ఒకానొక అజ్ఞానపు క్షణంలో. . . నాకు తెలీకుండా నేనే జన్మించి,  అమ్మ చనుబాలలో ఆది సంవేదన అనుభవించి. . .ఆటపాటలలో అద్వితీయుడనై రాణించి. . .సంఘ విద్యా సముపార్జనలో సారస్వత చక్రవర్తినై, పుస్తకాల్ని పఠించి. . .పరీక్షల్ని పరివీక్షించి. . .ఆత్మజ్ఞాన అవలోకనంలో విలువల వలువలు వూడదీసి. . .విశ్వతత్వాలు స్మరించి. . . మానవ శ్రేయస్సు మహా లక్ష్యమై పోగా. ."ఈ ప్రపంచపు దొడ్డబిడ్డగా ఉద్భవించాల"నీ, "ఒక పూర్తి మానవుడిగా పరిణమించాల"నీ, నేను కంటున్న కల,  కడుతున్న కోట. . .ఒహ్ ఇంతెందుకు కనుచూపు మేరలో. . . నా జీవితం ఒక వేద సంకలనం!!  నేనొక ఈశ్వరుడిని!!! ( ఇది ఈ బ్లాగులోని ప్రసంగి కథలో ఒక పాత్ర మనోభావాలు __ రచయిత )

Wednesday, January 23, 2008

వేంకటేశ్వరుడు – గడప

వేంకటేశ్వరుడు – గడప
ఇది నా స్వీయ రచన కాదు. ఒక స్నేహితుడిచ్చిన పాత సినిమా స్కిప్టులో చదివి రాస్తున్నా. ఏదైనా సినిమాలో ఈ విషయం చెప్పారో లేదో కూడా నాకు తెలీదు.

శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానంలో నిరంతరం భక్తుల సేవలందుకునే వేంకటేశ్వర స్వామి వారి గర్భగుడి ద్వారతోరణం దగ్గరి గడపకి ఓ రోజు ఓ ధర్మసందేహం కలిగిందట. సందేహం కలిగిన వెనువెంటనే ఆలస్యం చేయకుండా సదరు గడప శ్రీ వెంకటేశ్వర స్వామిని సందేహ నివృత్తి కోసం యిలా ప్రశ్నించిందట.

“ఆయ్యా స్వామీ! తమరూ రాయితో తయారు చేసినవారు. నేనూ రాయితోనే చేయబడ్డాను. తమరికీ, నాకూ తండ్రి అయిన శిల్పి ఒకరే. అయినప్పుడు, తమకి ఈ నిత్య మంగళ హారతులేమి. నన్ను మాత్రం ఈ లక్షలాది మంది భక్తులు మట్టి కాళ్ళతో తొక్కకుంటూ తమరికి ‘గోవింద’ నామ భజన చేయడమేమిటి?” అని.

ఆ మాటకా తిరమలాధీశుడు గడపని చూసి ఓ చిర్నవ్వు నవ్వి, సమాధానం యివ్వకుండా మిన్నకుండి పోయాట్ట.

ఆ చర్యతో ఆ గడప మరింప మనస్తాపం చెంది, “స్వామీ! తమ భక్తులతో పాటు తమరు కూడా నన్ను చిర్నవ్వుతో హేళన చేయడం ఏమంత బాగోలేద”ని మదనపడి, ముఖం (అయినా గడపకి ముఖం ఎక్కడిది. గడపమొహం కాకపోతే) చిన్నబుచ్చుకున్నదట.

ఆ మాటలకి శ్రీ స్వామివారు స్పందిస్తూ, యిలా సమాధానం యిచ్చార్ట.

“ఒసే గడపా! నన్ను కళా తపస్వియైన ఒక శిల్పి దీక్షగా యేళ్ళ తరబడి శ్రమించి కోటానుకోట్ల వులి దెబ్బలకి నన్ను గురిచేసి, తను శ్రమించి, నన్ను బాధించి మలిచిన పిదప నేను ఈ మహిమాన్వితమైన ఈ సుందర రూపం దాల్చి భక్తుల మనసుల్ని దోచుకోగలిగాను. ఇక నీ మాటంటావా. నీదేముంది? ఒక రాయిని తీసుకుని అదే శిల్పి వులితో అటో దెబ్బ, యిటో దెబ్బ వేస్తే నువ్వు గడపవై కూర్చున్నావు. నీకు దెబ్బలూ తక్కువే. పూజలూ తక్కువే. ఇప్పుడర్థమయిందా?” అన్నాట్ట.

అంతట, ఆ సమాధానం విని సదరు గడప “అరే! నిజమే గదా స్వామివారి గొప్పదనం!” అని సంతృప్తి చెందిందట.

ఇందుమూలంగా, ఈ కథను చెప్పడం మూలంగా నేను యావన్మందికీ తెలియజేయునది యేమనగా, ఈ కథలోని వేంకటేశ్వరుడికి మల్లే ‘ఫెటేల్’ మని ఈడ్చిపెట్టి కొట్టే జీవితానుభవం నుండి తద్వనుభవ సారాన్ని పిండుకుని, సారస్వతం ద్వారా యితరత్రా పరిశీలనా ప్రక్రియల ద్వారా కొంత ప్రంపంచ జ్ఞానాన్ని, పదార్థ స్వరూపజ్ఞానాన్ని, స్వస్వరూపజ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని పొందిన వ్యక్తులు ఏదో ఒక విధంగా తమ విశిష్టతను తాము చాటుకుంటూనే, యితరులకు ప్రయోజనకారకులౌతారని.

ప్రయోజకులై పదిమందికీ సహాయకారులయే వారు అందరూ ఆమోదించదగ్గ వ్యక్తులే గదా. అదీ ఈ టపా వెనుక సారాంశం.

ఏదో సందర్బంలో విశ్వనాధ వారు ఈ మాటన్నారు.

“పది విషయములు దెలిసియున్న భిన్న వస్తు స్వరూపజ్ఞానము దెలియినుగానీ, తెలిసినదియే ఒకటియై దాని యందే సర్వోత్కృష్టతా భావమును కలిగియుండుట బహు మానవులకు జీవితములో సంభవించునొక దురదృష్టము” అని.

అయితే, యిదంతా కూలంకషంగా చదివిన పిదప మీకో సందేహం కలగొచ్చు. వేంకటేశ్వరుడు చాలా దెబ్బల కోర్చి ఘనుడైనట్టు ఎప్పుడూ కష్టాల కొలిమిలో కాలుతూండే కార్మికులూ, కూలీనాలీ జనాలూ బతుకులో మనందరికంటే ఎక్కవ దెబ్బలు తినే వుంటారు గనుక, వాళ్ళంతా ఎందుకు జ్ఞానవంతులు కారూ? అని.

ఈ సందేహం కలిగిన వారికి నాదొకటే సమాధానం.

కష్టాలు పడినంతమాత్రాన ప్రయోజనం లేదు. కష్టమైనా, సుఖమైనా, జీవితంలో ఆయా అనుభవాల సారం పిండుకున్నవాళ్ళు, ఆయా విలువల్ని ప్రశ్నించి నిగ్గుదేల్చుకున్న వాళ్లు మాత్రమే గొప్పవారు కాగలరు!

మీరేమంటారు?
(సమాప్తం)

17 అభిప్రాయాలు:

విశ్వనాధ్ said...

ఉలి దెబ్బలకూ జై.
అర్జెంటుగా ఎవరైనా శిల్పిని పట్టుకోవాలి(సరదాగానే సుమా)

వింజమూరి విజయకుమార్ said...

సేమ్ టూయూ విశ్వనాధ్ గారూ. నేనూ శిల్పినే వెదుకుతున్నా.

oremuna said...

నేనూ శిల్పినే వెదుకుతున్నా

వింజమూరి విజయకుమార్ said...

చావా కిరణ్ గారికి,

మీరూ వెతుకుతున్నారా. అయితే, ఈ సమస్య సార్వజనీనమైనదనుకుంటా. అయినా అందరికీ శిల్పులు కావాలంటే కష్టమే మరి. అయితే ఇక మరుగున పడ్డ శిల్పకళకి మంచి రోజులొచ్చినట్టే.

Anonymous said...

చాలా బావుంది

వింజమూరి విజయకుమార్ said...

అశ్వన్ గారికి,

కతజ్ఞతలండీ. ఏదో చదివింది తమాషాగా రాసా.

Rajendra Devarapalli said...

గతంలో మీ రచనల్లో లేని కన్ఫ్యూజన్,కప్పిచెప్పే ప్రయత్నం,చూశావా దేవుడే గెలిచాడు! అని ఒప్పించే ఓ చిరుప్రయత్నం నాకు కనిపించాయి.గడపకు సమాధానం వరకూ నాకు బాగానే అర్ధమయ్యింది.

"ఆయా విలువల్ని ప్రశ్నించి నిగ్గుదేల్చుకున్న వాళ్లు మాత్రమే గొప్పవారు కాగలరు"...... మరి ఈలెక్కన గడప కూడా గొప్పది కావాలిగా .........

Anonymous said...

శిల్పిని వెతుకుతున్నారా? ఎవరి జీవితమే వాళ్ళకి శిల్పి. కాదా?

Anonymous said...

ప్రకటన:
ఇక్కడ శిల్పి అందుబాటులో వున్నారు.
కావలసిన వాళ్ళు హైదరాబాదు, ఎర్రగడ్డ నందు గల మానసిక చికిత్సాలయం లో నా గురించి వెతకండి.
నా పేరు లిప్శి.

వింజమూరి విజయకుమార్ said...

@రాజేంద్ర గారికి,

దేవుడే గెలిచాడనే భావనతో నేను రాయలేదండోయ్. ఏదో సరదాగా రాసా. అసలు భగవంతుడి గురించి నా కంత స్పష్టత లేదు కూడా. ఇక గడప విషయాని కొస్తే అది తన అర్హతనూ, స్వామివారి గొప్పదనాన్ని గుర్తించలేక పోయింది గనుక అది ఆయా విలువల్ని ప్రశ్నించి నిగ్గుదేల్చుకోలేకపోయినట్టే.

@శ్రీనివాస్ గారికి,

నిజమే. ఈ టపాలో చెప్పినట్టు‘ఫెటేల్’ మని ఈడ్చిపెట్టి కొట్టే జీవితానుభవం నుండి తద్వనుభవ సారాన్ని పిండుకోగలిగిన వాళ్లకి వేరే శిల్పి అవసరమే వుండదు. ఎవరి జీవితమే వారికి శిల్పి.

@అనోనిమస్ గారికి,

అమ్మయ్య మీరైతే ఎర్రగడ్డ చేరారు గదా మాకదే పదివేలు. సర్వజనాః సుఖినోభవంతు.

బ్లాగాగ్ని said...

టపా బాగుంది. కానీ, తద్వనుభవ అన్న ప్రయోగం తప్పేమో? తదనుభవ(తత్+అనుభవ) అనాలనుకుంటా. క్షమించాలి వింజమూరి గారూ, రంధ్రాన్వేషణ చేయటం నా ఉద్దేశ్యం కాదు.

వింజమూరి విజయకుమార్ said...

అయ్యా, బ్లాగాగ్ని గారూ. మీరు కనిపంచని ఆ నాలుగవ సింహం అని నాకు తెలుసు. రంధ్రాన్వేషణ చేయకూడదని నేననను. కానీ, అది ఎవర్నీ బాధ పెట్టకుండా నిర్మాణాత్మకంగా వుండాలి. మళ్ళీ యిదే సూత్రం సిద్ధాందాలు చెప్పేటప్పుడు, సీరియస్ విషయాలు చెప్పేటప్పుడు చెల్లదు. వాళ్ళని బాధ పెట్టయినా ఆ సిద్ధాంతాలు మార్పించాలి. ఇప్పుడు మీరు ఒక తప్పు సూచించారు. అది నిజమే అయితే తప్పకుండా సరిదిద్దుకుంటాను. ఓ.కే. అందరూ అన్నింటా పండితులు కాలేరు కదా. కృతజ్ఞతలు.

Anonymous said...

అయ్యా,
నా కామెంట్ చూసి నాపై పెద్ద ఎత్తున ’ధ్వజం’ ఎత్తిన మీరు నాకు పిచ్చి పట్టి ఎర్రగడ్డ చేరడానికి కారణం తెలుసుకోలేకపోయారా?
హతవిధీ, ఏమీటీ దుస్థితి?

వింజమూరి విజయకుమార్ said...

అయ్యా,
నా 'ధ్వజం' కథ తమరికి పిచ్చి పట్టించగలిగిందంటే నా కథ ధ్యేయం నెరవేరినట్టే. కథ సార్ధకం చెందినట్టే. ఎందుకంటే ఎవరైనా వాళ్ల మానసిక స్థితిని గ్రహించుకొని, అవసరమనుకున్నప్పుడు మానసిక చికిత్స కోసం ఎర్రగడ్డ ఆసుపత్రి చేరాలనేదే ఆ కథ ఉద్దేశ్యం. ఈ రూపేణా తమరు స్వస్వరూప జ్ఞానం పొంది చేరవలసిన చోటు చేరారని తెలిసి నేను బహు సంతోషముగానూ, గర్వముగానూ ఉంటిని. చిత్తగించగలరు.

Anonymous said...

For some reason, the telugu font in your posts does not appear nicely on firefox (2.0.0.12). Could you please look into it?

thanks

Anonymous said...

దేవుడే గెలిచాడు అనుకోవటంలో ఒక చిక్కు ..తిరుపతి లోని విగ్రహం స్వయం భూ (అలాంటిదేదో ..)అని భక్తులు ఆస్తికులు నమ్ముతారు..మధ్యలో శిల్పి ఎక్కడనుంచి వచ్చాడూ?

వింజమూరి విజయకుమార్ said...

rachana lu వారికి,

సృష్టి స్వయం భువు (తనకు తానుగానే ఏర్పడినట్టిది) అంటే నేనూ నమ్ముతాను గానీ, వేంకటేశుని విగ్రహం మాత్రం ఖచ్చితంగా శిల్పి చెక్కిందనే నా నమ్మకం.అయినా యిది ఓ సినిమా స్క్రిప్టులోని సరదా కథ కదా. కృతజ్ఞతలు.