ధ్వజం --4
భూకంప విపత్తు సంభవించే సమయానికి ఆదృష్టవశాత్తూ మాధవరావు వూర్లో లేడు. ఏవో పొలం సంబంధమైన పనులమీద భార్యా పిల్లల్తో సహా అక్కడికి ఆరొందల కిలోమీటర్ల దూరంలోనున్న తన స్వగ్రామం వెళ్ళేడు. అక్కడ భూకంప ప్రభావం లేదు.
అయితే ప్రాణ నష్టం ఏదీ లేకపోయినా, ఆస్తి నష్టం మాత్రం అతడికి బాగానే జరిగింది. కృష్ణమూర్తి లాగే అతడి యిల్లు ధ్వంసమయింది. ఇంట్లో వున్న డబ్బు, బంగారం, ఫర్నిచర్ లాంటివన్నీఅతడొచ్చి చూసుకునే సరికే దొంగలు పట్టుకుపోయారు. స్వగ్రామంలో కొద్దిపాటి ఆస్తిపాస్తులున్నందు వల్ల అతడు తట్టుకోగలిగాడు.
ఎటొచ్చీ, కృష్ణమూర్తిదే అతడికి పెద్ద సమస్య! ఇళ్ళూ, వుద్యోగం, ఆప్తులూ సమస్తం కోల్పోయి, వీధినపడి యించుమించు పిచ్చివాడిలా తయారైన కృష్ణమూర్తికి. . .మాధవరావు అన్నీ తనే అయాడు. ప్రభుత్వం కల్పించిన తాత్కాలిక వసతి గృహంలో ఆశ్రయం పొందుతున్న అతడ్ని కలుసుకుని దగ్గరకి తీసుకున్నాడు. తిరిగి కృష్ణమూర్తి ఏ అఘాయిత్యానికో తలపడకుండా అనుక్షణం అతడ్ని అంటిపెట్టుకునేవుంటూ, అతడికి మానసిక స్థైర్యాన్నిఅందించసాగాడు. ఎటూ యిద్దరికీ ప్రస్తుతం వుద్యోగాలు లేవు. అసలు వాళ్ళు పనిచేస్తున్న కంపెనీయే లేదు. పరిస్థితులన్నీ చక్కబడి, మళ్ళీ మామూలు స్థితికి రావడమంటే చాలా కాలమే పడ్తుందనిపించింది మాధవరావుకి.
అందుకే అతడొక నిర్ణయాని కొచ్చాడు. ఆ పరిసరాలకి దూరంగా కృష్ణమూర్తిని తనతోపాటే తన స్వగ్రామం తీసుకువెళ్ళి కొంతకాలంపాటు తన దగ్గరే వుంచుకోవాలనుకున్నాడు. దానికి తగినట్టుగానే కృష్ణమూర్తి ఆరోజు సాయంత్రం ఒకమాట అన్నాడు.
“భార్యా పిల్లలూ పదే పదే గుర్తుకొస్తూ రోజు రోజుకీ మనసు మరీ బలహీనంగా అవుతోంది మాధవా! ఒక్కొక్కసారి నేనిక బ్రతకలేననిపిస్తుంది. నన్నెక్కడికైనా దూరంగా తీసుకు వెళ్ళగలవా?”
“దూరంగా అంటే ఎక్కడికి?” అన్నాడు మాధవరావు.
“ఒకరోజు నువ్వొక మాటన్నావు గుర్తుందా మాధవా? కన్నబిడ్డలు ఎనిమిదిమందినీ పోగొట్టుకుని, యింకా మరేవో కష్టాలు పడుతూ కూడా ధైర్యంగా జీవనం సాగిస్తున్న వ్యక్తి ఎవరో వున్నారన్నావు గుర్తుందా?”
“గుర్తుంది!”
“ఎందుకో నాకా వ్యక్తిని చూడాలని వుంది వెంటనే. చూపించగలవా?” అన్నాడు.
మాధవరావు కృష్ణమూర్తి చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. ఆపైన అన్నాడు.
“చూద్దాం కృష్ణమూర్తీ! రేపు సాయంత్రమే ఆయన్నిమనం తప్పకుండా చూద్దాం!”
* * * *
ఒక చిన్న పూరిల్లు! దాని చుట్టూ వెదురు కర్రలతో విశాలంగా కట్టిన ఫెన్సింగ్!
ఆ ఫెన్సింగ్ లోపల అంతా ఆకు పచ్చని పచ్చిక. ఓ పది దాకా కొబ్బరి చెట్లూ, నాలుగు కస్తూరి చెట్లు, రెండు నూరు వరహాల చెట్లూ, ఒక నందివర్దనం, కాశీ రత్నాలూ, యింకా పూల మొక్కలూ, కూరగాయల మొక్కలూ. . . అక్కడ్నుంచి దూరంగా ఆకు పచ్చని కొండలు. . . దొంతర. . .దొంతరలుగా. . . అందంగా కన్పిస్తున్నాయి.
ఆ పూరింట్లోనే మూడు గదులున్నాయి. ఓ గదిలో వంట. ఓ గదిలో పడక. అతిధుల కోసం అన్నట్టు అటువైపు మరో గది. వసారాలో నేత మగ్గం. అక్కడే నూలు వడికే రాట్నం.
ఆ సాయంత్రం వేళ. . . ఆ యింటి బయట పచ్చికలో ముగ్గురు వ్యక్తులు కూర్చుని వున్నారు. వారిలో ఒకరు మాధవరావు. . .ఇంకొకరు కృష్ణమూర్తి. . . మూడవ వ్యక్తి ఆ యింటి యజమాని. . . ఆయన పేరు స్వర్ణధ్వజాల మహారధి.
ఆయనకి తొంభైయ్యేళ్ళ వయసుంటుంది. ఆరడుగుల పొడవు. పొడవుకి తగ్గ లావు. అంత వయసున్నట్టు కనిపించడు. మనిషి చలాకీగా వుంటాడు. మల్లెపూవు లాంటి తెల్లటి ఖద్దరు చొక్కా, పంచె. జుట్టు మొత్తం తెల్లబడిపోయివున్నా చక్కగా దువ్వుకున్నట్టుగా వుంది.
మహారధి గొంతు సవరించుకున్నాడు. కృష్ణమూర్తి వైపు చూశాడు.
“చూడు బాబూ కృష్ణమూర్తీ నీది పెద్ద కష్టం. దాని గురించి ఆలోచించాల్సింది నిజంగా ఎక్కువే వుంది! అంతకంటే ముందుగా అనుక్షణం ప్రమాదాల పారంపర్యత నింపుకున్న నా జీవిత వృత్తాంతం నువ్వు వినాలి. అది నీ ముందస్తు జీవితానికి మార్గదర్శకం కావచ్చు! అన్నాడు.
చెప్పమన్నట్టు తలాడించేడు కృష్ణమూర్తి.
“చూడు బాబూ! నేనొక ఉపాధ్యాయుడిని. డెభైయేళ్ళ క్రితం. ఆ రోజుల్లో బ్రతకలేక బడిపంతులనే వారు. అప్పటికే నాకు ఇరవైయేళ్ళు. ఆ తర్వాత మూడేళ్ళకి సువర్చలాదేవితో నాకు పెళ్ళయింది. ఆమె మంచి రూపవతి. అంతకు మించిన గుణవతి. అప్పటికే ఆమెకి పద్దెనిదేళ్ళు! పెళ్ళయిన రెండేళ్ళకి మాకు పాప పుట్టింది.
తొలి బిడ్డని చూసుకుని భార్యాభర్తలిద్దరం మురిసిపోయాం. మా యింట లక్ష్మీదేవి జన్మించిందని పండుగలు చేసుకున్నాం. పాపని అల్లారుముద్దుగా పెంచుకున్నాం. సంవత్సరం గడిచింది. ఇంతలో సువర్చల మళ్ళీ గర్భం ధరించింది. అంతవరకూ చక్కగా గడిచిన నాజీవితం అక్కడ నుండీ గతి తప్పింది.
ఆరోజు ఉదయం నేను యింట్లో లేను. ప్రభుత్వ ఆరోగ్యశాఖ వారిచ్చివెళ్ళిన విటమిన్ టాబ్లెట్లు పాప చేత మింగించడానికి సువర్చల ప్రయత్నించింది. ఆహార వాహిక, శ్వాసకోశాలు వీటి గురించి సువర్చలకి అవగాహన లేదు. టాబ్లెట్ ని పాప గొంతులో వేసి బలవంతంగా నోరు మూసింది. ఆ తర్వాత, నీళ్లుకూడా తాగించింది. అయినా దురదృష్టం వెన్నాడింది. మాత్ర కడుపులోకి దిగలేదు. ఏ శ్వాస నాళానికి అడ్డు పడిందో యేమో. . . ఫలితంగా పాప మరణించింది. . .అది బాబూ నా యింట మొదటి చావు!” మహారధి ఆపాడు. ఆయన విలక్షణమైన ముఖంలో ఏ భావమూ లేదు. వెనక్కి కాలంలోకి వెళ్ళి, ఒక పాత సంఘటనని గుర్తుకుతెచ్చుకుని వివరిస్తున్నట్టుగా వుంది. ఆయన మళ్ళీ ప్రారంభించేడు.
“ఇక రెండవది. చెప్పానుగా. . .సువర్చల చాలా అందగత్తె అని. సహజం గానే ఆ వూరి భూస్వామి ఒకతను ఆమెపై కన్ను వేశాడు. సమయం కోసం వేచి చూడసాగాడు. ఇంతలో సువర్చల రెండవ బిడ్డని కూడా ప్రసవించింది. ఈసారి మగబిడ్డ. మళ్ళీ ఆర్నెళ్ళు నడిచాయి. ప్రక్క పట్టణంలోని జిల్లా పరిషత్తులో పనుండి నేను ఆ రోజు రాత్రి ప్రయాణమై వెళ్ళాను. అది తెలుసుకున్న ఆ భూస్వామి అర్థరాత్రి వేళ మా యింటికి వెళ్ళి, తలుపు తట్టాడు. అప్పట్లో మాది పెంకుటిల్లు. పసిబిడ్డతో పాటు నిద్రిస్తున్న సువర్చల తలుపు తీసింది. ఆమెనలాగే వున్న ఫళాన లోపలికి నెట్టుకుంటూ వెళ్ళి, భూస్వామి లోనుండి తలుపు గడియ పెట్టేడు. “రా. . రమ్మంటూ” ఆమె చేయి పట్టుకున్నాడు. ఎలా పెనుగులాడిందో యేమో సువర్చల తను మాత్రం మానం పోగొట్టుకోకుండానే బయటపడింది. అతడు రాకుండా బయట నుండి తలుపుకి గొళ్ళెం పెట్టింది. కానీ, పసిబిడ్డ మాత్రం భూస్వామితో పాటు లోపలే వుండి పోయాడు. దాన్నే అవకాశంగా తీసుకున్నాడు ఆ భూస్వామి. సువర్చల గనుక “అరిచి గోల పెడితే, లోపలున్న బిడ్డని చంపేస్తా”నని బెదిరించేడు. బిడ్డని రక్షించుకోవాలనుకుంటే “తలుపు తీసి లోనికొచ్చి తనకి శరీరం అర్పించుకో”మన్నాడు.
ఏం చేస్తుంది సువర్చల? అరిచి బిడ్డని చంపుకోనూలేదు. అతడన్నట్టు శీలం పోగొట్టుకోనూలేదు. దిక్కుతోచని స్థితిలో యేదీ చేయలేక అలాగే తలుపు దగ్గర నిలుచుండిపోయింది. ఒక గంటసేపు నానా రకాలుగా బెదిరించాడతడు లోపల్నుండి. సువర్చల నుండి సమాధానం లేదు. ఏమనుకున్నాడో యేమో. . . తనకేం భయం లేదన్నట్టుగా భూస్వామి లోపలున్న నా బిడ్డని కత్తితో ముక్కలు ముక్కలుగా నరికి, ఒక్కొక్క ముక్క సువర్చల చూసే విధంగా కిటికీ లోంచి బయటికి విసిరేయసాగాడు. రక్తంతో తడిసిన తన ఆర్నెళ్ళ పసికందు శరీరంలోని ప్రతి భాగాన్ని, ప్రతి ముక్కనీ కళ్ళారా చూసుకుంది సువర్చల. . . ఆ కర్కోటకుడు విసురుతుండగా. అయినా మానం పోగొట్టుకోలేదు. కానీ, అక్కడే వున్న ఒక గునపం తీసి చేతబట్టుకుంది. శరీరపు ముక్కల్నన్నీ విసరడం పూర్తయాక భూస్వామి లోపల్నుండి కిటికీ వూచల్ని విరగ్గొట్టి, కిటికీకి పెద్ద సందు చేశాడు. బయటకి రావడానికి ప్రయత్నంజేస్తూ, ఆ సందులోంచి దూర్చి, తల బైటకి పెట్టేడు.
తను ఏం చేయాలో అప్పటికే నిశ్చయించుకుని వుంది సువర్చల. గునపం పైకెత్తి ఒకే ఒక్క వూపుతో వాడి వీపులోనుండి గుండెల్లోకి దింపింది. అట్లా వాడు చచ్చేవరకూ మళ్ళీ మళ్ళీ దింపింది.
ఆపైన, భూస్వామి కొడుకు నా భార్య మీద హత్యానేరం కేసు మోపాడు. కానీ, న్యాయమూర్తి దాన్ని నేరంగల హత్యగా పరిగణించలేదు. పైగా నా భార్యని ప్రశంసించినాడు. “మాన సంరక్షణ కోసం కన్నబిడ్డను సైతం త్యాగం చేసిన స్త్రీమూర్తి”గా, “అద్వితీయమైన భారతీయ సంస్కృతికి నిలువెత్తు నిదర్శనం”గా అభివర్ణిస్తూ దాన్ని జడ్జిమెంటు లో ఉటంకించినాడు. కేసు కొట్టి వేసినాడు. ఏది ఏమైనా. . .నా రెండవ బిడ్డ మరణించినాడు!. . .అది నా యింట రెండవ చావు!
( సశేషం )
0 అభిప్రాయాలు:
Post a Comment