ఒకానొక అజ్ఞానపు క్షణంలో. . . నాకు తెలీకుండా నేనే జన్మించి,  అమ్మ చనుబాలలో ఆది సంవేదన అనుభవించి. . .ఆటపాటలలో అద్వితీయుడనై రాణించి. . .సంఘ విద్యా సముపార్జనలో సారస్వత చక్రవర్తినై, పుస్తకాల్ని పఠించి. . .పరీక్షల్ని పరివీక్షించి. . .ఆత్మజ్ఞాన అవలోకనంలో విలువల వలువలు వూడదీసి. . .విశ్వతత్వాలు స్మరించి. . . మానవ శ్రేయస్సు మహా లక్ష్యమై పోగా. ."ఈ ప్రపంచపు దొడ్డబిడ్డగా ఉద్భవించాల"నీ, "ఒక పూర్తి మానవుడిగా పరిణమించాల"నీ, నేను కంటున్న కల,  కడుతున్న కోట. . .ఒహ్ ఇంతెందుకు కనుచూపు మేరలో. . . నా జీవితం ఒక వేద సంకలనం!!  నేనొక ఈశ్వరుడిని!!! ( ఇది ఈ బ్లాగులోని ప్రసంగి కథలో ఒక పాత్ర మనోభావాలు __ రచయిత )

Monday, August 6, 2007

ధ్వజం - 7

మహారధి జీవిత వృత్తాంతం విని, కృష్ణమూర్తి విభ్రాంతి చెందాడు!

మాధవరావుకి అది తెలిసిందే అయినా మళ్ళీ విన్నాడు. వినేప్పుడు మనసు మళ్ళీ ఆర్ధ్రమయింది. కన్నీరు వుబికింది.

కృష్ణమూర్తి ఆ వృద్దుడి వైపు ఒకసారి పరిశీలనగా చూశాడు. అస్తమిస్తున్న సూర్యకాంతి ఆయన పొడవైన ముక్కుమీద పడి ప్రతిఫలిస్తోంది. చల్లటి వాయుపవనం తాకి ఆయన వెండి జుట్టు పొడిగా రెప రెప లాడుతోంది. ముఖంలో ఏదో తెలీని శాంతి కనబడుతోంది. కధ చెప్తున్నంత సేపూ ఆయన ఎక్కడా కన్నీరు పెట్టలేదు. వెనక్కి కాలంలోకి వెళ్ళి ఒక పాత సంఘటనని చూసొచ్చి, వివరించినట్టు విలక్షణంగా సాగింది ఆయన చెప్పే విధానం! కృష్ణమూర్తికి అద్భుతమనిపించింది.

ఎదురుగా ఉన్నది మనిషి కాదు. మహత్తర మనీష జీవనసారం!!!

మొదటి చావులో మాత్ర మింగలేక చనిపోయిన పాపని భుజం మీద వేసుకు వెళ్ళి, మట్టిలో పూడ్చి పెడ్తున్నప్పుడూ. . . రెండవ చావులో ముక్కలు ముక్కలైన కొడుకు లేలేత శరీర భాగాల్ని దహనం కోసం ఏరుకుంటున్నప్పుడూ. . . మూడవ చావులో ముగ్ధమోహన రూపుడిని పోస్ట్ మార్టం టేబిల్ మీద ముక్కలుగా కోయిస్తున్నప్పుడూ. . . నాలుగో చావులో చెట్టంత కొడుకుని బావిలో నుండి బయటికి తీయిస్తున్నప్పుడూ. . . ఐదవ చావులో కాలి కమురు కంపు కొడ్తున్న కూతుర్ని చూడలేక జనం ముక్కలు మూసుకుంటున్నప్పుడూ. . . ఆరవ చావులో తన కూతురు తన పైన ఎంతటి ప్రేమానుబంధాల్ని పెంచుకున్నదో తేటతెల్లమైనప్పుడూ. . . ఏడవ చావులో కన్నబిడ్డని కర్కోటకులు చెరుస్తున్నప్పుడూ. . . ఎనిమిదవ చావులో మహాత్ముడంతటి తనయుడు మహారుద్రుడై మరణించినప్పుడూ. . . భార్యకి మతిభ్రమించినప్పుడూ. . . నిర్దోషి అయికూడా దోషిగా పంచాయతీ పెద్దల ముందు తలదించుకోవాల్సి వచ్చినప్పుడూ. . . చివరకి. . .చివరకి, సహధర్మచారినే సహధర్మం వీడి నిష్క్రమిస్తున్నప్పుడూ. . . అన్ని ఘటనలలో, అన్ని గండాలలో, అన్ని ఆపదలలో ఒక్కసారి. . . కనీసం ఒక్కసారైనా గుండె ఆగి చచ్చిపోలేదు. . . ఆ మానవుడు! తక్కువలో తక్కువ ఎవరినైనా కొట్టి చంపాలనే ద్వేషం కూడా ఆయన రక్తంలో కలుగలేదు.

జన్మ ఆదిగా హింసా విరోధి!!!

ఎలా సాధ్యపడిందీ మనీషికి జీవితకాలపు అహింసాపథ నిర్దేశకత్వం? మహోన్నత పవిత్ర జీవన సారధ్యం?!!!

కృష్ణమూర్తికి అర్ధం కాలేదు.

“ఇప్పడు అయిన వాళ్ళని పోగొట్టుకున్న నీ సమస్యకి కొంత ఊరట చిక్కినట్టనిపిస్తోందా నాయనా కృష్ణమూర్తీ?” అడిగాడు మహారధి.

“ఎక్కడ తాతగారూ! ఒక చిన్న గీత పక్కన యింకో పెద్ద గీత గీసి, ‘చూడు నీ గీతెంత చిన్నదో’ అన్నట్టుంది. . . ఈ పరిష్కారం.” అన్నాడు కృష్ణమూర్తి.

“చూడు నాయనా కృష్ణమూర్తీ జీవితంలో నీకొక కీడు జరిగింది. గుండె బెదురుపాటు చెందింది. దిక్కుతోచని స్థితిలో నా చెంత చేరావు. సలహా కోరావు. మనసు నొప్పితో దగ్గర చేరిన వాడిని నా కధ చెప్పి, మరింత కలవర పెట్టి పంపడం నాకు తెలిసిన నీతి కాదు. కానీ, కార్య కారణ సంబంధాల లాగే సమస్య, పరిష్కారం ఒకదాని కొకటి ముడిబడి వున్నాయి. సమస్యకి పరిష్కారం చెప్పడంలో నాకు నమ్మకం లేదు. ఒక పరిష్కారం నీకు నేను చెప్పానా. . . మరో సమస్యలోకి నిన్ను పనిగట్టుకుని నేను దింపుతున్నట్టే!!” అన్నాడాయన.

“అంటే?”

“అంటే. . . నువ్వు మళ్ళీ పెళ్ళి చెసుకుని, పిల్లాపాపలతో చక్కటి జీవితం గడపమని సలహా చెప్పవచ్చు. లేదన్నావా. . . ఒంటరిగానే జీవిస్తూ నీలాగే బ్రతుకులో ప్రమాదపడ్డ వారికి సహాయపడుతూ గడపమని చెప్పవచ్చు. కాదంటే ఆధ్యాత్మకంలోకి వెళ్ళమనవచ్చు. అదీ కాదనుకుంటే నీ యిష్టమొచ్చినట్టు జీవించమనవచ్చు. ఇవన్నీ నీ సమస్యకి పరిష్కారాలు. ఇందులో ఏ ఒక్కటి నీకు నేను సూచించినా. . . అది మళ్ళీ నీకు సమస్యని బహుకరిస్తున్నట్టే.”

(సశేషం)

0 అభిప్రాయాలు: