ఒకానొక అజ్ఞానపు క్షణంలో. . . నాకు తెలీకుండా నేనే జన్మించి,  అమ్మ చనుబాలలో ఆది సంవేదన అనుభవించి. . .ఆటపాటలలో అద్వితీయుడనై రాణించి. . .సంఘ విద్యా సముపార్జనలో సారస్వత చక్రవర్తినై, పుస్తకాల్ని పఠించి. . .పరీక్షల్ని పరివీక్షించి. . .ఆత్మజ్ఞాన అవలోకనంలో విలువల వలువలు వూడదీసి. . .విశ్వతత్వాలు స్మరించి. . . మానవ శ్రేయస్సు మహా లక్ష్యమై పోగా. ."ఈ ప్రపంచపు దొడ్డబిడ్డగా ఉద్భవించాల"నీ, "ఒక పూర్తి మానవుడిగా పరిణమించాల"నీ, నేను కంటున్న కల,  కడుతున్న కోట. . .ఒహ్ ఇంతెందుకు కనుచూపు మేరలో. . . నా జీవితం ఒక వేద సంకలనం!!  నేనొక ఈశ్వరుడిని!!! ( ఇది ఈ బ్లాగులోని ప్రసంగి కథలో ఒక పాత్ర మనోభావాలు __ రచయిత )

Saturday, October 6, 2007

జీనో పేరడాక్స్ లూ – పూర్వపక్షం!..1

(కడచిన 2400 సంవత్సరాలుగా తత్వవేత్తలను తికమక పెడుతున్న ఈ ‘జీనో’ అనబడే ఒక మేధావియైన గ్రీకు తత్వవేత్త పేరడాక్సుల్ని ఒక మామూలు ఆంధ్ర కథా రచయితనైన నేను పూర్వపక్షం చేయబూనడం తత్వశాస్త్రంతో పరిచయమున్నవారికి హాస్యాస్పదంగా అన్పించవచ్చు. అయినప్పటికీ నాకు తెలిసిన, నేను విశ్వసించిన ఈ ప్రయత్నం నేను మానుకోబోను. నేనీ పేరడాక్సుల్ని పూర్వపక్షం చేయగలిగినా, చేయ విఫలమైనా కనీసం వాటిని స్పృశించ సాహసిస్తున్నాను. ఈ ప్రయత్నంలో నేనెంత వరకూ కృతకృత్యుడనయ్యానో చెప్పవలసింది మీరే!)

జీనో పేరడాక్స్ లూ – పూర్వపక్షం!

జీనో పేరడాక్సుల్ని యథాతథంగా నేను ఆంగ్లంలో కానీ మరే యితర భాషలలోగానీ చదవడం జరగలేదు. ఈ వ్యాసం కేవలం శ్రీ నండూరి రామమోహనరావు గారి విశ్వదర్శనం (పాశ్చాత్య తత్వ మీమాంస) గ్రంథ ప్రధమ ప్రచురణ, ఆగష్టు 1988 ఆధారంగా వ్రాయబడుతోంది.

గ్రీకు తత్వవేత్తలలో ముఖ్యుడైన నిరంతర పరివర్తనవాది హెరాక్లిటస్ (క్రీస్తుపూర్వం 535-475) “విశ్వంలో స్థిరమైనది ఏదీ లేదు. ప్రతిదీ మరొక దానిగా మారిపోతున్నది. మార్పునకు లోనుగాని వస్తువంటూ లేదు. అన్నీ చలిస్తూ మారిపోతూ వుంటాయి. ప్రపంచం నిరంతర పరివర్తనశీలం. మారనిది మార్పు ఒక్కటే.” అన్నాడు.

ఆ తర్వాత వాడైన పారభౌతిక తాత్వికుడు పార్మెనిడీజ్ (క్రీస్తుపూర్వం 540-470) “ప్రపంచంలో మార్పు లేనేలేదు. ఏదీ మారదు. మారుతుందని అనుకోవడం భ్రమ.” అన్నాడు. పార్మెనిడీజ్ సిద్ధాంతాలు సమకాలికులలో గొప్ప సంచలనం కలిగించినవని, ముఖ్యంగా పితాగరస్ అనుయాయులు వాటిని ఖండించడానికి ప్రయత్నించారని చరిత్రకారులు చెబుతున్నారు. అస్తిత్వం లేదా సత్తా (being) ఒకటేనని, దానిలో బాహుళ్యం (Multiplicity) లేదని పార్మెనిడీజ్ అన్నాడు కదా? ఇది గణితరీత్యా తర్కానికి నిలవదని నిరూపించడానికి వారు ప్రయత్నించారు.

కాగా, తన గురువును ఈ విమర్శల నుంచి కాపాడడానికి పార్మెనిడీజ్ శిష్యుడు జీనో (క్రీస్తుపూర్వం 490-430) ప్రయత్నించాడు. తన గురువు సిద్థాంతాలను సమర్థించడానికి జీనో నాలుగు పేరడాక్స్ లను ఉదాహరించాడు. (ఒక ప్రతిపాదన స్వయం విరుద్ధంగా, అసంబద్ధంగా కనిపిస్తే దాన్ని పేరడాక్స్ – విరోధాభాస – అంటారు). ఇవి పాశ్చాత్య తత్వశాస్త్ర చరిత్రలో సుప్రసిద్ధాలైన పేరడాక్స్ లు. కడచిన 2400 సంవత్సరాలుగా ఇవి తత్వవేత్తలను తికమక పెడుతున్నాయి. వాటిని మింగడానికి వీలు లేదు. కక్కడానికీ వీలు లేదు. పచ్చి వెలక్కాయవలె గొంతుకకు ఆడ్డుపడుతున్నాయి.

“పార్మెనిడీజ్ చెప్పినట్లు యాధార్థ్యం (reality) అనేది ఒకటిగా, అవిభాజ్యంగా లేదు అనుకోండి. అప్పుడు యాధార్థ్యం సావధికం (finite), నిరవధికం (infinite) కూడా అవుతుంది. ఇది అసంబద్ధం కాదా?” అని జీనో ప్రశ్నించాడు.(విశ్వదర్శనం, ప్రధమ ప్రచురణ పుట.57)

దీన్ని నిరూపించడానికి అతడు పేర్కొన్న పేరడాక్సులు ఇవిః

మొదటి పేరడాక్స్

1. ఒక నిర్ణీత స్థలం నుంచి మరొక నిర్ణీత స్థలానికి వెళ్ళడం అసాధ్యం. ఉదాహరణకు నూరు మీటర్ల పరుగుపందెం మనం ఏర్పాటు చేశామనుకోండి. పందెంలో పాల్గొనే వ్యక్తి నిర్ణీత కాలంలో నూరు మీటర్లను పరుగెత్తడానికి ముందు 50 మీటర్లు పరుగెత్తాలి. దానికి ముందు 25 మీటర్లు పరుగెత్తాలి. దానికి ముందు పన్నెండున్నర మీటర్లు పరుగెత్తాలి. దానికిముందు అదులో సగం దూరం దాటాలి. ఇలాగ స్థలాన్ని అంతులేనన్ని భాగాలు చేయటానికి వీలున్నది. కనుక, వాటిలో ప్రతి భాగాన్ని అతడు దాటితే తప్ప అడుగు ముందుకు వేయలేడు. కనుక, అతడు ఎన్నడూ కాలు కదపలేడు. అతని కిచ్చిన కాలం పరిమితమైనది. కాని దాటవలసిన స్థలంలో అపరిమితమైన – పరిమితిలేనన్ని – విభాగాలున్నాయి. కనుక పరిమిత కాలంలో అపరిమితంగా వున్నస్థల విభాగాలను దాటడం సాధ్యం కాదు.

ఇది మొదటి పేరడాక్స్!

ఈ పేరడాక్స్ కి నేనిస్తున్న పూర్వపక్ష రూపం!

జీనో గొప్ప తార్కికుడు. అతడు ఈ పేరడాక్స్ లో స్థలాన్ని అపరిమితమైన విభాగాలుగా విడగొట్టాడు. అదే సమయంలో కాలాన్ని విభజించకుండా యుక్తిని ప్రదర్శించాడు. అసలు ఆ నిర్ణీత స్థలాన్ని దాటడానికి పట్టే సమయం అంటే కాలం ఎంతో ప్రస్తావించ లేదు. ఆ వివరణ లేకుండానే అపరిమితమైన స్థల విభాగాలను పరిమిత కాలంలో దాటడం సాధ్యం కాదన్నాడు.

ఉదాహరణకు నూరుమీటర్ల స్థలాన్ని దాటడానికి రెండు నిముషాల కాలం అవసరమనుకుందాం. జీనో తర్క పద్దతిలోనే పందెంలో పాల్గొనే వ్యక్తి నిర్ణీత స్థలంలో రెండు నిముషాలు పరుగెత్తడానికి ముందు ఒక నిముషం పరుగెత్తాలి. దానికి ముందు 50 సెకన్లు పరుగెత్తాలి. దానికి ముందు 25 సెకన్లు పరుగెత్తాలి. దానికి ముందు అందులో సగం కాలం దాటాలి. ఇలాగ కాలాన్ని అంతులేనన్ని భాగాలు చేయటానికి వీలున్నది. కనుక, ప్రతి స్థలభాగాన్ని ప్రతి కాలభాగంతో దాటుతూ అడుగు ముందుకు వేయగలడు. కనుక, అతడు ఎల్లప్పుడూ కాలు కదుపుతూనే వుంటాడు. అతని కిచ్చిన కాలంలో అపరిమితమైన – పరిమితిలేనన్ని – విభాగాలున్నాయి. అలాగే, దాటవలసిన స్థలంలో అపరిమితమైన – పరిమితిలేనన్ని – విభాగాలున్నాయి. కనుక, అపరిమితమైన కాలంలో అపరిమితంగావున్న స్థల విభాగాలను దాటడం సాధ్యం!

(సశేషం)

Monday, October 1, 2007

భావాతీతధ్యానం! 3

భావాతీతధ్యానం! (మెడిటేషన్)...3

(ఈ ‘సబ్జెక్టు’ అందరికీ ఉపయోగకరమని నా ఉద్దేశ్యం!)

అసలైనదేదో తెలుసుకుందాం! సత్యం అంటే ఏమిటో తెలుసుకుందాం!

మన ఎదురుగా, చుట్టుప్రక్కలా ఉన్నదే సత్యం. ప్రస్తుతం మనం చూస్తున్న కంప్యూటర్ సత్యం. దాని క్రింది టేబుల్ సత్యం. మనం కూర్చున్న కుర్చీ సత్యం. మనం సత్యం. మన చుట్టూ వున్న గోడలూ, పెయింటింగులూ సత్యం!

అంతే!

“మిగతావన్నీ అసత్యాలేనా?” అంటారు.

నిజం. మిగతావన్నీ అసత్యాలే దైవం, మోక్షం, ఆత్మసాక్షాత్కారం ఇవన్నీ అసత్యాలు. ఆలోచన, ఆశ కల్పించిన అసత్యాలు, భ్రాంతులు. వట్టి నమ్మకాలు. మనకి మన తండ్రో, తాతో, సంఘంమో ఎవరో వాటి గురించి చెప్పారు. మనం నమ్మాం. అంతే. నిజానిజాలు మనకి తెలీవు. అయినా పూజలూ, పునస్కారాలూ ఏప్పటికప్పుడు అన్నీజరింపించేస్తుంటాం.

అవన్నీ అసత్యాలనగానే నిరుత్సాహపడిపోతాం. జీవితం అగమ్యగోచరమైపోతుంది. కదూ? కానీ, అలా అవాల్సిన అవసరం లేదు. దేనికీ నిరాశ చెందాల్సిన పని లేదు.

తల్లిమీద మనకుండేది ప్రేమ అనుకుంటాం. కానీ, కాదు. అదొక బంధం. అలాగే ప్రేయసి మీద. అదో ఆకర్షణ. అట్లానే స్నేహితుడి మీద. అదొక ఆధారపడటం లేదా బంధం లాంటిది.

నిజాలు చాలా కఠినంగా వుంటాయి.

మరి ప్రేమంటే ఏమిటి? ఇదీ ప్రశ్న!

ప్రస్తుతంలో అంటే వర్తమానంలో జీవించడమే అసలైన ప్రేమ. అసలైన మెడిటేషన్. భావాతీతధ్యానం!

మనలో భూతకాలం వుంది. గతం రూపంలో. గతం అంటే ఆలోచన. ఆ గతంలో ప్రేమలూ ద్వేషాలూ, ఆశలూ నిరాశలూ లాంటి రకరకాల మనోవికారాలన్నీ చోటుచేసుకుని వున్నాయి. ఇవన్నీ భవిష్యత్తుని గురించిన ఆలోచన రేకెత్తించి ప్రస్తుతాన్ని అంటే వర్తమాన కాలాన్ని కలుషితం చేస్తున్నాయి. వర్తమానాన్ని చంపేశాయి. ఆలోచన రూపంలో.

నిజమే మనంకి గతం కూడా అవసరం. ఆలోచనా అవసరమే. సాంకేతిక పరమైన పనులు చేస్తున్నప్పుడు గతం కావాలి. అంటే కంప్యూటర్ లో టైప్ చేస్తున్నప్పుడు గతం లేకుండా జరుగదు. అలాగే ఏదైనా వస్తువుల్ని కొంటున్నప్పుడు దేని కంటే ఏది మేలైందో తేల్చుకోడానికి గతం అవసరం. అటువంటి విషయాలు మినహాయిస్తే అసలు గతంతో అవసరంలేదు. అంటే దీనర్థం గతాన్నిగానీ, ఆలోచననిగానీ ద్యేషించాలని కాదు.

అసలైన ధ్యానం గురించి యిప్పుడు తెలుసుకుందాం!

మనం ప్రస్తుతంలో వర్తమాన కాలంలో వుంటాం. కళ్ళు మూసుకోవాలనీ, కూర్చుండే చేయాలనీ ఎటువంటి నిబంధనలూ యిక్కడ లేవు. ఎలాగైనా వుండొచ్చు. మనం వర్తమానంలో వుంటాం. ఇంతకుమునుపు సుగుణోపోసకులు, నిర్గుణోపాసకులకి మల్లే ఇక్కడా ఆలోచన వుద్భవిస్తుంది. కానీ, ఇక్కడ ప్రత్యేకత యేమిటంటే దాన్ని, ఆలోచనని మనం తిరస్కరించం. నిరాకరించం. చూస్తుటాం. కేవలం చూస్తుంటాం. దాన్ని మనమేమీ చేయం! ఆలోచన దాని స్వరూప స్వభావాలు మొత్తం పరిశీలస్తుంటాం. అదనే కాదు మనం దేన్నయినా చూడొచ్చు. ఆకాశం, మబ్బులు, ఆ మబ్బులు చుట్టూరా వున్న మెరుగు, చెట్లూ, పూలూ, చెత్తా చెదారం అన్నీ. కానీ వాటికి పేర్లు పెట్టం. “ఇది మంచిది. ఇది చెడు” అంటూ. చూడకూడనిదేదీ లేదు. పరిశీలించకూడనిదేదీ లేదు. సృష్టిలో తప్పొప్పులనేవేవీ అసలు లేవు. అన్నీ సత్యాలే. ప్రతిదీ పరిశీలించడమే. కాకుంటే వాటి గురించి ఆలోచన కూడదు. ఆలోచించామంటే గతంలోకి వెళ్ళడమన్నట్టే. ఈ ప్రక్రియ అంతా తేలిగ్గా, సరళంగా జరిగిపోవాలి. పరిశీలిస్తున్నప్పుడు నేను అనే వాడుండడు. కేవలం పరిశీలన మాత్రమే వుంటుంది. ఎల్లప్పడూ అన్ని వస్తువుల్తోనూ, అన్ని భావాలతోనూ, అందరు మనుషులతోనూ, అన్ని యింద్రియాలతోనూ సంబంధం మంచి చెడులు ప్రశ్నించకుండా, పేర్లు పెట్టకుండా ప్రత్యక్ష సంబంధం కలిగివుండడమే ప్రేమ!

అన్నింటినీ చూడడం, వినడం, స్పృశించడం, పరిశీలించడం. వర్తమానంలో చురుగ్గా వుండడం. ఇది ఫలానా వాళ్ళే చేయాలనే నిబంధనేదీ లేదు. పిల్లలూ, యువకులూ, పెద్దలూ, సంసారులూ, వృద్ధులూ ఎవరైనా చెయ్యొచ్చు. నడిచేటప్పుడూ, కూర్చున్నప్పుడూ, పడుకున్నప్పుడూ, బస్సులోగానీ, యింట్లోగానీ ఎక్కడైనా చెయ్యొచ్చు!

ఇదే అసలైన ధ్యానం. ఈ ధ్యానం లోనే వుంది. . .వుండాల్సిందంతా! మనసు దానంతటదే ప్రశాంతత పొందినప్పుడు మన ప్రమేయం అంటూ లేనప్పుడు, (నేను, అహం అనేవి నశించినప్పుడు), ఏదీ ఆశించనప్పుడు, ఏ భావమూ లేనప్పుడు. . . మహత్తరమైనదేదో ఉద్భవిస్తుందట. మనకి కావలసిందేదో మనం యాచించాల్సిన అవసరం లేదట. అదే మనల్ని అమృతంలో ముంచెత్తుతుందట.

ఇదే అసలైన మెడిటేషన్, భావాతీతధ్యానం!

(ఈ వ్యాసం బాగా గుర్తుంచకోవలసిందిగా నేను చదువరులను కోరుతున్నాను. ఎందుకంటే యిప్పటికిప్పుడు దీన్ని ఎవరు విశ్వసించినా, విశ్వసించకపోయినా. . . మీరు చేసే మెడిటేషన్ లూ, ధ్యానాలూ అన్నీ ఒకనాటికి విఫలమై ఏ అరవై, డెభైయ్యవయేటనో మీరు ఏకాంతచిత్తులై విషాదోన్మత్తులై నిల్చునప్పుడు తిరిగి ఈ వ్యాసం, యిందులోని వాక్యాలూ మీ భుజం తట్టి, మిమ్మల్ని పలుకరిస్తాయి. భాసించే నిజత్వంతో, నిజతత్వంతో మిమ్మల్ని అక్కునజేర్చుకుంటాయి)

( సమాప్తం )