స్నానఘట్టం!..4
ఇది నా ఏభయ్యవ టపా. ఇప్పటిదాకా అంటే ఈ మధ్యలో కొంత కాలం నా తత్వశాస్త్ర టపాలతో, గణిత, జన్యుశాస్త్ర టపాలతో విసిగి వేసారిన పాఠకులకు కాస్త శృంగారం, హాస్యం, విషాదం కలగలిపి ‘సాహిత్యం’ టపా యివ్వాలనే ఉద్దేశ్యంతో సమయం తీసుకుని రాయబడిన కథ యిది. చదివి ఆనందించగలరనే ఆశిస్తాను.
స్నానఘట్టం! (కథ)
ఒకరోజు వేకువఝామున అయిదు గంటలప్పుడు పుష్పాంజలి ఇంట్లో నుండి ఎవరిదో స్త్రీ ఏడుపు వినిపించి, నేను నిద్రలోనుండి లేచి వెళ్ళి తలుపు దగ్గర చేరాను.
ఓ నలభై అయిదేళ్ళ మగాడితో పుష్పాంజలి వాళ్ళమ్మ ఏడుస్తూ మాట్లాడుతోంది. పుష్ఫాంజలి కూడా ఆ పక్కనే కూర్చుని వుంది. నేను వాళ్ళ మాటలు శ్రద్ధగా వినసాగాను.
“అది కాదురా మల్లయ్యా! నేనేమైనా కోరరాని కోరిక కోరుతున్నానా? ఆ పిల్లకి వుద్యోగస్థుడ్ని ఎవర్నైనా తెచ్చి చేయాలనుకుంటున్నాను. అది తప్పా?” అంటోంది వాళ్ళమ్మ.
“బయట కట్నాల సంగతి నీకు తెలీదక్కా. ఉద్యోగస్థులంటే మాటలనుకుంటున్నావా?” అన్నాడా వ్యక్తి.
“ఏదైనా మంచి కంపెనీలో చిన్న వుద్యోగైనా ఫర్లేదు చేసుకుంటానంటోందిరా పుష్పాంజలి. ఎటూ దాని అక్కలిద్దరికీ తేలేకపోయాం.” అందామె కన్నీరు తుడుచుకుంటూ.
“నిజమేనే అక్కా మనకి శక్తి వుండాలిగా?” అన్నాడతను సిగరెట్ తీసి వెలిగించుకుంటూ.
“వాళ్ళ నాయన దానికోసం అట్టిపెట్టిన స్థలం అమ్మితే ఒక లక్షరూపాయలొస్తాయి. ఎటూ పిల్ల బాగుంటుంది గనుక మీరంతా తలా ఒక చెయ్యి వేశారంటే దాని పెళ్ళి పెద్ద కష్టం కాదనుకుంటా.” అందామె.
“ఏం సహాయాలు చేయగలమే అక్కా. ఎవరి బాధలు వాళ్ళవి. నాకూ ఒక ఆడపిల్ల వుంది. నేనూ దాని బాగోగులు చూసుకోవాలి గదా. నావరకూ నేనైతే ఒక అయిదువేలియ్య గలను. పెద్దన్నయ్య ఎంతిస్తాడో కనుక్కో.” అన్నాడాయన తన శక్తిని తెలియజేసి, చేతులు దులిపేసుకుంటూ.
ఆ తర్వాత వాళ్ళ సంభాషణ నేను వినదలచుకోలేదు. కోట్లు కుమ్మరించినా కొనలేని చక్కదనాన్ని కోమటి కొట్లో గుమాస్తాకిచ్చి గొంతుకోసే ప్రయత్నాలూ, అశక్తత పేరుమీది యుక్తులూ కుయుక్తులూ నేను వినను. వినలేను కూడా.
* * *
రెండు రోజులు గడిచింది.
ఆ తర్వాత రోజు సాయంత్రం అకస్మాత్తుగా మా యింటి ఓనరొచ్చి మమ్మల్ని ‘ఆ నెలాఖరుకి గదులు ఖాళీ చేయమ’ని చెప్పాడు. ‘అంత అకస్మాత్తుగా మమ్మల్ని ఖాళీ చేయించాల్సిన అవసరం ఏమొచ్చింద’ని అడిగాను నేను. ఎవరో ఒకతను వచ్చి మేం యిస్తున్న అద్దెకి మూడు రెట్లు అద్దె యిస్తానన్నాడట. అందుకే మమ్మల్ని ఖాళీ చేయించాల్సి వచ్చిందన్నాడాయన. పైగా బుద్దిమంతులమైన మమ్మల్ని అర్థాంతరంగా ఖాళీ చేయించాల్సి వచ్చినందుకు బాధని వెలిబుచ్చాడు కూడా.
“ఆ మూడు రెట్లు అద్దె యిస్తానన్నవ్యక్తి పేరేమిటి?” అని అడిగాను నేను.
“ఉమేష్ గారట.” అన్నాడాయన.
నాకు అర్థమైపోయింది. ఉమేష్ గాడు ఆరోజు పుష్పాంజలిని చూడలేక పోయాననే అక్కసుని మనసులో పెట్టుకుని యింతకి తెగించాడు.
నాకు అక్కడనుండి వెళ్ళిపోవలసి రావడం బాధను కలిగించినా, అదీ మంచిదేననిపించింది.
అలాగేనన్నాను.
* * *
ఆరోజు నెలాఖరు. గది ఖాళీ చేయాల్సిన రోజు.
నేను ప్రక్కవీధిలో వేరే గది అద్దెకి మాట్లాడుకున్నాను. ఒకటి రెండు పరుపులు మినహా యించుమించు సామానంతా అక్కడకి చేరవేయడం కూడా జరిగిపోయింది. ఇంటి ఓనరొచ్చి గది ఖాళీ చేయమన్నరోజు రాత్రి చంద్రంగాడ్ని నేను బాగా తిట్టడం జరిగింది. వాడు అలిగి అప్పట్నుంచి గదికి రావడం మానేశాడు. బహుశా ఆ శీనుగాడి గదిలో మకాం పెట్టివుంటాడనుకున్నా.
సమయం ఉదయం ఆరు గంటలు కావస్తోంది. అది పుష్పాంజలి స్నానం చేసే సమయం.
ఆ గదిలో నాకదే ఆఖరురోజు కాబట్టి చివరిసారిగా పుష్పాంజలిని చూసి వెళ్దామనుకున్నాను. అందుకోసమే వెయిట్ చేయసాగాను. మరో పది నిముషాలు గడిచాక నీళ్ళబిందె చప్పుడైంది. నిశ్శబ్దంగా నడిచి, తలుపు దగ్గరకి చేరుకున్నాను. యథాప్రకారం బొక్కబోర్లాపడి లోపలికి చూడబోయాను.
అంతే!
“థడేల్!” మన్న చప్పుడుతో అక్కడి తలుపు తెరుచుకుంది. ఉగ్రస్వరూపిణిలా మారిన పుష్పాంజలి అక్కడ నిల్చుని వుంది.
ఆ హఠాత్పరిణామానికి నేను బిత్తరపోయి చటుక్కున లేచి నిలుచున్నాను. అసంకల్పితంగానే తలవంచుకుని “క్షమించండి.” అన్నాను.
పుష్పాంజలి నన్ను తీక్షణంగా చూసింది. ఉఛ్వాస నిశ్వాసలతో ఆమె గుండెలు ఎగసెగసి పడుతున్నాయి. ఆ రాత్రంతా ఏడ్చినట్టు ఆమె ముఖం వాచి ఎర్రబారి వుంది. ముక్కుపుటాలు అదురుతున్నాయి.
ఆమె నన్ను తీవ్రంగా చూస్తూ, “ఇది క్షమించగలిగే తప్పా?” అంది.
నేను మాట్లాడలేదు.
ఆమెకి దుఖః కట్టలు తెంచుకుంది. గట్టు తెగిన గోదారిలా ఆమె కళ్ళలో కన్నీరు పొర్లుతోంది.
“రోజుకొకరు చొప్పున మగాళ్ళని గదికి తీసుకొచ్చి మేం స్నానాలు చేసేప్పుడు చూపించడం క్షమించగలిగే తప్పా?” ఆమె గద్దించింది.
నేను దించిన తల ఎత్తలేదు.
“చెప్పు. చెప్పవేం?” ఆమె నిలదీసింది.
ఏమని చెప్పను నా సిగ్గులేని తనాన్ని. అలాగే మౌనంగా వుండిపోయా.
“పేదవాళ్ళం. మగదిక్కు లేనివాళ్ళం. ఏపూటకాపూట గడుపుకుంటున్న వాళ్ళం. మా బతుకులు బజార్న పెట్టారు. మీరు చేసిన ఈ పనికి యిప్పుడు ఈ ఊరొదిలి మేం దూరంగా వెళ్ళిపోవాలి. అక్కడ మేం ఎట్లా బ్రతకాలి?” అంది దిక్కుతోచనట్టుగా.
ఆ మాట భరించలేక పోయాను. చివ్వున తలెత్తి చూశాను.
“అయ్యో ఎక్కడికి వెళతారు?” అన్నాను మాటలకోసం తడుముకుంటూ. బిగిసడలని పశ్చాత్తాపం నన్ను కృంగదీసింది.
“మా చావేదో మేం ఛస్తాం. ఇట్లా యింకెవరి బ్రతుకులూ పాడుచేయకండి.” చేతులెత్తి నమస్కరించింది.
నేను నిరుత్తురుడనై నిలుచుండిపోయాను.
“నన్ను చూసిపోయిన ప్రబుద్ధుల్లో ఎవరో పాపం నామీద దయతో ఆకాశరామన్న ఉత్తరం రాశాడు. లేకుంటే మా బ్రతుకులింకెంత ఎగతాళి పాలయ్యేవో? ఈ ఉత్తరం నేను చూసాను గనుక సరిపోయింది. మా అమ్మకి తెలిస్తే ఉరేసుకు చచ్చివుండేది.” అంది. దుఃఖంతో ఆమె గొంతు పూడుకుపోయింది.
చేతిలో ఉత్తరం నామీదికి విసిరికొడుతూ, “ఛీ! మీరు కూడా మనుషులా?” అంది జిగుప్సగా. మళ్ళీ ఏడుస్తూ, లోపలికి వెళ్ళి “ధఢేల్” మని నా ముఖం మీద తలుపువేసింది.
నేను వెనక్కి తిరిగాను.
మర్యాదస్థురాలు గనుక ‘మీరు కూడా మనుషులా?’ అని అడిగి సరిపెట్టింది పుష్పాంజలి. మరింత గడుసుదైతే ‘మీకు అక్కాచెల్లెళ్ళు లేరా. వాళ్ళనీ యిలాగే చూపిస్తారా?” అని వుండేది. మరింత చిల్లర రకమైతే ముఖాన వుమ్మేసి, చెప్పుతో కూడా కొట్టి వుండేది. లేదంటే అందర్నీ పిలిచి కొట్టించి వుండేది.
నిజమే మా తప్పులకి తనని శిక్షించుకోదలపెట్టిన ఆమె సంస్కారం ముందు మేం ఎన్నటికీ మనుషులం కాకపోవచ్చు. ఎందుకంటే చేసింది సరిదిద్దుకునే తప్పు కాదు.
మానభంగం చేసివుంటే పెళ్ళి చేసుకుని సరిదిద్దుకోవచ్చు. కడుపు చేసి వుంటే దాన్ని తీయించి సరిదిద్దుకోవచ్చు. కానీ, వివస్త్రగా పదిమందికీ చూపించిన స్త్రీకి ఏంచేసి తప్పు సరిదిద్దుకోవాలో నాకు తెలీలేదు. పోనీ ఆర్థిక సహాయం చేద్దామంటే అదామె సౌందర్యానికి వెలకట్టిన పడుపుసొమ్మయి కూర్చుంటుంది. ఆ మాటే గనుక నేనంటే పుష్పాంజలి అప్పుడు నిజంగా నన్ను చెప్పుతో కొట్టి తీరుతుంది.
విషాదభరిత వేదనాశ్రువులు నా కళ్ళ వెంట వర్షించసాగాయి.
నేను దేవుడి పటం వైపు నడిచాను. వంగి మోకాళ్ళ మీద కూర్చున్నాను. ముకుళిత హస్తాలతో మానసం భగవంతునిపై లగ్నంచేసి. . .
“ప్రభూ! గాలిపడగ దారం వీడింది. గాలిలో పయణం కట్టింది. ముళ్ళకంప నంటకమునుపే, ముసురు వానన మునగక మునుపే. మరే మురికి మూలనో చేరక మునుపే. . .తండ్రిలేని పేదింటి పిల్ల. ఆమెని కాపాడు. ఏ జీవనస్వామికో అందించు. ఇదే నా జీవితకాలపు వేడికోలు!”
(సమాప్తం)
(ఒక స్నేహితుడు చెప్పిన సంఘటన ఆధారంగా ఈ కథ కల్పించబడింది. హైదరాబాదు వంటి ఇరుకు నగరాలలో యిటువంటివి సర్వ సాధారణం. కనుక అద్దె ఇళ్ళలో, క్రింది ఫ్లోర్ అపార్ట్ మెంట్ లలో వున్న స్త్రీమూర్తులారా ఎక్కడైనా కుర్రాళ్ళు పొంచి వుండగలరు గనుక తస్మాత్ జాగ్రత్త! -- రచయిత)
(అలాగే మొదట్లో యిది నా ఏభైయ్యవ టపా అన్నాను. చూస్తుండగానే ఈ కథతో యాభైమూడవ టపాలోకి వచ్చేశాను. ఏమనుకోకండే. ఉంటాను-రచయిత)
10 అభిప్రాయాలు:
అశ్లీలచిత్రం తనివితీరా చూసి చూపించి ’ఇదంతా తప్పమ్మా’ అన్నట్టుంది ఈ కథ. ’మానభంగం చేసివుంటే పెళ్ళి చేసుకుని సరిదిద్దుకోవచ్చు. కడుపు చేసి వుంటే దాన్ని తీయించి సరిదిద్దుకోవచ్చ”. ఈ రెండు వాక్యాలు చాలు వింజమూరీ ఆడవారి పట్ల నీ అభిప్రాయం తెలుసుకోటానికి. ఎక్కడా నిజాయితీ లేదు నీ రచనల్లో. నువ్వు ఒప్పుకోకపోయినా అంతే.
అయ్యో అనోనిమస్ గారూ తొందరపడకండి. ఇది సరదా కోసం రాసిన కథ. అలాగే, స్త్రీలని జాగ్రత్త పడమని చెప్పడం కూడా ముఖ్య ఉద్దేశ్యం. నేనొక రచయితని కొన్ని శృంగార రచనలు కూడా చేయాలి కదా. అశ్లీలం అనడానికి నేనేమైనా అంగాంగాలూ వర్ణించానా. స్త్రీ ఛాతీని వర్ణించడం రచయితలకు పరిపాటే. నిజానికి నా dry టపాలు చదివిన పాఠకులకి ఒక సరసమైన కథ చెపితే తప్పేంటండీ. అయినా 'సరసమైన కథ' అన్న టైటిల్ చూశాక యిష్టం లేనివాళ్ళు చదవడం మానుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే నా కథలన్నింటిలో దీనికే ఎక్కువ హిట్లు వచ్చాయి. అలాగే తక్కువ కామెంట్లు కూడా. అంటే దానర్థం ఎక్కువమంది ఎంజాయ్ చేస్తున్నారనేగా దానర్థం. దయచేసి రచయితగా నాకు కొంత స్వేచ్ఛనివ్వండి. మరీ కట్టేస్తే ఎలా స్త్రీ పేరుతో. నేను స్త్రీవాదిని కాదు మానవతా వాదినని మొదట్నుండీ కొట్టుకుంటూనే వున్నా. సరేనా?
గురువుగారూ, మీరు బాగా రాస్తున్నరా లేదా అన్న విషయం పక్కనపెడితే,మీ కథల్లో వాక్యాలని రంగులతో మీరే empahasis చేసుకోవడం బాగో లేదు. అలా ఫీల్ అయ్యే అవకాశాన్ని పాఠకులకు వదిలెయ్యండి.
అలాగే. ఇంతకుముందు ఒకరిద్దరు మిత్రులు కూడా యిదే మాటన్నారు. ఇక నించి అలా ఫీల్ అయ్యే అవకాశం పాఠకులకే వదుల్తాను. మీరు మంచి ఏది చెప్పినా నేను స్వీకరిస్తాను. కృతజ్ఞతలు.
వింజమూరి గారూ.. మానభంగం చేస్తే, కడుపుచేస్తే ఎలా సరిదిద్దుకోవచ్చో నని మీరు చెప్పిన విషయాలు ఈ కధలో చేసిన తప్పు వాతికన్నా తీవ్రమైనదని చెప్పడానికని నేను భావిస్తున్నాను. దాన్ని రచయిత అభిప్రాయం గా స్వీకరించకూడదని నా అభిప్రాయం. మీరేమంటారు?
వింజమూరి గారూ.. మానభంగం చేస్తే, కడుపుచేస్తే ఎలా సరిదిద్దుకోవచ్చో నని మీరు చెప్పిన విషయాలు ఈ కధలో చేసిన తప్పు వాతికన్నా తీవ్రమైనదని చెప్పడానికని నేను భావిస్తున్నాను. దాన్ని రచయిత అభిప్రాయం గా స్వీకరించకూడదని నా అభిప్రాయం. మీరేమంటారు?
అనోనిమస్ గారికి,
మరి అంతేకదండీ. మానభంగాలు చేయమనీ, కడుపులు చేయమనీ ఎవరైనా చెపుతారా. అక్కడ సమస్య తీవ్రతను చెప్పాల్సివచ్చినప్పుడు ఆ సంఘటనలతో అలా పోల్చాల్సి వచ్చింది. మీ భావనే నా భావన. ఇప్పుడా కథలో హీరోనే చూడండి. అతడు ఆ అమ్మాయిని బాగా యిష్టపడ్డాడు. దానికి తగ్గట్టుగానే ఆ అమ్మాయి కూడా క్యారెక్టర్ కలది. అతడికి ఉద్యోగం కూడా వుంది. ఆమెని పెళ్ళి చేసుకోవాలనే కోరిక కూడా వుంది. కానీ చేసుకోలేడు. ఆర్థిక సహాయం కూడా చేయలేడు. అందువల్ల మిగతా వాటి కన్నా అది చాలా పెద్ద తప్పిదం కదా. మొత్తానికి మీకు కృతజ్ఞతలు. కవి హృదయాన్ని, కథను సరిగా అర్థం చేసుకున్నారు.
mee kadhalo nijam undi kaani daanni choose mee choopulo bhaavaavesam dagi undi.
mee kadhalo nijam undi kaani daanni choose mee choopulo bhaavaavesam dagi undi.
aadavaalla gurunchi manchi katha raasaru kaani katha mugimpu verela vunte bagundedi
Post a Comment