ఒకానొక అజ్ఞానపు క్షణంలో. . . నాకు తెలీకుండా నేనే జన్మించి,  అమ్మ చనుబాలలో ఆది సంవేదన అనుభవించి. . .ఆటపాటలలో అద్వితీయుడనై రాణించి. . .సంఘ విద్యా సముపార్జనలో సారస్వత చక్రవర్తినై, పుస్తకాల్ని పఠించి. . .పరీక్షల్ని పరివీక్షించి. . .ఆత్మజ్ఞాన అవలోకనంలో విలువల వలువలు వూడదీసి. . .విశ్వతత్వాలు స్మరించి. . . మానవ శ్రేయస్సు మహా లక్ష్యమై పోగా. ."ఈ ప్రపంచపు దొడ్డబిడ్డగా ఉద్భవించాల"నీ, "ఒక పూర్తి మానవుడిగా పరిణమించాల"నీ, నేను కంటున్న కల,  కడుతున్న కోట. . .ఒహ్ ఇంతెందుకు కనుచూపు మేరలో. . . నా జీవితం ఒక వేద సంకలనం!!  నేనొక ఈశ్వరుడిని!!! ( ఇది ఈ బ్లాగులోని ప్రసంగి కథలో ఒక పాత్ర మనోభావాలు __ రచయిత )

Thursday, September 27, 2007

'లేదు' అనేది లేదు!

లేదనేది లేదు! (విజ్ఞానం)

మనం సాధారణంగా “లేదు” అంటుంటాం. అక్కడ ఆ రాయి లేదు. ఇక్కడ ఈ కుర్చీ లేదు. యిలా. . .

సూక్ష్మంగా పరిశీలిస్తే ఈ ‘లేదు’ అనేదానికి రూపులేదని అన్పిస్తుంది. ఈ ‘లేద’నేదానికి కూడా ‘అస్థిత్వం’ వుందనిపిస్తుంది. ఇది నిరూపణకు వస్తే సాధారణమైన విషయం కాదు. భావ, భౌతిక, హేతువాదులూ, ముఖ్యంగా నాస్తికులూ ‘ఉలిక్కి పడి’ తమ తమ సిద్ధాంత మూలాల్ని వెతుక్కోవలసిన విషయం! వాళ్ళనే యేముంది? అందరూ అచ్చెరువొందేదే!

ఇక పరిశీలిద్దాం!

‘లేదు’ అంటే?

లేకపోవడం. అంటే లేదు = సున్నా = 0.(ఈ జీరో అనేది తటస్థమైన విలువ).

మొదట అసలు ఉన్నది అంటే యేమిటో చూద్దాం.

ఈ ఉండడంలో రెండు రకాలు. మొదటిది (+) ధనాత్మకమైన ఉండటం. ఇది +1, +2 యిలా వుంటుంది. రెండవది (-) ఋణాత్మకమైన ఉండటం. ఇది -1, -2 యిలా వుంటుంది.

ఉదాహరణకి విద్యుత్తుని తీసుకుందాం. అందులో ప్లస్(ధన విద్యుదాత్మకత కలది), మైనస్(ఋణ విద్యుదాత్మకత కలది) అనే రెండు విరుద్ధ శక్తులుంటాయి. అలాగే అన్నింటిలోనూ ‘ఆస్థి’ ప్లస్ అనుకుంటే ‘అప్పు’ మైనస్.

అంటే ఈ (+), (-) అనేవి రెండూ పూర్తిగా పరస్పర విరుద్ధమైన శక్తులన్న మాట.

మరి తటస్థమైనదైన ఈ (0) లేదు అంటే ఏమిటి?

రెండు ఉన్న శక్తులు, పరస్పర విరుద్ధమైనవి, సమపాళ్ళలో కలవడమే ఈ (0) లేదు. అంటే ఒక +1, -1 కలవడమే (0) అంటే సున్నా. లేదు. అంటే రెండు విరుద్ధ శక్తులు సమపాళ్ళలో కలిసివున్నదాన్ని మనం ‘లేదు’ అనే పేరుతో వ్యవహరిస్తున్నాం. కనుక లేదనేది లేదు.

ఉదాహరణకు అణువులో ‘ప్రోటాన్’ ధనాత్మకతని, ‘ఎలక్ట్రాన్’ ఋణాత్మకతనీ, ‘న్యూట్రాన్’ తటస్థ స్థితినీ కలిగి వుంటాయి. మరి తటస్థమైన ఈ న్యూట్రాన్ ఉన్నదే అయింది కదా. అలాగే రంగుల్లో కూడా తెలుపురంగు అన్ని రంగులూ సమ పాళ్ళలో కలిసి ఏర్పడిందైతే, నలుపు ఏ రంగూ లేకపోవడం. ఏ రంగూ లేని నలుపురంగు లేనిదే అయితే అది మనకెలా లభిస్తున్నది? కనుక అది ఉన్నదే అయింది.

అలాగే కాలాల్లో కూడా గతం (+) అనుకుంటే భవిష్యత్తు (-) వర్తమానం తటస్థంగా ‘లేని స్ధితి’గా అన్పిస్తూ, అసలు సిసలైన ఉన్నది అదే అయికూర్చుంది.

కనుక సృష్టిలో లేదు అనేది లేదు.

బహుశా ఈ విధమైన అలోచనా విధానంతోనే భారతీయులు (0) ‘సున్నా’ కనిపెట్టివుంటారని భావిస్తాను. ‘సున్నా’ అనేది భారతీయ గణిత విశేయమని మనందరికీ తెలిసిందే కదా!

ఏమంటారు?

మేధావులూ, శాస్త్రవేత్తలూ, వైజ్ఞానికులూ, యింకా యేదైనా జఠిల తాత్విక సమస్యతో బాధపడుతున్న తత్వవేత్తలూ ఈ నా భావన మీలో ఎవరికైనా ఉపకరిస్తుందేమో చూడండి.

ఇంతకీ నేను చెప్పొచ్చేదేమిటంటే, ఈ లేకపోయడమనేది సాపేక్ష విలువ. మొదట్లో మనం అనుకున్నట్టు. . . అక్కడ ఆ ‘రాయి’ లేదు అంటే అది మరో చోటికి మార్చబడిందన్నమాట. అంటే మరోచోట వున్నదేనన్నమాట.

కనుక, సృష్టిలో లేదనేది లేదు. లేదు అనబడేది కూడా ఒకానొక ఉన్నటువంటి తటస్థమైన అస్తిత్వస్ధితి!!!

6 అభిప్రాయాలు:

Anonymous said...

కలదు కలదనునది కలదో లేదో. బెదరూ! ఏంటిదీ?

వింజమూరి విజయకుమార్ said...

ఈ బ్లాగులోవన్నీ అంతే బ్రెదరూ. అర్థం కావడమే కష్టం. నాది లేదనేది లేదు. మీది కలదనునది కలదో లేదో. అంతే బ్రెదరూ. ఇంకా ముందున్నాయి చూడండి జర్కులు. జర్కులమీద జర్కులు. ఉంటా బ్రెదరూ.

Anonymous said...

మీ లేదనేది లేదనే ఆర్టికిల్ చూసి నేను చాలా ఆశ్చర్య పోయాను.ఇది తత్వశాస్త్రంలో చాలా పెద్ద విషయం. మీ కథలు కూడా చాలా పై స్థాయిలో వున్నట్టున్నాయి. చదివిన తర్వాత మీకు వ్యక్తిగతంగా నా అభిప్రాయాలు తెలియపరచగలను.ధన్యవాదాలు.

Anonymous said...

ధన, ఋణ శక్తులు కలిసిన తటస్థ స్థితి వేరు, అదీ లేకపోవడం వేరు.

అయినా మీ జేబులో ఏమీ లేదనుకుంటే, మీకో కోటి రూపాయల ఆస్తీ, కోటి రూపాయల అప్పూ ఉన్న దానితో సమానమనుకుంటే దాని మూలాన ప్రయోజనమేదీ లేదు.

Unknown said...

ఔను ఇప్పుడు మీ దగ్గర డబ్బు లేదు అంటే ఎప్పుడు డో ఉంది అన్నటేయ్

Anonymous said...

లే దనేది కనపడనిది సమస్తం ఇచ్చే భూమి ఎవరు నమ్ముతున్నారు సమస్తం భూమి