిన జ్ఞాపకాలనుండీ, రుచి చూసిన పదార్థాల నుండీ కొంత జ్ఞానం నాలో పోగేశా. నేను పోగేసిన జ్ఞానం ఎంత పోగేసినప్పటికీ అది పరిమితమే. అపరిమితం కానేరదు. ఆ పరిమితమైన పోగేసిన జ్ఞానం లోనుంచి నేను మాట్లాడుతా. నీతులు వల్లిస్తా. ఇది నిజం, యిది అబద్ధం అని సిద్ధాంతాలు చేస్తా. ఇది మంచిదనీ, ఇది చెడ్డదనీ ప్రపంచాన్ని విభజించుకుంటూ పోతా. చెడు అనుకున్నదానికి దూరంగానూ, మంచికి దగ్గరగానూ వుండాలనుకుంటా. ఉన్నా, వుండలేక పోయినా. అలా నాకు చేతనయిన పనుల్లో ఏదో ఒక దాన్ని ఎంచుకుని దాన్ని వృత్తిగా స్వీకరిస్తా. ఆ వృత్తిలో గడుపుతూ సంసార జీవితమో, లేదంటే బికారినై సన్యాస జీవితమో గడుపుతా.

ఇంతవరకూ బాగానే వుంది. ఇక్కడ నుండే అసలు తంటా. నేను నాకే తెలీని కొన్ని పదాలు విన్నా. దేవుడనీ, పరమాత్ముడనీ, ఆత్మ సాక్షాత్కారమనీ, విశ్వరూప సందర్శనమనీ ఏవో మాటలు. అలాగే ఆ దైవాన్ని దర్శించడం కోసం కొన్ని మార్గాలు ఎంచుకున్నా. వాటికి మతాలని పేరు పెట్టుకున్నా. లేదంటే వాటికి సంఘం పేర్లెట్టి చెప్పగా విన్నా. అసలు దైవాన్ని ఎందుకు దర్శించాలీ అంటే దైవాన్ని దర్శిస్తే ఈ ఈతిబాధలుండవట. దుఃఖమనేది అసలుండదట. లేదంటే స్వర్గానికి చేరుతానట. అక్కడ రంభా, ఊర్వశీ, మేనకాదులతో సుఖంగా జీవించవచ్చునట. అందుకోసం నేను దైవాన్ని దర్శించాలట. దైవం అనబడేది అపరిమితమైనదట. దానిని నేను దర్శించడానికి పరిమితమైన ఆలోచన పనికిరాదట. కనుక, నేను ఆలోచనను స్తంభింపజేసినప్పుడే, ఆపుజేసినప్పుడే నేను realize అయినట్టట. అప్పుడే ఆ దైవం నాకు లభ్యమౌతుందట. ఇంతకీ నేనెలా ఆలోచనని ఆపగలను. అసలు ఆపాలనుకోవడమే ఒక ఆలోచనే. ఇది సమస్య.

దీని కోసం కొన్ని మార్గాలు సూచించబడ్డాయి. ధ్యానమనీ, భావాతీత ధ్యానమనీ (ఆలోచనలు లేనిది), Meditation అనీ రకరకాలు. అసలు ఆలోచనని ఆపాలనుకోవడమే ఒక ఆలోచనే. ఇదంతా నాకు చెప్తున్న దెవరు. ఆలోచనే కదా? అటువంటప్పుడు ఆలోచన తన నశింపును తను కోరుతుందా? పరిమితమైన ఆలోచన తను అంతమై అపరిమితమైన బ్రహ్మపదార్థం గురించి నాకు తెలుపగలదా? ఇది అసలు సమస్య! కనుక, నేను realize అవడం అనేది వట్టిమాట. నేనెన్నటికీ realize కాలేను. కాబట్టి, నేనెన్నటికీ బ్రహ్మపదార్థాన్ని గురించి తెలుసుకోలేను.

అయితే ఈ దైవం, ఈ బ్రహ్మపదార్థం, ఈ సత్యం అనేది నాకెప్పటికీ లభ్యం కానిదేనా?

ఈ ప్రశ్నకే సమాధానంగా కాదంటారు పెద్దలు. నువ్వు ఎన్నటికీ realize కాలేవు. ఒకవేళ అయినా నువ్వు ఆలోచనని నియంత్రించడానికి ప్రయత్నిస్తావు. ఎప్పుడైతే ఆలోచనని అణచడం, నియంత్రించడం వుంటుందో అప్పుడది మరింతగా విజృంభిస్తుంది. అప్పుడు నీకూ ఆలోచనకీ మధ్య విభజన వుంటుంది. సంఘర్షణ వుంటుంది. విభజించేదేదీ సత్యాన్ని తాకలేదంటారు పెద్దలు.

కానీ, నీలోని ఆలోచన realize కాగలదంటారు. ఆ ఆలోచన realize అయినప్పుడే సత్యం అనబడేది సాధ్యం అంటారు. అదెలాగంటే యిలా. . .

నిజానికి నేను నేను కాదు. నేనొక ఆలోచన. భావాల, భావజాలాల పరంపర. నేనొక శరీరానికి అనుసంధించబడి వుంటా. (తిరిగి మొదటికొద్దాం) నా శరీరానికి నేను ఫలానా అని ఓ పేరెట్టుకుంటా. జననావయవాల కనుగుణంగా నేను స్త్రీననో, పురుషుడిననో అభివర్ణించుకుంటా. నా కుటుంబం ఫలానా అనీ, నా ఊరూ యిది అనీ, నా దేశం అది అనీ, నేనున్న గ్రహం . . . ఇలా విభజించుకుంటూ పోతా. (యిలా మిగతాదంతా కూడా).

నేను ఆలోచన గనుక, నేను పుట్టేదే నేను పోగుజేసుకున్న జ్ఞానం లోంచి. అంటే గతం లోనుండి. జ్ఞానం ఎంత పోగేసినా ఎన్నటికీ పరిమితమైనదే గనుక ఆలోచన అనబడే నేను ఎన్నటికీ పరిమితమైన దానినే. నిజానికి నేను గతాన్ని. నాకు అనుసంధించబడివున్న శరీరానికి ఒక పేరు పెట్టి, దాన్ని ఈ విశ్వం నుండీ, అఖండ సత్యం నుండీ దాన్ని విభజించినాను. నాలోని అల్పత్వాన్ని దానికి వర్తింపజేసినాను. కనుక, నేను ఎన్నటికీ నేను కాని దైవాన్ని గురించి వివరించలేను. నేను దైవాన్ని గురించి చెప్పినా, వేదాల గురించి చెప్పినా, మరే గురువు గురించి చెప్పినా, యింకో జిడ్డు కృష్ణమూర్తి గురించి చెప్పినా, ఎవ్వరి గురించి చెప్పినా, ఏది చెప్పినా నా వివరణ యావత్తూ దైవం కానిదాని గురించే! నేనిప్పుడు realize అయినాను. నా పరిమితులు నేను తెలుసుకున్నాను గనుక నేను చెప్పేదంతా అసత్యమే. ఎందుకంటే సత్యం అపరిమితమైనది గదా. దాన్ని పరిమితమైన నేను స్పృశించలేను. నేను realize అయినప్పుడు, నేను చెప్పేదంతా అసత్యమని తెలుసుకున్నప్పుడు నేను భగవంతుడి గురించి యిక చెప్పడానికేం లేదు. భగవంతుడి గురించి ఆలోచించడానికేం లేదు. మనిషి వర్తమానంలో వున్నప్పుడు మాత్రమే నా absence వుంటుంది. ఆ సమయంలో మినహా ప్రతి క్షణం నేను మనిషిని సత్యం నుండి దూరం చేస్తూనే వుంటా.

కనుక, పరిణతి చెందిన ఆలోచన తనంతట తానే realize అయి భగవదాన్వేషణ కోసం వత్తిడి చేయదనీ, తనకు తానుగానే సద్దుమణుగుతుందనీ అంటారు పెద్దలు. వర్తమానంలో వున్నప్పుడు మాత్రమే మనిషికి సత్యంతో ప్రత్యక్ష సంబంధం వుంటుందంటారు. దైవాన్ని సాక్షాత్కరింపజేసుకోవాలనో, మరోటో ఆశ వున్నంత కాలం మనిషి దైవానికి దూరంగానే వుంటాడంటారు.

నిజమేనంటారా?

Tuesday, November 27, 2007

నా దృక్పథం నుండి స్త్రీమూర్తి!...2

(ఇది ఆడవాళ్ళ సానుభూతిని సంపాదించడం కోసమో, పురుషుల్ని బాధ పెట్టడం కోసమో ఉద్దేశించిన వ్యాసం కాదు. మానవజాతి చరిత్రలో నేను చూసిన, నాకు అన్పించిన ఒక సత్యాన్ని ఇక్కడ ఆవిష్కరిస్తున్నాను. అభిప్రాయ భేదాలుంటే నిర్మాణాత్మకమైన విమర్శ చేయమని పఠితల్ని కోరుతున్నాను)

నా దృక్పథం నుండి స్త్రీమూర్తి

ఇక ‘చలం’ గురించి. ఆచార వ్యవహారాల పేరుతో బానిసగా మారిన స్త్రీమూర్తిని చూసి చలం చలించిపోయాడు. పురుషుడు ముద్దు పెట్టుకుంటేనే గర్భం వస్తుందనుకునే మానసిక పరిణతి లేని స్త్రీలు ఆనాటికే 25 శాతం మంది వున్నారన్న కొన్ని నగ్నసత్యాల్ని గ్రహించి విల విలలాడాడు. స్త్రీ శరీరానికీ, మనసుకీ వ్యాయామం కావాలని ఎలుగెత్తి చాటాడు. స్త్రీని విశ్వకేంద్రంలో నిలిపి, కలాన్ని సమ్మెటగా చేసి ఆమె దాస్య శృంఖలాల్ని పగులగొట్ట బృహత్ ప్రయత్నించినాడు. ఎంత విశృంఖలత వుందనుకున్నా చలం రచనలు సాధించిన ఘనత తక్కవేమీ కాదు. అవి ఆంధ్ర వాజ్ఞయంలో తగిన స్థానం సంపాదించుకోగలిగాయి. యావత్ తెలుగుజాతి ఆలోచనా విధానాన్ని ప్రభావితంజేసి, తెలుగువారి దృక్పథంలో నూతనత్వానికి శ్రీకారం చుట్టాయి. ఒకనాడు తెలుగు సాహితీ ప్రపంచమే సంచలనాత్మక రచయిత వైపు దృష్టిసారించి అబ్బురపడిందన్న విషయం మనం మరువలేనిది. ఆపైన ఆథ్యాత్మిక చైతన్యం పొందిన చలం మాటలకు విలువ వుంటుందని నేననుకోను. ఒక్క చలమే కాదు ఆథ్యాత్మిక చైతన్యం పొందిన ఏ వ్యక్తి మాటలకైనా ఆథ్యాత్మిక విలువ తప్ప సామాజిక విలువలు వుండవు. ఎందుకంటే ఆథ్యాత్మిక మానవుడికి అన్ని విలువలూ సమానమే. భావాల హెచ్చుతగ్గుల వివక్ష వుండదు. అప్పుడే ఆథ్యాత్మికం సాధ్యం కూడా. ఏది ఏమైనా స్త్రీకి స్వేచ్ఛని ప్రసాదించాలనే తీవ్ర తాపత్రయంలో భారతీయ కుటుంబ వ్యవస్థనూ, పసిపిల్లల భవిష్యత్తునూ చలం విస్మరించారనే విషయమూ విమర్శలకు నోచుకుంది.

కానీ, గడచిన రెండు దశాబ్దాలకాలంలో ఆధునిక స్త్రీ తన దాస్య శృంఖలాల్ని తనే ఛేదించుకోవాలనే స్వీయ జ్ఞానాన్ని పొందింది. నడుం బిగించి ఆ దిశగా తనకి తానుగానే ఉద్యమించింది. ఆ క్రమంలో ఆమె సాధించిన విజయాలు తక్కువేమీ కాదు. పురుషుడితో సమానంగా ఆమె ఆర్థిక స్వావలంబన సాధించుకుంది. తన ప్రాణ, మాన సంరక్షణ కోసం తగువిధంగా చట్టాలు రూపొందించుకోగిలిగింది. అయినా, కనుచూపు మేరలో ఆమె సామాజిక స్వేచ్ఛ ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే చందంగా వుండిపోయింది.

అదే చట్టాలు సంఘంలో బరితెగించిన స్త్రీ వ్యక్తులకు మారణాయుధాలై చేతికందాయి. మంచి ప్రవర్తన గల మగవాళ్ళు సైతం ఈ చెడు మార్గాన్ననుసరించిన స్త్రీల చేత భంగపడిన సంఘటలలు ఇటీవల కోకొల్లలు. వరకట్నం ఊసెత్తని పురుషుడ్ని సైతం తనకి అభిప్రాయభేదం కలిగినప్పుడు స్త్రీలు వరకట్నపీడితుడిగా కోర్టుల కీడ్చి శిక్షింపజేయడం వంటి సంఘటనలు ఎంతైనా అమానుషం. ఇటువంటి స్త్రీలు తమని సామాజిక, ప్రాణ సంరక్షణకోసం ఏర్పడిన చట్టాల వెనుక స్త్రీ వేదననూ, బాధలనూ గుర్తించిన పురుషులు అనేకులున్నారన్న విషయం విస్మరించరాదు. కేవలం స్త్రీల వల్లనే ఆయా చట్టాలు రూపొందించబడలేదు. సరిగ్గా యిక్కడే పురుషుడు కూడా స్త్రీని ద్వేషించడం, తనకి బాధాకరంగా పరిణమించిన చట్టాల్ని దుయ్యబట్టడం జరిగింది.

ఏదియేమైనా, పురుషుడు తన జాత్యహంకారం మూలంగా స్త్రీ అనాది నుండీ అణచివేతకి గురైనదన్న విషయం అంగీకరించక తప్పదు. అదే విధంగా స్త్రీలు తమకి అణ్వాయుధాలై చేతికందిన ‘ఉమెన్ ప్రొటెక్షన్’ వంటి కేసుల్ని తప్పుడు పోకడలకు కాక నిజమైన తప్పిదం జరిగిన చోట మాత్రమే వాడుకోవడం సమంజసం. ఎందుకంటే, మానవజాతిలో స్త్రీ, పురుషులిద్దరూ భాగస్వాములు. స్త్రీ లేనిదే పురుషుడు లేడు. అలాగే స్త్రీ విషయంలో కూడా. అలా స్త్రీ పురుషులిద్దరూ సమదృష్టితో మెలగినంత కాలమే మానవత్వానికి మనుగడ. మానవజాతి మనుగడ. కడకి మనిషికే మనుగడ. ఆ అవగాహన నశించిన రోజున మనకి మిగిలేది శూన్యం.

చివరగా ఒకమాట. ఆచారాల పేరిట, కట్టుబాట్ల పేరిట, మతాల పేరిట స్త్రీ అణచివేతకి గురైందన్న విషయం నూరుకి నూరు పాళ్ళూ సత్యమనడానికి ఎన్నో తార్కాణాలు అవసరం లేదు. స్వంతంత్రించి, ఒక్కటే ఒక్కటి ఉదహరిస్తాను.

స్త్రీ శరీరం యావత్తూ పురుషుడి స్వంతమేనన్నది విశ్వసత్యం. అటువంటి పురుషుడి సొత్తైన స్త్రీ శరీరపు వంపు సొంపుల్నీ, ముఖ సోయగాల్నీ, లావణ్యాన్నీ, సుకుమారతనీ పురుషుడు వీక్షించి, తరించి, తథాత్మ్యం చెందాల్సిన స్త్రీమూర్తి గీర్వాణ సౌందర్యాన్ని ఒక మతం వారు నల్లముసుగులు వేసి మరుగు పరిస్తే, ఆ స్త్రీలు ఏ పాపమూ ఎరుగకుండానే ముసుగుదొంగలకి మల్లే మన మధ్యనే సంచరిస్తుంటే, సహజీవిస్తుంటే మనసున్న ఏ మనిషికైనా ప్రస్ఫుటంగా తెలీడం లేదా చరిత్రలో స్త్రీమూర్తి నిస్సందేహంగా అణచివేతకు గురైనదని, ప్రస్తుతం గురౌతూనే వున్నదన్న విషయం.

ఇంతకుమించిన తార్కాణాలు కావాలంటారా?

(సమాప్తం)

Monday, November 26, 2007

నా దృక్పథం నుండి స్త్రీమూర్తి!...1

(ఇది ఆడవాళ్ళ సానుభూతిని సంపాదించడం కోసమో, పురుషుల్ని బాధ పెట్టడం కోసమో ఉద్దేశించిన వ్యాసం కాదు. మానవజాతి చరిత్రలో నేను చూసిన, నాకు అన్పించిన ఒక సత్యాన్ని ఇక్కడ ఆవిష్కరిస్తున్నాను. అభిప్రాయ భేదాలుంటే నిర్మాణాత్మకమైన విమర్శ చేయమని పఠితల్ని కోరుతున్నాను)

నా దృక్పథం నుండి స్త్రీమూర్తి

మౌలికంగా ప్రపంచంలో వున్నది మానవజాతి ఒక్కటే. స్త్రీజాతి, పురుషజాతి అంటూ విడివిడిగా లేవు. కాకుంటే స్త్రీలనైనా, పురుషులనైనా ఒక సమూహంలా చెప్పుకోవాల్సివచ్చినప్పుడు మనం స్త్రీ జాతనో, పురుషజాతనో చెప్పుకోవడం అనవాయితీ అయింది.

ఇక సువర్చల, నూర్జహాన్, డయానా యిలా విడి విడి స్త్రీల గురించి కాకుండా ప్రపంచ స్త్రీ అంటే విశ్వజనీన స్త్రీ నిస్సందేహంగా లింగ వివక్షకూ, అణిచివేతకూ గురైంది ప్రకృతి పరంగా చెప్పాలంటే ఆమెకి పెద్ద అన్యాయమే జరిగింది. ఇంతకుముందు నేను ఇదే బ్లాగులో రాసిన “ఇంటిపేరు పురుషుడిదే-ప్రకృతి న్యాయం” టపాలో వలెనే పురుషుడికి ప్రకృతి పరంగా లభించిన ఇంటిపేరుని సాంఘిక, ఆర్థిక పరమైన విషయాలకు అన్వయించి (ఇది నా ఊహ మాత్రమే) ఆమెకు ఆస్తిహక్కు లేకుండా చేయడం మూలంగా స్త్రీకి చరిత్రలో దారుణమైన ద్రోహం జరిగిందన్నది నిర్వివాదాంశం. ఇక స్త్రీమూర్తికి ప్రకృతి పరంగా లభించిన మరో వరం మరియూ శాపం గర్భం. గర్భం ధరించడం మూలంగా ఆమె పురుషుడితో లైంగిక సంబంధం పెట్టుకున్న విషయం ప్రపంచానికి వెల్లడవుతుంది. ఆ కారణంగా ఆమె కొన్ని అంక్షలకి, కట్టుబాట్లకి గురైంది. అలాగే ఋతుక్రమం. ఇది కూడా ఆమె పాలిట శాపంలా పరిణమించింది. ఈ బాధలన్నీ పురుషుడికి లేవు. ఇదే, సరిగ్గా ఇక్కడే పురుషుడి చేతికి వజ్రాయుధం లభించింది. స్త్రీకి రౌరవ నరకమూ సంప్రాప్తమయింది. ఆపైన, పరిణామంలో ఏర్పడిన సతీసహగమనాలు మొదలుకుని ఇనుప కచ్చడాలూ, గృహనిర్భంధాలూ, ఆచారం కట్టుబాట్ల పేరిట భర్త చనిపోయిన స్త్రీ గుండు గీయించుకుని, తెల్లబట్టలు ధరించి శరీర కోర్కెలు చంపుకోవడం వరకూ జరిగిన నానా విధాల దురాచారాలూ మనకి తెలీనివి కావు. కడకి యివన్నీ మానవత్వానికే కళంకంలా, తీరని మచ్చలా పరిణమించాయి.

మొన్న ఒక పురుష బ్లాగరు ఒక సందర్భంలో అన్నారు. ఇలా స్త్రీ, పురుషులు ఒకరితో ఒకరు “సంబంధం పెట్టుకుని పరస్పరం ద్వేషించుకోవడం కంటే ఆడవాళ్ళు మగవాళ్ళ సహచర్యం పూర్తిగా వదులుకోండి. ఆలాగే మగవాళ్ళు కూడా ఆడవాళ్ళ సహచర్యం పూర్తిగా వదులుకోండి” అని. ఏదో ఆవేశంలోనో, ఆవేదనలోనో ఆయన అన్నారే గానీ, అది అసంబద్ధమైన మాట. అదే జరిగితే మానవజాతి మనుగడకే ముప్పు వాటిల్లుతుందన్నది జగమెరిగిన వాస్తవం!

మళ్ళీ ఆయనే, “ఆడవాళ్ళకి ఏడవడం చేతనయితే, మగాళ్ళకి కోపం తెచ్చుకోవడం చేతనవుతుంద”న్నారు. ఇది కోపం, అలక, ఏడ్పు లాంటి మనో వుద్రేకాల స్వరూపం గురించి తెలీక అన్నమాటగా నేను భావిస్తున్నాను. అలక, ఏడ్పు అసహాయత లోంచి జన్మిస్తాయి. కోపం అనబడేది ఆధిక్యతలోంచి పుట్టింది.

ఉదాహరణకి ఒక పురుష ఉద్యోగి వున్నాడనుకుందాం. అతడి పై అధికారి(ణి) ఒక స్త్రీ ఉద్యోగిని అనుకుందాం. పై అధికారిణి అంటే మామూలు సాదా సీదా పై అధికారిణి కాదు. అతడి ‘అపాయింటింగ్ అథారిటీ’ ప్లస్ ‘డిస్ మిస్సల్ అథారిటీ’ కూడా అమే అనుకుందాం. అటువంటి లేడీ బాస్ తన తప్పే అయినా, అకారణంగానే అయినా సదరు పురుష ఉద్యోగిని తీవ్రంగా దూషించిందనుకుందాం. అప్పుడు ఆ పురుష వుద్యోగి నేను పురుషుడ్నిగదా అని ఆమెపై కోపగించుకుని ఉద్యోగం వూడగొట్టుకుంటాడా. లేక అలిగి మాట్లాడకుండా ఊరుకుంటాడా. నేనైతే అలగుతాడనే అనుకుంటా (ఒకవేళ ఏడ్వలేక పోయినా). కనుక అలక, ఏడ్పు లాంటివి అసహాయతకి చిహ్నాలు. అలాగే కోపం ఆధిక్యతకి చిహ్నం. ప్రకృతి, ఆర్థిక, సామాజిక పరమైన కారణాల వల్ల స్త్రీ అసహాయురాలైంది. తన నిరసన తెలియజేయడానికి అలకనూ, ఏడ్పునూ ఆశ్రయించింది. అలాగే పురుషుడు ఆగ్రహించడమూ జరుగుతూ వస్తున్నది.

(సశేషం)

Monday, August 27, 2007

ఒక అసాంఘికుడు -- రెండు అకృత్యాలూ!!

“అసాంఘికులు -- అకృత్యాలు” పేరుతో భాగ్యనగర అభాగ్యపు బాంబు విస్ఫోటనాల గురించి ఒక వ్యాసం రాద్దామనుకున్నా. కొన్ని కారణాల వల్ల బాగా లేటయింది. ఇప్పుడు రాసినా పెద్దగా ప్రయోజనం వుండదు. ఎందుకంటే పత్రికల్లోనూ, టీవీ ల్లోనూ నే చెప్పేదాని కంటే యింకా విపులంగా అంతా వచ్చేసింది.

“ధ్వజం!” కథ రాసిన తర్వాత, “ధ్వజం కథ - దానికథ” అనే టైటిల్ తో కథా వైశిష్ట్యాన్ని గురించి వివరిస్తూ, ఈ కథ మీదీ నాదీ కాదనీ, విశ్వజనీన మానవుడి జీవన వైశాల్యం, అందులో ప్రమాదాల పారంపర్యతకున్నట్టి అపార అవకాశం గురించి చెప్తూ, కాలానుగుణంగా వచ్చే మార్పులననుసరించి మానసికంగా ప్రతి వ్యక్తీ అనుక్షణం జాగరూకుడై మసలుకోవాలని ఆరోజు ఉద్ఘాటించాను. ఆ మాట అవసరం, విలువ ఆనాడు ఎంతమందికి అర్థమయిందో లేదో నాకు తెలీదు. కానీ, నిన్న రెండు వరస పేలుళ్ళు చూసాక ఎందుకో ధ్వజం కథలోని కొన్ని భాగాల్ని తిరిగి రిప్రజంట్ చేయాలనిపంచి చేస్తున్నాను.

( ఇది భూకంపాన్ని వర్ణించిన సందర్భం.... నిన్నటి లుంబినీ పార్కూ, గోకల్ ఛాటూ వర్ణన యింతటిది కాదా?)

ఏ దేశ మయితేనేం. . . మానవుడుంటున్న దేశం!
ఏ స్థల మయితేనేం. . . ఇళ్ళూ, భవంతులూ నిర్మించుకున్న స్థలం!!
ఏ మత మయితేనేం. . . అది వైయక్తిక మనస్తత్వ సమ్మతం!!!

అక్కడ. . . ఆ ప్రదేశంలో. . . అప్పుడు. . . ఓ సాయం సంధ్య వేళ. . .

ఆహ్లాదభరితమై సాగిపోతున్న పిట్ట కూనల, పక్షి ప్రౌఢల, కేరింతల త్రుళ్ళింతల క్రిల క్రిల క్రిలా ధ్వానం ఎందుకో లిప్తపాటు ఆగింది. నవనవోన్మేషాల వసంతాల గానం ఏమైందో క్షణం సేపు దాగింది. మహోన్మత్త ముక్త కోకిలా రావం ఏకంగా మాయమే అయింది. ముంచుకొస్తున్న ప్రాకృతిక ప్రళయాన్ని ముందుగానే పసిగట్టిందో యేమో ఓ పక్షి ప్రాణి ‘కీచు’ మని అరిచింది.

అంతే!!

క్షణంలోపు క్షణంపాటు అక్కడ భూమి కదిలింది. . . భూమి కుదిలింది. . భూమి పగిలింది. ఏం జరిగిందో ఎవరికీ తెలీదు. జరగాల్సింది జరగనే జరిగింది. ఒక కంపనం పెను ప్రకంపనంగా మారి భూకంపమయింది. ప్రళయ కార్యానికి అది కారణభూతమయింది. ఆ మహా ప్రళయాన ఒక సంపూర్ణ రాష్ట్రమే లయమై విలయమయింది. . .విధ్వంసమయింది.

క్షణం నిడివిలో సస్యశ్యామలమంతా శవాల మయమయింది.

ధఢ. . . ధఢ. . . ధఢ. . . ధఢేల్ మను ధ్వనులతో అకాశ హర్మ్యాలే అక్కడ నేల కొరిగాయి. ఘన సుందర సౌధాలే శిధిలాలయాయి. శిధిలాల శకలాలయినాయి. మనుష్యులు మట్టి పాలయ్యారు. శకలాల క్రింది వికలాంగులయారు.

మానవ ప్రాణులు, జంతు ప్రాణులు, పక్షి ప్రాణులు. . . ఒకరేమిటి. . . ఒకటనేమిటి. . . ప్రకృతికి ప్రాణాల హెచ్చు తగ్గుల వివక్ష లేదు. అన్నీ శిధిలాల క్రిందే లెక్క. . . సగం యిరుక్కుని. . . సగం పెరుక్కుని. . . ఖండాలుగా, ఖండ ఖండాలుగా. . . మొండాలుగా. . . “దేవుడా రక్షించ రారమ్మం” టూ, ధీనంగా వేడికొంటూ.

తప్పించుకున్నవాడూ తప్పుకున్నవాడూ ధన్యతములు. చచ్చిన వాడూ ధన్యుడే. . . తప్పుకోనూలేక, చావనూ రాక యిరుక్కుపోయిన వాడే దౌర్భాగ్యుడు.

శిశువులూ, పశువులూ, గర్భిణీ స్త్రీలూ. . . సర్వులూ క్షతగాత్రులే! రాళ్ళ క్రింది క్షతగాత్రులు. అరుపులూ, ఆర్తనాదాలూ, మిన్నంటిన హాహాకారాలూ, మితిమీరిన రోదనలూ. . . ఎన్నని?. . . ఎవ్నరివని?. . . అది జీవన్మరణాల ఘోష! విషాద ప్రాణుల శరణాల భాష!!!

విజ్ఞాన శాస్త్రాలూ. . . రిక్టర్ స్కేళ్ళూ. . . ఎలాస్టిక్ రీ బౌండ్ థియరీలూ. . . ఆకర్షణ వికర్షణ భూ విద్యుచ్ఛాలక బలాల సిద్ధాంత రాద్ధాంతాలూ. . . సర్వం. . . సర్వమూ నిరర్ధకం అయినాయి. ప్రమాద తీవ్రతను ముందుగా పసిగట్టలేకనే పోయాయి. లక్షల శవాల రాసులే. . . రాసుల గణణమే. . . ఆ పైన విపత్తు తీవ్రతకి తార్కాణమయింది.
ఒక మహోపద్రవం. . . ఒక మహా ఉత్పాతం. . . అక్కడ సంభవించిది.

సుసంపన్నమైన, బహు విధమైన ఆ దేశ వారసత్వ సంపద. . . అక్కడ. . . ఆ ప్రాతం వారికి గర్వకారణం కాలేదు. . . బుగ్గి పాలయింది. . . బూడిద పాలయింది. . . భూకంపం పాలయింది.
* * * *

( మరొక సందర్భం )

“చెప్పు శారదా!” నిర్లిప్తంగా అన్నాడు.

“మీరు. . . మీరు జాగ్రత్త. . . మీ ఆరోగ్యం జాగ్రత్త!” కన్ను మూసింది.

“ఎలా జాగ్రత్త పడనే శారదా నువ్వు లేకుండా” మళ్ళీ గోడు గోడుమని ఏడ్చాడు.

అప్పటికే పొద్దు కృంగింది. ఒక పెంజీకటి ఆ ప్రదేశాన్నీ ఆర్తిగా ఆక్రమించుకో సాగింది.

భార్య శవాన్ని వదిలేసి, కృష్ణమూర్తి లేచాడు. చేతుల్తో తన తల పట్టుకున్నాడు. ఉన్నట్టుండి వంగి, స్వరపేటిక పగిలిపోయేలా బిగ్గరగా ఎలుగెత్తి అరవసాగాడు.

వ్వో. . . వ్వో. . . వ్వో. . . వ్వో. . .

శోకతప్త హృతయంతో విషాదోన్మత్తుడై విలపిస్తున్న అతడి అరుపులు విని, ఆ చీకట్లో ఎవరో వచ్చారు. నాలుగు ఆకారాలు. నలుగురు మనుషులు. ఓదార్చారు. ‘వగపు వలదన్నారు. వెతలు తప్పవన్నారు. మనం మనుషులం. . . మ్రానులమా?’ అన్నారు. ఆపైన ఎవరి దారిన వాళ్ళు వెళ్ళారు.

కృష్ణమూర్తి ఆ రాత్రంతా ఆప్తుల శవాల దగ్గరే కాపు వేశాడు. ఓ బండకి వీపు ఆన్చి జారగిలబడి కూర్చుండి పోయాడు. దూరంగా ఏడ్పులూ, శబ్దాలూ విన్పిస్తూనే వున్నయి. నడి రాత్రయింది. చంద్ర కాంతి శవాల మీద పడి వాటి ఉనికిని తెలియజేస్తోంది. కృష్ణమూర్తి హృదయం శూన్యంగా వుంది. కాలం గతానుగతికం. నిర్విరామం! క్రితంలో బాధ యిప్పుడు లేదు. అంతా పోగొట్టుకున్న వాడిలోని నిశ్చలత్వం. శవాలవైపు చూశాడు. . . నిర్నిమిత్తంగా. . . నిర్నిమేషంగా.

ఎవరు బాంధవులు? ఎవడు ఎవడికి బాంధవుడు. . .?

అసలు నీవెవడవు?

ఒక విడి మానవుడు. . . వేరొక విడి మానవుడికి బంధువా?

అయితే. . . ఆ బాంధవ్యపు గొలుసెక్కడ? ఆ గొలుసే సత్యమైతే. . .నిత్యమైతే. . . ఒకడు పోయినప్పుడు మరొకడు మిగిలివుండడం ఎలా సంభవం? అదే విధం??

కృష్ణమూర్తికి భగవద్గీతలోని ఒక శ్లోక భావం గుర్తుకొచ్చింది.

అవ్యక్తమునందు ఆసక్తమైన మనసుగల వారికి దుఃఖము అధికతరమై వుండును. ఎందుకనగా అవ్యక్తము దేహము కలిగిన వారిచే దుఃఖమునకు గతియై పొందబడుచున్నది!!!
* * *

(ఇంకొకటి ఇది బ్రతికి ఆప్తుల్ని పోగొట్టుకున్న వారికి కథలో సమస్యకి పరిష్కార మార్గంగా సూచించినది)

“చూడు నాయనా కృష్ణమూర్తీ జీవితంలో నీకొక కీడు జరిగింది. గుండె బెదురుపాటు చెందింది. దిక్కుతోచని స్థితిలో నా చెంత చేరావు. సలహా కోరావు. మనసు నొప్పితో దగ్గర చేరిన వాడిని నా కధ చెప్పి, మరింత కలవర పెట్టి పంపడం నాకు తెలిసిన నీతి కాదు. కానీ, కార్య కారణ సంబంధాల లాగే సమస్య, పరిష్కారం ఒకదాని కొకటి ముడిబడి వున్నాయి. సమస్యకి పరిష్కారం చెప్పడంలో నాకు నమ్మకం లేదు. ఒక పరిష్కారం నీకు నేను చెప్పానా. . . మరో సమస్యలోకి నిన్ను పనిగట్టుకుని నేను దింపుతున్నట్టే!!” అన్నాడాయన.

“అంటే?”

“అంటే. . . నువ్వు మళ్ళీ పెళ్ళి చెసుకుని, పిల్లాపాపలతో చక్కటి జీవితం గడపమని సలహా చెప్పవచ్చు. లేదన్నావా. . . ఒంటరిగానే జీవిస్తూ నీలాగే బ్రతుకులో ప్రమాదపడ్డ వారికి సహాయపడుతూ గడపమని చెప్పవచ్చు. కాదంటే ఆధ్యాత్మకంలోకి వెళ్ళమనవచ్చు. అదీ కాదనుకుంటే నీ యిష్టమొచ్చినట్టు జీవించమనవచ్చు. ఇవన్నీ నీ సమస్యకి పరిష్కారాలు. ఇందులో ఏ ఒక్కటి నీకు నేను సూచించినా. . . అది మళ్ళీ నీకు సమస్యని బహుకరిస్తున్నట్టే.”

“అర్ధం కావడం లేదు తాతగారూ!” అన్నాడు కృష్ణమూర్తి. అతడి గొంతు గాద్గధికమైంది. “ఒక మంచి కుటుంబం నాది. అర్ధంచేసుకునే భార్య, చక్కటి పిల్లలు. సాయంత్రం యింటికి రాగానే నాపైకెక్కి ఆడుకునే వాళ్ళు. ఎప్పుడూ గలగలా మాట్లాడే తల్లి. . . అందరూ భూకంపం పాలయ్యారు. ఒంటరిగా నన్ను శోకంలో వదిలారు. గతం వెంటాడుతోంది తాతగారూ. పడుకుంటే నిద్రరాదు. మేలుకునుంటే అవే జ్ఞాపకాలు. శరీరం మీద సృహ వుండదు. ఎందుకీ జీవితం. . .నా వాళ్ళు లేకుండా. ఆత్మహత్య చేసుకుని చస్తే ఏ బాధా వుండదనిపిస్తుంది. ఒకటే పిరికితనం. నాకు ధైర్యం చెప్పండి తాతగారూ!” కృష్ణమూర్తి వల వలా ఏడ్చాడు.

“బాధ పడకు కృష్ణమూర్తీ” అన్నాడు మాధవరావు. . .అతడి భుజం మీద చెయ్యేసి అనునయిస్తూ.

మహారధి కృష్ణమూర్తి వైపు నిశ్చలంగా చూశాడు. మళ్ళీ చెప్పసాగాడు.

“గతం వెన్నాడుతోందన్నావు. ఆత్మహత్య అహ్వానిస్తోందన్నావు. చూడు నాయనా. . .ఆత్మహత్యంటే హింస! హింస తప్పనేది అందరికీ తెలిసిన విషయం! ఉద్దేశపూర్వకంగా చావగలం గానీ, పుట్టలేం. చావడానికి ఉరితాడు చాలు. బ్రతకడానికి చాలా కావాలి. ఇక్కడ అసలు సమస్య గతం! భార్యా పిల్లలూ. . . తల్లీ. . . దుఃఖం. . .పిరికితనం. . . అన్నీ గతమే. దాన్ని మనం నిలువరించాలి. నిలువరించడమంటే దానర్ధం. . .ఏ టీవీనో, సినిమానో, మరే కంప్యూటరో చూస్తూనో, లేదంటే మరేదైనా యిష్టమైన పని కల్పించుకుని అందులో నిమగ్నమైపోయో గతం నుండి తప్పించుకోవడం కాదు. గతమంటే ఏమిటో అర్ధం చేసుకోవడం. దాన్నీ ‘ఢీ’ కొనడం. గతమంటే చీకటి. చీకటిని చీకటితో రాసినా. . . చీకటిని చీకటితో కొట్టినా. . . చీకటిని చీకటితోనే వెలిగించినా. . . ఏది చేసినా వెలుగు పుట్టదు. ఎందుకంటే చీకటి లేక పోవడమే వెలుగు. గతాన్ని మననం చేస్తున్నంత కాలం. . .‘ప్రాక్టీస్’ చేస్తుంన్నంత కాలం అది దుఃఖంలో మనల్ని ముంచెత్తుతుంది. గతాన్ని విడనాడడమే. . . తేలిగ్గా విడనాడడమే వెలుగువైపుకి పయనించే జీవితం. కొత్తది. . . చురుకైన జీవితం!” మహారధి అగాడు. క్షణం తర్వాత మళ్లీ చెప్పసాగాడు.

“చూడు బాబూ కృష్ణమూర్తీ! ఏదో బ్రతుకులో కష్టాలపాలై కఠినంగా మాట్లాడుతున్నానని అనుకోవద్దు. నేను నీకు ధైర్యం చెపితే . . . అదెంత సేపుంటుంది. ఆలోచించు! నేను పక్కకి పోగానే దాని దారి అది చూసుకుంటుంది. అలాగే పరిష్కారం కూడా. పరిష్కారం చెప్పానా, ఆ పరిష్కారం నాదవుతుంది నీదికాదు. ధైర్యమైనా, పరిష్కారమైనా అది నీలో నుండి రావాలి. అరువుతెచ్చుకున్నది కాదు. ఒప్పుకుంటావా” అన్నాడు మహారధి.

“ఒప్పుకుంటాన”న్నట్టు తలాడించేడు కృష్ణమూర్తి.

“అంతస్సులోకి వెళ్ళాలి! అన్వేషణ జరగాలి!! అంతర్మధనం జరగాలి!!! అది జరిగిననాడు నువ్వు నీ సమస్యకి సమాధానం కోసం. . .నీలో వున్న సమాధానం కోసం. . .బయటివాళ్ళని. . . వేరొకర్ని బిచ్చమెత్తాల్సిన అవసరం లేదు. సమాధానం నీలోనే లభ్యమౌతుంది! వెలుగు వుద్భవిస్తుంది!! మనిషి ఒంటరిగా నిలిచి, సర్వ స్వతంత్రుడై జీవించడమంత మహత్తరమైన విషయం మరొకటి లేదు ఈ లోకంలో!! చివరగా ఒక మాట. . . నీ పూర్తి జీవితం నీ చేతిలో వుంది. సర్వం నీలోనే వుంది. ఎంత చిలికేవో అంత వెన్న లభిస్తుంది. నైరాశ్యంలో కొట్టుమిట్టాడాల్సిన అవసరం. . .ఈ లోకంలో ఏ మనిషికీ లేదు. . . ఏ మనిషికి కూడా. . . మనసుని చిలకడం మరిచిన వాడికి తప్ప!” చెప్పడం అయిపోయిందన్నట్టుగా మహారధి లేచాడు.


(ఇవన్నీ. . .”చూశారా నాగొప్ప?” అన్న భేషజంకోసం నేను తిరిగి పబ్లిష్ చేయడం లేదు. ఎందుకో ఈ విపత్కర స్థితిలో ఈ కథా భాగాలు నా బ్లాగు ద్వారా ప్రపంచానికి పంపాలని పించింది. పంపుతున్నా.)