ఒకానొక అజ్ఞానపు క్షణంలో. . . నాకు తెలీకుండా నేనే జన్మించి,  అమ్మ చనుబాలలో ఆది సంవేదన అనుభవించి. . .ఆటపాటలలో అద్వితీయుడనై రాణించి. . .సంఘ విద్యా సముపార్జనలో సారస్వత చక్రవర్తినై, పుస్తకాల్ని పఠించి. . .పరీక్షల్ని పరివీక్షించి. . .ఆత్మజ్ఞాన అవలోకనంలో విలువల వలువలు వూడదీసి. . .విశ్వతత్వాలు స్మరించి. . . మానవ శ్రేయస్సు మహా లక్ష్యమై పోగా. ."ఈ ప్రపంచపు దొడ్డబిడ్డగా ఉద్భవించాల"నీ, "ఒక పూర్తి మానవుడిగా పరిణమించాల"నీ, నేను కంటున్న కల,  కడుతున్న కోట. . .ఒహ్ ఇంతెందుకు కనుచూపు మేరలో. . . నా జీవితం ఒక వేద సంకలనం!!  నేనొక ఈశ్వరుడిని!!! ( ఇది ఈ బ్లాగులోని ప్రసంగి కథలో ఒక పాత్ర మనోభావాలు __ రచయిత )

Friday, February 8, 2008

శ్రీరామమూర్తీ – సిరచ్ఛేదం

శ్రీరామమూర్తీ – సిరచ్ఛేదం (సరదా అనుభవం)

ఆ రోజులు. అవి 1993 నాటి రోజులు. నా జీవితంలో అవి తిరిగిరాని రోజులు. పెళ్ళిగానప్పటి మధురమైన రోజులు. పెళ్ళాం గోల్డు కొనమని గోలెట్టని రోజులు. కుమారుడు కారు కావాలని కారుకూతలు కూయని రోజులు. ఉదయాన్నే ఆరు గంటలకు లేచి, రాత్రి పదిన్నర దాకా అడ్డమైన పన్లూ చేయాల్సిన అవసరం లేని రోజులు. మందు కొట్టకుండానే మాంచి నిద్రగొట్టే రోజులు. ‘బ్యాచిలర్’ గా వుంటూ నా రూమ్ కి నేనే మహరాజునై, ‘సర్వసత్తాక సార్వభౌమత్వా’న్ని కలిగివున్న రోజులు. కొత్తగా వుద్యోగం వచ్చి, ఊర్నుంచి ‘ఎర్ర బస్సు’లో హైదరాబాదొచ్చి, వెర్రిముఖం వేసుకుని వీధుల్ని ఎగాదిగా పరిశీలించే రోజులు. ఉద్యోగం రావడం మూలంగా నేనేదో “సముద్రాల్ని పుక్కిలించ గలన"నీ, "కొండల్ని త్రవ్విపోయగలన”నీ ఊహల్లో, భ్రమల్లో బతుకుతున్న రోజులు. నా మొత్తం జీవితంలో అత్యంత స్వాతంత్రకరమైన బంగారు వజ్రాల రోజులు. (ఈ వాక్యాలు ‘నువ్వు నాకు నచ్చావు’ సినిమాలో “అమ్మా నాకు నువ్వు జన్మనిచ్చావు. తినడానికి అన్నం యిచ్చావు. అయినా ఎందుకింత ఎర్లీగా చచ్చావు” అంటూ ‘ప్రకాష్ రాజ్’ కవిత చదివినట్టు మీకు అన్పిస్తే అది నా తప్పు కాదు).

ఆ రోజల్లో నేనో మంత్రిగారి (పేరెందుకు లెండి) దగ్గర పనిచేసే భాగ్యమో, దౌర్భాగ్యమో నాకు కలిగింది. మంత్రిగారి పేషీలో పీయే, పీయస్ లతో పాటు నేనూ మరో స్టెనోగ్రాఫరూ, నలుగురు గన్ మెన్లూ, ముగ్గురు డ్రైవర్లూ చివరాఖరికి ఏడెనిమిది మంది అటెండర్లూ వుండేవాళ్ళం. వాళ్ళలో యాభైయేళ్ళ శ్రీరామమూర్తి అనే ఓ తూ.గో. జిల్లా అటెండరు కూడా వుండేవాడు. అతడు పూర్తిగా “ఆయ్ అయ్గారండీ!” అంటూ పూర్తిగా తూ.గో. జిల్లా యాసలోనే మాట్లాడేవాడు. బీపీ లాంటివేం లేవుగానీ వట్టి కంగారు మనిషి. భయమెక్కువ.

ఓ రోజు మంత్రి గారు ఓ ఐదు వేలెట్టి అదేదో మాంచి జాతి కుక్కపిల్లని కొన్నారు. కొంటే కొన్నారు గానీ, పనోళ్ళనీ, అటెండర్లనీ పిలిచి “దాన్ని పసిపిల్లలా జాగ్రత్తగా కాపాడాలనీ, పెంచాల”నీ హుకుం జారీ చేశారు. “దానికేదైనా అయితే వూరుకోన”నీ హెచ్చరించారు కూడా. ఇక చూడండి. ఆ కుక్కపిల్లకి పాలూ, బిస్కెట్లూ. . ఒకటేమిటి రోజూ రాజ భోగమే. ఇదంతా మంత్రిగారి యింట్లో అంటే మంత్రిగారికి ప్రభుత్వం కేటాయించిన క్వార్టర్సులో నన్నమాట. మేం పని చేసేది సెక్రటేరియట్లో. శ్రీరామమూర్తి మంత్రిగారి యింట్లో పని చేసేవాడు.

ఓ రోజు శ్రీరామమూర్తి సెక్రటేరియట్లోని ఆఫీసు కొచ్చేడు. నేరుగా నా సీటు దగ్గరకి వచ్చి, “సార్ ఓ సమస్య వచ్చిందండి.” అన్నాడు.

“ఏంటది?” అన్నా.

“మంత్రిగారి కుక్కపిల్లకి నేను స్నానం చేయించాలంటారేంటండీ అమ్మగారు?” అన్నాడు (అమ్మగారంటే మంత్రిగారి సతీమణి అన్నమాట).

“మరి చేయించాలి గదా?” అన్నా.

“మీరు భలే వోరండీ. నాకేం ఖర్మ. నేనసలే బ్రామ్మడ్ని. ఇంట్లో నా పిల్లలకి కూడా ఏనాడూ స్నానం చేయించి ఎరగను” అన్నాడు.

“అది నీ సొంత విషయం శ్రీరామ్మూర్తీ. మీ యింటికి నువ్వే రారాజు గాబట్టి అది నీ యిష్టం. కానీ, ఇది నీ డ్యూటీ.” అన్నా ఓ పక్క నవ్వాపుకుంటూనే. అప్పటికే నా పక్కన స్టెనోగ్రాఫర్ భాస్కర్ అటువైపు తిరిగి నవ్వుతున్నాడు.

శ్రీరామమూర్తికి మండింది. “ఏదండి నా డ్యూటీ. కుక్కకి స్నానం చేయించడమా? మీరు భలే వోరండీ. నేను అడక్క అడక్క మిమ్మల్ని సలహా అడిగా” అన్నాడు.

“మరి రాముగాడి చేత చేయించు” అన్నా (రాముగాడు మరో అటెండరన్నమాట)

“వాడు డ్యూటీలో వున్నప్పుడు వాడు చేయిస్తూనే వున్నాడండీ. నా డ్యూటీలోనే నాకీ యిబ్బంది” అన్నాడు.

“మరా విషయం మేడమ్ గారికి చెప్పు” అన్నా.

“ఏ విషయమండీ?” అన్నాడు శ్రీరామమూర్తి అమాయకంగా.

“అదే నువ్వు బ్రాహ్మణుడవనీ. చేయించలేక పోతున్నాననీ”

“నిజంమండీ బాబూ. మొన్న మూడ్రోజులు చేయించా. వాంతొచ్చేస్తుందండీ బాబూ” వికారంగా మొహం పెట్టేడు.

“అదే. ఆ మాటే మేడమ్ తో చెప్పు” అన్నా.

“అమ్మగారు ఒప్పుకుంటారంటారా?” అడిగాడు అనుమానంగా.

“ఏమో నీ బాధ నువ్వు చెప్పాకోవాలి గదా. తర్వాత ఆమె యిష్టం. నువ్వన్నట్టు నీకేం ఖర్మ కుక్కలకి స్నానం చేయించడానికి. అయినా నీకు భయంలాగుంది మేడమ్ తో చెప్పడానికి” అన్నా అతడిని గమనిస్తూ. మా భాస్కర్ నవ్వుకుంటూనే వున్నాడు.

"అలాంటిదేం లేదండీ. ఎంతొకవేళ చప్రాసీగాడినైనా కుక్కలకి స్నానం చేయించడం ఏంటండీ? చెప్పేస్తా అమ్మగారితో” అన్నాడు.

“సరేలే. మెల్లగా చెప్పు. మళ్ళీ తేడా రాకుండా”

“తేడా వస్తే ఏటౌద్దేటండీ. నా పేరెంట్ డిపార్ట్ మెంటు కెళ్తా. పని చేసుకుంటా. అంతే. నా ఉద్యోగమయితే పీకలేరుగదా ఎవరూ” అన్నాడు శ్రీరామమూర్తి.

“ఆ మాత్రం ధైర్యముంటే ఫర్లే శ్రీరామ్మూర్తీ” అన్నా.

“చూడండి రేపు అమ్మగారితో చెప్పి, ఈ సంగతి అటో యిటో తేల్చేస్తా” అన్నాడు శ్రీరామమూర్తి మంత్రి బంగళా కెళ్లడానికి సమాయత్తమవుతూ.

“మేడమ్ గారితో చెప్పింతర్వాత ఆమేం అన్నారో ఓ సారి నాకు ఫోన్ చెయ్ శ్రీరామ్మూర్తీ” అన్నాను.

“అలాగే సార్” అంటూ ఆరోజు శ్రీరామమూర్తి వెళ్ళిపోయాడు.

మర్నాడు ఉదయాన్నే నాకు ఫోన్ వచ్చింది మినిష్టరు గారి బంగ్లా నుండి. ఫోన్లో శ్రీరామమూర్తి.

“విజయకుమార్ గారాండీ” అన్నాడు శ్రీరామమూర్తి నేను ఫోనెత్తగానే.

“అవును. ఏంటి శ్రీరామ్మూర్తీ” అన్నాను గొంతు గుర్తుపట్టి.

“సార్ మీరు చెప్పినట్టే చెప్పాను సార్ అమ్మగారితో. నేను కుక్కపిల్లకి స్నానం చేయించలేనని” అన్నాడు.

“ఏమన్నారు?”

“అయితే నన్ను చేయించమంటావా కుక్కకి స్నానం?” అన్నారండి.

“ఇంకా ఏమన్నారు?” కుతూహలంగా అడిగా.

“నీకు వాంతులొస్తే మరి నాకు రావా వాంతులు?” అన్నారండి.

“అదీ నిజమే గదా” అన్నా. వచ్చే నవ్వును ఆపుకుంటూ.

“మీరు భలేవోరండీ. కాసేపు యిటు మాట్లాడ్తారు. కాసేపు అటేపు మాట్లాడ్తారు” అన్నాడు శ్రీరామమూర్తి.

“మరేం చేయమంటావు శ్రీరామ్మూర్తీ. ఎటో ఒకవైపు మాట్లాడాలి గదా” అని, మళ్ళీ “మరి నువ్వనేదేంటి కుక్కకి నన్ను చేయించమంటావా స్నానం?” అన్నా.

“అయ్యో. రామ రామ. అదేంమాట సార్. అంత మాటనేశారు?” అన్నాడు శ్రీరామమూర్తి తెగ బాధపడిపోతూ.
(సశేషం)

Wednesday, January 23, 2008

వేంకటేశ్వరుడు – గడప

వేంకటేశ్వరుడు – గడప
ఇది నా స్వీయ రచన కాదు. ఒక స్నేహితుడిచ్చిన పాత సినిమా స్కిప్టులో చదివి రాస్తున్నా. ఏదైనా సినిమాలో ఈ విషయం చెప్పారో లేదో కూడా నాకు తెలీదు.

శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానంలో నిరంతరం భక్తుల సేవలందుకునే వేంకటేశ్వర స్వామి వారి గర్భగుడి ద్వారతోరణం దగ్గరి గడపకి ఓ రోజు ఓ ధర్మసందేహం కలిగిందట. సందేహం కలిగిన వెనువెంటనే ఆలస్యం చేయకుండా సదరు గడప శ్రీ వెంకటేశ్వర స్వామిని సందేహ నివృత్తి కోసం యిలా ప్రశ్నించిందట.

“ఆయ్యా స్వామీ! తమరూ రాయితో తయారు చేసినవారు. నేనూ రాయితోనే చేయబడ్డాను. తమరికీ, నాకూ తండ్రి అయిన శిల్పి ఒకరే. అయినప్పుడు, తమకి ఈ నిత్య మంగళ హారతులేమి. నన్ను మాత్రం ఈ లక్షలాది మంది భక్తులు మట్టి కాళ్ళతో తొక్కకుంటూ తమరికి ‘గోవింద’ నామ భజన చేయడమేమిటి?” అని.

ఆ మాటకా తిరమలాధీశుడు గడపని చూసి ఓ చిర్నవ్వు నవ్వి, సమాధానం యివ్వకుండా మిన్నకుండి పోయాట్ట.

ఆ చర్యతో ఆ గడప మరింప మనస్తాపం చెంది, “స్వామీ! తమ భక్తులతో పాటు తమరు కూడా నన్ను చిర్నవ్వుతో హేళన చేయడం ఏమంత బాగోలేద”ని మదనపడి, ముఖం (అయినా గడపకి ముఖం ఎక్కడిది. గడపమొహం కాకపోతే) చిన్నబుచ్చుకున్నదట.

ఆ మాటలకి శ్రీ స్వామివారు స్పందిస్తూ, యిలా సమాధానం యిచ్చార్ట.

“ఒసే గడపా! నన్ను కళా తపస్వియైన ఒక శిల్పి దీక్షగా యేళ్ళ తరబడి శ్రమించి కోటానుకోట్ల వులి దెబ్బలకి నన్ను గురిచేసి, తను శ్రమించి, నన్ను బాధించి మలిచిన పిదప నేను ఈ మహిమాన్వితమైన ఈ సుందర రూపం దాల్చి భక్తుల మనసుల్ని దోచుకోగలిగాను. ఇక నీ మాటంటావా. నీదేముంది? ఒక రాయిని తీసుకుని అదే శిల్పి వులితో అటో దెబ్బ, యిటో దెబ్బ వేస్తే నువ్వు గడపవై కూర్చున్నావు. నీకు దెబ్బలూ తక్కువే. పూజలూ తక్కువే. ఇప్పుడర్థమయిందా?” అన్నాట్ట.

అంతట, ఆ సమాధానం విని సదరు గడప “అరే! నిజమే గదా స్వామివారి గొప్పదనం!” అని సంతృప్తి చెందిందట.

ఇందుమూలంగా, ఈ కథను చెప్పడం మూలంగా నేను యావన్మందికీ తెలియజేయునది యేమనగా, ఈ కథలోని వేంకటేశ్వరుడికి మల్లే ‘ఫెటేల్’ మని ఈడ్చిపెట్టి కొట్టే జీవితానుభవం నుండి తద్వనుభవ సారాన్ని పిండుకుని, సారస్వతం ద్వారా యితరత్రా పరిశీలనా ప్రక్రియల ద్వారా కొంత ప్రంపంచ జ్ఞానాన్ని, పదార్థ స్వరూపజ్ఞానాన్ని, స్వస్వరూపజ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని పొందిన వ్యక్తులు ఏదో ఒక విధంగా తమ విశిష్టతను తాము చాటుకుంటూనే, యితరులకు ప్రయోజనకారకులౌతారని.

ప్రయోజకులై పదిమందికీ సహాయకారులయే వారు అందరూ ఆమోదించదగ్గ వ్యక్తులే గదా. అదీ ఈ టపా వెనుక సారాంశం.

ఏదో సందర్బంలో విశ్వనాధ వారు ఈ మాటన్నారు.

“పది విషయములు దెలిసియున్న భిన్న వస్తు స్వరూపజ్ఞానము దెలియినుగానీ, తెలిసినదియే ఒకటియై దాని యందే సర్వోత్కృష్టతా భావమును కలిగియుండుట బహు మానవులకు జీవితములో సంభవించునొక దురదృష్టము” అని.

అయితే, యిదంతా కూలంకషంగా చదివిన పిదప మీకో సందేహం కలగొచ్చు. వేంకటేశ్వరుడు చాలా దెబ్బల కోర్చి ఘనుడైనట్టు ఎప్పుడూ కష్టాల కొలిమిలో కాలుతూండే కార్మికులూ, కూలీనాలీ జనాలూ బతుకులో మనందరికంటే ఎక్కవ దెబ్బలు తినే వుంటారు గనుక, వాళ్ళంతా ఎందుకు జ్ఞానవంతులు కారూ? అని.

ఈ సందేహం కలిగిన వారికి నాదొకటే సమాధానం.

కష్టాలు పడినంతమాత్రాన ప్రయోజనం లేదు. కష్టమైనా, సుఖమైనా, జీవితంలో ఆయా అనుభవాల సారం పిండుకున్నవాళ్ళు, ఆయా విలువల్ని ప్రశ్నించి నిగ్గుదేల్చుకున్న వాళ్లు మాత్రమే గొప్పవారు కాగలరు!

మీరేమంటారు?
(సమాప్తం)