ఒకానొక అజ్ఞానపు క్షణంలో. . . నాకు తెలీకుండా నేనే జన్మించి,  అమ్మ చనుబాలలో ఆది సంవేదన అనుభవించి. . .ఆటపాటలలో అద్వితీయుడనై రాణించి. . .సంఘ విద్యా సముపార్జనలో సారస్వత చక్రవర్తినై, పుస్తకాల్ని పఠించి. . .పరీక్షల్ని పరివీక్షించి. . .ఆత్మజ్ఞాన అవలోకనంలో విలువల వలువలు వూడదీసి. . .విశ్వతత్వాలు స్మరించి. . . మానవ శ్రేయస్సు మహా లక్ష్యమై పోగా. ."ఈ ప్రపంచపు దొడ్డబిడ్డగా ఉద్భవించాల"నీ, "ఒక పూర్తి మానవుడిగా పరిణమించాల"నీ, నేను కంటున్న కల,  కడుతున్న కోట. . .ఒహ్ ఇంతెందుకు కనుచూపు మేరలో. . . నా జీవితం ఒక వేద సంకలనం!!  నేనొక ఈశ్వరుడిని!!! ( ఇది ఈ బ్లాగులోని ప్రసంగి కథలో ఒక పాత్ర మనోభావాలు __ రచయిత )

Tuesday, September 16, 2008

ఆహంకారి (కథ)...1

(సునిశితమైన భార్యాభర్తల సంబంధాల మీద అల్లబడి, జూన్ నెల 'పొద్దు'ఇంటర్నెట్ పత్రికలో ప్రచురించబడి, ప్రశంసలు పొందిన నా కథ)
అహంకారి (కథ)
___ వింజమూరి విజయకుమార్

“నేను సుబ్బారావుకి విడాకులిచ్చేశాను.” అంది సురేఖ నాతో ఫోన్లో.

నాకు మొదట్లో అర్థంగాక, “ఏమిటీ నువ్వన్నది?” అన్నాను.

“నేను సుబ్బారావుతో డైవోర్స్ తీసుకున్నానని చెబుతున్నా.” అంది సురేఖ మళ్ళీ__కంఠస్వరం పెంచి.

నేను దిగ్భ్రాంతి చెందాను. నాలుగు క్షణాలపాటు మౌనంగా వుండిపోయా.

ఆపైన, “ఎందుకు. ఏమైంది?” అన్నా అతృతగా.

“అవన్నీ ఫోన్లో చెప్పేవిగాదు. నువ్వు వీలయినంత త్వరగా విజయవాడ వచ్చెయ్. నీతో మాట్లాడాలి.” అంది సురేఖ.

“వస్తాలేగానీ, ముందు ఏమైందో చెప్పు?” అన్నా మళ్ళీ.

“ఫోన్లో చెప్పేవి కాదన్నానా? నువ్వు ఇక్కడకి రా ముందు.” ఆమె ఫోన్ పెట్టేసింది.

సురేఖ నోటి నుండి ఈ విడాకుల ఉదంతం తెలుసుకున్నప్పుడు నేను దిగ్భ్రాంతి చెందినమాట నిజంగా సత్యమే. ఎందుకంటే సురేఖ జీవితాన్ని చేజేతులా పాడుజేసుకునే వ్యక్తి కాదు. అంటే దీనర్థం సురేఖ ఎంతటి ప్రతికూల పరిస్థితిలోనైనా నెగ్గుకు రాగల సూక్ష్మగ్రాహ్యత గల స్త్రీయనే గానీ, భర్తతో విడాకులు తీసుకునే వాళ్ళంతా బ్రతుకుని చేజేతులా పాడుజేసుకునే వాళ్ళని కాదు.

విజయవాడలో ‘మెడిసిన్’ చేస్తున్నప్పుడు సురేఖ నా క్లాస్ మేటు. మంచి స్నేహితురాలు. అందరు ఆడపిల్లలకి మల్లే సురేఖ సాదాసీదా వ్యక్తి కాదు. విశిష్టమైన రూప సంక్లిష్టాన్ని జన్మతః వెంటదెచ్చుకున్న స్త్రీమూర్తి. జిలుగురంగులతోనూ, వంపుగీతలతోనూ స్త్రీల శరీర భంగిమలనూ, చక్కదనాల ముఖాల చిత్రికలనూ రవివర్మ ఎంత శ్రమకోర్చి రచించినా, వాటిలో జీవాంశమైన ప్రాణం లేకపోవడంవల్లనేమో వాటితో సమానంగా సురేఖ రూపచందాల్ని పోల్చడానికి నాకెందుకో మనసొప్పేదిగాదు. అందుకే నేనామెకి బ్రిటీష్ యువరాణితోనూ, మొగల్ మహరాణితోనూ పోలికపెట్టేవాడిని.

నేనన్నట్టే సురేఖ నిజంగా ఇక్కడి లోకపు వ్యక్తిగాదు.

ఎందుకంటే ఆమె నడవడికలో ఒక విధమైన రాజసం ఎప్పుడూ వెన్నాడుతుండేది. అది నిరంతరం నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తుతూనూ వుండేది.

ఇప్పుడైతే నేను వృత్తిరీత్యా హైదరాబాదులో జీవించవలసివచ్చింది గానీ__ నాదీ, సురేఖదీ స్వస్థలం విజయవాడే. ఆమెతండ్రి దేవాదాయశాఖలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు. తల్లి యింటిపట్టునే వుండేది. సురేఖ ఒక్కగానొక్క కూతురు గనుక సహజంగానే గారాబంలో పెరిగింది.

వాళ్ళకి ఓ కారు వుండేది. ఆ కారులో నన్ను కూర్చోబెట్టుకుని సురేఖ విజయవాడంతా కలియదిరిగేది. తక్కువగానే మాట్లాడినా ఆమె మాటలు ఒక తరంనాటి మానసిక పరిణతిని కలిగివుండేవి. కవిత్వమూ, కథలూ రాసేది. అవన్నీ నాకు విన్పించేది. నన్నూ రాయమని బలవంతపెట్టేది. “ఇతివృత్తం నువ్వు చెప్పాలేగానీ, కథ రాయడం నాకో పనికాద”ని సరదాగా నవ్వుతూ, ఆమె మాటలు కొట్టిపడేసేవాడిని. నాతో ఎంత చనువుగా ఉన్నప్పటికీ, కార్లో మేం ఎన్ని షికార్లు కొట్టినప్పటికీ రోడ్డు ప్రక్కన ఏ కొబ్బరినీళ్ళో, కూల్ డ్రింకో తాగి సరిపెట్టేదే గానీ, సురేఖ ఏనాడూ నాతో కలసి కనీసం కాఫీ హోటల్ వరకైనా వచ్చి ఎరగదు. ఆమె అభీష్టానికి భిన్నంగా నడుచుకోవడం నాకూ రుచించేది కాదనుకుంటా. నేనూ అటువంటి చవకబారు వేషాలకు ఆమెను బలవంతపెట్టేవాడిని కాదు. నాలోని ఈ లక్షణం కూడా మా స్నేహం బలీయమవడానికి ఒక ప్రధాన కారణమనుకుంటా.

ఆమె మాటలతో తర్కిస్తూ, ఆమె సౌందర్యాన్ని అవలోకిస్తూ ఆమెతో నా చెలిమిని ‘మెడిసిన్’ పూర్తయేంతవరకూ సాఫీగానే సాగనిచ్చా. అంతలోనే మా చదువు పూర్తవడం, ఏదో ప్రళయకాలం ముంచుకొస్తున్నట్టు సురేఖ తల్లిదండ్రులు, సాప్ట్ వేర్ ఇంజనీరు సుబ్బారావుతో ఆమె పెళ్ళి జరిపించేయడం రెండూ జరిగిపోయాయి.

సురేఖ ఈ అకస్మాత్తు వివాహం నన్ను కృంగదీసిందనే చెప్పాలి. స్నేహితురాలి లోటు బాగానే తెలిసొచ్చింది. అయినా కాలం బలీయమైనది. మరపు మహత్తరమైనది. ఏడాది తిరగకుండానే నేనూ గాయత్రిని పెళ్ళి చేసుకోవడం, హైదరాబాదుకి మకాం మార్చి ఓ కార్పొరేటు హాస్పిటల్ లో ఉద్యోగం సంపాదించి, అక్కడే స్థిరపడిపోవడం అంతా జరిగిపోయింది.
పెళ్ళయినంత మాత్రాన సురేఖ నన్ను మర్చిపోలేదు. వారానికోసారైనా సురేఖ, సుబ్బారావులిద్దరూ నన్నూ, గాయత్రినీ పలుకరించి, పరామర్శించేవారు. పెళ్ళయిన ఏడాదికే వాళ్ళకి ఓ బాబు పుట్టాడు. వాడికిప్పుడు నాలుగేళ్లు.
అయినా, ఐదేళ్ళ సంసార జీవనం గడిపాక కూడా సురేఖ, సుబ్బారావుతో విడిపోవడం నా ఊహ అందుకోలేని విషయం. ఎందుకంటే, సురేఖది సరళమైన జీవితం. ఆ జీవితం యింత పెద్ద మలుపు తీసుకోవడానికి సురేఖ అనుమతించదు. అయినా ఆమె జీవితంలో ఈ వైచిత్రికి చోటు దొరకడం ఏమిటో నాకు భోదపడలేదు.

ఏమైనా, ఆ తెల్లవారే విజయవాడ వెళ్ళదలచుకున్నా.

* * *

(సశేషం )

2 అభిప్రాయాలు:

బ్లాగాగ్ని said...

మాష్టారూ, కుశలమా! చాలా రోజుల తర్వాత కనిపించారే. కథ రెండో భాగం కోసం ఎదురుచూస్తుంటాను.

Anonymous said...

బ్లాగాగ్ని గారూ,

బాగున్నానండి. మరి మీరు? ఏదో కొద్దిగా పనుల వత్తిడి వల్ల టపాలకి దూరంగా ఉన్నా. ఇదిగో ఇప్పుడే వేశా పోస్టులో అహంకారి రెండో భాగం. చదవండి. కృతజ్ఞతలు.