ఒకానొక అజ్ఞానపు క్షణంలో. . . నాకు తెలీకుండా నేనే జన్మించి,  అమ్మ చనుబాలలో ఆది సంవేదన అనుభవించి. . .ఆటపాటలలో అద్వితీయుడనై రాణించి. . .సంఘ విద్యా సముపార్జనలో సారస్వత చక్రవర్తినై, పుస్తకాల్ని పఠించి. . .పరీక్షల్ని పరివీక్షించి. . .ఆత్మజ్ఞాన అవలోకనంలో విలువల వలువలు వూడదీసి. . .విశ్వతత్వాలు స్మరించి. . . మానవ శ్రేయస్సు మహా లక్ష్యమై పోగా. ."ఈ ప్రపంచపు దొడ్డబిడ్డగా ఉద్భవించాల"నీ, "ఒక పూర్తి మానవుడిగా పరిణమించాల"నీ, నేను కంటున్న కల,  కడుతున్న కోట. . .ఒహ్ ఇంతెందుకు కనుచూపు మేరలో. . . నా జీవితం ఒక వేద సంకలనం!!  నేనొక ఈశ్వరుడిని!!! ( ఇది ఈ బ్లాగులోని ప్రసంగి కథలో ఒక పాత్ర మనోభావాలు __ రచయిత )

Friday, August 10, 2007

ప్రసంగి!..2 (కథ)

నేను మాట్లాడలేదు.

“ఆ సంగతులన్నీ నీకెందుకు మగవాడివి.” తనే అంది నన్ను విడదీస్తూ.

అందులో మగవాళ్ళకి సబంధం లేని విషయం ఏముందో నాకు అర్ధంగాలేదు. పైగా ఆమె గుర్తు చేస్తే తప్ప, ఆమె ముందు నేను మగవాడినన్న విషయం నాకూ స్ఫురించదు. మొత్తానికి ఎందుకో నిర్మల పెళ్ళి విషయం నా దగ్గర దాటవేస్తోందని తెలిసింది. అందుకే నేనారోజు మళ్ళీ ఆ విషయం గురించి కదిలించదలచుకోలేదు.

ఏది ఏమైనా, ఈసారి మాత్రం అల్లూరు వెళ్ళినప్పుడు నిర్మలతో ఆ విషయం మాట్లాడి అమీతుమీ తేల్చుకోవాలని ముందే గట్టిగా నిశ్చయించుకున్నాను.

* * * *

ఆ తర్వాత రెండు నెలలకి నేను అల్లూరు వెళ్ళడం జరిగింది.

నా తల్లిదండ్రులతో కుటుంబ విషయాలన్నీ మాట్లాడుకుని, కొంత విశ్రాంతి తీసుకున్న తర్వాత రెండో రోజు నేను తాపీగా నిర్మల యింటికి బయలుదేరాను.

నిర్మల వాకిట్లో నిల్చుని పక్షులకి బియ్యం గింజలు విసుర్తోంది. తల స్నానం చేసి ఎరుపురంగు చీర కట్టుకుంది. నన్ను చూసిన సంబరంలో పళ్ళెంలోని గింజలన్నీ ఒకేసారి నేలపై ఒలకబోసి, “చక్రీ! ఎప్పుడొచ్చావు” అంది దూరం నుండే. మళ్ళీ వెనక్కి తిరిగి, లోపలికెళ్ళి ఒక వాలు కుర్చీ వేస్తూ, “రా! కూర్చో!” అంది.

నేను కూర్చున్నాను.

నా ఎదురుగా చాప పరుచుకుని దానిపై కూర్చుంటూ, “ఎప్పుడొచ్చేవు?” అంది మళ్ళీ.

“నిన్న ఉదయం వచ్చాను.” అన్నా.

“నిన్ననగా వచ్చిన వాడివి. . .యిప్పుడా యిక్కడికి రావడం” నిష్ఠూరమాడింది.

“ప్రయాణంలో అలిసిపోయాను” అన్నా.

“పోన్లే విజయ బాగుందా?” అంది నా భార్య నుద్దేశించి.

“బావుంది!”

“అది కిరణ్మయీ?” అని, చప్పున నుదుటి మీద చేయి ఆనించి, ఏదో గుర్తుకుతెచ్చుకుంటూ, “అబ్బ వాడు. . .చిచ్చరపిడుగు. . .వాడితో వేగలేం బాబూ. . .ఆ. . గుర్తొచ్చింది రాకేశ్! వాడు బాగున్నాడా?” అంది నా పిల్లల్ని గుర్తుచేసుకుంటూ.


“లక్షణంగా వున్నారు.” అన్నాను.

నిర్మల ముఖంలో క్రితంసారి నేజూసిన ఒంటరితనం, భయం తాలూకూ నీడలు లేవు. వయసు ఆమె శరీరాన్ని ఆకర్షనీయమైన మార్పులకి గురిచేసింది. విచ్చుకున్న పుష్పంలా ఆమె ముఖం అందంగా వికసించింది. సూర్యచంద్రులు ఉదయించి, అస్తమించడానికన్నట్టు నుదురు విశాలమయింది. శరీరం లోని మృదుత్వం, రక్తం చెంపల్లోకి వ్యాపించుకుని అవి ఎర్రబారి, చిన్నతనంలో నేను చేసిన గాయాన్ని మాయం చేసాయి. నిశీధిలోని నల్లదనాన్ని సంగ్రహించుకుని ఆ కనుబొమలు ధన్యత చెందాయి.

నేను తదేకంగా చూడడం గమనించి నిర్మల, “ఏంటలా చూస్తున్నావు?” అంది.

“నువ్వు లావయ్యేవు!” అన్నాను.

ఆమె సంబరపడింది. “అవునా?” అంటూ, ఒకసారి తన ఒళ్ళు చూసుకుని, “అయితే నేను సుఖంగా వున్నానంటావు.” అంది. . .పమిటని జాకెట్లోకి దోపుకుంటూ.

“లావవడమనేది సుఖానికి నిదర్శనమో కాదో నాకు తెలీదు.” అన్నా. ఆమె మాటని కావాలనే ఖండించినప్పచికీ నేనన్నమాట కూడా వాస్తవమే.

ఆమె నవ్వింది.

“పోన్లే. విజయని తీసుకురాలేక పొయ్యావా?” అంది.

నేను మాట్లాడలేదు.

“పాపం! విజయ ఎంత మంచిదోగదా?” అంది.

“మంచిచెడులనేవి వ్యక్తుల్లో వుండవు నిర్మలా. వాళ్ళని పరిశీలించే మనుషుల్ని బట్టే వుంటాయనుకుంటాను.” మరో చురక తగిలించాను. ఆ జడంలో చైతన్యం కలిగించడం నా వుద్దేశ్యం.

‘అవుననుకో!’ అని, మోకాలు మడిచి, విడిపోయిన జడని ముందుకేసుకుంది. మళ్ళీ దాన్ని అల్లుకుంటూ, “మరి విజయ మంచిది గాదంటావా?” అంది.

“అనను. మంచి చెడులనేవి వస్తువుల్లోనూ, వ్యక్తుల్లోనూ వుండవంటాను. వాటిని తూకం వేసి, విలువని ఆపాదించేవారి సంస్కారం మీద ఆధారపడతాయంటాను.”

“పోన్లే. విజయ కుట్లూ, అల్లికలూ యింకా చేస్తోందా?” అంది.

ఆమె అంతే! ఏ ఒక్క నిర్దుష్ట విషయం దగ్గరా నిలబడి ఆలోచించదు. చర్చని కొనసాగించదు. ‘పోన్లే!’ అనే మాటతో ఒక విషయం లోంచి మరో దాన్లోకి కప్పదాట్లు వేసుకుంటూ ఆమె సృష్టినంతటినీ కలియదిరుగుతుంది. ఆ స్వభావానికనుగుణంగానే ఆమె కనురెప్పలు చంచలంగా కదిలి చిత్ర విన్యాసాలు చేస్తాయి. నాలా వాక్యాన్ని ముందుగా నిర్మించుకుని, తర్వాత మాట్లాడడం ఆమెకి చేతకాదు. ఒక స్వాభావికమైన ఒరవడిలో, ఆమె నోటినుండి బయల్పడే ప్రతిమాటా సహజ రమనీయతను సంతరించుకుని మనల్ని కట్టిపడేస్తుంది. ఆమెతో మాట్లాడడం ఎప్పటికీ నాకు చిత్రంగానూ, కష్టంగానూ వుంటుంది.

“ఊ!” అన్నాను.

“కాఫీ తాగుతావా?. . . అయ్యో నామతిమండా!” అంటూ లోపలికి లేచి వెళ్ళింది. కాఫీ కలుపుకుని, మళ్ళీ తొందరగా తిరిగి వచ్చింది. గ్లాసు నాకందిస్తూ, “సుజాతకి పెళ్ళైంది తెలుసా?” అంది.

“ఏ సుజాత?”

“రామబ్రహ్మంగారమ్మాయి. మనం ఎనిమిదో తరగతిలో వుండగా దాని రవిక నువ్వు చింపేశావు గుర్తుందా?”

“ఆ. . గుర్తుంది!” అన్నాను.

“దానికి పెళ్ళయింది. బహుశా దానికి నువ్వంటే యిష్టమనుకుంటా. నీ ఫోటో ఒకటి ఎప్పుడూ దాని దగ్గరుండేది. మొగుడు నీలా బ్యాంకు ఆఫీసరయ్యుండాలనేది. కానీ, దానికి పాపం గుమాస్తా దొరికేడు. అయితే మంచివాడనుకో!” అంది.

నేనేమీ మాట్లాడలేదు. ఎందుకంటే. . .ఆమె ‘చెడ్డవాళ్ళు’గా ఆరోపించిన వాళ్ళని నేనింత వరకూ చూడలేదు.

“సుజాత పెళ్ళికి ముందు రోజు గిలకబావి దగ్గర జారి పడింది. ఎడమచెయ్యి విరిగింది. ఆ చేతికి కట్టు కట్టించుకుని మెడలో మూడు ముళ్ళు వేయించుకుంది. ఆరోజు పందిట్లో జనం ఒకటే నవ్వులు. అది కూడా నవ్వడమేననుకో. నువ్వుంటే నవ్వలేక చద్దువు!” నవ్వింది. నవ్వేప్పుడు రొమ్ములు నిండుగా, బరువుగా కదిలాయి. కళ్ళలో నీళ్ళు తిరిగాయి. పమిటతో కళ్ళు తుడుచుకుంది. కళ్ళు కొద్దిగా ఎర్రబారాయి.

“ఈ సారి మన పంచాయతీకి మోహనకృష్ణ పోటీ చేశాడు. చౌదరి వాళ్ళ గ్రూపు ఓడిపోయింది. పోనీలే యికనైనా ఊరు బాగు పడుతుంది.” అంది.

నేను వినడం లేదు. మాటలు నేర్చిన నిర్మలని గమనిస్తున్నాను.

“వెంకట్రావు వాళ్ళ నాన్న చనిపోయాడు తెలుసా?”

“అరె! ఎందుకని?” అన్నాను బాధా సూచకంగా.

“గుండెపోటు. సిగరెట్లు బాగా కాల్చేవాడనుకో” అంది. . . పెద్ద ప్రపంచ జ్ఞానం వున్నదానికి మల్లే. ఆపైన చీరని పాదాలమీదికి లాక్కుని, జడని ముడి పెట్టుకుంది.

“సురేష్ కి ఉద్యోగం వచ్చింది తెలుసా?” కళ్ళు చక్రాల్లా తిప్పుతూ అడిగింది.

నాకేం తెలుసు? ఒకటి మాత్రం తెలుసు! నా ఆలోచన, నా జ్ఞానం ఆమెని ఏమాత్రం ప్రభావితం చేయలేవని తెలుసు. మంత్రముగ్దుడినై నేనామె చేష్టలు అవలోకించడం తెలుసు. ఆమె ఒక కథా నాయకురాలు! తన యిష్టానుసారంగా కథను మలుపులు తిప్పుకుంటుంది. అమె అందమయిన స్త్రీ కాదని యింతకు ముందు అభిప్రాయపడేవాడిని. కానీ అది తప్పు. అమె అందం ముఖంలో వుండదు. ప్రవర్తనలో, శరీరంలో వుంటుంది. ఆ శరీరం నుండి వెలువడే ప్రతి కులుకూ, ప్రతి విరుపూ, ప్రతి కదలికా ఒక కదిలే స్త్రీత్వపు చిత్తరువుని పోలి చూపరుల్ని ఆకర్షిస్తుంది. సకల చరాచర సృష్టిలోని సౌందర్యాన్నంతా మూట కట్టుకుని మాటలతో ఆమె విశ్వ సంచారం చేస్తుంది.

“ఏ సురేషు?” అన్నాను. . . ఈ ప్రపంచంలోకి వస్తూ.

“అయ్యో. . .సురేషుని గూడా మరిచావా?” అని, “నీతోపాటు పెళ్ళయింది జూడు.” గుర్తుచేసింది.

నాకు అవకాశం దొరికింది.

“అందరి పెళ్ళిళ్ళ గురించి చెప్పడమేనా లేక నీదేమయినా వుందా?” అన్నాను. . .గంభీరంగా ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ.

( సశేషం )

0 అభిప్రాయాలు: