ఒకానొక అజ్ఞానపు క్షణంలో. . . నాకు తెలీకుండా నేనే జన్మించి,  అమ్మ చనుబాలలో ఆది సంవేదన అనుభవించి. . .ఆటపాటలలో అద్వితీయుడనై రాణించి. . .సంఘ విద్యా సముపార్జనలో సారస్వత చక్రవర్తినై, పుస్తకాల్ని పఠించి. . .పరీక్షల్ని పరివీక్షించి. . .ఆత్మజ్ఞాన అవలోకనంలో విలువల వలువలు వూడదీసి. . .విశ్వతత్వాలు స్మరించి. . . మానవ శ్రేయస్సు మహా లక్ష్యమై పోగా. ."ఈ ప్రపంచపు దొడ్డబిడ్డగా ఉద్భవించాల"నీ, "ఒక పూర్తి మానవుడిగా పరిణమించాల"నీ, నేను కంటున్న కల,  కడుతున్న కోట. . .ఒహ్ ఇంతెందుకు కనుచూపు మేరలో. . . నా జీవితం ఒక వేద సంకలనం!!  నేనొక ఈశ్వరుడిని!!! ( ఇది ఈ బ్లాగులోని ప్రసంగి కథలో ఒక పాత్ర మనోభావాలు __ రచయిత )

Tuesday, February 26, 2008

శ్రీరామమూర్తీ - సిరచ్ఛేదం...3

శ్రీరామమూర్తీ – సిరచ్ఛేదం (సరదా అనుభవం)

“ఏమౌద్దిలే శ్రీరామ్మూర్తీ. దాని ఖర్మానికది చచ్చింది. అన్నా. తేలికగా తీసిపడేసినట్టు నటిస్తూ.” నా ప్రక్కన భాస్కర్ వచ్చేనవ్వును బిగబట్టుకుంటున్నప్పటికీ అతడికీ నేను చెప్పబోయేదేమిటో వినాలనే వుంది.

“సార్! మీరేదో నామీద మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నట్టున్నారు. నిజంగా మంత్రిగారేమంటారో చెప్పండి సార్.” శ్రీరామమూర్తి మాటల్లో కంగారు కంటే భయమే ఎక్కువగా కన్పిస్తోంది.

“నువ్వు భలే వోడివే శ్రీరామ్మూర్తీ మనసులో పెట్టుకోడానికి నువ్వేమయినా నా శత్రువా? అయినా అందులో నువ్వు చేసిన తప్పేం వుంది. నిద్రమత్తులో చూసుకోకుండా తొక్కావు. కావాలని. . వాంటెడ్ గా దాన్ని మర్డర్ చేయలేదు గదా.” అన్నా.

“లేదు సార్ మీరు నన్ను ఏడిపిస్తున్నారు. దయచేసి మంత్రిగారేమంటారో చెప్పండి సార్.” అన్నాడు శ్రీరామమూర్తి.

“ఏమనడు.” శ్రీరామ్మూర్తీ.

“లేదు దయచేసి చెప్పండి సార్. మంత్రిగారికి బాగా కోపమొస్తుంది గదా?” శ్రీరామమూర్తి గొంతులో ఆత్రుత కన్పిస్తోంది.

“కోపమెందుకు శ్రీరామ్మూర్తీ నువ్వేమయినా కుక్కపిల్లని కావాలని చంపావా?” అన్నా.

“లేదు లెండి. చెప్పండి సార్ విజయకుమార్ గారూ. నేనిక్కడ భయపడి ఛస్తున్నా.” అన్నాడు శ్రీరామమూర్తి.

“సరే శ్రీరామ్మూర్తీ భయపడుతున్నావు గాబట్టి నిజం చెప్తున్నా.” అన్నా.

“చెప్పండి.” శ్రీరామమూర్తి వినడానికి ముందుకి జరిగేడు.

“నిజం చెప్తా. భయపడకూడదు.” అన్నా మళ్ళీ.

“అబ్బ చెప్పండి సార్ అయ్యగారూ తొందరగా.”

“మంత్రిగారు ఏమీ అనరు గానీ. . .” సగంలో ఆపా.

“ఏమీ అనకుండా. . .” ఏమీ అనడనేప్పటికి శ్రీరామమూర్తి కొద్దిగా సంబరపడుతూనే క్యూరియాసిటీగా అడిగాడు.

“ఏమీ అనరుగానీ . . .ఈ విషయం వినగానే నిన్నలా తన దగ్గరకి రమ్మంటారు.”

“దగ్గరగా వచ్చాక?” శ్రీరామమూర్తి అమాయకంగా అడిగేడు.

“దగ్గరకి వచ్చాక ఒకసారి నిన్నలా నేల మీద పడుకోమంటారు.”

“పడుకుంటే?” శ్రీరామమూర్తి నా ముఖం వైపు అనుమానంగా చూస్తూ అడిగాడు.

“పడుకుంటే యింకేముంది. నువ్వు కుక్కపిల్ల గొంతుమీద కాలేసినట్టే మంత్రిగారు నీ గొంతుమీద కాలేసి అలా నులిమేస్తారు. సిగరెట్ పీకని నులిమినట్టు.” అన్నా.

ఇక భాస్కర్ నవ్వుని బిగబట్టుకోలేక పక పక మని విరగబడి నవ్వేశాడు.

శ్రీరామమూర్తి కి మండింది.

“మీరు భలేవోరండీ చచ్చేవాడ్ని యింకా చంపుతారు.” అలిగినట్టుగా అంటూ, భాస్కర్ వైపు తిరిగి “చూడండి సార్ భాస్కర్ గారూ ఈయన వేళాకోళం.” అన్నాడు.

“అయితే నువ్వు అడగడం ఎలాగుంది శ్రీరామ్మూర్తీ!: అన్నా నేను సీరియస్ లోకి వస్తూ.

“ఏమడిగానండీ మంత్రిగారేమంటారు అన్నా.” అన్నాడు శ్రీరామమూర్తి.

“మంత్రి గారేమంటారో. నువ్వు చెప్పే టైమ్ కి ఆయన ఏ మూడ్ లో వుంటారో. ఆయన ఎలా రియాక్ట్ అవుతారో నాకు గానీ ఈ భాస్కర్ కి గానీ తెలుసా?” అన్నా.

“మరి తెలీక పోతే తెలీదనొచ్చుగదండీ. నన్నిలా హడలగొట్టడమెందుకు?” అన్నాడు శ్రీరామమూర్తి.

“మరి నువ్వు ఏమంటారు. . ఏమంటారు అంటూ వత్తొత్తి అడిగితే నన్నేం చేయమంటావు.” అన్నా.

“సర్లేండి నా ఖర్మెలాగుంటే అలా కాలుద్ది.” అన్నాడు శ్రీరామమూర్తి.

“నీ ఖర్మేం కాలదులే శ్రీరామ్మూర్తీ మేమంతా లేమా. మంత్రిగారు రానీ పి.యస్ గారి చేత చెప్పిద్దాం పొరపాటైందని. పి.యస్. చెపితే ఏమనరు.” అన్నా ధైర్యం చెపుతూ.

“అమ్మయ్య ఆ పని చేయండి సార్. చచ్చి మీ కడుపున పుడతా.” అన్నాడు శ్రీరామమూర్తి.

“వారం రోజుల్లో వస్తారు మంత్రిగారు నీకు శిరచ్ఛేదం జరగకుండా చూసే బాద్యత మాది.” అన్నా భాస్కర్ ని నాతో కలుపుకుంటూ.

“అమ్మో ఈ వారం రోజులిట్టా నేను భయపడుతూనే వుండాలా?” అన్నాడు శ్రీరామమూర్తి.

“భయపడాల్సిన అవసరం లేదంటున్నాగా. కుక్కుపిల్ల ఛస్తే మనల్ని ఉరేసేస్తారా శ్రీరామ్మూర్తీ నీ పిచ్చిగాకపోతే.” అన్నా.

“నిజంగానండీ సార్ విజయకుమార్ గారూ చాలా భయపడిపోయానండి.” అన్నాడు శ్రీరామమూర్తి.

“అంత అవసరం లేదుగానీ. బంగ్లాకెళ్ళి పని చూస్కో. నీకేంగాదు.” అన్నా.

“చాలా థాంక్సండీ!” అంటూ శ్రీరామమూర్తి వెళ్ళిపోయాడు.

ఏదో పైకి కాస్త ధైర్యంగా కన్పిస్తున్నాడుగానీ నిజానికి శ్రీరామమూర్తి ఆ వారం రోజులూ సరిగా నిద్రపోయాడంటే నేను నమ్మను.

వారం రోజులు గడిచాయి. ఆ రోజు మంత్రిగారు హైదరాబాదు రావాల్సిన రోజు. కానీ రాలేదు. ఎందుకనో ‘టూర్’ రెండు రోజులు వెనక్కి ‘పోస్ట్ ఫోన్’ అయింది.

మంత్రిగారి రాక కోసం క్షణమొక యుగంగా ఎదురుచూసిన శ్రీరామమూర్తి మళ్ళీ రెండు రోజులనేసరికి డీలా పడిపోయాడు.

“ఇంకా రెండు రోజులు నేను భయపడుతూ బతకాలా?” అన్నాడు.

“మరి నేను భయపడుతూ బతకాలా?” అన్నా.

“లేదు లేదు.” బలవంతంగా తలూపేడు శ్రీరామమూర్తి నా మీద అక్కసుతో.

రెండ్రోజలూ గడిచాయి. ఇక ఈ రోజు వచ్చేస్తాడు మంత్రి అనుకుంటుండగానే మరో రెండు రోజులు వెనక్కి జరిగినట్టు ఫోనొచ్చింది.

ఇక శ్రీరామమూర్తికి సహనం చచ్చిపోయింది. నాతో మాటైనా చెప్పకుండా రాత్రికి రాత్రే రైలెక్కి కాకినాడ వెళ్ళిపోయాడు. మంత్రిగారిని కలిశాడు.

శ్రీరామమూర్తిని చూడగానే “ఏంరా యిట్లా వచ్చావు?” అన్నాట్ట మంత్రి ఆశ్చర్యంగా.

“ఏం లేదయ్యా నిద్రమత్తులో చూసుకోకుండా కుక్కపిల్లని తొక్కేశాను. చచ్చిపోయింది. అది చెప్పడానికే వచ్చాను”. అన్నాట్ట శ్రీరామమూర్తి.

“ఛస్తే చచ్చిందిలే. అది చెప్పడానికి యింత దూరం రావాలా నువ్వు ఛార్జీలు పెట్టుకుని? అన్నాట్ట మంత్రిగారు.

“భయమేసిందండీ అయ్యగారూ.” అన్నాట్ట శ్రీరామమూర్తి.

“ఛీ ఫో పిరికి సన్నాసీ!” అంటూ ఓ అయిదొందలు తీసి శ్రీరామమూర్తికిచ్చాట్ట మంత్రిగారు ఛార్జీల నిమిత్తం.

“అమ్మయ్య అయ్యగారు మంచోరే. శిరచ్ఛేదం చేయలేదు. పైగా అయిదొందలిచ్చారు.” అనుకుని ఊపిరి తీసుకున్నాట్ట శ్రీరామమూర్తి తొమ్మిది రోజుల తర్వాత ఫ్రీగా.

అదీ కథ!
( సమాప్తం )

Wednesday, February 13, 2008

శ్రీరామమూర్తీ – సిరచ్ఛేదం...2

శ్రీరామమూర్తీ – సిరచ్ఛేదం (సరదా అనుభవం కొద్దిపాటి అతిశయోక్తితో)

“అయితే నువ్వు మాట్లాడేదట్లాగే వుంది మరి” అన్నాను.

“అయ్యో రామ అంతమాటెలా అనగలనండీ. ఏదో మీతో నాకు చనువుంది గనక, మీరేదైనా మార్గం చెపుతారని మిమ్మల్ని అడుగుతున్నా” అన్నాడు శ్రీరామమూర్తి.

“అయితే నిజంగా చెప్పమంటావా మార్గం” అడిగాను.

“చెప్పమనేగదండీ నేనడుగుతున్నది. నిజంగా ఆ కుక్కతో నేను వేగలేకపోతున్నానండి” అన్నాడు శ్రీరామమూర్తి.

ఇక నేను జాప్యం చేయలేదు. చెప్పేశా.

“నీ ఫోన్ కి ముందు ఒక ఫోనొచ్చింది నాకు” అన్నా.

“దానికీ నాకూ సంబంధమేమిటి సార్” అన్నాడు శ్రీరామమూర్తి.

“అదే చెప్తున్నా. ఆ ఫోన్ మేడమ్ గారిది”

“అయ్ బాబో. అమ్మగారు చేసేరా. ఏమన్నారండి” అన్నాడు శ్రీరామమూర్తి క్యూరియాసిటీ ఎక్కువైపోగా.

“ఈ బ్రాహ్మడిక్కడ కుక్కకి స్నానం చేయించలేక బాధ పడ్తున్నాడు. ఇంకెవరైనా ఆ పని చేయగలిగిన మనిషిని ‘నోట్’ కొట్టి డిపార్ట్ మెంట్ నుండి తెప్పించ మన్నారు.

“అయ్ బాబో అలాగన్నారండీ. చూడ్డానికి అమ్మగారు అదోలా అన్పిస్తారు గానీ, నిజానికి దేవుల్లాంటోరండీ” శ్రీరామమూర్తి సంబరం మాటల్లో కన్పిస్తూనే వుంది.

“సరేగానీ, యిప్పుడు నీ ప్రాబ్లం తీరిందా” అడిగా.

“తీరింది గదండీ. అన్నట్టు ‘నోట్’ ఎప్పుడు కొడ్తున్నారండీ” అడిగాడు శ్రీరామమూర్తి.

“ఇప్పుడే కొట్టి పంపిస్తున్నా. వెంటనే తెప్పించే మార్గం చేస్తా. ఇక నువ్వు నిశ్చింతగా వుంటావా?”

“అయ్ బాబో ఆ పని చేయండి సార్ ముందు. చచ్చి మీ కడుపున పుడ్తా” అన్నాడు శ్రీరామమూర్తి.

“నా కడుపున పుడ్తే కుక్కకి స్నానం చేయించాల్సి వస్తుంది”

“ఎందుకండీ” అడిగాడు శ్రీరామమూర్తి అర్థంగాక.

“నేను బ్రాహ్మణుడిని కాదు గదా. నువ్వు బ్రాహ్మణుడివి గనుక మేడమ్ గారు విడిచిపెట్టారు. లేదంటే కుక్కకి స్నానం చేయించాల్సిందేగదా?” అన్నా సరదాగా.

“మీదంతా వేళాకోళమండీ. నేనొకడ్ని దొరికేను మీకు ఏడ్పిచ్చడానికి” శ్రీరామమూర్తి నొచ్చుకున్నాడు.

“సరేగానీ యిక ఫోన్ పెట్టేస్తావా నోట్ కొట్టాలి”

“పెట్టేస్తానండి. థాంక్సండీ. ముందా పని చూడండి. మీరూ మంచోరేనండీ” అన్నాడు శ్రీరామమూర్తి.

* * *

కొత్త పనివాడొచ్చాడు. వాడెవడోగానీ కుక్కలు కడగడంలో ధీరుడట. శ్రీరామమూర్తి సమస్య ఓ కొలిక్కొచ్చింది. కొలిక్కిరావడమేంటి. మొత్తంగా తీరిపోయింది. ఆ తర్వాత, ఓ పది పదిహేను రోజులు గడిచిపోయాయి.

ఓ రోజు మళ్లీ నాకు శ్రీరామమూర్తి దగ్గర్నుండి ఫోనొచ్చింది.

“అయ్యా ఓ సమస్యొచ్చిందండీ” చెప్పాడు శ్రీరామమూర్తి ఫోన్లో.

“మళ్ళీ ఏం సమస్య శ్రీరామ్మూర్తీ?” అన్నా.

“నిన్న అయ్యగారు టూర్ వెళ్లారు గదా కాకినాడకి” అన్నాడు శ్రీరామమూర్తి.

“అవును. వెళ్ళారు. ఏం?”

“ఎన్నిరోజులండీ టూరు?”

“వారం” అన్నా.

“అయ్యో చాల్రోజులుందే. ఎలాగండీ?” అన్నాడు శ్రీరామమూర్తి కంగారుగా.

“ఎలాగ ఏంటి? ఆ కంగారేంటి? అసలు నీకు అయ్యగారితో ఏం పని?” అడిగా.

“ఇక్కడో ఘోరం జరిగిపోయిందండీ” అన్నాడు శ్రీరామమూర్తి.

“ఏమైంది”

“నిన్న మంత్రిగారు టూరెళ్ళే ముందు నన్ను పిలిచి, కుక్కపిల్లకి బిస్కట్లూ గట్రా కొని పెట్టమనీ, రోజూ డాక్టరు దగ్గరకి తీసుకెళ్ళమనీ, జాగ్రత్తగా చూసుకోమనీ ఓ ఏడొందల రూపాయలిచ్చారండి. అయన టూరెళ్ళగానే ఇక్కడ అమ్మగారు కూడా పిల్లల్తో పాటు వాళ్ళ ‘కాన్స్టిట్యుయన్సీ’ వెళ్ళి పోయారండీ. ఇంటి తాళాలు నాకిచ్చి వెళ్ళారండి. ఇంట్లో నేనూ, రాముగాడూ, వంటోడూ, ఇద్దరూ కానిస్టేబుల్లూ వున్నామండీ. రాత్రి యిక్కడే పడుకున్నామండీ”

“అయితే”

“రాత్రి చీకట్లో బాత్ రూమ్ కని లేచానండి” భయంగా అన్నాడు శ్రీరామమూర్తి.

“లేస్తే? నాన్చకు. చెప్పు తొందరగా శ్రీరామ్మూర్తీ” ఏం జరిగిందోననే ఆందోళనతో అడిగాను (అఫ్ కోర్స్. ఏమైనా జరగడానికి అక్కడ ఆడాళ్లెవరూ లేరనుకోండి)

“నిద్రమత్తులో చూసుకోకుండా కుక్కపిల్ల మీద కాలేశానండి” అన్నాడు శ్రీరామమూర్తి.

“కొంపదీసి చచ్చిందా. ఏమిటి?” అన్నా. నేను కంగారుపడి.

“చస్తే ఏటౌద్దండీ?”. ఎదురు ప్రశ్నించాడు శ్రీరామమూర్తి.

“ఛస్తే ఏటౌద్దో మంత్రిగార్నడిగి చెప్తా గానీ, ముందు ఏమైందో చెప్పు” అసహనంగా అడిగా. శ్రీరామమూర్తి మాటేమో గానీ ముందు నాకు టెన్షన్ గా వుంది.

“కాలు పడగానే ముందు కాసేపు గిల గిలా కొట్టుకుందండీ. తర్వాత మీరన్నట్టు నిజంగానే చచ్చిపోయిందండీ” అన్నాడు శ్రీరామమూర్తి భయం భయంగా.

“గోవిందో గోవిందా!” అన్నా ఫోన్లోనే.

“మీరలా అనకండి సార్. నాకు భయం వేస్తోంది”

“నిండా మునిగాక భయమెందుకు శ్రీరామ్మూర్తీ. ఇక చూస్కో తమాషా” ఫోన్ పెట్టేశా.

నేను ఫోన్ పెట్టేసిన అర్థగంటలోపే శ్రీరామమూర్తి సెక్రటేరియట్ లో నా కళ్ల ముందు ప్రత్యక్షమయ్యాడు. నేనన్న మాటకి భయపడి ఆదుర్దాగా ఆటోలో వచ్చాట్ట. మనిషి బాగా భయపడ్డట్టు కన్పిస్తూనే వుంది. గబగబా నా దగ్గరకి వచ్చి, “ఇప్పుడేమౌద్దంటారు సార్ విజయకుమార్ గారూ” అన్నాడు.

నాకు మండింది.

(సశేషం)

Friday, February 8, 2008

శ్రీరామమూర్తీ – సిరచ్ఛేదం

శ్రీరామమూర్తీ – సిరచ్ఛేదం (సరదా అనుభవం)

ఆ రోజులు. అవి 1993 నాటి రోజులు. నా జీవితంలో అవి తిరిగిరాని రోజులు. పెళ్ళిగానప్పటి మధురమైన రోజులు. పెళ్ళాం గోల్డు కొనమని గోలెట్టని రోజులు. కుమారుడు కారు కావాలని కారుకూతలు కూయని రోజులు. ఉదయాన్నే ఆరు గంటలకు లేచి, రాత్రి పదిన్నర దాకా అడ్డమైన పన్లూ చేయాల్సిన అవసరం లేని రోజులు. మందు కొట్టకుండానే మాంచి నిద్రగొట్టే రోజులు. ‘బ్యాచిలర్’ గా వుంటూ నా రూమ్ కి నేనే మహరాజునై, ‘సర్వసత్తాక సార్వభౌమత్వా’న్ని కలిగివున్న రోజులు. కొత్తగా వుద్యోగం వచ్చి, ఊర్నుంచి ‘ఎర్ర బస్సు’లో హైదరాబాదొచ్చి, వెర్రిముఖం వేసుకుని వీధుల్ని ఎగాదిగా పరిశీలించే రోజులు. ఉద్యోగం రావడం మూలంగా నేనేదో “సముద్రాల్ని పుక్కిలించ గలన"నీ, "కొండల్ని త్రవ్విపోయగలన”నీ ఊహల్లో, భ్రమల్లో బతుకుతున్న రోజులు. నా మొత్తం జీవితంలో అత్యంత స్వాతంత్రకరమైన బంగారు వజ్రాల రోజులు. (ఈ వాక్యాలు ‘నువ్వు నాకు నచ్చావు’ సినిమాలో “అమ్మా నాకు నువ్వు జన్మనిచ్చావు. తినడానికి అన్నం యిచ్చావు. అయినా ఎందుకింత ఎర్లీగా చచ్చావు” అంటూ ‘ప్రకాష్ రాజ్’ కవిత చదివినట్టు మీకు అన్పిస్తే అది నా తప్పు కాదు).

ఆ రోజల్లో నేనో మంత్రిగారి (పేరెందుకు లెండి) దగ్గర పనిచేసే భాగ్యమో, దౌర్భాగ్యమో నాకు కలిగింది. మంత్రిగారి పేషీలో పీయే, పీయస్ లతో పాటు నేనూ మరో స్టెనోగ్రాఫరూ, నలుగురు గన్ మెన్లూ, ముగ్గురు డ్రైవర్లూ చివరాఖరికి ఏడెనిమిది మంది అటెండర్లూ వుండేవాళ్ళం. వాళ్ళలో యాభైయేళ్ళ శ్రీరామమూర్తి అనే ఓ తూ.గో. జిల్లా అటెండరు కూడా వుండేవాడు. అతడు పూర్తిగా “ఆయ్ అయ్గారండీ!” అంటూ పూర్తిగా తూ.గో. జిల్లా యాసలోనే మాట్లాడేవాడు. బీపీ లాంటివేం లేవుగానీ వట్టి కంగారు మనిషి. భయమెక్కువ.

ఓ రోజు మంత్రి గారు ఓ ఐదు వేలెట్టి అదేదో మాంచి జాతి కుక్కపిల్లని కొన్నారు. కొంటే కొన్నారు గానీ, పనోళ్ళనీ, అటెండర్లనీ పిలిచి “దాన్ని పసిపిల్లలా జాగ్రత్తగా కాపాడాలనీ, పెంచాల”నీ హుకుం జారీ చేశారు. “దానికేదైనా అయితే వూరుకోన”నీ హెచ్చరించారు కూడా. ఇక చూడండి. ఆ కుక్కపిల్లకి పాలూ, బిస్కెట్లూ. . ఒకటేమిటి రోజూ రాజ భోగమే. ఇదంతా మంత్రిగారి యింట్లో అంటే మంత్రిగారికి ప్రభుత్వం కేటాయించిన క్వార్టర్సులో నన్నమాట. మేం పని చేసేది సెక్రటేరియట్లో. శ్రీరామమూర్తి మంత్రిగారి యింట్లో పని చేసేవాడు.

ఓ రోజు శ్రీరామమూర్తి సెక్రటేరియట్లోని ఆఫీసు కొచ్చేడు. నేరుగా నా సీటు దగ్గరకి వచ్చి, “సార్ ఓ సమస్య వచ్చిందండి.” అన్నాడు.

“ఏంటది?” అన్నా.

“మంత్రిగారి కుక్కపిల్లకి నేను స్నానం చేయించాలంటారేంటండీ అమ్మగారు?” అన్నాడు (అమ్మగారంటే మంత్రిగారి సతీమణి అన్నమాట).

“మరి చేయించాలి గదా?” అన్నా.

“మీరు భలే వోరండీ. నాకేం ఖర్మ. నేనసలే బ్రామ్మడ్ని. ఇంట్లో నా పిల్లలకి కూడా ఏనాడూ స్నానం చేయించి ఎరగను” అన్నాడు.

“అది నీ సొంత విషయం శ్రీరామ్మూర్తీ. మీ యింటికి నువ్వే రారాజు గాబట్టి అది నీ యిష్టం. కానీ, ఇది నీ డ్యూటీ.” అన్నా ఓ పక్క నవ్వాపుకుంటూనే. అప్పటికే నా పక్కన స్టెనోగ్రాఫర్ భాస్కర్ అటువైపు తిరిగి నవ్వుతున్నాడు.

శ్రీరామమూర్తికి మండింది. “ఏదండి నా డ్యూటీ. కుక్కకి స్నానం చేయించడమా? మీరు భలే వోరండీ. నేను అడక్క అడక్క మిమ్మల్ని సలహా అడిగా” అన్నాడు.

“మరి రాముగాడి చేత చేయించు” అన్నా (రాముగాడు మరో అటెండరన్నమాట)

“వాడు డ్యూటీలో వున్నప్పుడు వాడు చేయిస్తూనే వున్నాడండీ. నా డ్యూటీలోనే నాకీ యిబ్బంది” అన్నాడు.

“మరా విషయం మేడమ్ గారికి చెప్పు” అన్నా.

“ఏ విషయమండీ?” అన్నాడు శ్రీరామమూర్తి అమాయకంగా.

“అదే నువ్వు బ్రాహ్మణుడవనీ. చేయించలేక పోతున్నాననీ”

“నిజంమండీ బాబూ. మొన్న మూడ్రోజులు చేయించా. వాంతొచ్చేస్తుందండీ బాబూ” వికారంగా మొహం పెట్టేడు.

“అదే. ఆ మాటే మేడమ్ తో చెప్పు” అన్నా.

“అమ్మగారు ఒప్పుకుంటారంటారా?” అడిగాడు అనుమానంగా.

“ఏమో నీ బాధ నువ్వు చెప్పాకోవాలి గదా. తర్వాత ఆమె యిష్టం. నువ్వన్నట్టు నీకేం ఖర్మ కుక్కలకి స్నానం చేయించడానికి. అయినా నీకు భయంలాగుంది మేడమ్ తో చెప్పడానికి” అన్నా అతడిని గమనిస్తూ. మా భాస్కర్ నవ్వుకుంటూనే వున్నాడు.

"అలాంటిదేం లేదండీ. ఎంతొకవేళ చప్రాసీగాడినైనా కుక్కలకి స్నానం చేయించడం ఏంటండీ? చెప్పేస్తా అమ్మగారితో” అన్నాడు.

“సరేలే. మెల్లగా చెప్పు. మళ్ళీ తేడా రాకుండా”

“తేడా వస్తే ఏటౌద్దేటండీ. నా పేరెంట్ డిపార్ట్ మెంటు కెళ్తా. పని చేసుకుంటా. అంతే. నా ఉద్యోగమయితే పీకలేరుగదా ఎవరూ” అన్నాడు శ్రీరామమూర్తి.

“ఆ మాత్రం ధైర్యముంటే ఫర్లే శ్రీరామ్మూర్తీ” అన్నా.

“చూడండి రేపు అమ్మగారితో చెప్పి, ఈ సంగతి అటో యిటో తేల్చేస్తా” అన్నాడు శ్రీరామమూర్తి మంత్రి బంగళా కెళ్లడానికి సమాయత్తమవుతూ.

“మేడమ్ గారితో చెప్పింతర్వాత ఆమేం అన్నారో ఓ సారి నాకు ఫోన్ చెయ్ శ్రీరామ్మూర్తీ” అన్నాను.

“అలాగే సార్” అంటూ ఆరోజు శ్రీరామమూర్తి వెళ్ళిపోయాడు.

మర్నాడు ఉదయాన్నే నాకు ఫోన్ వచ్చింది మినిష్టరు గారి బంగ్లా నుండి. ఫోన్లో శ్రీరామమూర్తి.

“విజయకుమార్ గారాండీ” అన్నాడు శ్రీరామమూర్తి నేను ఫోనెత్తగానే.

“అవును. ఏంటి శ్రీరామ్మూర్తీ” అన్నాను గొంతు గుర్తుపట్టి.

“సార్ మీరు చెప్పినట్టే చెప్పాను సార్ అమ్మగారితో. నేను కుక్కపిల్లకి స్నానం చేయించలేనని” అన్నాడు.

“ఏమన్నారు?”

“అయితే నన్ను చేయించమంటావా కుక్కకి స్నానం?” అన్నారండి.

“ఇంకా ఏమన్నారు?” కుతూహలంగా అడిగా.

“నీకు వాంతులొస్తే మరి నాకు రావా వాంతులు?” అన్నారండి.

“అదీ నిజమే గదా” అన్నా. వచ్చే నవ్వును ఆపుకుంటూ.

“మీరు భలేవోరండీ. కాసేపు యిటు మాట్లాడ్తారు. కాసేపు అటేపు మాట్లాడ్తారు” అన్నాడు శ్రీరామమూర్తి.

“మరేం చేయమంటావు శ్రీరామ్మూర్తీ. ఎటో ఒకవైపు మాట్లాడాలి గదా” అని, మళ్ళీ “మరి నువ్వనేదేంటి కుక్కకి నన్ను చేయించమంటావా స్నానం?” అన్నా.

“అయ్యో. రామ రామ. అదేంమాట సార్. అంత మాటనేశారు?” అన్నాడు శ్రీరామమూర్తి తెగ బాధపడిపోతూ.
(సశేషం)