ఒకానొక అజ్ఞానపు క్షణంలో. . . నాకు తెలీకుండా నేనే జన్మించి,  అమ్మ చనుబాలలో ఆది సంవేదన అనుభవించి. . .ఆటపాటలలో అద్వితీయుడనై రాణించి. . .సంఘ విద్యా సముపార్జనలో సారస్వత చక్రవర్తినై, పుస్తకాల్ని పఠించి. . .పరీక్షల్ని పరివీక్షించి. . .ఆత్మజ్ఞాన అవలోకనంలో విలువల వలువలు వూడదీసి. . .విశ్వతత్వాలు స్మరించి. . . మానవ శ్రేయస్సు మహా లక్ష్యమై పోగా. ."ఈ ప్రపంచపు దొడ్డబిడ్డగా ఉద్భవించాల"నీ, "ఒక పూర్తి మానవుడిగా పరిణమించాల"నీ, నేను కంటున్న కల,  కడుతున్న కోట. . .ఒహ్ ఇంతెందుకు కనుచూపు మేరలో. . . నా జీవితం ఒక వేద సంకలనం!!  నేనొక ఈశ్వరుడిని!!! ( ఇది ఈ బ్లాగులోని ప్రసంగి కథలో ఒక పాత్ర మనోభావాలు __ రచయిత )

Saturday, March 15, 2008

నేనెవరో తెలుసుకోండి!

‘నేనె’వరో తెలుసుకోండి!

నేను నేననుకుంటా. నిజానికి నేను నేనేనా? ఇది అసలు ప్రశ్న.

నా శరీరానికి నేను ఫలానా అని ఓ పేరెట్టుకుంటా. లేదంటే మా పెద్దలు పెట్టిన పేరుని అంగీకరించి, స్వీకరిస్తా. జననావయవాల కనుగుణంగా నేను స్త్రీననో, పురుషుడిననో అభివర్ణించుకుంటా. నా కుటుంబం ఫలానా అనీ, నా ఊరూ యిది అనీ, నా దేశం అది అనీ, నేనున్న గ్రహం . . . ఇలా విభజించుకుంటూ పోతా. నా బంధువులు ఫలానా వారనీ, నా స్నేహితులు ఫలానా వారనీ గుర్తించుకుంటా. నిజానికి నా ఊహలో తప్ప నాకూ నా బంధువులకి మధ్య బంధుత్వమనే గొలుసో, దారమో ఏదీలేదు. అయినా నన్ను నేను మోసగించుకుంటూనే వుంటా. ఎందుకంటే బంధువులు, స్నేహితులు లేకుండా నేను జీవించలేను. నాకు భయం. నేను నేజూసిన దృశ్యాల నుండీ, చదివిన పుస్తకాల నుండీ, విన్న మాటలూ, శబ్దాలనుండీ, స్పృశించిన జ్ఞాపకాలనుండీ, రుచి చూసిన పదార్థాల నుండీ కొంత జ్ఞానం నాలో పోగేశా. నేను పోగేసిన జ్ఞానం ఎంత పోగేసినప్పటికీ అది పరిమితమే. అపరిమితం కానేరదు. ఆ పరిమితమైన పోగేసిన జ్ఞానం లోనుంచి నేను మాట్లాడుతా. నీతులు వల్లిస్తా. ఇది నిజం, యిది అబద్ధం అని సిద్ధాంతాలు చేస్తా. ఇది మంచిదనీ, ఇది చెడ్డదనీ ప్రపంచాన్ని విభజించుకుంటూ పోతా. చెడు అనుకున్నదానికి దూరంగానూ, మంచికి దగ్గరగానూ వుండాలనుకుంటా. ఉన్నా, వుండలేక పోయినా. అలా నాకు చేతనయిన పనుల్లో ఏదో ఒక దాన్ని ఎంచుకుని దాన్ని వృత్తిగా స్వీకరిస్తా. ఆ వృత్తిలో గడుపుతూ సంసార జీవితమో, లేదంటే బికారినై సన్యాస జీవితమో గడుపుతా.

ఇంతవరకూ బాగానే వుంది. ఇక్కడ నుండే అసలు తంటా. నేను నాకే తెలీని కొన్ని పదాలు విన్నా. దేవుడనీ, పరమాత్ముడనీ, ఆత్మ సాక్షాత్కారమనీ, విశ్వరూప సందర్శనమనీ ఏవో మాటలు. అలాగే ఆ దైవాన్ని దర్శించడం కోసం కొన్ని మార్గాలు ఎంచుకున్నా. వాటికి మతాలని పేరు పెట్టుకున్నా. లేదంటే వాటికి సంఘం పేర్లెట్టి చెప్పగా విన్నా. అసలు దైవాన్ని ఎందుకు దర్శించాలీ అంటే దైవాన్ని దర్శిస్తే ఈ ఈతిబాధలుండవట. దుఃఖమనేది అసలుండదట. లేదంటే స్వర్గానికి చేరుతానట. అక్కడ రంభా, ఊర్వశీ, మేనకాదులతో సుఖంగా జీవించవచ్చునట. అందుకోసం నేను దైవాన్ని దర్శించాలట. దైవం అనబడేది అపరిమితమైనదట. దానిని నేను దర్శించడానికి పరిమితమైన ఆలోచన పనికిరాదట. కనుక, నేను ఆలోచనను స్తంభింపజేసినప్పుడే, ఆపుజేసినప్పుడే నేను realize అయినట్టట. అప్పుడే ఆ దైవం నాకు లభ్యమౌతుందట. ఇంతకీ నేనెలా ఆలోచనని ఆపగలను. అసలు ఆపాలనుకోవడమే ఒక ఆలోచనే. ఇది సమస్య.

దీని కోసం కొన్ని మార్గాలు సూచించబడ్డాయి. ధ్యానమనీ, భావాతీత ధ్యానమనీ (ఆలోచనలు లేనిది), Meditation అనీ రకరకాలు. అసలు ఆలోచనని ఆపాలనుకోవడమే ఒక ఆలోచనే. ఇదంతా నాకు చెప్తున్న దెవరు. ఆలోచనే కదా? అటువంటప్పుడు ఆలోచన తన నశింపును తను కోరుతుందా? పరిమితమైన ఆలోచన తను అంతమై అపరిమితమైన బ్రహ్మపదార్థం గురించి నాకు తెలుపగలదా? ఇది అసలు సమస్య! కనుక, నేను realize అవడం అనేది వట్టిమాట. నేనెన్నటికీ realize కాలేను. కాబట్టి, నేనెన్నటికీ బ్రహ్మపదార్థాన్ని గురించి తెలుసుకోలేను.

అయితే ఈ దైవం, ఈ బ్రహ్మపదార్థం, ఈ సత్యం అనేది నాకెప్పటికీ లభ్యం కానిదేనా?

ఈ ప్రశ్నకే సమాధానంగా కాదంటారు పెద్దలు. నువ్వు ఎన్నటికీ realize కాలేవు. ఒకవేళ అయినా నువ్వు ఆలోచనని నియంత్రించడానికి ప్రయత్నిస్తావు. ఎప్పుడైతే ఆలోచనని అణచడం, నియంత్రించడం వుంటుందో అప్పుడది మరింతగా విజృంభిస్తుంది. అప్పుడు నీకూ ఆలోచనకీ మధ్య విభజన వుంటుంది. సంఘర్షణ వుంటుంది. విభజించేదేదీ సత్యాన్ని తాకలేదంటారు పెద్దలు.

కానీ, నీలోని ఆలోచన realize కాగలదంటారు. ఆ ఆలోచన realize అయినప్పుడే సత్యం అనబడేది సాధ్యం అంటారు. అదెలాగంటే యిలా. . .

నిజానికి నేను నేను కాదు. నేనొక ఆలోచన. భావాల, భావజాలాల పరంపర. నేనొక శరీరానికి అనుసంధించబడి వుంటా. (తిరిగి మొదటికొద్దాం) నా శరీరానికి నేను ఫలానా అని ఓ పేరెట్టుకుంటా. జననావయవాల కనుగుణంగా నేను స్త్రీననో, పురుషుడిననో అభివర్ణించుకుంటా. నా కుటుంబం ఫలానా అనీ, నా ఊరూ యిది అనీ, నా దేశం అది అనీ, నేనున్న గ్రహం . . . ఇలా విభజించుకుంటూ పోతా. (యిలా మిగతాదంతా కూడా).

నేను ఆలోచన గనుక, నేను పుట్టేదే నేను పోగుజేసుకున్న జ్ఞానం లోంచి. అంటే గతం లోనుండి. జ్ఞానం ఎంత పోగేసినా ఎన్నటికీ పరిమితమైనదే గనుక ఆలోచన అనబడే నేను ఎన్నటికీ పరిమితమైన దానినే. నిజానికి నేను గతాన్ని. నాకు అనుసంధించబడివున్న శరీరానికి ఒక పేరు పెట్టి, దాన్ని ఈ విశ్వం నుండీ, అఖండ సత్యం నుండీ దాన్ని విభజించినాను. నాలోని అల్పత్వాన్ని దానికి వర్తింపజేసినాను. కనుక, నేను ఎన్నటికీ నేను కాని దైవాన్ని గురించి వివరించలేను. నేను దైవాన్ని గురించి చెప్పినా, వేదాల గురించి చెప్పినా, మరే గురువు గురించి చెప్పినా, యింకో జిడ్డు కృష్ణమూర్తి గురించి చెప్పినా, ఎవ్వరి గురించి చెప్పినా, ఏది చెప్పినా నా వివరణ యావత్తూ దైవం కానిదాని గురించే! నేనిప్పుడు realize అయినాను. నా పరిమితులు నేను తెలుసుకున్నాను గనుక నేను చెప్పేదంతా అసత్యమే. ఎందుకంటే సత్యం అపరిమితమైనది గదా. దాన్ని పరిమితమైన నేను స్పృశించలేను. నేను realize అయినప్పుడు, నేను చెప్పేదంతా అసత్యమని తెలుసుకున్నప్పుడు నేను భగవంతుడి గురించి యిక చెప్పడానికేం లేదు. భగవంతుడి గురించి ఆలోచించడానికేం లేదు. మనిషి వర్తమానంలో వున్నప్పుడు మాత్రమే నా absence వుంటుంది. ఆ సమయంలో మినహా ప్రతి క్షణం నేను మనిషిని సత్యం నుండి దూరం చేస్తూనే వుంటా.

కనుక, పరిణతి చెందిన ఆలోచన తనంతట తానే realize అయి భగవదాన్వేషణ కోసం వత్తిడి చేయదనీ, తనకు తానుగానే సద్దుమణుగుతుందనీ అంటారు పెద్దలు. వర్తమానంలో వున్నప్పుడు మాత్రమే మనిషికి సత్యంతో ప్రత్యక్ష సంబంధం వుంటుందంటారు. దైవాన్ని సాక్షాత్కరింపజేసుకోవాలనో, మరోటో ఆశ వున్నంత కాలం మనిషి దైవానికి దూరంగానే వుంటాడంటారు.

నిజమేనంటారా?

10 అభిప్రాయాలు:

Anonymous said...

బహుశా ఈ ఆలోచనలన్నింటిలో నేను ఏకీభవించేది మోక్షం కావాలనుకోవడం కూడా కోరికేనేమో అనే విషయమే అనుకుంటా.

Naga said...

మొదలు ఈ టపాలోని మీ కృషికి అభినందిస్తున్నాను. "నేను ఆలోచన గనుక.." - ఇది సరి కాదు. నేను ఏమిటి అన్నది పదాలలో చెప్పదలుచుకోలేదు, "అనుభవమే జ్ఞానం" అన్నారు పెద్దలు.

మీరు గురువు లేకుండా స్వయంగా కూచిపూడి నేర్చుకోగలరా? ఎవరి సహాయం లేకుండా తెలుగులో మాట్లాడటం, వ్రాయడం నేర్చుకున్నారా? ఆలోచించండి... మీరు రాసిన ప్రతి అక్షరం, పదం నేర్చుకున్నదే. ఈ బ్లాగులో కూడా మరొకరి సహాయం ఉంది కదా!

రాముడు, కృష్ణుడు, బుద్ధుడు అందరు మొదట ఒక గురువు వద్ద విద్యను అభ్యసించినవారే. ప్రత్యక్ష గురువు లేనిది విద్య లేదు, ప్రపంచాన్ని మరొక్కసారి పరికించండి. అంతా గురుశిష్యుల పరంపర మరియు అనుభవం యొక్క సారమే.

మీరు కూడా ఒక గురువును వెతుక్కొని నేర్చుకోండి. బయటి గురువు లోపలి గురువుకు మార్గాన్ని చూపిస్తాడు. గురువు కావాలంటే మొదట శిష్యుడు కావాలి, అదే ఇందులోని చిట్కా.

వింజమూరి విజయకుమార్ said...

లలిత గారూ,

మోక్షం కావాలను కోవడం వట్టి కోరికే గాదు ఆశ కూడా. ఆశలన్నింటిలోనూ పెద్ద అశ.

వింజమూరి విజయకుమార్ said...

నాగరాజా గారూ,

ముందు మీకు కృతజ్ఞతలు. ఇదేదో నేను అనాలోచితంగా, ఆషామాషీగా రాసిన టపా కాదు. దీని వెనుక చాలా కథే వుంది. మీరన్నట్టు అనుభవం నుండే జ్ఞానం వస్తుంది. అదే ఈ టపాలో నేను చూడడం ద్వారా, వినడం ద్వారా అంటూ జ్ఞానం గురించి చెప్పుకొచ్చాను. మీరన్నట్టు ప్రాపంచిక విషయాలలో అన్నింటికీ గురువు అవసరమే. కానీ నేనిక్కడ ప్రస్థావిస్తున్నది ఆధ్యాత్మిక విషయం గురించి. ఇక్కడ నేనంటున్నది సత్యం అనేది ఎవరికి వారు సాక్షాత్కరింపజేసుకోవలసింది. వేరొక గురువు మనల్ని వేలు పట్టుకుని తీసుకువెళ్ళి భగవంతుడిని చూపించలేరు. అనుభవం ద్వారా, గురువుల ద్వారా, అన్నింటి ద్వారా పండిన ఆలోచన మాత్రమే తన పరిధుల్ని గుర్తెరిగి ఎటువంటి గందరగోళం లేకుండా సరళంగా సద్దుమణుగుతుందని భావించబడుతున్నది. ఆలోచించగలరు.

సత్యసాయి కొవ్వలి Satyasai said...

ఒక క్లిష్టమైన అంశాన్ని స్పృసించే సాహసానికి నా అభినందనలు. టపా ఒకసారి చదివాక అర్ధంకాలేదు. వ్యాఖ్యల సహాయంతో మళ్ళీ ఇంకోసారి చదివా. అర్ధమయ్యీ కానట్లుంది. సత్యాన్వేషణలో గురువు అవసరం లేదంటారు మీరు. అంతేనా. అక్కడే ఇంకా ఎక్కువ అవసరం అని నా భావన. ఈవిషయంలో నాకు తర్కించేంతగా పరిజ్ఞానం లేదు, కొన్ని నమ్మకాలే తప్ప. కానీ మంచి ఆశక్తి కరమైన అంశం లేవనెత్తారు- చర్చ కోసం ఎదురు చూస్తున్నా.

వింజమూరి విజయకుమార్ said...

సత్యసాయి గారికి,

సత్యాన్వేషణ అంటే అది ఒక సాధన చేసే సమయం. ఆ సమయంలో గురువూ, పుస్తకాలూ అన్నీ కావలసినదే. కానీ మనిషి తనుగా ఏ సాధన మార్గాల ద్వారానూ సత్యాన్ని ఆవిష్కరింపజేసుకోలేడనీ, మనిషి లోని అలోచన తనకు తానుగా తన పరిమితులెరిగి అంతరించినప్పుడే అది సాథ్యమనీ చెప్పడం నా ఉద్దేశ్యం. ఆలోచించగలరు. కృతజ్ఞతలతో. .

Anonymous said...

Difficult to understand. How does my thought realise without my involment?

వింజమూరి విజయకుమార్ said...

Anonymous Sir,

Why do you feel that difficult to understand? Kindly see.

There is no such a thing as your’s thought. There is only the thought, absolutely the thought, not your’s.

What am I describing is if you realise, you want to stop the thought. You try to dominate and to overcome the thought. Then there is an effort and activity can arise. The issue becomes complicated. Where there is a self activity there is no god, only the thought can exist.

If the thought, which is old, past, ancient, Historical and evaluated from lakhs of years, can realize, it knows the limitations of it’s and itself. Then there no domination and other activity, because all the dominations and activities are thought cultivated things. Now, the thought has realized and known that what it is. Then, it does not create it’s self aggressiveness and own complication. It will be calm, quite and cooled. When there is no activity, then there will be something.

Did you understand?

బృహఃస్పతి said...

"నిజానికి నా ఊహలో తప్ప నాకూ నా బంధువులకి మధ్య బంధుత్వమనే గొలుసో, దారమో ఏదీలేదు" ఈ మధ్య కాలంలో చదివిన అద్భుత ప్రయోగం. ఎవరూ స్పృసించని, ఈ విధమైన సరికొత్త అంతర్మధనాలని ప్రచురిస్తూ ఉండండి. ఎంత మంది విభేదిస్తే ఆంతమందిని ఆలొచింపజేసినట్లు...

Anonymous said...

నేను అనేదిలేకుంటే ఆలోచనలు ఆగుతాయా జీవించి వున్నంతవరకు ఆగవుగాక ఆగవు ఐతే చెడు ఆలోచనలకు తావు ఇవ్వకుంటే ఆనందమే దొరుకుతుంది imam