ఒకానొక అజ్ఞానపు క్షణంలో. . . నాకు తెలీకుండా నేనే జన్మించి,  అమ్మ చనుబాలలో ఆది సంవేదన అనుభవించి. . .ఆటపాటలలో అద్వితీయుడనై రాణించి. . .సంఘ విద్యా సముపార్జనలో సారస్వత చక్రవర్తినై, పుస్తకాల్ని పఠించి. . .పరీక్షల్ని పరివీక్షించి. . .ఆత్మజ్ఞాన అవలోకనంలో విలువల వలువలు వూడదీసి. . .విశ్వతత్వాలు స్మరించి. . . మానవ శ్రేయస్సు మహా లక్ష్యమై పోగా. ."ఈ ప్రపంచపు దొడ్డబిడ్డగా ఉద్భవించాల"నీ, "ఒక పూర్తి మానవుడిగా పరిణమించాల"నీ, నేను కంటున్న కల,  కడుతున్న కోట. . .ఒహ్ ఇంతెందుకు కనుచూపు మేరలో. . . నా జీవితం ఒక వేద సంకలనం!!  నేనొక ఈశ్వరుడిని!!! ( ఇది ఈ బ్లాగులోని ప్రసంగి కథలో ఒక పాత్ర మనోభావాలు __ రచయిత )

Thursday, August 2, 2007

ధ్వజం --2

ఏ దేశ మయితేనేం. . . మానవుడుంటున్న దేశం!
ఏ స్థల మయితేనేం. . . ఇళ్ళూ, భవంతులూ నిర్మించుకున్న స్థలం!!
ఏ మత మయితేనేం. . . అది వైయక్తిక మనస్తత్వ సమ్మతం!!!

అక్కడ. . . ఆ ప్రదేశంలో. . . అప్పుడు. . . ఓ సాయం సంధ్య వేళ. . .

ఆహ్లాదభరితమై సాగిపోతున్న పిట్ట కూనల, పక్షి ప్రౌఢల, కేరింతల త్రుళ్ళింతల క్రిల క్రిల క్రిలా ధ్వానం ఎందుకో లిప్తపాటు ఆగింది. నవనవోన్మేషాల వసంతాల గానం ఏమైందో క్షణం సేపు దాగింది. మహోన్మత్త ముక్త కోకిలా రావం ఏకంగా మాయమే అయింది. ముంచుకొస్తున్న ప్రాకృతిక ప్రళయాన్ని ముందుగానే పసిగట్టిందో యేమో ఓ పక్షి ప్రాణి ‘కీచు’ మని అరిచింది.

అంతే!!

క్షణంలోపు క్షణంపాటు అక్కడ భూమి కదిలింది. . . భూమి కుదిలింది. . భూమి పగిలింది. ఏం జరిగిందో ఎవరికీ తెలీదు. జరగాల్సింది జరగనే జరిగింది. ఒక కంపనం పెను ప్రకంపనంగా మారి భూకంపమయింది. ప్రళయ కార్యానికి అది కారణభూతమయింది. ఆ మహా ప్రళయాన ఒక సంపూర్ణ రాష్ట్రమే లయమై విలయమయింది. . .విధ్వంసమయింది.

క్షణం నిడివిలో సస్యశ్యామలమంతా శవాల మయమయింది.

ధఢ. . . ధఢ. . . ధఢ. . . ధఢేల్ మను ధ్వనులతో అకాశ హర్మ్యాలే అక్కడ నేల కొరిగాయి. ఘన సుందర సౌధాలే శిధిలాలయాయి. శిధిలాల శకలాలయినాయి. మనుష్యులు మట్టి పాలయ్యారు. శకలాల క్రింది వికలాంగులయారు.

మానవ ప్రాణులు, జంతు ప్రాణులు, పక్షి ప్రాణులు. . . ఒకరేమిటి. . . ఒకటనేమిటి. . . ప్రకృతికి ప్రాణాల హెచ్చు తగ్గుల వివక్ష లేదు. అన్నీ శిధిలాల క్రిందే లెక్క. . . సగం యిరుక్కుని. . . సగం పెరుక్కుని. . . ఖండాలుగా, ఖండ ఖండాలుగా. . . మొండాలుగా. . . “దేవుడా రక్షించ రారమ్మం” టూ, ధీనంగా వేడికొంటూ.

తప్పించుకున్నవాడూ తప్పుకున్నవాడూ ధన్యతములు. చచ్చిన వాడూ ధన్యుడే. . . తప్పుకోనూలేక, చావనూ రాక యిరుక్కుపోయిన వాడే దౌర్భాగ్యుడు.

శిశువులూ, పశువులూ, గర్భిణీ స్త్రీలూ. . . సర్వులూ క్షతగాత్రులే! రాళ్ళ క్రింది క్షతగాత్రులు. అరుపులూ, ఆర్తనాదాలూ, మిన్నంటిన హాహాకారాలూ, మితిమీరిన రోదనలూ. . . ఎన్నని?. . . ఎవ్నరివని?. . . అది జీవన్మరణాల ఘోష! విషాద ప్రాణుల శరణాల భాష!!!

విజ్ఞాన శాస్త్రాలూ. . . రిక్టర్ స్కేళ్ళూ. . . ఎలాస్టిక్ రీ బౌండ్ థియరీలూ. . . ఆకర్షణ వికర్షణ భూ విద్యుచ్ఛాలక బలాల సిద్ధాంత రాద్ధాంతాలూ. . . సర్వం. . . సర్వమూ నిరర్ధకం అయినాయి. ప్రమాద తీవ్రతను ముందుగా పసిగట్టలేకనే పోయాయి. లక్షల శవాల రాసులే. . . రాసుల గణణమే. . . ఆ పైన విపత్తు తీవ్రతకి తార్కాణమయింది.
ఒక మహోపద్రవం. . . ఒక మహా ఉత్పాతం. . . అక్కడ సంభవించిది.

సుసంపన్నమైన, బహు విధమైన ఆ దేశ వారసత్వ సంపద. . . అక్కడ. . . ఆ ప్రాతం వారికి గర్వకారణం కాలేదు. . . బుగ్గి పాలయింది. . . బూడిద పాలయింది. . . భూకంపం పాలయింది.
* * * *
బాబుకి సిల్కులో లాల్చీ ఫైజమా, పాపకి పట్టులో లంగా జాకెట్టూ తీసుకుని కృష్ణమూర్తి షాపులోంచి బయట పడ్డాడు. పార్కింగ్ ప్లేస్ లోంచి కారుని బయటకి తీసి రోడ్డు మీదికి నడిపాడు. అది ఫోర్ లేన్ రోడ్డు. విశాలంగా వుంది. ఒక కిలోమీటరు దూరం కారు అలా ముందుకి నడిచింది.

అంతే!!! అక్కడ భూమి కదిలింది.

ధఢ. . . ధఢ. . . ధఢ. . . ధఢేల్ మను ధ్వనులతో అకాశ హర్మ్యాలే అక్కడ నేల కొరిగాయి. ఘన సుందర సౌధాలే శిధిలాలయాయి.


కారు చిన్నగా ‘జర్కి’చ్చి వూగింది. కృష్ణమూర్తికి మొదట ఏమీ అర్ధం కాలేదు. ఏమైందో తెలుసుకునే లోపే అతడి కళ్ళముందే రోడ్డుకిరువైపులా వున్న భవంతులూ, విద్యుత్ స్తంభాలూ కఠోర శబ్దాలు చేస్తూ కూలిపోసాగాయి. ఆ అకస్మాత్తు ఘటనకి బిత్తరపడి, కృష్ణమూర్తి అప్రయత్నంగానే బ్రేకేసి కారాపాడు. ఏదో భయానక విపత్తు ముంచుకొచ్చిందని తెలుస్తూనే వుంది. కఠోర శబ్ధాల ఆతిధ్వనుల్ని భరించలేక రెండు కళ్ళూ, చెవులూ మూసుకుని నిముషం సేపు స్టీరింగ్ దగ్గర అలాగే భయంతో బిగుసుకు పోయాడు. తర్వాత, కళ్ళు మాత్రమే తెరిచాడు. ఏం జరుగుతుందోనని విండోలోంచి బయటకి చుట్టూ చూశాడు.

అప్పటికే ఎన్నో భవనాలు కూలాయి. కొన్నింకా కూలుతూనే వున్నాయి. కూలిన భవంతుల శిథిలాలు అడ్డంగా పడి రోడ్డుని కప్పేస్తున్నాయి. కూలే మేడల్లోంచి కొన్ని రాళ్లు దొర్లుకుంటూ వచ్చి కారుని తాకుతున్నాయి. ఇళ్ళలోంచి బయటికొచ్చిన వాళ్ళు జనం తలకొక దిక్కుగా, తోచిన విధంగా పరుగులెత్త సాగారు. అప్పటికే మనుషుల కేకలతో అరుపులతో ఆ ప్రాంతం దద్ధరిల్లసాగింది.

కృష్ణమూర్తి అమాయకుడు కాదు. అర్ధమైపోయింది. ఏదో బలీయమైన భూ ప్రకంపనానికి ఆ ప్రదేశం కేంద్ర బిందువైందని తెలిసిపోయింది. ఆ పైన క్షణం కూడా అతడు కాలయాపన చేయలేదు. ఎటూ కారు ముందుకు వెళ్ళే అవకాశం లేదని తెలుసు. అతడి యిల్లు అక్కడ్నుంచి యింకా రెండు కిలోమీటర్ల దూరముంది. క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే డోర్ ఓపెన్ చేసి, బయటికి దూకాడు. దొర్లుకుంటూ రోడ్డు మీద దూసుకొస్తున్న రాళ్ళనీ, రోడ్డుకి అడ్డంగా పడి, ఒకదానికొకటి తగిలి విద్యుత్ చ్ఛటల్ని పుట్టిస్తున్న ఎలక్ట్రిక్ తీగల్నీ, వేటినీ లక్ష్య పెట్టకుండా అతడు తన యింటి వైపుకి పరుగుదీయసాగాడు.

కట్టుకున్న భార్య, కన్నతల్లి, తను కన్న బిడ్డలూ స్మృతిలో మెదిలి, జ్ఞప్తిలో వుండగా, అన్ని అవరోధాల్నీ అవలీలగా దాటుకుంటూ ప్రచండ వేగంతో అతడు యింటి దిక్కుకి దూసుకు పోయాడు.

0 అభిప్రాయాలు: