ధ్వజం --3
ఇరవై నిముషాల తర్వాత, చెమటలు గ్రక్కుకుంటున్న శరీరంతో
కృష్ణమూర్తి తన యింటి ముందున్నాడు. కానీ, యిల్లు అతడి ముందు లేదు. ఒక రాళ్ళ కుప్ప మాత్రం వుంది.
అసలా వీధిలో ఎవరి యిల్లూ లేవు. ఏ ఒక్కడి యిల్లూ నిఖార్సుగా నిలబడి లేదు. అన్నీ అర కొరగా మిగిలిన శిథిలాలే! అన్నీ రాళ్ళ కుప్పలే!! శకలాల వ్రక్కలే!!!
ఆ ముక్కల మధ్యన చిక్కుకుని మృత్యువుతో పోరాడుతూ కొందరు మానవులు. వారిని బయటికి లాగడానికి ప్రయత్నిస్తున్న యింకొందరు బ్రతికి బట్టకట్టిన మనుషులు. . . అంతా తాపత్రయాలు. . . తన వారి కోసం తాపత్రయాలు! ఉరుకులూ, పరుగులూ, ఏడుపులూ, పెడబొబ్బలూ, ఆర్తనాదాలూ, హాహాకారాలూ. . . గుండె బాదుడ్లూ. . . గుంభనపు రోదనలూ. . . అది వూరు కాదు. ఊరైన వల్లకాడు!!
ఇవన్నీ పట్టించుకునే స్థితిలో కృష్ణమూర్తి లేడు. మొదట ఇల్లు కూలిపోయిందన్న సత్యం భోదపడగానే దాన్ని జీర్ణించుకోలేక అతడు ప్రాణాలు ఎగిరిపోయేట్టు వెర్రికేక ఒకటి పెట్టేడు. అలాగే కేక పెట్టినట్టుగా రోదిస్తూ వేగంగా రాళ్ళ గుట్ట మీదికి చేరుకున్నాడు. చుట్టూ కలియజూస్తూ తన వారి కోసం వెదికాడు. ముందుగా భార్య శారద కనిపించింది. కాంక్రీట్ దిమ్మెల మధ్యన కూరుకుపోయివుంది.
“శారదా” పొలికేక పెట్టి, క్షణంలో ఆమెని చేరుకున్నాడు. అప్పటికే స్పృహ తప్పబోయే స్థితిలో వుందామె. భర్త గొంతు విని, కనుల్ని బలవంతంగా తెరిచి, అతడి వైపు చూసింది. అంతటి బాధలోనూ ఆమె ముఖంలో ఒక వెలుగురేఖ కనిపించి, మాయమైంది.
“ఏమిటీ శిక్ష నీకు శారదా? ఏరీ నాపిల్లలు. . . ఎక్కడ నా తల్లి. . .?” ఆమె నడుం దగ్గరి కాంక్రీట్ దిమ్మెల్ని తొలగించడానికి ప్రయత్నించాడు. అలివి కాలేదు. బలాన్నంతా ఉపయోగించి మళ్ళీ లేపడానికి ప్రయత్నించేడు. ఇసుమంత కూడా కదల్లేదు. అది చాలా పెద్ద దిమ్మె. లాభం లేదని తెలిసింది. ఆమె తలవేపుకి చేరుకున్నాడు. గుండెలపైనున్న రెండు చిన్నపాటి రాళ్ళను మాత్రం పక్కకి నెట్టి, శరీరం పైన మట్టిని తుడిచాడు. అక్కడే కూర్చుని ఆమె తలని తన తొడమీదకి చేర్చి, ముఖాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు.
“నా శక్తి చాలడం లేదు శారదా” ఆమె ముఖంలోకి చూసి పెద్దపెట్టున ఏడ్చాడు. ఆమె అతడి కళ్ళలోకి సంతృప్తిగా చూసింది. కడసారి చూపులన్నట్టుగా అతడి ముఖమంతా నిండుగా చూసుకుంది. బలవంతంగా కుడిచేతినెత్తి ‘నా పని ముగిసింది లాభం లేదన్నట్టుగా’ సైగతో చెప్పింది. ఆపైన అటువేపు వేలు చూపిస్తూ, ‘ అక్కడ పిల్లలో, తల్లో వున్నార’న్నట్టుగా ‘ముందు వాళ్ళని కాపాడమ’న్నట్టుగా సంజ్ఞ చేసింది.
విడవలేక ఆమెని విడుస్తూ, విధి లేక విడుస్తూ, కృష్ణమూర్తి అటువేపుకి పరుగుతీశాడు. అక్కడ అతడి తల్లి కనిపించింది. రక్తసిక్తమైన దేహంతో తొడల వరకూ శిథిలాల మధ్య కూరుకుపోయివుంది.
“అమ్మా!” ఆమెని చేరుకుని, బేలగా అరిచాడు. ఆమె స్పృహలోనే వుంది. తల తిప్పి కొడుకుని చూసింది. “మూర్తీ! వచ్చావురా! అరుగో పిల్లలు. . .ఆ రాళ్ళ క్రింద. ముందు వాళ్ళని బయటకి లాగు” అందామె మొదటగా అటు ఎడమవైపుకి చూపిస్తూ.
కృష్ణమూర్తి ఆమె మాటలు పట్టించుకోలేదు. ఆమె తొడల దగ్గరకి చేరి, ఒక పెద్ద బండరాతిని ప్రక్కకి తొలగించాడు.
“ఒరే మూర్తీ! బిడ్డల్ని వదిలేసి కాటికి కాళ్ళు చాపుకున్న నన్ను లాగుతావేరా వెధవా. వెళ్ళరా. వెళ్ళి వాళ్ళని లాగు ముందు” ఆమె కసురుకుంది.
“లేదమ్మా. ఈ ఒక్క రాతినీ తీస్తే నువ్వు బతుకుతావు” అతడు మళ్ళీ రాతికి భుజం ఆనించి బలంగా నెట్టసాగాడు.
“నువ్వెప్పుడూ నా మాట వినవు. ఒరే నాయనా చచ్చేప్పుడు ఈ ఒక్క మాటయినా వినరా. నేనెటూ బతకను. నీ వంశాకురాల్ని కాపాడుకోరా. వెళ్ళరా.” ఏడుస్తూ, ఆమె బ్రతిమాలింది.
“నాకు తెలుసులేవే. ఒక్క నిముషం ఓపిక పట్టు” ఏడుస్తున్న కృష్ణమూర్తి రాతిని వదిలి పెట్టలేదు.
“ఛీ! నా కడుపున చెడబుట్టేవురా. వెళ్ళి ముందు పిల్లల్ని కాపాడుకోరా. పనికిమాలినోడా.” ఆ కన్నతల్లి కృష్ణమూర్తిని అసహ్యించుకుంటూ అంది.
నెడ్తున్న రాతిని చటుక్కున వదిలేసి కృష్ణమూర్తి, తల్లి వైపు చూశాడు నిశ్చలంగా. చచ్చేప్పుడు కూడా తిట్టడం మానుకోని తల్లి. . . తన ముదుసలి ప్రాణం కన్నా మనుమల ప్రాణాలకి ప్రాధాన్యం వుందంటోంది. విషాద భరిత వేదనాశ్రువులు కళ్ళ వెంట వర్షించగా, కృష్ణమూర్తి తన రెండు చేతులూ జోడించి తల్లికి నమస్కరించేడు. “ అమ్మా! అలాగే యిప్పుడు నీ మాట వింటాను.” వెనుదిరిగాడు. తల్లి చూపించిన వైపూ, పిల్లలున్న వైపూ నడిచాడు.
ఒక రాతి గుట్టని చేరుకున్నాడు. ఏదో ఒక మహత్తరమైన శక్తి ఆవహించిన వాడిలా అక్కడున్న రెండు పెద్ద పెద్ద గోడ దిమ్మెల్ని ఒక్కవూపుతో పైకి లేపి భుజంతో పక్కకి జరిపాడు. అక్కడ వాటి క్రింద కాస్త విశాలంగా కొంత ఖాళీ స్ధలం వుంది. ఆ స్థలంలో వున్నారు. . . అతడి పిల్లలిద్దరూ రాళ్ళలో కూరుకుపోయి, చావు బ్రతుకుల మధ్య పోరాడుతూ!
ఐదేళ్ళ పాప బొక్క బోర్లా పడి వుంది. ఆమె నడుము మీద ఒకే ఒక నిలువెత్తు రాతి బండ అడ్డంగా పడి వుంది. నడుము దగ్గర శరీరం నలిగిపోయి, వత్తుకుపోయి వుంది. రక్త స్రావం బాగా జరిగినట్టుగా అక్కడ రక్తం ధార కట్టింది. గడ్డ కట్టి వుంది. మూడేళ్ళవాడు బాబు శరీరం మీద ఏ రాతి శకలమూ లేదు. . . ఏదో కొంత మట్టి తప్ప. అయినా తగలాల్సినదేదో అప్పటికే తగిలినట్టు తల దగ్గర గాయమై వుంది.
ఆ ఘోర భయానక దృశ్యం చూడలేక కృష్ణమూర్తి నిట్టనిలువునా కదిలి పోయినాడు. కంపించి పోయినాడు. ముప్పిరిగొన్న శోకంతో, “పాపా! సాహితీ. . నాన్నాఋషీ” గొంతు చిరిగేట్టు అరిచాడు. . . అరిచి, పిలిచాడు.
తండ్రి చివరి చూపుల కోసమే తాము జీవించివున్నట్టు బాబు కళ్లు తెరిచాడు. తండ్రిని చూశాడు. “నిద్రొస్తోంది డాడీ” కళ్లు మూయబోయాడు. మళ్ళీ ఏదో గుర్తుకొచ్చిన వాడిలా కళ్ళు తెరిచాడు. “కొత్త nలాల్చీ తెచ్చావా డాడీ?” అని, “నిద్రొస్తోంది. పొద్దున్న వేసుకుంటాలే” అన్నాడు. కళ్ళు మూతలు పడ్డాయి. . . నిద్ర కోసం. . . నిండైన పరలోక నిద్రకోసం!!
“ఋషీ! నాతండ్రీ!” కృష్ణమూర్తి బాబు శరీరం పైకెత్తి అక్కున జేర్చుకున్నాడు. “నన్నొదిలి నిద్రబోకురా నా కన్నతండ్రీ!” బాబు బుగ్గలూ, నుదురూ పదే పదే ముద్దాడుతూ పిచ్చెత్తిన వాడిలా వూగి పోయినాడు. . . వేసాగి పోయినాడు.
“డాడీ!” ప్రక్కనుండి కేక వినబడింది. వెర్రివాడై అటు చూశాడు. పాప తండ్రిని పిలుస్తోంది. చేతిలోని శవాన్ని అక్కడే వదిలేసి, అటు తిరిగాడు.
“అమ్మా! సాహితీ. . . నాతల్లీ!” ఒక్క వుదుటున వెళ్ళి, తల దగ్గర కూర్చున్నాడు.
“డాడీ! నొప్పి పుడుతోంది డాడీ. ఆ స్టోన్ తీసెయ్. నొప్పి తగ్గుతుంది” అడిగింది పాప.
“అది నేను ఎత్తలేనమ్మా” పాప తల నిమురుతూ, అసహాయుడై వెక్కి వెక్కి ఏడ్చాడు.
“వెయిట్ లిఫ్టు అంత ఈజీగా ఎత్తేస్తావే. ఇది ఎత్తలేవా?” అమాయకంగా అంది.
“లేదమ్మా. . . నిజంగా ఎత్తలేను” అతడికి దుఃఖం అలివికావడం లేదు. బోరుమని ఏడ్చాడు.
“నీవన్నీ అబద్దాలే డాడీ. బొమ్మలన్నీ తమ్ముడికే యిస్తావు. వాడి మీద పడిన రాళ్ళన్నీ తీసేసి వాడిని ఎత్తుకున్నావు. నన్నూ ఎత్తుకో డాడీ. . . ప్లీజ్. . .నిజంగా నొప్పి పుడుతోంది” తమ్ముడు చచ్చిపోయాడనీ, తండ్రి బ్రతికుండీ చచ్చినవాడే అయ్యాడనీ, తెలుసుకోలేని ఆ పసిప్రాణం. . .రెండవ బిడ్డ పుట్టాక మొదటి బిడ్డ మీద తల్లిదండ్రులు చూపే నిరాసక్తతని ఆ సమయంలో కూడా బైట పెట్టింది.
“లేదు తల్లీ. . . నావి అబద్దాలు కావు” ఘూర్ణిల్లుతున్న దుఃఖంతో కృష్ణమూర్తి గుండెలు బాదుకున్నాడు. అలా కొంత సమయం బాదుకుంటూనే వున్నాడు. ఆపైన వున్నట్టుండి ఆగాడు. ఏదో అనుమానం వచ్చిన వాడిలా పాప వైపు భయంగా చూశాడు.
భయం నిజమే అయింది. పాప తల వాల్చేసి వుంది. పాప తలని చేతుల్లోకి తీసుకున్నాడు. “సాహితీ!” పిలిచాడు. సమాధానం లేదు. “అమ్మా. . . సాహితీ!” మళ్ళీ పిలిచాడు. సమాధానమే కాదు. చలనం కూడా లేదు. అర్ధమైపోయింది. అలాగే పాప తలని నేలమీదికి వదిలేశాడు. మౌనంగా అక్కడ్నుంచి లేచాడు. కదిలి, మళ్ళీ తన తల్లి వున్నచోటికి వచ్చాడు. అప్పటికే ఆమె పోయి చాలా సేపయింది. కట్టె బిగుసుకుంటోంది. అదీ చూశాడు. అక్కడ్నుంచి భార్య వైపుకి నడిచాడు. ఆమెని సమీపించాడు. మళ్ళీ తల దగ్గరే కూర్చున్నాడు. తలని ఒళ్ళోకి తీసుకున్నాడు.
“ఏమండీ!” మృత్యుద్వారం వరకూ వెళ్ళి, అక్కడ దేవుడి అనుమతితో తాత్కాలికంగా మళ్ళీ వెనక్కి వచ్చినట్టు, ఆమె బలవంతంగా కళ్ళు తెరుస్తూ పిలిచింది.
“చెప్పు శారదా!” నిర్లిప్తంగా అన్నాడు.
“మీరు. . . మీరు జాగ్రత్త. . . మీ ఆరోగ్యం జాగ్రత్త!” కన్ను మూసింది.
“ఎలా జాగ్రత్త పడనే శారదా నువ్వు లేకుండా” మళ్ళీ గోడు గోడుమని ఏడ్చాడు.
అప్పటికే పొద్దు కృంగింది. ఒక పెంజీకటి ఆ ప్రదేశాన్నీ ఆర్తిగా ఆక్రమించుకో సాగింది.
భార్య శవాన్ని వదిలేసి, కృష్ణమూర్తి లేచాడు. చేతుల్తో తన తల పట్టుకున్నాడు. ఉన్నట్టుండి వంగి, స్వరపేటిక పగిలిపోయేలా బిగ్గరగా ఎలుగెత్తి అరవసాగాడు.
వ్వో. . . వ్వో. . . వ్వో. . . వ్వో. . .
శోకతప్త హృతయంతో విషాదోన్మత్తుడై విలపిస్తున్న అతడి అరుపులు విని, ఆ చీకట్లో ఎవరో వచ్చారు. నాలుగు ఆకారాలు. నలుగురు మనుషులు. ఓదార్చారు. ‘వగపు వలదన్నారు. వెతలు తప్పవన్నారు. మనం మనుషులం. . . మ్రానులమా?’ అన్నారు. ఆపైన ఎవరి దారిన వాళ్ళు వెళ్ళారు.
కృష్ణమూర్తి ఆ రాత్రంతా ఆప్తుల శవాల దగ్గరే కాపు వేశాడు. ఓ బండకి వీపు ఆన్చి జారగిలబడి కూర్చుండి పోయాడు. దూరంగా ఏడ్పులూ, శబ్దాలూ విన్పిస్తూనే వున్నయి. నడి రాత్రయింది. చంద్ర కాంతి శవాల మీద పడి వాటి ఉనికిని తెలియజేస్తోంది. కృష్ణమూర్తి హృదయం శూన్యంగా వుంది. కాలం గతానుగతికం. నిర్విరామం! క్రితంలో బాధ యిప్పుడు లేదు. అంతా పోగొట్టుకున్న వాడిలోని నిశ్చలత్వం. శవాలవైపు చూశాడు. . . నిర్నిమిత్తంగా. . . నిర్నిమేషంగా.
ఎవరు బాంధవులు? ఎవడు ఎవడికి బాంధవుడు. . .?
అసలు నీవెవడవు?
ఒక విడి మానవుడు. . . వేరొక విడి మానవుడికి బంధువా?
అయితే. . . ఆ బాంధవ్యపు గొలుసెక్కడ? ఆ గొలుసే సత్యమైతే. . .నిత్యమైతే. . . ఒకడు పోయినప్పుడు మరొకడు మిగిలివుండడం ఎలా సంభవం? అదే విధం??
కృష్ణమూర్తికి భగవద్గీతలోని ఒక శ్లోక భావం గుర్తుకొచ్చింది.
అవ్యక్తమునందు ఆసక్తమైన మనసుగల వారికి దుఃఖము అధికతరమై వుండును. ఎందుకనగా అవ్యక్తము దేహము కలిగిన వారిచే దుఃఖమునకు గతియై పొందబడుచున్నది!!!
* * *
(సశేషం)
0 అభిప్రాయాలు:
Post a Comment