ఒకానొక అజ్ఞానపు క్షణంలో. . . నాకు తెలీకుండా నేనే జన్మించి,  అమ్మ చనుబాలలో ఆది సంవేదన అనుభవించి. . .ఆటపాటలలో అద్వితీయుడనై రాణించి. . .సంఘ విద్యా సముపార్జనలో సారస్వత చక్రవర్తినై, పుస్తకాల్ని పఠించి. . .పరీక్షల్ని పరివీక్షించి. . .ఆత్మజ్ఞాన అవలోకనంలో విలువల వలువలు వూడదీసి. . .విశ్వతత్వాలు స్మరించి. . . మానవ శ్రేయస్సు మహా లక్ష్యమై పోగా. ."ఈ ప్రపంచపు దొడ్డబిడ్డగా ఉద్భవించాల"నీ, "ఒక పూర్తి మానవుడిగా పరిణమించాల"నీ, నేను కంటున్న కల,  కడుతున్న కోట. . .ఒహ్ ఇంతెందుకు కనుచూపు మేరలో. . . నా జీవితం ఒక వేద సంకలనం!!  నేనొక ఈశ్వరుడిని!!! ( ఇది ఈ బ్లాగులోని ప్రసంగి కథలో ఒక పాత్ర మనోభావాలు __ రచయిత )

Wednesday, March 5, 2008

రక్తం గ్లాసు...2

‘స్వాతి’ సపరివార పత్రిక 1-2-2002 సంచికలో ‘భయానక’ కథల విభాగంలో ప్రచురించబడిన నా కథ.

రక్తంగ్లాసు (కథ)

“అయ్ బాబో మీరెరగరండి. ఒకరోజు నేన్నిద్రలో వుంటే మనిషి పుర్రెదెచ్చి నా నెత్తిమీదేసిందండి. ఇంకో రోజు కూడుదినే కంచంలో నిలివినా నెత్తురు బోసిందండి. అందుకే రాత్రుల్లు నేనిక్కడుండనండి.” అన్నాడు నారయ్య.

“తినే కంచంలో నెత్తురెట్లా పోసింది? అది నీ ఎదురుగా వచ్చి నిలబడి కంచంలో పోసిందా?”

“కాదండి. ఆది మనకి కనిపిచ్చదండి. గాల్లోంచి నెత్తురు కంచంలోకి పడుద్దండి. అంతే.”

“సర్లేగానీ. . .బెడ్ రూమ్ లో వున్న ఇనుప గోద్రెజ్ బీరువా మీద కూడా రక్తం మరకలున్నాయి. ఆ బీరువా తాళాలు ఎవరిదగ్గరుంటాయి?” అడిగాను.

“నాకు దెలవదండి. రామరాజుగారి దగ్గరుండొచ్చండి.” అన్నాడు నారయ్య.

“సర్లె ఇక నువ్వెళ్ళు. ఎనిమిదింటికల్లా రాత్రి భోజనం పట్టుకురా!” అన్నాను. అతడు చూసేట్టుగా రివాల్వర్ తీసి చేతిలో పట్టుకుంటూ.

“వెళ్ళనండి. ఈ పూటిక్కడే తోటపని చేసి, సాయత్రం ఎళ్ళి భోజనం పట్టుకొత్తానండి.” అన్నాడు.

“సరే! నీ ఇష్టం!” అన్నాను.

* * *

ఆ రాత్రి నిద్రబోవడానికి ఎంతగా ప్రయత్నించినా నాకు నిద్రరాలేదు. అర్ధరాత్రి వరకూ ఎటువంటి అలికిడీ లేదు. సగం రాత్రి కావస్తుందనగా ఏదో అలికిడి అయినట్టయి ఉలిక్కిపడి, చెవులు రిక్కించి ఆ శబ్దం ఆలకించ సాగాను. రివాల్వర్ తీసి చేతబట్టుకున్నాను.

అది ఒక స్త్రీ ఏడుపు. సన్నగా రోదిస్తున్నట్టుగా ఉంది. తలవైపు కిటికీలో నుండి వినిపించసాగింది. గబుక్కున లేచి ఆ కిటికీ దగ్గరికి నడిచాను. కిటికీలోంచి పెరట్లోకి చూశాను. అక్కడ వెన్నెల వెలుగులో కనిపించిన దృశ్యం చూసి భయంతో అవాక్కయిపోయాను.

ఇద్దురు స్త్రీలు. పాడె మీద ఏదో శవాన్ని మోస్తున్నారు. నల్లటి చీరలు కట్టుకుని, జుట్టు విరబోసుకుని పెద్దగా రోదిస్తున్నారు. మెల్లగా పాడెని నేలమీదికి దించి, ఆ పాడె మీద పడి కర్ణకఠోరంగా దుఃఖించసాగారు.

ఎదురుగా వున్న ఇద్దురు స్త్రీలలో ఒకామె పాడెమీదున్న ఓ చిన్న గునపాన్ని చేతిలోకి తీసుకుంది. గునపంతో ఓ చిన్న గుంటతీసి, పలుగు పక్కన పడేసి మొదటి స్త్రీ మళ్ళీ పెద్దగా రోదించసాగింది. ఎదురుగా వున్నామె చేతిలోని శిశువు శవాన్ని తన చేతుల్లోకి తీసుకుంది. అలా వాళ్ళిద్దరూ ఆ బిడ్డ శవాన్ని ఒకరి చేతిలోంచి ఒకరు లాక్కుంటూ కొంతసేపు ఏడుస్తూనే వున్నారు.

అలా బిడ్డమీద పడి రోదిస్తున్న ఆ స్త్రీలిద్దరూ ఏదో అనుమానం వచ్చిన వారిలా వున్నట్టుండి నేనున్న కిటికీ వైపు తలలు తిప్పి చూశారు. అక్కడ నేను నిల్చుని ఉండటం గమనించి నావైపు చూశారు. తర్వాత వారు నన్ను భయపెడ్తున్నట్టుగా కళ్ళు ఉరిమారు.

నా గొంతులో తడారిపోయింది. నిముషం తర్వాత ఆ స్త్రీలు నా వైపు నుండి చూపు తిప్పి బిడ్డమీదికి మళ్ళించారు. మళ్ళీ ఏడుస్తూ, ఆ శవాన్ని గుంటలో వుంచి మట్టి కప్పారు. తర్వాత, లేచి నిలబడి నావైపు చూశారు. అలా గుడ్లురిమి నన్ను చూస్తూనే మెల్లగా అక్కడ్నుంచి కదిలి కాంపౌండ్ గేట్లోంచి బయటికి వెళ్ళిపోయారు.

“మైగాడ్!” నేను ఊపిరి పీల్చుకున్నాను. ప్రమాదం తప్పిపోయిందన్న రిలీఫ్ తో వెనక్కి తిరిగాను. మంచం దగ్గరికి వెళ్ళబోతూ ఎందుకో అనుమానం వచ్చి అటుపక్క కిటికీవైపు చూశాను. అంతే. కరెంట్ షాక్ తగిలినవాడిలా స్తంభించిపోయాను. ఓ నల్లటి ఆకారం అక్కడ నిల్చుని నన్ను చూస్తోంది. నేను దాన్ని చూడ్డం గమనించి తప్పుకుంది.

* * *

“గుడ్ మార్నిగ్ సార్!” అన్నాడు ప్రభాకర్.

“వెరీగుడ్ మార్నింగ్!” బదులిచ్చాను.

“రాత్రి మామూలుగా గడిచిందా లేక. . .” ఆగాడు.

“జరగకూడనిదే జరిగింది.” అని, రాత్రి జరిగిందంతా వివరంగా చెప్పాను.

అంతా విని, “అయ్యబాబో మీకెంత ధైర్యంసార్! అదంతా చూసి కూడా మామూలుగా మాట్లాడుతున్నారు. నేనైతే చచ్చేవాడిని.” అన్నాడు.

“నేనా మాటలు పట్టించుకోకుండా, ప్రభాకర్ పెరట్లోకెళ్ళి చూసొద్దాం. రా!” అన్నాను.

(సశేషం)

2 అభిప్రాయాలు:

Anonymous said...

చాలా ఇంట్రెస్టింగా ఉందండి.. తరువాతి భాగం కోసం ఎదురు చూస్తూ ఉంటాను.

వింజమూరి విజయకుమార్ said...

రమ్యగారూ,

కృతజ్ఞతలు. వదుల్తున్నా వదుల్తున్నా ఈ రోజు రేపట్లో 'రక్తం గ్లాసు' ఖతమ్.