ధ్వజం!..6
పెద్దమ్మాయి చనిపోయేనాటికి మూడో అమ్మాయి గ్రాడ్యుయేషన్ చేస్తోంది. మా వూర్లో కాలేజీ లేనందువల్ల అక్కడికి ఓ యాభై మైళ్ళ దూరంలో వున్న జిల్లా హెడ్ క్వార్టర్సులో ‘లేడీస్ కాలేజీ’లో చేర్పించినాను. ఆ కాలేజీకి హాస్టల్ ఫెసిలిటీ వుండేది. అందువల్ల హాస్టల్లో వుంటూ చదువు సాగించింది. పెద్దమ్మాయి శవం కారులో యిల్లు చేరిన రోజున ఆ చావు వార్త తెలుపమని ఒక మనిషిని బస్సెక్కించి, అక్కడ హాస్టల్ కి పంపించినాను. అదే నేను చేసిన తప్పు. ఆ వెళ్ళినవాడు తిక్కమనిషి. “మహాలక్ష్మి పోయింద”ని చెప్పడానికి బదులుగా “మహారధి పోయాడ”ని చెప్పాడట. అంతే మారుమాట లేకుండా నిటచున్నచోటనే కుప్పకూలి, క్షణంలో ప్రాణం విడిచిందట నా బిడ్డ. ఎందుకంటే పసినాటినుండీ ఆమెకి నా పట్ల వల్లమాలిన ప్రేమానురాగాలు. అదీ. . .నా యింట ఆరవ చావు!
ఇక నాయింట ఏడు, ఎనిమిది చావుల గురించి చెపుతాను విను!
సినిమాల్లో నటించిన మా చివరివాడి తర్వాత, అందంలో మాయింట్లో చెప్పుకోదగ్గ వ్యక్తి మా రెండవ అమ్మాయి. పొడవైన మంచి సొంపుగల శరీరం ఆమెది. జడకూడా చాలా పొడవుగా వుండేది అమ్మాయిది. చూడ చక్కని చక్కదనం గల పిల్ల. తల్లి పోలికా నా పోలికా కలబోసుకు పుట్టింది. పెద్దమ్మాయీ, మూడో అమ్మాయీ పోయింతర్వాత యింటి పనిలో తల్లికి సహాయకారిగా నిలిచింది. అంతకు ముందెన్నడూ యిల్లుదాటి కాలు బయట పెట్టని పిల్ల, ఆరోజు బిందె తీసుకుని మంచినీళ్ళ కోసం వూరి చివరి బావి దగ్గర కెళ్ళింది. అక్కడ కనిపించాడట కారులో వెళుతూ భూస్వామి కొడుకు. అమ్మాయిని చూసి కారాపాడట. “మీ అమ్మని మా నాయన అనుభవించి వుంటే నువ్వు నాకు చెల్లెలి వరుస అయ్యుండే దానివి. అది జరగనే లేదు గనుక నాకు నువ్వు ఉంపుడుగత్తెవి అవుతావా?” అన్నాట్ట. “ఇట్లా “మాట్లడడం వల్లనే మీ నాన్నకి బ్రతకడం చేతకాలేదు. ఆడది. . .మా అమ్మ చేతిలో చచ్చాడు. నువ్వైనా మాటలు నేర్చుకుని నా చేతిలో చావకుండా వుంటే మంచిది.” అన్నదట మా అమ్మాయి. “అదీ చూద్దాం! తండ్రి సాధించలేక పోయినవన్నీ కొడుకు సాధించాలంటారు. అంతటి భూస్వామి కొడకుని. . . నేను నిన్ను సాధించలేక పోతానా” అంటూ సవాల్ చేసి వెళ్ళిపోయాడట.
అన్నట్టే, అ వెళ్ళినవాడు మరుసటిరోజు మళ్ళీ వచ్చాడు. మంచినీళ్ళ బావి దగ్గరకి కాదు. పట్టపగలు మా యింటికే వచ్చాడు. తండ్రిని మించిన తనయుడనిపించుకోవాలనే తపన వాడికి పాతికేళ్ళుగా బలపడి పోయి వుందనుకుంటా. తప్ప తాగి ఏడుమంది కుర్రాళ్ళని వెంటబెట్టుకు వచ్చాడు. ఆ సమయానికి యింట్లో పెద్దబ్బాయి లేడు. నేనూ, సువర్చలా, అమ్మాయీ వున్నాం. నన్నూ సువర్చలనీ కాళ్ళూ చేతులూ కట్టి, అక్కడే మూలన పడేశారు. మేం చూస్తూండగానే అమ్మాయిని వివస్త్రను చేసి, బలవంతంగా అనుభవించాడు. విజయ గర్వంతో పొంగిపోయాడు. ఆపైన, ఒకడి తర్వాత ఒకడుగా ఏడుమందీ అమ్మాయిని అనుభవించేట్టు చేశాడు. అ సంఘటనలో అమ్మాయి అక్కడే ప్రాణాలు విడిచింది. కొండంత దౌర్భాగ్యమేమో మాది. అ ఘోర భీభత్స కృత్యం నేనూ, సువర్చలా కళ్ళారా చూడాల్సివచ్చింది. అమ్మాయి మరణించిన తర్వాత, భూస్వామి కొడకు సువర్చల దగ్గరకి వచ్చాడు. బిగ్గరగా నవ్వేడు. “చూడవే! నన్ను చంపుతానన్నది నీ కూతురు. అదే చచ్చింది. మేమేమయినా చంపామా? ముద్దొచ్చి సరసమాడాం! ఆ మాత్రానికే చచ్చింది. అసలు ఆనాడే నువ్వు మా నాయన దగ్గర పడుకుని వుంటే ఈ రోజు యింత తతంగం జరిగేది కాదుగా” అన్నాడు. మళ్ళీ నవ్వాడు. పాపం! ఏంచేయగలదు సువర్చల కాళ్ళూ చేతులు కట్టి పడేసిన నిస్సహాయురాలు. ఏడ్చుకుంటూ చనిపోయిన కూతురి వైపు చూసుకుంటోంది.
సరిగ్గా అప్పుడే వచ్చాడు అక్కడికి మా పెద్దబ్బాయి. . .లైబ్రరీ నుండి. వాకిట్లో ఎదురైన భూస్వామి కొడుకుని చూసి, “ఏం జరిగింద”న్నాడు. “నీ చెల్లెమ్మకి కన్నెరికం జరిగింద”న్నాడు వాడు గర్వంగా. మా పెద్దవాడేం మాట్లాడలేదు. చేతిలోవున్న పుస్తకాలు నేలమీద పెట్టేడు. అక్కడవున్న గొడ్డలి ఒకదాన్ని అందుకున్నాడు. పదినిముషాలు. . . సరిగ్గా పదే పది నిముషాల వ్యవధిలో. . . భూస్వామి కొడుకుతో సహా ఎనిమిదిమందినీ ముక్కలు ముక్కలుగా నరికాడు. చీల్చి చండాడేడు. కాకలుతీరిన కుర్రాళ్ళు. . . ఒక్కడూ మిగలకుండా అందరూ చచ్చారు. ఆ ఘర్షణలో మావాడికీ గాయాలయినాయి. తల్లి ఒడిలోకొచ్చి తలబెట్టుకుని తనూ తుది శ్వాస విడిచాడు. “వీడు సోక్రటీజే కాదు. . . అలగ్జాండర్ కూడా” అని అప్పుడనుకున్నా. . .వాడిలో శౌర్యం గ్రహించి! అవి. . . నా యింట ఏడు, ఎనిమిది చావులు!
అంత హింసనీ ఒక్కసారిగా చూసిన సువర్చల ఆ తర్వాత తట్టుకోలేక పోయింది. బాగా భయపడిపోయింది. నలభైయేళ్ళ వయసులోనే అన్ని రకాల యాతనలూ చవిచూసిన ఆ నిష్కల్మషురాలు. . .ఆ పైన మతిభ్రమించి, పిచ్చిదై పోయింది. అప్పటికే ఆవూరి ప్రజలకి “నేనొక దరిద్ర దామోదరుడ”ననే అభిప్రాయం వుంది. సువర్చల కూడా పిచ్చిదవడంతో వాళ్ళ నమ్మకం యింకా బలపడింది. నావంటి “మహాదరిద్రుడు ఆ ఊరిలో వుండడం వూరికే అరిష్టం”గా భావించినారు. పంచాయతీ నిర్వహించి, నన్నూ, నా భార్యనీ ఊరి నుండి వెలివేసి గ్రామ బహిష్కార శిక్ష విధించారు.
అంతటితో ఆ గ్రామం వదిలి ఈ వూరు చేరాను. మాధవరావు తండ్రికీ, నాకూ వయసులో చాలా తేడా వున్నప్పటికీ, ఏదో దూరపు చుట్టరికంలో నాకు తమ్ముడి వరుస అవుతాడు. మేం ఈ వూరు వచ్చినప్పడు అతడు చాలా చిన్నవాడు. పెళ్ళికాలేదు. అతడే మమ్మల్ని చేరదీసి, ఆశ్రయం కల్పించాడు. అప్పట్నుంచీ నేను ఉపాధ్యాయ వృత్తిని వదిలి, నాకు తెలిసిన మరో వృత్తి చేనేత పనిలోకి దిగాను. మతి చెడి పసిబిడ్డలా తయారైన నా భార్యకి నేనే రెండు పూటలా వండిపెడుతూ, పగలంతా మగ్గం మీద కూర్చుంటూ, జీవితం కొనసాగించినాను. ఆ తర్వాత ముప్ఫైయేళ్ళు జీవించి తన డెభై రెండవయేట సువర్చల కన్నుమూసింది. . . అది నా యింట తొమ్మిదవ చావు!
గత ఎనిమిది సంవత్సరాలుగా ఈ యింట్లో నేను ఒంటరిగా జీవిస్తున్నాను. వేకువనే లేవడం, వ్యాయామం, స్నానం, భోజనం చేసుకుని మగ్గం గుంటలోకి దిగడం. . .సాయంత్రం వరకూ పని. . .ఆపైన, ప్రకృతితో గడపడం. . .తర్వాత, ఎనిమిదింటికల్లా భోంచేసి, నిద్రబోవడం. . . ఇదీ నా దినచర్య! ఇందులో నేను తత్వవిచారానికీ, ధ్యానానికీ సమయం కేటాయించ లేదు. ఎందుకంటే నిద్ర లేచింది మొదలు పడుకునే వరకూ అవి నన్ను అంటిపెట్టుకునే వుంటాయి. ఇకపోతే పత్రికలూ, టీవీలూ, మీడియా, సిధ్ధాంత చర్చలూ నాకు అవసరం లేదు. మనిషికి నిజంగా కాలక్షేపం కావలసివస్తే, అది తన మనసులోనే దొరుకుతుంది.
ఎందరున్నా మాట్లాడుతూ గడప గలను. ఎవరూ లేకున్నా కూడా గడప గలను. చివరగా ఒక్కమాట. ఇప్పుడు నాకు తొంభై సంవత్సరాలు. కానీ, ఈ నాటికీ మగ్గం మీది కండెలోని నూలుపోగు స్పష్టంగా కన్పిస్తుంది. . . కళ్ళజోడు అవసరం లేకుండానే!!”
“అది నాయనా కృష్ణమూర్తీ నా సుదీర్ఘ జీవితపు విషాద గాధ అన్నాడు మహారధి చెప్పడం ముగించి.”
* * * *
(సశేషం)
0 అభిప్రాయాలు:
Post a Comment