ఏమొకొ చిగురుటధరమున...!..1
ఏమొకొ చిగురుటధరమున. . .
(‘స్వాతి’ సపరివార పత్రిక సరసమైన కథల పోటీలో రూ.1,000 బహుమతి పొందిన ఉత్తమ సరసమైన కథ! సంచిక 22.03.1996 లో ప్రచురితమైంది.)
తూర్పున సింధూరం లాంటి ఎర్రని సూర్యుడు కర్తవ్యోన్ముఖుడైన యోధుడిలా పైకి లేచాడు. రాత్రి రోతలో తడిసి బరువెక్కిన హరితవృక్షాలు తుషారంలో మునిగి విషాదాన్ని విసిరి కొట్టాయి. మంచులో మెరిసి మలినం పోగొట్టుకున్న పూలు సప్త వర్ణాల్లో వికసించి, వికాసం చెందాయి.
పిట్టకూనల, పక్షి ప్రౌఢల కేరింతల, త్రుళ్ళింతల కిల కిల కిలా రావాలతో సృష్టి స్వరంలో సుమధుర శృతులు పలికాయి. విశ్వగానంతో వివశత్వం పొందిన ఒక పొగరుబోతు ఈలపిట్ట కూతలో మైమరచి విశ్రాంతిని మరచింది.
ఆ ప్రకృతిలోని ఆర్ధ్రత నా శరీరాన్ని ఛిద్రం చేసుకుని, నా నాడుల్ని కదిల్చి, నా ఆత్మను మృదువుగా పెనవేసుకుంటున్నట్టు నాకొక భ్రాంతి కలిగింది. నాకు నేనే తెలీని ఒకానొక అయోమయావస్థలో కొంతసేపు అలాగే కోవెల మెట్లమీద కూర్చుండిపోయాను.
“భగీరధస్వామీ!” వాచ్ మెన్ పిలుపుతో ఈ లోకం లోకి వచ్చాను. ‘ఏమిట’న్నట్టు ప్రశ్నార్థకంగా చూశాను.
“చంద్రశేఖర స్వామి తమర్ని పూజకి వేళయింది రమ్మంటున్నారు.” చెప్పి, అతడు వెళ్ళిపోయాడు.
జుట్టు ముడివిప్పి, విదిలించి, తిరిగి ముడి పెట్టుకుంటూ నేను లేచాను. నదిలో స్నానం చేసినప్పుడు తడిసిన కాషాయం పంచె ఇంకా తడిని ఆర్పుకోకుండా బలిష్టమైన నా కాళ్ళని చుట్టేసింది. కొద్దిదూరంలో గుడిగంటలు హృదయస్పందనని అదుపు చేస్తున్నట్టు పవిత్రంగా, లయబద్దంగా విన్పిస్తున్నాయి.
ఎడతెగని జీవితం కర్మాగారంలో అలుపెరుగని శ్రామికుడిలా నేను గర్భగృహం వైపు నడిచాను.
మొదట్లో ఈ అర్చకవృత్తిపై నాకంత గౌరవం వుండేది కాదు. నేను బి.యస్.సి. పట్టా పుచ్చుకున్న తర్వాత, నా తల్లిదండ్రులు వంశపారంపర్యంగా లభించిన ఈ వృత్తిలో నన్ను బలవంతంగా ప్రవేశపెట్టారు.
‘పాశ్చాత్య నాగరికత ప్రభావంవల్ల నాకు విశాలమైన విశ్లేషణా జ్ఞానం అలవడిందనీ, సృజనశీలమైన ఆలోచనా విధానంతో నేను చైతన్య పూరితమైన జీవితం గడుపుతున్నాన’నీ అప్పట్లో భావించేవాడిని!
అందువల్ల. . . కేవలం కర్మసిద్ధాంత విశ్వాసపు పునాదుల పైనా, హైందవ సాంప్రదాయపు శిథిల స్తంభాలపైనా నిలబడిన ఈ అర్చకవృత్తిని నేను ఆనాడు గౌరవించలేదు. గౌరవంలేని వృత్తి ఆత్మద్రోహమే అయనప్పటికీ. . .జీవనోపాధి కోసం, భవిష్యత్తులో భద్రతకోసం జీవితంలో ఆ మాత్రం రాజీ నాకు తప్పలేదు!
కానీ, రాను రాను ఆ వృత్తిపై నాకు మమకారం పెరగసాగింది. దానికి తోడు పెళ్ళి చేసుకుని, ఇద్దరు బిడ్డల తండ్రినై ముఫైరెండేళ్ళ వయసొచ్చాక ఈనాటికి ఈ వృత్తిపైనా, ఈ దేవస్థానం పైనా నాకు గౌరవం మరీ పెరిగిపోయింది.
మాది నెల్లూరు జిల్లాలో పెన్నానదికి ఉత్తరం వైపునున్న శ్రీ జొన్నవాడ కామాక్షీదేవి ఆలయం! బాగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం కావడంతో ప్రస్తుతం నా ఆర్థికస్థితి కూడా బాగానే వుంది!
* * * *
ధూప దీప, నైవేద్యాల మధ్యా, ఒత్తైన పుష్ప అలంకరణల మధ్యా, మంత్రఘోషల, ఆగరొత్తుల పరిమళాల మధ్యా గర్భగృహంలో దైదీప్యమానంగా వెలిగిపోతోంది ‘శ్రీ కామాక్షీదేవి’ మూలవిరాట్టు!
అంతరాళంకి ఇటువైపున కుడ్యస్తంభం దగ్గర భక్తులకి కర్పూర హారతి అందిస్తూ నేను నిల్చున్నాను. ఆటువైపుగా చంద్రశేఖరస్వామి భక్తులకి తీర్థప్రసాదాలు అందిస్తున్నాడు.
యథాలాపంగా హారతిపళ్లెం పట్టుకున్న నేను “పూజ చేయాలి స్వామీ!” అన్న స్త్రీ కంఠం విని ఆ కంఠంలోని మృదుత్వానికి, మార్ధవానికి ప్రతిస్పందిస్తూ మంత్రోచ్ఛారణ ఆపి, అటువైపు చూశాను.
ఒక పద్దెనిమిదేళ్ల అమ్మాయి! పరికిణీ, ఓణీ వేసుకుంది. చేతిలో పూలబుట్ట వుంది!
ఆమె వెనుక అదే వయసుగల అమ్మాయిలు నలుగురున్నారు. వాళ్ళు నిల్చున్న చోటులో సరైన వెలుతురు లేక మసకగా వుంది.
“అష్టోత్తరమా?” పళ్ళెంలోని విభూతిపండు పక్కకి నెడుతూ నేను మామూలుగానే అడిగాను.
“మంత్రపుష్పం!” అంటూ, ఆమె కాస్త ముందుకి నడిచి, పూలబుట్టలోంచి కొబ్బరికాయ, పూలు తాంబూలం తీసి నాపళ్ళెంలో పెట్టింది.
ఆమె అలా ముందుకు జరిగినప్పుడు మండుతున్నకర్పూరం వెలుగు ఆ అమ్మాయి ముఖంపై పడింది. నేనామె వైపు చూశాను.
సూర్యుడూ, చంద్రుడూ ఒకేసారి ఉదయించి, అస్తమించగలిగిన విశాలమైన నుదురూ, నీటి వూటను నింపుకున్న ఒయాసిస్సులా మూగగా పిలుస్తూ. . .ప్రేమను వర్షించే కళ్ళూ. . .ఇంద్రచాపంలా వంగిపోయిన నల్లని కనుబొమలు. . .ఇంకా కళ్ళుతెరవని చకోరపక్షిలా వణికిపోయే కనురెప్పలు. . . వాటికింద విషాదం గూడుకట్టుకుని ఉనికిని ఎర్పరచుకున్నట్టు నల్లని నీడ, పుట్టినచోటు మరచిపోయి ప్రపంచాన్ని ధిక్కరించే ముక్కు, విశృఖలంగా రేగి విశ్వమంతా వ్వాపించుకోడానికి ప్రయత్నిస్తే అణిచిపెట్టి దువ్విన ఒత్తైనజట్టు. . .హిమాలయంలోని మంచులోయల్ని గుర్తుకుతెచ్చి, అలవోకగా శరీరంలో కలసిపోయిన మెడవంపు. . .పురుషుడు వులిక్కిపడి స్వప్నలోకంలో శక్తుల్ని వెదుక్కునేట్టు చేయగలిగే సామర్థ్యం గల నిండైన ఛాతీ!
ఒక సౌందర్యపు వెలుగుతో నా శరీరం బలంగా వూగింది.
“పేరు?” స్వప్నంలోంచి అడిగినట్టు అడిగాను.
“పద్మాంజలి!” గడ్డం పైకెత్తి స్పుటంగా చెప్పింది.
“గోత్రం?” అన్నాను.
“విజయమహర్షి గోత్రం!”
“సూత్రం?” చెప్పలేదనుకుంటూ అడిగాను.
“ఆపస్తంభన సూత్రం!” కళ్ళు ఇంతింతవి చేసి చెప్పింది.
“వంశం?” ఈసారి ఉత్సాహంగా అడిగాను.
“ఋషి వంశం!”
“జపం?” నేను పట్టు వదల్లేదు. అసలు మంత్రపుష్పానికి అన్ని వివరాలు అవసరంలేదు.
“గాయత్రీ జపం!” చిత్రంగా చెప్పింది. ఇన్ని ప్రశ్నలడిగిన ఆచార్యుడిని జీవితంలో మొదటిసారిగా చూస్తున్నట్టు.
ఈ కాలంలో కూడా సాంప్రదాయక విషయాల పట్ల ఆమెకున్న శ్రద్దకి నాకు ఆశ్చర్యమనిపించింది. ఆలోచిస్తూనే లోపలికి వెళ్లి, పరధ్యానంగా శ్లోకం పఠిస్తూ ఏదో పూజ అయిందనిపించి, హారతి తీసుకుని మళ్ళీ వాళ్ళున్న చోటికి వచ్చాను.
వాళ్ళంతా హారతి కళ్ళకద్దుకుని, కామాక్షీదేవికి నమస్కరించారు. నేను మాత్రం లతాగుల్మ శిల్పంలాంటి సౌందర్యం గలిగిన పద్మాంజలిని కన్నార్పకుండా చూస్తూనే వున్నాను.
ఇంతలో. . . పద్మాంజలి చటుక్కున పక్కకి తిరిగి, పక్కనున్న అమ్మాయిని మోచేత్తో పొడస్తూ, “ఏయ్! సీతా. . .పూజారి కుర్రవాడే. ఎంత బావున్నాడో చూడు!” ఆమె చెవిలో గుసగుసగా చెప్పింది.
“అవునే పద్మాంజలీ! పచ్చగా, బలంగా, అందంగా వున్నాడే.” అంతే గుసగుసగా అంది ఆ సీత అనే అమ్మాయి.
“అబ్బొ. . . వర్ణించేస్తున్నావే. . .నోర్ముయ్! ముందు పైట సరిజేసుకో. చూసేస్తాడు!”. పద్మాంజలి గదిమింది.
మిగిలిన అమ్మాయిలంతా ఫక్కున నవ్వారు. ఆ తర్వాత, నోటికి చేతులు అడ్డం పెట్టుకుని నవ్వుకుంటూ అక్కడ్నుంచి బయటకు పరుగుతీశారు.
అదంతా నాకు విన్పిస్తూనే వుంది. నేను బిత్తరపోయాను. ఆ తర్వాత కొద్దిసేపటికి వాళ్ళ కొంటెతనం గుర్తొచ్చి నాకు నవ్వొచ్చింది. నాలో అంత వరకూ విజృభించిన పూజ్వభావం చచ్చి, దాని స్థానంలో శృంగారం అంకురించింది. నాదనామక్రియా రాగంలోని అన్నమాచార్య కీర్తన మనసులో మెదిలింది.
“ఏమొకొ చిగురుటధరమున యెడనెడ కస్తూరి నిండెను. . . భామిని విభునకు రాసిన పత్రిక కాదు గదా. . .!”
* * * *
(సశేషం)
2 అభిప్రాయాలు:
It's is better reduce the age of Panthulu garu (Bhagiradha)
Thank you
Post a Comment