ఒకానొక అజ్ఞానపు క్షణంలో. . . నాకు తెలీకుండా నేనే జన్మించి,  అమ్మ చనుబాలలో ఆది సంవేదన అనుభవించి. . .ఆటపాటలలో అద్వితీయుడనై రాణించి. . .సంఘ విద్యా సముపార్జనలో సారస్వత చక్రవర్తినై, పుస్తకాల్ని పఠించి. . .పరీక్షల్ని పరివీక్షించి. . .ఆత్మజ్ఞాన అవలోకనంలో విలువల వలువలు వూడదీసి. . .విశ్వతత్వాలు స్మరించి. . . మానవ శ్రేయస్సు మహా లక్ష్యమై పోగా. ."ఈ ప్రపంచపు దొడ్డబిడ్డగా ఉద్భవించాల"నీ, "ఒక పూర్తి మానవుడిగా పరిణమించాల"నీ, నేను కంటున్న కల,  కడుతున్న కోట. . .ఒహ్ ఇంతెందుకు కనుచూపు మేరలో. . . నా జీవితం ఒక వేద సంకలనం!!  నేనొక ఈశ్వరుడిని!!! ( ఇది ఈ బ్లాగులోని ప్రసంగి కథలో ఒక పాత్ర మనోభావాలు __ రచయిత )

Tuesday, October 23, 2007

కోతికీ మనిషికీ భాష్యం చెప్పిన భాష!

కోతికీ మనిషికీ భాష్యం చెప్పిన భాష!

ఈ పరిశోధన చాలా ఇంటరెస్టింగ్ గా వుంటుంది. ఇది నేను చదివిన విషయమూ, నేను పరిశోధించిన విషయమూ కాదు. చిన్నప్పుడెప్పుడో నా తండ్రి నాకు చెప్పిన ఉదంతాన్ని ఇక్కడ రాస్తున్నాను. ఎవరైనా ఆ శాస్త్రవేత్త పేరుగానీ, అసలు ఉదంతం గానీ తెలియజేయగలిగితే సంతోషిస్తాను.

పరిణామక్రమంలో కోతి నుండి మనిషి ఉద్భవించాడని మనం విన్నాం. అదే శాస్త్రీయం అన్నట్టుగా నమ్ముతున్నాం కూడా. అది నిజమో కాదో ఆ విషయం కాసేపు పక్కన పెడదాం. కాకుంటే. . .కోతి నుండి మనిషిని దూరం చేస్తున్నదేమిటో, అసలు కోతికీ మనిషికీ వున్న వ్యత్యాసం, తేడా ఏమిటో తెలుసుకుందాం. మనం తెలుసుకోవడం కాదు. ఒక సైంటిస్టు చేసిన పరిశోధన గురించి తెలుసుకుందాం.

ఈ విషయం తెలుసుకోవడానికే ఒక శాస్త్రవేత్త (పేరు తెలీదు) ప్రయత్నించాడు. అందు నిమిత్తం ఓ కోతిని మచ్చిక చేసుకున్నాడు. దానికి ‘రొటీన్’ గా చేసుకుపోయే కొన్ని పన్లు నేర్పించాడు. అందులో ఓ పనిని కోతి చేత బాగా ‘ప్రాక్టీస్’ చేయించాడు. అదేమిటంటే. . .

ముందుగా అతడు తన కార్లో కొన్ని చితుకులు అంటే ఎండిపోయిన ఆకులూ, పుల్లలూ లాంటివి కొన్ని, అలాగే ఒక కుండ (లేదంటే కుండ లాంటి పాత్ర అనుకోండి), ఆ కుండ నిండా నీళ్ళు, కుండపైన మూత, ఒక నీళ్ళు తాగే గ్లాసు, మరో అగ్గిపెట్టె సిద్ధం చేసుకునేవాడు. కార్లోనే రోజూ ఆ కోతిని ఓ నిర్జన ప్రదేశానికి తీసుకు వెళ్ళేవాడు. అక్కడ ఒక ఖాళీ ప్రదేశంలో తను తెచ్చుకున్న ఆ చితుకుల్ని వెదజల్లేవాడు. అక్కడే పక్కగా ఓ చోట నీళ్ళకుండని ఉంచి దానిపైన మూతనీ, ఆ మూతమీద గ్లాసునీ వుంచేవాడు. కుండ పక్కనే అగ్గి పెట్టెని వుంచేవాడు.

ఇక కోతి చేయవలసిన పని. శాస్త్రవేత్త వెదజల్లిన చితుకుల్ని అన్నింటినీ వేరుకుని వచ్చి ఒక చోట కుప్పగా చేర్చాలి. ఆపైన అగ్గిపెట్టె తీసుకుని, వెలిగించి ఆ చితుకులకి నిప్పుంటించి మండేట్టు చేయాలి. ఆ తర్వాత, కుండ దగ్గరకి వెళ్ళి కుండమీద గ్లాసు తీసుకుని, కుండ మూత తీసి, అందులోంచి గ్లాసుతో నీళ్ళు ముంచి తీసుకువెళ్ళి మండుతున్న చితుకుల మీద నీళ్ళు పోసి ఆ మంటని ఆర్పాలి. ఇది కోతి దినచర్య!

ఈ దినచర్యని కోతిచేత నెలల తరబడి చేయించి, దానికి బాగా ‘ప్రాక్టీస్’ అయ్యేట్టుగా ఆ కోతిని తీర్చిదిద్దాడు. అతడు చేయించిన ‘ప్రాక్టీస్’ మూలంగా కోతి ఈ పన్లన్నీ చాలా సునాయాసంగా చేయగలిగేది. ఎందుకంటే నిరంతర సాధనలో దానికా పని బాగా అలవాటై పోయింది. ఈ విషయం. . .సరిగ్గా ఈ విషయం బాగా రూఢి పరుచుకున్న తర్వాత ఆ శాస్త్రవేత్త కోతికి ఒక పరీక్ష పెట్టాడు.

కోతిని ఈ సారి ఓ నది దగ్గరకి తీసుకు వెళ్ళాడు. ఆ నదిలో పారే పిల్లకాలువ పక్కన యిసుకలో ఆ రోజు కోతి దినచర్యని ప్రారంభించాడు. అయితే ఈసారి అతడు నీళ్ళకుండని అక్కడకి తీసుకెళ్ళలేదు. నది కాలువలో ఎటూ నీళ్ళున్నాయిగా. . .అందుకని. కేవలం గ్లాసు మాత్రమే తీసుకువెళ్ళి కాలువ ప్రక్కన నేలమీదుంచాడు. మిగతాదంతా మామూలే. చితుకులు వెదజల్లడం, అగ్గిపెట్టె గట్రా అంతా మామూలుగానే చేశాడు.

అప్పుడు కోతేం చేసింది. మామూలుగానే చితుకులన్నీ ఓపిగ్గా వేరి ఒక చోట కుప్ప చేసింది. అగ్గిపెట్టె తీసుకుని పుల్లని వెలిగించి, చితుకుల్ని మంట చేసింది. గబగబా పరుగెట్టుకుంటూ వెళ్ళి గ్లాసుని చేతిలోకి తీసుకుంది. అంతవరకూ బాగానే వుంది.

ఆ తర్వాత అది నీళ్ళకుండ కోసం ఆ చుట్టుప్రక్కల వెతకసాగింది. వెతికీ, వెతికీ ఎంతకీ కుండ కనబడకపోయేసరికి నిరుత్సాహపడిపోయింది. చితుకుల మంటని అర్పలేక గ్లాసుని చేత్తో పట్టుకుని నిస్సహాయంగా అలా నిలబడిపోయింది. ప్రక్కనే పిల్లకాలువలో నీళ్ళున్న విషయం అది గ్రహించలేకనే పోయింది.

అప్పుడా శాస్త్రవేత్తకి ఓ విషయం స్పష్టమయింది. మానవుడికి భాష తెలుసు. ఆ భాషతో కుండలోనివీ నీళ్ళేననీ, కాలువలోనివీ నీళ్ళేననీ, వర్షంలో వచ్చేవీ నీళ్ళేననీ, సముద్రంలో, చివరకి భూమిలోనుండి వచ్చేవీ నీళ్ళేననీ భాష ద్వారా కలుపుకుని, అవన్నీ నీళ్ళనే ఓ భావన ఏర్పరచుకున్నాడు.

అదే కోతి విషయంలో దానికి భాష లేదు. కనుక, రకరకాల ప్రదేశాల్లో వున్న నీళ్ళని అది కలుపుకోలేదు. అందువల్ల దానికి భావనలో(అనొచ్చా) కుండలోవున్నవి మాత్రమే నీళ్ళు. ప్రక్కనే నది కాలువలో నీళ్ళున్నా అది గ్రహించలేదు. కనుకనే నిస్సహాయురాలైంది (బహుశా ఈ శాస్త్రవేత్తకి పిచ్చెత్తిందా అని ఆలోచించింది కాబోలు).

కాబట్టి, మానవుడికీ, కోతికీ వున్న ప్రధానమైన తేడా భాష అని ఆ శాస్త్రవేత్త ఒక నిర్ధారణకు వచ్చాడట. (మనిషికీ, కోతికీ మెదడులో కూడా మౌలికమైన కొన్ని మార్పులున్నాయనుకోండి. అది వేరే విషయం.)

కనుక, కోతి మన తాతే. కాకుంటే దానికి భాష రాదు. మనకి వచ్చు. ఆ వచ్చిన భాష ఎంతవరకూ వెళ్ళిదంటే. . . .

మకరంద బిందు బృంద రస్యందన సుందరమగు మాతృభాషయే. . .
మహానంద కందళ సందోహ సంధానతుందిలమగు మాతృభాషయే. . .
నమ్రతకు నమ్రత. . . కఠినతకి కఠినత. . .
బిగికి బిగి. . . జోరునకు జోరు. . .
ఎదురెక్కువకెదురెక్కువ. . .
అన్ని వన్నెలు. . .అన్ని చిన్నెలు. . .
అన్ని హొయలు. . .అన్ని యొయ్యారములు. . .
అన్ని తళుకులు. . .అన్ని బెళుకులు. . .కలిగి. . .
కవిత్వమునకు. . .గానమునకు. . .గద్యమునకు. . .
సంపూర్ణార్హత గల భాషయే. . .!!! (అప్పుడెప్పడో చదివా. తప్పులుంటే మన్నించగలరు. క్రింది వాటిలో కూడా.)
అంటూ పానుగంటి వారు తెలుగు భాషలో తెలుగుభాషను ఘనకీర్తించినా,

విధాత తలపున ప్రభవించినదీ
అనాది జీవననాదం. . .
ప్రాణ నాడులకు స్పందన నొసగిన
ఆది ప్రణవ నాదం. . .
అంటూ సీతారామశాస్త్రి తెలుగులోనే ప్రభవించినా,

అరివీరషండ. . .నిర్మూలనోద్ధండ. . .
దోర్దండ. . .ఉద్ధండ. . .మణిమండితులు. . .
మేరు సమానధీరులు. . .మా శత సోదరులు వుండగా. . .
అంటూ తెలుగుతేజం నందమూరి వారు తెలుగులో గర్జించినా,

నేను సైతం ప్రపంచాగ్నికి సమిథనొక్కటి
ఆహుతిచ్చాను. . .
అంటూ శ్రీశ్రీ వారు తెలుగులో విప్లవించి విరచించినా,

అది భాషకున్న ఔన్నత్యమే!! మరీ మన తెలుగు భాష ఔన్నత్యం!!!

ఏమంటారు?
( సమాప్తం )

8 అభిప్రాయాలు:

Anonymous said...

కథ బాగుంది. కానీ జంతువులకు భాష లేకపోవటం సరికాదేమో? ఆకలికి ఏడ్చే లేగ దూడ కోసం ఆవు దూరం నుంచి పరిగెత్తుకు రాదా? భాష వాటికి ఉందనే నా నమ్మకం.

అదీ కాక, నీటిని గుర్తించలేక పోవటానికి, భాష కు సామీప్యం లేదు. అన్ని పనులు చేయగలిగిన కోతికి, ఓ సారి ఆ నది లోని నీరు చూపితే దానికీ తెలుస్తుంది, అదీ నీరని. భాష కన్నా, మనిషినీ జంతువునీ వేరు చేసేది తార్కిక చింతన అని నా భావన.

వింజమూరి విజయకుమార్ said...

కృతజ్ఞతలు. మీరన్నది నిజమేమో నాకూ తెలీదు. ఏదో విన్నది రాసా. అయినా జంతువులది కేవలం సంకేతాలేగానీ భాష కాదునుకుంటా. మీరన్నట్టు తార్కిక చింతన చేయాలన్నా, భాష కావల్సిందే. భాష లేనిదే తర్కం లేదు. అలాగే భావాన్ని వ్యక్తీకరించాలన్నా భాష కావల్సిందే.

Anonymous said...

కిచ కిచ కిచ .కోతి నదిలో నీళ్ళను వాడకపోవటానికి కారణం భాష ఎంతమాత్రంకాదు. It was not trained to do so. It doesn't know that its master wants it to use the river water. కిచ కిచ కిచ.

వింజమూరి విజయకుమార్ said...

కిచ కిచ కిచ అనోనిమస్ గారూ. కోతి యాంత్రికమైన పన్లు మాత్రమే చేయగలదు. భావాలను కలుపుకునే సృజనాత్మకమైన పనులు అది చేయలేదు. It doesn't know కాదు. భాష గనుకే దానికి తెలిస్తే సృజనాత్మకతతో దాని మాష్టరు శాస్త్ర హృదయం తెలుసుకుని వుండేది. బాగానే సమర్ధిస్తున్నారు కోతిని. పైగా కిచ కిచి అరుపొకటి. మాకేమోగానీ మీకు తాతే కోతి. ఏమంటారు.

Anonymous said...

Mee vyaasam bhaashani base cheesukuni raasaaru. Kaanii kathakii vaadanakii sambandham unnattu kanipinchatleedu.

Jantuvulaku Bhaasha undi kaani adi chaalaa parimitamaindi. Daanikii manishi bhaashakii unna teedaalu literaturelo oka aasaktikaramaina topic.

Ika ee vimarsanaa uttaram vishyaaniki vastee-

Koti nunchi manishi vacchaadaneedi Paaschaatya vaadana. Adi Darwin siddhaantam. Kaanii aa Darwin mahaasayudee tana pustakam "Origin of Species" lo tana parisoodhana antaa kevalam tana nammakameenani daaniki elaanti scientific proof leedani raasukunnaadani ekkadoo chadivinattu gurtu.

Atani siddhaantamlo unna losugulu endaroo paaschhaatya visleshakulu, vaijnaanikulee niruupanalato sahhaa kotti paareesaaru. Aa vaadanalannii neenu chadivaanu kaani ikaada aprastutam.

Darwin daggara chaalaa prasnalaku samaadhaanam ledu. Batikuntee galaa pattukuni aa chetta theories cheppinanduku utiki pettaalanipistundi.

Ika mana Divine (divya) Bhaaratiya siddhaantam chuustee manishidi divine descendence antundi. Adee nijamani mana Adhyaatmika pragati chuustee anipistundi. Anantamaina o saktiloni parimaita bhaagamee manishi ani naa nammakam. Manishi eppudu kaavaalanukuntee appudu aa aparimita ananta saktini cheeragaladu.

Kaabatti daya cheesi evarinii kooti nunchi puttaavani aaksheepinchi maanava jaati ounnatyaanni kimcha parachakandi.

Mee bloglo kathalannii chadivaanu. Manchi aaloochana ekkadunnaa neenu daanni gauravistaanu.

Dhanyavaadaalu.

వింజమూరి విజయకుమార్ said...

ఉష గారూ!

మీ సుదీర్ఘ వ్యాఖ్య చదివి చాలా సంతోషంచాను.కృతజ్ఞతలు
తర్వాత, ఒకవేళ నేను భాషని base చేసుకుని రాసినా చెప్పదలచింది కోతికి భాష లేదనే విషయమే. ఇదొక ఉదంతం. వాదనకి యిందులో తావులేదు. ఇకపోతే జంతువులకి భాష వుందో లేదో నాకు తెలీదు. సంకేతాలుంటాయని నేననుకుంటా.
డార్యిన్ పరిణామవాదం, తదనంతర వాదాలూ నాకు తెలుసు. డార్విన్ సిద్ధాంతం తప్పనుకున్నా కోతి నుండి మనిషి పుట్టాడనేది మన తెలుగువాళ్ళనానుడి. వ్యాస సారాంశం మాత్రం కోతికీ మనిషికీ తేడా. ఇక మన Divine (దివ్యత్వం) గురించి కూడూ నాకు తెలుసు.కానీ నా నమ్మకాలు వేరు. అందుకే భావాతీత థ్యానం గురించి బ్లాగులో రాసా. మనషి కోతిలోంచి పుట్టాడని నేను మానవుడిని కించపరచడం యేమిటండీ. అలా అంటే నన్ను నేనే కించపరచుకున్నట్టు కాదా? కనుక ఆ ప్రసక్తి లేదు. ఇక నా కథలన్నీ చదివానన్నారు. ధన్యుడిని. మంచి ఎక్కడున్నా గౌరవిస్తానన్నారు. చాలా మంచిది. కొనసాగించగలరు. మరిన్ని కృతజ్ఞతలతో. . .

Ramani Rao said...

వింజమూరిగారు!!

మనిషికి కోతికి వున్న తేడా భాష అని అన్నారు.. కాని అది కొంచం సత్యదూరమేమొ అని నాకనిపిస్తుంది... అన్ని జన్మల్లోకి ఉత్తమమైన జన్మ నరజన్మ అన్నారు మన పెద్దలు... ఎందుకంటే... మానవుడు తన యుక్తులతో ... ప్రపంచంలోని సమస్త ప్రాణ కొటిని తన స్వాధీనం చేసుకొన్నాడు..ఆ తెలివి తేటలు ఈ ప్రపంచంలో మానవుని సొంతం...

ఇక పోతే మీ కధలోకి వద్దాము... ఆ శస్త్రవేత్త ప్రయత్నం ఏంతవరకు నిజమో కాని..ఒక కోతి స్థానంలో... ఒక మూగ చెవిటి వాడికి కనక ఇలాంటి ట్రైనింగ్ ఇచ్చి చూస్తే.... చివరికి ఆ చెవిటి మూగవాడు.. తన ఆలోచనతో..పక్కన వున్నది సముద్రం అందులో వున్నది నీరు అని గ్రహించలేడంటారా?? కొంచం అలోచించండి.. ... భాష, భాష నుంది వచ్చిన లిపి..ఇవన్ని మానవుని సృష్టి... అంతేకాని..మెడడు యొక్క పరిపక్వత అనేది మనిషి లోను జంతువులలోను తేడాగా వుంటుంది... మూగవాడు..చెవిటివాడికి ఏ బాష తెలుస్తుంది చెప్పడి??

Ramani Rao said...

వింజమూరి గారు వ్యాఖ్య చాల సార్లు పంపినట్లున్నాను... కొంచం కష్టం మీద పంపాను... సారి..మీకు ఇబ్బంది గా అనిపిస్తే.. మీరు పబ్లిష్ చేయాలి అనుకొంటే ఒక్కటే.. చేయండి..