ఒకానొక అజ్ఞానపు క్షణంలో. . . నాకు తెలీకుండా నేనే జన్మించి,  అమ్మ చనుబాలలో ఆది సంవేదన అనుభవించి. . .ఆటపాటలలో అద్వితీయుడనై రాణించి. . .సంఘ విద్యా సముపార్జనలో సారస్వత చక్రవర్తినై, పుస్తకాల్ని పఠించి. . .పరీక్షల్ని పరివీక్షించి. . .ఆత్మజ్ఞాన అవలోకనంలో విలువల వలువలు వూడదీసి. . .విశ్వతత్వాలు స్మరించి. . . మానవ శ్రేయస్సు మహా లక్ష్యమై పోగా. ."ఈ ప్రపంచపు దొడ్డబిడ్డగా ఉద్భవించాల"నీ, "ఒక పూర్తి మానవుడిగా పరిణమించాల"నీ, నేను కంటున్న కల,  కడుతున్న కోట. . .ఒహ్ ఇంతెందుకు కనుచూపు మేరలో. . . నా జీవితం ఒక వేద సంకలనం!!  నేనొక ఈశ్వరుడిని!!! ( ఇది ఈ బ్లాగులోని ప్రసంగి కథలో ఒక పాత్ర మనోభావాలు __ రచయిత )

Saturday, September 29, 2007

భావాతీతధ్యానం! - 2

భావాతీతధ్యానం! (మెడిటేషన్)...2

(ఈ ‘సబ్జెక్టు’ అందరికీ ఉపయోగకరమని నా ఉద్దేశ్యం)

ఇక రెండవది. యిది నిరాకారం, నిర్గుణోపాసన లాంటి పేర్లతో పిలువబడుతోంది!

ఇందులో వ్యక్తి దైవం గట్రా ఎటువంటి ఆకారాన్నీ హృదయంలో ప్రతిష్టించుకోడు. ఏ దైవం పేరునో, మంత్రాన్నో ఉచ్ఛరించడు. కానీ, మనసులోకి ఎటువంటి ఆలోచనా రాకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఈ క్రమంలో ద్యాన పద్దతి గురించిన అవగాహన లేక ఈ వ్యక్తి కూడా మొదటి సుగుణోపాసకుడి లాగానే మనసులోకి ఆలోచన చొరబడనీయకుండా కంట్రోల్. . . మనసుని నియంత్రిస్తుంటాడు. మనసు లోనికి “ఏ ఆలోచనా రానీయకూడద”నే నియంత్రణాపూర్వకమైన ఆలోచన కూడా ఒక ఆలోచనే కదా? నియంత్రించే వ్యక్తి, నియంత్రింపబడేది వేర్వేరుగా వున్నంతకాలం ఘర్షణ అనేది తప్పనిసరి. కనుక యిక్కడ కూడా మొదటి సుగుణోపాసకుడిలాగానే ఘర్షణ, శక్తిని కోల్పోవడం, ప్రశాంతత గానీ సత్యంగానీ లభించక పోవడం వుంటుంది.

కాబట్టి యిది కూడా భావాలు లేని భావాతీతమైన ధ్యానం కానేరదు.


పైన చెప్పిన రెండు రకాల ధ్యాన ప్రక్రియలూ పైన చెప్పిన సంసారీ, సన్యాసీ ధ్యేయాలకి మల్లే పరస్పరం భిన్నంగా అన్పించినప్పటికీ ఆచరణలో ఒకే విధమైన సాధనలు.

పూర్తిగా నిరర్థకమైనవి. వీటిలో కోరికలూ, ఏదో సాధించాలనే తాపత్రయాలూ, వెంపర్లాటలూ, వీటన్నింటినీ నడిపించే అంతర్లీనమైన ఆశ నిబిడీకృతమైవుంటుంది.

కనుక, యివి అసలు సినలైన ధ్యాన ప్రక్రియలు కావు.

అయితే అసలైనదేది?

(సశేషం)

Friday, September 28, 2007

భావాతీతధ్యానం! 1

భావాతీతధ్యానం! (మెడిటేషన్)

(ఈ ‘సబ్జెక్టు’ నిజంగా అందరికీ ఉపయోగకరమనే ఉద్దేశ్యంతో రాస్తున్నాను)

మనం సాధారణంగా ‘మెడిటేషన్’ లేదా ‘భావాతీత ధ్యానం’ లాంటి మాటలు వింటుంటాం. అంటూంటాం! మనం ఏదో అనారోగ్య సమస్యతో డాక్టరు దగ్గరకి వెళ్తాం. డాక్టరు ‘మెడిటేషన్’ చేయమంటాడు. మరేదో వ్యక్తిగత సమస్య స్నేహితుడుకి చెప్పుకుంటాం. అతడూ అదే సలహా యిస్తాడు. ఇంకెవరో మనతో గొప్పగా చెప్పుకుంటారు “నేను మెడిటేషన్ చేస్తున్నా. చాలా హ్యాపీగా వున్నా”నంటూ.

ఇంతకీ, ‘మెడిటేషన్’ చేయమన్న ఆ డాక్టరుకీ, మన స్నేహితుడుకీ, ఇంకెవరో ‘మెడిటేషన్’ చేస్తున్నానని చెప్పిన వ్యక్తికీ నిజంగా ఈ ‘మెడిటేషన్’ అంటే ఏమిటో తెలుసా? ఇదీ అసలు సమస్య?

ఒక హిందువుడు భగవద్గీత పట్టుకుంటాడు. గుడి కెళ్ళి ప్రార్థన చేస్తాడు. ముస్లి ఖురాన్ తో మసీదు కెళ్తాడు. అలాగే బైబిల్ తో క్రిష్టియనూ. . . ఈ విధంగా రకరకాల మతాల వ్యక్తుల రకరకాల విశ్వాసాలతో ప్రార్థనలు జరుపుతుంటారు. కానీ, యిక్కడ అసలు విషయం వాళ్ళంతా వాళ్ళ విశ్వాసాల కనుగుణంగా మానసిక, శారీరక అరోగ్యం గానీ, ఆథ్యాత్మికమైన మరో ప్రయోజనం గానీ నిజంగా పొందుతున్నారా. . . లేదా?

తర్వాత, మనం బాధల్లో వుంటాం. బాధలకి ప్రత్యామ్నాయం దొరకదు. ఎవరి మీదో ఆధారపడతాం. గురువుని ఆశ్రయిస్తాం. సలహా కోరతాం. అతడేదో మంత్రమో, యింకొకటో ఉపదేశిస్తాడు. అది మనం ఆచరిస్తాం. కానీ, మళ్ళీ మామూలుగానే వుంటాం. ఒక్కోసారి దైవం మీదా ఈ ‘మెడిటేషన్’ మీద అసలు మనకి విశ్వాసం పోతుంది. రకరకాల సందేహాలూ పీడిస్తుంటాయి. అన్నీ ధ్యానం అంటే ఏమిటీ. . . ఎవరైనా నిజమైన ధ్యానం గురించి చెప్తే బాగుణ్ణు అని.

నిజానికి ఈ ‘మెడిటేషన్’ లేదా ‘ధ్యానం’ అంటే ఏమిటి? అసలు అటువంటి స్థితి యేదైనా నిజంగా వుందా లేదా యివి ప్రస్తుతం మన ముందున్న ప్రశ్నలు!

అసలు ధ్యానం గురించి తెలుసుకునే ముందు దానికి అవసరమైన కొన్ని మామూలు విషయాల గురించి తెలుసుకుందాం!

సమాజంలో జీవిస్తున్న ఒక సగటు మనిషిని ఉదాహరణగా తీసుకుంటే అతడికి కొన్ని కోరికలూ, ఆదర్శాలూ, ధ్యేయాలూ, లక్ష్యాలూ, వాటిని సాధించడానికి అతడు చేసే ప్రయత్నాలూ వుంటాయి. ఉదాహరణకి భార్యా పిల్లలూ, సొంత యిల్లూ, కొంత పొలం, ఓ కారూ, ఓ పెద్ద బ్యాంక్ అకౌంటూ యింకా అనుకుంటే ఓ పెద్ద పదవి (భారత ప్రధానో, అమెరికా ప్రెసిడెంటో). . . ఇవన్నీ ఆశతో ముడిపడి వుంటాయి.

అలాగే కుటుంబాన్నీ, సమాజాన్నీ వదిలేసి ఆథ్యాత్మికం లోకి వెళ్ళిన వ్యక్తిని తీసుకుంటే అతడకీ మామూలు మనిషిలాగే కొన్ని కోరికలూ, ఆదర్శాలూ, ధ్యేయాలూ, లక్ష్యాలూ, వాటిని సాధించడానికి అతడు చేసే ప్రయత్నాలూ వుంటాయి. కాకపోతే భార్యా పిల్లల బదులు దైవం, ఆస్థికి బదులుగా ముక్తీ, కారుకి బదులుగా స్వర్గం, పదవికి బదులుగా దైవదర్శనం, ఆత్మసాక్షాత్కారం, విశ్వరూప సందర్శనం యిలా. . . సగటు మామూలు మనిషి కోరికలకి భిన్నంగా అన్పించినా ఇవన్నీ కూడా ఆశతోనే ముడిబడివుంటాయి.

కనుక పైకి భిన్నంగా అన్పించినా వీళ్ళిద్దరినీ నడిపించే చోదక (Motive) శక్తి ఒకటే. అది ఆశ!

ఇక ‘మెడిటేషన్’ (Meditation) లేదా ‘భావాతీత ధ్యానం(భావాలు అంటే ఆలోచనలు లేనిది)’ గురించి విచారిద్దాం!

ఇందులో మొదటిది సాకారం, సుగుణోపాసన లాంటి పేర్లతో పిలువబడుతోంది.

ఒక వ్యక్తి పద్మాసనం వేసుకుని కళ్ళు మూసుకుని, “రామ రామ” అంటూనో, “ఓం నమశ్శివాయః” అంటూనో లేదా “అల్లా”, “యొహోవా” అంటూనో ఆ వ్యక్తి తనకి యిష్టమైన ఒక దైవం పేరును పదే పదే ఉచ్ఛరిస్తూ వుంటాడు. ఆ ఉచ్ఛారణలో ధారణ వుంటుంది. ఏకాగ్రత వుంటుంది. వ్యక్తి ఆలోచన పక్కదారి పట్టకుండా జాగ్రత్త పడటం, కంట్రోల్ చేయడమనేది వుంటుంది. ఈ పేరు ఉచ్ఛరించే క్రమంలో, కంట్రోల్ చేసే క్రమంలో వ్యక్తి నిరంతరం ఘర్షణ పడటం వుంటుంది. శరీరంలోని శక్తి ఖర్చవడం జరుగుతుంది. ఇక్కడ గమనిస్తే ఆ వ్యక్తి కోరుకునే ప్రశాంతత నిజంగా అతడికి దొరకదు. పైగా ఈ ప్రక్రియ లోపభూయిష్టంగా, ప్రశాంత రహితంగా తయారై అతడెన్ని గంటలు ఈ రకమైన ధ్యానం చేస్తాడో అన్ని గంటలు శరీరంలో శక్తి ఖర్చయి చివరకి అలసట మిగులుతుంది.

ముఖ్యమైన విషయమేమిటంటే. . . ఈ ధ్యాన ప్రక్రియ అంతా భావాలతో, ఆలోచనలతో, కంట్రోల్ చేయాలనే తాపత్రయంతో నిండి వుంటుంది. కనుక యిది భావాలు లేని భావాతీతమైన ధ్యానం కానేరదు.

ఈ విధమైన ధ్యానం యింతకు ముందు కొంతకాలం నుండీ ప్రాక్టీస్ చేస్తున్నవాళ్ళెవరైనా వుంటే అదెంత అనర్థదాయకమో ఎన్ని పని గంటలు వాళ్లు వ్యర్థం చేశారో అటువంటి వాళ్ళకే నిజానికి మాటలు స్పష్టంగా అర్థమవుతాయి. . .ఆ ప్రక్రియ మీద వాళ్ళకున్న దురభిమానాన్ని వదులుకోగలిగితేనే సుమా!

( సశేషం )

Thursday, September 27, 2007

'లేదు' అనేది లేదు!

లేదనేది లేదు! (విజ్ఞానం)

మనం సాధారణంగా “లేదు” అంటుంటాం. అక్కడ ఆ రాయి లేదు. ఇక్కడ ఈ కుర్చీ లేదు. యిలా. . .

సూక్ష్మంగా పరిశీలిస్తే ఈ ‘లేదు’ అనేదానికి రూపులేదని అన్పిస్తుంది. ఈ ‘లేద’నేదానికి కూడా ‘అస్థిత్వం’ వుందనిపిస్తుంది. ఇది నిరూపణకు వస్తే సాధారణమైన విషయం కాదు. భావ, భౌతిక, హేతువాదులూ, ముఖ్యంగా నాస్తికులూ ‘ఉలిక్కి పడి’ తమ తమ సిద్ధాంత మూలాల్ని వెతుక్కోవలసిన విషయం! వాళ్ళనే యేముంది? అందరూ అచ్చెరువొందేదే!

ఇక పరిశీలిద్దాం!

‘లేదు’ అంటే?

లేకపోవడం. అంటే లేదు = సున్నా = 0.(ఈ జీరో అనేది తటస్థమైన విలువ).

మొదట అసలు ఉన్నది అంటే యేమిటో చూద్దాం.

ఈ ఉండడంలో రెండు రకాలు. మొదటిది (+) ధనాత్మకమైన ఉండటం. ఇది +1, +2 యిలా వుంటుంది. రెండవది (-) ఋణాత్మకమైన ఉండటం. ఇది -1, -2 యిలా వుంటుంది.

ఉదాహరణకి విద్యుత్తుని తీసుకుందాం. అందులో ప్లస్(ధన విద్యుదాత్మకత కలది), మైనస్(ఋణ విద్యుదాత్మకత కలది) అనే రెండు విరుద్ధ శక్తులుంటాయి. అలాగే అన్నింటిలోనూ ‘ఆస్థి’ ప్లస్ అనుకుంటే ‘అప్పు’ మైనస్.

అంటే ఈ (+), (-) అనేవి రెండూ పూర్తిగా పరస్పర విరుద్ధమైన శక్తులన్న మాట.

మరి తటస్థమైనదైన ఈ (0) లేదు అంటే ఏమిటి?

రెండు ఉన్న శక్తులు, పరస్పర విరుద్ధమైనవి, సమపాళ్ళలో కలవడమే ఈ (0) లేదు. అంటే ఒక +1, -1 కలవడమే (0) అంటే సున్నా. లేదు. అంటే రెండు విరుద్ధ శక్తులు సమపాళ్ళలో కలిసివున్నదాన్ని మనం ‘లేదు’ అనే పేరుతో వ్యవహరిస్తున్నాం. కనుక లేదనేది లేదు.

ఉదాహరణకు అణువులో ‘ప్రోటాన్’ ధనాత్మకతని, ‘ఎలక్ట్రాన్’ ఋణాత్మకతనీ, ‘న్యూట్రాన్’ తటస్థ స్థితినీ కలిగి వుంటాయి. మరి తటస్థమైన ఈ న్యూట్రాన్ ఉన్నదే అయింది కదా. అలాగే రంగుల్లో కూడా తెలుపురంగు అన్ని రంగులూ సమ పాళ్ళలో కలిసి ఏర్పడిందైతే, నలుపు ఏ రంగూ లేకపోవడం. ఏ రంగూ లేని నలుపురంగు లేనిదే అయితే అది మనకెలా లభిస్తున్నది? కనుక అది ఉన్నదే అయింది.

అలాగే కాలాల్లో కూడా గతం (+) అనుకుంటే భవిష్యత్తు (-) వర్తమానం తటస్థంగా ‘లేని స్ధితి’గా అన్పిస్తూ, అసలు సిసలైన ఉన్నది అదే అయికూర్చుంది.

కనుక సృష్టిలో లేదు అనేది లేదు.

బహుశా ఈ విధమైన అలోచనా విధానంతోనే భారతీయులు (0) ‘సున్నా’ కనిపెట్టివుంటారని భావిస్తాను. ‘సున్నా’ అనేది భారతీయ గణిత విశేయమని మనందరికీ తెలిసిందే కదా!

ఏమంటారు?

మేధావులూ, శాస్త్రవేత్తలూ, వైజ్ఞానికులూ, యింకా యేదైనా జఠిల తాత్విక సమస్యతో బాధపడుతున్న తత్వవేత్తలూ ఈ నా భావన మీలో ఎవరికైనా ఉపకరిస్తుందేమో చూడండి.

ఇంతకీ నేను చెప్పొచ్చేదేమిటంటే, ఈ లేకపోయడమనేది సాపేక్ష విలువ. మొదట్లో మనం అనుకున్నట్టు. . . అక్కడ ఆ ‘రాయి’ లేదు అంటే అది మరో చోటికి మార్చబడిందన్నమాట. అంటే మరోచోట వున్నదేనన్నమాట.

కనుక, సృష్టిలో లేదనేది లేదు. లేదు అనబడేది కూడా ఒకానొక ఉన్నటువంటి తటస్థమైన అస్తిత్వస్ధితి!!!

Saturday, September 22, 2007

మహాపరాధి!..5

(‘విపుల’ సచిత్ర మాస పత్రిక కథల పోటీలో రూ. 1500 లు బహుమతి పొందిన నా మొట్ట మొదటి కథ! ‘విపుల’ 1996 మార్చి నెల సంచికలో ప్రచురించబడింది. ‘వేదగిరి రాంబాబు గారు’ వెలువరించిన 1996 తెలుగు కథల సమీక్షా గ్రంథంలో ఒక అజ్ఞాత వ్యాసకర్త ‘మంచి కథలు రాయగలిగిన శక్తి గల్గిన పదశిల్పి ఈ రచయిత’ అంటూ నన్ను ప్రస్తుతించినారు. ఆనాడు ఈ కథ మీద వెల్లువెత్తిన సమీక్షలెన్నో, పలుకరించి, పరామర్శించిన వ్యక్తులెటువంటివారో ఈ కథ ముగింపులో వివరిస్తాను. ఈ తరం పాఠకులకి కథ మొదట్లో కొంత యిబ్బందికరంగా అన్పించినా చివర్లో ఒక అద్భుతమైన సన్నివేశంతో పాఠకుల మనసుల్ని కలచివేసి ఒక ఆత్మిక విలువని అందజేస్తుందని విన్నవించుకుంటున్నాను. కనుక ఈ బ్లాగు సందర్శించే ప్రతి ఒక్కరినీ పేరు పేరునా దయవుంచి ఈ కథను చదివితీరమని ప్రార్థిస్తున్నాను!)

మహాపరాధి!

మోయలేని భయానక సత్యం అతడి శ్వాస, జ్ఞాన, నాడీ మండలాల్ని ఒక్క వేటుతో విధ్వంసం చేసింది!

జీర్ణంచుకోలేని కఠోర వాస్తవం అతడిలోని సమస్త విద్వత్తునూ అతలాకుతలం చేసింది.

“నేను, నేను, నేను, నేనం”టూ ఒళ్ళు మరిచి, కదంతొక్కి సర్వంలోకి, సమస్త విశ్వంలోకి విస్తరించుకుపోయిన అహం “నేలేన”ని ఎరిగి విశ్వకేంద్రంలో పడి నలిగి నలిగి, రగిలి, రగిలి పొగిలి పొగిలి ఏడ్చింది.

“ఎవరు? ఏమిటి? ఎక్కడ?” అంటూ వెర్రెత్తి విర్రవీగిన ప్రశ్న, ‘నేనెవరో’నన్న న్యూట్రాలిటీని జీర్ణించుకోలేక ఉరివేసుకు చచ్చింది. అది నిజం కాదు. కనీసం స్వప్నం కూడా కాకూడదు. స్వప్నంలో స్వప్నమూ అవరాదు.

ధ్వైతమెక్కడ? అధ్వైతమెక్కడ??

బైరాగులెక్కడ? బికారులెక్కడ? అసలు వాటిని విడదీసిన దరిద్రమానవుడెక్కడ?

నారాయణాచార్యుల శరీరం చెమటతో తడిసిపోయింది. నిరుద్యోగులు, సన్యాసులు, వ్యభిచారులు, యాచకులు వీళ్ళంతా బికారులు.

తను హిమాలయాలు వెళ్ళి సాధించిన బికారీతనం, వదినగారు ఇక్కడ నుండే సాధించినారు. ఎవరు గొప్పవారు?

నారాయణాచార్యులు దిగ్గున లేచాడు. వేగంగా అక్కడనుండి కదిలాడు. తలుపు తీసుకుని బయటికి వస్తున్నప్పుడు లోపల్నుండి నవ్వులు వినిపించాయి. పట్టించుకోలేదు. తనెవరో వాళ్లకి తెలీకూడదు. తెలిస్తే ఆ అమాయకులు ఆ నిజం ధాటిని తట్టుకోలేక పోవచ్చు. తమ దురదృష్టాన్ని తలుచుకుని ఆత్మహత్యతో మరణించినా మరణించవచ్చు. తనలా వారికి యోగం తెలీదు. ఆలోచించకుండా ఉండడం ఎలాగో తెలీదు.

వేగంగా నడిచిపోతున్నాడు. ఎక్కడికో తెలీదు. గమ్యంలేని ప్రయాణం!

ఎక్కడిదిది? వేదార్థం వారి వంశవృక్షం?

నాట్యకళావల్లభులు, సాహితీ విశారదులు, సంగీత విద్వాంసులు, శిల్పకళా చతురులు, చిత్రలేఖనా దురంధరులు, సారస్వత విదుషీమణులు, పరమ పరమేశ్వరునకే ఋక్కులు వల్లించిన వంశీకులు. . . చివరకి ప్రాస్టిట్యూటులు, డాఫర్లు, బికారులు!

వంశ చక్ర సంపూర్ణతా? అధోగతా? రెండూ నిజమే! ఏ ఒక్కదాన్నీ విడదీయడానికి వీల్లేదు.

ఏమిది ఈశ్వరా? నాకా ఈ విషపాత్ర?. ఈ అనుభవం? ధారావాహిక ధ్వానభక్తుడికి ఎంతటి బృహత్తర బహుమానం!

‘గుండెల మీద ఆడిన పసిపాపలు గుండెలు చూపి ప్రేరేపించడం.’ సమస్త విశ్వాన్ని మాతృమూర్తిగా తలపోసిన అస్కలిత బ్రహ్మచారికిది నీవిచ్చిన అధ్వైత అనుభవమా? అహంకార భంగమా?

ఎక్కడి భీభత్స దర్శనమోయీ యిది?

ఇక చాలు ప్రభూ! ఇక చాలు! ఈ వడలిన శరీరానికిది చాలు. సందేహం వీడింది. అంతిమ జ్ఞాన తృప్తి లభించింది. దర్శన భాగ్యమయింది. ఆత్మసాక్షాత్కరించింది. విశ్వరూప సందర్శనమయింది!

నిలబడిపోయాడు.

ఎదురుగా రావిచెట్టు! వెళ్ళి చెట్టుకింద కూర్చున్నాడు. శరీరంలో వణుకు ప్రారంభమై చాలా సేపయింది. దాహంతో నాలిక పీక్కుపోతోంది. మృత్యువు ఆసన్నమయింది. దాని గురించిన భయం లేదు. చావును జయించడంకోసం ప్రయత్నించిన వాడు దాని కోసం చావడానికైనా సిద్ధపడాలి. తప్పదు!

అలాగే వెనక్కివాలి కటిక నేల మీద పడుకున్నాడు. కాళ్లు బార్లా చాపాడు. కళ్లు మూసుకున్నాడు. శరీరం పట్టుదప్పింది. రక్తప్రసరణ తగ్గిపోతోంది కాబోలు. కాళ్ళూ, చేతులూ వశం తప్పాయి. తనని మృత్యువు కబళిస్తోంది. పిచ్చి మృత్యువు! ఎలా కబళించగలదు తనని? తను ‘కమిట్’ కావాలి. అప్పుడుగానీ అది కబళించలేదు. ఈ వెర్రిమనుషులకి తెలీక మృత్యువు తమని పట్టిందని తామే మృత్యువుకి రాజీ పడతారు!

మనసుని యోగనిద్రలోకి తీసుకెళ్ళాడు. “ఓం తత్వమసి!”

ఇప్పుడు బాల్యం లేదు. ఆశ్రమం లేదు. చతుర్వేది లేడు. జ్ఞానకౌముదీ లేడు. అన్నగారు లేరు, వారి పిల్లలూ లేరు, బైరాగి లేడు, బికారి లేడు. అసలేమీ లేదు.

ఇంకొద్ది క్షణాల్లో తన చైతన్యం విశ్వచైతన్యంలోనూ, తన దేహం విశ్వదేహంలోనూ కలిసిపోతాయి. ఆఖరుసారిగా శ్వాస పీల్చాడు.

“ఓం తత్వమసి!”

ఆయన తల వాలిపోయింది.

ఆ వైపున ఒక కోయిల రమ్యంగా కూసింది. ఒక వాయు పవనం చల్లగా వీచింది. అక్కడెక్కడో ఒక వర్షపు చినుకు మురిసిపోతూ ముత్యం చిప్పలోకి జారింది.

ప్రాచ్య, పాశ్చాత్య గ్రంధాల చేత ప్రభావితుడై, తను దైవాంశ సంభూతుడనని విర్రవీగి దైవానికి దాస్యం ఒప్పకున్న ఆ వృద్ధుడు తాను విశ్వసించిన దైవ దర్శనమనే యిన్సిడెంటుని తన జీవితంలో ఎదురైన ఒకానొక అనుభవానికి అన్వయించుకుని తృప్తిని సాధించడమనే ‘లిమిటేషన్’ తో పరమపదించినాడు.

( సమాప్తం )

Friday, September 21, 2007

మహాపరాధి!..4

(‘విపుల’ సచిత్ర మాస పత్రిక కథల పోటీలో రూ. 1500 లు బహుమతి పొందిన నా మొట్ట మొదటి కథ! ‘విపుల’ 1996 మార్చి నెల సంచికలో ప్రచురించబడింది. ‘వేదగిరి రాంబాబు గారు’ వెలువరించిన 1996 తెలుగు కథల సమీక్షా గ్రంథంలో ఒక అజ్ఞాత వ్యాసకర్త ‘మంచి కథలు రాయగలిగిన శక్తి గల్గిన పదశిల్పి ఈ రచయిత’ అంటూ నన్ను ప్రస్తుతించినారు. ఆనాడు ఈ కథ మీద వెల్లువెత్తిన సమీక్షలెన్నో, పలుకరించి, పరామర్శించిన వ్యక్తులెటువంటివారో ఈ కథ ముగింపులో వివరిస్తాను. ఈ తరం పాఠకులకి కథ మొదట్లో కొంత యిబ్బందికరంగా అన్పించినా చివర్లో ఒక అద్భుతమైన సన్నివేశంతో పాఠకుల మనసుల్ని కలచివేసి ఒక ఆత్మిక విలువని అందజేస్తుందని విన్నవించుకుంటున్నాను. కనుక ఈ బ్లాగు సందర్శించే ప్రతి ఒక్కరినీ పేరు పేరునా దయవుంచి ఈ కథను చదివితీరమని ప్రార్థిస్తున్నాను!)

మహాపరాధి!

నారాయణాచార్యులు ఊరి లోపలికి ప్రవేశించాడు. తన యిల్లెక్కడో గుర్తుపట్టడం కష్టంగా వుంది. శ్రమను మరిచిపోయిన అరికాళ్లు మంటపుడుతున్నాయి. మెల్లగా వీధిని పోల్చుకున్నాడు. ఇల్లే తెలీడం లేదు. అటు వేపుగా వెళ్తున్న ఒక ముసలివాడిని పిలిచి, “వేదార్థం శ్రీ రంగవల్లికాదేవిగారి యిల్లు చూపించగలరా?” అని అడిగాడు.

ఆ ముసలివాడు ఆయన అవతారాన్ని పైనుండి కిందిదాకా తేరిపారజూసి, “రాండి!” అంటూ ముందుకు దారితీశాడు. ‘రాండి’ ఎంతకాలం తర్వాత తన మాండలిక భాష వింటున్నాడు. ‘చెవుల్లో పాయసం పోసినట్టు’ అనుభూతి కలిగింది.

ముసలివాడు ఒక యింటిముందు ఆగి, “యిదే యిల్లు.” నిర్యక్ష్యంగా చెప్పి వెళ్ళిపోయాడు. చీకటిపడుతోంది.

ఇంటివేపు చూశాడు. ఆస్ బెస్టాస్ సిమెంటు రేకులు పరిచిన డాబా యిల్లు! అది తన యిల్లు కాదు. బహుశా వదినగారు స్వంత యిల్లు అమ్ముకుని దీన్ని బేరం చేసి వుంటారు. ఆమెగారు ఆర్థికంగా ఆభివృద్ధి సాధించినట్టులేరు. తలుపు దగ్గరకి వెళ్ళి తట్టబోయాడు. అది తెరిచే వుంది. లోపలికి ప్రవేశించాడు. వరండాలో ఎవరూ లేరు. లైట్ వెలుగుతోంది. చుట్టూ చూశాడు. ఒక కుర్చీ వుంది. పాతది. మౌనంగా వెళ్ళి అందులో కూర్చున్నాడు. ఆలా కూర్చుంటున్నప్పుడు కుర్చీ కదిలి, కొద్దిగా అలికిడైంది.

“ఎవరు? ఎవరది?” అలికిడి కావడంతో ఓ స్త్రీ కంఠం లోపల్నుంచి అరిచింది. ఆ కంఠం వదినగారిదేనా? పోల్చుకోలేక పోతున్నాడు. ఎవరని చెప్పాలి తను? మౌనంగా వుండిపోయాడు.

కొద్దిసేపు తర్వాత ఆవిడ రానే వచ్చింది. వచ్చి గుమ్మం దగ్గర నిలబడింది.

ఒక్కసారి ఆమెను సంపూర్ణంగా పరికించి చూశాడు నారాయణాచార్యులు. అరవై అయిదేళ్ళ వృద్దురాలు. నడుము వంగింది. శరీరం కృంగింది. చర్మం ముడుతలు పడింది. వయసు పండింది. ఆ వృద్దురాలు వదినగారే! సందేహం లేదు. కానీ, ఆమెగారి కళ్ళలో మునుపటి వైభవ చిహ్నాలేమీ లేవు. శరీరంలో ‘దర్పం’ కూడా లేదు.

ఆ వృద్దురాలు నారాయణాచార్యుల్ని కళ్ళజోడులోంచి పరిశీలనగా చూస్తూ, స్వామిగార్లా? అంది. క్షణం పాటు ఆమె ముఖంలో చిరునవ్వు కదిలి మాయమయింది.

నారాయణాచార్యులు ఆమె తనను గుర్తిస్తుందేమో ననుకున్నాడు. లేదు. గుర్తించినట్టు లేదు. “స్వామిగార్లు కాదు. నేను. . .నేను . . .నారాయణాచార్యుల్ని. . .మీ మరిది గారిని” చెప్పబోయాడు. ఉద్వేగం ఎక్కువైపోయింది. కంఠం పెగలడం లేదు. ఇరవై ఎనిమిది భాషలు అనర్గళంగా మాటలాడిన కంఠం. ఉద్దండ పండితుల్ని తర్కంతో మట్టికరిపించిన కంఠం మూగవోయింది. మూగబోయి ఒక్కమాటా పలుకలేకపోయింది.

“ఒసే! ప్రమీలా, నాగవల్లీ, రండే! మీకోసం స్వామిగార్లొచ్చారు.” రంగవల్లికాదేవి కేకేసింది.

నారాయణాచార్యులు చెప్పడానికి ప్రయత్నిస్తూనే వున్నాడు. లాభం లేదు. ఉద్వేగం ఆగడం లేదు.

ఎవరో లోపల్నుండి వస్తున్నట్టు కాలి అందెల చప్పుడు.

ముగ్గురు అమ్మాయిలు!

వాకిలి దాటుకుని బయటకి వచ్చి గోడ దగ్గర వరుసగా నిల్చున్నారు. అంతా వయసు నలభైయేళ్ళకు కొద్ది అటు యిటుగా వున్నవారే.

నారాయణాచార్యుల మనసుకి ఏదో కృత్రిమత్వం తోచింది. వాళ్ళ కట్టు, బొట్టు, వ్యవహారం అంతా వింతగా వుంది. వాళ్ళు తన అన్నగారి బిడ్డలా? అయితే వాళ్ళెందుకలా వున్నారు?

అన్నీ ప్రశ్మలే! సమాధానం లేదు! అడగాలని వుంది కంఠం సహకరించడం లేదు. కొంత సమయం తర్వాతగానీ ఈ ఉద్వేగం తగ్గి తను మామూలు మనిషి కాలేడు. ఎందుకో మనసు కీడును శంకిస్తోంది

ఇంతలో, “వీళ్ళలో మీకెవరు కావాలి స్వామీ?” పెదాల్ని పగలగొట్టుకుని బయటికి వస్తున్న నవ్వును బలవంతంగా ఆపుకుంటూ అడిగింది శ్రీరంగవల్లికాదేవి.

ఆ ఆచార్యుడికేమీ అర్థం కావడంలేదు. ఎవరు కావాలేమిటి? అయోమయంగా ఆ అమ్మాయిల వైపు చూశాడు. ఎదురుగా నిల్చునున్న ఆ ముగ్గురిలో ఒక అమ్మాయి వీపు గోడకి ఆన్చి వయ్యారంగా నిల్చుని కాలు వూపుతూ నవ్వుతోంది. మరొక అమ్మాయి నవ్వుతూనే ఎంతో నైపుణ్యంగా పైట కిందికి జార్చి వక్షస్థలం చూపుతోంది. ఇంకో అమ్మాయి ఆయన అవతారం పరిశీలిస్తూనే కన్నుగీటింది.

అతడు మూర్ఖుడు కాడు! అర్థమైపోయింది. వ్యభిచారం. . ! వదిన గారు శ్రీ వేదార్ధం శ్రీరంగవల్లికాదేవిగారు చేస్తున్నది వ్యభిచారం. . .పడుపువృత్తి. . . సానితనం. . .ప్రాస్టిట్యూషన్!!!

(సశేషం)

Thursday, September 20, 2007

మహాపరాధి!..3

(‘విపుల’ సచిత్ర మాస పత్రిక కథల పోటీలో రూ. 1500 లు బహుమతి పొందిన నా మొట్ట మొదటి కథ! ‘విపుల’ 1996 మార్చి నెల సంచికలో ప్రచురించబడింది. ‘వేదగిరి రాంబాబు గారు’ వెలువరించిన 1996 తెలుగు కథల సమీక్షా గ్రంథంలో ఒక అజ్ఞాత వ్యాసకర్త ‘మంచి కథలు రాయగలిగిన శక్తి గల్గిన పదశిల్పి ఈ రచయిత’ అంటూ నన్ను ప్రస్తుతించినారు. ఆనాడు ఈ కథ మీద వెల్లువెత్తిన సమీక్షలెన్నో, పలుకరించి, పరామర్శించిన వ్యక్తులెటువంటివారో ఈ కథ ముగింపులో వివరిస్తాను. ఈ తరం పాఠకులకి కథ మొదట్లో కొంత యిబ్బందికరంగా అన్పించినా చివర్లో ఒక అద్భుతమైన సన్నివేశంతో పాఠకుల మనసుల్ని కలచివేసి ఒక ఆత్మిక విలువని అందజేస్తుందని విన్నవించుకుంటున్నాను. కనుక ఈ బ్లాగు సందర్శించే ప్రతి ఒక్కరినీ పేరు పేరునా దయవుంచి ఈ కథను చదివితీరమని ప్రార్థిస్తున్నాను!)

మహాపరాధి!

“నా పేరు వేదార్థం నారాయణాచార్యులు! ప్రస్తుతం సైన్సులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని డాక్టరేట్ చేస్తున్నాను. మాది విశాలపురం. మా తండ్రిగారు స్వర్గీయ వేదార్ధం హనుమాచార్యులుగారు. మా అన్నగారు స్వర్గీయ అనంతాచార్యులు గారు. వదినగారు శ్రీరంగవల్లికా దేవిగారు. ఆమెకు ముగ్గురు ఆడపిల్లలు. ఈ మధ్యనే అన్నగారు ఓ అగ్నిప్రమాదంలో మరణించినారు. మాది ఆర్థికంగా బాగా చితికిపోయిన కుటుంబం. వదినగారు వారి పిల్లల బాధ్యత నాపైన పడింది. నాకు చిన్ననాటి నుండి తాత్విక చింతన ఎక్కువ. ఎల్లప్పుడూ వేదాంతపుటాలోచలతో సతమతమయ్యే వాడిని. ఆ జిజ్ఞాసతోనే వేదాలు, ఉపనిషత్తులు, అరణ్యకాలు, దర్శనాలు, ఇతిహాసాలు, భగవద్గీత మొదలైనవన్నీ పఠించాను. అన్నింటిలోనూ నాకు యిష్టమయింది భగవద్గీత. నాకు ఈ లౌకిక ప్రపంచం మీద వైరాగ్యభావనలు కలుగుతున్నాయి. అది వైరాగ్యభావనో, వదినగారు, వారి పిల్లల బాధ్యత గురించిన భయమో నేను యిదమిద్ధంగా తేల్చి చెప్పలేను. ఏది ఏమైనప్పటికీ సర్వాన్నీ త్యజించి, బంధాలన్నింటినీ దూరం చేసుకుని, ఆశ్రమవాసం చేయడానికి నేను అంగీకరిస్తున్నాను.”

చదవడం చాలించి, చతుర్వేది బోడిగుండు తడుముకుని, “అది అప్పటి లేఖ. ప్రస్తుత నిష్క్రమణ పత్రం చూడండి!” అన్నాడు.

“హైందవ ప్రచారక పరిషత్తు ఉపాధ్యక్షుడినైన వేదార్ధం నారాయణాచార్యులు అనబడే నేను ప్రస్తుతం ఈ ఆశ్రమం నుండి నిష్క్రమించదలచుకున్నాను. కేవలం గృహస్థాశ్రమం మీద మనసు లగ్నం కావడం దీనికి హేతువు. ఆశ్రమవాసులెవరూ యిందుకు బాధ్యులు కారు.”

“అది సారాంశం!” అన్నాడు చతుర్యేది. ఆ సారాంశం అన్న పదంలో పెర్వర్షన్ శాతం ఎంతుందో నారాయణాచార్యులుకి అర్థం కాలేదు.

“తమకి ఈ వృద్దాప్యంలో గృహస్థాశ్రమం మీద మనసు లగ్నమయిందా ఆచార్యా?” నారాయణాచాల్యుల్ని అడిగాడు. చతుర్యేది.

వెటకారం మొదలైంది.

“ఔను!” ముభావంగా చెప్పాడు నారాయణాచార్యులు. ‘ఈవిల్’ ని భరించడానికి తను ఎప్పుడో సిద్ధమయ్యేడు.

“తమరు గృహస్థాశ్రమం స్వీకరించిన తర్వాత వివాహం చేసుకో నిశ్చయించుకున్నారా? చతుర్వేది ప్రశ్న. ‘డిసానర్’ ఆయన మాటల్లో ఎప్పుడూ కన్పించే లక్షణం!

“లేదు” అన్నాడు నారాయణాచార్యులు

“మరి ఏమి చేయబోతున్నారు?” ఏమి అన్న పదాన్ని వత్తి పలుకుతూ అన్నాడు చదుర్వేది.

“తెలీదు.”

“వదినగారి బాధ్యత తీసుకుంటారా?” ఈసారి బాధ్యత మీద పడింది భారం. చతుర్వేది సొల్యూషన్స్ చాలా భయంకరంగా వుంటాయి. ‘నోబిలిటీ’ అన్నదాన్ని ఆదర్శంలో సైతం చంపుకున్న వ్యక్తి. మాట్లాడుతున్నది ఉపాధ్యక్షులతోనన్న సెన్సు కూడా వుండదు.

ఇక నారాయణాచార్యులు జాప్యం చేయదలచుకోలేదు. ఇంకా ఆలస్యం చేస్తే చతుర్వేది తీసుకోబోయే ఛార్జ్ కి ‘క్వాలిటీ ఆఫ్ మెర్సీ’ మరీ సన్నగిలిపోయి విషయం నవ్వుల పాలవుతుంది. అందుకే అన్నాడు.

“ఆశ్రమం నుండి వెళ్ళిపోయిన తర్వాత నా జీవితం గురించిన జిజ్ఞాస కనబరచడం అధిష్టాన వర్గానికి భావ్యంకాదు. ఆశ్రమ నియమాలకు యిది విరుద్ధం!”

చతుర్వేదుల వారి పని అయిపోయింది. నియమాల పేరుతో కట్టె విరక్కుండానే పాము చచ్చింది. అందుకే ఉపసంహారంగా నిర్ణయపత్రం చేతిలోకి తీసుకున్నాడు. భృకుటి ముడివేసి, గంభీరంగా దాన్ని చదువసాగాడు.

“ఉపాధ్యక్షులు శ్రీశ్రీశ్రీ వేదార్ధం నారాయణాచార్యులవారి అభ్యర్థన అంగీకరించబడినది. ఈయన యిన్నేళ్ల ఆశ్రమ జీవితం గడిపిన తర్వాత కూడా ఐహిక సుఖాల్ని వదిలిపెట్టలేకపోయిన ఆచార్యుడిగా అధిష్టానవర్గం పరిగణించింది. ఆయనను అర్థం చేసుకుని గృహస్థాశ్రమానికి పరిషత్తు వీలు కల్పిస్తుంది. ఇప్పటినుండి ఆయన ఏ క్షణంలోనయినా ఆశ్రమవాసం వదులుకుని నిష్క్రమించవచ్చు. మళ్ళీ ఆయన ఏ క్షణంలోనయినా ఆశ్రమ ప్రవేశం చేయ నిర్ణయించుకుంటే అందుకు కూడా పరిషత్తు వీలు కల్పిస్తుంది.”

చతుర్వేది లేచాడు.

నారాయణాచార్యులు ఆశ్రమానికి చేసిన సేవలకి గుర్తింపుగా ‘ఆయన సంరక్షణార్థం’ ఆశ్రమ ఖాతాలోంచి ఇరవై లక్షల రూపాయల నగదు బ్యాంక్ చెక్ రూపంలో యివ్వబడింది. ఆశ్రమం వదిలిపెట్టిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆయన ఆశ్రమం పేరు వినియోగించుకుని డబ్బు సంపాదించకూడదన్న షరతు విధిగా విధించబడింది. ఆయన నిష్క్రమణం గురించి బి.బి.సీ. టీవీకీ యితర మతసంస్థలకూ తెలియపరచబడింది. ఆయన ఆధ్యాత్మిక జీవితం గురించి ఆయన పేరుతో ఒక పుస్తకం ‘మోనోగ్రాఫ్’ విడుదల చేయబడింది. ఆ సంవత్సరం పరిషత్తు ‘యియర్ బుక్’ మీద ఆయన ముఖచిత్రం ప్రచురించాల్సిందిగా నిర్ణయించడం జరిగింది. నారాయణాచార్యులు ధర్మశాల నుండి ఢిల్లీ వరకూ కారులో వెళ్ళేట్టుగానూ, అక్కడినుండి హైదరాబాద్ వరకూ ఫ్లయిట్ లో కమర్షియల్ కేటగిరీలోనూ, హైదరాబాదు నుండి విశాలపురం వరకూ తిరిగి కారులో ప్రయాణం చేసేట్టుగానూ ఏర్పాట్లకు ఆదేశాలు జారీ చేయబడ్డాయి. అంతా సిద్ధమయింది!

తన కృషికి ఆశ్రమం యిచ్చిన పారితోషికం ఇరవై లక్షలు. నారాయణాచార్యులు నవ్వుకున్నాడు. రెవెన్యూ ఆఫీసులో ఒక హెడ్ గుమాస్తా రిటైర్ మెంట్ నాటికి సంపాదించినంత. అసలు డబ్బు అవసరం వుందో లేదో కూడా ఆయనకి తెలీదు. వద్దని వారించాలనుకున్నాడు. కానీ అది తన ఆత్మన్యూనతాభావాన్ని, ఆశ్రమం పట్ల తన అగౌరవాన్ని కనబరిచే చర్యగా భావించి మానుకున్నాడు.
* * * *
కారు విశాలపురం సమీపిస్తున్నకొద్దీ నారాయణాచార్యుల మనసు సంఘర్షించసాగింది. ‘ఆశ్రమం వదిలి వస్తున్నప్పుడు శ్రీ జ్ఞానకౌముదీ స్వామి తనకి వీడ్కోలు చెప్పడానికి రాలేదు. బహుశా చింతాక్రాంతులై వున్నారు కాబోలు! ఆనాడు తను వదినగారికి తెలీకుండా యిల్లు వదలి ఆశ్రమంలో చేరినప్పడు ఆమెగారు కూడా ఈ స్వామీజీలాగే బాధపడినారు కాబోలు!’

కారు డ్రైవర్ ఏకాగ్రతతో డ్రైవింగ్ చేసుకుంటూ వెళుతున్నాడు.

‘వదినగారు శ్రీరంగవల్లికాదేవిగారు ఎలా వున్నారో? ముగ్గురు పిల్లల్నీ ఎట్లా పోషించారో? ఆమెగారికి కూచిపూడి నృత్యంలోనూ, హరికథల్లోనూ మంచి ప్రవేశం వుంది. భరతనాట్యం కూడా కొంత తెలుసు. బహుశా ఏ శిక్షణ సంస్థో నడిపి దాని ద్వారా వచ్చిన పైకంతో జీవించివుంటారు. తను యింతకాలం ఆశ్రమంలో ఉన్నత పదవిలో వున్న విషయం కూడా వదినగారికి తెలీనట్టుంది. తెలిసుంటే తనను కలుసుకునే ప్రయత్నం చేసి వుండేవారు.

ముఫ్పై ఆరేళ్ళ సుదీర్ధకాలం తర్వాత తన రాకను ఆమెగారు ఎట్లా ‘రిసీవ్’ చేసుకుంటారో? సంతోషించగలరా? ఆవేదన చెందుతారా? పిల్లలు పినతండ్రి వచ్చారని పండుగలు చేసుకుంటారు కాబోలు! వారందరికీ వివాహాలు అయిపోయి వుంటాయి. వారు వాళ్ళ పిల్లలకు తనని చూపించి తాతగారు అని పరిచయం చేస్తారు కాబోలు. ఆశ్రమంలో తన పదవిని గురించి విని విభ్రమం చెందుతారు!

నారాయణాచార్యులు తన ఆలోచనలకి తనే నవ్వుకున్నాడు. “మనిషి తన పరంపరాగత స్వభావాన్ని మార్చుకోలేడ”న్న జీన్ పాల్ సార్త్రే మాటలు గుర్చొచ్చాయి! నిజమేననిపించింది. కాకపోతే యోగం చేసిన తనేమిటి? సామాన్యునిలా సంఘర్షంచడమేమిటి?

కారు విశాలపురం చేరేటప్పటికి సాయంత్రం ఆరున్నరయింది! ఊరి పొలిమేర దగ్గరే కారును ఆపి, తను దిగి, డ్రైవర్న్ ని వెనక్కి వెళ్ళిపొమ్మని ఆదేశించాడు. కారు వెళ్ళిపోయింది. ఆయన అక్కడినుండి వూరిలోకి నడక ప్రారంభించాడు. చేతిలోనున్న బ్రీఫ్ కేస్ల్ లో బ్యాంక్ చెక్ వుంది. అప్పటికే వూర్లో దీపాలు వెలిగించారు.

ఊరు పూర్తిగా మారిపోయింది. నాగరికత చెందింది. చెరువుగట్టూ, పంటపొలాలూ, పిల్లకాలవా, గోధూళి, ఎడ్లబండ్లూ లేగదూడలూ, పోలిగాడూ, సుబ్బీ యివేమీలేవు. వాటి స్థానంలో భవంతులూ, విశాలమైన రోడ్లూ, పార్కులూ, బస్ స్టాపులూ కొత్తగా వచ్చి చేరాయి!

( సశేషం )

Wednesday, September 19, 2007

మహాపరాధి!..2

(‘విపుల’ సచిత్ర మాస పత్రిక కథల పోటీలో రూ. 1500 లు బహుమతి పొందిన నా మొట్ట మొదటి కథ! ‘విపుల’ 1996 మార్చి నెల సంచికలో ప్రచురించబడింది. ‘వేదగిరి రాంబాబు గారు’ వెలువరించిన 1996 తెలుగు కథల సమీక్షా గ్రంథంలో ఒక అజ్ఞాత వ్యాసకర్త ‘మంచి కథలు రాయగలిగిన శక్తి గల్గిన పదశిల్పి ఈ రచయిత’ అంటూ నన్ను ప్రస్తుతించినారు. ఆనాడు ఈ కథ మీద వెల్లువెత్తిన సమీక్షలెన్నో, పలుకరించి, పరామర్శించిన వ్యక్తులెటువంటివారో ఈ కథ ముగింపులో వివరిస్తాను. ఈ తరం పాఠకులకి కథ మొదట్లో కొంత యిబ్బందికరంగా అన్పించినా చివర్లో ఒక అద్భుతమైన సన్నివేశంతో పాఠకుల మనసుల్ని కలచివేసి ఒక ఆత్మిక విలువని అందజేస్తుందని విన్నవించుకుంటున్నాను. కనుక ఈ బ్లాగు సందర్శించే ప్రతి ఒక్కరినీ పేరు పేరునా దయవుంచి ఈ కథను చదివితీరమని ప్రార్థిస్తున్నాను!)

మహాపరాధి!

జ్ఞాన కౌముది శ్రద్దగా వింటున్నాడు.

“ఇవిగాక రాజకీయ నాయకుల్లాగా ఒకర్ని ఒకరు కూలద్రోయడానికి ప్రయత్నాలు. ఒకరు అభివృద్ధిని పొందితే మరొకరికి ఈర్ష్య, అసూయ, ద్వేషం! ముప్ఫై ఆరేళ్ళ ఆశ్రమ అనుభవం నాది. నా ఇరవై ఐదవయేట ఈ ఆశ్రమంలో ప్రవేశించాను. మతాన్ని విస్తరించడం కోసం నేను తిరగని దేశం లేదు. బర్మా, థాయ్ లాండ్, కంబోడియా, ఇండోనేషియా, నేపాల్ ఎన్నని చెప్పమంటావు? ఇరవై మూడేళ్ళ సుదీర్ఘకాలంలో కేవలం ఒకటే పని! భగవద్గీతను ప్రచారం చేయడం! అంతటితో దానికి స్వస్తి చెప్పి పదమూడేళ్ళుగా భగవదాన్వేషణ చేస్తున్నాను.”చివరి మాటలు అంటున్నప్పుడు నారాయణాచార్యుల కళ్ళలో బాధ కనిపించింది. ఆయన నిగ్రహించుకున్నాడు.

జ్ఞాన కౌముది మంత్రదండం పక్కనపెట్టి ముందుకి వంగాడు. ఆయన ముఖంలో జిజ్ఞాస కనబడుతోంది.

ఎక్కడి ఈశ్వరుడు కౌముదీస్వామీ! ఆ పరమాత్ముని కోసం ఆయన పరమ దర్శనం కోసం నేను చేయని ప్రయత్నం ఏమున్నదని? “రామ, రామ రామం”టూ కళ్లుమూసి రాముని సాకారాన్ని హృదయంలో ప్రతిష్టించుకుని, ఆసనం వేసి, రాత్రి ధ్యానించడం మొదలుపెడితే, తెల్లగా తెల్లవారిపోయి భావతీవ్రత మిగిలేదేగానీ శ్రీరాముడేడి? పోనీ ‘అది పొరపాటేమోన’ని నిరాకార సాధన చేయదలిస్తే నిద్ర ముంచుకొచ్చేదేగానీ నిరాకారుడికి తావెక్కడ? నేనెవరు? నేననుకుంటున్న నాలోని ఈ నేనుకాని నేను ఎవరు? నేను నేనేనా? ఎన్ని ప్రశ్నలు? ఎన్ని నిద్రలేని రాత్రులు? ఎన్ని ఉపవాసపు దినాలు? స్త్రీని, జిహ్వను జయించడానికి ఎన్ని అర్థంలేని ప్రయత్నాలు? జ్ఞానం కోసం ఎన్ని గ్రంధాలు? ఎంతటి కాలయాపన? అన్నీ నిరర్ధకాలయాయి! చివరకి ఏంగ్జయిటీ, డిప్రెషన్ లాంటి మనోరుగ్మతలు మిగిలాయి. దైవం నాకు లభించలేదు. ఆశ్రమ నియమాలు ఉల్లఘించి పాశ్చాత్య దర్శనాలు కూడా పఠించాను. ప్రయోజనం లేదు. ఒక్కొక్కసారి అసలు ఈశ్వరుడికి అస్థిత్వముందా అన్న సందేహం కూడా కలిగేది. అయితే ఆ విషయం బయటికి ప్రస్తావించడానికి వీల్లేదు. చెప్పడమంటూ జరిగితే శ్రీ పరీక్షిత చతుర్వేదివారు సాధన కొరవడింది. దైవాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావంటారు. నువ్వు విశ్వాసాన్ని పొదివి పట్టడం లేదు. తప్పు మార్గంలో పయనిస్తున్నావంటారు. బాగా అణచడానికి ప్రయత్నిస్తారు! నిన్నగాక మొన్న ఆశ్రమవాసం చేసిన పిల్లస్వాముల దగ్గర్నుండి చతుర్వేది గారి వరకూ తమ తమ దైవానుభవాల్ని గురించి చెపుతూంటే నాకు నవ్వొచ్చేది. అల్ప మనోవికారాల్ని సైతం వదులుకోలేని ఈ అమాయకులకి ఈశ్వర కటాక్షం లభించడమా? విశ్వసించలేను. ప్రతివాడూ అసత్య ప్రచారం చేసుకుంటున్నాడు. స్వంత అవసరాల కనుగుణంగా దైవాన్ని వినియోగించు కుంటున్నాడు. ఒకడ్ని ఒకడు మోసగించుకుంటున్నాడు. నాకివన్నీ అసహ్యాన్ని కలిగిస్తున్నాయి స్వామీజీ! అసహ్యాన్ని కలిగిస్తున్నాయి!” నారాయణాచార్యులు ఆగి, శ్వాస తీసుకున్నారు.

“పైగా చేసిందే చేయరా అన్నట్టు ఈ ధూప దీప నైవేద్యాలూ, ఈ ఆగరొత్తుల వాసన, ఈ ఆడంబరాల ఖరీదుతనం, ఈ భగవద్గీత, ఈ బ్రహ్మం, అద్వైతం, భవం, అలౌకికం లాంటి పదాలు నాకు రొటీన్ అయిపోయి జీవితం యాంత్రికంగా మారి దుర్భరమై పోయింది. అందుకే నేను ఆంధ్రదేశం వెళ్ళిపోవాలనుకున్నాను. ఆశ్రమ అధ్యక్షులవారికి నాకు అనుమతి యిప్పించమంటూ వినతిపత్రం సమర్పించాను. అయితే ఒక్క విషయం. . .” నారాయణచార్యులు ఆగి మళ్ళీ చెప్పాడు.

“శ్రీ వైకుంఠ జగన్నాథ త్రివేదీ వారి అన్వేషణ గురించీ, దైవానుభవం గురించీ నాకు అవగాహన లేదు కాబట్టి నేను వారి ఒక్కరి గురించి మాత్రం ప్రస్తావించడం లేదు.” ఆగి నారాయణాచార్యులు లేచాడు.

ఇప్పుడు చెప్పండి కౌముదీ స్వామీజీ? యిప్పుడు చెప్పండి! ఎవరు హిందువుడు? భార్యాబిడ్డల్ని పోషించలేక ఆశ్రమంలో చేరి, తిని బలిసినవాడా? తోటి మతస్థులను నిందించి వాళ్ళ విశ్వాసాల్ని కూలద్రోసేవాడా? బానపొట్టతో పిలకజుట్టు ముందుకేసుకుని విమానాల్లో మత ప్రచారం చేసేవాడా? తను రాసింది తనే చదువుకుని పరులు చెప్పింది చెవికెక్కించుకోనివాడా? ఎవరు హిందువుడు మహర్షీ? ఎవరు హిందువుడు? పవిత్ర మతాన్ని స్వప్రయోజనాల కోసం వాడుకునే వీళ్ళు. . .వీళ్ళా హిందువులు?” నారాయణాచార్యులు ఉద్వేగంతో ఊగిపోతూ చివరగా ఒకమాట అన్నాడు.

పనీపాటా చేయకుండా తిని తిరిగే వాళ్ళని బికారీజనంగా వర్గీకరించారు ఆధునికులు. ఇక మన విషయానికొస్తే, మనం చేసే అన్వేషణలో మనకే భగవంతుడు లభ్యం కాడు. ఇక మనం చెప్పగా విన్న పామర సామాన్యజనానికి అసలే లభించడు. ఈ మాట అన్ని మతాల వారికీ వర్తిస్తుంది. పోతే సాంఘిక ప్రయోజనం అంటారా? అదీ లేదు. ప్రపంచమంతా పాశ్చాత్య సంస్కృతికి హారతులు పడుతున్న నేపథ్యంలో మన మతమేగాదు ఏ మతమూ ప్రత్యేకంగా ఒనగూర్చే ప్రయోజనం ఏదీలేదు. . . మత సంఘర్షణలూ, మృత కళేబరాల రాసులూ తప్ప.”

నారాయణాచార్యులు జ్ఞాన కౌముది భుజాలు పట్టి ఊపుతూ అడిగాడు.

“ఇది చెప్పండి మహర్షీ? యిది చెప్పండి? మనం. . .మనం ఆశ్రమంలోని వారందరం ఆధునికులన్నట్టు బికారులం. పచ్చిబికారీ సన్యాసులమని నేనంటే మీరు కాదనగలరా జ్ఞానకౌముదీ? మీరు కాదనగలరా?”

తన భుజాలు పట్టి కుదిపివేస్తున్న ఆ ఆచార్యుడిని ఏమనగలడు జ్ఞానకౌముది? ఏదైనా అనడానికి ఆయన వయసు తనకి లేదు. అనుభవం లేదు. జ్ఞానం లేదు. నైతిక హక్కే లేదు. వీటన్నింటికంటే ప్రధానంగా అహం అసలే లేదు.

అందుకే మౌనం దాల్చాడు.
* * * *

ఆరోజు ఆశ్రమంలోని కాన్ఫరెన్స్ హాలు స్వామీజీలతో క్రిక్కిరిసింది.

అది ఆశ్రమ ఉపాధ్యాక్షులు శ్రీ వేదార్థం నారాయణాచార్యుల వారికి గృహస్థాశ్రమ అనుమతి యివ్వాలా? వద్దా? అన్న నిర్ణయం జరిగే రోజు! అదొక గడ్డు సమస్య! ఆశ్రమ అధ్యక్షులు శ్రీ వైకుంఠ జగన్నాథ త్రివేదీ వారు అర్జంటుగా లేని ప్రయాణం కల్పించుకుని ఫిలిప్పీన్స్ వెళ్ళిపోయి, ఆ సమస్య నుండి తప్పించుకున్నారు. ఆ పని వ్యవస్థాపకులకి అప్పగించబడింది. ఫిలిప్పీన్స్ వెళ్ళేప్పుడు అధ్యక్షులు ఒక్క మాట మాత్రం అన్నారట. “నేను ఆ మహాత్ముని నిష్క్రమణ పత్రం చూసి దిగ్భ్రాంతి చెందాను. ఆయన పోకడ నాకు తీరని విచారం కలుగజేస్తోంది. కానీ దైవ సంకల్పం ఆయన నిష్క్రమణాన్ని కోరుతోంది.” అని.

వేదిక మీద శ్రీ పరీక్షిత చతుర్వేది, శ్రీ విష్ణుదుబే, ఆచార్య ఇంద్రకరణ్ భట్, శ్రీ మహీపాల కుల్ కర్ణి, శ్రీ జితేంద్ర అవస్థి, ఆచార్య పండరీనాథ్, శ్రీ లక్ష్మణ్ అనంతాళ్, శ్రీ ముకుందా మిశ్రా, శ్రీ అవినాష్ తివారీ అందరూ ఆసీనులయారు. నారాయణాచార్యులు ఓ వైపుగా కూర్చున్నాడు. ఆయన హృదయం అన్నింటికీ సిద్ధమయ్యేవుంది.

చతుర్వేది ఒక్కసారి గొంతు సవరించుకున్నాడు. ఆయన ఉపన్యాసం మైక్ ల ద్వారా ఆశ్రమంలోని ప్రతి గదిలోపల విన్పించే ఏర్పాటు చేయబడింది. ఆయన ఇంగ్లీషులో ఉపన్యాసం ప్రారంభించాడు.

“శ్రీ హైందవ ప్రచారక పరిషత్తు ఆశ్రమ ఉపాధ్యక్షులు శ్రీశ్రీశ్రీ వేదార్ధం నారాయణాచార్యులవారు అనబడే ఈ హైందవ ఆచార్యులు ముప్ఫై ఆరేళ్ళ క్రితం పంతొమ్మిది వందలా యాభై ఎనిమిదిలో ఈ ఆశ్రమ ప్రవేశం చేశారు. అప్పటి అధ్యక్షులు శ్రీశ్రీశ్రీ పరశురామ చతుర్వేది వారు ఆయన వేద గీతా పాండిత్యాలకు మెచ్చి ఆశ్రమ ప్రవేశం కల్పించారు. ఈయన ఆంధ్రులు! ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరుజిల్లా విశాలపురం వాస్తవ్యులు. ఈయన ఆశ్రమానికి చేసిన సేవలు అపారమైనవి. పద్దెనిమిది భారతీయ భాషలలోనూ, పది విదేశీ భాషలలోనూ ఈయన ఉద్దండులు! ఈయన వివిధ భాషల్లో మత శాస్త్రం పైన ఏడు గ్రంధాలూ, తత్వ శాస్త్రం మీద నాలుగు గ్రంధాలూ రచించారు. భారతదేశంలోనేగాక విదేశాల్లో కూడా హిందూమతాన్ని వ్యాపింపజేయడానికి విశేషమైన కృషి సల్పారు. ఈయన ఆశ్రమ ప్రవేశం చేసేటప్పుడు అధ్యక్షులవారికి రాసిన లేఖలో రెండు ముక్కలు దైవాంశ సంభూతులుకు వినిపించడం మన సాంప్రదాయం!” ఆగి, చతుర్వేది పొట్ట తడుముకుంటూ బర్రున ముక్కు చీదాడు. ఆ తర్వాత లేఖ నందుకుని చదువసాగాడు.

( సశేషం )

Tuesday, September 18, 2007

మహాపరాధి!..1

(‘విపుల’ సచిత్ర మాస పత్రిక కథల పోటీలో రూ. 1500 లు బహుమతి పొందిన కథ! ‘విపుల’ 1996 మార్చి నెల సంచికలో ప్రచురించబడింది. ‘వేదగిరి రాంబాబు గారు’ వెలువరించిన 1996 తెలుగు కథల సమీక్షా గ్రంథంలో ఒక అజ్ఞాత వ్యాసకర్త ‘మంచి కథలు రాయగలిగిన శక్తి గలిగిన పదశిల్పి ఈ రచయిత’ అంటూ నన్ను ప్రస్తుతించినారు. ఆనాడు ఈ కథ మీద వెల్లువెత్తిన సమీక్షలెన్నో, పలుకరించి, పరామర్శించిన వ్యక్తులెటువంటివారో ఈ కథ ముగింపులో వివరిస్తాను. ఈ తరం పాఠకులకి కథ మొదట్లో కొంత యిబ్బందికరంగా అన్పించినా చివర్లో ఒక అద్భుతమైన సంఘటనతో పాఠకుల మనసుల్ని ద్రవింపజేసి ఒక ఆత్మిక విలువని అందజేస్తుందని విన్నవించుకుంటున్నాను. కనుక ఈ బ్లాగు సందర్శించే ప్రతి ఒక్కరినీ పేరు పేరునా దయచేసి ఈ కథను చదివితీరమని ప్రార్థిస్తున్నాను!)

మహాపరాధి!

ఓ తెల్లవారుఝాము!

అది హిమాచల్ ప్రదేశ్ లోనున్న ధర్మశాల! ప్రసిద్ధ పర్వత కేంద్రం!

అక్కడ చలచల్లని వాయు పవనాలమధ్యా, ‘పోలో’ పక్షుల కిలకిలారావాల మధ్యా, మంచు సెలయేరుల ముర్ముర సంగీతాల మధ్యా మహోజ్వల భారతీయ హైందవ సంస్కృతికి ఆలంబనగా నెలకొల్పబడిందొక ఆశ్రమం.

శ్రీ హైందవ ప్రచారక పరిషత్తు!

ముఫ్ఫై రెండు ఎకరాల విస్తీర్ణంలో అంతర్ణాతీయ ఖ్యాతి గడించిన ఆర్కిటెక్ట్ ల చేత వెదురు కర్రలతో, నీటి తుంగతో హిందూ దేవాలయాల్ని గుర్తుకుతెచ్చే విధంగా నిర్మించబడిన ఆ ఆశ్రమ వాతావరణం ఈశ్వరుడికే తపోసంకల్పం కల్గించేంత పవిత్రమై వుంటుంది. మానవాళి సంక్షేమంకోసం, విశ్వశ్రేయస్సు కోసం ధూపదీప నైవేద్యాల మధ్యా, వేద మంత్రాల మధ్యా అక్కడ నిరంతరం యజ్ఞయాగాది క్రతువులు జరుగుతుంటాయి.

ఇక లోపలికి ప్రవేశిస్తే. . .

ఎడమవేపుగా ఓ అందమైన గది!

పక్కమీద కూర్చుని ‘ఫీడో’ గ్రంధం పఠిస్తున్న వేదార్థం నారాయణాచార్యులు తలుపు దగ్గర అలికిడి కావడంతో చటుక్కున ఆ గ్రంధాన్ని దిండుకింద దాచి, కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తున్న వాడిలా నటించసాగాడు.

“లోనికి ప్రవేశించవచ్చునా మహాశయా?” వాకిలి దగ్గర అస్సామీ భాషలో విన్పించిన ఆ కంఠం శ్రీ జ్ఞాన కౌముదుల వారిదని గుర్తించి, కళ్ళు తెరిచి, ‘రమ్మ’ని సంజ్ఞ చేశాడు నారాయణాచార్యులు.

ఆయన వస్తూనే ఎదురుగానున్న ఆసనంపై కూర్చుంటూ, “కాలకృత్యాలు ముగిశాయా అచార్యా?” పరామర్శగా అడిగాడు.

“ముగిశాయి!” క్లుప్తంగా అన్నాడు నారాయణాచార్యులు హిందీలో.

జ్ఞాన కౌముదీ స్వామి తనూ హిందీలోకి దిగుతూ, “తమరేదో గ్రంధం దాచినట్లున్నారు?” నవ్వుతూ ప్రశ్నించాడు.

నారాయణాచార్యులు నవ్వి, “మీరనుకోలేదు” అన్నాడు.

“పాశ్చాత్య దర్శనమా?”

“అవును ఫీడో. ప్లేటో వారిది.”

“ఆశ్రమ నియమాలకి విరుద్దమని తెలిసీ, తమరీ అలవాటును మానలేకున్నారు. నేను తమరికి చెప్పదగను.”

“నిజమే! నాతత్వం జ్ఞాన సంబంధమైనదని మీకు తెలియనిది గాదు. దానికి నేనేం చేయగలను?”

“అదీ నిజమే. కానీ శ్రీముకుందా మిశ్రా, శ్రీ పరీక్షిత చతుర్వేది లాంటి వారికి ఈ విషయం తెలిస్తే ప్రమాదం కదా?” కాస్త భయంగా అన్నాడు జ్ఞాన కౌముది.

నారాయణాచార్యులు పెద్దగా నిట్టూర్చాడు. ఆ తర్వాత, “తెలుసుకుని నన్నేంచేయగలరు కౌముదీ స్వామీజీ? అయినా పదేళ్ళుగా తెలుసుకోలేనిది యిప్పుడు తెలుస్తుందని భావించమంటారా? మీరయితే నాకు ప్రేమపాత్రులు గనుక నా ద్వారా తెలుసుకోగలిగారు. మీరు చెప్పినవాళ్ళు పరిచారకుల ద్వారా నాకు వర్తమానం పంపకుండా, నా అనుమతి లేకుండా లోనికి ప్రవేశించగలరా? అయినా యింకెంత కాలం నేనిక్కడ వుండబోతున్నాను గనుక!” అన్నాడు.

జుట్టు ముడివిప్పి విదిలించి, తిరిగి ముడిపెట్టుకోబోతున్న శ్రీ జ్ఞాన కౌముదీ స్వామి ఆ చివరి మాటలు విని భరించలేకపోతున్నట్టు “ఓం తత్ సత్!” అన్నాడు. సింధూరంతో మూడు నిలువు నామాలు దిద్దిన ఆయన ప్రసన్న వదనం కొంత విషాదంతో నిండింది.

కానీ, ఆయన అటువంటి అల్పభావాలకు అతీతుడుగా నిర్దేశించబడిన బాధ్యాతాయుతమైన వ్యక్తి. దైవాన్ని సాధన చేస్తున్నవాడు. అందుచేతనే తనకి అలవడిన ఆత్మ సంయమనంతో మళ్ళీ మామూలుగా అయిపోతూ, “తమరీ అరవయ్యొకటవ ఏట గృహస్థాశ్రమం స్వీకరించడంలో అంతర్యమేమిటో నాకు తెలీక నేను ఆవేదన చెందుతున్నాను. ఎందుకో ఈమధ్య నా మనసు బాగా చంచలంగా వుంటున్నది. ఆత్మీయులైన పెద్దలు, పైగా ఆశ్రమ ఉపాధ్యక్షులు తమరు వెళ్ళిపోవడం నేను భరించగలనా అన్పిస్తున్నది.” అన్నాడు.

నారాయణాచార్యులు కాళ్ళను ముందుకు లాక్కుని పద్మాసనం వేసుకున్నాడు. ఏదో చెప్పదలచుకున్న వాడిలా వెన్నెముక నిటారుగా చేసి మణకట్లు మోకాళ్ళుకు ఆనించి, భారంగా శ్వాస వదిలాడు. ‘రిమోట్’ మాగ్నటిక్ బజర్ తో పరిచారకుడిని పిలిచి, “మాకు పాలు తీసుకురావాలి!” అని కన్నడంలో చెప్పాడు. పరిచారకుడు వెళ్ళిపోయాడు.

ఇంతలో బ్లాక్ కమెండోల బూట్ల చప్పుడు ద్వారం వైపు నుండి వినిపించింది. ఎవరో చాలా మంది వేగంగా వెళుతున్నట్టు అడుగుల చప్పుడు. “ఆచార్య జితేంద్ర అవస్థి ఈ రోజు ఇండోనేషియా ప్రయాణమయినట్టున్నారు. చూడండి! భగవత్ స్వరూపులకు కేంద్ర ప్రభుత్వ రక్షణదళం కావాలి.” నవ్వి, నారాయణాచార్యులు తిరిగి చెప్పడం ప్రారంభించాడు.

“జ్ఞాన కౌముదీ స్వామీజీ! మీరు నాకన్నా ఇరవైయేళ్ళు చిన్నవారు. మీరు ఆశ్రమంలో ప్రవేశించి కేవలం తొమ్మిదేళ్ళయింది. పైగా మీరు మతప్రచారక కార్యకలాపాల్లో మునిగివున్నందువల్ల మీకీ ఆశ్రమం తీరుతెన్నుల గురించి, రాజకీయాల గురించి సరిగ్గా తెలీదు. నేను వివరిస్తాను.”

పరిచారకుడు పాలు తీసుకుని వచ్చాడు. అవి అందుకుని తాగాక ఆయన చెప్పాడు.

ప్రస్తుతం ఈ ఆశ్రమం విలువంతో మీకు తెలుసా స్వామీజీ? మూడు వందల కోట్ల రూపాయలు! దీని అధ్యక్షులు శ్రీశ్రీశ్రీ శ్రీవైకుంఠ జగన్నాథ త్రివేదీ వారి సంవత్సర ఖర్చు డెభై అయిదు లక్షలు టూర్లతో కలిపి. వ్యవస్థాపకులు శ్రీ పరీక్షిత చతుర్వేది వారి ఖర్చు యాభై లక్షలు. ఉపాధ్యక్షుడిగా నా ఖర్చు పడ్రెండు లక్షలు. . .మతవ్యాప్తి కార్యక్రమాలు చాలించుకున్నాను కాబట్టి. మిగతా డైభై ఆరుమంది స్వామీజీల ఖర్చు మీతో కలిపి అందరిదీ నాకన్నా ఎక్కువే వుంటుంది. మన ఆశ్రమ ఖాతాలో వున్న ఆస్తి విలువ మొత్తం మూడు వేల కోట్ల రూపాయలు. అంటే అది పూరీ, శృంగేరీ లాంటి నాలుగు శక్తి పీఠాల్లో ఏ ఒక్క పీఠానికీ లేనంత అన్నమాట. ఇంత ఖరీదయిన జీవితాలు మనకి అవసరమేనంటావా? కౌముదీ స్వామీజీ?”

నారాయణాచార్యులు మంచం పైనుండి లేచాడు. ఆ గది గోడ దగ్గరకి వెళ్ళి, గోడమీద చూపుడువేలు ఆన్చి చూపిస్తూ, “వెదురు కర్రల గోడలమీద అమర్చిన ఈ ‘రీబిల్డ్ పెంకు’ జపాన్ దేశపుదన్న విషయం మీకు తెలుసా?” అంటూ కాస్త పక్కకి జరిగి, అక్కడున్న తైలవర్ణ చిత్రాన్ని చూపిస్తూ, “ఈ ఇకనోగ్రఫీ పెయింటింగ్ లు, ఈ యంబాసింగ్ మంత్రపురేకులు చూస్తున్నారు కదూ?” ఆయన తిరిగి వచ్చి మంచం మీద కూర్చున్నాడు.

“ఈ ఎర్రటేకు మంచం మీద నగిషీలు చూడండి స్వామీ! ఆర్నమెంటల్ వర్క్ అట. ఈ కాషాయ వస్త్రాలు చూడండి. మీటరు వస్త్రం ఐదున్నర వేల రూపాయలట. యు.ఎస్.ఏ. వి! ఆ కేన్ కుర్చీ ధర అయిదువేల రూపాయలు. తాంబూలం దాచుకునే బంగారు ఇన్ లేయింగ్ స్టోన్డ్ భరిణెలు ఒక్కొక్కటీ ఇరవైవేల రూపాయలు. వింటున్నారా స్వామీజీ? ఇంకా పట్టు పరుపులు, కుషన్డ్ బోల్ స్టర్లు, దంతంతో తయారు చేయబడిన ల్యాంపులు, కార్తేజియన్ గులాబీ అత్తర్లు, లేవండర్ తలనూనెలు, జీడిపప్పు, నెయ్యి లాంటి వాటితో వండిన ఎస్ క్యులెంట్ వంటకాలు, వెన్నతీసిన స్కిమ్డ్ మిల్క్, మహారాష్ట్ర గుహల్లో నుండి దొంగతనంగా తెప్పించబడిన శిల్పాలు, హై కాన్ఫిగరేషన్ కంప్యూటర్లు, అధునాతన వీడియో టీ.వీ.లూ, ఒడిస్సీ, సిరైకెళ్ళా, అంకియానట్, భరతనాట్యం సీడీలు, క్యాసెట్టులు, డిజిటల్ ఆడియో సిస్టమ్స్, టేప్ రికార్డర్లు, అందులో వీణ, ఫిడేలు, సారంగి లాంటి వాటిమీద వాయించిన యిన్స్ స్ట్రుమెంటల్ క్లాసిక్స్, ఇవిగాక, సెల్ ఫోన్లు, డైనమిక్ ఐ.యస్.డీ. లూ, లిఫ్టులూ, ఎయిర్ కండిషన్డ్ కార్లు, ఫ్లయిట్ లు, విదేశాలు!” నారాయణాచార్యులు నవ్వాడు. ఈసారి ఆయన వదనం గంభీరమయింది.

“కామ, క్రోధ, లోభ, మోహ, పాశ, మదమాత్సర్యాల్ని జయించి, సర్వసంగపరిత్యాగులమైన మనకి, దైవలబ్ది కోసం ప్రయత్నించే మనకి మతవ్యాప్తి కోసం యింతటి లగ్జరీలు నిజంగా అవసరమా కౌముదీ స్వామీజీ?”

( సశేషం )

Thursday, September 13, 2007

సామెతలరాయుళ్ళు!..3

సామెతలరాయుళ్లు! (హాస్యకథ)

(కేవలం ఎనిమిది పేజీల కథలో 35 పై చిలుకు సామెతల్ని, యింకా జాతీయాల్నీ ఉపయోగించి రాసిన ప్రయోగాత్మకమైన హాస్య కథ!)


సూపర్నెంటు కూడా తనని తప్పు పట్టేసరికి సుబ్బలక్ష్మికి అరికాలిమంట నెత్తికెక్కింది.

“ఉలవలు తిన్నమ్మకి ఉలుకెక్కువైనట్టు చేసేవారికి లేని బాధ మీకెందుకండీ?” అంది వనజాక్షిని మూతి ముఫై వంకర్లు తిప్పుతూ.

“శభాష్!” అన్నాడు శాస్త్రి మెల్లగా వనజాక్షికి వినిపించకుండా.

వనజాక్షి గింజుకుంది. “అవున్లేమ్మా! నాకెందుకూ. . . ఎల్లపాములూ తలెత్తితే ఏలికపాము కూడా తలెత్తిందనీ ఈ మధ్య నీక్కూడా నోరు బాగానే పెరిగింది.” అంది మెటికలు విరుస్తూ.

“ఓ.కే! సైలెన్స్! సైలెన్స్!” గుర్నాధం పెద్దగా అరిచాడు.

శాస్త్రి మాత్రం సుబ్బలక్ష్మిని మెచ్చుకుంటూ, “ఏదియేమైనా సుబ్బలక్ష్మి మంచి అమ్మాయయ్యా!” అన్నాడు.

కామేశం ఎత్తుకున్నాడు. “అవును పాపం! నంగకి నాలుగు అట్లు యిస్తే నమలకుండా మింగిందనీ చాలా చాలా మంచిది.” శాస్త్రి చెవిలో మంటగా చెప్పాడు.

“మరి నువ్వు లైటింగ్ యిస్తున్నావుగా?” అడిగాడు శాస్త్రి కామేశం చెవిలో.

“ఏం లైటింగ్? నా బొంద! లాటరీ ప్రయత్నం లాగా ఎంతకీ తెగదు.” అన్నాడు కామేశం.

“బాగానే మాట్లాడుతుందిగా?” శాస్త్రి అడిగాడు.

“ఏం మాట్లాడ్డంలెండి శాస్త్రిగారూ! ఓడ ఎక్కేదాకా ఓడ మల్లన్న ఓడ దిగినాక బోడి మల్లన్న రకం. పని వున్నప్పుడు మాత్రం బాగానే మాట్లాడుతుంది.” కామేశం తన గోడు వినిపించుకున్నాడు.

మొత్తానికి వనజాక్షీ, సుబ్బలక్ష్ముల సంవాదం కారణంగా ఆ తర్వాత అక్కడి వాతావరణం కొద్దిసేపు బరువుగా, నిశ్శబ్దంగా మారింది.

ఆ నిశ్శబ్దాన్ని భగ్నంచేస్తూ జోగినాధం అన్నాడు. “ఓ అయిదొందలుంటే అప్పుగా యిద్దురూ సూపర్నెంటుగారూ? ఫస్టున జీతం రాగానే యిచ్చేస్తాను!” అని.

గుర్నాధం అదిరిపడి, “నా దగ్గర డబ్బెక్కడిదయ్యా బాబూ! అసలే నెలాఖరు! ఆ పెళ్ళిగాని కుర్రోడు కామేశాన్నడగండి పుష్కలంగా వుంటాయి.” అంటూ ఓ సలహా పారేశాడు ఉచితంగా.

“మా ఆయనేవుంటే మంగలాయనెందుకనీ కామేశాన్ని అడిగింతర్వాతే మిమ్మల్నడిగాను మహాశయా!” జోగినాధం సూపర్నెంటు మీద మండిపడ్డాడు. ఆ తర్వాత శాస్త్రి వైపు తిరిగి, “పోనీ మీ దగ్గరుంటే సర్దండి శాస్త్రిగారూ!” అన్నాడు.

అటువంటి విషయాల్లో శాస్త్రి చాలా జాగరూకుడై వ్వవహరిస్తాడు.

ఠడబ్బు నాదగ్గరెక్కడిదయ్యా జోగినాధం? ఆ అయిదొందలే వుంటే ఈ నడుమీడ్పూ, ఈ కాళ్ళపీకుడూ ఎందుకూ డాక్టర్ దగ్గరకెళ్ళి చూపించుకోనూ!” వెంటనే చెప్పాడు తడుముకోకుండా.

“ఆరావులమ్మ మూడావులమ్మ యింటికి నేతికి వెళ్ళినట్టు బాగానే వుందయ్యా మీ జంఝాటం!” అవధాని నవ్వేడు. ఆ తర్వాత, “పోనీ సుబ్బలక్ష్మిని అడిగి చూద్దురూ!” అన్నాడు నేర్పుగా సుబ్బలక్ష్మికి అంటగడుతూ.

తన వంతు వచ్చిందన్న విషయం సుబ్బలక్ష్మికి బాగా స్ఫురించింది. ఇక లాభంలేదని ‘హ్యాండ్ బ్యాగ్’ ఓపెన్ చేసి, అందులోంచి ఓ అయిదొందల రూపాయలు తీసి జోగినాధం కిచ్చింది. “మళ్ళీ ఫస్టుకిచ్చేయండీ!” అంటూ.

“ఇచ్చేయండి మరి. ఆవిడ రేపు పెళ్ళిలో మొగుడ్ని కొనుక్కోవాలి పాపం!” కామేశం గొంతు తగ్గించి జోగినాధం చెవిలో వూదాడు.

సుబ్బలక్ష్మి సహాయానికి జోగినాధం తెగ సంబరపడిపోయి, “అయినవాళ్ళ మూతి వెనుక కానివాళ్ళ తోక ముందన్నట్టు వీళ్ళందరి కంటే నువ్వే మేలమ్మా సుబ్బలక్ష్మీ రేపు నీ పెళ్ళికి ఏదైనా మంచి గిఫ్టు యిస్తాన్లే.” అన్నాడు.

“ఇంగ్లీషు డిక్షనరీ ఒకటి కొని యిచ్చేయండి సరిపోతుంది.” కామేశం గొణిగాడు.

జోగినాధంకి అప్పు లభించడం సూపర్నెంటుకి కూడా సంతోషం కలిగించినట్టుంది. “ఇందామ్మా తీయగూర అంటే యిందామ్మా పుల్లగూర అన్నట్టుగా ఒకరికొకరు సెక్షన్లో సహాయంగా వుండండయ్యా.” అన్నాడు.

ఇంతలో. . . ఆ సెక్షన్లోకి ఓ అరవైయేళ్ళ ముసలాయన ఒకాయన వచ్చాడు. వచ్చీరాగానే, సూపర్నెంటు టేబుల్ దగ్గరికి వెళ్ళి, “మా పుల్లిగాడు ఎక్కడండీ?” అన్నాడు.

సూపర్నెంటు ఆ ముసలాడ్ని ఎగాదిగా పైనుండి కిందికి పరికించి చూస్తూ “పుల్లిగాడెవరయ్యా. . .? కన్నెరికపు పెళ్లికొడుకా ఏంటి?” అడిగాడు అర్థంగాక.

ఆ ముసలాడు కూడా చమత్కారి లాగే వున్నాడు. “పుట్ట గొడుగంటే గుడ్డదా తాటాకుదా? అన్నాట్ట మీలాంటి ఒకాయన. అదేనండీ మీ అటెండరు పుల్లారావు గురించి నేనడుగుతున్నది.” అన్నాడు ఆయన ముక్కుమీది కళ్ళజోడు ముఖం మీదికి లాక్కుంటూ.

సూపర్నెంటుకి అర్థమైంది. “పుల్లారావు పాపం వాళ్ళ నాన్నగారు పోయారని సెలవు మీద వెళ్ళాడండీ.” అన్నాడు.

“ఓహో. . ! అలాగా? పుల్లారావు వస్తే కాస్త నేను వచ్చి వెళ్ళానని చెప్పండి.” అంటూ ఆ ముసలాయన కదిలి వెళ్ళబోయాడు.

“ఇంతకీ తమరెవరండీ?” అన్నాడు గుర్నాధం మామూలుగా.

“ఆ పుల్లారావుగాడి చచ్చిపోయిన నాన్నగారు నేనేనండి.” ముసలాయన చావు కబురు చల్లగా చెప్పాడు.

జోడుగుళ్ల తుపాకీ దెబ్బ తగిలినట్టు ఉలిక్కిపడ్డాడు గుర్నాధం. ఆ తర్వాత, “మరి నాకెందుకు పుల్లారావు అబద్దం చెప్పినట్టు?” అన్నాడు అయోమయంగా తలగోక్కుంటూ.

“ఏమీ లేదుసార్! పిల్లి గుడ్డిదైతే ఎలుక ముడ్డి చూపిస్తుందనీ ఓ సామెతుందిలే అందుకు.” చెప్పి ఆ ముసలాయన అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు.

గుర్నాధం చిందులు తొక్కాడు. “తాళిబొట్టు బలం తలంబ్రాల వరకేననీ ఈ రోజుతో ఈ పుల్లారావు పని అయిపోయింది. రానీ చెబుతా.” అన్నాడు.

“మరేం చేయమంటారండీ! అతి లోభి రాజుకి అడగనివాడే మహా పండితుడన్నట్టు తమరికి సెలవడిగితే కోపమాయే.” అవధానికి ఛాన్సొచ్చింది.

ఆ మాటతో గుర్నాధంకి గుటక పడింది. అందుకే మాట మారుస్తూ, “ఏది ఏమైనా ఈ రోజు మన మాటల్లో దొర్లిన సామెతలతో ఒక సామెతల శతకమే రాయొచ్చయ్యా!” అని, “సరేగానీ టైమ్ అయిదయింది. ఫైళ్లు కట్టేసి, యిక కదలండి యిళ్ళకి.” అన్నాడు.

అంతా లేచి అక్కడ్నుంచి కదిలారు. అట్లా కదిలి అందరూ వెళుతున్నప్పుడు యిక ఆరోజుకి ఉపసంహారంగా గుర్నాధం గంభీర వదనుడై ఒక మాట చెప్పాడు.

“చూడండి! మనమంతా ప్రభుత్వ ఉద్యోగులం. ప్రభుత్వమనే మహారథానికి మనం నిండు చక్రాల్లాంటి వాళ్లం! ప్రజల సొమ్ముతిని బ్రతికే మనం. . .ఆ ప్రజల కోసం. . . ఇట్లా మాటలతో, నవ్వులతో కాలం వెళ్ళబుచ్చకుండా పని బాగా చేసి దేశం సర్వతోముఖాభివృద్ధికి మన వంతు సహకారం అందిద్దాం. రేపట్నుంచి కలసి యింకా ఎక్కువ పని చేయడానికి ప్రయత్నిద్దాం!”

“సూపర్నెంటుగారు చూడండి. ఎంత మంచి మనిషో. .?” అంది వనజాక్షి గుర్నాధాన్ని చూసి మురిసి ముష్టెత్తుకుంటూ.

“అవున్లేమ్మా! గోడ దూకొచ్చినమ్మ గోత్రం మహాత్మ్యం చెప్పుకుందనీ ఆయన చాలా మంచి మనిషి. . .నీలాగే!” అన్నారెవరో ఆ గుంపులో నుండి.

( సమాప్తం )

Wednesday, September 12, 2007

సామెతలరాయుళ్ళు!..2

సామెతలరాయుళ్లు! (హాస్యకథ)

(కేవలం ఎనిమిది పేజీల కథలో 35 పై చిలుకు సామెతల్ని, ఇంకా జాతీయాల్నీ ఉపయోగించి రాసిన ప్రయోగాత్మకమైన హాస్య కథ!)

“ఇప్పుడేమయిందండీ మీకు?” అడిగాడు గుర్నాధం జోగినాధాన్ని.

“కాకపోతే ఏందండీ యిది? ఏదో పది రూపాయల పై ఆదాయం కోసం నేనిక్కడికి ట్రాన్స్ ఫర్ మీదొస్తే గాడిద చాకిరీ తప్ప పైగా టికాణా లేకుండా పోయింది. ఏదో సామెతుందిలే ఊరుకోలేక ఉప్పరోడ్ని చేసుకుంటే తట్టకొక తన్ను తన్నాడనీ అట్లాగయింది నా పరిస్థితి!” అన్నాడు జోగినాధం ఈసడింపుగా.

“నిజమేనండీ ఈ సెక్షన్లో పనిచేయడానికి ఒక్క గాడిదకున్నంత ఓపిక వుండాలంటే నమ్మండి. అన్నాడు శాస్త్రి జోగినాధంకి సపోర్టుగా.

సూపర్నెంటుకి మండింది. “అవును. నాకు ఆరు గాడిదలకున్నంత ఓపిక వుండాలి మరి!” అన్నాడు తెలివిగా.

‘ఏమిరా వెర్రిముఖమా అంటే ఏముందిలే చిన్నాయనా’ అన్నట్టు కొట్టిన దెబ్బ తిరిగి తమకే తగలడంతో కొంచెం సేపు అంతా కిక్కురుమనకుండా వుండిపోయారు.

కొద్దిసేపు తర్వాత అవధాని వివరించేడు. “అదిగాదండీ సూపర్నెంటుగారూ. . .అసలు విషయం! మొన్న ఆ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు ముకుందరావుకి ఆయన తాలూకూ కాన్ఫిడెన్షియల్ రిపోర్టుల్లో బ్యాడ్ రిమార్కులన్నీ దాచేసి, ప్రమోషన్ యిచ్చినందుగ్గాను ఆయనగారు తమకి సమర్పించుకున్న కట్నం బాపతు సొమ్ము అంతా తమరే నొక్కేసి, తన వాటా యివ్వలేదని జోగినాధంకి బాధ.” అన్నాడు.

“చాదస్తం ముదిరిందిరా అంటే చెరిసగం పంచుకుందామన్నాట్ట జోగినాధం లాంటోడు. ఆ ముకుందరావు నాకెప్పుడు యిచ్చి చచ్చాడయ్యా. . .వాడు ఇస్తానన్జెప్పి మోసంజేసి పోతేనూ.” గుర్నాధం యిమ్మీడియట్ గా రెడీమేడ్ సంజాయిషీ యిచ్చేశాడు.

“మరి ఆయనగారు మొన్న కొత్తగా కొన్న వాషింగ్ మెషీన్ ఎక్కడనుండి వచ్చిందో దాని సంగతి చెప్పమనండి.” జోగినాధం అవధానినడిగాడు ఉక్రోషంగా.

గుర్నాధం సీరియస్ అయిపోతూ, “అది మా బామ్మర్ది పిల్లకి పురుడు పోసుకుంటూ నాకు ప్రజంటేషన్ గా యిచ్చాడయ్యా.” అన్నాడు.

ఆ మాట అందరూ నమ్మారో లేదోగానీ జోగినాధం మాత్రం యిసుమంత కూడా నమ్మలేదు. అందుకే. . .

“ఆ అల్లంమురబ్బా అమ్ముకునే ఈయన బామ్మర్ది వాషింగ్ మెషీన్ గిఫ్టు యిచ్చాట్ట. . .అబద్దం ఆడినా అతికినట్టుండాలి!” అన్నాడు మెల్లగా.

ఇంతలో. . .వనజాక్షి సీట్లోంచి లేచి, సూపర్నెంటు టేబుల్ దగ్గరికి వెళ్ళింది. ఆమెకి నలభై ఏళ్ళుటాయి. మనిషి కొద్దిగా లావు! అందం కాస్త మందం అయినందువల్ల ఈకల తోకలు దులిపి నూకలలో కలిపినట్టు ఎక్కడలేని అలంకారాలూ చేసుకుంటుంది. ‘ఊగీ ఊగీ ఊయెల వున్నచోటికే వచ్చినట్టు’ ఎన్నిచేసినా ఆవిడగారి బోడిముఖం మారేదీ లేదు మండేదీ లేదని జోగినాధం అభిప్రాయం. ఆఫీసులో కూడా వనజాక్షి నవల్లు చదవడం మానదు. ‘సిద్దారెడ్డోళ్ళ చద్దన్నం తిని, శివారెడ్డోళ్ళ ఆవులు మేపినట్టు’ ఆవిడ ప్రభుత్వం సొమ్ముతిని పత్రికలవాళ్ళని పోషిస్తుందని ఆమెపై అవధాన్లు అభియోగం!

ఏదియేమైనా. . . ‘సూర్యుడు తనవాడైతే చుక్కలన్నీ తన కుక్కలని’ వనజాక్షి మాత్రం మొత్తానికి సూపర్నెంటుని బుట్టలో వేసుకోగలిగింది. ఇక ఆ విషయం పక్కన పెడితే. . .

వనజాక్షి సూపర్నెంటు టేబుల్ మీద చేతులానించి, “నాకు రేపు సెలవు కావాలండీ!” అంది గారాలుపోతూ.

“ఎందుకుట?” అడిగాడు గుర్నాధం వనజాక్షి చేతుల సోయగాలు చొంగగార్చుకుంటూ పరికిస్తూ.

“ఒళ్ళంతా ఒహటే నొప్పులండీ. కనీసం ఒక్కరోజైనా విశ్రాంతి లేందే తగ్గేట్టు లేవు.” అంది వనజాక్షి. జారిన పైటని జాకెట్లోకి దోపుకోకుండానే.

శాస్త్రికి తన కసి తీర్చుకోడానికి అవకాశం దొరికింది. “దంచేది ఒకరైతే పక్కలెగరేసేదింకొకరని మీకెందుకండీ ఒళ్లునొప్పులు. . .పనంతా మీ అత్తగారు చేస్తుటేనూ?” అన్నాడు.

“అదేమిటండీ శాస్త్రిగారూ అట్లా అంటారు. నేను యింట్లో లేకుంటే మా ఆయనకి ఒక్కరోజయినా జరుగుతుందా.” అని, “మా అత్తగారేం చేస్తారు. . . పాపం ఆవిడ ముసలావిడ.” అంది వనజాక్షి.

“ఆహా! గప్పాల పోతిరెడ్డికి ముఫ్ఫై మూడు దొడ్లూ, మూడు ఎడ్లూ అనీ ఈవిడగారు లేకపోతే ఆ హెజ్బెండ్ గారికి జరగనే జరగదట! మరి ఆఫీసులో లేకపోతే సూపర్నెంటుకి జరుగుతుందా? ఆ మాట చెప్పదేం?” అవధాని చెవిలో రహస్యంగా అన్నాడు జోగినాధం.

“నిజమే మరి ఓపలేని అత్తకి వంగలేని కోడలు.” అన్నాడు అవధాని అంతే రహస్యంగా.

“ఓ.కె. లీవ్ గ్రాంటెడ్!” గుర్నాధం వనజాక్షికి లీవిచ్చేశాడు.

“థాక్సండీ!” అంది వనజాక్షి మెలికలు తిరిగిపోతూ.

అవధానికి అస్సలు గిట్టనివాళ్ళలో వనజాక్షిది ఒకటో నెంబర్. “అలివిగానమ్మకి అన్నీ ఎక్కువేననీ అబ్బ. . . ఆ మెలికలు తిరిగడం చూడండి.” అన్నాడు జోగినాధం చెవిలో.

ఈ లోపల సుబ్బలక్ష్మి లేచింది.

లేచి, కామేశం వైపు చూస్తూ, “ఎక్స్యూజ్ మీ! ఏమనుకోకుండా ఏఫోర్ సైజు పేపర్లు ఓ పాతికవుంటే అప్పుగా యిస్తారా కామేశంగారూ?” అంది.

ఆ మాత్రం పలుక్కి కామేశం పరవశించి పోయాడు. “దాందేముందండీ భలేవారే. మనకీ మనకీ మధ్య అప్పేంటి లక్ష్మిగారూ?” అంటూ తన టేబుల్ డ్రా లోని పేపర్లు తీసుకెళ్లి సుబ్బలక్ష్మికి అందించాడు.

“థాంక్యూ అండీ!” సుబ్బలక్ష్మి సిగ్గుల మెగ్గయింది.

సుబ్బలక్ష్మి సిగ్గు వనజాక్షికి ఎల్లప్పుడూ ఒళ్ళుమంటే. అందుకే సుబ్బలక్ష్మి వైపు ఈర్ష్యగా చూస్తూ, “ఏమ్మా సుబ్బలక్ష్మీ. ఎత్తేవారుంటే ఏకులబుట్ట కూడా బరువేననీ ఆ కుర్రవాడ్నెందుకట్టా తిప్పుతావ్. వెళ్ళి యిండెంట్ తెచ్చుకోలేవూ?” అంది.

“అదీ అట్లా చెప్పండి!” అన్నాడు గుర్నాధం వనజాక్షితో.

జోగినాధం శాస్త్రి చెవి దగ్గరకి వంగి, “ముక్కిడిదాని పాటకి ముండోడి మెచ్చుకోలనీ ఆవిడ మాటకి ఈయన సపోర్టు చూడండి.” అన్నాడు.

( సశేషం )

Tuesday, September 11, 2007

సామెతలరాయుళ్ళు! 1

సామెతలరాయుళ్లు! (హాస్యకథ)

(కేవలం ఎనిమిది పేజీల కథలో 35 పై చిలుకు సామెతల్ని, యింకా జాతీయాల్నీ ఉపయోగించి రాసిన ప్రయోగాత్మకమైన హాస్య కథ!)

నిర్భంధ విధానపు గడబిడలో తద్దినం మంత్రపు లొడలొడలా హైదరాబాదు నగరానికి నడినెత్తిమీద వున్నట్టుంటుందా గుట్టమీది అదేదో కమీషనరాఫీసు. సదరు ఆఫీసులోని ఒకానొక సెక్షన్ కి గుర్నాధం సూపర్నెంటు! ‘చెవిగొరుకువారు. . .తార్పుడు సేయువారు. . .కొంటెకూతలవారు. . .కోడెగాండ్రు’ అన్నట్టు అన్ని రకాల మనస్తత్వాలూ వున్న తన క్రింది వుద్యోగుల్ని తను ‘కంట్రోల్’ చేయలేకపోతున్నాడేమోనని ఆయనగారికొక అనుమానం. చత్వారం హేతువుగా లభించిన కళ్ళజోడుతోనూ, నిగనిగలాడే నిండారు బట్టతల తోనూ గుర్నాధం. . .నల్లగా, గుండ్రంగా, అచ్చు గునపంలాగా వుంటాడు.

‘జుట్టు మూడు పాళ్లే అయినా అధికారం ఆరు పాళ్ళన్నట్టూ’. . . ‘నాన్ గెజిటెడ్ ఆఫీసరే’ అయినా ఆఫీసరాఫీసరే అయినట్టూ’ గుర్రుగా, గంభీరంగా వుంటాడు.

“వెధవది! గంభీరమే కాదాయనకి. . .కొసవెర్రి, కొంకనక్కతనం పాళ్ళు కూడా కాస్త ఎక్కువేనం”టాడు. అతనంటే గిట్టని హెడ్ గుమాస్తా ఆవకాయల అవధాన్లు.

“మరదే సూపర్నెంటంటే! సాతాని జుట్టుకి సన్యాసి జంద్యానికి ముడి పెట్టగలిగి వుండాలి గదా.” అంటాడు మరో గుమాస్తా జోగినాధం అవధానికి వత్తాసుగా.

గబ్బువాడు గదరువాడు వియ్యమందుకుంటుంటే మురికి వాడొచ్చి ముద్దాడినట్టుగా, “నిజమే సుమండీ! యిన్నాళ్ళకి నిజం పలికారు మీరు.” అంటూ తిట్టాడో పొగిడాడో కూడా తెలీనీకుండా తన వంతు తలూపుతాడు యింకో గుమాస్తా శాస్త్రి.

ఏది ఎట్లా ఏడ్చినా. . .ముండకి మొగుళ్ళు యిద్దరన్నట్టు గుర్నాధం వాళ్ళ సెక్షన్ కి రెండు గదులున్నాయి. ఒక గదిలో గుర్నాధం, ఆయనగారికి ఎదురుగా. . .సరిగ్గా ఎదురుగానున్న సీట్లో వనజాక్షి అనబడే ఒకానొక పెళ్ళయిన చంచలాక్షి, ఆమెకి అటుపక్కగా మరో పెళ్ళిగాని చిగురుబోడి సుబ్బలక్ష్మి కూర్చుంటారు.

ఇంకో గదిలో శాస్త్రి, జోగినాధం, అవధాన్లు మరో పెళ్ళీ పెటాకులూ రెండూ లేని ‘స్టెనోగ్రాఫర్’ కామేశం కూర్చుంటారు. పూటకొక్కసారి మేత మాటకొక్కసారి సామెత అన్నట్టుగా ఆ సెక్షన్లో ప్రతివాళ్ళకీ మాటకి ముందు సామెతలు వాడడం బాగా అలవాటు!

వనజాక్షి జూనియర్ అసిస్టెంటు! “ఆవిడ జూనియర్ అసిస్టెంటు కానేగాదనీ గుర్నాధమే ఆమెకి సీనియర్ అసిస్టెంటు అయ్యుంటాడ”నీ ఛలోక్తిగా అంటూంటాడు జోగినాధం. ఇకపోతే. . .సుబ్బలక్ష్మి టైపిస్టు! “ఆమె టైపిస్టే గానీ. . . టైపురైటింగంతా ఉద్యోగం వచ్చాకే నేర్చిందం”టాడు ఆ కన్నెని ఆమూలాగ్రం పరిశీలించిన కామేశం.

ఇక మనం పరిచయాలాపేసి, ప్రస్తుతంలోకి ప్రయాణిస్తే. . .గూనివాడు గోచీ బిగించి గుర్రంమీదెక్కి గదాయుద్ధం చేసినంత సీరియస్ గా ఆరోజు మద్యాహ్నం మూడు గంటలప్పుడు గుర్నాధం వాళ్ళ సెక్షన్ లో అంతా ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నమయ్యారు. శాస్త్రికి మాత్రం పనిమీద ఏకాగ్రత లేదు. కడుపులో కొద్దిగా ఆరాటంగా వున్నట్టుంది.

“జోగినాధం గారూ!” అన్నాడు మెల్లగా పెన్నుతీసి పక్కన పెడుతూ.

“ఊ!” అన్నాడు జోగినాధం ఫైల్లోంచి తలెత్తకుండానే

“నాకు ఒంట్లో ఏమీ బాగుండలేదయ్యా” చెప్పాడు శాస్త్రి ప్రారంభంగా.

ఆ మాటకి ఆ పక్కనేవున్న ఆవధానికి విసుగొచ్చినట్టుంది. “అందరికీ అన్నీరోగాలే గానీ అయిదుసోల కుండకి ఏ రోగం లేదని నీ ముఖానికి ఎప్పుడూ రోగాలే.” అన్నాడు తను కల్పించుకుంటూ. ఎక్కువ కాలం కలిసి పనిచేయడం వల్ల అవధానికి శాస్త్రితో కాస్త చనువెక్కువ.

“ఏమయిందేమిటి?” అడిగాడు జోగినాధం.

“ఎలుకలూ పందికొక్కులూ కలగలిసి పరుగెట్టినట్టు కడుపులో ఏవో అంతా రణగొణ ధ్వనులండీ!” కడుపు నొక్కుకుంటూ చెప్పాడు శాస్త్రి.

“చేతికందిన ఛెండాలమంతా చెడదింటే పైత్యం చేయదూ?” అన్నాడు అవధాని.

“ఇంతకీ ఏం తిన్నారో శాస్త్రిగారు?” తెగ క్యూరియాసిటీతో ప్రశ్నించింది వనజాక్షి అవతల గదిలోనుండి.

శాస్త్రికి తన గొప్ప చెప్పుకోడానికి కాస్త వీలు చిక్కినట్టయింది. “ఆ. . . మా ఆవిడ కాస్త చిత్రాన్నం, చిట్టిగారెలూ చేసిపెట్టింది లెండి.” అన్నాడు కొద్దిపాటి గర్వంగా మరింత ముక్తసరిగా.

“వాళ్ళావిడ కాస్త ప్రేమగా నోటికందించే సరికి కాదనలేక ఒక మోతాదు ఎక్కువ బిగించినట్టున్నారు. అంతేనంటారా సూపర్నెంటుగారూ!” అంది వనజాక్షి గుర్నాధంతో ముసి ముసిగా నవ్వుకుంటూ.

“అవునవును!” అన్నాడు గుర్నాధం గుడ్డి అద్దాల్లోంచి చూస్తూ.

“వీడి జబ్బు అదిగాదులెండి వనజాక్షిగారూ!” అన్నాడు అవధాని తనకి అంతా తెలుసునన్నట్టు.

“మరేదో?” అడిగాడు శాస్త్రి వెటకారంగా.

“నీ జబ్బు అదిగాదులేవయ్యా. నాకు తెలుసు.” అన్నాడు అవధాని మళ్ళీ వత్తి పలుకుతూ.

“మరి నీకు తెలిసిందేదో చెప్పి చావరాదూ.” శాస్త్రి అడిగాడు.

“ఆహార నిద్రావ్యత్యస్త పరిస్థితుల వల్లా, వాత పిత్త శ్లేష్మ దోషాల వల్లా నీకు కడుపులో బాధలు ప్రకోపిస్తున్నాయని నా అనుమానమయ్యా.” అన్నాడు అవధాని పెద్ద వైద్యుడిలాగా.

శాస్త్రికి మండింది. “మంగలి గొరిగి నేర్చుకుంటే వైద్యుడు చంపి నేర్చుకుంటాడని వీడి దరిద్రగొట్టు వైద్యం నామీద ప్రయోగిస్తాడెందుకండీ సూపర్నెంటూగారూ!” అన్నాడు రిపోర్టు చేస్తున్నట్టుగా.

“ఆయన వైద్యం కూడా ఒకసారి చేసి చూడొచ్చు కదండీ!” అన్నాడు . . .కామేశం సుబ్బలక్ష్మి పైనుండి కన్ను తిప్పకుండానే శాస్త్రిని ఏడిపించాలన్నట్టు.

“అద్గదీ. అట్లా గడ్డి పెట్టండి!” అన్నాడు అవధాని.

ఇక శాస్త్రి రెచ్చిపోయాడు. “ఏమిటండీ వీడిబొంద వైద్యం. గాడిద గడప చెట్టు ఆకులు తెచ్చి, కూతురు బుడమ చెట్టు రసంలో కలిపి, కల్పంలో వేసి నూరి తలకి పట్టిస్తే కడుపులో బాధలు తగ్గుతాయట. ఇదీ వైద్యం! అది వైద్యమో వీడి ఛాదస్తమో కూడా అర్థంగాదు.” అన్నాడు.

ఆ మాటతో అవధానికి కోపమొచ్చి, “బొండుమల్లెల గోడు బోడిముండ కెందుకనీ నీ దిక్కుమాలిన పిష్టపేషణ వ్యాపారం నాకెందుకులే.” అంటూ శాస్త్రి మీద అలిగి అటువైపు తిరిగాడు.

అంతా నవ్వారు. సుబ్బలక్ష్మి మాత్రం ముఖం పక్కకి తిప్పి ప్రత్యేకంగా కిల కిలా నవ్వింది. ‘ఈరక్క పెళ్ళి సందట్లో పేరక్క గర్భాదానం చేయించుకున్నట్టు’ ఏమాత్రం ఛాన్సొచ్చినా వదులుకునే రకంగాదు కామేశం. అందుకే వెంటనే అలర్టయి. . .

“ఏది ఎట్లాగున్నా సుబ్బలక్ష్మిగారు నవ్వితే మాత్రం సెక్షనంతా కళ కళ లాడిపోతుందండీ.” అన్నాడు.

సుబ్బలక్ష్మి కామేశం వైపు కొరకొరా చూసింది. ‘అందమా అందానికి పట్టిన పీడా’ అన్నట్టు సుబ్బలక్ష్మి పుటక్కి బాగానే వుంటుంది. గుణానికి మాత్రం. . . ‘ఎందుకొచ్చావే ఎల్లమ్మా అంటే అందుక్కాదులే అగ్గికొచ్చాన’న్నట్టు ప్రవర్తిస్తుంది. కామేశం అట్లా మాట్లాడడం ఆమెకీ ఇష్టమే. అయినప్పటికీ, ‘బావా అని చూడబోతే రావా అంటూ కొంగుబట్టుకుంటాడేమో’నని భయం. అందుకే పైకి బింకంగా వుంటుంది.

ఆ విషయం అటుంచితే. . .ఈ లోపల జోగినాధంకి రేగింది.

“అచ్చిగాడు చావనీ అంటే బుచ్చిగాడే చచ్చాడనీ శాస్త్రిగారి సంగతేమోగానీ నేను మాత్రం ఈ పని చేయలేక చచ్చేటట్టే వున్నానండీ.” అన్నాడు చేతిలో పెన్ను విసిరి టేబుల్ మీద కొడుతూ పెద్దగా సూపర్నెంటు వినేట్టుగా.

( సశేషం )

Monday, September 10, 2007

ఊహా ప్రేయసి (భావ కవిత)

ఊహా ప్రేయసి!

వేడికోలిదే ప్రియురాలా. . . !
నా వేడికోలిదే ప్రియురాలా. . . !
ముకుళిత మానస అంతస్సమున
భావన ప్రతిమకు జీవనస్వామిగా
విరహపు త్వరలో
మధురిమ ఝరిలో. . . !

. . .వేడికోలిదే. . .

మెరుపు రూపముగ బంగరు తీవెవు
మేఘని చలువగ కరుణమూర్తిమవు
మెదుపు పలుకులన మృదులభాషిణవు
మాటువేళలన మైమరపున నను
విడిచిపోకుమని విస్మరింపకని. . . !

. . .వేడికోలిదే. . .

కుదుపుకు కదిలిన నలుపు వాలుజడ
ముగ్గులిడను నువు ముందుకు వాలగ
నేలకు వ్రేల్పడి ముగ్దనె దలపగ
తపము నెరుపుటకు జపపుమాలగా
జంకుమానుకుని జడను యివ్వుమని. . . !

. . .వేడికోలిదే. . .

నుదురున చెదిరిన సింధుర గుండ్రము
సంజె సమయమున సూరుని బింబము
చెమరిన చెక్కిలి అదిరిన పెదివము
ముక్కు ధిక్కరణం నేత్ర విస్ఫురణం
నిదురపోవగను నుదురు నివ్వుమని. . . !

. . .వేడికోలిదే. . .

కయ్యము సలిపెను పయ్యెద పొంగులు
నడువము కడువము నడమంతరము
కడుపు కండరము మడతలు పడగా
మడత వేడిమిన కన్నులె కాలగ
ముఖము దాచుకుని దుఃఖ పడెదనని. . . !

. . .వేడికోలిదే. . .

చెంగున గెంతగ కొంగు జార్చుకుని
పరికిణి పట్టుకు పరుగులు తీయగ
కాలి అందియలు ప్రిదిలి ఘల్లుమన
ముముక్షువునయినే మోక్షము నొందను
వేదము బదులుగ పాదములిమ్మని. . . !

. . .వేడికోలిదే. . .

Friday, September 7, 2007

అమృతమూర్తి!..3 (సరసమైన కథ)

అమృతమూర్తి!

(‘స్వాతి’ సపరివార పత్రిక సంచిక 26.09.1997 లో ప్రచురితమైన సరసమైన కథ! ఆది నుండీ తుది దాకా ‘బిగి’ సడలక అలనాటి పాఠకుల మనసులు రంజింపజేసిందీ కథ!)

“పెద్ద మగాడివేలే! అంటూ ఆమె నన్ను ఈసడించినట్టుగా లేచి అక్కడ్నుంచి వెళ్ళిపోయింది.

ఆ తృణీకారం నా అహంకారాన్ని రెచ్చగొట్టి, నాలోని పురుషుడిని వెయ్యింతలు చేసింది. నేను మగవాడిని కాదట. నాకు నవ్వొచ్చింది!

* * * *
నెలరోజులు గడిచాయి! విద్యాధరితో నా బాధలు ఎక్కువయినాయి. ఆదినారాయణగారు పరధ్యానపు మనిషి. ఈ లోకంలో నిల్చుని మరో లోకపు మానవులతో ప్రసంగించుకుంటున్నట్టు అదోలా వుంటారు. నాకు ఆయన పూర్తిగా ‘సైన్సు’ మాస్టారులాగే అనిపిస్తారు. ఏదో వ్రతమని చెప్పి ఆరోజు ఆయన నన్ను భోజనానికి ఆహ్వానించారు.

భోజనాలయాక, ఆదినారాయణగారు తాను పడుకుంటానని చెప్పి,లోపలి గదిలోకి వెళ్ళిపోయారు. మధ్య గదిలో నేనూ, విద్యాధరీ మిగిలిపోయాం. నేను ఉయ్యాల మంచం మీద కూర్చున్నాను. ఆమె నాకెదురుగా నేలమీద చాపేసుకుని కూర్చుంది. ప్లాస్టిక్ క్రిస్టిల్స్ తో ఏదో ఆటబొమ్మని అల్లుకోసాగింది.

నేను చూస్తూ కూర్చున్నాను. ఆమె ముదురు ఆకుపచ్చ రంగు చీర కట్టుకుని, అదే రంగు బ్లౌజు వేసుకుంది. అది పలుచగా వుంది. లోపల ‘బ్రా’ లేదు. తాంబూలం వేసుకోవడం వల్ల ఆమె పెదవులు లేతగా ఎర్రబారి ప్రియుడిని ఆహ్వానించసాగాయి!

ఉన్నట్టుండి విద్యాధరి, చేతిలో బొమ్మని నాకు చూపిస్తూ, “చూశావా పసివాడు.” అంది.

నుదుటిపై గాలికి అల్లల్లాడే వెంట్రుకల్ని వేళ్ళతో చెవుల వెనక్కి తోసింది.

“నువ్వు కూడా రేపు అటువంటి బాబునే ఒకడిని కనాలి!” అన్నాను సరసంగా.

“ఛీ! ఇటువంటివాడినా?” అంది.

“మరి?”

“నీలాంటివాణ్ణి కంటాను.” అంది.

నేను అదిరిపడ్డాను. “నాలాంటివాడ్నా?” అన్నాను. ఆమాటని జీర్ణించుకోడానికి ప్రయత్నిస్తూ.

“అవును! అచ్చు నీ పోలికలుండాలి.” అంది. అని, లోపలి గది వైపుకి ముఖం తిప్పి, “ఏమండీ! నేను చందూ లాంటి పిల్లవాణ్ణి కననా?” అంది పెద్దగా.

నాకు భూగోళం గిర్రున తిరిగినట్టయింది. “ఇద్దర్ని కను!” అన్నారు ఆదినారాయణగారు లోపల్నుండే.

స్త్రీ నటనలో గల చాకచక్యం, గొప్పదనం నాకు తెలియని విషయాలు గావు. నేను లేచి విద్యాధరి కూర్చున్న చోటికి చేరాను.

“ఏమిటీ. . .ఏమన్నావు నువ్వు? నీకు నాలాంటి పిల్లవాడు కావాలా?” నా మగతనం ప్రదర్శించకుంటూ, ఆమె కళ్ళలోకి చూసి తీవ్రంగా అడిగాను.

ఆమె నా తీవ్రతని ఏమాత్రం పట్టించుకోలేదు. “పిల్లలనగానే నా గుండె చూడు చందూ ఎట్లా కొట్టుకుంటుందో.” అంటూ నా చేతిని తన చేతిలోకి తీసుకుని గుండెలపై ఆనించుకుంది.

నా చేతిక్రింద మృదువైన, ఉన్నతమైన ఆమె వక్షోజాలు! వెచ్చటి స్త్రీత్వాన్ని నా శరీరంలోకి వ్యాపింపజేస్తూ! ఒక అగ్నిపర్వతం కుమిలింది. ఆమె గుండె ఎట్లా కొట్టుకుంటుందో నాకు స్పర్శ లేదు. నా గుండె మాత్రం శతకోటి శబ్దాలతో మార్మోగుతూ సృష్టినంతటినీ ప్రతిధ్వనించసాగింది. నేనప్పుడు మనిషి కాదు! విచక్షణ నాకు లేదు!!

క్షణం ఆలస్యమయి వుంటే అక్కడ ఏం జరిగివుండేదో నాకు తెలీదుగానీ ఇంతలో ఆదినారాయణగారు మంచినీళ్ళకని గబుక్కున బయటకొచ్చారు. చప్పున నేను చేతిని వెనక్కి లాక్కున్నాను. అంతటితో నా ఆవేశం అణగారిపోయింది.

ఆయన ఏదో ఆలోచించుకుంటూ నీళ్ల ఫిల్టర్ దగ్గర రెండుసార్లు అటూ ఇటూ తచ్చట్లాడి మంచి నీళ్లు తాగేసి మళ్ళీ లోపలిగదిలోకి వెళ్ళిపోయారు.

ఈ నెలరోజులుగా నేననుభవించిన మానసిక క్షోభ వర్ణింపశక్యంగానిది. నేనిక జాప్యం చేయదలచుకోలేదు. నా మనసేదో ఆమెకు విన్నవించేసుకుని అటో ఇటో తేల్చుకోదలచుకున్నాను.

అందుకే, “నువ్వంటే నాకు చెప్పలేనంత ఇష్టం!” అన్నాను నెమ్మదిగా తలొంచుకుని.

“ఏమిటీ?” అంది విద్వాధరి అర్థంగాక.

“నువ్వంటే నాకు ప్రేమ!” మళ్ళీ చెప్పాను.

ఆమె నావైపు చిత్రంగా చూసింది. “చందూ!” ఆర్తిగా అంటూ, నా గడ్డం చేత్తో పట్టుకుని పైకెత్తుతూ, “అది చెప్పడానికెందుకు అంత బాధ.” అంది. ఆపైన నవ్వింది.

వెంటనే లేచి భర్త గదివైపు వెళ్తూ, “చూడండి! నేను మీకు ఎప్పుడో చెప్పానుగా చందూకి నేనంటే ఇష్టమని. . .ఇన్నాళ్ళు పట్టింది ఆయనకి ఆ మాట నాతో చెప్పడానికి” అంది.

“అబ్బ! పోనీవే. అతడ్ని విసిగించకు!” అంటూ ఆదినారాయణగారు విసుగ్గా లేచి బయటికొచ్చారు.

నేను పిచ్చిపట్టినవాడిలా వెర్రిగా చూశాను. అదంతా ఒక వింత ప్రంపంచంలా అనిపించింది.

ఎందుకో వాళ్ళ మాటల్లో కృత్రిమత్వం లేనట్టుగా తోచింది. ఒక సహజ రమణీయమైన స్థితిలో ఆ వ్యక్తులు జీవించి, కొట్టుకుపోతున్నట్టుగా నాకు అనిపించసాగింది. నా ప్రపంచం నా కళ్ళెదుటే తిరిగిపోయి నా కథ తల్లక్రిందులై పోయింది.

ఒక వివేకపూరితమైన ఆలోచన అంతకుముందు నా శీలం మీద నాకే అనుమానం కలిగించింది.

దాన్ని నిర్థారిస్తూ, ఆదినారాయణగారు. . .

“అయ్యా చందూ! శ్రీహర్ష అని. . . బ్రతికుంటే నీ వయసువాడే ఒక తమ్ముడుండే వాడయ్యా ఈమెకి. మూడేళ్ళక్రితం ట్రైనాక్సిడెంట్ లో పోయాడు. అప్పట్నుంచీ ఆ వయసువాళ్ళెవరిని చూసినా నా తమ్ముడే ఈ రూపంలో వచ్చాడు అంటుంది. తొలిరోజు నిన్ను చూసినప్పుడే నువ్వు శ్రీహర్ష లానే వున్నావని నాతో అన్నది. దాని పిచ్చి. . .నువ్వు పట్టించుకోకేం?” అన్నారు.

నాకు తెలిసిపోయింది.

విద్యాధరి ‘నన్ను చూడగానే సొంత తమ్ముడిని చూసుకున్నట్టు ఒక అజ్ఞాత భావన పొందిందా? అయితే ఇంతకుముందు ఆమె మాటలన్నీ ఒక అక్క వంటి స్త్రీ తమ్ముడులాంటి పురుషుడితో మాట్లాడడానికి అవకాశమున్న మాటలా?’

నేను ఆలోచించాను. నిజమే! నెహ్రూ హెచ్చరిక తాలూకూ మూలకోణంలోంచి పరిశీలించకపోతే అవి నిజంగా పవిత్రమైన మాటలే! ఆలాంటప్పుడు నాలోని ఈ అసంబద్ధ శృంగార ప్రక్రియ అంతా యథార్థ్యాన్ని వక్రీకరించుకోవడం వల్ల జరిగిన అపార్థం!

గతం నాకు చిత్రంగా. . .చిత్రాతి చిత్రంగా తోచి, సిగ్గుగా, చిన్నతనంగా అనిపించసాగింది.

అయినా పిల్లల ప్రసక్తి రాగానే విద్యాధరి గుండె ఎందుకలా కొట్టుకుందో అప్పటికీ నా కర్థంగాలేదు!

* * * *
ఓ నాల్రోజుల తర్వాత, ఆదినారాయణగారు నాకు బయట వీధిలో మార్కెట్ దగ్గర కనిపించారు.

ఆయన చేతిలో ఏదో చిన్న ప్యాకెట్ వుంది. నన్ను చూడగానే ఆ ప్యాకెట్ నా చేతికిస్తూ. . .

“ఈ మందులు విద్యాధరి కివ్వు!” అన్నారు.

“మందులెవరికి?” అడిగాను దాన్ని తీసుకుంటూ.

“ఆమెకే.” అన్నారు.

“ఆమెకేమైంది?” భయంగా అడిగాను.

“ఏమీ కాలేదులే పిల్లల కోసం!” అన్నారు.

“అంటే?”

“గర్భసంచిలో ఏదో లోపం వుందట. పిల్లలు కలగకపోవచ్చునన్నారు డాక్టర్లు. తొంభై శాతం ఆశ లేదు. ఏదో మన ప్రయత్నం.” నవ్వేరు.

విద్యాధరికి పిల్లలు లేకపోవడమా? నా ప్రాణం చివుక్కుమంది.

“నీకు విద్యాధరి చెప్పలేదా?” అన్నారు మళ్ళీ ఆయనే.

“సందర్భం రాలేదు.” అన్నాను బాధతో.

“సరే. నువ్వెళ్లు! నేను నెహ్రూని చూసొస్తాను. అతడికేదో ఆక్సిడెంటయిందట! అన్నారు.

ఒక సందేహం తీర్చుకునేందుకు నాకు సమయం ఏర్పడింది.

“నెహ్రూ మంచివాడు కాదన్నారే విద్యాధరి గారు. . .” ఒకమాట చీకట్లోకి వదిలాను. ఆయన్ని గమనిస్తూ.

ఆయన వెళ్ళబోతూ ఆగారు.

“చూడు! అసలు తప్పుంతా ఈమెది! అతడిని అర్థంచేసుకోకుండా ఏదేదో మాట్లాడేది. అతడికేం తెలుసు? కుర్రవాడు! మరోలా భావించుకున్నాడు. ఓరోజు నేను ఇంట్లో లేనప్పుడు ఆమె చేయి పట్టుకున్నాడు. చెంప పగలేసింది! మరుసటిరోజు గది ఖాళీ చేశాడు. నువ్వేమయినా చెప్పు చందూ. విద్యాధరి పిచ్చిది. తన ధోరణి తనదేగానీ ఎవరితో ఎట్లా నడుచుకోవాలో ఆమెకి తెలీదు.” అన్నారు ఆవేదనగా.

“అటువంటివాడికి యాక్సిడెంటయితే మీరెళ్ళి చూడాలా?” అన్నాను.

“తప్పదుగదా. . .ఇది మానవజీవితం. ఇందులో విషాదం నీకు తెలీనిదేముంది. పైగా రచయితవి!” అన్నారు వేదాంతిలాగా.

అక్కడ్నుంచి నేను కదిలేను మౌనంగా.

మానవజీవితం విషాదకరమైందన్నారు ఆదినారాయణగారు. అది నిజం కావచ్చు. కాకపోనూ వచ్చు! దాని గురించి నేనిప్పుడు తర్కించడం లేదు. కానీ, ఒకటి వాస్తవం. మనిషి జీవితంలో విషాదమనేది కొంత వుంది. అది జగమెరిగిన సత్యం! అయితే ఎటొచ్చీ, “ఆ విషాదం విద్యాధరి జీవితాన్ని ఎందుకు తాకలేక పోయింద”నేది ప్రస్తుతం నా ప్రశ్న!

ఎందుకంటే సోదరుడి అకాల మరణం, పిల్లలు పుట్టకపోవడం. . .ఇవన్నీ ఆమె స్వయంకృతాలు కావు. కనుక నేను వాటిని విషాదాలుగా భావించలేను. మనిషి బతుకులో నా ప్రకారం రెండే విషాదాలు ఒకటి తనకు తానుగా చేసుకున్నవి. రెండవది ఒకేమాట రెండు విధాలుగా అర్థం కావడం. అంటే మంచిమాట కూడా చెడుగా అర్థంగావడం!

విద్యాధరి మామూలు స్త్రీ! కానీ అపూర్వమైనది! కొన్ని చిత్రమైన పరిస్థితుల మధ్య పెరిగింది. పాపపంకిలమైన మనిషి ఆలోచనలకి ఆమె సుదూరమైనది! రెండు మాటల ప్రపంచం ఆమెకి లేదు. ఉన్నదొకటే! అది. . .తను, భర్త. . .తన వెలితీ. . . అంతే! మరొకటి లేదు.

తప్పుచేయడంలోని ఆనందంకోసం ఆమె ప్రాకులాడదు. అందరూ తనలా పవిత్రంగానే వుంటారని ఆమె ఆశిస్తుంది. ప్రియుడనే పదం అసలామె నిఘంటువులో లేదు. ఒక స్వతస్సిద్ధమైన స్వాభావిక గమనంలో ఆమె తనని తాను వున్నది వున్నట్టుగా యథాతథంగా వ్యక్తీకరించుకుంటుంది. ఎదుటివారి పాపానికి, బాధలకి ఆమె ఎప్పుడూ బాధ్యత వహించదు. ఆ ప్రయత్నంలో ఆమె ప్రవర్తన ఉదాత్త మాధుర్యపూరితంగా శోభిల్లుతుంది. అదీ ఆమె జీవిత రహస్యం.

నాకు ఆశ్చర్యమనిపించింది.

నాలాగే నెహ్రూ ఆమె విషయంలో పప్పులో కాలేశాడు. చివరలో వాస్తవం జీర్ణించుకోలేక ఆమెపై ద్వేషం పెంచుకున్నాడు.

ఆరోజు ఆదినారాయణగారు మంచినీళ్ళకోసం లేవకపోయి వుండినా, నేను ప్రేమిస్తున్నానని చెప్పినప్పుడు మాటలోని అసలు అర్థాన్ని విద్యాధరి గ్రహించి వుండినా నా పరిస్థితీ అంతే!

ఎటొచ్చీ, నేను పట్టుబడని దొంగని!

ఏ కొందరు మహనీయులనో మినహాయిస్తే. . .

ఈ ప్రంపంచమూ అంతే!

( సమాప్తం )

Thursday, September 6, 2007

అమృతమూర్తి!..2 (సరసమైన కథ)

అమృతమూర్తి!

(‘స్వాతి’ సపరివార పత్రిక సంచిక 26.09.1997 లో ప్రచురితమైన సరసమైన కథ! ఆది నుండీ తుది దాకా ‘బిగి’ సడలక అలనాటి పాఠకుల మనసులు రంజింపజేసిందీ కథ!)

నా ఊహ నిజమైంది. ఒంటిమీద బట్టల్లేవన్న విషయం అప్పుడు గుర్తుకొచ్చింది!

చక చకా ఫ్యాంటు తీసి వేసేసుకుంటూ, “ఊర్నుండి ఈవేళే వచ్చారా?” అన్నాను.

“అవును. ఉదయం వచ్చేను. నువ్వు మొన్న చేరేవా?” అంది. ఎడమచేతికున్న గాజులన్నింటినీ ఒకే దగ్గరికి చేర్చుకుంటూ.
“అవును.” అన్నాను.

నన్నామె ఏకవచనంలో సంభోదించడం నాకు నచ్చలేదు. చిన్నతనంగా అనిపించింది.

ఆమె పొడవాటి జడని ముందుకేసుకుని లాగింది. “నువ్వు ఉద్యోగం చేస్తావా?” అంది.

“లేదు. కథలు రాస్తాను.” అన్నాను ఆమెని గమనిస్తూ.

“అబ్బో! రచయితన్నమాట.” గుండెలమీద చేతులేసుకుని ఆశ్చర్యం ప్రదర్శించింది.

ఆ తర్వాత, “భోజనం వండుకోవా?” అంది. నా గదిలో వంట సామాన్లు లేకపోవడం గమనించి.

“లేదు. హోటల్లో తింటాను.” అన్నాను.

నెహ్రూ మాటల్ని బట్టి నేను ఊహించుకున్నదాని కంటే నిజంగా ఆమె చాలా అందగత్తె! పొడవుగా వుంటుంది. ఆ పొడవుకి తగ్గ సొంపు గల శరీరం. నెమ్మదిగా భావ ప్రకటన చేస్తూ మాట్లాడుతుంది.

విశ్వ సరోవరాల్ని పోలినట్టు కళ్ళు సజలంగా, స్వచ్ఛంగా వుంటాయి. చక్కదనంతో ముక్కు మిగిలిన అవయవాలన్నిటినీ అపహాస్యం చేస్తుంది. నిశీథిలోని నల్లదనంతోనూ, ఇంద్రచాపంలోని ఆకృతితోనూ ఒప్పందం కుదుర్చుకుని ఆమె కనుబొమలు ధన్యత చెందాయి. ఆదినారాయణ గారు అసలామెకి ఈడైన వ్యక్తి కాదు.

ఆమె విషయంలో జాగ్రత్తగా వుండమన్నాడు నెహ్రూ. అంతటి అందాలరాశి మనసు పడ్డప్పుడు మగవాడు ఆ సౌందర్యం తనివితీరా అనుభవించి, అమరత్వం చెందాలిగానీ. . .జాగ్రత్త పడటమెందుకో నాకు అర్థం కాలేదు. అట్లా జాగ్రత్త పడినవాడు సౌందర్యం పట్ల చూపులేనివాడైనా అయివుండాలి. లేదా ఋషిపుంగవుడైనా కావాలి.

“ఏమిటి ఆలోచిస్తున్నావు చందూ. నా గురించా?” అంది విద్యాధరి.

ఉలిక్కిపడి, ఈలోకం లోకి వచ్చాను.

“లేదు. వేరే కథల గురించి ఆలోచిస్తున్నాను.” అన్నా. అట్లా అబద్దాలాడడం నాకేం కొత్తగాదు.

“సర్లే! నిన్ను చందూ అని పిలవొచ్చా?” అడిగింది.

ఒకటికి రెండు సార్లు పిలిచేసి, మళ్ళీ పిలవొచ్చా అంటూ పర్మిషన్ అడిగితే నేనేమనగలను?

“పిలవండి.” అన్నాను నవ్వుతూ.

ఆమె నవ్వింది. “నా పేరు తెలుసా?” అంది.

“విద్యాధరి గారు.” అన్నాను.

“ఫర్లేదే!” అని, “నా పేరు నీకెవరు చెప్పారు?” అడిగింది వెంటనే.

“ఎవరో అంటుంటే విన్నాను.” అన్నాను. నెహ్రూని గుర్తుకు తెచ్చుకుంటూ.

“సర్లే. నేను మళ్ళీ వస్తాను. ఆయన్ని కాలేజీకి పంపించాలి.” అంటూ ఆమె కదిలింది.

కదిలి వెళ్ళబోతున్నదల్లా మళ్ళీ వెనక్కి తిరిగి “నువ్వు నాకు నచ్చేవు ప్రేమచందూ!” అనేసి, మెరుపులా కదిలి వెళ్ళిపోయింది.

నా గుండెలదిరాయి! నేను స్తంభించిపోయాను. నెహ్రూ మాటల్ని బట్టి ఆమెది వేగపూరితమైన మనస్తత్వమయివుంటుందని నేను ఊహించకపోలేదు. కానీ మరీ ఇంతటి వేగాన్ని నేను ఊహించలేను. . .కనీసం కథల్లోనైనా.

నేనామెకి నచ్చడం నాకు నాకు గర్వంగా తోచింది. స్త్రీకి నచ్చడం కన్నా పురుషుడు తనని తాను అభివ్యక్తం చేసుకునే మాట ఈ సృష్టిలో మరొకటి వుండదనుకుంటా!

అయితే. . .విద్యాధరికి నేను నచ్చడం ఏ విధంగానో?
* * * *

విద్యాధరి మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళినప్పటికీ నాకెందుకో ఆ రోజుకి ఇక ఆమె రాదని అనిపించసాగింది. నా అంచనా ప్రకారమే ఆరోజు మళ్ళీ ఆమె రాలేదు. మరుసటిరోజు వచ్చింది. వచ్చీరాగానే వాకిట్లో నిలబడకుండా నేరుగా గదిలోకి ప్రవేశించింది. చాపమీద కూర్చుంది. మోకాళ్ళు ముడుచుకుంది. తలస్నానం చేసి ఎరుపు నలుపు రంగుల సంకీర్ణ వర్ణపు చీర కట్టుకుంది.

“ఆదినారాయణగారు కాలేజీకి వెళ్ళారా?” అన్నాను.

“వెళ్ళేరు. ఏం?” అంది. తలస్నానం చేసి ముడిపెట్టుకున్న జడని విప్పుకుని విదలగొట్టింది.

“ఊరికే అడిగాను.” అన్నా. . .ఏం చెప్పాలో తోచక. ఆమె ఎందుకో నవ్వుకుంది.

నాకు సిగరెట్ కాల్చుకోవాలన్న కోరిక కలిగింది. ఆమె ముందు కాల్చడానికి భయంగా అనిపించింది. అయినా ధైర్యం చేసి సిగరెట్టు తీసి, వెలిగించుకున్నా.

విద్యాధరి ఆశ్చర్యపడింది.

“నువ్వు సిగరెట్లు కాలుస్తావా?” అంది.

నాకు సిగ్గేసింది. అవునన్నట్టు తలూపాను.

“నాకు సిగరెట్లు కాల్చే మగవాళ్ళంటే ఇష్టం. ఆయన కాల్చరు.” అంది నిరాసక్తంగా.

నేను మాట్లాడలేదు. చూస్తున్నాను. ఏ భావం పలకాల్సి వచ్చినప్పుడు ఆ భావానికనుగుణంగా ఆమె ముఖంలోని కండరాలు, చర్మం వంపులు తిరుగుతాయి. తలను ఆర్పుకుంటున్నప్పుడు ఆ శరీరం ఆమె కదిలికలకి అనుగుణంగా వింత విన్యాసం చేస్తుంది. వక్షోజాలు నిండుగా, బరువుగా వూగుతాయి. సృష్టి సౌందర్యాన్ని కండరాలుగా మార్చుకున్న ఆ నడుము. . .కడుపు దగ్గర అందంగా నులుముకుని మడతలు పెట్టుకుంటుంది. నాకామె అభినయం చిత్రంగా వుంది!

“ఇంతకీ నేన్నీకు నచ్చానా?” అడిగింది విద్యాధరి. . .జారిన పైటని పైకి ఎగదోసుకుంటూ.

నాకు నవ్వొచ్చింది.

నచ్చి. . .మెప్పించి. . .సౌందర్య వశీకరణంతో నన్ను మోసపుచ్చి. . .నన్ను నేనే విస్మరించేట్టు ఒక మాయా ప్రపంచంలోకి గిరవాటు వేసిన స్త్రీ. . .ఇప్పుడా ప్రశ్నించడం?

“నేను నచ్చానా?” అంటూ.

నేను సమాధానం యివ్వలేదు. నవ్వాను.

ఆ నవ్వే ఆమెకి అంగీకారం!

“ఆమె కూడా అదోలా నవ్వింది. క్షణం తర్వాత, నువ్వు ఎలాంటికథలు రాస్తావు?” అంది.

“మీరు సాహిత్యం చదువుతారా?” అన్నాను.

“నాకలవాటు లేదు.”

నాకు బాధేసింది. నా వ్యక్తిత్వం ఆమె ముందు బయల్పరచుకునే అవకాశం ఒకటి జారిపోయింది.
“నువ్వు శృంగార కథలు వంటివి కూడా రాస్తావా?” కళ్లు చిత్రంగా ఆడించింది.

“రాస్తాను!” అన్నా.

“ఘటికుడివే!” అంది ఓరగా చూస్తూ.

“ఇందులో ఘటికత్వం ఏముంది? వాస్తవం చెప్పాను. ఏం అవి రాసేంత వయసు నాకు లేదా?” అన్నాను.

“సర్లే! తమాషాకన్నాను. పోనిద్దూ. అని, అయితే ఎప్పుడూ నువ్వింట్లోనే వుంటావుగా. అయితే రోజూ నాకు తోడుగా వుంటావన్న మాట!” అంది ఓరకంట జూసి, వయ్యారంగా జడని అల్లుకుంటూ.

నా గుండె ఝల్లుమంది! స్త్రీలతో యిటువంటి విషయాలు మాట్లాడడం నాకు చేతగాదు.

“ఉంటాను.” అన్నాను బలవంతంగా.

“ఆయన ఎప్పుడూ ఇంట్లో వుండడు. ఉన్నా నన్ను పట్టించుకోడు. ఇంతకుముందు నాకు నెహ్రూ తోడుగా వుండేవాడు తెలుసా?”. అంది.

నెహ్రూ అంటే?” అడిగాను ఎరగనట్టు.

“నీకు ముందు ఈ రూమ్ లో వుండేవాడులే. పాపం పిచ్చివాడు!” అంది.

“మంచివాడేనా?” అమెని జాగ్రత్తగా గమనించాను.

క్షణంసేపు ఆలోచించి, “మంచివాడేలే. ఏం?” అంది.

ఏమనాలో నా కర్థంగాలేదు. “మరి పిచ్చివాడన్నారుగా!” అన్నాను నవ్వుతూ తెలివిగా.

ఆమె నవ్వింది. నీ మాటల్లో మైమరచి కూర్చుంటే ఆయనకి పాపం రాత్రికి భోజనం వుండదు. అంటూ వెళ్ళడానికన్నట్టు లేచింది.

విద్యాధరి మాట్లాడింది యింతకీ ఏ భోజనం గురించో. . .!!!?

* * * *

వారం గడిచింది! విద్యాధరి నా గదికి రావడం, పోవడం మామూలై పోయింది. ఆ ద్వంద్వార్థపు మాటలు కూడా ఎక్కువైనాయి. ఆ మాటల మధ్యన నేను ఉక్కిరిబిక్కిరయి మనస్థిమితం కోల్పోయాను. కథలు రాయడం మానేశాను. విద్యాధరే నా కథను తిరగరాస్తుందేమోననిపించ సాగింది.

ఆరోజు నా పుట్టినరోజు! ఆ విషయం తెలిసిన నా సాహితీ అభిమాని ఓ అమ్మాయి నన్ను పలకరించడానికి నా గదికి వచ్చింది. కొంతసేపు మాట్లాడాక నాకు ‘శుభాకాంక్షలు’ తెలియజేసి ఆమె వెళ్లిపోయింది.

ఆ తర్వాత కొంతసేపటికి విద్యాధరి వచ్చింది. నా కోసం ప్రత్యేకంగా పాయసం వండి తెచ్చింది!

నేనారోజు రోజా రంగు పూతల షర్టు వేసుకుని, బ్లాక్ కలర్ ఫ్యాంట్ లోకి టక్ చేసుకున్నాను.

“అబ్బ! చందూ నువ్వీ రోజు ఎంత బాగున్నావో తెలుసా?” అంది విద్యాధరి వచ్చీరాగానే.

“ఎంత బాగున్నాను?”

“ఎంతా. . .? మూద్దొచ్చేసినంత!” అంది.

“పెట్టుకో మరి!” అన్నాను ధైర్యంచేసి. ఈ వారంరోజుల్లో నేనూ ఏకవచనంలోకి దిగిపోయాను.

“సర్లే నోరుముయ్.” చిరుకోపంగా అని. . .”ఎవరా అమ్మాయి?” కుతూహలంగా అడిగింది. పాయసం గిన్నె నాకు అందిస్తూ.

“నా అభిమాని.”

“చాలా బావుంది కదూ?” అంది.

“అవును.” అన్నాను గర్వంగా.

“నాకంటే బావుందా?” వెంటనే అడిగింది. గర్వంతో ఆమె ముఖం వెలిగింది.

“అదెట్లా చెప్పగలం? ఎవరి ప్రత్యేకత వారిది.” ఆమెని ఏడిపించాలనేది నా లక్ష్యమే అయినప్పుటికీ, ఆ మాట వాస్తవం!

నా మాటలు విని ఆమె హతాశురాలైంది.

ఆ తర్వాత, “నిజమేననుకో” అని, పైటని భుజంమీదుగా తీసుకుని బొడ్లో దోపుకుంటూ, “అయినా చెప్పుకోవాల్సివచ్చినప్పుడు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువగా చెప్పుకుంటాంగదా!” అంది.

‘నువ్వే విద్యాధరీ. . .నువ్వే. . .నువ్వే అందగత్తెవు. . .నువ్వే రూపసివి. . .నువ్వే చ. . .క్క. . .టి దానవు. నువ్వే. . నువ్వే. . నువ్వే. . .’నా హృదయం అంతరంలో ప్రతిధ్వనించింది. కానీ, దాన్ని నేను బయటికి రానీయలేదు.

“ఎవరి విశిష్టత వారిదని చెప్పుకున్నప్పుడు మళ్ళీ ఎక్కువ తక్కువలనే ప్రసక్తే లేదు గదా!” అన్నాను. నవ్వును బలవంతంగా ఆపుకుంటూ.

“పోనీలేబ్బా. నీవన్నీ పెద్ద మేధావి మాటలు” అంది విసుగ్గా ముఖం పెడుతూ.

నాకు నవ్వాగలేదు.

“అయినా నీకెందుకీ అందాల బాధ?” నవ్వాను.

ఆమె ముఖం మాడ్చుకుంది. క్షణం తర్వాత, “నా బాధలన్నీ నీకేం తెలుస్తవిలే. పెళ్ళి కానివాడివి.” అంది మరో ప్రపంచంలోకెళ్ళినట్టు విషాదంగా.

“అదేమిటో నేను తెలుగుకోకూడదా?” అన్నాను.

“తెలుసుకుని ఏంజేస్తావు. నాకోరిక తీర్చగలవా? నన్ను తృప్తి పరచ గలవా?” అడిగింది.

“తీర్చగలను!” దృఢంగా అన్నాను.

( సశేషం )