ఒకానొక అజ్ఞానపు క్షణంలో. . . నాకు తెలీకుండా నేనే జన్మించి,  అమ్మ చనుబాలలో ఆది సంవేదన అనుభవించి. . .ఆటపాటలలో అద్వితీయుడనై రాణించి. . .సంఘ విద్యా సముపార్జనలో సారస్వత చక్రవర్తినై, పుస్తకాల్ని పఠించి. . .పరీక్షల్ని పరివీక్షించి. . .ఆత్మజ్ఞాన అవలోకనంలో విలువల వలువలు వూడదీసి. . .విశ్వతత్వాలు స్మరించి. . . మానవ శ్రేయస్సు మహా లక్ష్యమై పోగా. ."ఈ ప్రపంచపు దొడ్డబిడ్డగా ఉద్భవించాల"నీ, "ఒక పూర్తి మానవుడిగా పరిణమించాల"నీ, నేను కంటున్న కల,  కడుతున్న కోట. . .ఒహ్ ఇంతెందుకు కనుచూపు మేరలో. . . నా జీవితం ఒక వేద సంకలనం!!  నేనొక ఈశ్వరుడిని!!! ( ఇది ఈ బ్లాగులోని ప్రసంగి కథలో ఒక పాత్ర మనోభావాలు __ రచయిత )

Saturday, August 18, 2007

కుచేలుడు!.. 1 (కథ)

కుచేలుడు!
(‘స్వాతి’ సపరివార పత్రిక పంచరత్నాల కథల పోటీలో రూ.5,000 బహుమతి పొందిన ఉత్తమ పౌరాణిక కథ! సంచిక 9-.11.2001 లో ప్రచురితమైంది. ఐదు లక్షల పాఠకులకు ‘స్వాతి’ అందించిన కానుక అన్న మంచి వ్యాఖ్యని నాకు ఆనాడు అందించింది)

అది ద్వాపరయుగం నాటి కాలం! ఓ ప్రాతఃకాల వేళ! ఆ ఆలయం గర్భగుడి చుట్టూ ఒక స్త్రీ ప్రదక్షిణం చేస్తోంది. ముఫ్ఫై అయిదేళ్ళ ఫ్రౌఢ స్త్రీ! చేతులు జోడించి, మనసంతా దేవుడిపై లగ్నం చేసి నెమ్మదిగా నడుస్తూ, ఆమె భక్తిపూర్వక ప్రదక్షిణాలు చేస్తోంది.

అదంతా కొంతసేపటి నుండి ఓ పాతికేళ్ళ యువకుడు గమనిస్తున్నాడు. ప్రదక్షిణం అంటే ఎలా చేయాలో అతడికి తెలుసు. నిండుకుండని నెత్తిమీదుంచుకుని నడిచే తొమ్మిది నెలల నిండు గర్భిణిలా మెల్లగా నెమ్మదిగా, కామధేనువులా నడవాలని అతడికి తెలుసు. ఆ లక్షణం అతడికి ఆమెలో నిండుగా కనిపించింది.

ఆమె ప్రదక్షిణాలు ముగించాక ఆ యువకుడామెని సమీపించాడు. అతడీ విధంగా అడిగాడు. ఆమె ఈ విధంగా అతడికి సంజ్ఞలతో సమాధానం చెప్పింది.

అతడు : “నారీ లలామ! మీ పేరేమి చెప్పు?” మన్న. . .
ఆమె : దయమీర, “నెడమ నేత్రమును” జూపె!
అతడు : “కుటిలకుంతల! నీదు కులము నామం?”బన్న. . .
ఆమె : “అటు పంజరమునున్న పక్షినిం” జూపె!
అతడు : “మత్తేభయాన! నీదు మగని నామం?”బన్న. . .
ఆమె : తన “చేతనున్న జీర్ణ వస్త్రమును” జూపె!
అతడు : “వెలదీ! నీకేమైన బిడ్డలా చెప్పు?”మన్న
ఆమె : “మింటినున్న నక్షత్రముల” జూపె!
అతడు : “ధవుని వ్యాపారమేమి?”టన్న
ఆమె : “దండమిడియే!”

‘ఆమె సంజ్ఞలకి అర్థమేమిటా?” అని ఆ యువకుడు ఆలోచించినాడు. పేరేమిటంటే ఎడమకన్ను చూపించింది. కులమేమిటంటే శాకాహారుల మన్నట్టు రామ చిలకని చూపించింది. భర్త పేరడిగితే పేదరికానికి చిహ్నమైన చిరిగిపోయిన గుడ్డముక్కని చూపింది. బిడ్డల గురించి అడిగితే నక్షత్రాలంతటి అధిక సంతానమన్నది. భర్త వృత్తినడిగితే చేతులెత్తి దణ్ణం పెట్టింది.

అతడికేదో అర్థమయింది.

“అమ్మా! మీ పేరు వామాక్షి లేదా మీనాక్షి! మీ భర్త మహాభక్తాగ్రగణ్యుడు. . . కుచేలుడు! అవునా? అడిగాడు.

ఆమె అంగీకరించింది. తనకా “రెండు పేర్లూ వున్నాయ”న్నది. “భర్త పేరు కూడా నిజమే”నన్నది.

అ మాట విని ఆ యువకుడు చలించిపోయాడు. తర్వాత అన్నాడు.

“వెదకబోయిన తీగ కాలికి తగిలినట్టు ఎవ్వరిని చూడ నేనిక్కడకి వచ్చినానో, ఆ మహానుభావుడి యిల్లాలువి. . . మహాతల్లీ! నీ దర్శనభాగ్యమయింది. ముందుగా నీకు నా హృదయపూర్వక నమస్సులు” వినయంగా చేతులు జోడించి నమస్కరించినాడు.

“అమ్మా! నా పేరు వైముఖుడు. మిథునాపుర సామంతరాజు మహాధ్వజదైవికుల వారి ఏకైక పుత్రుడిని. నిరంతరం శ్రీకృష్ణ నామ ధ్యాన పారవశ్యంలో మునిగితేలే కుచేలుర వారి కీర్తి దశదిశలా వ్యాపించుకుంది. దేశదేశాంతరాలూ విస్తరించుకుంది. అది విని, ఆ మహాత్ముడిని చూడదలిచాను. ఆయనకి శిష్యరికం చేయదలిచాను. ఆ ప్రయత్నంలో భాగంగా. . . ఆ భక్తిని పరీక్షించవచ్చాను. మీకు అభ్యంతరమా?” అడిగాడు.

అమాయకంగా ప్రశ్నిస్తున్న ఆ యువకుడిని చూసి, ఆమె చిన్నగా నవ్వింది. ఆపైన. . . “సత్యం చూడగోరిన వారిని అభ్యంతరపరచను. . .నేనెవరిని?” అన్నది.
* * * *

“అమ్మా! బిక్షకుడిని. ఏదైనావుంటే దానం చేస్తారా?” అన్నాడు కుచేలుడు ఆ యింటి ముందాగి.

ఇంట్లోంచి ఆడవాళ్ళెవరూ బయటికి రాలేదు. వైముఖుడు వచ్చాడు. వచ్చి, తొలిసారిగా కుచేలుడనబడే ఆ బిక్షకుడిని పరిశీలించి చూశాడు.

మాసినగడ్డం, చిరిగిన బట్టలు, చేతికి రాగి కడియం, చేతిలో గుడ్డసంచీ, తైల సంస్కారం లేక వెనక ముడిపెట్టకున్న జుట్టు, చెప్పులులేని కాళ్ళు. . .దరిద్రానికి నిలువెత్తు నిదర్శనంలా కనిపిస్తున్న ఆ పేద బ్రాహ్మణుడిని చూసి, “అహా! ఇతడికా అంతటి పేరు ప్రఖ్యాతులు?” అనుకున్నాడు. మళ్ళీ వెనక్కి ఇంట్లోకెళ్ళి, లోనుండి ఒక డబ్బు మూట పట్టుకొచ్చాడు.

ఆ మూటని కుచేలుడికందిస్తూ, “ఇదిగోవయ్యా బ్రాహ్మడా! వెయ్యి వరహాల బంగారు నాణేలు. పిల్లలుగల వాడిలా కన్పిస్తున్నావు. తీసుకో!” అన్నాడు.

అది చూసి కుచేలుడు నివ్వెరపోయాడు. అంతలోనే, “కృష్ణ పరమాత్మా!” అన్నాడు. ఆపైన. . .

“నాకెందుకు నాయనా బంగారు నాణేలు? నా పిల్లలు బంగారం తినరు. అంబలిలో గింజలు తింటారు. అటుకులు తింటారు. పండుగరోజొస్తే కడుపారగా అన్నం తింటారు. దయగల మారాజులా కనిపిస్తున్నావు. ధనం నాకు వద్దు. కాసిన్ని ధాన్యం వుంటే ఇప్పించు!” అర్థించాడు. మళ్ళీ, “శ్రీకృష్ణ పరమాత్మా!” అన్నాడు.

వైముఖుడు ఆశ్చర్యపడలేదు. “ఇదేమిటయ్యా పిచ్చి బ్రాహ్మడా! ధనం వద్దంటావు. ధాన్యం కావాలంటావు. మాటిమాటికీ కృష్ణపరమాత్ముడా అంటూంటావు. సరే. . .నువ్వడిగినట్టే ధాన్యం ఇప్పిస్తాను. నూటపదహారు బండ్ల ధాన్యం. సరేనా?” అన్నాడు.

కుచేలుడు అబ్బురపడి, “ఎందుకు నాయనా నామీద నీకింతటి దయ?” అన్నాడు.

“దయ కాదు. అందుకు ప్రతిఫలంగా నువ్వొకటి నాకు యివ్వాల్సివుంటుంది!”. . .వైముఖుడు.

“భాగ్యవంతుడివి. నీకు నేనేమివ్వగలను తండ్రీ?”

“శ్రీకృష్ణుని నామం! ఒక ఘడియ కాలం పాటు నాకు నువ్వు అరువు యివ్వాలి!” అన్నాడతడు.

వైముఖుడిని చిత్రంగా చూసేడు కుచేలుడు.

తర్వాత చిన్నగా నవ్వాడు.

“శ్రీకృష్ణుని నామం నేను నీకివ్వడమేమిటి? అది ప్రతివారికి స్వంతమే కదా!” అన్నాడు.

“నా ఉద్దేశ్యం అది కాదు. ఒక ఘడియకాలంపాటు దాన్ని నువ్వు స్మరించకూడదు. ఉచ్ఛరించకూడదు.”

ఆ మాట విని భరించలేక, “శ్రీకృష్ణ పరమాత్మా!” బాధగా అన్నాడు కుచేలుడు.

తర్వాత, “నీ పేరేమిటి తండ్రీ?” అడిగాడు.

“వైముఖుడు!”

“చూడు వైముఖ కుమారా! నాకు లేని ధాన్యం గురించి నేను యాచిస్తున్నాను. కానీ, నువ్వు నీలో వున్న పరమాత్ముడి కోసం. . .బయటి వాడిని నన్ను యాచిస్తున్నావు. అయినా, భగవంతుడిని అమ్ముకుని ధాన్యం పట్టుకురమ్మని నా భార్యాబిడ్డలు నన్ను కోరలేదయ్యా. పైగా అంత ధాన్యం దాచను వాళ్లకి ధాన్యాగారాలు కూడా లేవు. నీ ధాన్యం నీ దగ్గరే వుంచు. వస్తాను తండ్రీ!” చెప్పేసి, అక్కడ్నుంచి కదిలాడు కుచేలుడు.

శ్రీకృష్ణపరమాత్మా!” అనుకుంటూ ఎండనపడి నడిచి వెళ్తున్న ఆ పేద బ్రాహ్మణ యాచకుడిని సంతృప్తిగా చూసుకున్నాడు వైముఖుడు. . .సజల నయనాలతో.

* * * *

( సశేషం )

0 అభిప్రాయాలు: