ధ్వజం! --5
తర్వాత, తొమ్మిదేళ్ళలో సువర్చల మరో ఆరుమందికి జన్మనిచ్చింది. వాళ్ళలో పెద్ద వాళ్ళిద్దరూ మగపిల్లలు. తర్వాతి ముగ్గురూ ఆడపిల్లలు. చివరివాడు మళ్ళీ మగవాడే. కానీ, బాబూ కృష్ణమూర్తీ ఆ చివరివాడున్నాడే వాడు అసాధారణమైన సౌందర్యం గలవాడు. అద్బుతమైన రూపవంతుడు. “కాకి పిల్ల కాకికి ముద్దం”టారు. “హంస పిల్ల అందరికీ ముద్దే”నని వాడు పుట్టిన ఒకటిన్నర సంవత్సరం లోనే నిరూపించినాడు. ఆ చుట్టుప్రక్కల వూర్లలో వుండే ప్రజలంతా తండోపతండోలుగా, అదే పనిగా వచ్చి వాడ్ని చూసి వెళ్ళేవాళ్ళు. “ఎనిమిదవ వాడుగా నా యింట శ్రీకృష్ణుడే జన్మించినాడ”ని అనుకున్నాను.
ఆ రోజుల్లో ప్రసిద్ది చెందిన చలనచిత్ర దర్శకుడొకాయన తను నిర్మించబోయే భారీ పౌరాణిక చిత్రానికి “చిన్ని బాల నటుడు కావాల”ని, “ఫలానా తేదీన సెలక్షన్ వుంటుంద”నీ ఒక దినపత్రకలో ప్రకటన యిచ్చాడు. నేను మా చివరివాడిని తీసుకుని ఆ సెలక్షన్ జరుగుతున్న ఊరు వెళ్ళాను. చిత్రంలో బాలుడి పాత్ర బాగా ప్రాముఖ్యమున్నది కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఐదు వందలమంది తమ పిల్లల్ని వెంటబెట్టుకు వచ్చారు. . . ఆ రోజుల్లోనే. వారం రోజలపాటు సెలక్షన్ తంతు జరిపి, కడకి మా చిన్నవాడ్ని ఎంపికచేసినట్టు ప్రకటించాడు ఆ డైరెక్టర్. ఆ మాట విన్నరోజు మా యింట జరిగిన సంబరం అంతా యింతా కాదు.మూడు నెలల పాటు జరిగింది షూటింగ్! చిత్రం పూర్తయింది. పారితోషికంగా ఐదు వేల రూపాయలు యిచ్చారు. ఆ రోజుల్లో అది చాలా పెద్ద మొత్తం. అప్పటికి నా పూర్తి జీవితమంతటిలో నేను ఒకేసారిగా చూసిన ఎక్కువ డబ్బు అదే! ఆ విషయం భూస్వామి కొడుక్కి తెలిసింది. అట్లా పసివాడు వరుసగా సినిమాల్లో నటించడం మొదలు పెడితే, అతి కొద్దిరోజుల్లోనే నేను పెద్ద ధనవంతుడిని అయిపోతానని భావించినాడు.అంతే!! ఆ మరుసటి రోజు యింటి ఆరు బయట ఆటలాడుకుంటున్న నా చిన్ని కృష్ణుడు. . . ఆ ఆరు బయటే నిర్జీవుడై, శవమై కన్పించినాడు. పోస్టుమార్టం రిపోర్టులో విషప్రయోగమని తెలిసింది. భూస్వామి కొడుకు మీద కేసు పెట్టాను. సాక్ష్యాల్ని కొనేసి కేసు మాఫీ చేయించుకున్నాడు. మళ్ళీ పదేళ్ళ విరామం తర్వాత, నా ఎనిమిదవ బిడ్డ మరణించినాడు. . . అది నా యింట మూడవ చావు!
మిగిలిన ఐదు మందిలో పెద్దవాడు మహా సాత్వికుడు. నాలాగే నెమ్మదస్తుడు. పెద్ద పెద్ద శాస్త్రజ్ఞుల గురించీ, తాత్వికుల గురించీ చిన్ననాటి నుండే అడిగి తెలుసుకునే వాడు. వారి వారి సిధ్ధాతాలు నాతో చర్చించేవాడు. జఠిలమైన తాత్విక సమస్యల్ని కూడా సులువుగా పరిష్కరించగలిగే వాడు. చదువులో కూడా క్లాస్ ఫస్ట్ వుండేవాడు. . . “అన్నీ సోక్రటీస్ లక్షణాలే” అనుకున్నా.రెండవవాడిది దుడుకుబోతు మనస్తత్వం. పదవ తరగతి చదువుకునే రోజుల్లోనే వాడిని వాళ్ళ క్లాస్ టీచర్ “బాల నేరస్తుల కేంద్రంలో చేర్పించ” మన్నాడు. “నా కడుపున హిట్లర్ పుట్టడమేమిటా” అని బాధ పడినాను. దానికి తగినట్టుగానే వాడు కర్రసాము నేర్చాడు. అందులో మెలకువలన్నీ తెలుసుకుని ఆరితేరాడు. మల్లయోధుడి కుండే శరీర సౌష్టవం వాడిది. తనంతవారిని ముగ్గురు మనుషుల్ని సైతం అవలీలగా తిరగ గొట్టగలిగే యుద్ధ నైపుణ్యం సంపాదించాడు. దాంతో మనిషి గర్వించినాడు.
ఇరవై రెండేళ్ళ వయసు రాగానే వూరు వూరంతా వాడ్ని చూసి బయపడసాగింది. దాంతో వాడు మరీ విర్రవీగినాడు. ఊరిలో ఆ చివరనుండీ ఈ చివర వరకూ పద్దెనిమిది మంది తలకాయలు పగులగొట్టాడు. ప్రతి చిన్న విషయానికీ కోపమే వాడికి. నిగ్రహమన్నది లేదు.“వలద”ని వారించినాను. “హింస తప్ప”న్నాను. “మానమత్వం అభిమానం కలద”న్నాను. “కర్రసాములకీ, కరవాలం మెరుపులకీ అది తలదించుకోబోద”న్నాను. “ప్రవర్తన అలాగే కొనసాగితే ఒకనాటికి ఓటమి తప్పద”న్నాను. వాడు వినలేదు. పెడచెవిన పెట్టేడు. చివరికి నేనన్నదే జరిగింది. విసిగి, వేసారిన మానవత్వం ఒక రోజు రొమ్ము విరుచుకుంది. “ఎవడు వీడు బ్రతకడం నేర్వని వెర్రిబాగులవాడం” టూ కన్నెర్రజేసింది. ఎవరో కాదు. . .వాడి స్నేహితులే. . . నలుగురు యింటికొచ్చి షికారు కోసం వాడ్ని పిలుచుకు వెళ్ళారు. మంచిగానే మాట్లాడుతూ వూరి బైట బావి గట్టు మీద వాడ్ని కూర్చోబెట్టారు. నవ్వుకుంటూ, త్రుళ్ళుకుంటూనే, అలాగ్గా వాడి రెండు కాళ్ళూ ఎత్తి, వెనక్కి బావిలోకి తోసేశారు. మళ్ళీ ఏనాటికీ పైకి రాకుండా రెండు పెద్ద బండరాళ్ళెత్తి లోపలికి వేశారు. యథావిధంగా మళ్ళీ నవ్వుకుంటూనే ఎవరి యిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు.
మళ్ళీ పదునాలుగేళ్ళ తర్వాత, నా నాలుగవ బిడ్డ మరణమే. . . నా యింట నాలుగవ చావు.మా sపెద్దమ్మాయి పేరు మహాలక్ష్మి! యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్. పెద్దవాడిలాగే నెమ్మదస్తురాలు. తప్పు చేయదు గనుక, మాటంటే భరించగలిగేది కాదు. అదంత గొప్పలక్షణం కాదనేవాడిని. నెమ్మదితనం అంటే. . అది అన్నింటా వుండాలనేవాడిని. నాలుగోవాడు మరణించిన తర్వాత ఒక సంవత్సరానికి ఏదో మునిగిపోయినట్టుగా తొందరపడిపోయి పెళ్ళి చేశాను. చాలా వైభవంగా చేశాను. నా యింట జరిగే మొదటి శుభకార్యం గనుక అబ్బాయివాళ్ళు అడిగినవన్నీ యిచ్చి, ఆదరంగా అత్తవారింటికి పంపాను. మూడవరోజుకి. . .శోభనం గదిలో సోయగాలు ఒలకబోస్తూ వుంటుందనుకున్న పిల్ల కాళ్ళ పారాణి ఆరకుండానే కట్టెగా మారి, కారు డిక్కీలో కమురు కంపుకొడుతూ నా యింటికొచ్చింది. నివ్వెరపోయి, “ఏం జరిగింద”న్నాను. వంట గదిలో అగ్ని ప్రమాదం జరిగిందన్నారు. ప్రమాదవశాత్తూ పోయిందన్నారు. మహాలక్షి శవాన్ని నాయింటి ముందే పడేసి, మెల్లగా తప్పుకున్నారు. అసలు విషయం తర్వాత తెలిసింది. శోభనం రోజు రాత్రి గదిలో పెళ్ళికొడుకు అడిగాడట. “నిన్ను భూలక్ష్మీ అని పిలవాలా లేక మహాలక్ష్మీ అని పిలవాలా?” అని. “అట్లా ఎందుకడుగుతున్నారు?” అన్నదట నా బిడ్డ. “ఏం లేదు. నువ్వు భూస్వామి కూతురివైతే భూలక్ష్మీ అందామని. . . మహారధి కూతురివైతే మహాలక్ష్మీ అని పిలుద్దామని” అని బదులిచ్చేట్ట. సతీదేవంతటి అభిమానవంతురాలు నా పెద్ద కూతురు. తల్లి శీలాన్ని భర్త శకించడం భరించలేకపోయింది. మరుక్షణం వంటింటిలోకెళ్ళి శరీరం మీద కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని దగ్దమై పోయిందట. . . అది నా యింట అయిదవ చావు.
( సశేషం )
0 అభిప్రాయాలు:
Post a Comment