ఒకానొక అజ్ఞానపు క్షణంలో. . . నాకు తెలీకుండా నేనే జన్మించి,  అమ్మ చనుబాలలో ఆది సంవేదన అనుభవించి. . .ఆటపాటలలో అద్వితీయుడనై రాణించి. . .సంఘ విద్యా సముపార్జనలో సారస్వత చక్రవర్తినై, పుస్తకాల్ని పఠించి. . .పరీక్షల్ని పరివీక్షించి. . .ఆత్మజ్ఞాన అవలోకనంలో విలువల వలువలు వూడదీసి. . .విశ్వతత్వాలు స్మరించి. . . మానవ శ్రేయస్సు మహా లక్ష్యమై పోగా. ."ఈ ప్రపంచపు దొడ్డబిడ్డగా ఉద్భవించాల"నీ, "ఒక పూర్తి మానవుడిగా పరిణమించాల"నీ, నేను కంటున్న కల,  కడుతున్న కోట. . .ఒహ్ ఇంతెందుకు కనుచూపు మేరలో. . . నా జీవితం ఒక వేద సంకలనం!!  నేనొక ఈశ్వరుడిని!!! ( ఇది ఈ బ్లాగులోని ప్రసంగి కథలో ఒక పాత్ర మనోభావాలు __ రచయిత )

Wednesday, August 8, 2007

ధ్వజం! (కథ) -- దాని కథ!

"ధ్వజం!” కథ పూర్తయింది! కథ రాస్తున్నప్పుడు ఒకరిద్దరు స్నేహితులన్నారు ఎందుకలా కష్టాలూ, చావులూ. . .సరదాగా రాయొచ్చుగా అని. నిజమే రాయొచ్చు! సరదాగా వుండడమంటే ఎవరికి యిష్టం వుండదు? లక్ష రూపాయల విలువచేసే బైక్ మీద వెనక ఇద్దర్ని కూర్చోబెట్టుకుని నెక్లస్ రోడ్లు మీద వంద కిలోమీటర్ల స్పీడుతో వెళ్ళే కుర్రాడి సరదా, ఉల్లాసం ఎంత సేపు? రెప్పపాటు! ఆ సరదా సరైందనగలమా. మన సరదాలు కూడా యించుమించు ఈ మాత్రంలోనే వుంటాయనుకుంటా. ఎందుకంటే, బాగా జరుగుతున్నంత కాలం పొంగిపోతాం. పొరపాటున అనుకోనిది జరిగిందా కృంగిపోతాం! కానీ, ధ్వజం కథ ఏం చెపుతుంది. పదమూడు చావులూ.. ఒక భూకంప విపత్తు. . . అంతా ఏడుపుగొట్టు కథ. తెలుగు టీవీ సీరియల్ లాగా, అవార్డు సినిమాలాగా. . అంతేనా యింకేమయినా వుందా?

ఖచ్చితంగా కాదు! ఈ కథ ఒక ప్రయోజనాన్ని ఆశించి రాసింది. మీదో నాదో కాదు. విశ్వజనీన మానవుడి జీవన వైశాల్యం, అందులో ప్రమాదాల పారంపర్యతకున్నట్టి అపారమైన అవకాశం, ‘గతం’. . .భయానకమైన దాని విస్తృతి. . .మనిషి దాని పట్ల జాగరూకుడై వున్నప్పుడు కుంచించుకు పోయే దాని పరిధులు. ఈ మధ్య ఒకసారి యండమూరి వారన్నారు ఓ టీవీ ఛానల్లో. . . నాకిప్పుడు కోపం రావడం లేదు. కానీ, కోపం ప్రదర్శిస్తానని. దానర్ధం ఈ రోజుల్లో ఎంతమందికి తెలుసో లేదో నాకు తెలీదుగానీ, అంతర్ముఖుడై కోప స్వభావాన్ని తెలుసుకున్న వ్యక్తి. ఆ చెడుగు తనకి అంటకుండా దూరంగా వుంటాడనేది సారాంశం. అదే ‘ధ్వజం!’ చెప్పేది కూడా. మనిషి జీవితంలో బ్యాలెన్స్. . . మానసిక సంయమనం గురించి!

ఈ కథ ఎవరికి సంతోషాన్నిచ్చినా, యివ్వకపోయినా ఫర్లేదుగానీ చదివితే చాలు నాకదే పదివేలు! ఏ కారణంగానైనా బతుకులో భంగపడి నైరాశ్యంలో కొట్టుకుపోతున్న ఏ ఒక్క వ్యక్తి కయినా తన లోపలికి ఒకసారి చూసుకోవాలన్న స్పర్శ ఈ కథ కలిగించ గలిగితే నేను నేననుకున్నది సాధించినట్టే! మానవత్వం నా కథలకి ప్రాతిపదిక. దీనర్ధం. . . నేను సరదా కథలూ, హాస్యకథలూ రాయనని కాదు. అవీ రాస్తాను.

ఇక ఇందులో వాడిన భాష విషయం. కొంతమంది “ఎక్కువైంద”న్నారు. ఒకాయనైతే ఏకంగా “కొన్ని పదాలకి అసలు అర్దమేలేద”న్నారు. అలాంటి విమర్శ విసిరే ముందు ఒకసారి తెలుగు నిఘంటువు చూసి విసిరితే బావుంటుందని వారికి నా సూచన. ఏదేమైనా, సందర్భానికి తగినట్టే భాష ప్రయోగించానని నా ఉద్దేశ్యం. ఎందుకంటే 1996 లోనే విపుల వారి బహుమతి పొందిన నా తొలి కథ మహాపరాధి, యింకా బహుమతులందుకున్న స్వాతి కథలు యింతకంటే రెండితలు ఎక్కువ భాషతో భాసించినవే.

మొదటగా నాకు బ్లాగుల గురించి చెప్పిన స్నేహితుడు మదన్ గారికి, యిక కథ రాసేప్పుడు తమ కామెంట్లతో నన్ను ప్రోత్సహించిన ఎందరో మహానుబావుల్నీ, ఛాటింగ్ లోకొచ్చి సలహా యిచ్చిన వీవెన్ గారూ, కొన్ని సూచనలిచ్చిన సి.బి.రావు గారూ, ప్రదీప్ గారూ, కంప్యూటర్ ఎరా శ్రీధర్ గారూ. . .అన్నింటికీ మించి నేనెవరో తెలీకుండానే. . .నేనడక్కుండానే బ్లాగ్ డిజైన్ చేసి పెట్టి, నాచేత విసిగించబడ్డ మానవ చక్రం మరియూ మహిళా సవ్యసాచి వలబోజు జ్యోతమ్మలు గారూ. . . అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటూ. . . “రేపట్నుండి “ప్రసంగి” అనే కొత్త కధతో మీ ముందుకు రాబోతున్నాన”ని తెలియజేసుకుంటూ. . .వినమ్రతతో. . .

మీ . . . వింజమూరి విజయకుమార్

3 అభిప్రాయాలు:

మదన్ మోహన్ said...

ధన్యవాదములు శ్రీ విజయకుమార్
మిమ్మల్ని బ్లాగ్లోకానికి తీసుకెళ్ళినందుకు ఆనందంగా ఉంది.

Anonymous said...

వింజమూరి విజయకుమార్ గారూ, నిజంగా మీ రచనాశైలి అద్భుతం. స్వతహాగా సాహితీ ప్రియుడనైన నేను చాన్నాళ్ల తర్వాత మంచి రచయితను కలిశాననిపించింది. మీ బ్లాగులో నాకు కూడా కృతజ్ఞతలు తెలిపారు, నేను మీకు ఏ రకంగానూ సాయపడలేదు కదండీ!
-నల్లమోతు శ్రీధర్

జ్యోతి said...

nmమీలాంటి ప్రముఖ రచయిత బ్లాగు మొదలెట్టడం సంతోషం. మీ బ్లాగు మీ కథలకు సరితూగలేదనిపించింది. మీకు నేర్పించే బదులు నేనే చేసి బొత్తాములు అన్ని పెడితే బావుంటుంది అని మీ బ్లాగును మీ కథలకు తగ్గట్టుగా అందంగా చేసా. దానికే ఇంతలా పొగడాలా. టూ మచ్ విజయ్‌గారు. సరే మీ పొగడ్తలు నేను స్వీకరించాలంటే ఒక మాటివ్వాలి. నెలకొక అంశంపై వికీలో రాయాలి. ఏం రాయలో నేను చెప్తా లేదా గుంపు సభ్యులు చెప్తారు. ఒకేనా..