ఒకానొక అజ్ఞానపు క్షణంలో. . . నాకు తెలీకుండా నేనే జన్మించి,  అమ్మ చనుబాలలో ఆది సంవేదన అనుభవించి. . .ఆటపాటలలో అద్వితీయుడనై రాణించి. . .సంఘ విద్యా సముపార్జనలో సారస్వత చక్రవర్తినై, పుస్తకాల్ని పఠించి. . .పరీక్షల్ని పరివీక్షించి. . .ఆత్మజ్ఞాన అవలోకనంలో విలువల వలువలు వూడదీసి. . .విశ్వతత్వాలు స్మరించి. . . మానవ శ్రేయస్సు మహా లక్ష్యమై పోగా. ."ఈ ప్రపంచపు దొడ్డబిడ్డగా ఉద్భవించాల"నీ, "ఒక పూర్తి మానవుడిగా పరిణమించాల"నీ, నేను కంటున్న కల,  కడుతున్న కోట. . .ఒహ్ ఇంతెందుకు కనుచూపు మేరలో. . . నా జీవితం ఒక వేద సంకలనం!!  నేనొక ఈశ్వరుడిని!!! ( ఇది ఈ బ్లాగులోని ప్రసంగి కథలో ఒక పాత్ర మనోభావాలు __ రచయిత )

Thursday, August 9, 2007

ప్రసంగి!..1 (కథ)

ప్రసంగి! (కథ)

నిర్మల పెళ్ళి మానుకుందన్నవార్త ఒక స్నేహితుడి ద్వారా విన్నప్పుడు జీవతంలో ఒక విలువైన మాట వింటున్నట్టు నేను శ్రద్దగా ఆలకించాను. ఆ మాట నిర్మల స్వతంత్రమైన వ్యక్తిత్వాన్ని తొలిసారిగా నాముందు ప్రదర్శించినప్పటికీ, ఆ తర్వాత అది నాలో చాలా వేదన కలిగించిన మాట వాస్తవం!

నిర్మల పెళ్ళి చేసుకోనంత మాత్రాన ఈ లోకానికి వాటిల్లే నష్టం ఏదీ వుండబోదని నాకు తెలుసు. కానీ, ఆమె నిర్ణయం జీవితంలో ఎదురైన చెడులో నుంచో, యింకేదయినా ప్రత్యేకతను సముపార్జించుకోవాలన్న అర్ధం లేని ఆతృత లోంచో జనించి వుంటుందేమోనని నా భయం! అట్లాగాక, జీవితం గమ్యాన్ని నిర్ధేశించుకున్న అవగాహన నుండీ, అది కలిగించిన స్థిరత్వంలో నుండీ రూపుదిద్దుకున్న నిర్ణయమైతే, ఆమెతో నాకు పేచీ లేదు.

నేనూ, నిర్మలా ఒకే పాఠశాల లోనూ కళాశాల లోనూ కలిసి చదువుకున్నాం. ఆమె ఏమంత అందమయిన స్త్రీ కాదు. అయినా, తమ తమ అందచందాలతో నన్ను పీడించి, ప్రభావితం చేసిన గొప్ప స్త్రీలతో సమానంగా సరితూగ గలిగే ఒక నిగూఢమైన వ్యక్తిత్వం నాకామెలో ఎప్పటికప్పుడు ప్రస్ఫుటమవుతూనే వుండేది. అయినా, నిర్మలని చూస్తే మౌనం పలకరించినట్టు మనసు ప్రశాంతంగా వుంటుంది. వెకిలితనమనేది ఏ కోశానా వుండదు. ఆమె సమక్షంలో నేనే గాక చాలా మంది. . . యువకులతో సహా భయంగా మసలుకోవడం నేను గ్రహించకపోలేదు. దానికి కారణం బహుశా ఏదీ వ్యక్తపరుచుకోక పోవడమంత గొప్ప వ్యక్తిత్వం ఈ లోకంలో మరోటి వుండదనుకుంటా!

నిర్మల వాళ్ళది అల్లూరులో మాపక్క యిల్లే! చిన్నప్పుడు కలిసి గవ్వలాటా, వెన్నెలకుప్పలూ ఆడుకునే వాళ్ళం. దుడుకు స్వభావం వల్లా, నిర్లక్ష్యం వల్లా ఆటలలో ఎక్కువసార్లు నేనే ఓడిపోయేవాడిని. ఓటమి వల్ల కలిగిన ఉక్రోషంతోనో, లేక సమాజం నుండి అప్పటికే పొందివున్న పురుషాధిక్యత వల్లనో నేనామెని కొట్టేవాడిని. తన్నేవాడిని. కానీ, నిర్మల నన్నేమీ అనేది కాదు. తన్నులన్నీ మౌనంగానే భరించేది. అయినా మళ్ళీ నాకెందుకో భయం వేసేది. ఆమె అసహాయత లోంచి ఒక శక్తివంతమయిన శాపం నన్ను వెంటాడుతున్నట్టు నాకు అన్పించేది.

అది నాకు బాగా గుర్తు! ఒకరోజు తొక్కుడుబిళ్ళాట మూలంగా జరిగిన ఘర్షణలో నేను నిర్మలని ఎడమ చెంప దగ్గర గట్టిగా కొరికేశాను. రక్తం వచ్చింది. వాళ్ళ నాన్న మా నాన్నతో గొడవ పడ్డాడు. మానాన్న నన్ను చితగ్గొట్టాడు. తర్వాత, ఆ గాయం మానడానికి ఆమెకి నెలరోజులు పట్టింది. గాయం ఏర్పరచిన గుర్తు ఆమె చెంప మీద ఈనాటికీ వుంది.

నిర్మల పుట్టగానే వాళ్ళ అమ్మ చనిపోయింది. అక్క పేరు ఇందిర. నాన్న పంచాయతీ ఆఫీసులో గుమాస్తా! వాళ్ళకి ఓ ఏడెకరాల పొలం వుండేది. కాస్త జరుగుబాటున్న కుటుంబపు మనుషుల్లో కనిపించే నిర్భీతి, దర్పం. . . బిగ్గరగా అరిచినట్టు మాట్లాడే ఆయన కఠంలో యిమిడి వుండేది. నిర్మల మౌనంలోని రహస్యం. . . బహుశా తండ్రి మాట్లాడే గుణం లోంచి పుట్టిన ఏహ్యతా భావనేయేమో నేను చెప్పలేను. పైగా మనుషుల వ్యక్తిత్వాల వెనుక లోపాల్ని, కారణాల్ని అన్వేషించడంలో నాకంత నమ్మకం లేదు. మేము డిగ్రీ చేస్తుండగా వదిలి పెట్టని టైఫాయిడ్ జ్వరంతో వాళ్ళ నాన్న చనిపోయాడు. అప్పటికే ఇందిరకి పెళ్ళయింది. భర్త ఇన్సూరెన్స్ కంపెనీలో వుద్యోగి. నిర్మల కొద్దిరోజులపాటు అక్కబావల ప్రాపకంలోనే పెరిగింది. ఆ తర్వాత కొంత కాలానికి వాళ్ళ బావ ట్రాన్స్ ఫర్ మీద భార్యతో సహా ‘చెన్నై’ వెళ్ళిపోవడం, నిర్మల బి.యిడి., టీచరుగా వుద్యోగం సంపాదించి, అల్లూరులోనే వుండిపోవడం, నేను బ్యాంకు ఆఫీసర్ గా హైదరాబాదులో సెటిలవడం, పెళ్ళి చేసుకుని యిద్దరు పిల్లల్ని కనడం కూడా వరుసగా జరిగిపోయాయి. అప్పటికి కూడా నిర్మల జీవితంలో చెప్పుకోదగ్గ మార్పేదీ నాకు కన్పించలేదు.

నా తల్లిదండ్రుల్ని చూడటం కోసం నేను హైదరాబాదు నుండి అల్లూరు వెళ్ళినప్పుడల్లా నిర్మలని తప్పకుండా కలిసేవాడిని. మేం రకరకాల విషయాల గురించి గంటలకొద్దీ ముచ్చటించుకునే వాళ్ళం. ఆ మాటల్లో కూడా నిర్మల ఏమంత ప్రత్యేకతని చాటుకునేది కాదు. రాజధాని విశేషాలు వింటున్నప్పుడు కళ్ళు పెద్దవి చేసి, చిత్రంగా వినేది. ఆమె ఎంత శ్రద్దగా, అమాయకంగా నా మాటల్ని వినేదంటే. . . భాగ్యనగరం అంతటికీ నేనొక్కడినే ఒక్కగానొక్క జమీందారీ మహారాజునన్నా ఆమె నమ్మేస్తుందనిపించేది. ఇందులో అతిశయోక్తి లేదు. ఎంతసేపు మాట్లాడినా, ఎన్నిసార్లు మాట్లాడినా ఆమెతో నాకింకా మాట్లాడాలనే అన్పిస్తుండేది. రేఖామాత్రంగానైనా ఒక అసంతృప్తి నాలో ప్రతిసారీ మిగిలిపోతుండేది.

ఒక పురుషుడి శరీరాన్ని పవిత్రం చేసి, కుటుంబాన్ని ఒక వెలుగు వెలిగించాల్సిన నిర్మల లాంటి స్త్రీ వివాహం లేకుండా మోడుగా జీవించడం నా హృదయంలో వెలితిని కలిగించేదనుకుంటా. . . పెళ్ళి గురించి ఒకటి రెండుసార్లు ప్రస్తావించాను. ఆ విషయం కదిలించగానే నిర్మల నవ్వి నేర్పుగా మాట తప్పించేది. అది వివాహం విషయంలో స్త్రీకి వుండే సహజమైన బిడియంగా, సిగ్గుగా భావించేవాడినేగానీ. . . స్థిరమైన నిర్ణయంతో కూడిన చర్యగా ఆనాడు నేను వూహించలేదు. ఒక సందర్భంలో ఎప్పుడో అన్నాను.

“ఇరవై ఆరేళ్ళొచ్చేయి!” అని.

ఆ మాటలో నిబిడీకృతమైన భావం తనకి అర్ధమైపోయినట్టుగా ఆమె ముఖం ఎరుపు వర్ణం దాల్చింది.

“అయితే ఏంజెయ్యాలంటావు?” విసుగ్గా, ఎరగనట్టు నటించినా, వెంటనే అడిగింది.

వయసులో వున్న ఒక స్త్రీ వివాహం గురించి మరో వయసులో వున్న పురుషుడు ఆమెతోనే ఆ విషయం చర్చించడం ఎంతైనా కొంచెం యిబ్బందికరం! మాటల్లో నిజాయితీ లోపించి, వ్యక్తుల బలహీనతలు చోటు చేసుకుంటాయనే మరో వైపు నిజం బహుశా ఆ యిబ్బందికి కారణమనుకుంటా!

“నీకు నిజంగా తెలీదా?” సూటిగా ప్రశ్నించినా, యిబ్బందిగానే అన్నాను.

“నా పెళ్ళి గురించా?” కళ్లు క్రిందికి వాల్చి, నెమ్మదిగా అడిగింది.

(సశేషం)

0 అభిప్రాయాలు: