ఒకానొక అజ్ఞానపు క్షణంలో. . . నాకు తెలీకుండా నేనే జన్మించి,  అమ్మ చనుబాలలో ఆది సంవేదన అనుభవించి. . .ఆటపాటలలో అద్వితీయుడనై రాణించి. . .సంఘ విద్యా సముపార్జనలో సారస్వత చక్రవర్తినై, పుస్తకాల్ని పఠించి. . .పరీక్షల్ని పరివీక్షించి. . .ఆత్మజ్ఞాన అవలోకనంలో విలువల వలువలు వూడదీసి. . .విశ్వతత్వాలు స్మరించి. . . మానవ శ్రేయస్సు మహా లక్ష్యమై పోగా. ."ఈ ప్రపంచపు దొడ్డబిడ్డగా ఉద్భవించాల"నీ, "ఒక పూర్తి మానవుడిగా పరిణమించాల"నీ, నేను కంటున్న కల,  కడుతున్న కోట. . .ఒహ్ ఇంతెందుకు కనుచూపు మేరలో. . . నా జీవితం ఒక వేద సంకలనం!!  నేనొక ఈశ్వరుడిని!!! ( ఇది ఈ బ్లాగులోని ప్రసంగి కథలో ఒక పాత్ర మనోభావాలు __ రచయిత )

Wednesday, September 5, 2007

అమృతమూర్తి!..1

అమృతమూర్తి!

(‘స్వాతి’ సపరివార పత్రిక సంచిక 26.09.1997 లో ప్రచురితమైన సరసమైన కథ! ఆది నుండీ తుది దాకా ‘బిగి’ సడలక అలనాటి పాఠకుల మనసులు రంజింపజేసిందీ కథ!)


నేనుంటున్న గది బాగా ఇరుకై పోవడంతో నేను ఆదినారాయణ గారింట్లో తూర్పువైపు గదిని అద్దెకు మాట్లాడుకుని, అడ్వాన్సూ. . . అదీ చెల్లించాక పాతగదిలోని నాలుగు సామాన్లూ తీసి, అతికష్టం మీద చేరేశాను.

నాకేం పెద్దగా సామాన్లు లేవు. రెండు బక్కెట్లూ, మంచినీళ్ళ బిందె, ఫ్యానూ, సూట్ కేసూ, బెడ్డింగూ. . . అవిగాక ఓ గంపెడు పుస్తకాలు!

నాలాంటి రచయితకి పుస్తకాలకి మించిన ఆస్తులు ఈ ప్రపంచంలో మరోటి కనబడవనుకుంటా!

సామాన్లన్నీ జారిపోకుండా కొత్తగదిలోకి చేరాయన్న ఊహ కలిగాక నేను సంతృప్తిచెంది, గోడలకి మేకులు దిగేసి హేంగర్లూ గట్రా అన్నీ వరుసగా తగిలిస్తుండగా “నమస్తే! ప్రేమ్ చంద్ గారూ!” అన్న పలకరింవు వాకిలి దగ్గర వినబడింది.

నేను ఆదినారాయణగారేమోననుకున్నాను. కానీ కాదు. ఎవరో అపరిచిత యువకుడు.

“నమస్తే!” అభివందనం చేశాను. . . ‘నా పేరు అతడికెలా తెలిసిందా’ అనుకుంటూ.

అతడు లోపలికొచ్చాడు.

“నా పేరు నెహ్రూ. మీకు ముందు ఈ గదిలో నేనుండేవాడిని. కూర్చోవచ్చా?” అన్నాడు.

“భలేవారే కూర్చోండి!” అన్నాను.

అతడు చాపమీద కూర్చున్నాడు. “మీ గురించి ఆదినారాయణ గారు చెప్పారు. ఏం లేదు. . .మీతో ఓ చిన్న విషయం చెపుదామని వచ్చాను.” అన్నాడు.

నేను కూడా అతడి కెదురుగా కూర్చున్నాను.

“చెప్పండి!” అన్నాను.

“ఆదినారాయణగారి భార్య విద్యాధరిని చూశారా?” నేరుగా విషయం లోకి దిగుతూ అడిగాడు.

నాకేదో భయంగా అనిపించింది. “లేదు.” అన్నా. నిజంగానే నేనామెని చూళ్ళేదు. గదికి అడ్వాన్సు తీసుకున్న దగ్గర్నుండి అప్పడిదాకా నా మాటలన్నీ ఆదినారాయణగారితోనే నడిచాయి.

ఆయన జూనియర్ కాలేజీలో ‘లెక్చరర్’ అని విన్నాను. ఆయనకి ముఫ్పై అయిదేళ్ళు వుంటాయి. నిజానికి ఆయన భార్య ఎవరో చూడాలన్న కుతూహలం నాలో లేకపోలేదు. ఆయన్నే అడగాలనుకున్నాను. కానీ చేరిచేరకముందే అటువంటి ఆసక్తులు కనబరచడం మర్యాదకాదని మానేశా!

“ఊర్లో లేనట్టుందిలే! బహుశా పుట్టింటికెళ్లి వుంటుంది.” అన్నాడు నెహ్రూ.

నేను మాట్లాడలేదు. కానీ విద్యాధరి గురించి అతడు చెప్పబోయేదేమిటో తెలుసుకోవాలన్న అతృత నాలో క్షణక్షణానికీ ఎక్కువయింది. దాన్ని నేను పైకి కనిపించనీయలేదు.

“విద్యాధరి క్యారెక్టరు మంచిది కాదు తెలుసా?” అన్నాడు అతడు ఆలోచిస్తూ.

అక్కడ నేను మాట్లాడడానికేమీ లేదు.

అతడివైపే చూస్తున్నాను.

“ఆదినారాయణ అసమర్థుడు. అందువల్ల ఆమె ఆ అసంతృప్తితో కుర్రవాళ్ళ మీద పడుతుంది. ఆ విషయం ఆదినారాయణకి కూడా తెలుసు. అదుకే అతడీ గదిని మంచి కుర్రవాళ్ళని చూసి అద్దెకిస్తాడు. నేనీ గదిలో వున్నంతకాలం విద్యాధరి నన్ను చంపుకుతినేది. ఒకటిన్నర సంవత్సరం. ఆమె బాధ భరించలేక ఖాళీ చేశాను.” నెహ్రూ ఆగాడు.

నాకు తెలిసినంత వరకూ ఆడపిల్లలు అట్లా ఖాళీ చేస్తారు. . . మగాళ్ల ధాటికి తట్టుకోలేక. మగాళ్ళయితే చేయరు. ‘ఆడపిల్లల్లాగా ఈ నెహ్రూ అంత అమాయకమైన పురుషుడా?’ అతడిని పరిశీలించాను.

అతడికి ఇకవై అయిదేళ్ళుంటాయి. నా వయసే! ఎర్రగా, నిండుగావున్న చెంపలు. . .అంతే ఎర్రగా రంగుతేలిన పెదవులు. . .అందంగా ముఖంమీదికి పడే గిరజాల జుట్టు. . .దానికి తగ్గట్టు ఎరుపురంగు టీషర్టూ, బ్లూ కలర్ ప్యాంటూ.

నిజానికి అతడు నాకు ఆడపిల్లలాగే తోచాడు. మొత్తంమీద ఒక స్త్రీ వాంఛించదగిన అర్హతలు అతడిలో వున్నాయనిపించింది. అయినా, స్త్రీ ఎటువంటి మగవాణ్ణి వాంచిస్తుందో నాకు తెలుసా? ఈ కాలంలోనైతే ఎక్కువమంది డబ్బున్నవాళ్ళనే వాంచిస్తున్నారు(పైపైకి).

జేబులోంచి సిగరెట్ పెట్టె తీశాను.

“కాల్చండి!” అన్నాను. . .అతడికి ఆఫర్ చేస్తూ.

“నో థాంక్స్! నాకు అలవాటు లేదు!”

నేను సిగరెట్ వెలిగించుకున్నాను.

“అదే ప్రేమ్ చంద్ గారూ నేను చెప్పదలిచింది. విద్యాధరి మంచిది కాదు. ఆమె విషయంలో మీరు జాగ్రత్త వహించాలి. ఆ తర్వాత బాధపడి ప్రయోజనం వుండదు. ఇల్లూ గుల్ల ఒళ్ళూ గుల్ల! మీరు మంచివారిలా కన్పిస్తున్నారు. వస్తాను!” నెహ్రూ లేచాడు.

ఆ రెండు ముక్కలూ చెప్పేసి, అతడట్లా అర్థంతరంగా లేవడం నాకు ఆశ్చర్యమనిపించింది. అతడ్ని వాకిలి దాకా వెళ్ళి దిగబెడుతూ, “ఓ.కె! థాంక్యూ ఫర్ యువర్ కైండ్ సజెషన్.” అన్నాను.

“వెల్ కమ్!” అతడు వెళ్లిపోయాడు.

నేను వెనక్కి తిరిగాను. మనుషులు యిటువంటి మాటలు ఎందుకు చెపుతారో నాకు అర్థంకాదు. జరగబోయే అనర్థాన్ని గ్రహించి తోటి మనిషికి సాయం చేయాలన్న దయతోనైతే నాకు అభ్యంతరం లేదు.

కానీ ఏది అనర్థమో ఏది కాదో ఎవరైనా అంత సులభంగా ఎట్లా నిర్ణయించగలరు?

ఒకవేళ విద్యాధరి నన్నే వేధించి వుండినా నేనైతే అలా చెప్పివుండను. ఏదేమయినా, ఈ కథంతటికీ కారకురాలైన విద్యాధరి ఎవరో. . .ఆమె కథేమిటో. . .శృంగార వ్యథ యేమిటో నాకు తెలుసుకోవాలనిపించింది.

* * * *
“ప్రేమ్ చంద్ అంటే నువ్వేనా?” అంది బయట వాకిట్లోంచి ఒక స్త్రీ కంఠం.

అప్పుడే స్నానం చేసి, నడుముకి టవల్ చుట్టుకుని, ఫ్యాను గాలి చల్లదనంలో పాట పాడుకుంటున్న నేను ఆడగొంతు వినగానే వులిక్కిపడ్డాను. వాకిలి వైపు చూశాను. ఓ ఇరవై ఎనిమిదేళ్ళ యువతి. తలుపుమీద చేయి ఆనించి వయ్యారంగా నిల్చుని వుంది!

నేను ఆమే విద్యాధరి అయ్యుంటుందనుకుంటూ. మీరు. . .? చిన్నగా నసిగాను.

“మా ఇంట్లో చేరి నన్నే ఎవరని అడుగుతావా? ఇదేమి చిత్రం ప్రేమచందూ. . .?” అంది కళ్ళు కాస్తంత పెద్దవి చేసి తిప్పుతూ.

( సశేషం )

0 అభిప్రాయాలు: