స్వర్గారోహణం...1 (జానపద కథ)
(‘స్వాతి’ సపరివార పత్రిక 06-09-2002 సంచికలో ప్రచురించబడిన నా ‘జానపద’ కథ. పాత కాలం 'చందమామ'లోని కథల్లా ‘స్నేహం’ విలువను విడమరచి చెప్పే కథ యిది. వాస్తవానికి ఈ కథను శ్రీమతి వలబోజు జ్యోతి గారు ‘స్నేహం’ సబ్జెక్టు మీద బ్లాగు రాయమన్నప్పుడు నేను రాయవలసినది. కానీ, అప్పట్లో రాయలేక పోయాను. చదివి మీ అభిప్రాయాలు తెలుపవలసిందిగా ప్రార్థన)
స్వర్గారోహణం (జానపద కథ)
“నీ భక్తికి నేనెంతో మెచ్చాను! ఏ వరం కావాలో కోరుకో చతురాక్షా!” అది కాళికాదేవి.
“ధన్యుడిని మాతా ధన్యుడిని! నీకు తెలీనిదేమున్నది. మనిషి ఎల్లపుడూ భయపడేది మృత్యువుకే. ఆ మృత్యువు నన్ను చేరకుండా నేను కలకాలం జీవించేలా వరమివ్వు మాతా!” అడిగాడు చతురాక్షుడు.
కాళికాదేవి క్షణకాలంపాటు ఆలోచించింది.
“అది సాధ్యం కాదు చతురాక్షా. పుట్టిన ప్రతివారూ మరణించక తప్పుదు.” అని, తర్వాత, “సరే నీ ఇష్టప్రకారమే కానివ్వు. నీకు మృత్యువు లేకుండా చేస్తాను. అయితే ఒక షరతు. ఈ దేశంలో అదరికన్నా మహావీరుడిని నువ్వు నీ చేతుల్తో చంపగలగాలి. నువ్వలా చంపలేకపోయినా, మరే యితర కారణం వల్ల అతడు మరణించినా నీకు మృత్యువు తప్పదు.” అంది కాళికాదేవి.
“ధన్యోస్మి మాతా ధన్యోస్మి! అదెంత పని?” అంటూ చతురాక్షుడు వికటాట్టహాసం చేశాడు.
“శుభం నాయనా!” కాళికాదేవి అంతర్థానమైంది.
* * *
అది త్రిపురాపుర రాజకోటలోని సమాలోచనా మందిరం!
మహారాజు విక్రమసేన భూపాలుడు, మహారాణి సువర్చలాదేవి, రాకుమార్తె రాధికా విద్యుల్లత, రాజ మాంత్రికుడు చతురాక్షుడు అక్కడ సమావేశమయ్యారు. చతురాక్షుడే వారిని అక్కడ సమావేశపరిచాడు.
“మహారాజా! రాకుమార్తెకు వెంటనే మీరు స్వయంవరం ప్రకటించాలి. ఈ దేశంలోకెల్లా వీరాధివీరుడిని మీరు ఎంపిక చేయాలి” అన్నాడు చతురాక్షుడు.
“అలాగే మాంత్రికవర్యా! స్వయంవరం జరిపించి, వీరాధివీరుడిని ఎంపికజేసి అతడితో రాకుమార్తెకి పరిణయం జరిపిద్దాం. దీనికి అత్యవసరంగా మనం సమావేశమవాల్సిన అవసరం ఏముంది?” అడిగాడు మహారాజు.
“వీరాధివీరుడిని ఎంపికజేసేది రాకుమార్తెకిచ్చి పెళ్ళి చేసేందుకు కాదు. అతడిని వధించడానికి.” చతురాక్షుడు పెద్దగా నవ్వాడు. తరువాత, కాళికాదేవి పెట్టిన షరతు గురించీ, తను మృత్యువును తప్పించుకోడం గురించీ క్షుణ్ణంగా వాళ్ళందరికీ వివరించి చెప్పాడు.
అంతా విన్నాక, “అదేమిటి మహా మాంత్రికా. మీరు మరణం నుండి తప్పించుకోవడం కోసం దేశంలోకెల్లా వీరాధివీరుడిని చంపి, రాకుమార్తెకి ఓ సాధారణమైన వ్యక్తితో కళ్యాణం జరిపిస్తారా?” అంది మహారాణి ఆందోళనగా.
“తప్పదు మహారాణీ! లేదంటే మీరు నా కోపానికి బలి కావలసివస్తుంది.” చతురాక్షుడు బెదిరించాడు.
ఆ మాట వినగానే రాజ దంపతులిద్దరూ విషాద మనస్కులయ్యారు. మ్లానమైన వదనాలతో ఇక తప్పదన్నట్టుగా, “అలాగే మాంత్రికవర్యా!” అన్నారు.
కానీ, రాకుమార్తె రాధికా విద్యుల్లత బాధపడలేదు. మాంత్రికుడిని చూసి నవ్వింది. ఏడ్చి మొత్తుకోవలసిన తన కుమార్తె అలా ఎందుకు నవ్విందో, ఆ నవ్వుకి అర్థమేమిటో మహారాజుకి బొత్తిగా అర్థంకాలేదు.
* * *
అది యాత్రికులు బస చేసే సత్రం!
తను నుదుటిపై దిద్దుకున్న వీరతిలకం కొద్దిగా పక్కకి జరిగిందేమోనని సందేహం కలిగింది విక్రముడికి. దాన్ని సరిదిద్దుకోడానికి సత్రం యజమానిని పిలిచి, “మీ వద్ద అద్దం ఏదైనా వున్నదా?” అని అడిగాడు.
“అటువంటిదేమీలేద”న్నాడు సత్రం యజమాని.
ఓ పక్కనుండి అదంతా గమనిస్తున్న ఓ పాతికేళ్ళ యువకుడు తాను కూర్చున్న ఆసనం లోంచి లేచి, విక్రముడిని సమీపించాడు. అతడికి ఎదురుగా వున్న ఆసనంలో కూర్చుంటూ, “వీరతిలకం దిద్దుకున్నవారికి ప్రతిబింబం చూసుకోను దర్పణం కావాలా?” అన్నాడు.
ఆ మాట వినగానే విక్రముడికి ఏదో గుర్తొచ్చింది. “క్షమించండి మరిచాను.” అంటూ తన నడుముకి వ్రేలాడుతున్న ఒరలోంచి ఖడ్గాన్ని తీసి పదునుతో తళతళలాడుతున్న ఖడ్గఫలకం మీద తన ప్రతిబింబం చూసుకుని తిలకం సరిదిద్దుకున్నాడు. తర్వాత, ఆ యువకుడి వైపు తిరిగి, “చూస్తే మీరు కూడా వీరుల్లాగే వున్నారే. మీ పేరు?” అని అడిగాడు.
ఆ యువకుడు అవునన్నట్టుగా చిన్నగా నవ్వి, “నా పేరు పరాక్రముడు. మీరు?” అన్నాడు.
“విక్రముడు. మాది మైథిలీపురం. త్రిపురాపుర మహారాజు తన కుమార్తెకి స్వయంవరం ప్రకటించాడు కదా. ఆ పోటీల్లో పాల్గొనదలచి బయల్దేరాను.” అన్నాడు విక్రముడు.
“శౌర్యంతో యువరాణీ వారిని చేపట్టదలిచారన్నమాట” అని నవ్వి, “నేనూ అదే పని మీద వచ్చాను. మాది వైశాలీపురం.” అన్నాడు పరాక్రముడు.
విక్రముడు ఆశ్చర్యపడి, “అరె! చిత్రంగా వుందే. రేపు స్వయంవరంలో జరిగే పోటీల్లో మనిద్దరం ఒకరితో ఒకరు పోటీపడబోతున్నామన్నమాట.” అన్నాడు.
“అంతవరకూ వస్తే తప్పదు గదా.” అని, పరాక్రముడు స్నేహపురస్సరంగా విక్రముడితో చేయికలిపాడు.
విక్రముడు తనూ చేయి అందిస్తూ, “ఇక్కడ నుండి చాలా దూరం వుంది త్రిపురాపురం. దారిలో భయంకరమైన ఆడవుల్లో వారం రోజులైనా నడవాలి.” అన్నాడు.
“ఒకరికొకరం తోడు దొరికాం గనుక అరణ్యంలో కలిసే ప్రయాణిద్దాం.” అన్నాడు పరాక్రముడు.
ఆ తర్వాత, వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ కొద్దిసేపటిలోనే మంచి స్నేహితులుగా మారారు.
“మీరు మీరు” అనుకోడం మానేసి “నువ్వు నువ్వు” అనుకొనేంత చనువును సంపాదించుకున్నారు. అలాగే మాట్లాడుకుంటూ అరణ్యంలో ప్రయాణం సాగించారు.
ఆ రోజుకి సరిగ్గా పన్నెండవ రోజున స్వయంవరం!
* * *
(సశేషం)
7 అభిప్రాయాలు:
dayachesi ikkadito aapeyyandi. parama suthiga undi katha.
అనోనిమస్సుగారూ,
సుత్తి నా కథలో కాదనుకుంటా మీ మనసులో వుండి వుంటుంది. సవరించుకోండి. ఎందుకంటే సుత్తి, విసుగూ, కోపం లాంటి వుద్రేకాలు బాహ్యంలో వుండవు. మన మనసులోనే వుంటాయి. సారీ మీ కోసం కథని ఆపలేను.
అనోనిమస్సు పేరుతో రాసే వారందరి ఒక విన్నపం. అసలు పేరుతో రాయడానికి భయమెందుకు. మీరు చెప్పేది correct ఐతే భయ పడకుండా అసలు పేరు తో రాయండి. ఎవరు ఏమి చేయలేరు. పోలీస్ రిపోర్టు ఇస్తారా?? కోర్ట్లో కేసు వేస్తారా?? ఎందుకంత భయం??
మాంఛి మలుపులో ఆపారు విజయకుమార్,త్వరగా ఆట్టే ఊరించక తక్కుంగల భాగాలు మాకిచ్చేయండి
కృష్ణారావు గారూ,
మీ వ్యాఖ్య అనోనిమస్సు వారిని సపోర్టు చేస్తుందో నన్ను సపోర్టు చేస్తుందో నాకు అర్థం కాలేదు గానీ ఈ అనోనిమస్సులు కూడా వుండాలండీ. లేదంటే బ్లాగరుకి అన్నీ పొగడ్తలే వుంటాయి. ఆపైన కళ్ళు మూసుకుపోతాయి. కృతజ్ఞతలతో. . .
రాజేంద్ర గారూ,
మీరు మొదట్నుండీ నా వెన్నుదట్టి ప్రోత్సహిస్తూనే వున్నారు. మీ ఆదరణకి ఎల్లప్పుడూ ఋణపడి వుంటానని విన్నవించికుంటూ. . .
Good story
Post a Comment