ప్రసంగి!.. 4 (కథ)
శ్రీమంతుడైన నా బాల్య స్నేహితుడొకతడు నా హైదరాబాదు తిరుగు ప్రయాణం గురించి తెలుసుకుని, తన కారులో నన్ను నెల్లూరు రైల్వేస్టేషన్ దాకా దిగవిడిచి రమ్మని ‘డ్రైవర్’ ని పంపేడు.
నేనూ, నిర్మలా ప్రయాణమయ్యాం! ఆమెతో కలిసి ప్రయాణం చేయడం నా జీవితంలో అదే మొదటిసారి. అక్కడి నుండి నెల్లూరికి గంట సేపు ప్రయాణం. నెల్లూరు చేరే వరకూ నిర్మల నాతో కబుర్లు చెపుతూనే వుంది.
ఆ మాటల్లో మా వూరి ప్రజలంతా పాత్రలు! సరోజ జడ పిన్నులు పోగొట్టుకుని భర్త చేత పుట్టింటికి వెళ్ళగొట్టించుకోవడం, సుబ్బుసుందరం పక్కింటి పదహారేళ్ళ రామసుబ్బమ్మని కన్నుగీటి చెప్పుదెబ్బలు తినడం, దౌర్భాగ్యుడు తాగుబోతు పాపారావు తన యింట్లో డబ్బులు తనే దొంగిలించి భార్య కేసు పెట్టడం మూలంగా పోలీసుల చేతుల్లో తన్నులు తినడం, పన్నెండేళ్ళ ప్రమీలారాణి ఎదురింటి అరవ కుర్రాడితో లేచిపోయి మళ్ళీ వారం తిరక్కుండానే తిరిగి రావడం, నిర్మల తోటి టీచర్ ఒకావిడ బాక్స్ లో అన్నంఉప్మా తెచ్చుకుని విందుకి ఈవిడని ఆహ్వానించకుండా తనొక్కతే తినడం, స్కూలు విద్యార్ధిని చంపకమాల నిర్మల బ్యాగ్ లోని గోళ్ళపెయింట్ దొంగిలించి షాపులో అమ్మడం ద్వారా పట్టుపడడం, నిర్మల పెన్ లోని ‘రీఫిల్’ అయిపోయినప్పుడు బాలుడు ‘గుడ్డు’ గాడి పెన్ అడిగి తీసుకుని వాడు చూడకుండా రీఫిల్లు మార్పుచేసి పొంగిపోవడం. . . ఇవన్నీ ఆ మాటల్లోని సన్నివేశాలు! అంతా లోయర్ మిడిల్ క్లాస్ భావజాలం! గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ నిర్మల చెప్పడం, జ్ఞాపకాన్ని వదిలేసి నేను వినడం. . . మా ప్రయాణం ఆహ్లాదంగానే సాగింది.
నేను నిర్మలకి ఎడమవైపున కూర్చున్నాను. మాటల మధ్యలో ఆమె విరగబడి నవ్వుతుంది. అప్పుడు కడుపు దగ్గర కండరాలు అద్భుతంగా మడతలు పడతాయి. సాగుతాయి. రొమ్ములు ఎగసెగసి పడతాయి. కనుబొమలు నాట్యం చేస్తాయి. పైట “నేనోపలేనమ్మా!” అంటూ కిందికి జారుతుంది. నిర్మల సర్దుతుంది. మళ్ళీ జారుతుంది.
అదంతా ఒక ప్రహసనం! . .కథాకమామీషు!! . .భోగట్టా!!! . .ఆమెతో మాటయినా చెప్పకుండా నేను ఆ సౌందర్యం తస్కరించి, అనుభిస్తాను. మిత్రద్రోహం చేస్తాను. ఎక్కడ అందం కనిపిస్తే అక్కడికి కక్కుర్తి పడి పరుగులుదీసే ఈ ఇంద్రియాల్నీ, ఏది చూడాలనుకుంటామో దాన్నే ఉన్నతంగా చూపించే ఈ మాయమనసునీ నేను నిరోధించలేను!
చేకటి పడింది! కారు రైల్వేస్టేషన్ చేరుకుంది!
జీవితం పరుగులు తీసినట్టు స్టేషన్ రద్దీగా సందడిగా వుంది. మరణ భయాన్ని కల్పిస్తూ రైళ్ళు దెయ్యాలై కూతలు పెడతాయి. ప్రాణం గగుర్పొడిచేట్టు యంత్రాలు ధ్వనులు చేస్తాయి. విద్యుద్దీపాలతో షాపులు శోభాయమానంగా వెలుగొందుతాయి. ఆలోచన ఆధునికత రూపంలో వెల్లి విరుస్తుంది. మనుషులు మరమనుషులై మాట్లాడుకుంటారు. ప్రేమలూ, ఆప్యాయతలూ. . . ద్వేషాలూ, పగలూ అన్నీ ముసుగులు తొలగించుకుని అక్కడ బయటపడతాయి. రక్తం విలువెంతో చూపించుకుంటాయి.
ఎక్కడికో ఈ విధాన పయనం!!
నేను వెళ్ళవలసిన “రైలు యింకా అరగంట లేటుంద”న్నాడు అనౌన్సరు. నేనూ, నిర్మలా రెస్ట్ రూంలోకి వెళ్ళలేదు. ఫాట్ ఫాం నెంబరు కనుక్కుని అక్కడే ఒక సిమెంటు బెంచీ మీద కూర్చున్నాం. వృత్తి వ్యత్యాసాన్ని పాటిస్తూ కారు డ్రైవర్ మరో బెంచీ మీద అసీనుడయాడు. నేను ట్రైనెక్కాక నిర్మలని తీసుకుని అతడు మళ్ళీ అల్లూరు చేరవలసి వుంది.
ఏదో ట్రైనొచ్చింది. రద్దీ మరింత పెరిగింది. టీ షాపు కుర్రాళ్ళ పరుగులూ, పండ్ల కొట్టు వాళ్ళ అరుపులూ, బిచ్చగాళ్ళ కేకలూ, పిల్లల కేరింతలూ, పెద్దల పలకరింపులూ, యింకా వీడ్కోళ్ళూ. . . ఆ గందరగోళంలో నేనూ నిర్మలా మాట్లాడుకోలేదు. చూస్తున్నాం!
మాకు అటువైపున అవిటి బిక్షగాడొకడు చిల్లరనాణేలు అడుక్కుంటున్నాడు. అతడికి పుట్టుకతోనే రెండు చేతులూ లేనట్టుంది. మెడలో రేకు డబ్బా ఒకటి వ్రేలాడుతోంది. అప్తులెవరో వాడి మొల చుట్టూ రెండు గజాల గుడ్డ చుట్టారు.
“మళ్ళీ ఎప్పుడొస్తావు?” అడిగింది నిర్మల.
“ఎప్పుడో!” అన్నాను నిర్లిప్తంగా.
“క్రితంసారి నువ్వొచ్చి అప్పుడే సంవత్సరమైంది. ఈసారి విజయనీ, పిల్లల్నీ తీసుకురా.” అంది.
“తప్పకుండా.” అన్నాను.
అవిటివాడు మేంకూర్చున్న చోటికి చేరుకున్నాడు.
“దర్మవయ్యా బాబూ. . .! దరమం. . .!” అన్నాడు.
చిల్లర కోసం నిర్మల బ్యాగ్ తెరిచింది. అప్పుడే వూహించని విధంగా ఓ చిత్రమైన సంఘటన జరిగింది.
అవిటివాడి మొలకి చుట్టివున్న గుడ్డముక్క వూడి, గబుక్కున క్రిందికి జారిపోయింది. దాన్ని తిరిగి అందుకుని కట్టుకోడానికి వాడికి చేతులు లేవు. చేసేదేమీలేక నగ్నదేహుడై అతడు గబుక్కున నేలమీద కూర్చుని మోకాళ్ళు ముడుచుకున్నాడు. సహాయం కోసం తన వారెవరైనా వుంటారేమోనని చుట్టూ చూశాడు.
ఊహించని పరిణామం నన్ను మూగవాడ్ని చేసింది. నేను చూస్తూండిపోయాను. యథాలాపంగా బ్యాగ్ లోంచి చిల్లర పైసలు తీస్తున్న నిర్మల, వున్నట్టుండి అకస్మాత్తుగా ఆ దృశ్యం చూసింది. చటుక్కున వెంటనే తల పక్కకి తిప్పుకుంటూ. . .
“చక్రీ! వెళ్ళి అతడికి బట్ట కట్టు.” అంది.
నేను విస్తుపోయాను. “ఏమిటి నేనా?” అన్నాను.
“నువ్వే. ముందు అతడి మొలకి బట్ట చుట్టు. అంది నిర్మల మళ్లీ.” ఆమె పరిస్థితి నాకేం అర్థం కాలేదు.
“ఏంటి నిర్మలా నువ్వంటున్నది. నేను వెళ్ళి ఆ అవిటివాడికి పంచె కట్టాలా?” విసురుగా అడిగాను.
నిర్మల నావైపు అర్థంగానట్టు చూస్తూ, “అవును. ఏం?” అంది.
“నేనేమిటీ. ..వాడికి బట్ట కట్టడమేమిటి. నీకేమయినా పిచ్చి పట్టిందా?” కోపంగా అన్నాను.
నిర్మల క్షణం సేపు నా వైపు చిత్రంగా చూసింది. ఆపైన ఏదో నిశ్చయించుకున్నదాన్లా చటుక్కున బెంచీ మీది నుండి లేచింది. నా ప్రమేయం ఏదీ లేకుండా అక్కడ్నుంచి కదిలి అవిటివాడిని చేరుకుంది. క్షణంలో నేలమీదున్న గుడ్డ ముక్కను చేత్తో అందుకుని, అవిటివాడిని లేచి నిలబడమని చెప్తూ, చేత్తో సంజ్ఞ చేసింది.
ఆ హఠాత్పరిణామానికి అవిటివాడు నివ్వెరపోయాడు. విస్మయం చెందాడు. అది కలో నిజమో నన్న సంశయం ముఖంలో తాండవిస్తుండగా, యాంత్రికంగానే లేచి నిలబడిపోయాడు.
ఇంతలో నిర్మల చేతిలోని గుడ్డ ముక్కని అతడి మొలకి అడ్డం పెడ్తూ, అతడి నడుము చుట్టూ గుడ్డని గబగబా చుట్టివేసింది. పట్టుకోసం పైన మొలత్రాడు వేసింది.
ఆకసమున ఒక మెరుపు మెరిసింది!
అక్కడి స్థలం ప్రేమ వికాసం జరుపుకుంది!!
అప్పటి కాలం మానవతని ప్రకటించుకుంది!!!
అవిటివాడు ఆ చర్యకి పూర్తిగా అవాక్కయాడు. తర్వాత తేరుకుని, “మాయమ్మే!” అన్నాడు. కృతజ్ఞతని వెలిబుచ్చుకోవడం అంతకుమించి అతడికి చేతగాదు. దణ్ణం పెట్టడానికి కూడా వాడికి చేతులు లేవు. అతడొక దురదృష్ట జీవుడు.
సరిగ్గా క్షణం తర్వాత నిర్మల వెనక్కి తిరిగి నన్ను చేరుకుని, “పాపం. అతడి స్థితి చూడు చక్రీ!” అంది.
అంతక్రితమే నా అల్పత్వానికి నేను సిగ్గుపడడం, నిర్మల లోని మహోగ్రమైన ఔదార్యం చూసి దిగ్భ్రాంతి చెందడం, రెండూ జరిగిపోయాయి! అలవిగాని కన్నీరు అప్పటికే నా కళ్ళని కమ్మేసింది. ఎందుకంటే. . .ఎంతగా నేను ‘స్టేటస్’ అన్న మేలి ముసుగులో అవిటివాడికి దూరంగా జరిగినా, నిర్మల చేసిన పని ఈ లోకంలో ప్రతి మనిషీ నిర్వర్తించవలసిన కనీస మానవతా ధర్మమని నాకు తెలుసు. నాకే కాదు. . .మనసున్న ప్రతివాళ్ళకి అది క్షుణ్ణంగా తెలుసు!
అప్పుడు. . . ఆ క్షణంలో అక్కడ నేను లేను. అమె లేదు. ఒక పరిశీలన మాత్రం అక్కడ శూన్యంలో అవిష్కరించుకుంది.
ఆమె ఒక స్త్రీ! సంకుచితమైనది. విశాలమై విస్తరించుకున్న తాత్విక సిద్ధాంతాలు ఆమెకి తెలీవు. పరిధి నుండి కేంద్రం వైపు దూసుకుపోయే తపన అమెలో తొలినాటి నుండీ కలుగలేదు. లోనుండి వచ్చిన ఒక ధ్వని ప్రకారంగా ఆమె ఎప్పుడూ మసలుకుంటుంది. తన జీవితంలో ప్రతి నడకా ఆ ధ్వననుసారంగానే నడిచింది. ఆమె ప్రయాణంలో గమ్యానికి చోటు లేదు. చేసే పనులకీ, తీసుకున్న నిర్ణయాలకే ఆమె వద్ద హేతువు లభించదు. మనసులోని మృదుత్వం కారణంగా అందరూ ఆమెకి మంచివారిలాగే అన్పిస్తారు.
ప్రేమ, ద్వేషం. . .మంచీ చెడూ. . . ఈ వివక్ష ఆమెకి లేదు. వాటిని వున్నవి వున్నట్టుగానే స్వీకరించింది. ఆ ప్రయత్నంలో ఆమె వివాహాన్నితనకి ప్రతిబంధకంగా భావించింది. కూడదనుకున్నది. ఆ నిశ్చయం జరగగానే. . .ఒక ఉదాత్త గంభీరమైన ఒరవడిలో ఆమె జీవితం విశాలంగా వ్వాపించుకుంది.
బంధాలు లేవు. బాధ్యతలు లేవు. ఎవరోమనుకుంటారోనన్న భయం లేదు. రేపనేది అసలే లేదు. ‘ఈ రోజు’ జీవితంలో ప్రధానమైంది. తనకి తోచిన విశుద్ధమైన దారిలో ఆమె రోజుని ప్రారంభిస్తుంది. అదే కారణంగా. . . వయసులో వున్న మగవాడి మొలకి నిర్భీతిగా బట్ట కట్ట గలిగింది.
చారిత్రక కాలగతిలో శ్రమించి, వ్వభిచరించి, చివరికి మరణించి సైతం తమ బిడ్డల్ని కాపాడుకున్న స్త్రీమూర్తులెందరో నాకా క్షణంలో గుర్తుకొచ్చారు. సమస్త మానవ మనో వ్యాపారానికి కేంద్ర బిందువైనదేదో నాకు స్థూలంగా తెలియసాగింది.
కోరిక, ప్రతిఫలాపేక్ష లేని చోట క్రియ నిండుగా, సంపూర్ణంగా వుంటుంది. కనుక, అది జీవించడంలో ఒక భాగమంటారు పెద్దలు! నిర్మల సహచర్యం మూలంగా కలిగిన ప్రోద్భలంతో నేనా మాటని నిరాకరిస్తున్నాను. అది జీవితంలో ఒక భాగం కానేరదు. అసలదే జీవితం!!
ప్రేమ మానవతకి చిహ్నం కాదు! అదే మానవత్వం!!!
ఈ మాట ఈ భూమిపై నివసించబోయే చిట్ట చివరి మానవుడికి తెలియజేయాలని ఆ క్షణంలో నాకొక కాంక్ష కలిగింది!
“చక్రీ.! ట్రైనొచ్చినట్టుంది.” అంది నిర్మల.
ఆలోచనల నుండి బయల్పడి, బ్రీఫ్ కేస్ అందుకుంటూ నేను కదిలాను.
నేను కదిలాను... నేను కదిలాను!!!
(ప్రసంగి! కథ సమాప్తం)
3 అభిప్రాయాలు:
బాగా రాస్తున్నారు.మరిన్ని అందిస్తూ వుండండి.
అనవసరపు వాక్యవిన్యాసాల గందరగోళం వదిలించుకోవలసిన అవసరం కనిపిస్తుంది. కథనమూ, పాత్రల స్వభావాలు ఏకరీతిగానూ, సంబద్ధంగానూ ఉండేలా చూసుకుంటే మంచి కథలు రాయగలరు.
కధ, కధనం రెండు బాగున్నయి..మరిన్ని రాస్తారు అని ఆశిస్తు...
Post a Comment