ఒకానొక అజ్ఞానపు క్షణంలో. . . నాకు తెలీకుండా నేనే జన్మించి,  అమ్మ చనుబాలలో ఆది సంవేదన అనుభవించి. . .ఆటపాటలలో అద్వితీయుడనై రాణించి. . .సంఘ విద్యా సముపార్జనలో సారస్వత చక్రవర్తినై, పుస్తకాల్ని పఠించి. . .పరీక్షల్ని పరివీక్షించి. . .ఆత్మజ్ఞాన అవలోకనంలో విలువల వలువలు వూడదీసి. . .విశ్వతత్వాలు స్మరించి. . . మానవ శ్రేయస్సు మహా లక్ష్యమై పోగా. ."ఈ ప్రపంచపు దొడ్డబిడ్డగా ఉద్భవించాల"నీ, "ఒక పూర్తి మానవుడిగా పరిణమించాల"నీ, నేను కంటున్న కల,  కడుతున్న కోట. . .ఒహ్ ఇంతెందుకు కనుచూపు మేరలో. . . నా జీవితం ఒక వేద సంకలనం!!  నేనొక ఈశ్వరుడిని!!! ( ఇది ఈ బ్లాగులోని ప్రసంగి కథలో ఒక పాత్ర మనోభావాలు __ రచయిత )

Tuesday, September 11, 2007

సామెతలరాయుళ్ళు! 1

సామెతలరాయుళ్లు! (హాస్యకథ)

(కేవలం ఎనిమిది పేజీల కథలో 35 పై చిలుకు సామెతల్ని, యింకా జాతీయాల్నీ ఉపయోగించి రాసిన ప్రయోగాత్మకమైన హాస్య కథ!)

నిర్భంధ విధానపు గడబిడలో తద్దినం మంత్రపు లొడలొడలా హైదరాబాదు నగరానికి నడినెత్తిమీద వున్నట్టుంటుందా గుట్టమీది అదేదో కమీషనరాఫీసు. సదరు ఆఫీసులోని ఒకానొక సెక్షన్ కి గుర్నాధం సూపర్నెంటు! ‘చెవిగొరుకువారు. . .తార్పుడు సేయువారు. . .కొంటెకూతలవారు. . .కోడెగాండ్రు’ అన్నట్టు అన్ని రకాల మనస్తత్వాలూ వున్న తన క్రింది వుద్యోగుల్ని తను ‘కంట్రోల్’ చేయలేకపోతున్నాడేమోనని ఆయనగారికొక అనుమానం. చత్వారం హేతువుగా లభించిన కళ్ళజోడుతోనూ, నిగనిగలాడే నిండారు బట్టతల తోనూ గుర్నాధం. . .నల్లగా, గుండ్రంగా, అచ్చు గునపంలాగా వుంటాడు.

‘జుట్టు మూడు పాళ్లే అయినా అధికారం ఆరు పాళ్ళన్నట్టూ’. . . ‘నాన్ గెజిటెడ్ ఆఫీసరే’ అయినా ఆఫీసరాఫీసరే అయినట్టూ’ గుర్రుగా, గంభీరంగా వుంటాడు.

“వెధవది! గంభీరమే కాదాయనకి. . .కొసవెర్రి, కొంకనక్కతనం పాళ్ళు కూడా కాస్త ఎక్కువేనం”టాడు. అతనంటే గిట్టని హెడ్ గుమాస్తా ఆవకాయల అవధాన్లు.

“మరదే సూపర్నెంటంటే! సాతాని జుట్టుకి సన్యాసి జంద్యానికి ముడి పెట్టగలిగి వుండాలి గదా.” అంటాడు మరో గుమాస్తా జోగినాధం అవధానికి వత్తాసుగా.

గబ్బువాడు గదరువాడు వియ్యమందుకుంటుంటే మురికి వాడొచ్చి ముద్దాడినట్టుగా, “నిజమే సుమండీ! యిన్నాళ్ళకి నిజం పలికారు మీరు.” అంటూ తిట్టాడో పొగిడాడో కూడా తెలీనీకుండా తన వంతు తలూపుతాడు యింకో గుమాస్తా శాస్త్రి.

ఏది ఎట్లా ఏడ్చినా. . .ముండకి మొగుళ్ళు యిద్దరన్నట్టు గుర్నాధం వాళ్ళ సెక్షన్ కి రెండు గదులున్నాయి. ఒక గదిలో గుర్నాధం, ఆయనగారికి ఎదురుగా. . .సరిగ్గా ఎదురుగానున్న సీట్లో వనజాక్షి అనబడే ఒకానొక పెళ్ళయిన చంచలాక్షి, ఆమెకి అటుపక్కగా మరో పెళ్ళిగాని చిగురుబోడి సుబ్బలక్ష్మి కూర్చుంటారు.

ఇంకో గదిలో శాస్త్రి, జోగినాధం, అవధాన్లు మరో పెళ్ళీ పెటాకులూ రెండూ లేని ‘స్టెనోగ్రాఫర్’ కామేశం కూర్చుంటారు. పూటకొక్కసారి మేత మాటకొక్కసారి సామెత అన్నట్టుగా ఆ సెక్షన్లో ప్రతివాళ్ళకీ మాటకి ముందు సామెతలు వాడడం బాగా అలవాటు!

వనజాక్షి జూనియర్ అసిస్టెంటు! “ఆవిడ జూనియర్ అసిస్టెంటు కానేగాదనీ గుర్నాధమే ఆమెకి సీనియర్ అసిస్టెంటు అయ్యుంటాడ”నీ ఛలోక్తిగా అంటూంటాడు జోగినాధం. ఇకపోతే. . .సుబ్బలక్ష్మి టైపిస్టు! “ఆమె టైపిస్టే గానీ. . . టైపురైటింగంతా ఉద్యోగం వచ్చాకే నేర్చిందం”టాడు ఆ కన్నెని ఆమూలాగ్రం పరిశీలించిన కామేశం.

ఇక మనం పరిచయాలాపేసి, ప్రస్తుతంలోకి ప్రయాణిస్తే. . .గూనివాడు గోచీ బిగించి గుర్రంమీదెక్కి గదాయుద్ధం చేసినంత సీరియస్ గా ఆరోజు మద్యాహ్నం మూడు గంటలప్పుడు గుర్నాధం వాళ్ళ సెక్షన్ లో అంతా ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నమయ్యారు. శాస్త్రికి మాత్రం పనిమీద ఏకాగ్రత లేదు. కడుపులో కొద్దిగా ఆరాటంగా వున్నట్టుంది.

“జోగినాధం గారూ!” అన్నాడు మెల్లగా పెన్నుతీసి పక్కన పెడుతూ.

“ఊ!” అన్నాడు జోగినాధం ఫైల్లోంచి తలెత్తకుండానే

“నాకు ఒంట్లో ఏమీ బాగుండలేదయ్యా” చెప్పాడు శాస్త్రి ప్రారంభంగా.

ఆ మాటకి ఆ పక్కనేవున్న ఆవధానికి విసుగొచ్చినట్టుంది. “అందరికీ అన్నీరోగాలే గానీ అయిదుసోల కుండకి ఏ రోగం లేదని నీ ముఖానికి ఎప్పుడూ రోగాలే.” అన్నాడు తను కల్పించుకుంటూ. ఎక్కువ కాలం కలిసి పనిచేయడం వల్ల అవధానికి శాస్త్రితో కాస్త చనువెక్కువ.

“ఏమయిందేమిటి?” అడిగాడు జోగినాధం.

“ఎలుకలూ పందికొక్కులూ కలగలిసి పరుగెట్టినట్టు కడుపులో ఏవో అంతా రణగొణ ధ్వనులండీ!” కడుపు నొక్కుకుంటూ చెప్పాడు శాస్త్రి.

“చేతికందిన ఛెండాలమంతా చెడదింటే పైత్యం చేయదూ?” అన్నాడు అవధాని.

“ఇంతకీ ఏం తిన్నారో శాస్త్రిగారు?” తెగ క్యూరియాసిటీతో ప్రశ్నించింది వనజాక్షి అవతల గదిలోనుండి.

శాస్త్రికి తన గొప్ప చెప్పుకోడానికి కాస్త వీలు చిక్కినట్టయింది. “ఆ. . . మా ఆవిడ కాస్త చిత్రాన్నం, చిట్టిగారెలూ చేసిపెట్టింది లెండి.” అన్నాడు కొద్దిపాటి గర్వంగా మరింత ముక్తసరిగా.

“వాళ్ళావిడ కాస్త ప్రేమగా నోటికందించే సరికి కాదనలేక ఒక మోతాదు ఎక్కువ బిగించినట్టున్నారు. అంతేనంటారా సూపర్నెంటుగారూ!” అంది వనజాక్షి గుర్నాధంతో ముసి ముసిగా నవ్వుకుంటూ.

“అవునవును!” అన్నాడు గుర్నాధం గుడ్డి అద్దాల్లోంచి చూస్తూ.

“వీడి జబ్బు అదిగాదులెండి వనజాక్షిగారూ!” అన్నాడు అవధాని తనకి అంతా తెలుసునన్నట్టు.

“మరేదో?” అడిగాడు శాస్త్రి వెటకారంగా.

“నీ జబ్బు అదిగాదులేవయ్యా. నాకు తెలుసు.” అన్నాడు అవధాని మళ్ళీ వత్తి పలుకుతూ.

“మరి నీకు తెలిసిందేదో చెప్పి చావరాదూ.” శాస్త్రి అడిగాడు.

“ఆహార నిద్రావ్యత్యస్త పరిస్థితుల వల్లా, వాత పిత్త శ్లేష్మ దోషాల వల్లా నీకు కడుపులో బాధలు ప్రకోపిస్తున్నాయని నా అనుమానమయ్యా.” అన్నాడు అవధాని పెద్ద వైద్యుడిలాగా.

శాస్త్రికి మండింది. “మంగలి గొరిగి నేర్చుకుంటే వైద్యుడు చంపి నేర్చుకుంటాడని వీడి దరిద్రగొట్టు వైద్యం నామీద ప్రయోగిస్తాడెందుకండీ సూపర్నెంటూగారూ!” అన్నాడు రిపోర్టు చేస్తున్నట్టుగా.

“ఆయన వైద్యం కూడా ఒకసారి చేసి చూడొచ్చు కదండీ!” అన్నాడు . . .కామేశం సుబ్బలక్ష్మి పైనుండి కన్ను తిప్పకుండానే శాస్త్రిని ఏడిపించాలన్నట్టు.

“అద్గదీ. అట్లా గడ్డి పెట్టండి!” అన్నాడు అవధాని.

ఇక శాస్త్రి రెచ్చిపోయాడు. “ఏమిటండీ వీడిబొంద వైద్యం. గాడిద గడప చెట్టు ఆకులు తెచ్చి, కూతురు బుడమ చెట్టు రసంలో కలిపి, కల్పంలో వేసి నూరి తలకి పట్టిస్తే కడుపులో బాధలు తగ్గుతాయట. ఇదీ వైద్యం! అది వైద్యమో వీడి ఛాదస్తమో కూడా అర్థంగాదు.” అన్నాడు.

ఆ మాటతో అవధానికి కోపమొచ్చి, “బొండుమల్లెల గోడు బోడిముండ కెందుకనీ నీ దిక్కుమాలిన పిష్టపేషణ వ్యాపారం నాకెందుకులే.” అంటూ శాస్త్రి మీద అలిగి అటువైపు తిరిగాడు.

అంతా నవ్వారు. సుబ్బలక్ష్మి మాత్రం ముఖం పక్కకి తిప్పి ప్రత్యేకంగా కిల కిలా నవ్వింది. ‘ఈరక్క పెళ్ళి సందట్లో పేరక్క గర్భాదానం చేయించుకున్నట్టు’ ఏమాత్రం ఛాన్సొచ్చినా వదులుకునే రకంగాదు కామేశం. అందుకే వెంటనే అలర్టయి. . .

“ఏది ఎట్లాగున్నా సుబ్బలక్ష్మిగారు నవ్వితే మాత్రం సెక్షనంతా కళ కళ లాడిపోతుందండీ.” అన్నాడు.

సుబ్బలక్ష్మి కామేశం వైపు కొరకొరా చూసింది. ‘అందమా అందానికి పట్టిన పీడా’ అన్నట్టు సుబ్బలక్ష్మి పుటక్కి బాగానే వుంటుంది. గుణానికి మాత్రం. . . ‘ఎందుకొచ్చావే ఎల్లమ్మా అంటే అందుక్కాదులే అగ్గికొచ్చాన’న్నట్టు ప్రవర్తిస్తుంది. కామేశం అట్లా మాట్లాడడం ఆమెకీ ఇష్టమే. అయినప్పటికీ, ‘బావా అని చూడబోతే రావా అంటూ కొంగుబట్టుకుంటాడేమో’నని భయం. అందుకే పైకి బింకంగా వుంటుంది.

ఆ విషయం అటుంచితే. . .ఈ లోపల జోగినాధంకి రేగింది.

“అచ్చిగాడు చావనీ అంటే బుచ్చిగాడే చచ్చాడనీ శాస్త్రిగారి సంగతేమోగానీ నేను మాత్రం ఈ పని చేయలేక చచ్చేటట్టే వున్నానండీ.” అన్నాడు చేతిలో పెన్ను విసిరి టేబుల్ మీద కొడుతూ పెద్దగా సూపర్నెంటు వినేట్టుగా.

( సశేషం )

1 అభిప్రాయాలు:

Anonymous said...

చదివిన కాణ్ణించి పెయ్యలో బుచికి బుచికి బుచికి.