ఒకానొక అజ్ఞానపు క్షణంలో. . . నాకు తెలీకుండా నేనే జన్మించి,  అమ్మ చనుబాలలో ఆది సంవేదన అనుభవించి. . .ఆటపాటలలో అద్వితీయుడనై రాణించి. . .సంఘ విద్యా సముపార్జనలో సారస్వత చక్రవర్తినై, పుస్తకాల్ని పఠించి. . .పరీక్షల్ని పరివీక్షించి. . .ఆత్మజ్ఞాన అవలోకనంలో విలువల వలువలు వూడదీసి. . .విశ్వతత్వాలు స్మరించి. . . మానవ శ్రేయస్సు మహా లక్ష్యమై పోగా. ."ఈ ప్రపంచపు దొడ్డబిడ్డగా ఉద్భవించాల"నీ, "ఒక పూర్తి మానవుడిగా పరిణమించాల"నీ, నేను కంటున్న కల,  కడుతున్న కోట. . .ఒహ్ ఇంతెందుకు కనుచూపు మేరలో. . . నా జీవితం ఒక వేద సంకలనం!!  నేనొక ఈశ్వరుడిని!!! ( ఇది ఈ బ్లాగులోని ప్రసంగి కథలో ఒక పాత్ర మనోభావాలు __ రచయిత )

Tuesday, March 4, 2008

రక్తం గ్లాసు - 1

‘స్వాతి’ సపరివార పత్రిక 1-2-2002 సంచికలో ‘భయానక’ కథల విభాగంలో ప్రచురించబడిన నా కథ.

రక్తంగ్లాసు (కథ)


“రెండు వేల రెండులోకెళ్ళాం. ఇంకా దెయ్యాలూ భూతాలూ ఏమిటి రామరాజూ?” అన్నాను.

“తేలిగ్గా తీసేయకు. నా కళ్ళతో నేను చూశానని చెప్తున్నాగా!” సీరియస్ గా చెప్పేడు రామరాజు.

“ఏం చూశావు నీ కళ్ళతో?” అడిగాను.

“చెప్తే విలువుండదు. నేను ఫేస్ చేసిన ప్రతిదానికీ నువ్వు రీజనింగ్ ఇస్తావు. కొట్టిపడేస్తావు. అది ఎవరికి వాళ్లు చూడాల్సిందే.”

నేను కొద్దిసేపు మాట్లాడలేదు. తర్వాత, ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా అన్నాను.
“ఎందుకో ఆ పల్లెటూర్లోని మీ ఇల్లు నేనోసారి చూడాలనుకుంటున్నాను.”

“సరేగానీ అక్కడ ఏదైనా జరగరానిది జరుగుతుందేమోనని నా భయం.” అన్నాడు రామరాజు.

“ఆ భయం నాకు లేదన్నానుగా?”

“సరే నీ యిష్టం. ఈ మాట చాలాసార్లు ఆడిగావు గాబట్టి వెళ్ళాలనుకుంటే వెళ్ళు. అయితే ఆ యింట్లో ఓ రెండు రోజులు మాత్రమే గడిపి వచ్చెయ్. ఒక విషయం. . . జరుగుతున్నదేంటో చూడడమేగానీ నువ్వు మాత్రం రిస్క్ తీసుకోవద్దు. అసలటువంటి రిస్క్ ఏదైనా జరుగుతుందనే అనుమానం వచ్చినా సరే వెంటనే ఇల్లు వెకేట్ చేసి వచ్చెయ్. ఓ.కె.”

“ఓ.కే!” అన్నాను.

“అయితే ఎప్పుడెళ్తావో చెప్పు. ఆ ఊర్లో మా మేనేజర్ కి ఫోన్ చేసి చెపుతాను. కావలసినవన్నీ చూసుకుంటాడు. వాచ్ మెన్ నారయ్యకి చెప్పి పెట్టమంటాను.”

“రేపట్నుండీ కోర్టుకి సెలవులుగదా. ఎల్లుండి వెళ్తా!”
* * *
“రామరాజు వాళ్ళ తాతగారు ఈ గ్రామంలో ఈ భవంతిలోనే కాపురం వుండేవాళ్లు. వాళ్ళది పేరుమోసిన జమీందార్ల కుటుంబం. అప్పట్లో ఈ బిల్డింగ్ లో దెయ్యాలూ గియ్యాలూ లాంటివేం లేవు.”

“రామరాజు వాళ్ళ నాన్నగారి హయాంలో ఈ ఊరు వదిలి వాళ్ళు హైదరాబాదులో స్థిరపడ్డారు. అప్పట్నుంచీ ఈ ఇల్లు లాక్ చేసి ఖాళీగా వుంచారు. అప్పట్నుంచీ ఈ దెయ్యాల గోలంతా.” అన్నాడు మేనేజర్ ప్రభాకర్.

నేను మాట్లాడలేదు. అతడ్ని గమనిస్తూ వింటున్నాను.

“వాళ్ళకి వంద ఎకరాల పొలం ఉండేది. అంతా మాగాణి. ఆది ఇప్పటికీ ఉందనుకోండి. ఆ పొలం వ్యవహారాలే నేను చూసుకుంటూ వుంటాను.”

“నారయ్య ఈ భవంతికి కాపలాగా వుంటాడు. అదైనా రాత్రి పదిగంటల వరకే వుంటాడు. ఆపైన వాడికీ భయమే. మళ్ళీ ఉదయం వస్తాడు. నాదైనా వాడిదైనా ప్రాణం ప్రాణమే గదా.” అన్నాడు మళ్ళీ ప్రభాకర్.

“మరి రామరాజు ఈ ఇల్లూ, పొలం అమ్ముకోవచ్చుగా?” అన్నాను.

“ఎవరు కొంటారు? అతడి ఇంట్లో, పొలంలో దెయ్యాలు తిరుగుతూంటే.” అన్నాడు ప్రభాకర్.

“పొలంలో కూడా వున్నాయా దెయ్యాలు?”

“మొదట పొలం లోనే కన్పించాయి. ఈ మధ్యనే బిల్డింగ్ లో. దాంతో పొలం విలువ బొత్తిగా పడిపోయింది. మొదట్నుంచీ ఇక్కడ వున్నవాడ్ని గనక ఏదో తంటాలు పడి నేను కౌలుకి చేస్తున్నాను.”

“ఈ పొలం కొనుక్కుంటే ఈ ఊళ్ళో ఎక్కువ ఎవరికి ఉపయోగం వుంటుంది” అడిగాను.

“ఎవరికనేముంది. ఎవరికైనా ఉపయోగమే ఈ దెయ్యాల బెడద లేకుంటే.” అన్నాడు.

“నా ఉద్దేశ్యం అది కాదు. రామరాజు వాళ్ళ పొలాల్ని ఆనుకుని ఎవరి పొలాలు వున్నాయి?” అని.

“ఒకరివంటూ ఏం లేవు. చాలా మందివి వున్నాయి.” అని, ఇక తాను వెళ్తానన్నట్టుగా లేచి నిలబడి. . .
“మధ్యాహ్నానికి, రాత్రికీ నారయ్య భోజనం పట్టుకు వస్తాడు. మీకేది కావాలన్నా నారయ్యకి చెప్పండి. కానీ, రాత్రి పదిలోగా అతడ్ని ఇంటికి పంపించేయండి. పాపం పిల్లలు గలవాడు. ఎందుకైనా మంచిది మీరు కూడా జాగ్రత్తగా వుండండి.” ప్రభాకర్ కదిలాడు.

అతడు వెళ్ళింతర్వాత ఇంట్లోకి నడిచాను. క్యారేజ్ డైనింగ్ టేబిల్ మీదుంది. టిఫిన్ చేయడానికని డైనింగ్ హాల్ లోకి వెళ్ళబోతూ ఎందుకో అటు డ్రాయింగ్ రూమ్ లోని టీపాయ్ వైపు చూశాను. అక్కడ టీపాయ్ మీదున్న గ్లాసులో ఎర్రటి ద్రవం వుంది. దగ్గరకెళ్ళి పరీక్షగా చూశాను. అది కాదు. రక్తం. ఎర్రగా, చిక్కగా వున్న రక్తం. . . ఎవరిదో?!!
* * *
ఆ రోజు మధ్యాహ్నం నారయ్య నాకు భోజనం తీసుకువచ్చాడు. అతడిని డ్రాయింగ్ రూమ్ లోకి తీసుకెళ్ళి టీపాయ్ మీది రక్తం గ్లాసు చూపించాను.

నారయ్య ఆశ్చర్యపడలేదు. “ఆ ఎదవముండ ఇంతేనండి. నాలుగేళ్ళనుండీ నన్నిట్టా ఏడిపిత్తావుందండి.” అంటూ, ఆ రక్తం గ్లాసు తీసుకెళ్ళి దూరంగా పడేశాడు.

“నేను ఉదయం ప్రభాకర్ మాట్లాడుతున్నప్పుడు మెయిన్ డోర్ లాక్ చేసే లాన్ లో కూర్చున్నాను నారయ్యా. అన్ని తలుపులూ వేసివుండగా ఈ రక్తం డ్రాయింగ్ రూమ్ లోకెలా వచ్చిందో నాకు అర్థంకావడం లేదు.” అన్నాను అతడిని పరిశీలిస్తూ.

“అయ్యా అది మనిషి కాదండీ బాబూ. దెయ్యం. ఎట్లాగైనా లోపలికి వచ్చేత్తది. నేనిట్టాంటియి ఎన్ని చూశాననుకున్నారు?” అన్నాడు నారయ్య.

“ఇలాంటివి చాలా చూశావా?” అన్నాను.

(సశేషం)

0 అభిప్రాయాలు: