ఒకానొక అజ్ఞానపు క్షణంలో. . . నాకు తెలీకుండా నేనే జన్మించి,  అమ్మ చనుబాలలో ఆది సంవేదన అనుభవించి. . .ఆటపాటలలో అద్వితీయుడనై రాణించి. . .సంఘ విద్యా సముపార్జనలో సారస్వత చక్రవర్తినై, పుస్తకాల్ని పఠించి. . .పరీక్షల్ని పరివీక్షించి. . .ఆత్మజ్ఞాన అవలోకనంలో విలువల వలువలు వూడదీసి. . .విశ్వతత్వాలు స్మరించి. . . మానవ శ్రేయస్సు మహా లక్ష్యమై పోగా. ."ఈ ప్రపంచపు దొడ్డబిడ్డగా ఉద్భవించాల"నీ, "ఒక పూర్తి మానవుడిగా పరిణమించాల"నీ, నేను కంటున్న కల,  కడుతున్న కోట. . .ఒహ్ ఇంతెందుకు కనుచూపు మేరలో. . . నా జీవితం ఒక వేద సంకలనం!!  నేనొక ఈశ్వరుడిని!!! ( ఇది ఈ బ్లాగులోని ప్రసంగి కథలో ఒక పాత్ర మనోభావాలు __ రచయిత )

Tuesday, August 21, 2007

కుచేలుడు!.. 3 (కథ)

కుచేలుడు!

(‘స్వాతి’ సపరివార పత్రిక పంచరత్నాల కథల పోటీలో రూ.5,000 బహుమతి పొందిన ఉత్తమ పౌరాణిక కథ! సంచిక 9.11.2001 లో ప్రచురితమైంది. ఐదు లక్షల పాఠకులకు ‘స్వాతి’ అందించిన కానుక అన్న ప్రశంసలు ఆనాడు అందుకుంది)


కుచేలుడు నీళ్ళు తాగాక ఖాళీ పాత్రను అందుకుని, ఆమె వెనుదిరిగింది. “ఘల్లు! ఘల్లు!” మంటూ కాలి అందెలు శబ్దం చేస్తుండగా మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది.



ఇంకొంత సమయం గడిచింది. “పూజ పూర్తి కావచ్చింది. హారతి పట్టుదురుగానీ లోపలికి రండి! కుచేలవర్యా!” పిలిచింది వైజయంతీదేవి.

కుచేలుడు లేచాడు. లోనికి నడిచాడు. అతడలా లోనికి ప్రవేశించగానే, వైజయంతీదేవి అతడి వెనకనుండి బయటకి ఊయల ఉండేచోటుకి వచ్చేసింది. కుచేలుడు వున్న ఆ గది తలుపులు మూసి గడియపెట్టింది.

ఇదేమీ ఎరుగని కుచేలుడు లోనికి వెళ్ళినాడు. లోపల అంతా కలియజూశాడు. అంతే! విద్యుధ్ఘాతం తగిలిన వాడిలా ఉలిక్కిపడ్డాడు. అక్కడ పుష్పికా త్రిలోచన నిలుచుని వుంది. మామూలుగా కాదు. వివస్త్రగా. . .నగ్నంగా. . .పూర్తిగా ఒంటిమీద బట్టలు లేకుండా.

పుష్పికా త్రిలోచన రెండు చేతులూ చాపి, ‘రమ్మ’న్నట్టుగా పిలిచింది. ఆపైన “రండి! భూసురోత్తమా! రండి!. . .వచ్చి వశం చేసుకోండి. . .ఈ శరీరం మీదే!” అంది. అలా ఆమె వయ్యారంగా ఆహ్వానిస్తున్నప్పుడు ఆమె రొమ్ములు బరువుగా ఊగినాయి. పిరుదులూ, తొడలు లయబద్దంగా కదిలినాయి.

క్షణంలో మనసు చలించింది. ప్రేరణ కలిగింది. మరోక్షణం గడిచివుంటే అక్కడేదో ఉపద్రవం జరిగివుండేది. కానీ, అంతలో విచక్షణ మేల్కొంది.

అనుక్షణం భగవన్నామ స్మరణకి అలవాటు పడిన ఆయన మస్తిష్కం అంతలోనే అకస్మాత్తుగా తెప్పరిల్లింది. జరిగిన పొరపాటుని లిప్తపాటులో గ్రహించింది.

అంతే! నిలుచున్నవాడు నిలుచున్న ఫళంగా వెనక్కి తిరిగాడు. ఆ ప్రదేశం విడిచి బయటకు రాబోయాడు. తలుపులు బిగించి వున్నాయి. నెట్టి చూశాడు. రాలేదు. కాలెత్తి ఒక్క తాపుతో వాటిని విరగదన్నాడు.

కిరుక్కుమన్న శబ్దంతో గడియవూడింది. “భళ్ళు”న తెరుచుకున్నాయి తలుపులు. అక్కడ బయట గదిలో నిలుచున్న వాళ్ళెవరినీ అయన పట్టించుకోలేదు. పరుగుపెడ్తున్నట్టుగా వేగంగా నడుచుకుంటూ ఆ ఇంట్లోంచి బయటపడి ఆయన ఆ నగర వీధుల్లోకి వచ్చాడు.

‘శరీరంలోని తాపాన్ని, కామ ప్రకోపాన్ని వెంటనే చల్లార్చాలి. చేసిన తప్పుకి ప్రాయశ్ఛిత్తం తక్షణం జరగాలి.’ ఏంచేయాలో తోచలేదు. చుట్టూ చూశాడు.

అక్కడికి కొద్ది దూరంలో వీధిలోనే ఒక ముసలావిడ పొయ్యిమీద పెనం పెట్టి అట్లు వేస్తోంది. వాటిని అమ్ముకుని అక్కడే జీవిస్తోంది. అది ఆయన కంట పడింది.

అంతే! వచ్చినంత వేగంగా ఆ పెనం వైపు నడిచాడు. పెనం సమీపంలోకి చేరుకుని ముసలావిడ ఒక దోశె తీసి మలి దోశె వేసే లోపు వంగి గబుక్కున కాలి మసిలిపోతున్న ఆ పెనం మీద కూర్చుండి పోయాడు.

ఊహించని ఆ పరిణామానికి ముసలిది బిత్తరపోయి, ఒక వెర్రికేక పెట్టి అక్కడ్నుండి పరుగుదీసింది. పెనం మండుతోంది. కుచేలుడి ఆసనభాగం కాలిపోసాగింది.

“కృష్ణ పరమాత్మా!కృష్ణ పరమాత్మా!! శ్రీకృష్ణ పరమాత్మా!!! ఇది అపరాధ పరిహారమయ్యా!” కుచేలుడు పిచ్చెక్కినవాడిలా పెద్దగా అరుస్తున్నాడు.

చేసిన తప్పుని గుర్తెరిగి, ప్రచండవేగంతో పరుగు పరుగున వచ్చాడు అక్కడికి వైముఖుడు. క్షణంలో కుచేలుడిని చేరుకుని, ఆయన చేతిని పట్టుకున్నాడు. ఒక్క వుదుటున పైకెత్తి ఆయనని ప్రక్కకి ఈడ్చిపడేశాడు. అప్పటికే కుచేలుడి ఆసనభాగం బాగా కాలిపోయింది. ఇంతలో ఆఘమేఘాల మీద అక్కడికి చేరుకున్న సైనికులు ఆయనను వైద్యశాలకి తరలించారు.

* * * *

ఆ మరుసటి రోజు!

అది ద్వారకా నగరం. కుచేలురవారిల్లు. ఆ యింటి వాకిట్లో వామాక్షీదేవి నిలుచుని వుంది. ఆమె పాదాలపై పడి వైముఖుడు ప్రణమిల్లి వున్నాడు.

క్షణం తర్వాత లేచాడు. అశ్రునయనాలతో అన్నాడు.

“అమ్మా! మన్నించు తల్లీ. ముందుగా భావించినట్టే నాకు ఓటమి ఎదురైంది. దాని గురించి సంబరమేగానీ చింతలేదు. కానీ, దురదృష్టవశాత్తూ గురువర్యులను పరీక్షించే సమయంలో ఒక అపరాధం జరిగింది. కుచేలుర వారికి స్వల్పంగా గాయాలయినాయి. పక్షం రోజుల్లో కోలుకుంటారు.”

“నా వల్ల జరిగిన ఆ అపచారానికి నేనూ ప్రాయశ్ఛిత్తం చేసుకోదలిచాను. నేటినుండీ ఈ జీవితం చివరి వరకూ అష్టైశ్వర్యాలనూ వదులుకుని, కాషాయ వస్త్రాలు ధరించి కుచేలుర వారి సేవలో నేను బతుకు నెరవేర్చదలిచాను. ఇదే నా అపరాధానికి నేనిచ్చుకున్న పరిహారం!” ఆ మాటలు విని, వామాక్షీదేవి నవ్వింది. నవ్వుతూనే ఏడ్చింది.

( కుచేలుడు కథ సమాప్తం )

2 అభిప్రాయాలు:

oremuna said...

కథ ఏం బాగో లేదు

ఎందుకు బాగో లేదు?

1. కుచేలుడు అలా చేసేవాడా?

ఎలా?

మొదటి ప్రశ్న స్త్రీ ని చూసి టెంప్ట్ అవ్వడం? (అసలు కుచేలుడు ఉన్నాడా లేడా అనేది తరువాతి ప్రశ్న, అది మనకు అప్రస్తుతం, ఓ కారక్టరు అనుకుందాం)

సరే టెంప్ట్ అయ్యాడే అనుకుందాం, దానిలో తప్పేముంది? సెక్స్ ఈజ్ సిన్ అని కుచేలుడు ఎక్కడన్నా చెప్పినాడా? అసలే పెళ్ళాం పిల్లలు కల వాడాయ,

సరే టెంప్ట్ అవ్వడం కూడా సిన్ అనే నుకుందాము, దానికి అతని పనిష్మెంటు అలా దోసెల పెనంపై కూచ్రోవడమా? -- ఇక్కడ కూడా ప్రశ్నలు ఆ రోజుల్లో కూడా దోశలు ఉన్నాయా :) (కొద్దిగా కామెడీ ప్రశ్న) ఉన్నాయనే నుకుందాము, కానీ ఎంత పెద్దగా ఉన్నాయి? సరే పెద్దవే ఉన్నాయనుకుందాము )

అంత పెద్ద తప్పు చేసినట్టు భావిస్తే కుచేలుడు ఏ అరేబియా సముద్రంలోనో దూకకుండా ఇలా దోశల పెనంపై కూర్చుంటాడా?

సరే ఏం బాగుంది?

కథలో శైలి బాగుంది, చిన్నగా వ్రాయడం బాగుంది, ఇలా రంగురంగులతో ప్రజంట్ చేయడం బాగుంది. ఇలా బ్లాగులో పెట్టడం మరీ మరీ బాగుంది

Anonymous said...

అవును, బాలేదు. పరస్త్రీని చూచి చలించకపోవడానికి అతను సన్యాసి కాడు కదా! అయినా అది అతని భక్తికి పరీక్ష ఎందుకయ్యింది? పెనం మీద కూచోవడం మరీ చిన్నపిల్లల చేష్టలా ఉంది. కళ్ళు పీక్కున్న విప్రనారాయణ ప్రేరణ కామోసు!

ఆమెని చూచి 'కృష్ణా' అని కాళ్ళ మీద పడుంటే గుడ్డిలో మెల్ల అయుండేదేమో!