ఒకానొక అజ్ఞానపు క్షణంలో. . . నాకు తెలీకుండా నేనే జన్మించి,  అమ్మ చనుబాలలో ఆది సంవేదన అనుభవించి. . .ఆటపాటలలో అద్వితీయుడనై రాణించి. . .సంఘ విద్యా సముపార్జనలో సారస్వత చక్రవర్తినై, పుస్తకాల్ని పఠించి. . .పరీక్షల్ని పరివీక్షించి. . .ఆత్మజ్ఞాన అవలోకనంలో విలువల వలువలు వూడదీసి. . .విశ్వతత్వాలు స్మరించి. . . మానవ శ్రేయస్సు మహా లక్ష్యమై పోగా. ."ఈ ప్రపంచపు దొడ్డబిడ్డగా ఉద్భవించాల"నీ, "ఒక పూర్తి మానవుడిగా పరిణమించాల"నీ, నేను కంటున్న కల,  కడుతున్న కోట. . .ఒహ్ ఇంతెందుకు కనుచూపు మేరలో. . . నా జీవితం ఒక వేద సంకలనం!!  నేనొక ఈశ్వరుడిని!!! ( ఇది ఈ బ్లాగులోని ప్రసంగి కథలో ఒక పాత్ర మనోభావాలు __ రచయిత )

Thursday, April 3, 2008

స్వర్గారోహణం... 3 (జానపద కథ)

(‘స్వాతి’ సపరివార పత్రిక 06-09-2002 సంచికలో ప్రచురించబడిన నా ‘జానపద’ కథ. పాత కాలం చందమామలోని కథల్లా ‘స్నేహం’ విలువను విడమరచి చెప్పే కథ యిది. వాస్తవానికి ఈ కథను శ్రీమతి వలబోజు జ్యోతి గారు ‘స్నేహం’ సబ్జెక్టు మీద బ్లాగు రాయమన్నప్పుడు నేను రాయవలసినది. కానీ, అప్పట్లో రాయలేక పోయాను. చదివి మీ అభిప్రాయాలూ తెలుపవలసిందిగా ప్రార్థన)

స్వర్గారోహణం (జానపద కథ)

అరివీరషండులు, నిర్మూలనోద్దండుల, దోర్దండులు, ఉద్దండులు, మణిమండితులు, మేరు సమాన ధీరులన్నట్టుగా వీర పురుషులతో, యోధులతో, యుద్ధపరాక్రమ ధీరులతో త్రిపురాపుర మహానగరం అంతా కోలాహలంగా వుంది. దేశం నాలుగు మూలల నుండీ స్వయంవర పోటీల్లో పాల్గనదలచి వచ్చిన వీరులలో పోటీలకి ప్రాథమికంగా నూట తొమ్మిదిమంది ఎంపికయ్యారు.

మల్లయుద్ధం, విలువిద్య, ఖడ్గవిద్య మొత్తం మూడు విభాగాలలో ఎంపికయిన వ్యక్తులు తమ ప్రతిభా పాటవాలు చూపించుకోవలసివుంటుంది. పోటీలు దశలవారీగా ప్రారంభమయినాయి.

మొదటిరోజు సాయంత్రం పోటీల తంతు ముగిసేసరికి సగానికి పైగా ఓడిపోయిన వీరులు తమ ఊర్లకి తిరుగు ప్రయాణం కట్టారు. మూడవరోజుకి ఐదింట నాలుగు వంతులు తప్పుకున్నారు. ఐదవరోజుకి అంతా ఓటమి చవిచూసి, విక్రమ, పరాక్రములిద్దరే మిగిలారు. అంటే చివరగా వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు పరస్పరం తలపడాల్సి వుంటుందన్నమాట. గెలిచిన వారిని రాకుమార్తె విద్యుల్లత పరిణయమాడుతుంది.

రాజ్యంకోసం, యువరాణి కోసం తామిద్దరూ పోటీ పడాల్సిన దౌర్భాగ్య స్థితి ఎదురైనందుకు విక్రమ, పరాక్రములిరువురూ చాలా ఆవేదనకి గురయినారు. కలత చెందారు. అయినా తప్పదు. పోటీ పడవలసినదే.

అంతదాకా వచ్చాక వెనక్కి తగ్గడం ధర్మంకాదు. ఎందుకంటే దేశం యావత్తూ తామిద్దరి చండపోరాటం కోసం ఉత్కంఠతో ఎదురుచూస్తోంది.

ఆ రోజు ఆరవ రోజు. ఆ రోజు విక్రమ, పరాక్రములిద్దరికీ రాజకోటలో సభామధ్యంలోనే పోటీలకి ఏర్పాట్లు చేయబడ్డాయి. ఆ మహావీరుల యుద్ధనైపుణ్యం వీక్షించడానికి ఆరోజు మహారాజు, మహారాణి, రాకుమార్తె, మహా మాంత్రికుడు చతురాక్షుడు, ఇతర అస్థాన ప్రమఖులు అందరూ సభకి హాజరయినారు.

మొదట మల్లయద్ధం పోటీ జరిగింది. ఉరోవపట్టు, శ్రోణీయపట్టు, ఊరువుల పట్టు, ఆసనం పట్టు, కంఠబిగి, శిరోబిగింపు, గిరవాటు వీటన్నింటిలోనూ విక్రమ, పరాక్రములు సమవుజ్జీలుగా నిర్ణయింపబడ్డారు.

తర్వాత విలువిద్య పోటీ జరిగింది. చలన కౌశలం, బిందు కౌశలం, స్తంభకౌశలం, ఫలఖండనం, శబ్దభేది- అన్ని విలువిద్యా మెళకువల్లోనూ విక్రమ, పరాక్రములిద్దరూ మళ్ళీ సమవుజ్జీలుగా నిర్ణయింపబడ్డారు.

ఇక మిగిలింది ఖడ్గవిద్య. అదే వారిలో అసలు వీరుడిని తేల్చి చెప్పే చివరి పరీక్ష. రాకుమార్తె చేతిలో పుష్పమాల ధరించి దాంతో వీరాధివీరుడి మెడని అలంకరింపజేయడానికి సిద్ధమయింది. చతురాక్షుడు ఒక విషం పూసిన చిన్న పిడిబాకుని బొడ్లో దోపుకుని గెలిచిన వీరుడిని వెనకనుండి పొడిచి చంపడం కోసం సంసిద్ధమయ్యాడు. మహారాజు, మహారాణి ఏం జరుగుతుందోనని ఆందోళనగా ఎదురుచూడసాగారు.

పోటీ ప్రారంభమైంది. పోటీ రెండు విడతలుగా వుంటుంది. మొదటి విడత పోటీ పూర్తయ్యేసరికి విక్రముడికి ఒక విషయం అర్థమయింది. అది- ఖడ్గవిద్యలో పరాక్రముడు తనంత నిపుణుడు కాదన్న విషయం. విక్రముడు తలుచుకుని వుంటే మొదటి విడతలోనే పరాక్రముడిని అవలీలగా ఓడించివుండేవాడు.

కానీ, అందుకు అతడి మనసు అంగీకరించలేదు. ఖడ్గవిద్యంటే శత్రువుని వధించాలి. కాదంటే శత్రువు కాలో చెయ్యో నరికి కనీసం వికలాంగుడినైనా చేయాలి. ఆ రెండు పన్లూ చేయడానికి విక్రముడు సిద్ధంగా లేడు.

అడవిలో ఆటవికుల వలలో తను పట్టుపడ్డప్పుడు ప్రాణాలు ఫణంగా పెట్టి తనని బ్రతికించి తెచ్చుకున్న మిత్రుడు పరాక్రముడు. అటువంటివాడికి హాని తలపెట్టి తను బాహ్యంలో రాకుమార్తెని సాధించినా, రాజ్యాన్ని సాధించినా అంతరంగంలో మాత్రం వట్టి దౌర్భగ్యుడి కిందే లెక్క. అటువంటి భావంలో తను జీవించలేడు. అందుకే ఒక నిశ్చయానికి వచ్చాడు.

రెండవ విడత పోటీ ప్రారంభం కాగానే పరాక్రముడితో మెల్లగా కత్తియుద్దం చేస్తున్నట్టుగానే నటిస్తూ ఒకానొక అనుకూలమైన సమయం రాగానే పరాక్రముడి కత్తిదెబ్బ ధాటికి తన చేతిలో కత్తి జారిపోయినట్టుగా అలవోకగా కత్తి మొన పైకి వచ్చేట్టు నేలమీదికి కత్తిని జారవిడిచి, వున్నట్టుండి ఎగిరి ఆ కత్తి మొనమీద తన కడుపు ఆనేలా పడిపోయాడు. అంతే. క్షణంలో విక్రముడి కత్తి అతడి కడుపుని చీల్చుకుని వెన్నులో నుంచి బయటకొచ్చింది. రక్తం చివ్వున పైరి విరజిమ్మింది.

ఆ హఠాత్పరిణామానికి స్తబ్దుడైపోయాడు పరాక్రముడు. విక్రముడు ఎంత నేర్పుగా ఓడినట్టు నటించినా అది కావాలనే ఓడినట్టు అందరికీ తెలుస్తూనే వుంది.

“విక్రమా ఎందుకు చేశావీ పని? నన్ను చంపలేక కదూ?” పరాక్రముడు నేలమీదున్న విక్రముడిని సమీపించి, అతడి తలని తన ఒడిలోకి తీసుకుంటూ అడిగాడు. అతడి కళ్ళు ధారాపాతంగా వర్షించసాగాయి.

“లేదు. ఓడాను.” అన్నాడు విక్రముడు మైకంతో కళ్ళు మూసుకుపోతుండగా.

“కాదు. నాకోసం కావాలనే ఓడావు. నువ్వే మహావీరుడివి. నీకు అక్కరలేని రాకుమార్తె నాకూ అక్కరలేదు.” పరాక్రముడు తన చేతిలోని కత్తితో తను కూడా పొడుచుకోబోయాడు.

ప్రచండ వేగంతో అక్కడికి పరుగుపరుగున వచ్చాడు మహారాజు. పరాక్రముడి చేతిలోని కత్తిని చటుక్కున లాక్కున్నాడు. “వలద”ని వారించాడు.

విక్రముడు మూసుకుపోతున్న కళ్ళు బలవంతంగా తెరిచాడు. “పరాక్రమా! దేశంలోకెల్లా వీరాధివీరుడిని నేనే. కానీ, నీ లోపలి మంచిమనసు చూపించి నన్నే ఓడిపోయేట్టు చేసిన నువ్వు నిజంగా నా కన్నా చాలా గొప్పవాడివి. కనుక ఆత్మహత్యా ప్రయత్నాలు మాని మనస్ఫూర్తిగా రాకుమార్తెని స్వీకరించు!” చెప్పి, మిత్రుడి ఒడిలో కన్ను మూశాడు విక్రముడు.

అక్కడ చూస్తున్న వాళ్ళంతా “అదే నిజమ”న్నారు. “అంతటి వీరాధివీరుడి మనసు దోచుకున్న పరాక్రముడు అతడికంటే నిజంగా అధికుడేన”న్నారు. “ఒకవేళ పరాక్రముడు గనుక ఆత్మహత్యతో మరణిస్తే విక్రముడు చేసిన త్యాగానికి అర్థం లేద”న్నారు.

దేశంలోకెల్లా వీరాధివీరుడు మరణించాడన్న విషయం తెలియగానే ఉలిక్కిపడి, “ఆ!” అంటూ గబుక్కున కూర్చున్న ఆసనంలోంచి ఆతృతగా పైకి లేచాడు చతురాక్షుడు. ఆ తొందరలో బొడ్లో దోపుకున్న విషపుకత్తి బొడ్డు దగ్గర కొద్దిగా చర్మంలోకి దిగింది.

అంతే. ‘ధభేలు’న నేలమీదపడి గిలగిల తన్నుకుంటూ క్షణంలో ప్రాణాలు వదిలాడు చతురాక్షుడు.

‘దేశంలోకెల్లా వీరాధివీరుడు ఏ కారణంవల్ల మరణించినా వెంటనే చతురాక్షుడు మరణిస్తాడ’ని ఆనాడు కాళికాదేవి అన్న మాటలు నిజమయ్యాయి.

ఆ తర్వాత, కొంతసేపటికి రాకుమార్తె పరాక్రముడి మెడలో పుష్పమాల వేసి, అతడ్ని పరిణయమాడింది. విషాదపూరిత మానసంతోనే రాకుమార్తె వేలికి అంగుళీయకం తొడిగాడు పరాక్రముడు.

అప్పుడడిగాడు మహారాజు రాకుమార్తెని. “అమ్మా విద్యుల్లతా! అనాడు సమాలోచనా మందిరంలో మహామాంత్రికుడిని చూసి ఎందుకు నవ్వావు?” అని.

రాకుమార్తె మళ్ళీ చిరునవ్వు నవ్వి, తర్వాత అంది.

“చతురాక్షుడితో దేశంలోకెల్లా వీరాధివీరుడిని చంపమన్నది కాళికాదేవి. చతురాక్షుడు కూడా ఈ దేశ పౌరుడే గనుక దేశంలోకెల్లా వీరాధివీరుడంటే చతురాక్షుడికన్నా కూడా వీరుడేగదా. అటువంటప్పుడు చతురాక్షుడు తనకన్నా వీరుడిని ఎన్నటికీ చంపలేడు- కనీసం వెనకనుండి కూడా. అదే కాళికాదేవి సంకల్పం.”

(సమాప్తం)

Wednesday, April 2, 2008

స్వర్గారోహణం... 2 (జానపద కథ)

(‘స్వాతి’ సపరివార పత్రిక 06-09-2002 సంచికలో ప్రచురించబడిన నా ‘జానపద’ కథ. పాత కాలం చందమామలోని కథల్లా ‘స్నేహం’ విలువను విడమరచి చెప్పే కథ యిది. వాస్తవానికి ఈ కథను శ్రీమతి వలబోజు జ్యోతి గారు ‘స్నేహం’ సబ్జెక్టు మీద బ్లాగు రాయమన్నప్పుడు నేను రాయవలసినది. కానీ, అప్పట్లో రాయలేక పోయాను. చదివి మీ అభిప్రాయాలు తెలుపవలసిందిగా ప్రార్థన)

స్వర్గారోహణం (జానపద కథ)

మహారణ్యంలో విక్రమ, పరాక్రముల ప్రయాణం ప్రారంభమై రెండు రోజులైంది. రాను రాను అరణ్యం దట్టంగా వుంది. కీటకాల్ని, సర్పాల్ని, క్రూరమృగాలని తప్పించుకుంటూ ఆ రోజు మధ్యాహ్నం భోజనాల వేళకి అడవిలో ఒక కొలను వున్న ప్రదేశానికి చేరుకున్నారు వాళ్ళిద్దరూ.

భోజనం చేయడం కోసం ఓ పెద్ద చెట్టు కిందికిచేరి, వెంట తెచ్చుకున్న ఆహారం మూటలు విప్పారు. మంచినీళ్ళ కోసం ఖాళీ అయిన మట్టిపాత్రను తీసుకుని కొలను వద్దకి వెళ్ళాడు విక్రముడు.

కొలను సమీపిస్తున్నప్పుడు- నీరు ఇక రెండు గజాల దూరంలో వుందనగా నేల మీద దారికి అడ్డంగా కట్టివున్న ఒక ఇనుపతీగ ఏదో విక్రముడి కాలికి తగిలింది.

అంతే. ఏం జరిగిందోగానీ ‘ఫట్’ మన్న శబ్దమైంది. క్షణంలోపు విక్రముడు ఒక ఇనుపతీగల వలలో ఇరుక్కుపోయాడు. చిక్కుకుపోయాడు. ఎవరో ఆటవికులు ఏర్పాటు చేసిన వలలో తను చిక్కుకుపోయాడని అతడికి వెంటనే అర్థమైంది.

“పరాక్రమా! మరుక్షణం కేకపెట్టాడు విక్రముడు. పరాక్రమా పారిపో. ఇక్కడ ప్రమాదం పొంచి వుంది. ఇటువైపు రాకు.” అంటూ పరాక్రముడికి తెలిపాడు.

ఆ కేకవిని కూడా అక్కడికి పరుగుపరుగున వచ్చాడు పరాక్రముడు. జరిగిన ఉపద్రవం చూసాడు. ఒరలోంచి ఖడ్గాన్ని తీసి ఇనుపతీగల వలని ఛేదించబోయాడు.

“వద్దు పరాక్రమా వెళ్ళిపో. నువ్వైనా తప్పించుకో. ఇది ఆటవికులు పన్నిన వల. వాళ్ళు చాలా అనాగరికులు. నాగరికులంటే వాళ్ళకి గిట్టదు. వచ్చారంటే ఇద్దర్నీ కలిపి చంపేస్తారు. దురదృష్టం. నేనెటూ చావక తప్పదు. బయట వున్నవాడివి నువ్వైనా వాళ్లు వచ్చేలోపు ఇక్కడ్నుంచి వెంటనే వెళ్ళిపో.” విక్రముడు అరిచాడు.

పరాక్రముడు అతడి మాటలు పట్టించుకోలేదు. ఖడ్గంతో వలని కత్తిరించడానికి ప్రయత్నించాడు. సాధ్యంకాలేదు. చేసేదేమీలేక నిస్సహాయంగా వుండిపోయాడు.

“చెప్పానుగా అదిరాదు. దయచేసి వెళ్ళు పరాక్రమా. త్వరగా వెళ్ళి ప్రాణాలు కాపాడుకో.” విక్రముడు బ్రతిమాలాడు.

అయినా పరాక్రముడు అక్కడినుండి వెళ్ళలేదు. కొద్దిసేపు ఆలోచించాడు. తర్వాత ఒక నిశ్చయానికి వచ్చిన వాడిలా. . .

“చూడు విక్రమా. స్వయంవరానికి వెళ్ళాలనుకున్నాం. కలిసివచ్చాం. కానీ, మధ్యలో నీకు ప్రమాదం ఎదురైంది. వీలైతే ఆటవికుల్ని ఒప్పించో, ఓడించో ఇద్దరం కలిసే స్వయంవరానికి వెళదాం. లేదంటే కలిసే చనిపోదాం. అంతేగానీ ఆపదలోవున్న మిత్రుడిని వదిలి, ఆడదాని కోసం పరుగులు తీయడం వీరుని లక్షణం కాదు. అసలది మానవ లక్షణమే కాదు.” అన్నాడు

“లేదు పరాక్రమా. దయచేసి నా మాట విను. చక్కని జీవితం. చేజేతులా నాశనం చేసుకోకు. వెళ్ళు.” అంటూ విక్రముడు చేతులు ఎత్తి దణ్ణం పెట్టాడు.

తన నిర్ణయం మారదన్నట్టుగా అడ్డంగా తలాడించాడు పరాక్రముడు. మెల్లగా రెండడుగులు ముందుకు నడిచి, అక్కడ వున్న ఒక బండరాతి మీది కూర్చున్నాడు. అటవికుల రాకకోసం నిరీక్షించసాగాడు.

విక్రముడికి ఏం చేయాలో తోచలేదు. అందుకే భయపెడ్తున్నట్టు నేర్పుగా అడిగాడు. “అసలు నువ్వు స్వయంవరానికని వచ్చావా? స్వర్గారోహణకని వచ్చావా?”

ఆ మాటలు విని పరాక్రముడు చిన్నగా నవ్వాడు. విక్రముడిని సూటిగా చూస్తూ, “ఫర్లేదులే. నువ్వెక్కడికి వెళితే అక్కడికనే నేనూ వచ్చా.” అని అన్నాడు.

* * *

అది గూడెం కొలువుదీరే చోటు!

ఆరోజు అక్కడ గూడెంలోని ఆటవికులంతా వృత్తాకారంలో గుమిగూడారు. అందరి ముఖాల్లోనూ ఉత్కంఠ కన్పిస్తోంది. ‘ఎవరో నాగరికులు ఇద్దరు పట్టుబడ్డారు.

వాళ్ళకి ఏ శిక్ష విధిస్తాడో తమ దొర.’ అందరి మనసుల్లోనూ ఇదే ప్రశ్న.

అక్కడ వాళ్ళ మధ్య ఒక ప్రత్యేక ఆసనం మీద గూడెం దొర కూర్చుని వున్నాడు. నల్లగా నిగనిగలాడే భారీకాయం. అంతకుమించి కండలు తిరిగిన శరీర సౌష్టవం. దొర పక్కనే దొరసాని కూర్చుని వుంది. వాళ్ళ ముందు విక్రమ, పరాక్రములిద్దరూ నిల్చుని వున్నారు. వాళ్ళ చేతులు రెండూ వెనక్కి విరిచి కట్టబడివున్నాయి.

“దొరా. ఈడు వల్లో సిక్కిండు. ఈడు వల బైట కూసోనుండు.” చెప్పాడు విక్రమ, పరాక్రముల్ని అక్కడికి తీసుకువచ్చిన ఆటవికుల్లో ఒక వ్యక్తి.

దొర చేతిలో వున్న మట్టిపాత్రలోని ఈతకల్లు కొద్దిగా తాగి, పాత్ర పక్కన పెట్టాడు. కళ్ళు చింతనిప్పుల్లా ఎర్రగా వున్నాయి. దగ్గి, గొంతు సవరించుకున్నాడు.

“ఏం బిడ్డా గూడెంలోకెందుకొచ్చినారు?” అడిగాడు.

జరిగిందంతా పదినిముషాలపాటు వివరించి చెప్పాడు విక్రముడు. ‘స్వయంవరానికి వచ్చిన తాము తెలీక వాళ్ళ గూడెం పరిధిలోకి వచ్చామని చెప్పాడు. తమ తప్పేమీ లేద’న్నాడు. ‘ఒకవేళ తప్పు ఏదైనా వుంటే వలలో చిక్కుబడ్డది తను గనుక తనని శిక్షించి, పరాక్రముడిని విడిచిపెట్టమ’ని వేడుకున్నాడు.

అంతా విని, “భలే నేస్తంకట్టినార్రా. దొర నవ్వాడు.” తర్వాత పరాక్రముడి వైపు తిరిగి, “ఏం బిడ్డా నేస్తాన్ని వల్లో వదిలెల్లడానికి పాణం పీకిందా?” అడిగాడు.

‘అవున’న్నాడు పరాక్రముడు.

“ఎళ్ళిపోడానికి నీకు వీలుంటే ఎందుకెళ్ళలే. నీకు తెలివితేటల్లేవ్. తెలివుంటే అప్పడే ఎళ్ళేవోడివి.”

“తెలివితేటలుంటే అది స్నేహం కాదు దొరా. వ్యాపారమవుతుంది.” అన్నాడు పరాక్రముడు.

“నేస్తం కట్టడానికి తెలివెందుకంటావ్. మనసుంటే సాలంటావు. మనసుండి నేస్తాన్ని కాపాడుకోను నువ్వంత మొనగాడివా.?” కాస్తంత కోపంగా అన్నాడు దొర.

“మొనగాడినని కాదు దొరా. మేం ఏ తప్పూ చేయలేదు. అలాంటప్పుడు వీలున్నా నేనెందుకు పారిపోవాలి? అసలు నా స్నేహితుడైనా ఎందుకు శిక్షించబడాలి? నాకంటే మించి అతడు చేసిన తప్పు కూడా ఏమీ లేదు. నీళ్ళ కోసం వెళ్ళి మీ వలలో చిక్కాడు. అంతేగదా?”

“మాటలు నేర్చినావురా బిడ్డా. ఇప్పుడు నిన్నొదిలేత్తాం. ఎళ్తావా?” దొర అడిగాడు.

‘వెళ్ళన’న్నట్టు తల అడ్డంగా వూపుతూ, “ఒక్కడినే వెళ్లి ప్రాణాలు దక్కించుకోవాలనే ఉద్దేశ్యమే వుంటే అప్పుడే పారిపోయేవాడ్ని. వెళ్ళను.” అన్నాడు పరాక్రముడు.

“భళిరా బిడ్డా. నేస్తమంటే నువ్వేనురా. ఇప్పుడు మేం మిమ్మల్నిద్దర్నీ కలిపి సంపేత్తానో?” అడిగాడు

“చావం. ఊపిరివున్నంత వరకూ ఇరువురం కలిసే పోరాడుతాం. చేతకానప్పుడు కలిసే చనిపోతాం.” దృఢంగా పలికాడు పరాక్రముడు.

“ఆ!. బిరుసున్నవోడివే. చేతులు కట్టేసినాం. ఏం పోరాడుతావ్. చేతులిక్కట్లిప్పుతాం. నాతో చెయ్యి కలుపుతావా?” దొర పిడికిలి పైకెత్తి తన బలం చూపిస్తూ అన్నాడు. మళ్ళీ “దైర్నముందా?” అడిగాడు.

పరాక్రముడు క్షణం ఆలోచించి తర్వాత అన్నాడు.

“క్షమించండి దొరా. పెద్దవారు. తమతో నాకే శత్రుత్వమూ లేదు. తమరితో యుద్ధం చేయడానికి నా మనసు ఆంగీకరించడం లేదు. కానీ, మమ్మల్ని విడిచిపెట్టడానికి బదులుగా మీరు విధించే షరతు అదే అయితే, తప్పనిసరైతే నేను సిద్ధమే. మీతో చేయి కలుపుతా.”

“ఔరౌరా! ఎంతమాట.” అపచారం జరిగిందన్నట్టుగా నోటిమీద చేతులేసుకున్నారు గూడెం ప్రజలు.

“దొరతోనే యుద్ధం చేత్తాడంట. పదిమందిని ఒక్కసారే సంపేత్తాడు దొర.” అన్నారెవరో ఆ గుంపులోనుండి.

“ఈడికి మూడింది. దొరతో చెయ్యి గలుపుతాడంట. ఆ చెయ్యి ఇరగదీసేత్తాడు దొర.” అన్నారింకెవరో.

క్షణంసేపు అక్కడ నిశ్శబ్దం తాండవించింది. అంతా దొర తీసుకోబోయే నిర్ణయం కోసమని ఎదురుచూడసాగారు.

నిముషం తర్వాత పెద్దగా నవ్వాడు దొర. “లెస్స బలికేవురా వీరుడా. నన్ను మెప్పించావు. పిల్లకాకివి. నాతోనే తలపడతానన్నావు. అదే నీ గెలుపు.” ఆసనంలోంచి దొర లేచి వచ్చాడు.

విక్రమ, పరాక్రములున్న చోటికి వచ్చి వారి చేతులుకున్న కట్లు స్వయంగా తన చేతుల్తోనే విప్పి, తొలగించాడు. వాళ్ళని ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు.

మళ్ళీ విక్రముడి వైపు తిరిగి, “మంచి నేస్తాన్ని సాధించినావు బిడ్డా. నీకు జయమవుద్ది. మంచోళ్ళని మేం సంపం. నేస్తాలకి పాణమిచ్చుకునే వాళ్ళని మేం సంపితే మా దేవత మమ్మల్ని సంపుద్ది. ఎళ్ళండి. మీకు జయమవుద్ది. రాజుబిడ్డ మీ ఇద్దరిలో ఒకరికి సిక్కుద్ది.” అన్నాడు.

ఆ మాట వినగానే విక్రమ, పరాక్రముల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. దొర పాదాలకి ప్రణమిల్లుతూ, “పెద్దమనసు నీది. మమ్మల్ని దీవించు దొరా!” అన్నారు.

“దేవత మిమ్మల్ని సూసింది బిడ్డా. మీకు జయమవుద్ది. రాజు బిడ్డని మనువాడినాక ఓపారి ఆయమ్మను తీసుకుని మా గూడెంకి రాండి. మా దేవతకి మొక్కుకోండి. అంతా మేలవుద్ది.” దొర దీవించి చెప్పాడు.

విక్రమ, పరాక్రములిద్దరి కళ్ళలో నీళ్ళు తిరిగాయి.

* * *

(సశేషం)

Tuesday, April 1, 2008

స్వర్గారోహణం...1 (జానపద కథ)

(‘స్వాతి’ సపరివార పత్రిక 06-09-2002 సంచికలో ప్రచురించబడిన నా ‘జానపద’ కథ. పాత కాలం 'చందమామ'లోని కథల్లా ‘స్నేహం’ విలువను విడమరచి చెప్పే కథ యిది. వాస్తవానికి ఈ కథను శ్రీమతి వలబోజు జ్యోతి గారు ‘స్నేహం’ సబ్జెక్టు మీద బ్లాగు రాయమన్నప్పుడు నేను రాయవలసినది. కానీ, అప్పట్లో రాయలేక పోయాను. చదివి మీ అభిప్రాయాలు తెలుపవలసిందిగా ప్రార్థన)

స్వర్గారోహణం (జానపద కథ)


“నీ భక్తికి నేనెంతో మెచ్చాను! ఏ వరం కావాలో కోరుకో చతురాక్షా!” అది కాళికాదేవి.

“ధన్యుడిని మాతా ధన్యుడిని! నీకు తెలీనిదేమున్నది. మనిషి ఎల్లపుడూ భయపడేది మృత్యువుకే. ఆ మృత్యువు నన్ను చేరకుండా నేను కలకాలం జీవించేలా వరమివ్వు మాతా!” అడిగాడు చతురాక్షుడు.

కాళికాదేవి క్షణకాలంపాటు ఆలోచించింది.

“అది సాధ్యం కాదు చతురాక్షా. పుట్టిన ప్రతివారూ మరణించక తప్పుదు.” అని, తర్వాత, “సరే నీ ఇష్టప్రకారమే కానివ్వు. నీకు మృత్యువు లేకుండా చేస్తాను. అయితే ఒక షరతు. ఈ దేశంలో అదరికన్నా మహావీరుడిని నువ్వు నీ చేతుల్తో చంపగలగాలి. నువ్వలా చంపలేకపోయినా, మరే యితర కారణం వల్ల అతడు మరణించినా నీకు మృత్యువు తప్పదు.” అంది కాళికాదేవి.

“ధన్యోస్మి మాతా ధన్యోస్మి! అదెంత పని?” అంటూ చతురాక్షుడు వికటాట్టహాసం చేశాడు.

“శుభం నాయనా!” కాళికాదేవి అంతర్థానమైంది.

* * *

అది త్రిపురాపుర రాజకోటలోని సమాలోచనా మందిరం!

మహారాజు విక్రమసేన భూపాలుడు, మహారాణి సువర్చలాదేవి, రాకుమార్తె రాధికా విద్యుల్లత, రాజ మాంత్రికుడు చతురాక్షుడు అక్కడ సమావేశమయ్యారు. చతురాక్షుడే వారిని అక్కడ సమావేశపరిచాడు.

“మహారాజా! రాకుమార్తెకు వెంటనే మీరు స్వయంవరం ప్రకటించాలి. ఈ దేశంలోకెల్లా వీరాధివీరుడిని మీరు ఎంపిక చేయాలి” అన్నాడు చతురాక్షుడు.

“అలాగే మాంత్రికవర్యా! స్వయంవరం జరిపించి, వీరాధివీరుడిని ఎంపికజేసి అతడితో రాకుమార్తెకి పరిణయం జరిపిద్దాం. దీనికి అత్యవసరంగా మనం సమావేశమవాల్సిన అవసరం ఏముంది?” అడిగాడు మహారాజు.

“వీరాధివీరుడిని ఎంపికజేసేది రాకుమార్తెకిచ్చి పెళ్ళి చేసేందుకు కాదు. అతడిని వధించడానికి.” చతురాక్షుడు పెద్దగా నవ్వాడు. తరువాత, కాళికాదేవి పెట్టిన షరతు గురించీ, తను మృత్యువును తప్పించుకోడం గురించీ క్షుణ్ణంగా వాళ్ళందరికీ వివరించి చెప్పాడు.

అంతా విన్నాక, “అదేమిటి మహా మాంత్రికా. మీరు మరణం నుండి తప్పించుకోవడం కోసం దేశంలోకెల్లా వీరాధివీరుడిని చంపి, రాకుమార్తెకి ఓ సాధారణమైన వ్యక్తితో కళ్యాణం జరిపిస్తారా?” అంది మహారాణి ఆందోళనగా.

“తప్పదు మహారాణీ! లేదంటే మీరు నా కోపానికి బలి కావలసివస్తుంది.” చతురాక్షుడు బెదిరించాడు.

ఆ మాట వినగానే రాజ దంపతులిద్దరూ విషాద మనస్కులయ్యారు. మ్లానమైన వదనాలతో ఇక తప్పదన్నట్టుగా, “అలాగే మాంత్రికవర్యా!” అన్నారు.

కానీ, రాకుమార్తె రాధికా విద్యుల్లత బాధపడలేదు. మాంత్రికుడిని చూసి నవ్వింది. ఏడ్చి మొత్తుకోవలసిన తన కుమార్తె అలా ఎందుకు నవ్విందో, ఆ నవ్వుకి అర్థమేమిటో మహారాజుకి బొత్తిగా అర్థంకాలేదు.

* * *

అది యాత్రికులు బస చేసే సత్రం!

తను నుదుటిపై దిద్దుకున్న వీరతిలకం కొద్దిగా పక్కకి జరిగిందేమోనని సందేహం కలిగింది విక్రముడికి. దాన్ని సరిదిద్దుకోడానికి సత్రం యజమానిని పిలిచి, “మీ వద్ద అద్దం ఏదైనా వున్నదా?” అని అడిగాడు.

“అటువంటిదేమీలేద”న్నాడు సత్రం యజమాని.

ఓ పక్కనుండి అదంతా గమనిస్తున్న ఓ పాతికేళ్ళ యువకుడు తాను కూర్చున్న ఆసనం లోంచి లేచి, విక్రముడిని సమీపించాడు. అతడికి ఎదురుగా వున్న ఆసనంలో కూర్చుంటూ, “వీరతిలకం దిద్దుకున్నవారికి ప్రతిబింబం చూసుకోను దర్పణం కావాలా?” అన్నాడు.

ఆ మాట వినగానే విక్రముడికి ఏదో గుర్తొచ్చింది. “క్షమించండి మరిచాను.” అంటూ తన నడుముకి వ్రేలాడుతున్న ఒరలోంచి ఖడ్గాన్ని తీసి పదునుతో తళతళలాడుతున్న ఖడ్గఫలకం మీద తన ప్రతిబింబం చూసుకుని తిలకం సరిదిద్దుకున్నాడు. తర్వాత, ఆ యువకుడి వైపు తిరిగి, “చూస్తే మీరు కూడా వీరుల్లాగే వున్నారే. మీ పేరు?” అని అడిగాడు.

ఆ యువకుడు అవునన్నట్టుగా చిన్నగా నవ్వి, “నా పేరు పరాక్రముడు. మీరు?” అన్నాడు.

“విక్రముడు. మాది మైథిలీపురం. త్రిపురాపుర మహారాజు తన కుమార్తెకి స్వయంవరం ప్రకటించాడు కదా. ఆ పోటీల్లో పాల్గొనదలచి బయల్దేరాను.” అన్నాడు విక్రముడు.

“శౌర్యంతో యువరాణీ వారిని చేపట్టదలిచారన్నమాట” అని నవ్వి, “నేనూ అదే పని మీద వచ్చాను. మాది వైశాలీపురం.” అన్నాడు పరాక్రముడు.

విక్రముడు ఆశ్చర్యపడి, “అరె! చిత్రంగా వుందే. రేపు స్వయంవరంలో జరిగే పోటీల్లో మనిద్దరం ఒకరితో ఒకరు పోటీపడబోతున్నామన్నమాట.” అన్నాడు.

“అంతవరకూ వస్తే తప్పదు గదా.” అని, పరాక్రముడు స్నేహపురస్సరంగా విక్రముడితో చేయికలిపాడు.

విక్రముడు తనూ చేయి అందిస్తూ, “ఇక్కడ నుండి చాలా దూరం వుంది త్రిపురాపురం. దారిలో భయంకరమైన ఆడవుల్లో వారం రోజులైనా నడవాలి.” అన్నాడు.

“ఒకరికొకరం తోడు దొరికాం గనుక అరణ్యంలో కలిసే ప్రయాణిద్దాం.” అన్నాడు పరాక్రముడు.

ఆ తర్వాత, వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ కొద్దిసేపటిలోనే మంచి స్నేహితులుగా మారారు.

“మీరు మీరు” అనుకోడం మానేసి “నువ్వు నువ్వు” అనుకొనేంత చనువును సంపాదించుకున్నారు. అలాగే మాట్లాడుకుంటూ అరణ్యంలో ప్రయాణం సాగించారు.

ఆ రోజుకి సరిగ్గా పన్నెండవ రోజున స్వయంవరం!

* * *
(సశేషం)