ఒకానొక అజ్ఞానపు క్షణంలో. . . నాకు తెలీకుండా నేనే జన్మించి,  అమ్మ చనుబాలలో ఆది సంవేదన అనుభవించి. . .ఆటపాటలలో అద్వితీయుడనై రాణించి. . .సంఘ విద్యా సముపార్జనలో సారస్వత చక్రవర్తినై, పుస్తకాల్ని పఠించి. . .పరీక్షల్ని పరివీక్షించి. . .ఆత్మజ్ఞాన అవలోకనంలో విలువల వలువలు వూడదీసి. . .విశ్వతత్వాలు స్మరించి. . . మానవ శ్రేయస్సు మహా లక్ష్యమై పోగా. ."ఈ ప్రపంచపు దొడ్డబిడ్డగా ఉద్భవించాల"నీ, "ఒక పూర్తి మానవుడిగా పరిణమించాల"నీ, నేను కంటున్న కల,  కడుతున్న కోట. . .ఒహ్ ఇంతెందుకు కనుచూపు మేరలో. . . నా జీవితం ఒక వేద సంకలనం!!  నేనొక ఈశ్వరుడిని!!! ( ఇది ఈ బ్లాగులోని ప్రసంగి కథలో ఒక పాత్ర మనోభావాలు __ రచయిత )

Saturday, March 29, 2008

మానవ జీవితానికి మహాతాత్పర్యం!

మానవ జీవితానికి మహాతాత్పర్యం!

ప్రాచ్య, పాశ్చాత్య వాజ్ఞయంలో మహోన్నత మానవమూర్తులు ప్రవచించిన ఎన్నో వాదాలూ, ఎన్నో ‘యిజా’లూ, మరెన్నో నిజాలూ మనం చదువుకున్నా, యింకెన్ని నేర్చుకున్నా, మరెన్ని వున్నాయనుకున్నా, తత్వశాస్త్రం యావత్తూ క్షుణ్ణంగా పరిశీలించిన మీదట మనకి కడకి అర్థమయ్యేదీ, మిగిలేది మూడే మూడు వాదనలు. అందులో. . . భగవంతుడున్నాడనే అస్థిత్వవాదం ఒకటి. లేడనే నాస్తికవాదం మరొకటి, ఇంకేదో వుందనే వాదం. . .ఉదాహరణకి హేతువాదం తరహాలో. ఇటువంటివి చాలా మంది చాలా రకాలుగా నిర్వచించారు.

కాగా, ఆధునిక తత్వవేత్తలలో ఒకరైన భారతీయులూ మరియూ తెలుగువారైన కీ.శే. జిడ్డు కృష్ణమూర్తి గారి తత్వం యిటీవలి కాలంలో బాగా ప్రాచుర్యం పొందడమే గాక, యావత్ ప్రపంచాన్నీ ఆ తత్వం ఆలోచింపజేసింది. ప్రభావితం చేసింది. ఆయన తత్వానికనుగుణంగా దేశంలోనూ, యితరత్రా ఎన్నో రచనలూ, మరెన్నో గ్రంథాలూ ఉద్భవించి, వెల్లువెత్తాయనే చెప్పవచ్చు. ఆయన తత్వానికి ప్రభావితులయే కీ.శే. బుచ్చిబాబు గారు తెలుగులో “చివరకి మిగిలేది” గ్రంథాన్ని రచించారనే విషయం ప్రచారంలో వుంది. ఈ రచనలో ఒక పాత్ర ఒక ఖాళీ కవరును కథా నాయకుడి చేత విప్పించడం ద్వారా బుచ్చిబాబు గారు జీవితానికి అర్థం ఏమీ లేదనే విషయాన్ని ప్రస్థావిస్తారు. కానీ బుచ్చిబాబు గారు తన నవల పీఠికలో తన “నవలలోని పాత్రల అభిప్రాయాలన్నీ తను జీవితంలో నేర్చుకున్న పాఠాలుగా భావించవద్ద”ని వేడుకున్నారు. కనుక, ఆయన నవలలోని ఆ పాత్ర ద్వారా చెప్పించిన జీవితానికి అర్థం ఏమీ లేదన్న విషయం బుచ్చిబాబు గారి స్వీయభావనగా మనం పరిగణించరాదు.

ఇదిలా వుండగా, జీవితానికి అర్థం ఏమీ లేదనే వాదన ఈ మధ్య కాలంలో ప్రబలంగా వినపడుతున్నది. ఇలా చెప్పడం, చెప్పుకోవడం గొప్పగానూ, passion గానూ కన్పిస్తున్నది. అసలింతకీ జిడ్డు కృష్ణమూర్తి గారు గానీ, బుచ్చిబాబు గారు గానీ జీవితానికి అర్థం ఏమీ లేదనే వాదనని గానీ, తత్వాన్ని గానీ ఎక్కడ చెప్పారో, ఎప్పుడు చెప్పారో ఎవరికీ తెలీదు. వాళ్ళలా నిర్వచించారని ఎవరైనా అంటే అది సత్య దూరమైన మాట.

నిన్నటికి నిన్న ‘పొద్దు’ పత్రికలో ప్రచురితమైన శ్రీ ఫణీంద్ర గారి ‘కలం కలలు’ బ్లాగు మీద ప్రముఖ బ్లాగరు పప్పు నాగరాజుగారి ‘కలం కలల ఘలం ఘలలు’ అన్న సమీక్షా వ్యాసంలో ఫణీంద్ర గారన్న మాట యిది.

“మానవ అస్థిత్వానికి అర్థం లేదు. అర్థమేదో ఉందన్న అన్వేషణలో మనం పడే నిష్ఫలమైన సంఘర్షణే ఈ అస్థిత్వానికి కడకు మిగిలే అర్థం. అస్థిత్వానికి అర్థమే లేదంటే ఇక మిగిలేది జీవితమంత పొడవైన ఖాళీ; భీతి గొలిపే శూన్యత.”

ఈ మాట శ్రీ ఫణీంద్రగారు ఎందుకన్నారో, ఎటువంటి సందర్భంలో అన్నారో నాకు తెలీదుగనుక, నేను ఆయనను గానీ, మరొకర్నిగానీ తప్పు పట్టేదేమీలేదు గానీ, సరిగ్గా యిటువంటి భావనే యిటీవలి కాలంలో సర్వత్రా వ్యాపించుకుని వుందని చెప్పడానికి ఎంతో విచారిస్తున్నాను. ఇదెంతో బాధాకరమైన భావన. ఈ విషయం సవివరంగా ప్రస్థావించడానికే ఈ వ్యాసంలో ఫణీంద్రగారి మాటలు నేను వాడుకుంటున్నాను.

అసలు కీ.శే. జిడ్డు కృష్ణమూర్తి గారు ఏమన్నారు? “భగవంతుడనే విషయాన్ని ఒకరు మనకి చెప్పడం ద్వారా కాకుండా మనల్ని మనమే ఆత్మశోధన చేసుకోవడం ద్వారా, ప్రపంచ శోధన చేయడం ద్వారా మనమే నిగ్గుదేల్చుకోవలసివుంద”న్నారు. “మనిషి జీవితంలోని మంచిచెడులూ, ఆవేశకావేశాల వంటి మానసికోద్రేకాలనూ మనం తరచి, తరచి చూసి వాటి స్వరూప స్వభావాలను తెలుసుకోవాల”న్నారు. “వాటి స్వరూపం గురించి తెలిసినప్పుడే ఆయా ఉద్రేకాలు మనిషి చెప్పుచేతల్లో వుంటాయనీ, అలాగే, వ్యసనాలూ, వాటి మూలాలూ గ్రహిస్తే, మనం వ్యసనాలకు భయపడాల్సిన అవసరం లేదనీ, వాటంతటవే అంతరిస్తాయ”నీ అన్నారు. అలాగే “దైవం, భగవంతుడు వంటి కల్పిత భావనలు మనిషిలో ఆశను రేకెత్తించి, అతడ్ని పరాధీనుడిగా (dependable) చేసి, భ్రమల్లో వుంచి అతడి భవిష్య జీవితానికి గొడ్డలి వ్రేటుగా పరిణమించి, పాడుచేస్తాయనీ, ఆశ, దాని సంపూర్ణ స్వరూపాన్ని మనం తెలుసుకున్నప్పుడు దానంతటదే నశించి మనిషి భ్రమల్లో బ్రతకకుండా సత్యంతో ప్రత్యక్ష సంబంధం కలిగివుండే చురుకైన వర్తమానంలో జీవించడమే నిజమైన జీవితమ”నీ ఉద్ఘాటించారు.

“ఆలోచన పక్వత చెందినప్పుడు దానంతటదే తన పరిమితులెరిగి సద్దుమణుగుతుందనీ, అప్పుడే ప్రశాంతత సాధ్యమనీ, అటువంటి జీవితంలో అనుభవించేవాడూ, అనుభవించబడేదొటీ అంటూ విభజన వుండదనీ, అనుభవించడం అనే మైమరపు స్థితియే అసలైన జీవితమ”నీ వెలుగెత్తి చాటారు.

“మన కంటికెదురుగా వున్న సత్యాన్ని విస్మరించి, దైవం, భగవంతుడని ఎవరో చెప్పిన అభూత కల్పనలనీ, నమ్మకాలనూ, భావనలను విడనాడి, వర్తమానంలో ప్రతిక్షణం మానవుడు సత్యాన్ని సాక్షాత్కరింపజేసుకోవాలని ఆక్రోశించినారు. మానసికంగా ఏకాకియైన మనిషి (ఇది మనుషులందరికీ వర్తిస్తుంది) సత్యంతో సంబంధం కలిగివుండడం ద్వారా ఏకాకి తనాన్ని గిరవాటు వేయాల”ని ఉద్బోధించినారు.

ఈ ప్రకారం, ఫణీంద్రగారి యిది వరకటి ఈ మాటలను. . .

“మానవ అస్థిత్వానికి అర్థం లేదు. అర్థమేదో ఉందన్న అన్వేషణలో మనం పడే నిష్ఫలమైన సంఘర్షణే ఈ అస్థిత్వానికి కడకు మిగిలే అర్థం. అస్థిత్వానికి అర్థమే లేదంటే ఇక మిగిలేది జీవితమంత పొడవైన ఖాళీ; భీతి గొలిపే శూన్యత.”

ఇప్పుడు, ఈ మాటలకి జిడ్డు కృష్ణమూర్తి గారి తత్వాన్ని మేళవించి సరికొత్త అర్థంతో ఉటంకిస్తాను.

“మానవ అస్థిత్వానికి అర్థం వున్నది. అర్థమేదో ఉందన్న అన్వేషణలో మనం పడే సంఘర్షణే (నిష్ఫలమైనది కాదు. ఇదే చివరకి ఫలిస్తుంది) ఈ అస్థిత్వాన్ని కడకు మనకి తెలుపబోయే సాధనం. అస్థిత్వానికి అర్థం వుందనుకున్నప్పుడు, అసలు అస్థిత్వానికి అర్థం తెలుసుకున్నప్పుడు మిగిలేది జీవితమంతటా పొడవైన నిండుదనమే; భీతికి తావులేని నిండుదనం.”

ఇది అసలు నిజం. మీరేమంటారు?

(ఇది ఎవరినైనా కించపరచాలనో, వివాదాలు సృష్టించడానికో రాసిన వ్యాసం కాదు. మందుకి అలవాటు పడ్డ తాగుబోతుకి "యింక మందు లేదూ, లభించదూ" అంటే జీవితం ఎంత నిరాశాజనకంగా మారుతుందో, అలాగే భగవంతుడి మీద ఆధార పడిన మనిషి "భగవంతుడు లేడ"నే నిజం తెలిసుకున్నప్పుడు నిరాశాపూరితుడిగా, క్రియాశూన్యుడిగా మారకుండా, అసలా నిజం తెలుసుకున్నప్పుడే నిజమైన, నిండైన జీవితం గడపగలడనీ, గడప సమర్థుడనీ, భగవంతుడనే స్థితి లేకపోయినా సత్యంమనబడే అద్భుతమైన స్థితి, వర్తమానం మనకి ఎల్లప్పుడూ వున్నవనీ చెప్పడానికి ఉద్దేశించిన టపా యిది. ఇది నా స్వీయ ఛాదస్తం ఎంత మాత్రమూ కాదు. కాకుంటే శ్రీ పప్పు నాగరాజు గారి సమీక్ష, శ్రీ ఫణీంద్రగారి ఏ కథలోనివో, కవితలోనివో మాటలూ ఈ వ్యాసానికి ప్రేరకాలు)

(సమాప్తం)

3 అభిప్రాయాలు:

Srinivas said...

జీవితానికి అర్థం ఉండి తీరవలసిన అవసరమేమిటో నాకర్థం కాదు. లేనంత మాత్రాన కొంపలేమీ కూలిపోవు. గాలి వొళ్ళు నిమురుతూనే ఉంటుంది. పూలు పూస్తూనే ఉంటాయి. పిల్లలు నవ్వుతూనే ఉంటారు. వీటన్నిటికీ అర్థం లేనంత మాత్రాన అవి కలిగించే ఆనందానికి కొరతేమే ఉండదు.

పరమ సత్యమనేదేదీ లేదన్నదొకటే సత్యం. ఎవరి నిజం వారిది. ఎవరు ఏది నిజమని నమ్ముతారో అదే నిజం; దానికి విరుధ్ధమైనదేదీ తటస్థపడనంతవరకూ, పడినా అది సమర్థనకు లొంగినంతవరకూ.

వింజమూరి విజయకుమార్ said...

అయ్యా శ్రీనివాస్ గారూ,

జీవితానికి అర్థం ఉండి తీరవలసిన అవసరమేమిటో మీకర్థం కాదన్నారు. మీకర్థమైనా కాకపోయినా, జీవితానికి మహత్తరమైన అర్థం వున్నప్పుడు అది లేదని చెప్పుకోవడం మన దౌర్భాగ్యం అని నాకన్పిస్తున్నది. మీరే అన్నారు- గాలి నిమురుతూనే వుంటుంది. పూలు పూస్తూనే వుంటాయి. పిల్లలు నవ్వుతూనే ఉంటారని. అదే నేను చెప్పింది కూడా. అంతటి అందాల్ని ఈ లోకంలో వుంచుకుని, మన ఎదురుగా వుంచుకుని బ్రతుకుకి అర్థం లేదనే నిస్ఫృహలోకి జారుకోడం మహా తప్పిదం. మీరు పరమసత్యం అన్నారు. ఈ సత్యానికీ, పరమసత్యానికీ మధ్య తేడాలు నాకు తెలీవుగానీ వర్తమానంలో మన కంటికి ఎదురుగా ఉన్నది మాత్రం ముమ్మాటికీ సత్యమే. పరమసత్యం. తర్వాత, ఎవరేది నమ్మితే అదేనిజం అన్నారు. ఇది చాలా ప్రమాదకరమైన మాట. హింసను నమ్మేవాడికి హింసే నిజం అంటే మీరంగీకరించి వాడిని సమర్థించగలరా. మనం నమ్మింది సత్యం కాదు. సత్యం అంటే ఒకటే వుంటుంది. ఇరవై నాలుగు సత్యాలుండవు. ఏది నిజమో దాన్ని తెలుసుకుని మనం అనుసరించాలి గానీ మీరన్నట్టు మాత్రం కాదు. కృతజ్ఞతలతో. . .

Anonymous said...

భూమి శ్యాస్వివితం సమస్త భూమినుండి ఉద్భావించి భూమిలో కలిసేవే జీవమున్నంతవరకు మంచినే కోరుకొంటు బతుకడమే మానవ జన్మకు సార్ధకం imam