ఒకానొక అజ్ఞానపు క్షణంలో. . . నాకు తెలీకుండా నేనే జన్మించి,  అమ్మ చనుబాలలో ఆది సంవేదన అనుభవించి. . .ఆటపాటలలో అద్వితీయుడనై రాణించి. . .సంఘ విద్యా సముపార్జనలో సారస్వత చక్రవర్తినై, పుస్తకాల్ని పఠించి. . .పరీక్షల్ని పరివీక్షించి. . .ఆత్మజ్ఞాన అవలోకనంలో విలువల వలువలు వూడదీసి. . .విశ్వతత్వాలు స్మరించి. . . మానవ శ్రేయస్సు మహా లక్ష్యమై పోగా. ."ఈ ప్రపంచపు దొడ్డబిడ్డగా ఉద్భవించాల"నీ, "ఒక పూర్తి మానవుడిగా పరిణమించాల"నీ, నేను కంటున్న కల,  కడుతున్న కోట. . .ఒహ్ ఇంతెందుకు కనుచూపు మేరలో. . . నా జీవితం ఒక వేద సంకలనం!!  నేనొక ఈశ్వరుడిని!!! ( ఇది ఈ బ్లాగులోని ప్రసంగి కథలో ఒక పాత్ర మనోభావాలు __ రచయిత )

Tuesday, September 18, 2007

మహాపరాధి!..1

(‘విపుల’ సచిత్ర మాస పత్రిక కథల పోటీలో రూ. 1500 లు బహుమతి పొందిన కథ! ‘విపుల’ 1996 మార్చి నెల సంచికలో ప్రచురించబడింది. ‘వేదగిరి రాంబాబు గారు’ వెలువరించిన 1996 తెలుగు కథల సమీక్షా గ్రంథంలో ఒక అజ్ఞాత వ్యాసకర్త ‘మంచి కథలు రాయగలిగిన శక్తి గలిగిన పదశిల్పి ఈ రచయిత’ అంటూ నన్ను ప్రస్తుతించినారు. ఆనాడు ఈ కథ మీద వెల్లువెత్తిన సమీక్షలెన్నో, పలుకరించి, పరామర్శించిన వ్యక్తులెటువంటివారో ఈ కథ ముగింపులో వివరిస్తాను. ఈ తరం పాఠకులకి కథ మొదట్లో కొంత యిబ్బందికరంగా అన్పించినా చివర్లో ఒక అద్భుతమైన సంఘటనతో పాఠకుల మనసుల్ని ద్రవింపజేసి ఒక ఆత్మిక విలువని అందజేస్తుందని విన్నవించుకుంటున్నాను. కనుక ఈ బ్లాగు సందర్శించే ప్రతి ఒక్కరినీ పేరు పేరునా దయచేసి ఈ కథను చదివితీరమని ప్రార్థిస్తున్నాను!)

మహాపరాధి!

ఓ తెల్లవారుఝాము!

అది హిమాచల్ ప్రదేశ్ లోనున్న ధర్మశాల! ప్రసిద్ధ పర్వత కేంద్రం!

అక్కడ చలచల్లని వాయు పవనాలమధ్యా, ‘పోలో’ పక్షుల కిలకిలారావాల మధ్యా, మంచు సెలయేరుల ముర్ముర సంగీతాల మధ్యా మహోజ్వల భారతీయ హైందవ సంస్కృతికి ఆలంబనగా నెలకొల్పబడిందొక ఆశ్రమం.

శ్రీ హైందవ ప్రచారక పరిషత్తు!

ముఫ్ఫై రెండు ఎకరాల విస్తీర్ణంలో అంతర్ణాతీయ ఖ్యాతి గడించిన ఆర్కిటెక్ట్ ల చేత వెదురు కర్రలతో, నీటి తుంగతో హిందూ దేవాలయాల్ని గుర్తుకుతెచ్చే విధంగా నిర్మించబడిన ఆ ఆశ్రమ వాతావరణం ఈశ్వరుడికే తపోసంకల్పం కల్గించేంత పవిత్రమై వుంటుంది. మానవాళి సంక్షేమంకోసం, విశ్వశ్రేయస్సు కోసం ధూపదీప నైవేద్యాల మధ్యా, వేద మంత్రాల మధ్యా అక్కడ నిరంతరం యజ్ఞయాగాది క్రతువులు జరుగుతుంటాయి.

ఇక లోపలికి ప్రవేశిస్తే. . .

ఎడమవేపుగా ఓ అందమైన గది!

పక్కమీద కూర్చుని ‘ఫీడో’ గ్రంధం పఠిస్తున్న వేదార్థం నారాయణాచార్యులు తలుపు దగ్గర అలికిడి కావడంతో చటుక్కున ఆ గ్రంధాన్ని దిండుకింద దాచి, కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తున్న వాడిలా నటించసాగాడు.

“లోనికి ప్రవేశించవచ్చునా మహాశయా?” వాకిలి దగ్గర అస్సామీ భాషలో విన్పించిన ఆ కంఠం శ్రీ జ్ఞాన కౌముదుల వారిదని గుర్తించి, కళ్ళు తెరిచి, ‘రమ్మ’ని సంజ్ఞ చేశాడు నారాయణాచార్యులు.

ఆయన వస్తూనే ఎదురుగానున్న ఆసనంపై కూర్చుంటూ, “కాలకృత్యాలు ముగిశాయా అచార్యా?” పరామర్శగా అడిగాడు.

“ముగిశాయి!” క్లుప్తంగా అన్నాడు నారాయణాచార్యులు హిందీలో.

జ్ఞాన కౌముదీ స్వామి తనూ హిందీలోకి దిగుతూ, “తమరేదో గ్రంధం దాచినట్లున్నారు?” నవ్వుతూ ప్రశ్నించాడు.

నారాయణాచార్యులు నవ్వి, “మీరనుకోలేదు” అన్నాడు.

“పాశ్చాత్య దర్శనమా?”

“అవును ఫీడో. ప్లేటో వారిది.”

“ఆశ్రమ నియమాలకి విరుద్దమని తెలిసీ, తమరీ అలవాటును మానలేకున్నారు. నేను తమరికి చెప్పదగను.”

“నిజమే! నాతత్వం జ్ఞాన సంబంధమైనదని మీకు తెలియనిది గాదు. దానికి నేనేం చేయగలను?”

“అదీ నిజమే. కానీ శ్రీముకుందా మిశ్రా, శ్రీ పరీక్షిత చతుర్వేది లాంటి వారికి ఈ విషయం తెలిస్తే ప్రమాదం కదా?” కాస్త భయంగా అన్నాడు జ్ఞాన కౌముది.

నారాయణాచార్యులు పెద్దగా నిట్టూర్చాడు. ఆ తర్వాత, “తెలుసుకుని నన్నేంచేయగలరు కౌముదీ స్వామీజీ? అయినా పదేళ్ళుగా తెలుసుకోలేనిది యిప్పుడు తెలుస్తుందని భావించమంటారా? మీరయితే నాకు ప్రేమపాత్రులు గనుక నా ద్వారా తెలుసుకోగలిగారు. మీరు చెప్పినవాళ్ళు పరిచారకుల ద్వారా నాకు వర్తమానం పంపకుండా, నా అనుమతి లేకుండా లోనికి ప్రవేశించగలరా? అయినా యింకెంత కాలం నేనిక్కడ వుండబోతున్నాను గనుక!” అన్నాడు.

జుట్టు ముడివిప్పి విదిలించి, తిరిగి ముడిపెట్టుకోబోతున్న శ్రీ జ్ఞాన కౌముదీ స్వామి ఆ చివరి మాటలు విని భరించలేకపోతున్నట్టు “ఓం తత్ సత్!” అన్నాడు. సింధూరంతో మూడు నిలువు నామాలు దిద్దిన ఆయన ప్రసన్న వదనం కొంత విషాదంతో నిండింది.

కానీ, ఆయన అటువంటి అల్పభావాలకు అతీతుడుగా నిర్దేశించబడిన బాధ్యాతాయుతమైన వ్యక్తి. దైవాన్ని సాధన చేస్తున్నవాడు. అందుచేతనే తనకి అలవడిన ఆత్మ సంయమనంతో మళ్ళీ మామూలుగా అయిపోతూ, “తమరీ అరవయ్యొకటవ ఏట గృహస్థాశ్రమం స్వీకరించడంలో అంతర్యమేమిటో నాకు తెలీక నేను ఆవేదన చెందుతున్నాను. ఎందుకో ఈమధ్య నా మనసు బాగా చంచలంగా వుంటున్నది. ఆత్మీయులైన పెద్దలు, పైగా ఆశ్రమ ఉపాధ్యక్షులు తమరు వెళ్ళిపోవడం నేను భరించగలనా అన్పిస్తున్నది.” అన్నాడు.

నారాయణాచార్యులు కాళ్ళను ముందుకు లాక్కుని పద్మాసనం వేసుకున్నాడు. ఏదో చెప్పదలచుకున్న వాడిలా వెన్నెముక నిటారుగా చేసి మణకట్లు మోకాళ్ళుకు ఆనించి, భారంగా శ్వాస వదిలాడు. ‘రిమోట్’ మాగ్నటిక్ బజర్ తో పరిచారకుడిని పిలిచి, “మాకు పాలు తీసుకురావాలి!” అని కన్నడంలో చెప్పాడు. పరిచారకుడు వెళ్ళిపోయాడు.

ఇంతలో బ్లాక్ కమెండోల బూట్ల చప్పుడు ద్వారం వైపు నుండి వినిపించింది. ఎవరో చాలా మంది వేగంగా వెళుతున్నట్టు అడుగుల చప్పుడు. “ఆచార్య జితేంద్ర అవస్థి ఈ రోజు ఇండోనేషియా ప్రయాణమయినట్టున్నారు. చూడండి! భగవత్ స్వరూపులకు కేంద్ర ప్రభుత్వ రక్షణదళం కావాలి.” నవ్వి, నారాయణాచార్యులు తిరిగి చెప్పడం ప్రారంభించాడు.

“జ్ఞాన కౌముదీ స్వామీజీ! మీరు నాకన్నా ఇరవైయేళ్ళు చిన్నవారు. మీరు ఆశ్రమంలో ప్రవేశించి కేవలం తొమ్మిదేళ్ళయింది. పైగా మీరు మతప్రచారక కార్యకలాపాల్లో మునిగివున్నందువల్ల మీకీ ఆశ్రమం తీరుతెన్నుల గురించి, రాజకీయాల గురించి సరిగ్గా తెలీదు. నేను వివరిస్తాను.”

పరిచారకుడు పాలు తీసుకుని వచ్చాడు. అవి అందుకుని తాగాక ఆయన చెప్పాడు.

ప్రస్తుతం ఈ ఆశ్రమం విలువంతో మీకు తెలుసా స్వామీజీ? మూడు వందల కోట్ల రూపాయలు! దీని అధ్యక్షులు శ్రీశ్రీశ్రీ శ్రీవైకుంఠ జగన్నాథ త్రివేదీ వారి సంవత్సర ఖర్చు డెభై అయిదు లక్షలు టూర్లతో కలిపి. వ్యవస్థాపకులు శ్రీ పరీక్షిత చతుర్వేది వారి ఖర్చు యాభై లక్షలు. ఉపాధ్యక్షుడిగా నా ఖర్చు పడ్రెండు లక్షలు. . .మతవ్యాప్తి కార్యక్రమాలు చాలించుకున్నాను కాబట్టి. మిగతా డైభై ఆరుమంది స్వామీజీల ఖర్చు మీతో కలిపి అందరిదీ నాకన్నా ఎక్కువే వుంటుంది. మన ఆశ్రమ ఖాతాలో వున్న ఆస్తి విలువ మొత్తం మూడు వేల కోట్ల రూపాయలు. అంటే అది పూరీ, శృంగేరీ లాంటి నాలుగు శక్తి పీఠాల్లో ఏ ఒక్క పీఠానికీ లేనంత అన్నమాట. ఇంత ఖరీదయిన జీవితాలు మనకి అవసరమేనంటావా? కౌముదీ స్వామీజీ?”

నారాయణాచార్యులు మంచం పైనుండి లేచాడు. ఆ గది గోడ దగ్గరకి వెళ్ళి, గోడమీద చూపుడువేలు ఆన్చి చూపిస్తూ, “వెదురు కర్రల గోడలమీద అమర్చిన ఈ ‘రీబిల్డ్ పెంకు’ జపాన్ దేశపుదన్న విషయం మీకు తెలుసా?” అంటూ కాస్త పక్కకి జరిగి, అక్కడున్న తైలవర్ణ చిత్రాన్ని చూపిస్తూ, “ఈ ఇకనోగ్రఫీ పెయింటింగ్ లు, ఈ యంబాసింగ్ మంత్రపురేకులు చూస్తున్నారు కదూ?” ఆయన తిరిగి వచ్చి మంచం మీద కూర్చున్నాడు.

“ఈ ఎర్రటేకు మంచం మీద నగిషీలు చూడండి స్వామీ! ఆర్నమెంటల్ వర్క్ అట. ఈ కాషాయ వస్త్రాలు చూడండి. మీటరు వస్త్రం ఐదున్నర వేల రూపాయలట. యు.ఎస్.ఏ. వి! ఆ కేన్ కుర్చీ ధర అయిదువేల రూపాయలు. తాంబూలం దాచుకునే బంగారు ఇన్ లేయింగ్ స్టోన్డ్ భరిణెలు ఒక్కొక్కటీ ఇరవైవేల రూపాయలు. వింటున్నారా స్వామీజీ? ఇంకా పట్టు పరుపులు, కుషన్డ్ బోల్ స్టర్లు, దంతంతో తయారు చేయబడిన ల్యాంపులు, కార్తేజియన్ గులాబీ అత్తర్లు, లేవండర్ తలనూనెలు, జీడిపప్పు, నెయ్యి లాంటి వాటితో వండిన ఎస్ క్యులెంట్ వంటకాలు, వెన్నతీసిన స్కిమ్డ్ మిల్క్, మహారాష్ట్ర గుహల్లో నుండి దొంగతనంగా తెప్పించబడిన శిల్పాలు, హై కాన్ఫిగరేషన్ కంప్యూటర్లు, అధునాతన వీడియో టీ.వీ.లూ, ఒడిస్సీ, సిరైకెళ్ళా, అంకియానట్, భరతనాట్యం సీడీలు, క్యాసెట్టులు, డిజిటల్ ఆడియో సిస్టమ్స్, టేప్ రికార్డర్లు, అందులో వీణ, ఫిడేలు, సారంగి లాంటి వాటిమీద వాయించిన యిన్స్ స్ట్రుమెంటల్ క్లాసిక్స్, ఇవిగాక, సెల్ ఫోన్లు, డైనమిక్ ఐ.యస్.డీ. లూ, లిఫ్టులూ, ఎయిర్ కండిషన్డ్ కార్లు, ఫ్లయిట్ లు, విదేశాలు!” నారాయణాచార్యులు నవ్వాడు. ఈసారి ఆయన వదనం గంభీరమయింది.

“కామ, క్రోధ, లోభ, మోహ, పాశ, మదమాత్సర్యాల్ని జయించి, సర్వసంగపరిత్యాగులమైన మనకి, దైవలబ్ది కోసం ప్రయత్నించే మనకి మతవ్యాప్తి కోసం యింతటి లగ్జరీలు నిజంగా అవసరమా కౌముదీ స్వామీజీ?”

( సశేషం )

2 అభిప్రాయాలు:

Burri said...

మీ కధలు చాలా చాలా బాగున్నాయి. ముఖ్యముగా రాయస్థాపనాచార్య!(ఆమోఘం), ప్రసంగి!(అపూర్వం). మంచి కథలు రాయగలిగిన మీ శక్తికి మా ధన్యవాదములు.
-మరమరాలు

వింజమూరి విజయకుమార్ said...

మీ ప్రశంసతో కడుపు నిండింది. కృతజ్ఞతలు. మొన్ననే నేను మీ బ్లాగు చూడడం జరిగింది. నేను కొంత ఆఫీసు పని వత్తిడిలో వున్నందువల్ల సరిగ్గా పరిశీలించలేకపోయాను. ఈసారి చూసి నా
అభిప్రాయం తెలుపగలను. అభివందనాలతో