ఒకానొక అజ్ఞానపు క్షణంలో. . . నాకు తెలీకుండా నేనే జన్మించి,  అమ్మ చనుబాలలో ఆది సంవేదన అనుభవించి. . .ఆటపాటలలో అద్వితీయుడనై రాణించి. . .సంఘ విద్యా సముపార్జనలో సారస్వత చక్రవర్తినై, పుస్తకాల్ని పఠించి. . .పరీక్షల్ని పరివీక్షించి. . .ఆత్మజ్ఞాన అవలోకనంలో విలువల వలువలు వూడదీసి. . .విశ్వతత్వాలు స్మరించి. . . మానవ శ్రేయస్సు మహా లక్ష్యమై పోగా. ."ఈ ప్రపంచపు దొడ్డబిడ్డగా ఉద్భవించాల"నీ, "ఒక పూర్తి మానవుడిగా పరిణమించాల"నీ, నేను కంటున్న కల,  కడుతున్న కోట. . .ఒహ్ ఇంతెందుకు కనుచూపు మేరలో. . . నా జీవితం ఒక వేద సంకలనం!!  నేనొక ఈశ్వరుడిని!!! ( ఇది ఈ బ్లాగులోని ప్రసంగి కథలో ఒక పాత్ర మనోభావాలు __ రచయిత )

Thursday, September 13, 2007

సామెతలరాయుళ్ళు!..3

సామెతలరాయుళ్లు! (హాస్యకథ)

(కేవలం ఎనిమిది పేజీల కథలో 35 పై చిలుకు సామెతల్ని, యింకా జాతీయాల్నీ ఉపయోగించి రాసిన ప్రయోగాత్మకమైన హాస్య కథ!)


సూపర్నెంటు కూడా తనని తప్పు పట్టేసరికి సుబ్బలక్ష్మికి అరికాలిమంట నెత్తికెక్కింది.

“ఉలవలు తిన్నమ్మకి ఉలుకెక్కువైనట్టు చేసేవారికి లేని బాధ మీకెందుకండీ?” అంది వనజాక్షిని మూతి ముఫై వంకర్లు తిప్పుతూ.

“శభాష్!” అన్నాడు శాస్త్రి మెల్లగా వనజాక్షికి వినిపించకుండా.

వనజాక్షి గింజుకుంది. “అవున్లేమ్మా! నాకెందుకూ. . . ఎల్లపాములూ తలెత్తితే ఏలికపాము కూడా తలెత్తిందనీ ఈ మధ్య నీక్కూడా నోరు బాగానే పెరిగింది.” అంది మెటికలు విరుస్తూ.

“ఓ.కే! సైలెన్స్! సైలెన్స్!” గుర్నాధం పెద్దగా అరిచాడు.

శాస్త్రి మాత్రం సుబ్బలక్ష్మిని మెచ్చుకుంటూ, “ఏదియేమైనా సుబ్బలక్ష్మి మంచి అమ్మాయయ్యా!” అన్నాడు.

కామేశం ఎత్తుకున్నాడు. “అవును పాపం! నంగకి నాలుగు అట్లు యిస్తే నమలకుండా మింగిందనీ చాలా చాలా మంచిది.” శాస్త్రి చెవిలో మంటగా చెప్పాడు.

“మరి నువ్వు లైటింగ్ యిస్తున్నావుగా?” అడిగాడు శాస్త్రి కామేశం చెవిలో.

“ఏం లైటింగ్? నా బొంద! లాటరీ ప్రయత్నం లాగా ఎంతకీ తెగదు.” అన్నాడు కామేశం.

“బాగానే మాట్లాడుతుందిగా?” శాస్త్రి అడిగాడు.

“ఏం మాట్లాడ్డంలెండి శాస్త్రిగారూ! ఓడ ఎక్కేదాకా ఓడ మల్లన్న ఓడ దిగినాక బోడి మల్లన్న రకం. పని వున్నప్పుడు మాత్రం బాగానే మాట్లాడుతుంది.” కామేశం తన గోడు వినిపించుకున్నాడు.

మొత్తానికి వనజాక్షీ, సుబ్బలక్ష్ముల సంవాదం కారణంగా ఆ తర్వాత అక్కడి వాతావరణం కొద్దిసేపు బరువుగా, నిశ్శబ్దంగా మారింది.

ఆ నిశ్శబ్దాన్ని భగ్నంచేస్తూ జోగినాధం అన్నాడు. “ఓ అయిదొందలుంటే అప్పుగా యిద్దురూ సూపర్నెంటుగారూ? ఫస్టున జీతం రాగానే యిచ్చేస్తాను!” అని.

గుర్నాధం అదిరిపడి, “నా దగ్గర డబ్బెక్కడిదయ్యా బాబూ! అసలే నెలాఖరు! ఆ పెళ్ళిగాని కుర్రోడు కామేశాన్నడగండి పుష్కలంగా వుంటాయి.” అంటూ ఓ సలహా పారేశాడు ఉచితంగా.

“మా ఆయనేవుంటే మంగలాయనెందుకనీ కామేశాన్ని అడిగింతర్వాతే మిమ్మల్నడిగాను మహాశయా!” జోగినాధం సూపర్నెంటు మీద మండిపడ్డాడు. ఆ తర్వాత శాస్త్రి వైపు తిరిగి, “పోనీ మీ దగ్గరుంటే సర్దండి శాస్త్రిగారూ!” అన్నాడు.

అటువంటి విషయాల్లో శాస్త్రి చాలా జాగరూకుడై వ్వవహరిస్తాడు.

ఠడబ్బు నాదగ్గరెక్కడిదయ్యా జోగినాధం? ఆ అయిదొందలే వుంటే ఈ నడుమీడ్పూ, ఈ కాళ్ళపీకుడూ ఎందుకూ డాక్టర్ దగ్గరకెళ్ళి చూపించుకోనూ!” వెంటనే చెప్పాడు తడుముకోకుండా.

“ఆరావులమ్మ మూడావులమ్మ యింటికి నేతికి వెళ్ళినట్టు బాగానే వుందయ్యా మీ జంఝాటం!” అవధాని నవ్వేడు. ఆ తర్వాత, “పోనీ సుబ్బలక్ష్మిని అడిగి చూద్దురూ!” అన్నాడు నేర్పుగా సుబ్బలక్ష్మికి అంటగడుతూ.

తన వంతు వచ్చిందన్న విషయం సుబ్బలక్ష్మికి బాగా స్ఫురించింది. ఇక లాభంలేదని ‘హ్యాండ్ బ్యాగ్’ ఓపెన్ చేసి, అందులోంచి ఓ అయిదొందల రూపాయలు తీసి జోగినాధం కిచ్చింది. “మళ్ళీ ఫస్టుకిచ్చేయండీ!” అంటూ.

“ఇచ్చేయండి మరి. ఆవిడ రేపు పెళ్ళిలో మొగుడ్ని కొనుక్కోవాలి పాపం!” కామేశం గొంతు తగ్గించి జోగినాధం చెవిలో వూదాడు.

సుబ్బలక్ష్మి సహాయానికి జోగినాధం తెగ సంబరపడిపోయి, “అయినవాళ్ళ మూతి వెనుక కానివాళ్ళ తోక ముందన్నట్టు వీళ్ళందరి కంటే నువ్వే మేలమ్మా సుబ్బలక్ష్మీ రేపు నీ పెళ్ళికి ఏదైనా మంచి గిఫ్టు యిస్తాన్లే.” అన్నాడు.

“ఇంగ్లీషు డిక్షనరీ ఒకటి కొని యిచ్చేయండి సరిపోతుంది.” కామేశం గొణిగాడు.

జోగినాధంకి అప్పు లభించడం సూపర్నెంటుకి కూడా సంతోషం కలిగించినట్టుంది. “ఇందామ్మా తీయగూర అంటే యిందామ్మా పుల్లగూర అన్నట్టుగా ఒకరికొకరు సెక్షన్లో సహాయంగా వుండండయ్యా.” అన్నాడు.

ఇంతలో. . . ఆ సెక్షన్లోకి ఓ అరవైయేళ్ళ ముసలాయన ఒకాయన వచ్చాడు. వచ్చీరాగానే, సూపర్నెంటు టేబుల్ దగ్గరికి వెళ్ళి, “మా పుల్లిగాడు ఎక్కడండీ?” అన్నాడు.

సూపర్నెంటు ఆ ముసలాడ్ని ఎగాదిగా పైనుండి కిందికి పరికించి చూస్తూ “పుల్లిగాడెవరయ్యా. . .? కన్నెరికపు పెళ్లికొడుకా ఏంటి?” అడిగాడు అర్థంగాక.

ఆ ముసలాడు కూడా చమత్కారి లాగే వున్నాడు. “పుట్ట గొడుగంటే గుడ్డదా తాటాకుదా? అన్నాట్ట మీలాంటి ఒకాయన. అదేనండీ మీ అటెండరు పుల్లారావు గురించి నేనడుగుతున్నది.” అన్నాడు ఆయన ముక్కుమీది కళ్ళజోడు ముఖం మీదికి లాక్కుంటూ.

సూపర్నెంటుకి అర్థమైంది. “పుల్లారావు పాపం వాళ్ళ నాన్నగారు పోయారని సెలవు మీద వెళ్ళాడండీ.” అన్నాడు.

“ఓహో. . ! అలాగా? పుల్లారావు వస్తే కాస్త నేను వచ్చి వెళ్ళానని చెప్పండి.” అంటూ ఆ ముసలాయన కదిలి వెళ్ళబోయాడు.

“ఇంతకీ తమరెవరండీ?” అన్నాడు గుర్నాధం మామూలుగా.

“ఆ పుల్లారావుగాడి చచ్చిపోయిన నాన్నగారు నేనేనండి.” ముసలాయన చావు కబురు చల్లగా చెప్పాడు.

జోడుగుళ్ల తుపాకీ దెబ్బ తగిలినట్టు ఉలిక్కిపడ్డాడు గుర్నాధం. ఆ తర్వాత, “మరి నాకెందుకు పుల్లారావు అబద్దం చెప్పినట్టు?” అన్నాడు అయోమయంగా తలగోక్కుంటూ.

“ఏమీ లేదుసార్! పిల్లి గుడ్డిదైతే ఎలుక ముడ్డి చూపిస్తుందనీ ఓ సామెతుందిలే అందుకు.” చెప్పి ఆ ముసలాయన అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు.

గుర్నాధం చిందులు తొక్కాడు. “తాళిబొట్టు బలం తలంబ్రాల వరకేననీ ఈ రోజుతో ఈ పుల్లారావు పని అయిపోయింది. రానీ చెబుతా.” అన్నాడు.

“మరేం చేయమంటారండీ! అతి లోభి రాజుకి అడగనివాడే మహా పండితుడన్నట్టు తమరికి సెలవడిగితే కోపమాయే.” అవధానికి ఛాన్సొచ్చింది.

ఆ మాటతో గుర్నాధంకి గుటక పడింది. అందుకే మాట మారుస్తూ, “ఏది ఏమైనా ఈ రోజు మన మాటల్లో దొర్లిన సామెతలతో ఒక సామెతల శతకమే రాయొచ్చయ్యా!” అని, “సరేగానీ టైమ్ అయిదయింది. ఫైళ్లు కట్టేసి, యిక కదలండి యిళ్ళకి.” అన్నాడు.

అంతా లేచి అక్కడ్నుంచి కదిలారు. అట్లా కదిలి అందరూ వెళుతున్నప్పుడు యిక ఆరోజుకి ఉపసంహారంగా గుర్నాధం గంభీర వదనుడై ఒక మాట చెప్పాడు.

“చూడండి! మనమంతా ప్రభుత్వ ఉద్యోగులం. ప్రభుత్వమనే మహారథానికి మనం నిండు చక్రాల్లాంటి వాళ్లం! ప్రజల సొమ్ముతిని బ్రతికే మనం. . .ఆ ప్రజల కోసం. . . ఇట్లా మాటలతో, నవ్వులతో కాలం వెళ్ళబుచ్చకుండా పని బాగా చేసి దేశం సర్వతోముఖాభివృద్ధికి మన వంతు సహకారం అందిద్దాం. రేపట్నుంచి కలసి యింకా ఎక్కువ పని చేయడానికి ప్రయత్నిద్దాం!”

“సూపర్నెంటుగారు చూడండి. ఎంత మంచి మనిషో. .?” అంది వనజాక్షి గుర్నాధాన్ని చూసి మురిసి ముష్టెత్తుకుంటూ.

“అవున్లేమ్మా! గోడ దూకొచ్చినమ్మ గోత్రం మహాత్మ్యం చెప్పుకుందనీ ఆయన చాలా మంచి మనిషి. . .నీలాగే!” అన్నారెవరో ఆ గుంపులో నుండి.

( సమాప్తం )

2 అభిప్రాయాలు:

Nune Srinivasa Rao said...

మీ ప్రయత్నం చాలా బాగుంది. చదివినవారు అందరూ బ్లాగులు బద్దలయ్యేలా పగలపడి నవ్వాలి. సామెతలకు, హస్య కధలకు ప్రాణం పోసినందుకు మరియు చివరిలో చక్కని నీతిని బోదించినందుకు ధన్యవాధాలు

ఉంటాను.
నూశ్రీ

వింజమూరి విజయకుమార్ said...

అయ్యా/అమ్మా నూశ్రీ గారూ! మీ వంటి వారు చదివి ఆ కథ విలువను గుర్తించి గౌరవంగా ఒక కామెంట్ రాయడం కంటే మా వంటి రచయితలకి కావలసిందేముంటుంది.కృతజ్ఞతాభినందనలతో. . .