ఒకానొక అజ్ఞానపు క్షణంలో. . . నాకు తెలీకుండా నేనే జన్మించి,  అమ్మ చనుబాలలో ఆది సంవేదన అనుభవించి. . .ఆటపాటలలో అద్వితీయుడనై రాణించి. . .సంఘ విద్యా సముపార్జనలో సారస్వత చక్రవర్తినై, పుస్తకాల్ని పఠించి. . .పరీక్షల్ని పరివీక్షించి. . .ఆత్మజ్ఞాన అవలోకనంలో విలువల వలువలు వూడదీసి. . .విశ్వతత్వాలు స్మరించి. . . మానవ శ్రేయస్సు మహా లక్ష్యమై పోగా. ."ఈ ప్రపంచపు దొడ్డబిడ్డగా ఉద్భవించాల"నీ, "ఒక పూర్తి మానవుడిగా పరిణమించాల"నీ, నేను కంటున్న కల,  కడుతున్న కోట. . .ఒహ్ ఇంతెందుకు కనుచూపు మేరలో. . . నా జీవితం ఒక వేద సంకలనం!!  నేనొక ఈశ్వరుడిని!!! ( ఇది ఈ బ్లాగులోని ప్రసంగి కథలో ఒక పాత్ర మనోభావాలు __ రచయిత )

Thursday, August 2, 2007

ధ్వజం -- 1


కృష్ణమూర్తి ఎనభై వేల రూపాయలు దాచుకున్న చిట్ ఫండ్ కంపెనీ వాడు రాత్రికి రాత్రే మూటా ముల్లె సర్దుకుని అర్జంటుగా ఫ్లయిటెక్కి ఫారిన్ వెళ్ళిపోయిన రోజున కృష్ణమూర్తి కొంత అశాంతికి లోనయ్యాడు.

ఆపద సమయంలో నేను అతడికి ఓ మంచి ఓదార్పు ఉపకరణంలా కన్పిస్తాననుకుంటా. ఆ రోజు సాయంత్రం వేళ మా యింటికొచ్చి నాతో ఓ గంటసేపు గడిపాడు.

ఒక ప్రయివేట్ కంపెనీలో అతడు సాఫ్టువేర్ యింజనీరు. నెలకి ముఫై ఐదు వేల రూపాయల జీతం. సొంత యిల్లూ, కారూ వున్నాయి. చక్కటి భార్యాపిల్లలూ, తోడుగా తల్లి. . . మొత్తానికి కృష్ణమూర్తి జీవితం వడ్డించిన విస్తరే! ఓ మూడు నెలల జీతం తనది కాదనుకుంటే అతడికి చిట్ ఫండ్ కంపెనీ వల్ల కలిగిన నష్టం పెద్ద లెక్కలోది కాదు. అయినా ఎందుకో కృష్ణమూర్తి నేననుకున్నదాని కంటే బాగా డీలా పడినట్టు కనిపించాడు. ఆ మాటే అతడి నడిగాను.

“నీకున్న స్టాటస్ కి ఈ ఎనభైవేలొక నష్టమా?” అని.

కృష్ణమూర్తి విరక్తిగా నవ్వేడు. “కాదనుకో” అని, “ఒకదాని వెంట ఒకటిగా ఎప్పుడూ ఏదో కష్టం కలుగుతూ వుంటే ఎంతయినా మనసు బలహీన పడుతుంది మాధవరావ్” అన్నాడు.

“ఇప్పుడేం కష్టాలు కలిగాయని”

“అంతకుముందు నెలలో అమ్మకి అపెండిసైటిస్ ఆపరేషను, క్రిందటి నెలలో పాపకి మలేరియా జ్వరం, ఈ నెలలో యిది. ఎన్నని భరించగలం చెప్పు!” అన్నాడు విసుగ్గా.

కృష్ణమూర్తి అసహనం ఎవరి మీదో నాకర్ధం కాలేదు. మానవ జీవన ప్రయాణ యానంలో అవరోధ ప్రమాదాలెన్ని వుండాలో, అవి నెలకెన్ని వుండాలో, సంవత్సరానికెన్నో. . . వాటి సంఖ్యను నిర్దేశిస్తున్నాడా ఈ కృష్ణమూర్తి? నాకు నవ్వొచ్చింది.

“నీకో విషయం చెప్పనా?” అడిగాను.
“చెప్పు” అన్నాడు.

“నీ కష్టాలు చాలా చిన్నవి. ఆ మాటకోస్తే అవి కష్టాలే కాదు. ఎటువంటి కష్టం అనుభవించిన వాళ్ళున్నారను కుంటున్నావు ఈ లోకంలో?”

“ ఎటువంటి వాళ్ళున్నారు? ”

“పుట్టిన ఎనిమిది మంది బిడ్డలూ ఎనిమిది విధాలుగా తన కళ్ళ ముందరే చనిపోయినా, చివరకంటా తోడు నిలుస్తుందనుకున్న భార్య మతి భ్రమించి మధ్యలోనే పిచ్చిదై పోయినా, ఊరు వూరంతా ఏకమై వూర్నుండి వెలివేసినా. . . అలుపనేది లేకుండా జీవితం జీవించడానికేనన్నట్టు హుందాగా బ్రతుకుతున్న వాళ్ళున్నారు తెలుసా?” అన్నాను.

“ఛీ! వాడెవడో దరిద్రుడు. . .వాడితో నన్ను పోలుస్తావు నువ్వు” ఈసడింపుగా అన్నాడు కృష్ణమూర్తి.

‘ఫెటేల్’ మని గుండెల మీద చరిచినట్టయింది నాకు. . “వాడెవడో దరిద్రుడు” అన్న మాట వినగానే. అతడ్ని వారిస్తూ, ఏదో చెప్పబోయాను.

ఇంతలో నాభార్య కాఫీ తీసుకొచ్చింది. అక్కడ్నుంచి టాపిక్ మారిపోయింది. ఆ తర్వాత కొంత సేపటికి వెళ్ళొస్తానన్జెప్పి కృష్ణమూర్తి లేచి బయట కారు దగ్గరకు నడిచాడు. అంతవరకూ వెళ్ళి అతడిని సాగనంపి, నేను వెనుదిరిగాను. మనసంతా అసంతృప్తిగా తయారైంది.

ఎంతో చెప్పాలనుకున్న వాడికి ఏమీ చెప్పలేకపోయి నప్పుడు కలిగే అసంతృప్తి!!!

0 అభిప్రాయాలు: