అహంకారి (కథ)...3
(భార్యాభర్తల మధ్య సున్నితమైన మానసిక సంబంధాల మీద అల్లబడి, జూన్ నెల 'పొద్దు' ఇంటర్నెట్ పత్రికలో ప్రచురించబడిన నా కథ)
అహంకారి (కథ)...3
సురేఖ విచిత్ర విడాకుల ఉదంతం విని నేను నిర్ఘాంతపోయాను.
మానవ సంబంధాలు, విలువలలోని ఔచిత్యం, సున్నితత్వం గురించి నేను తెలీనివాడ్ని కాదు. అయినా సురేఖ వైవాహిక జీవితం పరిశీలించాక నాకవన్నీ మళ్ళీ మరింత విశదంగా భోదపడినట్టయింది. మనం తప్పు చేయకపోవడం పెద్ద గొప్పనుకుంటాం. కానీ కాదు. ఆవతలి వ్యక్తులు మన చర్యలకి ఏ విధంగా స్పందిస్తున్నారో, ఏ విధమైన బాధననుభవిస్తున్నారో గ్రహించుకుని మసలుకోవడం అంతకన్నా గొప్పగా, ముఖ్యంగా నాకు తోచింది.
అంతలోనే సురేఖ, “ఇప్పుడు చెప్పు. నేను చేసింది తప్పంటావా?” అంది. ఆపైన, పక్కకి తొలగిన చున్నీని వతైన ఛాతీ మీదికి లాక్కుంది.
నేనామె ప్రశ్నకి సమాధానం యివ్వకుండా, “ఇంతకీ ఏ కారణాలతో అంటే ఏ ‘గ్రౌండ్స్’ ని ఆధారం చేసుకుని యిచ్చింది నీకు కోర్టు విడాకులు?” అన్నా.
“ఏదో! చెత్తాచెదారం. అన్నీ అబద్దాలే. ఆ లాయరు చెప్పమన్నవన్నీ కోర్టులో చెప్పాను. మొత్తం మీద సుబ్బారావుని చేయకూడనంతటి దోషిని చేస్తేనే వచ్చాయి విడాకులు.” అందామె బాధగా.
ఎవరో పనిగట్టుకుని తీర్చిదిద్దినట్టుండే సురేఖ మృదువైన పెదాలు అసత్యాలు పలికి, అసలుని నకిలీ చేయడం నాకు నచ్చలేదు. అందుకే__
“సుబ్బారావుని దోషిని చేయడం నీకు తప్పనిపించలేదూ?” అడిగాను.
“అనిపించింది. కానీ అలా అనుకుంటూ పోతే నాకు విముక్తి లభించదే. అయినా నాకు తెలిసిందొక్కటే. ముందు నా జీవితం నాకు ముఖ్యం. నా మనసు__ దాని బాగోగులు__ దానికి నొప్పి కలుగకుండా చూసుకోవాల్సిన బాధ్యత, నాదేనని నా ప్రగాఢ నమ్మకం. నా జీవితానికీ, నా మనసుకీ, సుబ్బారావు బాధలతో నిమిత్తం ఉందని నేననుకోను. ఇక మా బాబు జీవితం అంటావా? వాడికేం? సుబ్బారావు జీవించివున్నంత కాలం వాడికేలోటూ వుండదు!” అంది నమ్మకంగా.
“పోనీ, నువ్వు ప్రపంచానికి సుబ్బారావుని దోషిగా చూపడం అతడికి కోపం తెప్పించలేదా?”
“లేదు. కోర్టు విడాకులకు అనుమతిచ్చిన రోజు రాత్రి సుబ్బారావు మా యింటికొచ్చాడు. నన్ను పట్టుకుని పసివాడిలా వలవలా ఏడ్చాడు. నేను లేకుండా జీవించలేనన్నాడు. తన బిడ్డని తల్లిలేనివాడిగా చేయొద్దని వేడుకున్నాడు.”
“నువ్వేమన్నావు?”
“అతడ్ని కోర్టుకీడ్చి విడాకులు సంపాదించిన దాన్ని ఏమంటాను? కుదరదన్నాను. విసిగించకుండా వెళ్ళమన్నాను. ఏం చేయగలడు సుబ్బారావు? అలాగే ఏడుస్తూనే, బాబుని భుజాన వేసుకుని వెళ్ళిపోయాడు. బాబు కూడా వెళ్తుంన్నంతసేపూ నన్ను చిత్రంగా చూస్తూనే వున్నాడు. ఆ దృశ్యం చూసి నా కడుపు తరుక్కుపోయింది. ఆ తర్వాత, రెండురోజులపాటు ఏడుస్తూనే గడిపాను.” అంది సురేఖ. ఆమె కళ్ళలో కన్నీరు పొంగింది. మళ్ళీ తనే __
“చెప్పు! నేను చేసింది తప్పేనంటావా?” అడిగింది.
ఆమెకి తన ప్రవర్తన కొంత అనిశ్చితికి గురిచేసినట్టుంది. తన ప్రవర్తనలోని మంచిచెడుల్ని నిగ్గుదేల్చుకునేటందుకు ఆమె నా అభిప్రాయానికి స్వాగతం పలుకుతూ, ఆతృత కనబరుస్తోంది. ఎందుకంటే సురేఖ దృష్టిలో నేనొక పరిణతి చెందిన వ్యక్తిని. అందుకే __
“ఏం చెప్పను సురేఖా. కవితలల్లీ, రచనలు చేసీ, విలువలేమిటో కళాత్మకంగా పదిమందికీ వివరించగలదానవు. మనసు కష్టపెట్టుకోడం తప్పని తెలుసుకునే స్థాయికి ఎదిగిన స్త్రీవి. మనసు__ దాని పరిమితులెరిగిన వాడిగా నీకు తప్పుని ఆపాదించలేను. అలాగని, జీవితం ప్రాక్టికాలిటీతో, జీవించడంలో వున్న సౌందర్యంతో అంతటి నీ కళాహృదయాన్ని సైతం అథః పాతాళానికి తొక్కేయగలిగిన సుబ్బారావు క్రమశిక్షణనూ నేను తప్పు పట్టలేను.” అన్నా.
సురేఖ మాట్లాడలేదు. కానీ, నా మాటలు చాలా శ్రద్ధగా ఆలకిస్తోంది.
మళ్ళీ నేనే__ “వ్యక్తులు విప్పిచెప్పుకోలేని తప్పొప్పుల్ని కాలం, భవిష్యత్తూ విశదపరుస్తాయంటారు. చూద్దాం. అంతవరకూ మనం వేచివుండక తప్పదు.” అంటూ వెళ్ళడానికన్నట్టు లేచాను.
* * *
ఓ ఏడాది గడిచింది.
మళ్ళీ సురేఖ నుండి అర్జంటుగా విజయవాడ రమ్మని నాకు ఫోనొచ్చింది. ఏదో ఒక విశేషమైన పని లేనిదే సురేఖ నన్ను విజయవాడ రమ్మనదు. ఉన్నఫళాన బయలుదేరి విజయవాడ చేరా. సురేఖని వాళ్ళింట్లో కలుసుకున్నా.
నేను వెళ్ళేసరికి సురేఖ మంచమీద పడుకుని వుంది. ఎప్పుడూ లేనిది ఆమె ఈసారి చీర కట్టుకుని వుంది. ఏదో సుస్తీ చేసిన దానికి మల్లే ఆమె శరీరం నీరసంగా వుంది. నన్ను చూడగానే మంచంమీంచి బలవంతంగా లేవలేనట్టుగా లేచి కూర్చోబోయింది. ఆమె వాలకంలో ఏదో కృత్రిమత్వం తోచి నేను వలదని వారించాను. ఆమె మళ్లీ పడుకుంది. అంత నీరసంలోనూ నన్ను చూసిన ఆనందం ఆమె ముఖంలో కన్పిస్తూనే వుంది. మొదటగా__
“బావున్నావా?” అంది. పమిటని గుండెలమీదికి సర్దుకుంటూ.
“బాగానేవున్నా.” అన్నా.
“బానేవుంటావులే. కష్టాలు పడను నన్ను కట్టుకోలేదుగా.” విషాదంగా నవ్వింది.
“ఏంటా మాటలు. అసలేమయింది నీకు?” అన్నా.
“ఏమవుతుంది? నువ్వప్పుడో మాటన్నావు గుర్తుందా? మనుషులు తేల్చుకోలేని సమస్యలు భగవంతుడే తేలుస్తాడని---గుర్తుందా?” అంది సురేఖ. స్వేదంతో ఆమె శరీరం తడిసింది. జాకెట్టుకీ, చీరకీ మధ్యభాగంలోని నడుము భాగం రెట్టింపు కాంతితో నాజూగ్గా కన్పిస్పోంది.
“భగవంతుడని నేననలేదు. కాలం అన్నాను.” అన్నా.
“ఏదో ఒకటిలే. అదిప్పుడు తెలిసొచ్చింది నాకు.” అందామె.
“ఏమైంది నీకు?” అడిగా భయంగా.
“పాపిష్టిదాన్ని నాకేమవుతుంది? సుబ్బారావుకే పాపం మూత్రపిండాలు దెబ్బతిన్నాయి. నావల్ల ఎంత వేదన అనుభవించాడో ఏమో?” కన్నీరు ఆమె కనతలమీది నుంచి చెవులమీదికి కారుతోంది.
నేను చలించిపోయా. “మూత్రపిండాలెందుకు దెబ్బతిన్నాయి సుబ్బారావుకి?” అన్నా అసంకల్పితంగానే.
సురేఖ మళ్ళీ నవ్వింది. “ఆర్నెళ్ళ పసివాడికి కాన్సర్ ఎందుకొస్తుందంటే ఏం చేపుతావు? సుబ్బారావు కూడా పసివాడే కదా! అందుకే వచ్చుంటుంది.” అంది కాళ్ళు ముడుచుకుని. చీరని పాదాలమీదికి లాక్కుంది. పాలవంటి ఆ తెల్లటి పాదాల దగ్గర బంగారు రంగు పట్టీలు మెరుస్తున్నాయి.
“అయితే ఏమంటున్నారు డాక్టర్లు?”
“ఏమన్నారు? అతడు బ్రతకడానికి మూత్రపిండం కావాలన్నారు. ఎవరిస్తారు సుబ్బారావుకి. అందుకే నేనే యిచ్చా.” అంది సురేఖ.
“నువ్విచ్చేవా మూత్రపిండం సుబ్బారావుకి?” బాధగానూ, ఆశ్చర్యంగానూ అడిగా.
“మరి నేనతడి దేవతని కదా నేనివ్వక మరొకరినివ్వనిస్తానా?” అని, మళ్ళీ తనే స్వగతంలో అనుకుంటున్నట్టుగా, “సుబ్బారావు ప్రేమని సంపాదించగలిగిన నేనెంతటి ధన్యురాలిని?” అంది.
“అయితే యిప్పుడెలా వుంది?” అన్నా ఆతృతగానే.
“ఆయనకేం మహారాజు. వెంటనే కోలుకున్నాడు. నాకే గ్యారంటీ లేదన్నారు డాక్టర్లు.”
“ఏమన్నారు?” శరీరం గగుర్పాటు చెందగా ప్రకంపించిపోతూ అడిగాను.
“బ్రతకనన్నారు. చూసేవా? కంటి ఆపరేషన్ లో నెగ్గుకు రాగలిగేను గానీ ఇక్కడ ఓటమి తప్పలేదు.”
నా చిరకాల నేస్తం మృత్యువు పాలవబోతుందన్న విషయం నన్ను నిర్వీర్యుడ్ని చేసింది. శోకోన్మత్తత నా శరీరాన్ని ముప్పిరిగొనగా నేనామె తల దగ్గర కూర్చుని ఆమె నుదుటిమీద చెయ్యేశా.
సురేఖ నవ్వింది. “చూశావా! నీలో ప్రేమని ఈనాటికి నాతో చెప్పుకోగలిగావు.” అంది__ నా చేతిని తన రెండు చేతుల్తో ఆప్యాయంగా పట్టుకుంది.
నేను నాచేతిని గబుక్కున లాక్కోబోయి, ఏదో అనుమానం వచ్చినవాడిలా ఆమె కళ్ళలోకి చూశాను.
“నీ ప్రేమ గురించి నాకు తెలుసు. నా ఈ శరీరం మీద నీకున్న వ్యామోహం, ఆకర్షణ ఎంత బలమైనవో కూడా నాకు తెలుసు.” అంది సురేఖ.
కన్నీరు తుడుచుకుంటూ ఆమె వైపు చిత్రంగా చూశా.
“నిజమే. ఓ పదినిముషాలపాటు ఈ శరీరాన్ని నీకు అర్పించుకునివుంటే ఈ ప్రపంచానికేం నష్టం. నాకూ పోయేదేముందిగానీ, ఆ పని చేయను ఈ శరీరం మీద నాకేం అధికారం వుందని. ఈ శరీరం నాదీ నీదీ కాదు. సుబ్బారావుదే!” అంది మళ్ళీ కన్నీరు పెట్టుకుంటూ.
నేనేమె వైపు నిశ్చలంగా చూస్తున్నాను.
“కోర్టులకెళ్ళి మంచోళ్ళతో విడివడిపోవడమే తెలుసుగానీ మొద్దుమాలోకం ఈమెకేం తెలుసు ప్రేమ గురించి అనుకుంటున్నావు. కదూ?” తల పక్కకు వాలుస్తూ ప్రశ్నించింది. మెడ ప్రక్కన పుట్టుమచ్చ ఆమెమీది ప్రేమతో అక్కడే ఆమె చర్మాన్ని కౌగిలించుకుని అందంగా కన్పించసాగింది.
‘కాద’న్నట్టు తలూపాను. అంతటి బాధలోనూ.
“నిజంగానే నాకు తెలీదు. పెళ్ళయినాక సుబ్బారావే చెప్పాడు ఒకరోజు. నీ కళ్ళూ, నీ చూపులూ, నన్ను ఆరాధించే తత్వం కలిగివుంటాయట. నువ్వు కూడా తనలాగే నా భక్తుడివట. భర్త ఎవరైనా భార్యకట్లా చెపుతాడా? అంతటి ఉదార హృదయుడూ, మంచివాడూ, తెలివైనవాడూ సుబ్బారావు.” అంది.
అంత విషాదంలోనూ నేను దిగ్భ్రాంతికి గురయ్యా.
సురేఖ మాట్లాడుతూనే వుంది.
“చూశావుగదూ? ఎన్ని కన్నీళ్ళు పెట్టించాను సుబ్బారావు చేత! అవన్నీ యిప్పుడు నన్ను చుట్టుముట్టాయి” అంది-- కన్నీటిని వ్రేలితో తొలగిస్తూ.
పశ్ఛాత్తాపంలో ప్రక్షాళన పొంది ఆమె కన్నుల నుండి జాలువారుతున్న అశ్రుధారలు అవి. నాకెందుకో అవి నాకలా అన్పించలా. పవిత్ర తీర్ధంలా తోచాయి.
“నేను సుబ్బారావుతో విడిపోయినందుకు పశ్ఛాత్తాపపడుతున్నా ననుకుంటున్నావు నువ్వు. లేదు. ఆ విషయంలో నేనెప్పటికీ వెనక్కిచూసుకోడమనేది లేదు. స్త్రీ అనే పదం యిక్కడెందుకుగానీ, వ్యక్తిగా అతడితో సంబంధం వదులుకుని నేను నా ఆత్మగౌరవం కాపాడుకున్నాననే భావిస్తా. మరి ఈ ప్రేలాపన, ఈ మూత్రాపిండాల దానం యివన్నీ ఎందుకంటావా? మానవత్వంగల మనిషిగా నా క్షేమంకోసం పరితపించిన సుబ్బారావు మీద నాకు అచంచలమైన భక్తి. అలాగే దయ కూడా” సురేఖ దుఃఖాన్ని నిగ్రహించుకుంది. “అన్నట్టు నిన్నెందుకు పిలిపించానో తెలుసా?” అడిగింది.
“తెలీదు.” అన్నా.
“సుబ్బారావుకి ఆపరేషన్ సక్సెస్ అయింది. అతడు బతుకుతాడు. నాకు తెలుసు. కానీ, ఒకవేళ దురదృష్టం వెన్నాడి అతడికేదైనా అయితే. . .?” సురేఖ కంఠం దుఃఖంతో పూడుకుపోయింది.
“ఏదైనా అయితే బాబు బాధ్యత నన్ను తీసుకోమంటావు. అంతేకదా?” అనడిగా.
“అంతేగాదు. బాబు పేరు కూడా మార్చాలి నువ్వు.”
“అలాగే. ఏం పేరు పెట్టమంటావు చెప్పు.” అన్నా. వంగి, అనునంయంగా ఆమె తలమీద చెయ్యేస్తూ.
“ఇంకేం పెడతావు? సుబ్బారావని పెట్టు. అంతకుమించిన అందమైన పేరు తెలుసా నాకీ లోకంలో. తండ్రి గుణంలో సగం లక్షణాలొచ్చినా చాలు. మెరుపులా బ్రతికేస్తాడు నా బాబు.” అంది సురేఖ నా చేతిని తన చేతిలోకి తీసుకుంటూ.
“అలాగే. సురేఖా!” అన్నా__దుఃఖోద్విగ్నుడనై ఓదార్పుగా ఆమె చేతుల మీద నేను చేయ్యేస్తూ.
క్షణం తర్వాత సురేఖ మళ్ళీ, “నేను ఇతివృత్తం చెబితే కథ రాస్తానంటావుగా. ఇప్పుడు రాయి కథ” అంది.
ఆమె చెప్పబోయేదేమిటో నాకు తెలుసు. అందుకే నేను మాట్లాడలేదు.
మళ్ళీ సురేఖే అంది. “నా బ్రతుకే నీ కథకి ఇతివృత్తం. రాయి. బహుశా మంచి కథవుతుందనుకుంటా” అటువేపు తిరిగి కన్నీరు విడిచింది.
నేను మళ్ళీ మాట్లాడలేదు. ఎందుకంటే ఆమె మాట నాకేమీ తప్పుగా అన్పించలా. నిజంగానే జీవితాన్ని కథకి కావలసినంత అతిశయంతో నింపుకుంది సురేఖ. కాదంటారా?
(నా కథలు చదివి, అభినందించి, నన్ను ప్రోత్సహించి, ఆరు సంవత్సరాల తర్వాత మళ్ళీ నాచేత కథ రాయించిన “కల్హార” బ్లాగు రచయిత్రి ‘స్వాతి’గారికి కృతజ్ఞతలతో¬__రచయిత)
( సమాప్తం )