ఒకానొక అజ్ఞానపు క్షణంలో. . . నాకు తెలీకుండా నేనే జన్మించి,  అమ్మ చనుబాలలో ఆది సంవేదన అనుభవించి. . .ఆటపాటలలో అద్వితీయుడనై రాణించి. . .సంఘ విద్యా సముపార్జనలో సారస్వత చక్రవర్తినై, పుస్తకాల్ని పఠించి. . .పరీక్షల్ని పరివీక్షించి. . .ఆత్మజ్ఞాన అవలోకనంలో విలువల వలువలు వూడదీసి. . .విశ్వతత్వాలు స్మరించి. . . మానవ శ్రేయస్సు మహా లక్ష్యమై పోగా. ."ఈ ప్రపంచపు దొడ్డబిడ్డగా ఉద్భవించాల"నీ, "ఒక పూర్తి మానవుడిగా పరిణమించాల"నీ, నేను కంటున్న కల,  కడుతున్న కోట. . .ఒహ్ ఇంతెందుకు కనుచూపు మేరలో. . . నా జీవితం ఒక వేద సంకలనం!!  నేనొక ఈశ్వరుడిని!!! ( ఇది ఈ బ్లాగులోని ప్రసంగి కథలో ఒక పాత్ర మనోభావాలు __ రచయిత )

Tuesday, November 27, 2007

నా దృక్పథం నుండి స్త్రీమూర్తి!...2

(ఇది ఆడవాళ్ళ సానుభూతిని సంపాదించడం కోసమో, పురుషుల్ని బాధ పెట్టడం కోసమో ఉద్దేశించిన వ్యాసం కాదు. మానవజాతి చరిత్రలో నేను చూసిన, నాకు అన్పించిన ఒక సత్యాన్ని ఇక్కడ ఆవిష్కరిస్తున్నాను. అభిప్రాయ భేదాలుంటే నిర్మాణాత్మకమైన విమర్శ చేయమని పఠితల్ని కోరుతున్నాను)

నా దృక్పథం నుండి స్త్రీమూర్తి

ఇక ‘చలం’ గురించి. ఆచార వ్యవహారాల పేరుతో బానిసగా మారిన స్త్రీమూర్తిని చూసి చలం చలించిపోయాడు. పురుషుడు ముద్దు పెట్టుకుంటేనే గర్భం వస్తుందనుకునే మానసిక పరిణతి లేని స్త్రీలు ఆనాటికే 25 శాతం మంది వున్నారన్న కొన్ని నగ్నసత్యాల్ని గ్రహించి విల విలలాడాడు. స్త్రీ శరీరానికీ, మనసుకీ వ్యాయామం కావాలని ఎలుగెత్తి చాటాడు. స్త్రీని విశ్వకేంద్రంలో నిలిపి, కలాన్ని సమ్మెటగా చేసి ఆమె దాస్య శృంఖలాల్ని పగులగొట్ట బృహత్ ప్రయత్నించినాడు. ఎంత విశృంఖలత వుందనుకున్నా చలం రచనలు సాధించిన ఘనత తక్కవేమీ కాదు. అవి ఆంధ్ర వాజ్ఞయంలో తగిన స్థానం సంపాదించుకోగలిగాయి. యావత్ తెలుగుజాతి ఆలోచనా విధానాన్ని ప్రభావితంజేసి, తెలుగువారి దృక్పథంలో నూతనత్వానికి శ్రీకారం చుట్టాయి. ఒకనాడు తెలుగు సాహితీ ప్రపంచమే సంచలనాత్మక రచయిత వైపు దృష్టిసారించి అబ్బురపడిందన్న విషయం మనం మరువలేనిది. ఆపైన ఆథ్యాత్మిక చైతన్యం పొందిన చలం మాటలకు విలువ వుంటుందని నేననుకోను. ఒక్క చలమే కాదు ఆథ్యాత్మిక చైతన్యం పొందిన ఏ వ్యక్తి మాటలకైనా ఆథ్యాత్మిక విలువ తప్ప సామాజిక విలువలు వుండవు. ఎందుకంటే ఆథ్యాత్మిక మానవుడికి అన్ని విలువలూ సమానమే. భావాల హెచ్చుతగ్గుల వివక్ష వుండదు. అప్పుడే ఆథ్యాత్మికం సాధ్యం కూడా. ఏది ఏమైనా స్త్రీకి స్వేచ్ఛని ప్రసాదించాలనే తీవ్ర తాపత్రయంలో భారతీయ కుటుంబ వ్యవస్థనూ, పసిపిల్లల భవిష్యత్తునూ చలం విస్మరించారనే విషయమూ విమర్శలకు నోచుకుంది.

కానీ, గడచిన రెండు దశాబ్దాలకాలంలో ఆధునిక స్త్రీ తన దాస్య శృంఖలాల్ని తనే ఛేదించుకోవాలనే స్వీయ జ్ఞానాన్ని పొందింది. నడుం బిగించి ఆ దిశగా తనకి తానుగానే ఉద్యమించింది. ఆ క్రమంలో ఆమె సాధించిన విజయాలు తక్కువేమీ కాదు. పురుషుడితో సమానంగా ఆమె ఆర్థిక స్వావలంబన సాధించుకుంది. తన ప్రాణ, మాన సంరక్షణ కోసం తగువిధంగా చట్టాలు రూపొందించుకోగిలిగింది. అయినా, కనుచూపు మేరలో ఆమె సామాజిక స్వేచ్ఛ ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే చందంగా వుండిపోయింది.

అదే చట్టాలు సంఘంలో బరితెగించిన స్త్రీ వ్యక్తులకు మారణాయుధాలై చేతికందాయి. మంచి ప్రవర్తన గల మగవాళ్ళు సైతం ఈ చెడు మార్గాన్ననుసరించిన స్త్రీల చేత భంగపడిన సంఘటలలు ఇటీవల కోకొల్లలు. వరకట్నం ఊసెత్తని పురుషుడ్ని సైతం తనకి అభిప్రాయభేదం కలిగినప్పుడు స్త్రీలు వరకట్నపీడితుడిగా కోర్టుల కీడ్చి శిక్షింపజేయడం వంటి సంఘటనలు ఎంతైనా అమానుషం. ఇటువంటి స్త్రీలు తమని సామాజిక, ప్రాణ సంరక్షణకోసం ఏర్పడిన చట్టాల వెనుక స్త్రీ వేదననూ, బాధలనూ గుర్తించిన పురుషులు అనేకులున్నారన్న విషయం విస్మరించరాదు. కేవలం స్త్రీల వల్లనే ఆయా చట్టాలు రూపొందించబడలేదు. సరిగ్గా యిక్కడే పురుషుడు కూడా స్త్రీని ద్వేషించడం, తనకి బాధాకరంగా పరిణమించిన చట్టాల్ని దుయ్యబట్టడం జరిగింది.

ఏదియేమైనా, పురుషుడు తన జాత్యహంకారం మూలంగా స్త్రీ అనాది నుండీ అణచివేతకి గురైనదన్న విషయం అంగీకరించక తప్పదు. అదే విధంగా స్త్రీలు తమకి అణ్వాయుధాలై చేతికందిన ‘ఉమెన్ ప్రొటెక్షన్’ వంటి కేసుల్ని తప్పుడు పోకడలకు కాక నిజమైన తప్పిదం జరిగిన చోట మాత్రమే వాడుకోవడం సమంజసం. ఎందుకంటే, మానవజాతిలో స్త్రీ, పురుషులిద్దరూ భాగస్వాములు. స్త్రీ లేనిదే పురుషుడు లేడు. అలాగే స్త్రీ విషయంలో కూడా. అలా స్త్రీ పురుషులిద్దరూ సమదృష్టితో మెలగినంత కాలమే మానవత్వానికి మనుగడ. మానవజాతి మనుగడ. కడకి మనిషికే మనుగడ. ఆ అవగాహన నశించిన రోజున మనకి మిగిలేది శూన్యం.

చివరగా ఒకమాట. ఆచారాల పేరిట, కట్టుబాట్ల పేరిట, మతాల పేరిట స్త్రీ అణచివేతకి గురైందన్న విషయం నూరుకి నూరు పాళ్ళూ సత్యమనడానికి ఎన్నో తార్కాణాలు అవసరం లేదు. స్వంతంత్రించి, ఒక్కటే ఒక్కటి ఉదహరిస్తాను.

స్త్రీ శరీరం యావత్తూ పురుషుడి స్వంతమేనన్నది విశ్వసత్యం. అటువంటి పురుషుడి సొత్తైన స్త్రీ శరీరపు వంపు సొంపుల్నీ, ముఖ సోయగాల్నీ, లావణ్యాన్నీ, సుకుమారతనీ పురుషుడు వీక్షించి, తరించి, తథాత్మ్యం చెందాల్సిన స్త్రీమూర్తి గీర్వాణ సౌందర్యాన్ని ఒక మతం వారు నల్లముసుగులు వేసి మరుగు పరిస్తే, ఆ స్త్రీలు ఏ పాపమూ ఎరుగకుండానే ముసుగుదొంగలకి మల్లే మన మధ్యనే సంచరిస్తుంటే, సహజీవిస్తుంటే మనసున్న ఏ మనిషికైనా ప్రస్ఫుటంగా తెలీడం లేదా చరిత్రలో స్త్రీమూర్తి నిస్సందేహంగా అణచివేతకు గురైనదని, ప్రస్తుతం గురౌతూనే వున్నదన్న విషయం.

ఇంతకుమించిన తార్కాణాలు కావాలంటారా?

(సమాప్తం)

Monday, November 26, 2007

నా దృక్పథం నుండి స్త్రీమూర్తి!...1

(ఇది ఆడవాళ్ళ సానుభూతిని సంపాదించడం కోసమో, పురుషుల్ని బాధ పెట్టడం కోసమో ఉద్దేశించిన వ్యాసం కాదు. మానవజాతి చరిత్రలో నేను చూసిన, నాకు అన్పించిన ఒక సత్యాన్ని ఇక్కడ ఆవిష్కరిస్తున్నాను. అభిప్రాయ భేదాలుంటే నిర్మాణాత్మకమైన విమర్శ చేయమని పఠితల్ని కోరుతున్నాను)

నా దృక్పథం నుండి స్త్రీమూర్తి

మౌలికంగా ప్రపంచంలో వున్నది మానవజాతి ఒక్కటే. స్త్రీజాతి, పురుషజాతి అంటూ విడివిడిగా లేవు. కాకుంటే స్త్రీలనైనా, పురుషులనైనా ఒక సమూహంలా చెప్పుకోవాల్సివచ్చినప్పుడు మనం స్త్రీ జాతనో, పురుషజాతనో చెప్పుకోవడం అనవాయితీ అయింది.

ఇక సువర్చల, నూర్జహాన్, డయానా యిలా విడి విడి స్త్రీల గురించి కాకుండా ప్రపంచ స్త్రీ అంటే విశ్వజనీన స్త్రీ నిస్సందేహంగా లింగ వివక్షకూ, అణిచివేతకూ గురైంది ప్రకృతి పరంగా చెప్పాలంటే ఆమెకి పెద్ద అన్యాయమే జరిగింది. ఇంతకుముందు నేను ఇదే బ్లాగులో రాసిన “ఇంటిపేరు పురుషుడిదే-ప్రకృతి న్యాయం” టపాలో వలెనే పురుషుడికి ప్రకృతి పరంగా లభించిన ఇంటిపేరుని సాంఘిక, ఆర్థిక పరమైన విషయాలకు అన్వయించి (ఇది నా ఊహ మాత్రమే) ఆమెకు ఆస్తిహక్కు లేకుండా చేయడం మూలంగా స్త్రీకి చరిత్రలో దారుణమైన ద్రోహం జరిగిందన్నది నిర్వివాదాంశం. ఇక స్త్రీమూర్తికి ప్రకృతి పరంగా లభించిన మరో వరం మరియూ శాపం గర్భం. గర్భం ధరించడం మూలంగా ఆమె పురుషుడితో లైంగిక సంబంధం పెట్టుకున్న విషయం ప్రపంచానికి వెల్లడవుతుంది. ఆ కారణంగా ఆమె కొన్ని అంక్షలకి, కట్టుబాట్లకి గురైంది. అలాగే ఋతుక్రమం. ఇది కూడా ఆమె పాలిట శాపంలా పరిణమించింది. ఈ బాధలన్నీ పురుషుడికి లేవు. ఇదే, సరిగ్గా ఇక్కడే పురుషుడి చేతికి వజ్రాయుధం లభించింది. స్త్రీకి రౌరవ నరకమూ సంప్రాప్తమయింది. ఆపైన, పరిణామంలో ఏర్పడిన సతీసహగమనాలు మొదలుకుని ఇనుప కచ్చడాలూ, గృహనిర్భంధాలూ, ఆచారం కట్టుబాట్ల పేరిట భర్త చనిపోయిన స్త్రీ గుండు గీయించుకుని, తెల్లబట్టలు ధరించి శరీర కోర్కెలు చంపుకోవడం వరకూ జరిగిన నానా విధాల దురాచారాలూ మనకి తెలీనివి కావు. కడకి యివన్నీ మానవత్వానికే కళంకంలా, తీరని మచ్చలా పరిణమించాయి.

మొన్న ఒక పురుష బ్లాగరు ఒక సందర్భంలో అన్నారు. ఇలా స్త్రీ, పురుషులు ఒకరితో ఒకరు “సంబంధం పెట్టుకుని పరస్పరం ద్వేషించుకోవడం కంటే ఆడవాళ్ళు మగవాళ్ళ సహచర్యం పూర్తిగా వదులుకోండి. ఆలాగే మగవాళ్ళు కూడా ఆడవాళ్ళ సహచర్యం పూర్తిగా వదులుకోండి” అని. ఏదో ఆవేశంలోనో, ఆవేదనలోనో ఆయన అన్నారే గానీ, అది అసంబద్ధమైన మాట. అదే జరిగితే మానవజాతి మనుగడకే ముప్పు వాటిల్లుతుందన్నది జగమెరిగిన వాస్తవం!

మళ్ళీ ఆయనే, “ఆడవాళ్ళకి ఏడవడం చేతనయితే, మగాళ్ళకి కోపం తెచ్చుకోవడం చేతనవుతుంద”న్నారు. ఇది కోపం, అలక, ఏడ్పు లాంటి మనో వుద్రేకాల స్వరూపం గురించి తెలీక అన్నమాటగా నేను భావిస్తున్నాను. అలక, ఏడ్పు అసహాయత లోంచి జన్మిస్తాయి. కోపం అనబడేది ఆధిక్యతలోంచి పుట్టింది.

ఉదాహరణకి ఒక పురుష ఉద్యోగి వున్నాడనుకుందాం. అతడి పై అధికారి(ణి) ఒక స్త్రీ ఉద్యోగిని అనుకుందాం. పై అధికారిణి అంటే మామూలు సాదా సీదా పై అధికారిణి కాదు. అతడి ‘అపాయింటింగ్ అథారిటీ’ ప్లస్ ‘డిస్ మిస్సల్ అథారిటీ’ కూడా అమే అనుకుందాం. అటువంటి లేడీ బాస్ తన తప్పే అయినా, అకారణంగానే అయినా సదరు పురుష ఉద్యోగిని తీవ్రంగా దూషించిందనుకుందాం. అప్పుడు ఆ పురుష వుద్యోగి నేను పురుషుడ్నిగదా అని ఆమెపై కోపగించుకుని ఉద్యోగం వూడగొట్టుకుంటాడా. లేక అలిగి మాట్లాడకుండా ఊరుకుంటాడా. నేనైతే అలగుతాడనే అనుకుంటా (ఒకవేళ ఏడ్వలేక పోయినా). కనుక అలక, ఏడ్పు లాంటివి అసహాయతకి చిహ్నాలు. అలాగే కోపం ఆధిక్యతకి చిహ్నం. ప్రకృతి, ఆర్థిక, సామాజిక పరమైన కారణాల వల్ల స్త్రీ అసహాయురాలైంది. తన నిరసన తెలియజేయడానికి అలకనూ, ఏడ్పునూ ఆశ్రయించింది. అలాగే పురుషుడు ఆగ్రహించడమూ జరుగుతూ వస్తున్నది.

(సశేషం)