ఒకానొక అజ్ఞానపు క్షణంలో. . . నాకు తెలీకుండా నేనే జన్మించి,  అమ్మ చనుబాలలో ఆది సంవేదన అనుభవించి. . .ఆటపాటలలో అద్వితీయుడనై రాణించి. . .సంఘ విద్యా సముపార్జనలో సారస్వత చక్రవర్తినై, పుస్తకాల్ని పఠించి. . .పరీక్షల్ని పరివీక్షించి. . .ఆత్మజ్ఞాన అవలోకనంలో విలువల వలువలు వూడదీసి. . .విశ్వతత్వాలు స్మరించి. . . మానవ శ్రేయస్సు మహా లక్ష్యమై పోగా. ."ఈ ప్రపంచపు దొడ్డబిడ్డగా ఉద్భవించాల"నీ, "ఒక పూర్తి మానవుడిగా పరిణమించాల"నీ, నేను కంటున్న కల,  కడుతున్న కోట. . .ఒహ్ ఇంతెందుకు కనుచూపు మేరలో. . . నా జీవితం ఒక వేద సంకలనం!!  నేనొక ఈశ్వరుడిని!!! ( ఇది ఈ బ్లాగులోని ప్రసంగి కథలో ఒక పాత్ర మనోభావాలు __ రచయిత )

Monday, October 1, 2007

భావాతీతధ్యానం! 3

భావాతీతధ్యానం! (మెడిటేషన్)...3

(ఈ ‘సబ్జెక్టు’ అందరికీ ఉపయోగకరమని నా ఉద్దేశ్యం!)

అసలైనదేదో తెలుసుకుందాం! సత్యం అంటే ఏమిటో తెలుసుకుందాం!

మన ఎదురుగా, చుట్టుప్రక్కలా ఉన్నదే సత్యం. ప్రస్తుతం మనం చూస్తున్న కంప్యూటర్ సత్యం. దాని క్రింది టేబుల్ సత్యం. మనం కూర్చున్న కుర్చీ సత్యం. మనం సత్యం. మన చుట్టూ వున్న గోడలూ, పెయింటింగులూ సత్యం!

అంతే!

“మిగతావన్నీ అసత్యాలేనా?” అంటారు.

నిజం. మిగతావన్నీ అసత్యాలే దైవం, మోక్షం, ఆత్మసాక్షాత్కారం ఇవన్నీ అసత్యాలు. ఆలోచన, ఆశ కల్పించిన అసత్యాలు, భ్రాంతులు. వట్టి నమ్మకాలు. మనకి మన తండ్రో, తాతో, సంఘంమో ఎవరో వాటి గురించి చెప్పారు. మనం నమ్మాం. అంతే. నిజానిజాలు మనకి తెలీవు. అయినా పూజలూ, పునస్కారాలూ ఏప్పటికప్పుడు అన్నీజరింపించేస్తుంటాం.

అవన్నీ అసత్యాలనగానే నిరుత్సాహపడిపోతాం. జీవితం అగమ్యగోచరమైపోతుంది. కదూ? కానీ, అలా అవాల్సిన అవసరం లేదు. దేనికీ నిరాశ చెందాల్సిన పని లేదు.

తల్లిమీద మనకుండేది ప్రేమ అనుకుంటాం. కానీ, కాదు. అదొక బంధం. అలాగే ప్రేయసి మీద. అదో ఆకర్షణ. అట్లానే స్నేహితుడి మీద. అదొక ఆధారపడటం లేదా బంధం లాంటిది.

నిజాలు చాలా కఠినంగా వుంటాయి.

మరి ప్రేమంటే ఏమిటి? ఇదీ ప్రశ్న!

ప్రస్తుతంలో అంటే వర్తమానంలో జీవించడమే అసలైన ప్రేమ. అసలైన మెడిటేషన్. భావాతీతధ్యానం!

మనలో భూతకాలం వుంది. గతం రూపంలో. గతం అంటే ఆలోచన. ఆ గతంలో ప్రేమలూ ద్వేషాలూ, ఆశలూ నిరాశలూ లాంటి రకరకాల మనోవికారాలన్నీ చోటుచేసుకుని వున్నాయి. ఇవన్నీ భవిష్యత్తుని గురించిన ఆలోచన రేకెత్తించి ప్రస్తుతాన్ని అంటే వర్తమాన కాలాన్ని కలుషితం చేస్తున్నాయి. వర్తమానాన్ని చంపేశాయి. ఆలోచన రూపంలో.

నిజమే మనంకి గతం కూడా అవసరం. ఆలోచనా అవసరమే. సాంకేతిక పరమైన పనులు చేస్తున్నప్పుడు గతం కావాలి. అంటే కంప్యూటర్ లో టైప్ చేస్తున్నప్పుడు గతం లేకుండా జరుగదు. అలాగే ఏదైనా వస్తువుల్ని కొంటున్నప్పుడు దేని కంటే ఏది మేలైందో తేల్చుకోడానికి గతం అవసరం. అటువంటి విషయాలు మినహాయిస్తే అసలు గతంతో అవసరంలేదు. అంటే దీనర్థం గతాన్నిగానీ, ఆలోచననిగానీ ద్యేషించాలని కాదు.

అసలైన ధ్యానం గురించి యిప్పుడు తెలుసుకుందాం!

మనం ప్రస్తుతంలో వర్తమాన కాలంలో వుంటాం. కళ్ళు మూసుకోవాలనీ, కూర్చుండే చేయాలనీ ఎటువంటి నిబంధనలూ యిక్కడ లేవు. ఎలాగైనా వుండొచ్చు. మనం వర్తమానంలో వుంటాం. ఇంతకుమునుపు సుగుణోపోసకులు, నిర్గుణోపాసకులకి మల్లే ఇక్కడా ఆలోచన వుద్భవిస్తుంది. కానీ, ఇక్కడ ప్రత్యేకత యేమిటంటే దాన్ని, ఆలోచనని మనం తిరస్కరించం. నిరాకరించం. చూస్తుటాం. కేవలం చూస్తుంటాం. దాన్ని మనమేమీ చేయం! ఆలోచన దాని స్వరూప స్వభావాలు మొత్తం పరిశీలస్తుంటాం. అదనే కాదు మనం దేన్నయినా చూడొచ్చు. ఆకాశం, మబ్బులు, ఆ మబ్బులు చుట్టూరా వున్న మెరుగు, చెట్లూ, పూలూ, చెత్తా చెదారం అన్నీ. కానీ వాటికి పేర్లు పెట్టం. “ఇది మంచిది. ఇది చెడు” అంటూ. చూడకూడనిదేదీ లేదు. పరిశీలించకూడనిదేదీ లేదు. సృష్టిలో తప్పొప్పులనేవేవీ అసలు లేవు. అన్నీ సత్యాలే. ప్రతిదీ పరిశీలించడమే. కాకుంటే వాటి గురించి ఆలోచన కూడదు. ఆలోచించామంటే గతంలోకి వెళ్ళడమన్నట్టే. ఈ ప్రక్రియ అంతా తేలిగ్గా, సరళంగా జరిగిపోవాలి. పరిశీలిస్తున్నప్పుడు నేను అనే వాడుండడు. కేవలం పరిశీలన మాత్రమే వుంటుంది. ఎల్లప్పడూ అన్ని వస్తువుల్తోనూ, అన్ని భావాలతోనూ, అందరు మనుషులతోనూ, అన్ని యింద్రియాలతోనూ సంబంధం మంచి చెడులు ప్రశ్నించకుండా, పేర్లు పెట్టకుండా ప్రత్యక్ష సంబంధం కలిగివుండడమే ప్రేమ!

అన్నింటినీ చూడడం, వినడం, స్పృశించడం, పరిశీలించడం. వర్తమానంలో చురుగ్గా వుండడం. ఇది ఫలానా వాళ్ళే చేయాలనే నిబంధనేదీ లేదు. పిల్లలూ, యువకులూ, పెద్దలూ, సంసారులూ, వృద్ధులూ ఎవరైనా చెయ్యొచ్చు. నడిచేటప్పుడూ, కూర్చున్నప్పుడూ, పడుకున్నప్పుడూ, బస్సులోగానీ, యింట్లోగానీ ఎక్కడైనా చెయ్యొచ్చు!

ఇదే అసలైన ధ్యానం. ఈ ధ్యానం లోనే వుంది. . .వుండాల్సిందంతా! మనసు దానంతటదే ప్రశాంతత పొందినప్పుడు మన ప్రమేయం అంటూ లేనప్పుడు, (నేను, అహం అనేవి నశించినప్పుడు), ఏదీ ఆశించనప్పుడు, ఏ భావమూ లేనప్పుడు. . . మహత్తరమైనదేదో ఉద్భవిస్తుందట. మనకి కావలసిందేదో మనం యాచించాల్సిన అవసరం లేదట. అదే మనల్ని అమృతంలో ముంచెత్తుతుందట.

ఇదే అసలైన మెడిటేషన్, భావాతీతధ్యానం!

(ఈ వ్యాసం బాగా గుర్తుంచకోవలసిందిగా నేను చదువరులను కోరుతున్నాను. ఎందుకంటే యిప్పటికిప్పుడు దీన్ని ఎవరు విశ్వసించినా, విశ్వసించకపోయినా. . . మీరు చేసే మెడిటేషన్ లూ, ధ్యానాలూ అన్నీ ఒకనాటికి విఫలమై ఏ అరవై, డెభైయ్యవయేటనో మీరు ఏకాంతచిత్తులై విషాదోన్మత్తులై నిల్చునప్పుడు తిరిగి ఈ వ్యాసం, యిందులోని వాక్యాలూ మీ భుజం తట్టి, మిమ్మల్ని పలుకరిస్తాయి. భాసించే నిజత్వంతో, నిజతత్వంతో మిమ్మల్ని అక్కునజేర్చుకుంటాయి)

( సమాప్తం )

12 అభిప్రాయాలు:

Ramani Rao said...

బాగుంది విజయకుమార్ గారు.. మీరు చెప్పిన మెడిటెషన్ గురించి.. నేను ఇంటర్ చదువుతుండగా.. మాకు మెడిటేషన్ కి ప్రత్యేకంగా ఒక క్లాస్ వుండేది.. దీనితో పాటు కొంచం యోగా గురించి కూడా చెప్పండి. మీ బ్లాగ్ చిత్రం కూడా చాలా బాగుంది.

వింజమూరి విజయకుమార్ said...

కృతజ్ఞతలు రమగారూ. ఈ మాత్రం కామెంట్ రావడమే గగనమైపోతోందీ రోజుల్లో. అదే కదా మొన్న బ్లాగులు-రాజకీయాల్లో మీ బాధ, నా బాధ.

Anonymous said...

విజయకుమార్ గారూ హ్యాట్సాఫ్. మీ వివరణ చాలా అద్భుతంగా ఉంది. యోగా క్లాసు పుణ్యమా నేను రోజూ చేసే సమాధి మెడిటేషన్ (అదే భావాతీత ధ్యానాన్ని మా గురూజీ చెప్పినంత వివరంగా చెప్పారు. దన్యవాదాలు.
- నల్లమోతు శ్రీధర్

Anonymous said...

అన్నా. అర్వై డెబ్బై ఏండ్లొచ్చినంక ఏం చేయాలె అని సోచాయిస్తున్నా. ఈ మెడికేసన్ గప్పుడు చేస్తానె. ఈ లోపట శానా పనులున్నాయి అన్నా. నారజి గాకె. ఏదో అప్రస్తుత ప్రసంగం అన్కోరాదె.

వింజమూరి విజయకుమార్ said...

కృతజ్ఞతలు శ్రీధర్ గారూ. మీ వంటి వారి ప్రోత్సాహాలే మా వంటి వారికి శక్తిసామర్థ్యాలు. మొన్ననే మీ కామెంట్ కి కృతజ్ఞతలు తెలిపా. కానీ ఏదో పొరపాటున కామెంట్ పబ్లిష్ అవలేదు. ఈ వ్యాసం అప్పటికప్పుడు కంప్యూటర్ లో నోట్ ప్యాడ్ మీద రాసుకుని పేస్ట్ చేయడం వల్ల నా కథలకి మల్లే గంభీరంగా రాలేదు. నేననుకున్నంత Quality రాలేదు. వీలయితే సవరించడానికి ప్రయత్నిస్తాను. మీ కామెంట్ కి నా కామెంట్ కి మధ్యలో 'రత్నగర్భలో అస్థిపంజరం' లేదా 'నియాండర్తల్' కామెంట్ ఒకటుంది. దాన్ని గురించి పట్టించుకోకండే.

Naga said...

మీరు రాసింది అద్భుతంగా ఉంది. అయితే, ధ్యానాం విఫలం అవుతుంది అని ఎందుకు భావిస్తున్నారో అర్థం కావడం లేదు?...

వింజమూరి విజయకుమార్ said...

నాగరాజు గారూ కృతజ్ఞతలు. నేను విఫలమవుతాయన్నది. ఈ విధమైన ప్రక్రియ గాక మీరు చేసే వేరే తరహా మెడిటేషన్ ప్రక్రియలు అని దానర్ధం. ఈ ప్రక్రియ విఫలమవుతుందని కాదు. ఇప్పుడు ఓ.కే.నా?

Anonymous said...

నాగరాజన్నా! వింజమూరన్న చెప్పిందే వేదమన్నట్టు. కడ్మ మెడికేసన్లన్నిట్ని బంద్ జేయాలె.

Burri said...

విజయకుమార్ గారు.. నేను అలస్యముగా అయిన మంచి విషయాలు చదినాను. మీ వివరణ(పేరడాక్స్ తో సహా) చాలా అద్భుతంగా వివరించినారు. మీ ఆలోచన శక్తి నా నెనర్లు.

-మరమరాలు

వింజమూరి విజయకుమార్ said...

చాలా కృతజ్ఞతలు రఘనాధరెడ్డి గారూ. మళ్ళీ ఏదైనా సందర్భంలో కలుద్దాం. ఉంటాను.

సత్యసాయి కొవ్వలి Satyasai said...

చాలా చక్కగా ఉంది. వర్తమానంలో జీవించగలిగితే చాలా బాధలనుండి ఉపశమనం పొందచ్చన్నది నిజం.

వింజమూరి విజయకుమార్ said...

సత్యసాయి గారూ,

వర్తమానంలో జీవించినంత కాలం అసలు బాధ అనేదే మనకి తెలీదు. వర్తమానం అంటేనే తెలీని స్థితి. బాధ అంటేనే గతాన్ని తలుచుకునేది. అంటే ఆలోచిస్తున్న స్థితి. ఆ ప్రకారం వర్తమానంలో వుండటమనేది అద్భుతమైన విషయం గదా.