ఒకానొక అజ్ఞానపు క్షణంలో. . . నాకు తెలీకుండా నేనే జన్మించి,  అమ్మ చనుబాలలో ఆది సంవేదన అనుభవించి. . .ఆటపాటలలో అద్వితీయుడనై రాణించి. . .సంఘ విద్యా సముపార్జనలో సారస్వత చక్రవర్తినై, పుస్తకాల్ని పఠించి. . .పరీక్షల్ని పరివీక్షించి. . .ఆత్మజ్ఞాన అవలోకనంలో విలువల వలువలు వూడదీసి. . .విశ్వతత్వాలు స్మరించి. . . మానవ శ్రేయస్సు మహా లక్ష్యమై పోగా. ."ఈ ప్రపంచపు దొడ్డబిడ్డగా ఉద్భవించాల"నీ, "ఒక పూర్తి మానవుడిగా పరిణమించాల"నీ, నేను కంటున్న కల,  కడుతున్న కోట. . .ఒహ్ ఇంతెందుకు కనుచూపు మేరలో. . . నా జీవితం ఒక వేద సంకలనం!!  నేనొక ఈశ్వరుడిని!!! ( ఇది ఈ బ్లాగులోని ప్రసంగి కథలో ఒక పాత్ర మనోభావాలు __ రచయిత )

Friday, August 31, 2007

రాయస్థాపనాచార్య!.. 2 (కథ)

రాయస్థాపనాచార్య!

(‘స్వాతి’ సపరివార పత్రిక సంచిక 11.07.2003 లో ప్రచురితమైన చారిత్రాత్మక కథ! పాఠకుల మనసులు కలచివేస్తూ, మానవ విలువల్ని సునిశితంగా ప్రశ్నించే కథ యిది! "తెలుగు అకాడమీ" వారెవరైనా దీన్ని 6వ తరగతి నుండి 10వ తరగతి వరకూ తెలుగు పాఠ్యాంశంగా మార్చడానికి ప్రయత్నించగలరని ప్రార్థన!)


‘వెళ్ళార’న్నట్టు తలూపింది వెంగమాంబ.

“వెళ్ళమ్మా వెంగమాంబా! గుండయ బాగా అలిసిపోయి వచ్చాడు. కాళ్లకి నీళ్ళిచ్చి లోపలిగదిలోకి తీసుకు వెళ్ళు! అన్ని శుభవార్తలూ ఏకాంతంలో నీ నోటితోనే విన్పించు!” అంది పుండరీయమ్మ.

“ఏందమ్మా ఈ హడావిడంతా? ఏమైంది?” గొంతు పూడుకుపోతుండగా, తల్లిని అడగలేక అడిగాడు గుండయనాయకుడు.

“అన్నీ చెపుతుందిలే నీ భార్య. ముందు లోపలికి వెళ్లు నాయనా!” అంది. . .ముంచుకొచ్చిన ముప్పు గురించి తెలీని ఆ వృద్దురాలెంతో సంతోషంగా.

గుండయ తల్లివైపు చూశాడు. ఆమె ముఖం ఆనందంతో వెలిగిపోతోంది. అతడికి జాలేసింది. “ఇంకెంతసేపమ్మా! ఈ వెర్రి సంబరం?” అనుకున్నాడు. దుఃఖం ముంచుకొచ్చింది. మౌనంగా లోపలికి నడిచాడు.

లోపలి గదిలోకి వెళ్ళగానే గది తలుపులు మూసి లోన గడియపెట్టి, భర్త పాదాలకి వినయంగా నమస్కరించింది వెంగమాంబ.

“ఏమిటిది వెంగమాంబా ఏమయింది?” ఆమె భూజాలు పట్టిలేపి, తన గుండెలకి హత్తుకుంటూ అడిగాడు గుండయనాయకుడు. వెంగమాంబ కళ్ళలో ఆనందబాష్పాలు ఉబికాయి. “అయ్యా! నా పూజ ఫలించింది. మన కల పండింది!” అంది.

గుండయనాయకుడు మాట్లడలేదు.

“సోమనాథ సేనాని కుమారుడు నాగదేవుడు మన అమ్మాయిని పెళ్ళాడడానికి అంగీకరించాడట. ఆ సంగతి సోమనాథ సేనాని కబురు పంపించాడు.” అంది.

మరో సమయంలోనైతే ఆమాటకి గుండయ ఎగిరి గంతేసేవాడు. ప్రాణాలే అనిశ్చితమైన ఆ విపత్కర సమయంలో ఏం సంతోషించగలడు. అందుకే మౌనంగా వుండిపోయాడు. అదేమీ పట్టించుకోని వెంగమాంబ కొనసాగించింది.

“అయ్యా! నిన్న అన్నీ శుభవార్తలే! మన పిల్లవాడు తిమ్మయ నిన్న వాళ్ల పాఠశాలలో కర్నాట రాజాస్థాన తెలుగు పండితులు నిర్వహించిన పద్య పోటీలో నూటపదహారు వరహాల బహుమతిని అందుకున్నాడు.” అంది.

కుమారుడి గొప్పదనం వినగానే గుండయనాయకుడి కళ్లు మెరిశాయి. “నిజమా!” అన్నాడు.

‘నిజమే’నన్నట్టు తలూపి, “వీటన్నిటికన్నా మంచివార్త మరొకటి వుంది!” అందామె సిగ్గుపడుతూ.

“ఏమిటది?” నిర్లిప్తంగా అడిగాడు గుండయ.

వెంగమాంబ అతడి చేయి పట్టుకుని, తీసుకువెళ్ళి మంచం మీద కూర్చోబెట్టింది. పక్కనే తనూ కూర్చుంటూ ముఖాన్ని అతడి గుండెలపై ఆనించి, తరువాత అంది. “అయ్యా! ఇన్నాళ్ళ మీ కోరిక తీరింది. మనకి మరో బిడ్డ పుట్టబోతున్నాడు. నాకిప్పుడు మూడవనెల!”

గుండయనాయకుడు నిరుత్తరుడయ్యాడు.
ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. ‘నిజమా’ అన్నట్టు ఆప్యాయంగా కళ్ళలోకి చూశాడు.

“నిన్న వాంతులు అవుతుంటే అనుమానం కలిగి వైద్యుడిని పిలిపించాను. వచ్చి పరీక్షించి చూసి గర్భమని అన్నాడు.” అందామె.

అది విని గుండయనాయకుడు భార్య ముఖాన్ని ప్రియమార తన గుండెలకి అదుముకున్నాడు.

‘మనసు నిండేట్టు ఎన్ని మాటలు చెప్పినావే వెంగమాంబా. అన్నీ మంచిమాటలే! కానీ నీకు నేనేమని చెప్పను? ఒక్కమాటలో మన కుటుంబ ఇహలోక నిష్క్రమణ వార్త చెప్పి, మీ మాటలకి విలువ లేకుండా చేయనా? నిజానికి సహధర్మచారిణికి చెప్పి తీరాలి! కానీ, నేను చెప్పలేను. చెప్పి ఏడ్పించలేను.’ అతడి కళ్లు నీటిని వర్షించి వెంగమాంబ వీపుభాగం తడిసిపోసాగింది. మళ్ళీ వెంగమాంబకి ఎక్కడ అనుమానం కలుగుతుందోనని. . .

“ఆనందంతో మనసు పొంగిందే! ఆనందాశ్రువులు చూడు!” అంటూ లేచి కన్నీటిని తుడుచుకున్నాడు.

గంగవెర్రులెత్తే ఆనందంలో వెలిగిపోతున్న భార్య ముఖాన్ని చూసి దిండులో తలదాచుకుని వెక్కి వెక్కి. . . వెక్కి వెక్కి ఏడ్చాడు గుండయనాయకుడు.

* * * *

“నాయనగారూ! ఆశీర్వదించండి!” పదకొండేళ్ళ తిమ్మయ గుండయనాయకుడి పాదాలకి ప్రణమిల్లాడు.

ఏమని ఆశీర్వదించగలడు గుండయసేనాని? ‘దీర్ఘాయుష్యమస్తుః అనగలడా.’ “లే నాయనా లే!” విషాదంతో గుండెలు పగిలిపోతుండగా కొడుకుని లేవనెత్తాడు. ప్రియమారా గట్టిగా కౌగలించుకున్నాడు.

“నాయనగారూ! నా పద్యానికి రాజపండితులు గురుకులంలో నూట పదహార్లు బహుకరించారు. ఏదైనా మంచి కావ్యం రచించమని సూచించారు.” అన్నాడు తిమ్మయ.

“ఏం పద్యం రాశావు నాయనా?” అన్నాడు గుండయ.

తిమ్మయ హుషారుగా లోపలి గదిలోకి వెళ్ళి, ఒక లేఖ పట్టుకుని వచ్చాడు. దాన్ని తండ్రి చేతికిస్తూ, “ఈ లేఖని మా గురువర్యులు స్వయంగా మీకివ్వమన్నారు. అందులోనే నేను రాసిన పద్యం కూడా రాశారు!” అన్నాడు.

లేఖనందుకుని విప్పి, గుండయ చదువసాగాడు.

“మహారాజ రాజమార్తాండ కాకతీయ సామ్రాజ్య ఆస్థాన సేనా నాయకులు శ్రీ శ్రీ శ్రీ గుండయనాయకుల వారికి రత్నగిరి గురుకుల ఆచార్యులు విప్రజ్యోతిర్మయుల వారు చేయు ప్రణామములు!

అయ్యా, తమ కుమారుడు చిరంజీవి తిమ్మయ విద్యాభ్యాసం ఎంతో సంతృప్తికరంగా వుంది. ప్రత్యేకించి తిమ్మయ కుమారుడిలోని కావ్య కౌశలం అమోఘమైనది. పసితనంలోనే అది కర్నాటరాజ్యం వరకూ వ్వాపించి, పరిఢవిల్లిందని చెప్పడానికి సంతోషిస్తున్నాము. అదేమిటనగా. . .నిన్న కర్నాటదేశ రాజాస్థాన పండితులు మన గురుకులానికి వేంచేసి, ఇక్కడ విద్యాభ్యాసం చేస్తున్న పిల్లలలోని కవితా పాటవాన్ని పరిశీలించారు. అందుకుగాను పద్యరచనా పోటీని నిర్వహించినారు.

ఆ సందర్భంగా, తిమ్మయ కుమారుడు ప్రదర్శించిన ప్రతిభా పాటవాలు చూసి అచ్చెరువు చెందారు! నివ్వెరపోయారు! వారు తిమ్మయ రాసిన పద్యాన్నిగాక పద్యభావాన్ని గ్రహించి, విస్మయం చెందారు. తిమ్మయకి విద్యాబుద్దులు గఱిపి, ఆ స్థాయికి తెచ్చిన గురువుగా నన్ను ఆభినందించినారు. నాకు కూడా నూట పదహార్లు బహుకరించారు. అయ్యా! కర్నాట రాజ పండితుల చేత గౌరవించబడిన అప్పటి నా ఆనందం వెలకట్టలేనిది. తిమ్మయ వంటి బాలుడిని శిష్యుడిగా పొందిన నేను ధన్యుడిని! జన్మనిచ్చిన తమరు మరింతగా ధన్యతములు!!

దయవుంచి తిమ్మయ నాయకుని ప్రోత్సహించండి! ఆ చిరంజీవికి ఉజ్వలమైన భవిష్యత్తు వుంది. తిమ్మయ రాసిన పద్యం క్రింద వ్రాస్తున్నాను!

‘త్యాగభావమనిన త్యజిత స్వార్థముగాదు
త్యాగపరుని యందు తన స్యార్థతమమె మెండు!
లోక ప్రశంశలకె లోనాత్మ ప్రశంశకే
త్యాగధనుడెపుండు తెగనంగలార్చుచుండు!!’

‘భావం :
త్యాగ భావనలో స్వార్థం వదులుకోవడమనేది లేదు. త్యాగపరునిలో తన గురించిన స్వార్థమే ఎక్కువ. లోకం మెచ్చుకోలు కోసం, తనలోని అహాన్ని సంతృప్తి పరుచుకోడానికి త్యాగి ఎప్పుడూ వెంపర్లాడుతుంటాడు.’

చూడండి తిమ్మయ ఎంత లోతుగా ఆలోచించి ఎంత గొప్పగా వ్రాసినాడో. రేపు ఏకాదశినాడు తమర్ని కలిసి, తమ దర్శనం చేసుకోగలను!

చిత్తగించవలయును!
ఇట్లు. . .
ఆచార్య విప్రజ్యోతిర్మయుడు”

గుండయనాయకుడు చదవడం ముగించాడు. తిమ్మయను మరొక్కసారి ఆప్యాయంగా గుండెలకి హత్తుకున్నాడు. పెద్దగా రోదించినట్టుగా ఏడ్చాడు.

“త్యాగం గురించి ఎంత చక్కగా వివరించావు నాయనా తిమ్మయా! ఇంతకాలం నేనో పెద్ద త్యాగమూర్తినని విర్రవీగాను. మిడిసిపడ్డాను. నాకన్నా స్వార్థపరుడులేడని పసినాటనే పద్యం రాసి కనువిప్పు కలిగించావు. నీకు నేనే విధంగా భవిష్యత్తు కల్పించగలనురా తండ్రీ.!” గుండయనాయకుడు కొడుకుని పట్టుకుని వదలలేక రోదిస్తూనే వున్నాడు.

అక్కడే నిలబడి ఆదృశ్యమంతటినీ చూస్తున్న అతడి తల్లి పుండరీయమ్మ, ఇల్లాలు వెంగమాంబ, పద్దెనిమిదేళ్ళ కూతురు గోపికాపూర్ణిమ అందరూ అవన్నీ గుండయనాయకుడి ఆనందభాష్పాలనుకున్నారు.

వాళ్ళ కళ్ళల్లో కూడా ఆనందభాష్పాలు మెరిశాయి.

* * * *
ఆరోజు మధ్యాహ్నం గుండయనాయకుడు కుమార్తె గోపికాపూర్ణిమ గదిలోకి నడిచాడు. ఆ సమయానికి గోపికాపూర్ణిమ పట్టు పరుపు మీద పవళించి, ఏదో లేఖ చదువుకుంటోంది. తండ్రి రాకని గమనించి మంచంమీంచి లేచింది. లేఖని పరుపు క్రింద దాచింది.

(సశేషం)

Thursday, August 30, 2007

రాయస్థాపనాచార్య!.. 1 (కథ)

రాయస్థాపనాచార్య!

(‘స్వాతి’ సపరివార పత్రిక సంచిక 11.07.2003 లో ప్రచురితమైన చారిత్రాత్మక కథ! పాఠకుల మనసులు కలచివేస్తూ, మానవ విలువల్ని సునిశితంగా ప్రశ్నించే కథ యిది!)

కాలం : క్రీ.శ. 1271. కాకతీయుల నాటి కాలం!
స్థలం -: ఓరుగల్లు! సమయం వేకువవేళ!

అక్కడ కోటలో ఒక రహస్య సమావేశం జరుగుతున్నది. సమావేశమందిరంలో ఒక ఉన్నతాసనం పైన రాణీ రుద్రమదేవి ఆసీనురాలై వుంది. ఆమె ఎదురుగా సేనానాయకులు ప్రసాదిత్యుడు, అంబదేవులు, గంగయసాహిణి, గోనగన్నయ, కన్నర, త్రిపురారి, జన్నిగ, మాదయ నాయకులు ఆసీనులయి వున్నారు. వారికి ఒక ప్రక్కగా గుండయనాయకుడు కూర్చుని వున్నాడు.

రుద్రమదేవి గొంతు సవరించుకుంది. గుండయనాయకుడిని చూసింది. మధుర గంభీర స్వరంతో, “గుండయ నాయకా! ఓరుగల్లుకి ప్రమాదం వాటిల్లింది. ఓరుగల్లు కోటపై దేవగిరి యాదవుల దాడి ప్రారంభమయింది. యాదవ మహదేవరాజు దురాక్రమణ ప్రయత్నాలు ప్రారంభించాడు. అందులో భాగంగా మొదట సైన్యాన్ని రత్నగిరి తరలించాడు. రత్నగిరిలోని రహస్య ప్రదేశాల్లో సైన్యం మొహరించివుంది. ప్రస్తుతం రత్నగిరి యాదవరాజు ఆధీనంలో వుంది.” అంది.

‘సైన్యం రత్నగిరిని ఆక్రమించుకుంద’న్న మాట వినగానే ఉలిక్కిపడ్డాడు గుండయనాయకుడు. ఎందుకంటే ఆయన ఇల్లూ, కుటుంబం రత్నగిరిలో వున్నాయి.

సన్నగా వణుకుతున్న స్వరంతో, “ఎప్పుడు జరిగింది మహారాణీ ఈ ఆక్రమణ?” అని అన్నాడు.

“రాత్రి” అని, “గుండయనాయకా! మీరు రాయస్థాపనాచార్య బిరుదాంకితులు. ఈ ఆపద సమయంలో ఆత్మస్థైర్యం వహించాలి.” అంది రుద్రమదేవి. మళ్ళీ తనే. . “గుండయనాయకా! రత్నగిరి కొండపై మొత్తం నాలుగైదు వందల కుటుంబాలు మాత్రమే వున్నాయి. మహదేవరాజు సైన్యాన్ని తిప్పికొట్టడం లేదా నాశనం చేయడం మనకో లెక్కలోది కాదు. ఎందుకంటే నాలుగడుగుల వ్యాసార్థం గల పెద్ద ఫిరంగి రత్నగిరి ముఖద్వారానికి గురిపెట్టబడి వుంది. మూడడుగుల ఫిరంగులు పది రత్నగిరిలోని అన్ని ప్రముఖ ప్రాంతాలకీ గురిపెట్టి వున్నాయి.”

“ఇంకా అసంఖ్యాకమైన పదాతిదళాలు క్షణంలో రత్నగిరి లోని సైన్యాన్ని తుడిచిపెట్టగలవు. అయితే, రత్నగిరిలో నివసించే నాలుగైదువందల కుటుంబాలూ ప్రమాదానికి గురవుతాయి. అదీ నిజానికి మనకి సమస్య కాదు. ఎందుకంటే లక్షల కుటుంబాల్ని కాపాడుకోడం కోసం ఓ అయిదొందల కుటుంబాలు వదలుకోవడం తప్పనిసరైతే వాటిని నిర్థాక్షిణ్యంగా వదులుకోవడం రాజనీతి!”

“ఎటొచ్చీ, అసలు సమస్య మీ కుటుంబం గూర్చి! మీ కుటుంబం రత్నగిరిలో చిక్కుకునిపోయింది. తప్పించడానికి వీలులేదు. సైన్యం మీ యింటిమీద నిఘా వేసివుంది. తప్పించడానికి ప్రయత్నిస్తే వాళ్ళు రత్నగిరిని ఆక్రమించిన విషయం మనకి తెలిసిపోయిందని భయపడి వెంటనే ఓరుగల్లు కోటపై దాడికి దిగుతారు.” చెప్పి, శ్వాస తీసుకోవడం కోసమని ఆగింది రుద్రమదేవి.

“అయ్యా! గుండయనాయకా! మా దాయాదులు హరిహర, మురారిదేవులు నాపై తిరుగుబాటు చేసినప్పుడు మీరు నా తండ్రివలె అనుక్షణం నా వెంటవుండి కాపాడినారు. దేశంలోని అంతః కలహాల్ని సమర్థవంతంగా అణిచి వేశారు. అటువంటి ప్రశస్తమయిన సేవాతత్పరత గల్గిన నాయకులు మీరు. మీ కుటుంబం శత్రుబారిన పడటం, అదీ కేవలం మన ఫిరంగుల కారణంగానే చనిపోవలసిరావడం ఎంతో దురదృష్టకరం. దేశ ప్రజలకీ, అంతకన్నా ముఖ్యంగా నాకు చాలా బాధాకరం!” రుద్రమదేవి నేత్రాల్లో కన్నీరు చిప్పిల్లాయి. కంఠం పూడుకుపోయింది.

“ఇంతకీ నేను చెప్పొచ్చేదేమిటంటే. . . మీరు తక్షణం ఇక్కడ్నుంచి ఒంటరిగానే రత్నగిరికి వెళ్ళండి. కడసారి చూపులుగా ఈ పగలంతా మీ కుటుంబ సభ్యుల మధ్య గడపండి. రాత్రిలోపు మీరు కుటుంబాన్ని వీడి రాలేకపోయారంటే రేపు సరిగ్గా వేకువ చుక్కపొడిచే సమయానికి మీరు ఫిరంగులకి ఆహుతైపోక తప్పదు!” రుద్రమదేవి దుఃఖోద్వేగంతో పెదవి విప్పి మాట్లాడలేక పోయింది. కొంతసేపటికి ఎలాగో ఆ దుఃఖం నుండి తేరుకుని, “వెళ్ళండి! సేనానాయకా! తక్షణం వెళ్ళండి. వెళ్ళి మీ కుటుంబాన్ని కలవండి. మీరు రావాలనే ఆశిస్తాను.” అంది.

గుండయనాయకుడికి విషయం అర్థమైపోయింది. ఇక తను చేయాల్సిందేగానీ చెప్పాల్సిందేమీలేదు. అసనంలోంచి లేచాడు. అక్కడున్న వారందరికి చేతులు జోడించి నమస్కరించాడు. రుద్రమదేవి వైపు చూశాడు.

“అమ్మా రుద్రాంబా! దురదృష్టవంతుడిని. దేశ రక్షణలో పాలుపంచకోవలసిన విపత్కర సమయాన కుటుంబంకోసం వెళ్ళవలసి వచ్చింది. వెళతాను. రాగలిగితే రాత్రిలోపు తిరిగి వస్తాను. లేదంటే ఆగిపోతాను. కానీ మీరు మాత్రం మా గురించి ఆలోచిస్తూ వేకువ వేళకి విధ్వంసం చేయడం ఆపవద్దు. ఆపినారా రేపు సాయంత్రానికి యాదవ మహదేవరాజు దాడి ప్రారంభిస్తాడు. ఓరుగల్లు కోట వాళ్ళ వశమవుతుంది. ఆ దుర్మార్గుడి పాలనలో ప్రజలు పురిటి మంచం పన్నులతో సహా కట్టలేక కష్టాలపాలు కావలసివస్తుంది.” చెప్పి, రుద్రమదేవికి నమస్కరించి గుండయనాయకుడు కదిలాడు.

దేశ సంరక్షణ కోసం కుటుంబాన్ని త్యాగం చేసి, కదిలి వెళ్తున్న ఆ సేనా నాయకుడుని చూసి మిగిలిన నాయకులంతా కన్నీరు పెట్టారు. వీడ్కోలు చెప్పారు.

“గుండయనాయకా!” వెళ్తున్న గుండయనాయకుడిని రుద్రమదేవి పిలిచింది. వెళ్తున్నవాడు ఆగి, చటుక్కున వెనక్కి తిరిగాడు. ఏమిటన్నట్టు చూశాడు.

“ఎటువంటి పరిస్థితుల్లోనూ, కుటుంబాన్ని రత్నగిరి దాటించడానికి ప్రయత్నించకండి. ఆ పని చేసినారంటే మేమంతా వుండం. ఇకపై కాకతీయుల పాలన వుండదు!” అంటూ రెండు చేతులూ ఎత్తి నమస్కరించింది రుద్రమదేవి.

గుండయనాయకుడు నవ్వాడు. ఆ పని ఎన్నటికీ జరగదన్నట్టు తల అడ్డంగా వూపాడు. తరువాత అన్నాడు.

“ప్రజలంటే నీకే కాదమ్మా. నాకూ బిడ్డల్లాంటివారే!”

* * * *

“టక్! టక్!” మని తన ఇంటి తలుపు తట్టాడు గుండయనాయకుడు. క్షణకాలం గడిచిన తర్వాత తలుపులు తెరుచుకున్నాయి. ఎదురుగా అతడి తల్లి పుండరీయమ్మ నిలుచుని వుంది.

“వచ్చావా నాయనా?” అని లోపలికి తొంగిచూస్తూ, “గుండయ వచ్చాడమ్మా వెంగమాంబా! ఎర్రనీళ్ళూ, హారతీ పట్టుకురా. దృష్టి తీద్దువుగానీ!” అందామె.

“నాకు దృష్టేమిటమ్మా. . .నీ పిచ్చిగానీ” వికల మనస్కుడైన గుండయ గడప దాటి లోనికెళ్ళబోయాడు.

ఆగు నాయనా గుండయా! ఈ రోజు నీకు అన్నీ శుభవార్తలే. దృష్టి తీయవలసినదే.” అంది పుండరీయమ్మ.

తల్లినోట ‘శుభవార్త’ అన్నమాట వినగానే గుండయనాయకుడి కళ్ళవెంట కన్నీరు వుబికింది. ఎత్తిన కాలు ఎత్తినట్టే ఆపి, వాకిట్లోనే నిలబడిపోయాడు. “ఇక శుభవార్త లెక్కడివమ్మా మనకి. . .రేపీ సమయానికి అందరూ వినబోయేది మన చావువార్తలే!” స్వగతంలో అనుకున్నాడు.

నిముషం తర్వాత వెంగమాంబ వచ్చింది. పళ్ళెంలో ఎర్రనీళ్ళూ, ఉప్పూ, హారతీ పట్టుకు వచ్చింది. తలస్నానం చేసి, పట్టు వస్త్రాలు ధరించి వుంది. భర్తను చూసి కొత్త పెళ్ళికూతురిలూ సిగ్గుపడింది. ఆ తరువాత "మీ రాక కోసమే ఎదురు చూస్తున్నాం!" అంటూ దృష్టి తీసింది. ఎర్రనీళ్ళు బయట పారబోసి, ఉప్పు తీసుకెళ్ళి, ఇంట్లో నిప్పుల్లో వేసి వచ్చింది. మళ్ళీ భర్తని సమీపిస్తూ, “ఆ కళ్ళలో నీళ్ళేమిటండీ?” అంది అనుమానంగా.

“ఏదో నలుసుపడిందిలే!” అన్నాడు గుండయనాయకుడు ముఖం పక్కకి తిప్పుకుంటూ. నడుముకి వ్రేలాడుతున్న కరవాలం తీసి భార్యకి అందించాడు.

“పిల్లలేరి?” అడిగాడు ఇల్లంతా కలియజూస్తూ.

“ఇంట్లో తులసి మొక్క ఎండితే ఇంకోటి తీసుకురాను పక్కింటికెళ్ళారు. వస్తారులే!” అంది వెంగమాంబ.

“ఇద్దరూ వెళ్ళారా?” అడిగాడు గుండయనాయకుడు “యాదవుల సైన్యం రత్నగిరిని చుట్టుముడితే తులసి మొక్క ఎండక ఏంచేస్తుంద”నుకుంటూ.

( సశేషం )

Monday, August 27, 2007

ఒక అసాంఘికుడు -- రెండు అకృత్యాలూ!!

“అసాంఘికులు -- అకృత్యాలు” పేరుతో భాగ్యనగర అభాగ్యపు బాంబు విస్ఫోటనాల గురించి ఒక వ్యాసం రాద్దామనుకున్నా. కొన్ని కారణాల వల్ల బాగా లేటయింది. ఇప్పుడు రాసినా పెద్దగా ప్రయోజనం వుండదు. ఎందుకంటే పత్రికల్లోనూ, టీవీ ల్లోనూ నే చెప్పేదాని కంటే యింకా విపులంగా అంతా వచ్చేసింది.

“ధ్వజం!” కథ రాసిన తర్వాత, “ధ్వజం కథ - దానికథ” అనే టైటిల్ తో కథా వైశిష్ట్యాన్ని గురించి వివరిస్తూ, ఈ కథ మీదీ నాదీ కాదనీ, విశ్వజనీన మానవుడి జీవన వైశాల్యం, అందులో ప్రమాదాల పారంపర్యతకున్నట్టి అపార అవకాశం గురించి చెప్తూ, కాలానుగుణంగా వచ్చే మార్పులననుసరించి మానసికంగా ప్రతి వ్యక్తీ అనుక్షణం జాగరూకుడై మసలుకోవాలని ఆరోజు ఉద్ఘాటించాను. ఆ మాట అవసరం, విలువ ఆనాడు ఎంతమందికి అర్థమయిందో లేదో నాకు తెలీదు. కానీ, నిన్న రెండు వరస పేలుళ్ళు చూసాక ఎందుకో ధ్వజం కథలోని కొన్ని భాగాల్ని తిరిగి రిప్రజంట్ చేయాలనిపంచి చేస్తున్నాను.

( ఇది భూకంపాన్ని వర్ణించిన సందర్భం.... నిన్నటి లుంబినీ పార్కూ, గోకల్ ఛాటూ వర్ణన యింతటిది కాదా?)

ఏ దేశ మయితేనేం. . . మానవుడుంటున్న దేశం!
ఏ స్థల మయితేనేం. . . ఇళ్ళూ, భవంతులూ నిర్మించుకున్న స్థలం!!
ఏ మత మయితేనేం. . . అది వైయక్తిక మనస్తత్వ సమ్మతం!!!

అక్కడ. . . ఆ ప్రదేశంలో. . . అప్పుడు. . . ఓ సాయం సంధ్య వేళ. . .

ఆహ్లాదభరితమై సాగిపోతున్న పిట్ట కూనల, పక్షి ప్రౌఢల, కేరింతల త్రుళ్ళింతల క్రిల క్రిల క్రిలా ధ్వానం ఎందుకో లిప్తపాటు ఆగింది. నవనవోన్మేషాల వసంతాల గానం ఏమైందో క్షణం సేపు దాగింది. మహోన్మత్త ముక్త కోకిలా రావం ఏకంగా మాయమే అయింది. ముంచుకొస్తున్న ప్రాకృతిక ప్రళయాన్ని ముందుగానే పసిగట్టిందో యేమో ఓ పక్షి ప్రాణి ‘కీచు’ మని అరిచింది.

అంతే!!

క్షణంలోపు క్షణంపాటు అక్కడ భూమి కదిలింది. . . భూమి కుదిలింది. . భూమి పగిలింది. ఏం జరిగిందో ఎవరికీ తెలీదు. జరగాల్సింది జరగనే జరిగింది. ఒక కంపనం పెను ప్రకంపనంగా మారి భూకంపమయింది. ప్రళయ కార్యానికి అది కారణభూతమయింది. ఆ మహా ప్రళయాన ఒక సంపూర్ణ రాష్ట్రమే లయమై విలయమయింది. . .విధ్వంసమయింది.

క్షణం నిడివిలో సస్యశ్యామలమంతా శవాల మయమయింది.

ధఢ. . . ధఢ. . . ధఢ. . . ధఢేల్ మను ధ్వనులతో అకాశ హర్మ్యాలే అక్కడ నేల కొరిగాయి. ఘన సుందర సౌధాలే శిధిలాలయాయి. శిధిలాల శకలాలయినాయి. మనుష్యులు మట్టి పాలయ్యారు. శకలాల క్రింది వికలాంగులయారు.

మానవ ప్రాణులు, జంతు ప్రాణులు, పక్షి ప్రాణులు. . . ఒకరేమిటి. . . ఒకటనేమిటి. . . ప్రకృతికి ప్రాణాల హెచ్చు తగ్గుల వివక్ష లేదు. అన్నీ శిధిలాల క్రిందే లెక్క. . . సగం యిరుక్కుని. . . సగం పెరుక్కుని. . . ఖండాలుగా, ఖండ ఖండాలుగా. . . మొండాలుగా. . . “దేవుడా రక్షించ రారమ్మం” టూ, ధీనంగా వేడికొంటూ.

తప్పించుకున్నవాడూ తప్పుకున్నవాడూ ధన్యతములు. చచ్చిన వాడూ ధన్యుడే. . . తప్పుకోనూలేక, చావనూ రాక యిరుక్కుపోయిన వాడే దౌర్భాగ్యుడు.

శిశువులూ, పశువులూ, గర్భిణీ స్త్రీలూ. . . సర్వులూ క్షతగాత్రులే! రాళ్ళ క్రింది క్షతగాత్రులు. అరుపులూ, ఆర్తనాదాలూ, మిన్నంటిన హాహాకారాలూ, మితిమీరిన రోదనలూ. . . ఎన్నని?. . . ఎవ్నరివని?. . . అది జీవన్మరణాల ఘోష! విషాద ప్రాణుల శరణాల భాష!!!

విజ్ఞాన శాస్త్రాలూ. . . రిక్టర్ స్కేళ్ళూ. . . ఎలాస్టిక్ రీ బౌండ్ థియరీలూ. . . ఆకర్షణ వికర్షణ భూ విద్యుచ్ఛాలక బలాల సిద్ధాంత రాద్ధాంతాలూ. . . సర్వం. . . సర్వమూ నిరర్ధకం అయినాయి. ప్రమాద తీవ్రతను ముందుగా పసిగట్టలేకనే పోయాయి. లక్షల శవాల రాసులే. . . రాసుల గణణమే. . . ఆ పైన విపత్తు తీవ్రతకి తార్కాణమయింది.
ఒక మహోపద్రవం. . . ఒక మహా ఉత్పాతం. . . అక్కడ సంభవించిది.

సుసంపన్నమైన, బహు విధమైన ఆ దేశ వారసత్వ సంపద. . . అక్కడ. . . ఆ ప్రాతం వారికి గర్వకారణం కాలేదు. . . బుగ్గి పాలయింది. . . బూడిద పాలయింది. . . భూకంపం పాలయింది.
* * * *

( మరొక సందర్భం )

“చెప్పు శారదా!” నిర్లిప్తంగా అన్నాడు.

“మీరు. . . మీరు జాగ్రత్త. . . మీ ఆరోగ్యం జాగ్రత్త!” కన్ను మూసింది.

“ఎలా జాగ్రత్త పడనే శారదా నువ్వు లేకుండా” మళ్ళీ గోడు గోడుమని ఏడ్చాడు.

అప్పటికే పొద్దు కృంగింది. ఒక పెంజీకటి ఆ ప్రదేశాన్నీ ఆర్తిగా ఆక్రమించుకో సాగింది.

భార్య శవాన్ని వదిలేసి, కృష్ణమూర్తి లేచాడు. చేతుల్తో తన తల పట్టుకున్నాడు. ఉన్నట్టుండి వంగి, స్వరపేటిక పగిలిపోయేలా బిగ్గరగా ఎలుగెత్తి అరవసాగాడు.

వ్వో. . . వ్వో. . . వ్వో. . . వ్వో. . .

శోకతప్త హృతయంతో విషాదోన్మత్తుడై విలపిస్తున్న అతడి అరుపులు విని, ఆ చీకట్లో ఎవరో వచ్చారు. నాలుగు ఆకారాలు. నలుగురు మనుషులు. ఓదార్చారు. ‘వగపు వలదన్నారు. వెతలు తప్పవన్నారు. మనం మనుషులం. . . మ్రానులమా?’ అన్నారు. ఆపైన ఎవరి దారిన వాళ్ళు వెళ్ళారు.

కృష్ణమూర్తి ఆ రాత్రంతా ఆప్తుల శవాల దగ్గరే కాపు వేశాడు. ఓ బండకి వీపు ఆన్చి జారగిలబడి కూర్చుండి పోయాడు. దూరంగా ఏడ్పులూ, శబ్దాలూ విన్పిస్తూనే వున్నయి. నడి రాత్రయింది. చంద్ర కాంతి శవాల మీద పడి వాటి ఉనికిని తెలియజేస్తోంది. కృష్ణమూర్తి హృదయం శూన్యంగా వుంది. కాలం గతానుగతికం. నిర్విరామం! క్రితంలో బాధ యిప్పుడు లేదు. అంతా పోగొట్టుకున్న వాడిలోని నిశ్చలత్వం. శవాలవైపు చూశాడు. . . నిర్నిమిత్తంగా. . . నిర్నిమేషంగా.

ఎవరు బాంధవులు? ఎవడు ఎవడికి బాంధవుడు. . .?

అసలు నీవెవడవు?

ఒక విడి మానవుడు. . . వేరొక విడి మానవుడికి బంధువా?

అయితే. . . ఆ బాంధవ్యపు గొలుసెక్కడ? ఆ గొలుసే సత్యమైతే. . .నిత్యమైతే. . . ఒకడు పోయినప్పుడు మరొకడు మిగిలివుండడం ఎలా సంభవం? అదే విధం??

కృష్ణమూర్తికి భగవద్గీతలోని ఒక శ్లోక భావం గుర్తుకొచ్చింది.

అవ్యక్తమునందు ఆసక్తమైన మనసుగల వారికి దుఃఖము అధికతరమై వుండును. ఎందుకనగా అవ్యక్తము దేహము కలిగిన వారిచే దుఃఖమునకు గతియై పొందబడుచున్నది!!!
* * *

(ఇంకొకటి ఇది బ్రతికి ఆప్తుల్ని పోగొట్టుకున్న వారికి కథలో సమస్యకి పరిష్కార మార్గంగా సూచించినది)

“చూడు నాయనా కృష్ణమూర్తీ జీవితంలో నీకొక కీడు జరిగింది. గుండె బెదురుపాటు చెందింది. దిక్కుతోచని స్థితిలో నా చెంత చేరావు. సలహా కోరావు. మనసు నొప్పితో దగ్గర చేరిన వాడిని నా కధ చెప్పి, మరింత కలవర పెట్టి పంపడం నాకు తెలిసిన నీతి కాదు. కానీ, కార్య కారణ సంబంధాల లాగే సమస్య, పరిష్కారం ఒకదాని కొకటి ముడిబడి వున్నాయి. సమస్యకి పరిష్కారం చెప్పడంలో నాకు నమ్మకం లేదు. ఒక పరిష్కారం నీకు నేను చెప్పానా. . . మరో సమస్యలోకి నిన్ను పనిగట్టుకుని నేను దింపుతున్నట్టే!!” అన్నాడాయన.

“అంటే?”

“అంటే. . . నువ్వు మళ్ళీ పెళ్ళి చెసుకుని, పిల్లాపాపలతో చక్కటి జీవితం గడపమని సలహా చెప్పవచ్చు. లేదన్నావా. . . ఒంటరిగానే జీవిస్తూ నీలాగే బ్రతుకులో ప్రమాదపడ్డ వారికి సహాయపడుతూ గడపమని చెప్పవచ్చు. కాదంటే ఆధ్యాత్మకంలోకి వెళ్ళమనవచ్చు. అదీ కాదనుకుంటే నీ యిష్టమొచ్చినట్టు జీవించమనవచ్చు. ఇవన్నీ నీ సమస్యకి పరిష్కారాలు. ఇందులో ఏ ఒక్కటి నీకు నేను సూచించినా. . . అది మళ్ళీ నీకు సమస్యని బహుకరిస్తున్నట్టే.”

“అర్ధం కావడం లేదు తాతగారూ!” అన్నాడు కృష్ణమూర్తి. అతడి గొంతు గాద్గధికమైంది. “ఒక మంచి కుటుంబం నాది. అర్ధంచేసుకునే భార్య, చక్కటి పిల్లలు. సాయంత్రం యింటికి రాగానే నాపైకెక్కి ఆడుకునే వాళ్ళు. ఎప్పుడూ గలగలా మాట్లాడే తల్లి. . . అందరూ భూకంపం పాలయ్యారు. ఒంటరిగా నన్ను శోకంలో వదిలారు. గతం వెంటాడుతోంది తాతగారూ. పడుకుంటే నిద్రరాదు. మేలుకునుంటే అవే జ్ఞాపకాలు. శరీరం మీద సృహ వుండదు. ఎందుకీ జీవితం. . .నా వాళ్ళు లేకుండా. ఆత్మహత్య చేసుకుని చస్తే ఏ బాధా వుండదనిపిస్తుంది. ఒకటే పిరికితనం. నాకు ధైర్యం చెప్పండి తాతగారూ!” కృష్ణమూర్తి వల వలా ఏడ్చాడు.

“బాధ పడకు కృష్ణమూర్తీ” అన్నాడు మాధవరావు. . .అతడి భుజం మీద చెయ్యేసి అనునయిస్తూ.

మహారధి కృష్ణమూర్తి వైపు నిశ్చలంగా చూశాడు. మళ్ళీ చెప్పసాగాడు.

“గతం వెన్నాడుతోందన్నావు. ఆత్మహత్య అహ్వానిస్తోందన్నావు. చూడు నాయనా. . .ఆత్మహత్యంటే హింస! హింస తప్పనేది అందరికీ తెలిసిన విషయం! ఉద్దేశపూర్వకంగా చావగలం గానీ, పుట్టలేం. చావడానికి ఉరితాడు చాలు. బ్రతకడానికి చాలా కావాలి. ఇక్కడ అసలు సమస్య గతం! భార్యా పిల్లలూ. . . తల్లీ. . . దుఃఖం. . .పిరికితనం. . . అన్నీ గతమే. దాన్ని మనం నిలువరించాలి. నిలువరించడమంటే దానర్ధం. . .ఏ టీవీనో, సినిమానో, మరే కంప్యూటరో చూస్తూనో, లేదంటే మరేదైనా యిష్టమైన పని కల్పించుకుని అందులో నిమగ్నమైపోయో గతం నుండి తప్పించుకోవడం కాదు. గతమంటే ఏమిటో అర్ధం చేసుకోవడం. దాన్నీ ‘ఢీ’ కొనడం. గతమంటే చీకటి. చీకటిని చీకటితో రాసినా. . . చీకటిని చీకటితో కొట్టినా. . . చీకటిని చీకటితోనే వెలిగించినా. . . ఏది చేసినా వెలుగు పుట్టదు. ఎందుకంటే చీకటి లేక పోవడమే వెలుగు. గతాన్ని మననం చేస్తున్నంత కాలం. . .‘ప్రాక్టీస్’ చేస్తుంన్నంత కాలం అది దుఃఖంలో మనల్ని ముంచెత్తుతుంది. గతాన్ని విడనాడడమే. . . తేలిగ్గా విడనాడడమే వెలుగువైపుకి పయనించే జీవితం. కొత్తది. . . చురుకైన జీవితం!” మహారధి అగాడు. క్షణం తర్వాత మళ్లీ చెప్పసాగాడు.

“చూడు బాబూ కృష్ణమూర్తీ! ఏదో బ్రతుకులో కష్టాలపాలై కఠినంగా మాట్లాడుతున్నానని అనుకోవద్దు. నేను నీకు ధైర్యం చెపితే . . . అదెంత సేపుంటుంది. ఆలోచించు! నేను పక్కకి పోగానే దాని దారి అది చూసుకుంటుంది. అలాగే పరిష్కారం కూడా. పరిష్కారం చెప్పానా, ఆ పరిష్కారం నాదవుతుంది నీదికాదు. ధైర్యమైనా, పరిష్కారమైనా అది నీలో నుండి రావాలి. అరువుతెచ్చుకున్నది కాదు. ఒప్పుకుంటావా” అన్నాడు మహారధి.

“ఒప్పుకుంటాన”న్నట్టు తలాడించేడు కృష్ణమూర్తి.

“అంతస్సులోకి వెళ్ళాలి! అన్వేషణ జరగాలి!! అంతర్మధనం జరగాలి!!! అది జరిగిననాడు నువ్వు నీ సమస్యకి సమాధానం కోసం. . .నీలో వున్న సమాధానం కోసం. . .బయటివాళ్ళని. . . వేరొకర్ని బిచ్చమెత్తాల్సిన అవసరం లేదు. సమాధానం నీలోనే లభ్యమౌతుంది! వెలుగు వుద్భవిస్తుంది!! మనిషి ఒంటరిగా నిలిచి, సర్వ స్వతంత్రుడై జీవించడమంత మహత్తరమైన విషయం మరొకటి లేదు ఈ లోకంలో!! చివరగా ఒక మాట. . . నీ పూర్తి జీవితం నీ చేతిలో వుంది. సర్వం నీలోనే వుంది. ఎంత చిలికేవో అంత వెన్న లభిస్తుంది. నైరాశ్యంలో కొట్టుమిట్టాడాల్సిన అవసరం. . .ఈ లోకంలో ఏ మనిషికీ లేదు. . . ఏ మనిషికి కూడా. . . మనసుని చిలకడం మరిచిన వాడికి తప్ప!” చెప్పడం అయిపోయిందన్నట్టుగా మహారధి లేచాడు.


(ఇవన్నీ. . .”చూశారా నాగొప్ప?” అన్న భేషజంకోసం నేను తిరిగి పబ్లిష్ చేయడం లేదు. ఎందుకో ఈ విపత్కర స్థితిలో ఈ కథా భాగాలు నా బ్లాగు ద్వారా ప్రపంచానికి పంపాలని పించింది. పంపుతున్నా.)

Saturday, August 25, 2007

జై కిసాన్! (కవిత)

కిసానులు --సానులు! (కవిత)

సరిగమలు. . . జంట స్వరాలు. . .
స్వరజతులు. . . జతిస్వరాలు. . .
సంకీర్ణ రసాలు. . . పలికే. . . పలికించే. . .
మృదుమధుర. . . స్వరమృదుల రాగాల వీణలో. . .
తీగలు తెగుతున్నట్టూ. . .!!!

ప్రసవించిన పసికందును. . .
నడి గుండెన అదిమి పట్టి. . .
పాలుగుడిపే అమృతమూర్తి. . .అమ్మ. . .
అమ్మ రొమ్మును. . .
బ్రెస్ట్ క్యాన్సర్ ఆక్రమిస్తున్నట్టూ. . .!!!

రైతు చస్తున్నాడయ్యా. . .!
ఓ నా పాలకవర్గ మేధావీ. . .!!
రైతు ఛస్తున్నాడు!!!

చచ్చినవారి పట్ల. . .
మన ముష్టి సంతాపం. . .
ముదనష్టపు ఏడ్పులూ. . .

కాదిప్పుడు అవసరం. . . లేదిప్పుడు అవసరం. . .!!!

కృతిపాడే వాగ్గేయుడొకడు. . .
శృతి తప్పిన కంఠాన్ని. . .
చిని పొడిదగ్గుతొ. . .
గొంతుని సవరించినట్టూ. . .!!!

విద్య గరిపే గురువరుడొకడు. . .
చింతబరికతొ శిష్యుడి అజ్ఞాన తిమిరాన్ని. . .
తరిమి. . . తందరిమి కొట్టినట్టూ. . .!!!

బ్రతికున్న శవాల బ్రతుకులకో పరిష్కారం కావాలి!!!

అది. . . ఆ పరిష్కారం. . .

నా ‘కిసాను’ల భార్యలు. . . కూటికోసం ‘సాను’లు కాకుండేందుకు. . .
తోడ్పడగలగాలి!!!


* * *

Friday, August 24, 2007

ఏమొకొ చిగురుటధరమున...!.. 3

ఏమొకొ చిగురుటధరమున. . .

(‘స్వాతి’ సపరివార పత్రిక సరసమైన కథల పోటీలో రూ.1,000 బహుమతి పొందిన ఉత్తమ సరసమైన కథ! సంచిక 22.03.1996 లో ప్రచురితమైంది.)


ఆ వసుధైక స్త్రీ సౌందర్యపు వెలుగు నిజతత్వం తెలుసుకోవడానికి నేను వెర్రివాడిలా ప్రయాసపడసాగాను! నా హృదయం శరీరంతో కలిసి ఏకమైపోయి ఆ మహిమాన్విత సౌందర్యాన్వేషణ కోసం అర్రులు చాచింది. ఇంతలో ముఫ్ఫైరెండేళ్ళ సుదీర్ఘ జీవితపు సంస్కరణలో నేను చేజిక్కించుకున్న నైతిక విలువ ‘ఫెటేల్’ మని నా వెన్ను చరిచింది!

పెళ్ళయి, ఇద్దరు బిడ్డల తండ్రినైన నేను. . .ఆకర్షణ కలిగించిన భ్రాంతిలో. . . స్త్రీ పేరుతో, సౌందర్యాన్వేషణ పేరుతో ఉద్రిక్తత పొంది, అభం శుభం తెలీని పసిపిల్ల పద్మాంజలి శరీరతత్వాన్ని అపహరించడం నాకు తప్పుగా తోచింది!

బలమైన అపరాధ భావం ఒకటి నాలో మానవత్వాన్ని మేల్కొల్పి సిగ్గుని కలిగించింది.

అంతే!! నేను తల తిప్పేసుకున్నాను.

“శివోహం, శివోహః” శరీరాన్ని చల్లబరుస్తూ నా పెదాలు తిరిగి యాంత్రికంగా ఉచ్ఛరించసాగాయి.

* * * *
మూడవరోజు సాయంత్రం నేను ఆలయంలోంచి ఇంటికి వెళుతున్నప్పుడు ధ్వజస్తంభం దగ్గర పద్మాంజలి నాకు ఎదురయింది. ఆమె వెనక ఎవరూ లేరు. భుజానికి ఎయిర్ బ్యాగ్ వ్రేలాడుతోంది.

నేనామె వైపు ప్రశ్నార్థకంగా చూశాను.

“వెళుతున్నాం స్వామీ! చూడాల్సిన ప్రదేశాలన్నీ చూశాం!” అంది.

నాకెందుకో బాధగా అనిపించింది.

“వెళ్ళిరా పద్మాంజలీ!” అన్నాను.

పద్మాంజలి వెనక్కి తిరిగి వెళ్ళబోతూ, ఏదో గుర్తొచ్చినదానిలా ఆగి, “స్నానం చేసేప్పుడు చూడ్డానికి కాలేదేం?” అంది కొంటెగా.

“వచ్చానుగా!” అన్నాను.

“నిజంగా వచ్చారా?” అంది.

“వచ్చాను!” అన్నా

“కొంపదీసి చూసేశారా. . . ఏంటి?” కళ్ళు పెద్దవి చేసి, అనుమానంగా అడిగింది.

“చూశాను.” అన్నాను.

“నిజంగా చూశారా?” భయంగా అంది.

“నిజంగానే చూశాను!” అన్నాను గట్టిగా.

“అంతా చూసేశారా?” ఏడుస్తున్నట్టుగా అంది.

నేను చిన్నగా నవ్వి, “లేదు. . నువ్వు కనిపించనంత వరకూ” అన్నాను.

“అంటే?” అర్థంగాక అడిగింది.

“ప్రమాదం లేనంతవరకూ చూశాను” అన్నాను.

గుండెలమీద చేయి ఆనించుకుని, “అమ్మయ్య!” అంటూ పద్మాంజలి ‘రిలాక్స’యి నవ్వేసింది.

అల్లరిపిల్లని ఆప్యాయంగా చూస్తూ, నేను కూడా నవ్వాను.

“ఇక వెళ్ళొస్తాను స్వామీ!” చెప్పి, ఆమె వెనుదిరిగింది. ఇంతలో మళ్ళీ ఏదో గుర్తొచ్చిన దానిలా చటుక్కున వెనుదిరిగి, మోకాళ్ళమీద కూర్చుని, నా పాదాలకి నమ్రతగా నమస్కరిస్తూ, “నన్ను ఆశీర్వదించండి స్వామీ!” అంది.

విశ్వమంతటి విషాదం నా శరీరాన్నిముప్పిరిగొనగా, నేను “శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు!” ఆమెను మనస్పూర్తిగా ఆశీర్వదించాను.

ఆ తర్వాత, ఆమె లేచి వెళ్ళిపోయింది.

నేను ఇంటివైపు నడిచాను. ఓ రకమైన ఉద్వేగం, విషాదం నిండిన నా హృదయం దైవంపై నిమగ్నమై, అందులో ఓ భావం అస్పష్టంగా కదలాడసాగింది.

“విశ్వజనీన మానవ చరిత్రాత్మక జీవనగమనంలో. . .

ఏ శక్తిని పురుషుడు కాంక్షతో ఉపాసిస్తాడో. . .

ఏ అనుభవం కోసం రసపిపాసి ఆరాధనతో ఊపిరి బిగిస్తాడో. . .

ఏ అనుభూతిని మగవాడు అర్రులు చాచి అభిలషిస్తాడో. . .

అట్టి మహత్తర దివ్య సౌందర్యానుభవం. . .

కేవలం హైందవ సాంప్రదాయపు సంకెళ్ళలో నీ పాదసేవ కోసం నియమించబడిన పూజారిని!

వట్టి వ్యర్థుడిని!!

నాకేల ప్రసాదించావు ప్రభూ!!!”

(ఏమొకొ చిగురుటధరమున. . . కథ సమాప్తం)

Thursday, August 23, 2007

ఏమొకొ చిగురుటధరమున...!.. 2

ఏమొకొ చిగురుటధరమున. . .

(‘స్వాతి’ సపరివార పత్రిక సరసమైన కథల పోటీలో రూ.1,000 బహుమతి పొందిన ఉత్తమ సరసమైన కథ! సంచిక 22.03.1996 లో ప్రచురితమైంది.)


“అయమాత్మ బ్రహ్మః” వైదిక మంత్రాన్ని పఠిస్తూ నేను ద్వారతోరణంకి అటువైపున పద్మాసనం వేసుకు కూర్చుని ధ్యానంలో నిమగ్నమయాను.

“మీ పేరేమిటి స్వామీ?” అన్న ప్రశ్న విని కళ్ళు తెరిచాను.

ఎదురుగా పద్మాంజలి. ఆమె వెనుక నలుగురమ్మాయిలూ!

పద్మాంజలి నా ముఖంమీదికి వంగి ప్రశ్నిస్తోంది. నేను నవ్వి, ఆమె ప్రశ్నకి సమాధానం యివ్వకుండా “మీరెక్కడినుండి వచ్చారు?” అన్నాను.

పద్మాంజలి నిట్టూర్చి, “పాఠం అప్పజెప్తున్నట్టుగా, మాది కోనసీమ. నా పేరు పద్మాంజలి. నేను మా అమ్మానాన్నలతో ఈ దేవస్థానం చూడడానికి వచ్చాను. వీళ్ళూ మాతో పాటే వచ్చారు. వీళ్ళంతా నా ఫ్రెండ్స్. అంటూ వాళ్ళని ఒక్కొక్కరినీ చూపిస్తూ, సీత, గౌరి, గంగ, సుగుణ పరిచయం చేసి, ఇంజనీరింగ్ ఫస్టియర్ చదువుతున్నాం. చాలా?” అంది అలిసిపోయినట్టుగా.

“ఎక్కడ దిగారు?” అన్నా.

పద్మాంజలి ముఖం విసుగ్గా పెట్టి, “కాకర్లవారి సత్రంలో. ఇంకా ఏమైనా వివరాలు కావాలా?” అంది.

నేను నవ్వాను.

“ఇంతకీ మీపేరేమిటో చెప్పరా స్వామీ?” జడని మెడచుట్టూ తిప్పి, లాగి తలూపుతూ గారంగా అడిగింది పద్మాంజలి.

“భగీరధుడు!” అన్నా.

ఆమె కళ్ళు ఆశ్చర్యంతో ప్రపంచమంత అయ్యాయి. “అయ్యబాబోయ్. . . భగీరధుడే!” అంది. అంతలోనే ఆ ఆశ్చర్యం నుండి తేరుకుంటున్నట్టుగా గంగ వైపు తిరిగి, “ఒసే గంగా! నిన్ను స్వర్గం నుండి భూమిమీదికి తెచ్చింది ఇతగాడేనే!” అంది.

నవ్వులతో ఆ ప్రదేశమంతా నిండిపోయింది.

ఆమెలోని సమయానుకూలతకి నేనూ నవ్వాను.

గంగ ముఖం మాడ్చుకుంది.

అంతా నా చుట్టూ కూర్చున్నారు. నాకేదో యిబ్బందిగా అన్పించసాగింది.

“స్వామీ ఇంతకుముందు మీరు పూజచేసినప్పుడు మేం ఏమేం కోరుకున్నామో మీకు తెలుసా?” అడిగింది పద్మాంజలి.

తెలీదన్నట్టు తల అడ్డంగా వూపాను.

“ఒక్కొక్కరూ చెప్పండే” అని, “ముందు నువ్వుజెప్పవే సీతా!” పద్మాంజలి సీత డొక్కలో పొడిచింది.

“ఊహు నేను చెప్పను.” అంది సీత.

“చెప్పవే!” పద్మాంజలి ఉరిమింది.

ఇక సీతకి తప్పలేదు. “మంచి మొగుడినివ్వమని” సిగ్గుతో ముడుచుకుపోతూ చెప్పింది.

“ఓహో అక్కడి దాకా వెళ్ళిదన్నమాట కోరిక.” అని, “మంచి మొగుడంటే?” పద్మాంజలి రెట్టించింది.

“చవటలా వుండాలి!” సీత సిగ్గుపడిపోయింది.

అంతా నవ్వారు. నాకూ అదంతా సరదాగా, ఉత్సాహంగా యిబ్బందిగా కూడా అన్పించసాగింది.

“నీ కెలాంటి మొగుడుగావాలే గౌరీ?” పద్మాంజలి గౌరిని అడిగింది.

“తాగుబోతు మొగుడు!” అంది గౌరి వెంటనే.

“తాగుబోతువాడా. . . ఎందుకూ?” చిత్రంగా అడిగింది పద్మాంజలి.

“అతగాడు తాగి నిద్రబోతే, ఎంచక్కా నేను టీవీ సీరియల్లు చూసుకోవచ్చుగా!”

“ఓహో టీవీ సీరియల్లన్నమాట తమరికి ముఖ్యం. అసలు విషయంగాదు. పోనీ, నీ సంగతి చెప్పవే గంగా?” అంది పద్మాంజలి గంగవైపు తిరిగి.

“నాకెలాంటివాడైనా ఫర్లేదే!” అంది గంగ స్థిరంగా.

“అంటే?” పద్మాంజలి.

“అతగాడెంతటివాడైనా ఒక్కరోజులో నాచేతిలో ఛస్తాడు కాబట్టి!” మంచి ఆత్మవిశ్వాసంతో అసలు విషయం చెప్పింది గంగ.

“సుగుణా నువ్వో?” అంది పద్మాంజలి.

“నాకు ఆల్ రెడీ మొగుడున్నాడుగా. . .యింకొకడెందుకు?” అంది సుగుణ.

“ఎవరే?” ఆశ్చర్యంగా చూసింది పద్మాంజలి.

“నువ్వులేవూ?” అడిగింది సుగుణ సిగ్గుపడుతూ.

అంతా విరగబడి నవ్వారు. నాకు నవ్వాగలేదు. పద్మాంజలి ముఖం కందగడ్డలా తయారైంది. సుగుణని వొంచి వీపు మీద ఒక్కటిచ్చింది.

“మరి పద్మాంజలీ నీ సంగతి చెప్పలేదేం?” అన్నాను నేను. పద్మాంజలి వంతు వచ్చిందనే భావన నాలో ఏదో కొత్త ఉత్సాహాన్ని కలిగించింది.

“చెప్పనా?” అంది పద్మాంజలి ఆలోచిస్తూ.

“ఊ చెప్పు!” అన్నాను నేను కొంటెగా.

అంతా క్యూరియాసిటీతో చెవులు రిక్కించారు.

పద్మాంజలి ఏదో నిశ్చయానికి వచ్చినదాన్లా నా కళ్ళలోకి సూటిగా చూస్తూ, “నాకు నీలాంటి భర్త కావాలి.” అంది.

నాకు అర్థంగాక “ఏమిటీ?” అన్నాను.

పద్మాంజలి పిచ్చిగా, “నాకు నీలాంటి మొగుడు కావాలి. నువ్వు కావాలి” అంది మళ్ళీ.

నాకు పిచ్చిపట్టినట్టయింది. “ఏమిటి పద్మాంజలీ నువ్వంటున్నది?” అన్నాను.

“నాకు నువ్వంటే యిష్టమంటున్నాను. నువ్వు భర్తగా కావాలంటున్నాను. అర్థంగావడం లేదా లేక ఇష్టంలేదా?” అంది పద్మాంజలి అంతే పిచ్చిగా.

ఒక విభ్రాంత వాక్ శకలం నా నాడీ మండలంలోకి వాయువేగంతో దూసుకుపోయింది. అ హఠాత్పరిణామానికి నేను స్థానువే అయాను. ఆ ప్రదేశమంతా నిశ్శబ్దం ఆవరించుకుంది.

“ఇద్దరు బిడ్డల తండ్రిని. . .కర్మ సిద్ధాంతంతో చేతులు కట్టేసుకున్నవాడిని. . . నన్ను కట్టుకుని ఏం సాధిస్తుంది ఈ పద్మాంజలి? ఆమెకి పిచ్చిపట్టలేదుకదా?” నేను ఆలోచిస్తున్నాను.

క్షణం తర్వాత, పద్మాంజలి బిగ్గరగా నవ్వేసింది. ఆపైన, “భయపడ్డారా స్వామీ?” అంది.

అప్పుడుగానీ అది సరదాకోసం అంటున్న మాటగా నాకు స్ఫురించలేదు.

నేను బలవంతంగా నవ్వాను.

పద్మాంజలి నా పక్కకి జరిగి, నా గడ్డం పట్టుకుంటూ, “నిజంగా భయపడ్డారా స్వామీ?” అంది. అలా పక్కకి జరిగినప్పుడు ఆమె నడుము భాగం ఆచ్చాదన లేని నా భుజానికి తగిలింది.

స్త్రీ శరీరంలోని మృదుత్వం, వెచ్చదనం నాకు కొత్తగాదు. అయినప్పటికీ, పద్మాంజలి లోని అగ్ని నా శరీరాన్ని కాల్చేసింది. ఆ వేడిలో నేను కరిగి ఆవిరైపోతున్నట్టు నాకొక అనుభూతి కలిగింది.

ఆ తన్మయంలోంచి తేరుకుంటూ నేను, “లేదు. . .అదేమీ లేదు. . .” తడబడుతూ అన్నాను.

“అయ్యో నా పిచ్చి స్వామీ!” అంటూ పద్మాంజలి నవ్వసాగింది. ఆమెనే గమనిస్తున్న నాకు ఆ నవ్వులో ప్రపంచం నవ్వుతున్నట్టు తోచింది.

క్షణం తర్వాత, వాళ్లు అక్కడి నుండి కదిలారు.

పరికిణీ కుచ్చిళ్ళు పైకెత్తి, పద్మాంజలి కోవెల మెట్లు దిగుతూ వెళుతున్నప్పుడు బంగారు రంగు పట్టీలతో మెరిసే ఆమె గులాబీ రంగు పాదాలూ, సుకుమారమైన కాలిపిక్కలూ నా హృదయాన్ని మృదువుగా పిండి ఏదో శృంగార సంకీర్తనని గుర్తుకుతెచ్చాయి.

“కొంగుజారిన మెరుగు. . . గుబ్బలొలయగ తరుణి. . .
బంగారు మేడపై పవ్వళించేను.
చెంగలువ కనుగొనల. . .సింగారములు తొలక. . .
అంగజ గురునితోడ. . .అలసినది గాన. . .”

* * * *

మరుసటిరోజు ఉదయం నేను ఆలయం వద్ద నిల్చొని, ముఖమండపం మీద చెక్కిన నృత్య, సంగీత శిల్పాల్ని గమనించసాగాను. వాటిలో ఒక ఆలసకన్య శిల్పాన్ని చూడగానే నాకెందుకో పద్మాంజలి గుర్తొచ్చింది. నేను ఆమె గురించి ఆలోచిస్తుండగానే “భగీరధస్వామీ!” అన్న పిలుపు వినిపించింది.

అటువైపు చూసాను. పద్మాంజలి తన పటాలంతో ఎక్కడికో బయలుదేరింది.

నేను ‘ఏమిట’న్నట్టు చూశాను.

పద్మాంజలి నాకు దగ్గరగా వచ్చి, నా చెవిలో రహస్యంగా, “నదిలో స్నానానికెళ్తున్నాం స్వామీ. . .రండి చూద్దురు గానీ” అంటూ కన్నుగీటింది.

నాకు ఆ అమ్మాయి మనస్తత్వం చిత్రంగా తోచింది.

పద్మాంజలి కొద్దిగా ముందుకు వెళ్ళి మళ్ళీ, “దమ్ముంటే రండి. . .దమ్ము!” అంటూ సవాల్ చేసింది.

ఆమె గడుసుతనం నాకు నవ్వుని తెప్పించింది. ఆమె నన్ను మరీ చాదస్తపు పంతులుగా జమకడుతున్నట్టు నాకనిపించింది. నేను కదిలి ఆలయం లోపలికి వెళ్ళబోయాను. కానీ, మనసు నది వైపుకు లాగింది. ఎందుకో అటే నడిచాను. వెళ్ళి నది గట్టుమీద, ఒక ఎత్తైన బండరాతిమీద కూర్చున్నాను.

అక్కడికి కొద్ది దూరంలోనే నీటిలో పద్మాంజలి తన బృందంతో జలకాలాడడం నాకు స్పష్టంగా కన్పిస్తోంది. పద్మాంజలి ఒంటిమీద ఓణీ లేదు. పరికిణీ, జాకెట్టు మాత్రమే వున్నాయి. జడని కొప్పులా చుట్టి ముడిపెట్టుకుంది. నీటిలో తడిసిన పరికిణీ ఆమె పిరుదులకి అతుక్కుపోయి వాటి ఆకారాన్ని పట్టిచ్చేస్తోంది. తడిసి బిగిసిన రవికలోంచి ఆమె ఎద తమ వంపుల్ని, నిండుదనాన్ని లోకానికి చాటుతున్నాయి. జాకెట్లోంచి పొంగిన నీరు పొట్టమీదుగా లోపలికి జారిపోతోంది. నడుము దగ్గర కండరాలు ఆమె కదలికలకి అనుగుణంగా మడతలు పడసాగాయి. నీటిలో ప్రక్షాళన చెందిన ఆమె శరీరం పసిడివర్ణపు కాంతితో మెరిసిపోసాగింది.

ఏదో సరదాకి అన్నదేగానీ, నిజంగా నేనక్కడకి వస్తానని పద్మాంజలి ఊహించివుండదు.

ఆమె జాకెట్టు హుక్స్ విప్పడానికి సమాయత్తమవుతూ, రెండుచేతుల్నీ పైకెత్తి గుండెల దగ్గరకి చేర్చింది.

ఇంకొద్ది సేపట్లో పద్మాంజలి నగ్న శరీరం నా కళ్ళ ముందుంటుంది. ఆమె రహస్యం శోధించడానికి నా నేత్రాలు రెట్టింపు శక్తితో జాగృతమయాయి.

( సశేషం)

Wednesday, August 22, 2007

ఏమొకొ చిగురుటధరమున...!..1

ఏమొకొ చిగురుటధరమున. . .

(‘స్వాతి’ సపరివార పత్రిక సరసమైన కథల పోటీలో రూ.1,000 బహుమతి పొందిన ఉత్తమ సరసమైన కథ! సంచిక 22.03.1996 లో ప్రచురితమైంది.)


తూర్పున సింధూరం లాంటి ఎర్రని సూర్యుడు కర్తవ్యోన్ముఖుడైన యోధుడిలా పైకి లేచాడు. రాత్రి రోతలో తడిసి బరువెక్కిన హరితవృక్షాలు తుషారంలో మునిగి విషాదాన్ని విసిరి కొట్టాయి. మంచులో మెరిసి మలినం పోగొట్టుకున్న పూలు సప్త వర్ణాల్లో వికసించి, వికాసం చెందాయి.

పిట్టకూనల, పక్షి ప్రౌఢల కేరింతల, త్రుళ్ళింతల కిల కిల కిలా రావాలతో సృష్టి స్వరంలో సుమధుర శృతులు పలికాయి. విశ్వగానంతో వివశత్వం పొందిన ఒక పొగరుబోతు ఈలపిట్ట కూతలో మైమరచి విశ్రాంతిని మరచింది.

ఆ ప్రకృతిలోని ఆర్ధ్రత నా శరీరాన్ని ఛిద్రం చేసుకుని, నా నాడుల్ని కదిల్చి, నా ఆత్మను మృదువుగా పెనవేసుకుంటున్నట్టు నాకొక భ్రాంతి కలిగింది. నాకు నేనే తెలీని ఒకానొక అయోమయావస్థలో కొంతసేపు అలాగే కోవెల మెట్లమీద కూర్చుండిపోయాను.

“భగీరధస్వామీ!” వాచ్ మెన్ పిలుపుతో ఈ లోకం లోకి వచ్చాను. ‘ఏమిట’న్నట్టు ప్రశ్నార్థకంగా చూశాను.

“చంద్రశేఖర స్వామి తమర్ని పూజకి వేళయింది రమ్మంటున్నారు.” చెప్పి, అతడు వెళ్ళిపోయాడు.

జుట్టు ముడివిప్పి, విదిలించి, తిరిగి ముడి పెట్టుకుంటూ నేను లేచాను. నదిలో స్నానం చేసినప్పుడు తడిసిన కాషాయం పంచె ఇంకా తడిని ఆర్పుకోకుండా బలిష్టమైన నా కాళ్ళని చుట్టేసింది. కొద్దిదూరంలో గుడిగంటలు హృదయస్పందనని అదుపు చేస్తున్నట్టు పవిత్రంగా, లయబద్దంగా విన్పిస్తున్నాయి.

ఎడతెగని జీవితం కర్మాగారంలో అలుపెరుగని శ్రామికుడిలా నేను గర్భగృహం వైపు నడిచాను.

మొదట్లో ఈ అర్చకవృత్తిపై నాకంత గౌరవం వుండేది కాదు. నేను బి.యస్.సి. పట్టా పుచ్చుకున్న తర్వాత, నా తల్లిదండ్రులు వంశపారంపర్యంగా లభించిన ఈ వృత్తిలో నన్ను బలవంతంగా ప్రవేశపెట్టారు.

‘పాశ్చాత్య నాగరికత ప్రభావంవల్ల నాకు విశాలమైన విశ్లేషణా జ్ఞానం అలవడిందనీ, సృజనశీలమైన ఆలోచనా విధానంతో నేను చైతన్య పూరితమైన జీవితం గడుపుతున్నాన’నీ అప్పట్లో భావించేవాడిని!

అందువల్ల. . . కేవలం కర్మసిద్ధాంత విశ్వాసపు పునాదుల పైనా, హైందవ సాంప్రదాయపు శిథిల స్తంభాలపైనా నిలబడిన ఈ అర్చకవృత్తిని నేను ఆనాడు గౌరవించలేదు. గౌరవంలేని వృత్తి ఆత్మద్రోహమే అయనప్పటికీ. . .జీవనోపాధి కోసం, భవిష్యత్తులో భద్రతకోసం జీవితంలో ఆ మాత్రం రాజీ నాకు తప్పలేదు!

కానీ, రాను రాను ఆ వృత్తిపై నాకు మమకారం పెరగసాగింది. దానికి తోడు పెళ్ళి చేసుకుని, ఇద్దరు బిడ్డల తండ్రినై ముఫైరెండేళ్ళ వయసొచ్చాక ఈనాటికి ఈ వృత్తిపైనా, ఈ దేవస్థానం పైనా నాకు గౌరవం మరీ పెరిగిపోయింది.

మాది నెల్లూరు జిల్లాలో పెన్నానదికి ఉత్తరం వైపునున్న శ్రీ జొన్నవాడ కామాక్షీదేవి ఆలయం! బాగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం కావడంతో ప్రస్తుతం నా ఆర్థికస్థితి కూడా బాగానే వుంది!

* * * *

ధూప దీప, నైవేద్యాల మధ్యా, ఒత్తైన పుష్ప అలంకరణల మధ్యా, మంత్రఘోషల, ఆగరొత్తుల పరిమళాల మధ్యా గర్భగృహంలో దైదీప్యమానంగా వెలిగిపోతోంది ‘శ్రీ కామాక్షీదేవి’ మూలవిరాట్టు!

అంతరాళంకి ఇటువైపున కుడ్యస్తంభం దగ్గర భక్తులకి కర్పూర హారతి అందిస్తూ నేను నిల్చున్నాను. ఆటువైపుగా చంద్రశేఖరస్వామి భక్తులకి తీర్థప్రసాదాలు అందిస్తున్నాడు.

యథాలాపంగా హారతిపళ్లెం పట్టుకున్న నేను పూజ చేయాలి స్వామీ!” అన్న స్త్రీ కంఠం విని ఆ కంఠంలోని మృదుత్వానికి, మార్ధవానికి ప్రతిస్పందిస్తూ మంత్రోచ్ఛారణ ఆపి, అటువైపు చూశాను.

ఒక పద్దెనిమిదేళ్ల అమ్మాయి! పరికిణీ, ఓణీ వేసుకుంది. చేతిలో పూలబుట్ట వుంది!

ఆమె వెనుక అదే వయసుగల అమ్మాయిలు నలుగురున్నారు. వాళ్ళు నిల్చున్న చోటులో సరైన వెలుతురు లేక మసకగా వుంది.

“అష్టోత్తరమా?” పళ్ళెంలోని విభూతిపండు పక్కకి నెడుతూ నేను మామూలుగానే అడిగాను.

“మంత్రపుష్పం!” అంటూ, ఆమె కాస్త ముందుకి నడిచి, పూలబుట్టలోంచి కొబ్బరికాయ, పూలు తాంబూలం తీసి నాపళ్ళెంలో పెట్టింది.

ఆమె అలా ముందుకు జరిగినప్పుడు మండుతున్నకర్పూరం వెలుగు ఆ అమ్మాయి ముఖంపై పడింది. నేనామె వైపు చూశాను.

సూర్యుడూ, చంద్రుడూ ఒకేసారి ఉదయించి, అస్తమించగలిగిన విశాలమైన నుదురూ, నీటి వూటను నింపుకున్న ఒయాసిస్సులా మూగగా పిలుస్తూ. . .ప్రేమను వర్షించే కళ్ళూ. . .ఇంద్రచాపంలా వంగిపోయిన నల్లని కనుబొమలు. . .ఇంకా కళ్ళుతెరవని చకోరపక్షిలా వణికిపోయే కనురెప్పలు. . . వాటికింద విషాదం గూడుకట్టుకుని ఉనికిని ఎర్పరచుకున్నట్టు నల్లని నీడ, పుట్టినచోటు మరచిపోయి ప్రపంచాన్ని ధిక్కరించే ముక్కు, విశృఖలంగా రేగి విశ్వమంతా వ్వాపించుకోడానికి ప్రయత్నిస్తే అణిచిపెట్టి దువ్విన ఒత్తైనజట్టు. . .హిమాలయంలోని మంచులోయల్ని గుర్తుకుతెచ్చి, అలవోకగా శరీరంలో కలసిపోయిన మెడవంపు. . .పురుషుడు వులిక్కిపడి స్వప్నలోకంలో శక్తుల్ని వెదుక్కునేట్టు చేయగలిగే సామర్థ్యం గల నిండైన ఛాతీ!

ఒక సౌందర్యపు వెలుగుతో నా శరీరం బలంగా వూగింది.

“పేరు?” స్వప్నంలోంచి అడిగినట్టు అడిగాను.

“పద్మాంజలి!” గడ్డం పైకెత్తి స్పుటంగా చెప్పింది.

“గోత్రం?” అన్నాను.

“విజయమహర్షి గోత్రం!”

“సూత్రం?” చెప్పలేదనుకుంటూ అడిగాను.

“ఆపస్తంభన సూత్రం!” కళ్ళు ఇంతింతవి చేసి చెప్పింది.

“వంశం?” ఈసారి ఉత్సాహంగా అడిగాను.

“ఋషి వంశం!”

“జపం?” నేను పట్టు వదల్లేదు. అసలు మంత్రపుష్పానికి అన్ని వివరాలు అవసరంలేదు.

“గాయత్రీ జపం!” చిత్రంగా చెప్పింది. ఇన్ని ప్రశ్నలడిగిన ఆచార్యుడిని జీవితంలో మొదటిసారిగా చూస్తున్నట్టు.

ఈ కాలంలో కూడా సాంప్రదాయక విషయాల పట్ల ఆమెకున్న శ్రద్దకి నాకు ఆశ్చర్యమనిపించింది. ఆలోచిస్తూనే లోపలికి వెళ్లి, పరధ్యానంగా శ్లోకం పఠిస్తూ ఏదో పూజ అయిందనిపించి, హారతి తీసుకుని మళ్ళీ వాళ్ళున్న చోటికి వచ్చాను.

వాళ్ళంతా హారతి కళ్ళకద్దుకుని, కామాక్షీదేవికి నమస్కరించారు. నేను మాత్రం లతాగుల్మ శిల్పంలాంటి సౌందర్యం గలిగిన పద్మాంజలిని కన్నార్పకుండా చూస్తూనే వున్నాను.

ఇంతలో. . . పద్మాంజలి చటుక్కున పక్కకి తిరిగి, పక్కనున్న అమ్మాయిని మోచేత్తో పొడస్తూ, “ఏయ్! సీతా. . .పూజారి కుర్రవాడే. ఎంత బావున్నాడో చూడు!” ఆమె చెవిలో గుసగుసగా చెప్పింది.

“అవునే పద్మాంజలీ! పచ్చగా, బలంగా, అందంగా వున్నాడే.” అంతే గుసగుసగా అంది ఆ సీత అనే అమ్మాయి.

“అబ్బొ. . . వర్ణించేస్తున్నావే. . .నోర్ముయ్! ముందు పైట సరిజేసుకో. చూసేస్తాడు!”. పద్మాంజలి గదిమింది.

మిగిలిన అమ్మాయిలంతా ఫక్కున నవ్వారు. ఆ తర్వాత, నోటికి చేతులు అడ్డం పెట్టుకుని నవ్వుకుంటూ అక్కడ్నుంచి బయటకు పరుగుతీశారు.

అదంతా నాకు విన్పిస్తూనే వుంది. నేను బిత్తరపోయాను. ఆ తర్వాత కొద్దిసేపటికి వాళ్ళ కొంటెతనం గుర్తొచ్చి నాకు నవ్వొచ్చింది. నాలో అంత వరకూ విజృభించిన పూజ్వభావం చచ్చి, దాని స్థానంలో శృంగారం అంకురించింది. నాదనామక్రియా రాగంలోని అన్నమాచార్య కీర్తన మనసులో మెదిలింది.

“ఏమొకొ చిగురుటధరమున యెడనెడ కస్తూరి నిండెను. . . భామిని విభునకు రాసిన పత్రిక కాదు గదా. . .!”

* * * *


(సశేషం)

Tuesday, August 21, 2007

కుచేలుడు!.. 3 (కథ)

కుచేలుడు!

(‘స్వాతి’ సపరివార పత్రిక పంచరత్నాల కథల పోటీలో రూ.5,000 బహుమతి పొందిన ఉత్తమ పౌరాణిక కథ! సంచిక 9.11.2001 లో ప్రచురితమైంది. ఐదు లక్షల పాఠకులకు ‘స్వాతి’ అందించిన కానుక అన్న ప్రశంసలు ఆనాడు అందుకుంది)


కుచేలుడు నీళ్ళు తాగాక ఖాళీ పాత్రను అందుకుని, ఆమె వెనుదిరిగింది. “ఘల్లు! ఘల్లు!” మంటూ కాలి అందెలు శబ్దం చేస్తుండగా మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది.



ఇంకొంత సమయం గడిచింది. “పూజ పూర్తి కావచ్చింది. హారతి పట్టుదురుగానీ లోపలికి రండి! కుచేలవర్యా!” పిలిచింది వైజయంతీదేవి.

కుచేలుడు లేచాడు. లోనికి నడిచాడు. అతడలా లోనికి ప్రవేశించగానే, వైజయంతీదేవి అతడి వెనకనుండి బయటకి ఊయల ఉండేచోటుకి వచ్చేసింది. కుచేలుడు వున్న ఆ గది తలుపులు మూసి గడియపెట్టింది.

ఇదేమీ ఎరుగని కుచేలుడు లోనికి వెళ్ళినాడు. లోపల అంతా కలియజూశాడు. అంతే! విద్యుధ్ఘాతం తగిలిన వాడిలా ఉలిక్కిపడ్డాడు. అక్కడ పుష్పికా త్రిలోచన నిలుచుని వుంది. మామూలుగా కాదు. వివస్త్రగా. . .నగ్నంగా. . .పూర్తిగా ఒంటిమీద బట్టలు లేకుండా.

పుష్పికా త్రిలోచన రెండు చేతులూ చాపి, ‘రమ్మ’న్నట్టుగా పిలిచింది. ఆపైన “రండి! భూసురోత్తమా! రండి!. . .వచ్చి వశం చేసుకోండి. . .ఈ శరీరం మీదే!” అంది. అలా ఆమె వయ్యారంగా ఆహ్వానిస్తున్నప్పుడు ఆమె రొమ్ములు బరువుగా ఊగినాయి. పిరుదులూ, తొడలు లయబద్దంగా కదిలినాయి.

క్షణంలో మనసు చలించింది. ప్రేరణ కలిగింది. మరోక్షణం గడిచివుంటే అక్కడేదో ఉపద్రవం జరిగివుండేది. కానీ, అంతలో విచక్షణ మేల్కొంది.

అనుక్షణం భగవన్నామ స్మరణకి అలవాటు పడిన ఆయన మస్తిష్కం అంతలోనే అకస్మాత్తుగా తెప్పరిల్లింది. జరిగిన పొరపాటుని లిప్తపాటులో గ్రహించింది.

అంతే! నిలుచున్నవాడు నిలుచున్న ఫళంగా వెనక్కి తిరిగాడు. ఆ ప్రదేశం విడిచి బయటకు రాబోయాడు. తలుపులు బిగించి వున్నాయి. నెట్టి చూశాడు. రాలేదు. కాలెత్తి ఒక్క తాపుతో వాటిని విరగదన్నాడు.

కిరుక్కుమన్న శబ్దంతో గడియవూడింది. “భళ్ళు”న తెరుచుకున్నాయి తలుపులు. అక్కడ బయట గదిలో నిలుచున్న వాళ్ళెవరినీ అయన పట్టించుకోలేదు. పరుగుపెడ్తున్నట్టుగా వేగంగా నడుచుకుంటూ ఆ ఇంట్లోంచి బయటపడి ఆయన ఆ నగర వీధుల్లోకి వచ్చాడు.

‘శరీరంలోని తాపాన్ని, కామ ప్రకోపాన్ని వెంటనే చల్లార్చాలి. చేసిన తప్పుకి ప్రాయశ్ఛిత్తం తక్షణం జరగాలి.’ ఏంచేయాలో తోచలేదు. చుట్టూ చూశాడు.

అక్కడికి కొద్ది దూరంలో వీధిలోనే ఒక ముసలావిడ పొయ్యిమీద పెనం పెట్టి అట్లు వేస్తోంది. వాటిని అమ్ముకుని అక్కడే జీవిస్తోంది. అది ఆయన కంట పడింది.

అంతే! వచ్చినంత వేగంగా ఆ పెనం వైపు నడిచాడు. పెనం సమీపంలోకి చేరుకుని ముసలావిడ ఒక దోశె తీసి మలి దోశె వేసే లోపు వంగి గబుక్కున కాలి మసిలిపోతున్న ఆ పెనం మీద కూర్చుండి పోయాడు.

ఊహించని ఆ పరిణామానికి ముసలిది బిత్తరపోయి, ఒక వెర్రికేక పెట్టి అక్కడ్నుండి పరుగుదీసింది. పెనం మండుతోంది. కుచేలుడి ఆసనభాగం కాలిపోసాగింది.

“కృష్ణ పరమాత్మా!కృష్ణ పరమాత్మా!! శ్రీకృష్ణ పరమాత్మా!!! ఇది అపరాధ పరిహారమయ్యా!” కుచేలుడు పిచ్చెక్కినవాడిలా పెద్దగా అరుస్తున్నాడు.

చేసిన తప్పుని గుర్తెరిగి, ప్రచండవేగంతో పరుగు పరుగున వచ్చాడు అక్కడికి వైముఖుడు. క్షణంలో కుచేలుడిని చేరుకుని, ఆయన చేతిని పట్టుకున్నాడు. ఒక్క వుదుటున పైకెత్తి ఆయనని ప్రక్కకి ఈడ్చిపడేశాడు. అప్పటికే కుచేలుడి ఆసనభాగం బాగా కాలిపోయింది. ఇంతలో ఆఘమేఘాల మీద అక్కడికి చేరుకున్న సైనికులు ఆయనను వైద్యశాలకి తరలించారు.

* * * *

ఆ మరుసటి రోజు!

అది ద్వారకా నగరం. కుచేలురవారిల్లు. ఆ యింటి వాకిట్లో వామాక్షీదేవి నిలుచుని వుంది. ఆమె పాదాలపై పడి వైముఖుడు ప్రణమిల్లి వున్నాడు.

క్షణం తర్వాత లేచాడు. అశ్రునయనాలతో అన్నాడు.

“అమ్మా! మన్నించు తల్లీ. ముందుగా భావించినట్టే నాకు ఓటమి ఎదురైంది. దాని గురించి సంబరమేగానీ చింతలేదు. కానీ, దురదృష్టవశాత్తూ గురువర్యులను పరీక్షించే సమయంలో ఒక అపరాధం జరిగింది. కుచేలుర వారికి స్వల్పంగా గాయాలయినాయి. పక్షం రోజుల్లో కోలుకుంటారు.”

“నా వల్ల జరిగిన ఆ అపచారానికి నేనూ ప్రాయశ్ఛిత్తం చేసుకోదలిచాను. నేటినుండీ ఈ జీవితం చివరి వరకూ అష్టైశ్వర్యాలనూ వదులుకుని, కాషాయ వస్త్రాలు ధరించి కుచేలుర వారి సేవలో నేను బతుకు నెరవేర్చదలిచాను. ఇదే నా అపరాధానికి నేనిచ్చుకున్న పరిహారం!” ఆ మాటలు విని, వామాక్షీదేవి నవ్వింది. నవ్వుతూనే ఏడ్చింది.

( కుచేలుడు కథ సమాప్తం )

Monday, August 20, 2007

కుచేలుడు!.. 2 (కథ)

కుచేలుడు!

(‘స్వాతి’ సపరివార పత్రిక పంచరత్నాల కథల పోటీలో రూ.5,000 బహుమతి పొందిన ఉత్తమ పౌరాణిక కథ! సంచిక 9-.11.2001 లో ప్రచురితమైంది. ఐదు లక్షల పాఠకులకు ‘స్వాతి’ అందించిన కానుక అన్న ప్రశంసలు ఆనాడు నాకు కురిపించింది)


ఆ రోజు మిథునాపుర మహానగరం రాజకోట సందడిగా వుంది. పుష్ప అలంకరణలతో మామిడాకుల శోభలతో దీపప్రభల కాంతులతో కోట విరాజిల్లింది.

“కుచేలుడి మీద రాజుకి దయగలిగింది. కుచేలుడికి రాజానుగ్రహం కలిగింది. ఆ పరాయిదేశపు బ్రాహ్మడి పంట పండింది.” అంటూ ఆ నగర పౌరులంతా కుచేలుడి గురించి గుసగుసలుగా చెప్పుకోసాగారు.

కోటలో సభామండపం కళకళలాడింది. విధ్వాంసులతో, విధ్వన్మణులతో, మంత్రి, మహాసేనానీ, సపరివార పరిచారకగణంతో సభ నిండుగా వుంది. మహారాజు సతీసమేతుడై సింహాసనం అధిష్టించాడు. వారి ప్రక్కనే వైముఖ యువరాజు కూర్చున్నాడు.

సభ మధ్యభాగంలో మహారాజు సింహాసనంకి ఎదురుగా ప్రత్యేకంగా ఒక ఆసనం ఏర్పాటు చేయబడింది. ఆ ఆసనం మీద కుచేలుడు కూర్చుని వున్నాడు.

కుచేలుడి వైపు చూశాడు మహారాజు. “బ్రాహ్మణోత్తమా! మీ భక్తితత్పరత గురించి విన్నాం. ముగ్దులమయ్యాం. మీ వంటి వారిని తగిన విధంగా గౌరవించడం మా విధిగా మేము భావించినాం! అందుకే లక్షమంది జనాభా గలిగిన పశ్చిమంవైపు కౌముదీపుర సంస్థానాన్ని మీకు రాసివ్వదలిచాం! ఇక మీదట మీరే దానికి పాలకులు! మీకిది అంగీకారమేనా?” అన్నాడు మహారాజు.

ఆ మాటలు విని, కుచేలుడు ఆసనంలోంచి లేచాడు. వినమ్రంగా చేతులు కట్టుకున్నాడు.

“ప్రభూ! తమరి దయావీచికలు ప్రసరించిన నా జన్మ ధన్యం. నేను తమకి, తమ దేశపౌరులకి సర్వదా కృతజ్ఞుడిని. కానీ, మహారాజా నేనొక మామూలు మనిషిని. ఏదో భగవన్నామ జపంలో పూటగడుపుకునే వాడిని. నా కెందుకు ప్రభూ ఈ రాజ్యభారం. నన్ను మన్నించండి. ఆ భారం నా తలపై మోపకండి!” అన్నాడు.

కుచేలుడి మాటలు విన్న మహారాజు ఆశ్చర్యపడి, “లేదు కుచేలవర్యా! మీరు సమర్థులు! మాటలో స్పష్టత, ప్రవర్తనలో క్రమబద్దత, నడవడికలో నమ్రత కలిగివున్న మీరు కౌముదీపుర సంస్థానాధీశులుగా ఆన్ని విధాలుగా సమర్థులని నాకు తెలుసు. నిరాకరించకండి. కాదనకండి. కౌముదీపురం చేపట్టి, పరిపాలించి అఖండమయిన కీర్తి ప్రతిష్టలు సముపార్జించండి!” అన్నాడు.

కుచేలుడు మహారాజు వైపు చూశాడు. “కీర్తిప్రతిష్టలనేవి అసలెందుకు మహారాజా?” అడిగాడు.

మహారాజు నవ్వి, “అదేమిటి కుచేలవర్యా ఆమాట? కీర్తిప్రతిష్టలెందు కంటారు? ఇహలోకంలో శాశ్వితాలు కీర్తిప్రతిష్టలేగదా. . .? మహాపండితులు మీకు తెలియనిదేమున్నది.” అన్నాడు. కుచేలుడు అందుకున్నాడు.

ద్వారకానగరం నుండి మిథునాపురం వరకూ నేను రప్పించబడటానికి ఏది కారణభూతమయిందో. . . ద్వారపాలకులు కూడా దగ్గర చేరనీయని ఒక మానవాధముడిని ఏది సభామధ్యంలో కూర్చుండబెట్టిందో. . .ఏది కూటికి కొరగాని బిచ్చగాడిని క్షణంలో కౌముదీపుర సంస్థానాధీశుడిని చేసిందో. . . అది. . . అదంతా కీర్తిప్రతిష్టలే కావా మహారాజా?” అడిగాడు.

“కావచ్చు!” అన్నాడు మహారాజు సాలోచనగా.

“ఇంకా నాకెందుకు మహారాజా కీర్తిప్రతిష్టలు? అహంభావంతో మాట్లాడుతున్నానని భావించకండి. ఆశతో ప్రపంచాన్ని జయించిన వాడికన్నా ఏ ఆశా లేక కౌముదీపురాన్ని చేజిక్కించుకున్న నేను యశోవంతుడిని కాదా?”

మహారాజు మాట్లాడలేదు.

ప్రభూ! నన్ను మన్నించండి. కీర్తి అనేది కేవలం ఒక ప్రాపంచికమైన విలువ. ఆశతో కూడినది. నేను ఆథ్యాత్మిక మానవుడిని. అంటే ఆశ అంతరించిన వాడిని. ఎందుకో మానసం మాధవుడిపై లగ్నమైవుంది. మాధవుడి నామ ధ్యానమే తప్ప, ఆ మాధవుడి నుండి కూడా ఏ సాయం ఆశించనివాడిని. చివరకి మోక్షాన్ని కూడా నేను అభిలషించను. నాపై దయచూపి, నన్ను విడిచి పెట్టండి. నాపై ఏ రాజ్యభారాలూ మోపకండి.” కుచేలుడు మహారాజుని వేడుకున్నాడు.

కుచేలుడి మాటలు విన్న మహాధ్వజదైవికుడు సింహాసనం పైనుడి లేచాడు. ఒకానొక ఆనందాతిశయం కళ్ళ వెంట వర్షించగా కుచేలుడిని చేరుకున్నాడు. మెల్లగా వంగి కుచేలుడి పాదాలు స్పృశించినాడు.

“ధన్యతమయింది భక్తాగ్రేసరా! నా బ్రతుకు ధన్యతమయింది! సామ్రాజ్యవాద కాంక్షతో అనుక్షణం వెంపర్లాడే నాకు కీర్తి కూడా ప్రాపంచికమైన విలువేనని మీ ద్వారా తెలిసి, జ్ఞానోదయమయింది. ఆశ నశించినప్పుడే ఆథ్యాత్మికం సాధ్యమని భోదపడింది!”

లేచాడు. లేచి వెనక్కి తిరిగాడు. “సేనాపతీ!” అన్నాడు.

పరుగున వచ్చాడు సేనాధిపతి. “ఆనతి మహారాజా!” అన్నాడు.

“వెళ్ళండి! ఆ పవిత్ర మానవుడిని తీసుకుని ద్వారకా నగరం వెళ్ళండి. ఆయనను ఇల్లు చేర్చిరండి.” వెళ్ళబోయాడు. ఇంతలో ప్రజల్ని కన్నబిడ్డల్లా పాలించే క్షాత్ర ధర్మం ఆయన వెన్ను తట్టింది.

“అన్నట్టు మరిచాను. కుచేలురవారు మిధునాపురి ప్రవేశించి రెండు దినాలైంది. అక్కడ ఆయన బిడ్డలు ఏదైనా తిన్నారో లేదో. . . ఆయన ఏదీ పుచ్చుకోరు. వెళ్ళేప్పుడు పాతిక మానికల బియ్యమైనా పట్టుకు వెళ్ళండి. ఆయన సహధర్మచారినికి అవి యిచ్చి రండి! అంతకుమించి మనం చేయగలిగిందేమీ లేదు.” సభను మధ్యంతరంగా ఆపి, అన్యమనస్కుడై మహారాజు శయన మందిరంలోకి నడిచాడు. వైముఖుడు నవ్వుకున్నాడు.

* * * *

ధనధాన్యాలకి కుచేలుడు లొంగి రాలేదు. రాజ్యకాంక్ష, కీర్తికాంక్ష కూడా అతడిలో లేవు. ఈ విషయం వైముఖుడికి అర్థమైపోయింది. ఇక మిగిలింది స్త్రీ కాంక్ష! కుచేలుడు అధిక సంతానవంతుడు గనుక అతడిలో స్త్రీ వ్యామోహం వుండడానికి అవకాశముంది. కాబట్టి, స్త్రీని ప్రయోగిస్తే కుచేలుడు లొంగి రావచ్చు. ఈ ఆలోచన రాగానే వెంటనే దాన్ని ఆచరణలో పెట్టాడు వైముఖుడు.

మిథునాపుర రాజనర్తకి శ్రీమతి వైజయంతీదేవి ఏకైక పుత్రిక. . . కుమారి పుష్పికా త్రిలోచన అపురూప సౌందర్యవతి. ఆమెని కుచేలుడిపై ప్రయోగించదలిచాడు వైముఖుడు. కావలసిన ఏర్పాట్లన్నీ క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే పూర్తి చేసుకున్నాడు.


ఆరోజు సాయంత్రం కుచేలుడు మిథునాపురం నుండి ద్వారకకి ప్రయాణం కావలసివుందనగా ఆరోజు ఉదయమే సూర్యోదయ వేళకి వైముఖుడు కుచేలుడు విడిదిచేసిన అతిధి గృహం చేరుకున్నాడు.

ఆయనను కలిసి, “రాజనర్తకి వైజయంతీదేవి మహాలక్ష్మీ వ్రతం చేయతలపెట్టిందనీ, ఆ సందర్భంగా ఒక సద్బ్రాహ్మణునికి ఆతిధ్యం యివ్వదలచిందనీ, అందుకుగానూ కుచేలురవారిని ఎంపిక చేసుకుందనీ చెప్పి, వారి ఆతిధ్యం స్వీకరించేందుకుగానూ కుచేలుర వారిని ఒప్పించవలసిందిగా వైజయంతీదేవి తనని వేడుకున్నదనీ, ఆ పనిమీదే వచ్చాన”నీ నమ్మబలికాడు.

వైముఖుడి అభ్యర్ధన విని కుచేలుడు కొంచెం ఆలోచించాడు. ‘మహాలక్ష్మీ వ్రతం’ అనేసరికి ఆయన మససు పీకింది. ఆతిథ్యం తంతు ఒకవేళ ఉదయం నుండీ మధ్యాహ్నం వరకూ సాగినా, సాయంత్రానికి తను యధాప్రకారం ద్వారక ప్రయాణించవచ్చు. ఏ ఆటంకమూ లేదు. బాగా ఆలోచించుకుని “సరే!” నన్నాడు.

అంతే! నిముషంలోపు అతిధి గృహంకి పూలపల్లకీ రప్పించబడింది. మరికొంతసేపటికి ఆయన పల్లకీలో బయలుదేరి అక్కడినుండి నగర మధ్యంలోని వైజయంతీదేవి నివాసగృహం చేర్పించబడ్డాడు.

కొంత సమయం గడిచింది. అప్పుడు వచ్చింది లోనుండి అక్కడికి పద్దెనిమిదేళ్ళ జగద్విఖ్యాత సుందరి పుష్పికా త్రిలోచన. క్షణంసేపు కృష్ణనామ జపం ఆపి, ఆమె వైపు చూశాడు కుచేలుడు. ఏ అవయవం ఎక్కడ అమరాలో అక్కడే అమరి, ఏ వంపు ఎక్కడ తిరగాలో అక్కడే తిరిగి నిలువెల్లా సుకుమారతను నింపుకుని వుంది ఆ శరీరం. బంగరు వన్నెల కాంతితో మెరుస్తోంది.

పొడవుగా వున్న వాలుజడను పుష్పికా త్రిలోచన ఒక మృదువైన విసురుతో ముందుకేసుకుని, కొద్దిగా వంగి మొదట ఆయనకి కళ్ళతోనే ప్రణామం చేసింది. తర్వాత, పచ్చ కర్పూరం కలిపిన పళ్ళెంలోని నీళ్ళు అయనకి అందించింది.

( సశేషం )

Saturday, August 18, 2007

కుచేలుడు!.. 1 (కథ)

కుచేలుడు!
(‘స్వాతి’ సపరివార పత్రిక పంచరత్నాల కథల పోటీలో రూ.5,000 బహుమతి పొందిన ఉత్తమ పౌరాణిక కథ! సంచిక 9-.11.2001 లో ప్రచురితమైంది. ఐదు లక్షల పాఠకులకు ‘స్వాతి’ అందించిన కానుక అన్న మంచి వ్యాఖ్యని నాకు ఆనాడు అందించింది)

అది ద్వాపరయుగం నాటి కాలం! ఓ ప్రాతఃకాల వేళ! ఆ ఆలయం గర్భగుడి చుట్టూ ఒక స్త్రీ ప్రదక్షిణం చేస్తోంది. ముఫ్ఫై అయిదేళ్ళ ఫ్రౌఢ స్త్రీ! చేతులు జోడించి, మనసంతా దేవుడిపై లగ్నం చేసి నెమ్మదిగా నడుస్తూ, ఆమె భక్తిపూర్వక ప్రదక్షిణాలు చేస్తోంది.

అదంతా కొంతసేపటి నుండి ఓ పాతికేళ్ళ యువకుడు గమనిస్తున్నాడు. ప్రదక్షిణం అంటే ఎలా చేయాలో అతడికి తెలుసు. నిండుకుండని నెత్తిమీదుంచుకుని నడిచే తొమ్మిది నెలల నిండు గర్భిణిలా మెల్లగా నెమ్మదిగా, కామధేనువులా నడవాలని అతడికి తెలుసు. ఆ లక్షణం అతడికి ఆమెలో నిండుగా కనిపించింది.

ఆమె ప్రదక్షిణాలు ముగించాక ఆ యువకుడామెని సమీపించాడు. అతడీ విధంగా అడిగాడు. ఆమె ఈ విధంగా అతడికి సంజ్ఞలతో సమాధానం చెప్పింది.

అతడు : “నారీ లలామ! మీ పేరేమి చెప్పు?” మన్న. . .
ఆమె : దయమీర, “నెడమ నేత్రమును” జూపె!
అతడు : “కుటిలకుంతల! నీదు కులము నామం?”బన్న. . .
ఆమె : “అటు పంజరమునున్న పక్షినిం” జూపె!
అతడు : “మత్తేభయాన! నీదు మగని నామం?”బన్న. . .
ఆమె : తన “చేతనున్న జీర్ణ వస్త్రమును” జూపె!
అతడు : “వెలదీ! నీకేమైన బిడ్డలా చెప్పు?”మన్న
ఆమె : “మింటినున్న నక్షత్రముల” జూపె!
అతడు : “ధవుని వ్యాపారమేమి?”టన్న
ఆమె : “దండమిడియే!”

‘ఆమె సంజ్ఞలకి అర్థమేమిటా?” అని ఆ యువకుడు ఆలోచించినాడు. పేరేమిటంటే ఎడమకన్ను చూపించింది. కులమేమిటంటే శాకాహారుల మన్నట్టు రామ చిలకని చూపించింది. భర్త పేరడిగితే పేదరికానికి చిహ్నమైన చిరిగిపోయిన గుడ్డముక్కని చూపింది. బిడ్డల గురించి అడిగితే నక్షత్రాలంతటి అధిక సంతానమన్నది. భర్త వృత్తినడిగితే చేతులెత్తి దణ్ణం పెట్టింది.

అతడికేదో అర్థమయింది.

“అమ్మా! మీ పేరు వామాక్షి లేదా మీనాక్షి! మీ భర్త మహాభక్తాగ్రగణ్యుడు. . . కుచేలుడు! అవునా? అడిగాడు.

ఆమె అంగీకరించింది. తనకా “రెండు పేర్లూ వున్నాయ”న్నది. “భర్త పేరు కూడా నిజమే”నన్నది.

అ మాట విని ఆ యువకుడు చలించిపోయాడు. తర్వాత అన్నాడు.

“వెదకబోయిన తీగ కాలికి తగిలినట్టు ఎవ్వరిని చూడ నేనిక్కడకి వచ్చినానో, ఆ మహానుభావుడి యిల్లాలువి. . . మహాతల్లీ! నీ దర్శనభాగ్యమయింది. ముందుగా నీకు నా హృదయపూర్వక నమస్సులు” వినయంగా చేతులు జోడించి నమస్కరించినాడు.

“అమ్మా! నా పేరు వైముఖుడు. మిథునాపుర సామంతరాజు మహాధ్వజదైవికుల వారి ఏకైక పుత్రుడిని. నిరంతరం శ్రీకృష్ణ నామ ధ్యాన పారవశ్యంలో మునిగితేలే కుచేలుర వారి కీర్తి దశదిశలా వ్యాపించుకుంది. దేశదేశాంతరాలూ విస్తరించుకుంది. అది విని, ఆ మహాత్ముడిని చూడదలిచాను. ఆయనకి శిష్యరికం చేయదలిచాను. ఆ ప్రయత్నంలో భాగంగా. . . ఆ భక్తిని పరీక్షించవచ్చాను. మీకు అభ్యంతరమా?” అడిగాడు.

అమాయకంగా ప్రశ్నిస్తున్న ఆ యువకుడిని చూసి, ఆమె చిన్నగా నవ్వింది. ఆపైన. . . “సత్యం చూడగోరిన వారిని అభ్యంతరపరచను. . .నేనెవరిని?” అన్నది.
* * * *

“అమ్మా! బిక్షకుడిని. ఏదైనావుంటే దానం చేస్తారా?” అన్నాడు కుచేలుడు ఆ యింటి ముందాగి.

ఇంట్లోంచి ఆడవాళ్ళెవరూ బయటికి రాలేదు. వైముఖుడు వచ్చాడు. వచ్చి, తొలిసారిగా కుచేలుడనబడే ఆ బిక్షకుడిని పరిశీలించి చూశాడు.

మాసినగడ్డం, చిరిగిన బట్టలు, చేతికి రాగి కడియం, చేతిలో గుడ్డసంచీ, తైల సంస్కారం లేక వెనక ముడిపెట్టకున్న జుట్టు, చెప్పులులేని కాళ్ళు. . .దరిద్రానికి నిలువెత్తు నిదర్శనంలా కనిపిస్తున్న ఆ పేద బ్రాహ్మణుడిని చూసి, “అహా! ఇతడికా అంతటి పేరు ప్రఖ్యాతులు?” అనుకున్నాడు. మళ్ళీ వెనక్కి ఇంట్లోకెళ్ళి, లోనుండి ఒక డబ్బు మూట పట్టుకొచ్చాడు.

ఆ మూటని కుచేలుడికందిస్తూ, “ఇదిగోవయ్యా బ్రాహ్మడా! వెయ్యి వరహాల బంగారు నాణేలు. పిల్లలుగల వాడిలా కన్పిస్తున్నావు. తీసుకో!” అన్నాడు.

అది చూసి కుచేలుడు నివ్వెరపోయాడు. అంతలోనే, “కృష్ణ పరమాత్మా!” అన్నాడు. ఆపైన. . .

“నాకెందుకు నాయనా బంగారు నాణేలు? నా పిల్లలు బంగారం తినరు. అంబలిలో గింజలు తింటారు. అటుకులు తింటారు. పండుగరోజొస్తే కడుపారగా అన్నం తింటారు. దయగల మారాజులా కనిపిస్తున్నావు. ధనం నాకు వద్దు. కాసిన్ని ధాన్యం వుంటే ఇప్పించు!” అర్థించాడు. మళ్ళీ, “శ్రీకృష్ణ పరమాత్మా!” అన్నాడు.

వైముఖుడు ఆశ్చర్యపడలేదు. “ఇదేమిటయ్యా పిచ్చి బ్రాహ్మడా! ధనం వద్దంటావు. ధాన్యం కావాలంటావు. మాటిమాటికీ కృష్ణపరమాత్ముడా అంటూంటావు. సరే. . .నువ్వడిగినట్టే ధాన్యం ఇప్పిస్తాను. నూటపదహారు బండ్ల ధాన్యం. సరేనా?” అన్నాడు.

కుచేలుడు అబ్బురపడి, “ఎందుకు నాయనా నామీద నీకింతటి దయ?” అన్నాడు.

“దయ కాదు. అందుకు ప్రతిఫలంగా నువ్వొకటి నాకు యివ్వాల్సివుంటుంది!”. . .వైముఖుడు.

“భాగ్యవంతుడివి. నీకు నేనేమివ్వగలను తండ్రీ?”

“శ్రీకృష్ణుని నామం! ఒక ఘడియ కాలం పాటు నాకు నువ్వు అరువు యివ్వాలి!” అన్నాడతడు.

వైముఖుడిని చిత్రంగా చూసేడు కుచేలుడు.

తర్వాత చిన్నగా నవ్వాడు.

“శ్రీకృష్ణుని నామం నేను నీకివ్వడమేమిటి? అది ప్రతివారికి స్వంతమే కదా!” అన్నాడు.

“నా ఉద్దేశ్యం అది కాదు. ఒక ఘడియకాలంపాటు దాన్ని నువ్వు స్మరించకూడదు. ఉచ్ఛరించకూడదు.”

ఆ మాట విని భరించలేక, “శ్రీకృష్ణ పరమాత్మా!” బాధగా అన్నాడు కుచేలుడు.

తర్వాత, “నీ పేరేమిటి తండ్రీ?” అడిగాడు.

“వైముఖుడు!”

“చూడు వైముఖ కుమారా! నాకు లేని ధాన్యం గురించి నేను యాచిస్తున్నాను. కానీ, నువ్వు నీలో వున్న పరమాత్ముడి కోసం. . .బయటి వాడిని నన్ను యాచిస్తున్నావు. అయినా, భగవంతుడిని అమ్ముకుని ధాన్యం పట్టుకురమ్మని నా భార్యాబిడ్డలు నన్ను కోరలేదయ్యా. పైగా అంత ధాన్యం దాచను వాళ్లకి ధాన్యాగారాలు కూడా లేవు. నీ ధాన్యం నీ దగ్గరే వుంచు. వస్తాను తండ్రీ!” చెప్పేసి, అక్కడ్నుంచి కదిలాడు కుచేలుడు.

శ్రీకృష్ణపరమాత్మా!” అనుకుంటూ ఎండనపడి నడిచి వెళ్తున్న ఆ పేద బ్రాహ్మణ యాచకుడిని సంతృప్తిగా చూసుకున్నాడు వైముఖుడు. . .సజల నయనాలతో.

* * * *

( సశేషం )

Tuesday, August 14, 2007

ప్రసంగి!.. 4 (కథ)

శ్రీమంతుడైన నా బాల్య స్నేహితుడొకతడు నా హైదరాబాదు తిరుగు ప్రయాణం గురించి తెలుసుకుని, తన కారులో నన్ను నెల్లూరు రైల్వేస్టేషన్ దాకా దిగవిడిచి రమ్మని ‘డ్రైవర్’ ని పంపేడు.

నేనూ, నిర్మలా ప్రయాణమయ్యాం! ఆమెతో కలిసి ప్రయాణం చేయడం నా జీవితంలో అదే మొదటిసారి. అక్కడి నుండి నెల్లూరికి గంట సేపు ప్రయాణం. నెల్లూరు చేరే వరకూ నిర్మల నాతో కబుర్లు చెపుతూనే వుంది.

ఆ మాటల్లో మా వూరి ప్రజలంతా పాత్రలు! సరోజ జడ పిన్నులు పోగొట్టుకుని భర్త చేత పుట్టింటికి వెళ్ళగొట్టించుకోవడం, సుబ్బుసుందరం పక్కింటి పదహారేళ్ళ రామసుబ్బమ్మని కన్నుగీటి చెప్పుదెబ్బలు తినడం, దౌర్భాగ్యుడు తాగుబోతు పాపారావు తన యింట్లో డబ్బులు తనే దొంగిలించి భార్య కేసు పెట్టడం మూలంగా పోలీసుల చేతుల్లో తన్నులు తినడం, పన్నెండేళ్ళ ప్రమీలారాణి ఎదురింటి అరవ కుర్రాడితో లేచిపోయి మళ్ళీ వారం తిరక్కుండానే తిరిగి రావడం, నిర్మల తోటి టీచర్ ఒకావిడ బాక్స్ లో అన్నంఉప్మా తెచ్చుకుని విందుకి ఈవిడని ఆహ్వానించకుండా తనొక్కతే తినడం, స్కూలు విద్యార్ధిని చంపకమాల నిర్మల బ్యాగ్ లోని గోళ్ళపెయింట్ దొంగిలించి షాపులో అమ్మడం ద్వారా పట్టుపడడం, నిర్మల పెన్ లోని ‘రీఫిల్’ అయిపోయినప్పుడు బాలుడు ‘గుడ్డు’ గాడి పెన్ అడిగి తీసుకుని వాడు చూడకుండా రీఫిల్లు మార్పుచేసి పొంగిపోవడం. . . ఇవన్నీ ఆ మాటల్లోని సన్నివేశాలు! అంతా లోయర్ మిడిల్ క్లాస్ భావజాలం! గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ నిర్మల చెప్పడం, జ్ఞాపకాన్ని వదిలేసి నేను వినడం. . . మా ప్రయాణం ఆహ్లాదంగానే సాగింది.

నేను నిర్మలకి ఎడమవైపున కూర్చున్నాను. మాటల మధ్యలో ఆమె విరగబడి నవ్వుతుంది. అప్పుడు కడుపు దగ్గర కండరాలు అద్భుతంగా మడతలు పడతాయి. సాగుతాయి. రొమ్ములు ఎగసెగసి పడతాయి. కనుబొమలు నాట్యం చేస్తాయి. పైట “నేనోపలేనమ్మా!” అంటూ కిందికి జారుతుంది. నిర్మల సర్దుతుంది. మళ్ళీ జారుతుంది.

అదంతా ఒక ప్రహసనం! . .కథాకమామీషు!! . .భోగట్టా!!! . .ఆమెతో మాటయినా చెప్పకుండా నేను ఆ సౌందర్యం తస్కరించి, అనుభిస్తాను. మిత్రద్రోహం చేస్తాను. ఎక్కడ అందం కనిపిస్తే అక్కడికి కక్కుర్తి పడి పరుగులుదీసే ఈ ఇంద్రియాల్నీ, ఏది చూడాలనుకుంటామో దాన్నే ఉన్నతంగా చూపించే ఈ మాయమనసునీ నేను నిరోధించలేను!

చేకటి పడింది! కారు రైల్వేస్టేషన్ చేరుకుంది!

జీవితం పరుగులు తీసినట్టు స్టేషన్ రద్దీగా సందడిగా వుంది. మరణ భయాన్ని కల్పిస్తూ రైళ్ళు దెయ్యాలై కూతలు పెడతాయి. ప్రాణం గగుర్పొడిచేట్టు యంత్రాలు ధ్వనులు చేస్తాయి. విద్యుద్దీపాలతో షాపులు శోభాయమానంగా వెలుగొందుతాయి. ఆలోచన ఆధునికత రూపంలో వెల్లి విరుస్తుంది. మనుషులు మరమనుషులై మాట్లాడుకుంటారు. ప్రేమలూ, ఆప్యాయతలూ. . . ద్వేషాలూ, పగలూ అన్నీ ముసుగులు తొలగించుకుని అక్కడ బయటపడతాయి. రక్తం విలువెంతో చూపించుకుంటాయి.

ఎక్కడికో ఈ విధాన పయనం!!

నేను వెళ్ళవలసిన “రైలు యింకా అరగంట లేటుంద”న్నాడు అనౌన్సరు. నేనూ, నిర్మలా రెస్ట్ రూంలోకి వెళ్ళలేదు. ఫాట్ ఫాం నెంబరు కనుక్కుని అక్కడే ఒక సిమెంటు బెంచీ మీద కూర్చున్నాం. వృత్తి వ్యత్యాసాన్ని పాటిస్తూ కారు డ్రైవర్ మరో బెంచీ మీద అసీనుడయాడు. నేను ట్రైనెక్కాక నిర్మలని తీసుకుని అతడు మళ్ళీ అల్లూరు చేరవలసి వుంది.

ఏదో ట్రైనొచ్చింది. రద్దీ మరింత పెరిగింది. టీ షాపు కుర్రాళ్ళ పరుగులూ, పండ్ల కొట్టు వాళ్ళ అరుపులూ, బిచ్చగాళ్ళ కేకలూ, పిల్లల కేరింతలూ, పెద్దల పలకరింపులూ, యింకా వీడ్కోళ్ళూ. . . ఆ గందరగోళంలో నేనూ నిర్మలా మాట్లాడుకోలేదు. చూస్తున్నాం!

మాకు అటువైపున అవిటి బిక్షగాడొకడు చిల్లరనాణేలు అడుక్కుంటున్నాడు. అతడికి పుట్టుకతోనే రెండు చేతులూ లేనట్టుంది. మెడలో రేకు డబ్బా ఒకటి వ్రేలాడుతోంది. అప్తులెవరో వాడి మొల చుట్టూ రెండు గజాల గుడ్డ చుట్టారు.

“మళ్ళీ ఎప్పుడొస్తావు?” అడిగింది నిర్మల.

“ఎప్పుడో!” అన్నాను నిర్లిప్తంగా.

“క్రితంసారి నువ్వొచ్చి అప్పుడే సంవత్సరమైంది. ఈసారి విజయనీ, పిల్లల్నీ తీసుకురా.” అంది.

“తప్పకుండా.” అన్నాను.

అవిటివాడు మేంకూర్చున్న చోటికి చేరుకున్నాడు.

“దర్మవయ్యా బాబూ. . .! దరమం. . .!” అన్నాడు.

చిల్లర కోసం నిర్మల బ్యాగ్ తెరిచింది. అప్పుడే వూహించని విధంగా ఓ చిత్రమైన సంఘటన జరిగింది.

అవిటివాడి మొలకి చుట్టివున్న గుడ్డముక్క వూడి, గబుక్కున క్రిందికి జారిపోయింది. దాన్ని తిరిగి అందుకుని కట్టుకోడానికి వాడికి చేతులు లేవు. చేసేదేమీలేక నగ్నదేహుడై అతడు గబుక్కున నేలమీద కూర్చుని మోకాళ్ళు ముడుచుకున్నాడు. సహాయం కోసం తన వారెవరైనా వుంటారేమోనని చుట్టూ చూశాడు.

ఊహించని పరిణామం నన్ను మూగవాడ్ని చేసింది. నేను చూస్తూండిపోయాను. యథాలాపంగా బ్యాగ్ లోంచి చిల్లర పైసలు తీస్తున్న నిర్మల, వున్నట్టుండి అకస్మాత్తుగా ఆ దృశ్యం చూసింది. చటుక్కున వెంటనే తల పక్కకి తిప్పుకుంటూ. . .

“చక్రీ! వెళ్ళి అతడికి బట్ట కట్టు.” అంది.

నేను విస్తుపోయాను. “ఏమిటి నేనా?” అన్నాను.

“నువ్వే. ముందు అతడి మొలకి బట్ట చుట్టు. అంది నిర్మల మళ్లీ.” ఆమె పరిస్థితి నాకేం అర్థం కాలేదు.

“ఏంటి నిర్మలా నువ్వంటున్నది. నేను వెళ్ళి ఆ అవిటివాడికి పంచె కట్టాలా?” విసురుగా అడిగాను.

నిర్మల నావైపు అర్థంగానట్టు చూస్తూ, “అవును. ఏం?” అంది.

“నేనేమిటీ. ..వాడికి బట్ట కట్టడమేమిటి. నీకేమయినా పిచ్చి పట్టిందా?” కోపంగా అన్నాను.

నిర్మల క్షణం సేపు నా వైపు చిత్రంగా చూసింది. ఆపైన ఏదో నిశ్చయించుకున్నదాన్లా చటుక్కున బెంచీ మీది నుండి లేచింది. నా ప్రమేయం ఏదీ లేకుండా అక్కడ్నుంచి కదిలి అవిటివాడిని చేరుకుంది. క్షణంలో నేలమీదున్న గుడ్డ ముక్కను చేత్తో అందుకుని, అవిటివాడిని లేచి నిలబడమని చెప్తూ, చేత్తో సంజ్ఞ చేసింది.

ఆ హఠాత్పరిణామానికి అవిటివాడు నివ్వెరపోయాడు. విస్మయం చెందాడు. అది కలో నిజమో నన్న సంశయం ముఖంలో తాండవిస్తుండగా, యాంత్రికంగానే లేచి నిలబడిపోయాడు.

ఇంతలో నిర్మల చేతిలోని గుడ్డ ముక్కని అతడి మొలకి అడ్డం పెడ్తూ, అతడి నడుము చుట్టూ గుడ్డని గబగబా చుట్టివేసింది. పట్టుకోసం పైన మొలత్రాడు వేసింది.

ఆకసమున ఒక మెరుపు మెరిసింది!

అక్కడి స్థలం ప్రేమ వికాసం జరుపుకుంది!!

అప్పటి కాలం మానవతని ప్రకటించుకుంది!!!

అవిటివాడు ఆ చర్యకి పూర్తిగా అవాక్కయాడు. తర్వాత తేరుకుని, “మాయమ్మే!” అన్నాడు. కృతజ్ఞతని వెలిబుచ్చుకోవడం అంతకుమించి అతడికి చేతగాదు. దణ్ణం పెట్టడానికి కూడా వాడికి చేతులు లేవు. అతడొక దురదృష్ట జీవుడు.

సరిగ్గా క్షణం తర్వాత నిర్మల వెనక్కి తిరిగి నన్ను చేరుకుని, “పాపం. అతడి స్థితి చూడు చక్రీ!” అంది.

అంతక్రితమే నా అల్పత్వానికి నేను సిగ్గుపడడం, నిర్మల లోని మహోగ్రమైన ఔదార్యం చూసి దిగ్భ్రాంతి చెందడం, రెండూ జరిగిపోయాయి! అలవిగాని కన్నీరు అప్పటికే నా కళ్ళని కమ్మేసింది. ఎందుకంటే. . .ఎంతగా నేను ‘స్టేటస్’ అన్న మేలి ముసుగులో అవిటివాడికి దూరంగా జరిగినా, నిర్మల చేసిన పని ఈ లోకంలో ప్రతి మనిషీ నిర్వర్తించవలసిన కనీస మానవతా ధర్మమని నాకు తెలుసు. నాకే కాదు. . .మనసున్న ప్రతివాళ్ళకి అది క్షుణ్ణంగా తెలుసు!

అప్పుడు. . . ఆ క్షణంలో అక్కడ నేను లేను. అమె లేదు. ఒక పరిశీలన మాత్రం అక్కడ శూన్యంలో అవిష్కరించుకుంది.

ఆమె ఒక స్త్రీ! సంకుచితమైనది. విశాలమై విస్తరించుకున్న తాత్విక సిద్ధాంతాలు ఆమెకి తెలీవు. పరిధి నుండి కేంద్రం వైపు దూసుకుపోయే తపన అమెలో తొలినాటి నుండీ కలుగలేదు. లోనుండి వచ్చిన ఒక ధ్వని ప్రకారంగా ఆమె ఎప్పుడూ మసలుకుంటుంది. తన జీవితంలో ప్రతి నడకా ఆ ధ్వననుసారంగానే నడిచింది. ఆమె ప్రయాణంలో గమ్యానికి చోటు లేదు. చేసే పనులకీ, తీసుకున్న నిర్ణయాలకే ఆమె వద్ద హేతువు లభించదు. మనసులోని మృదుత్వం కారణంగా అందరూ ఆమెకి మంచివారిలాగే అన్పిస్తారు.

ప్రేమ, ద్వేషం. . .మంచీ చెడూ. . . ఈ వివక్ష ఆమెకి లేదు. వాటిని వున్నవి వున్నట్టుగానే స్వీకరించింది. ఆ ప్రయత్నంలో ఆమె వివాహాన్నితనకి ప్రతిబంధకంగా భావించింది. కూడదనుకున్నది. ఆ నిశ్చయం జరగగానే. . .ఒక ఉదాత్త గంభీరమైన ఒరవడిలో ఆమె జీవితం విశాలంగా వ్వాపించుకుంది.

బంధాలు లేవు. బాధ్యతలు లేవు. ఎవరోమనుకుంటారోనన్న భయం లేదు. రేపనేది అసలే లేదు. ‘ఈ రోజు’ జీవితంలో ప్రధానమైంది. తనకి తోచిన విశుద్ధమైన దారిలో ఆమె రోజుని ప్రారంభిస్తుంది. అదే కారణంగా. . . వయసులో వున్న మగవాడి మొలకి నిర్భీతిగా బట్ట కట్ట గలిగింది.

చారిత్రక కాలగతిలో శ్రమించి, వ్వభిచరించి, చివరికి మరణించి సైతం తమ బిడ్డల్ని కాపాడుకున్న స్త్రీమూర్తులెందరో నాకా క్షణంలో గుర్తుకొచ్చారు. సమస్త మానవ మనో వ్యాపారానికి కేంద్ర బిందువైనదేదో నాకు స్థూలంగా తెలియసాగింది.

కోరిక, ప్రతిఫలాపేక్ష లేని చోట క్రియ నిండుగా, సంపూర్ణంగా వుంటుంది. కనుక, అది జీవించడంలో ఒక భాగమంటారు పెద్దలు! నిర్మల సహచర్యం మూలంగా కలిగిన ప్రోద్భలంతో నేనా మాటని నిరాకరిస్తున్నాను. అది జీవితంలో ఒక భాగం కానేరదు. అసలదే జీవితం!!

ప్రేమ మానవతకి చిహ్నం కాదు! అదే మానవత్వం!!!

ఈ మాట ఈ భూమిపై నివసించబోయే చిట్ట చివరి మానవుడికి తెలియజేయాలని ఆ క్షణంలో నాకొక కాంక్ష కలిగింది!

“చక్రీ.! ట్రైనొచ్చినట్టుంది.” అంది నిర్మల.

ఆలోచనల నుండి బయల్పడి, బ్రీఫ్ కేస్ అందుకుంటూ నేను కదిలాను.

నేను కదిలాను... నేను కదిలాను!!!

(ప్రసంగి! కథ సమాప్తం)

Monday, August 13, 2007

ప్రసంగి!.. 3 (కథ)

నా నుండి ఆ మాట వూహించకపోవడం వల్ల క్షణం సేపు ఆమె స్తబ్దురాలైంది. ఆపైన ఒక నిశ్చయానికి వచ్చిన దాన్లా. . .

“నేను పెళ్ళి చేసుకోదలుచుకోలేదు చక్రీ!” అంది స్థిరంగా. . . తలొంచుకుని అరచేతిని చూపుడు వేలితో నొక్కుకోసాగింది.

“నీ జీవితం గురించి నువ్వే నిర్ణయాలు తీసుకోగలంత పెద్దదానవై పోయావన్న మాట.” అన్నాను.

“ఇందులో పెద్దరికం ఏముంది? నాకు చేసుకోవాలనిపించలేదు. చేసుకోవడం లేదు. నీకు చేసుకోవాలనిపించింది. చేసుకున్నావు. అంత మాత్రం చేత నువ్వూ పెద్దవాడివైనట్టేనా?” ఎదురు ప్రశ్నించింది.

“నా విషయం వేరు నిర్మలా! నేను గుంపులో మనిషిని. సంఘం నన్ను బాధించదు. కానీ నువ్వు ధ్వజం లాంటి దానవు! ఎందుకంటే వివాహం వదులుకోవడం అనే నిర్ణయంతో నీ జీవితం ప్రత్యేకతను సంతరించుకుంది. ఇక సంఘం నిన్నొదిలి పెట్టదు. నీపై కన్నేసి వుంచుతుంది. ఒక విశిష్టతతో ప్రపంచానికి ఎదురు నిల్చినప్పుడు అది విసిరే సవాళ్ళను సమర్ధవంతంగా తిప్పికొట్టగలిగే శక్తి సామర్థ్యాలు నీకుండాలి.”

“ఏమో బాబూ! నా కవన్నీ తెలీవు.” అంది అమాయకంగా.

“అదే తప్పంటున్నాను. తెలీకపోవడం గొప్పలక్షణం కాదు. అది మళ్ళీ రేపు భవిష్యత్తులో పశ్చాత్తాపపడే అవసరాన్ని కల్పించకూడదు.”

ఆమె కొద్దిసేపు ఆలోచించింది! ఆ తర్వాత అంది.

నువ్వు కొంచెం ఎక్కువగా ఆలోచిస్తావేమో చక్రీ!”

“కావచ్చు! అందులో నిజం లేదనగలవా?”

అమె మౌనం వహించింది.

“అయితే నువ్వనేదేమిటి. నేను పెళ్ళి చేసుకోవాలంటావా?” క్షణం తర్వాత అడిగింది.

“అనను. ఏది చేసినా దాని వెనుక ఒక ఉద్దేశ్యం, గమ్యం వుండాలంటాను. అ పని వల్ల మనం సాధించదలచుకున్నదేమిటో స్పష్టంగా ఎరిగి వుండాలంటాను.” అన్నాను.

“పోనీలే. నన్నిలా బతకనిద్దూ!.” అంది.

“బ్రతకనివ్వడం కాదు నిర్మలా. నాకు నువ్వు ఆత్మీయురాలవు. నీ జీవితం గురించిన కష్టసుఖాలతో నాకు కొంతయినా ప్రమేయం వుందనుకుంటాను.” అన్నాను.

ఆ మాట విని ఆమె కన్నీరు పెట్టుకుంది. వెక్కిళ్ళ మధ్య, “నా మంచిచెడ్డలెవరిక్కావాలి. కావలసిన అక్కబావలకే అవి పట్టలేదు.” అని తనలో తనే గొనుక్కుంది.

దుఃఖంలో నిర్మల అందంగా వుండదు. ఆమెది మనఃపూర్వకమైన శోకం కాదు. సందర్భోచితమైనది. అశాశ్వతమైనది. నేనామెని ఓదార్చలేదు.

రెండు నిముషాల తర్వాత ఆమె ఏడ్పులోంచి తెప్పరిల్లి, “నాబాధ నీకేం తెలుస్తుంది?”. పమిటచెంగుతో కన్నీరు తుడుచుకుంటూ అన్నది.

“ఏమిటి నీ బాధ. . . ఎవరినైనా ప్రేమించావా?” ఆమె కళ్ళలోకి చూస్తూ అడిగాను.

“ఛీ! అటువంటిదేం లేదు. వుంటే నీకు చెప్పడానికి నాకు భయమేముంది.” అంది వెంటనే. ఎందుకో నా మనసు తేలిక పడ్డట్టయింది ఆమె నోటి నుండి ఆ మాట వినగానే.

“అయితే యింకేమిటి బాధ. నీ బాల్య స్నేహితుడిని. . . అది తెలుసుకొనే యోగ్యత నాకు లేదంటావా?”

“ఛీ అదేం లేదు.” నిర్మల వెంటనే అంది. “ఎందుకో ఎంతగా అలోచించినా నాకు పెళ్ళి వద్దనే అనిపిస్తుంది. నన్ను బలవంతపెట్టకు చక్రీ!” అందామె.

“బలవంతపెట్టడం నా ఉద్దేశ్యం కాదు.” అన్నాను.

“అయితే ఈ పెళ్ళి ప్రసక్తి దయచేసి యిక ముందెప్పుడూ మన మధ్య తీసుకురాకు.” నిర్మల ఖచ్చితంగా చెప్పేసింది. మళ్ళీ, “అయినా నన్నంటావుగానీ నీజీవితానికున్నాయా ఒక లక్ష్యం, గమ్యం అనేవి?” అడిగింది.

ఆమె మాటకి నాకు నవ్వొచ్చింది. నాలో అహం మేలుకుంది.

ఒకానొక అజ్ఞానపు క్షణంలో. . . నాకు తెలీకుండా నేనే జన్మించి, అమ్మ చనుబాలలో ఆది సంవేదన అనుభవించి. . .ఆటపాటలలో అద్వితీయుడనై రాణించి. . .సంఘ విద్యా సముపార్జనలో సారస్వత చక్రవర్తినై, పుస్తకాల్ని పఠించి. . .పరీక్షల్ని పరివీక్షించి. . .ఆత్మజ్ఞాన అవలోకనంలో విలువల వలువలు వూడదీసి. . .విశ్వతత్వాలు స్మరించి. . . మానవ శ్రేయస్సు మహా లక్ష్యమై పోగా. . .భాగ్యనగరంలో నే చేపట్టిన సేవాకార్యక్రమాలు ఎన్నని? రక్త దాన శిభిరాలూ, నేత్రదాన ప్రచారాలూ, బ్లడ్ బ్యాంకులూ, అనాధాశ్రమ నిర్మాణ కార్యక్రమాలు, సాహిత్యసేవలూ, యిలా ఎన్నో!. . . “ఈ ప్రపంచపు దొడ్డబిడ్డగా ఉద్భవించాల”నీ, “ఒక సంపూర్ణ మానవునిగా పరిణమించాల”నీ, నేను కంటున్న కల, కడుతున్న కోట. . .యింతెందుకు కనుచూపు మేరలో. . .

నా జీవితం ఒక వేద సంకలనం!! నేనొక ఈశ్వరుడిని!!!

నేనిట్లా అలోచిస్తుండగా, నిర్మల నా మౌనాన్ని మరోలా భావించుకుని, “నా మాటలకి బాధ పడ్తున్నావా చక్రీ?” అంది.

నా ఉద్రేకానికి సిగ్గుపడి, నేను ఈ లోకంలోకి వస్తూ, “లేదు. నేను వేరే ఆలోచిస్తున్నాను”. అన్నాను.

“ఏమాలోచించావు చెప్పు. నా గురించా?” అంది.

అనంతమైన భావాన్ని ఒక్కమాటలో చెప్పలేక విఫలమయ్యా

“అదేమీ లేదులే!” అని సరిపెట్టా.

“పోన్లే రాక రాకొచ్చావు. నా బాధల్తో నిన్ను కష్టపెట్టడమెందుకు. నాల్రోజులు వుంటున్నావా?” అడిగింది.

“లేదు. రేపు సాయంత్రం వెళ్ళాలి.” అన్నాను.

“నువ్వెప్పుడూ యిలాగే చేస్తావేమిటి. . .అక్కడేదో సముద్రాల్ని పుక్కిలించాలన్నట్టు? అని, “పోన్లే దేనికెళ్తున్నావు. . .ట్రైనుకా. . .బస్సుకా?” అంది.

“ట్రైనుకి.” అన్నా.

“వెళ్ళేప్పుడు చెప్పు నేను కూడా నెల్లూరు వరకూ వచ్చి నిన్ను ట్రైనెక్కిస్తాను.” అంది.

నాకు ఆశ్చర్యమేసింది. ఇంతకు ముందెప్పుడూ నిర్మల నన్ను సాగనంపడానికి రైల్వేస్టేషన్ దాకా వచ్చి ఎరుగదు. . . కనీసం మా యింటి దాకా కూడా. వివాహాన్ని వదులుకోవడం వల్ల ఆమెలో కన్పించిన ఆకస్మిక మార్పులు అప్పుడే నాకు మెల్లగా అర్ధం కాసాగాయి.

“నువ్వు రైల్వేస్టేషన్ దాకా వస్తావా?” అశ్చర్యంగా అడిగాను.

“ఏం?” అంది.

నేనిక ఆమెతో మాట్లాడదలచుకోలేదు. అలాగే నని చెప్పి, అక్కడ్నుంచి కదిలాను. “రేపు నిర్మలతో కారు ప్రయాణం ఎలా వుంటుందబ్బా. . . ఇరవై ఎనిమిది కిలోమీటర్ల కారు ప్రయాణం. . .?” అనుకుంటూ.

* * * *
(సశేషం)

Friday, August 10, 2007

ప్రసంగి!..2 (కథ)

నేను మాట్లాడలేదు.

“ఆ సంగతులన్నీ నీకెందుకు మగవాడివి.” తనే అంది నన్ను విడదీస్తూ.

అందులో మగవాళ్ళకి సబంధం లేని విషయం ఏముందో నాకు అర్ధంగాలేదు. పైగా ఆమె గుర్తు చేస్తే తప్ప, ఆమె ముందు నేను మగవాడినన్న విషయం నాకూ స్ఫురించదు. మొత్తానికి ఎందుకో నిర్మల పెళ్ళి విషయం నా దగ్గర దాటవేస్తోందని తెలిసింది. అందుకే నేనారోజు మళ్ళీ ఆ విషయం గురించి కదిలించదలచుకోలేదు.

ఏది ఏమైనా, ఈసారి మాత్రం అల్లూరు వెళ్ళినప్పుడు నిర్మలతో ఆ విషయం మాట్లాడి అమీతుమీ తేల్చుకోవాలని ముందే గట్టిగా నిశ్చయించుకున్నాను.

* * * *

ఆ తర్వాత రెండు నెలలకి నేను అల్లూరు వెళ్ళడం జరిగింది.

నా తల్లిదండ్రులతో కుటుంబ విషయాలన్నీ మాట్లాడుకుని, కొంత విశ్రాంతి తీసుకున్న తర్వాత రెండో రోజు నేను తాపీగా నిర్మల యింటికి బయలుదేరాను.

నిర్మల వాకిట్లో నిల్చుని పక్షులకి బియ్యం గింజలు విసుర్తోంది. తల స్నానం చేసి ఎరుపురంగు చీర కట్టుకుంది. నన్ను చూసిన సంబరంలో పళ్ళెంలోని గింజలన్నీ ఒకేసారి నేలపై ఒలకబోసి, “చక్రీ! ఎప్పుడొచ్చావు” అంది దూరం నుండే. మళ్ళీ వెనక్కి తిరిగి, లోపలికెళ్ళి ఒక వాలు కుర్చీ వేస్తూ, “రా! కూర్చో!” అంది.

నేను కూర్చున్నాను.

నా ఎదురుగా చాప పరుచుకుని దానిపై కూర్చుంటూ, “ఎప్పుడొచ్చేవు?” అంది మళ్ళీ.

“నిన్న ఉదయం వచ్చాను.” అన్నా.

“నిన్ననగా వచ్చిన వాడివి. . .యిప్పుడా యిక్కడికి రావడం” నిష్ఠూరమాడింది.

“ప్రయాణంలో అలిసిపోయాను” అన్నా.

“పోన్లే విజయ బాగుందా?” అంది నా భార్య నుద్దేశించి.

“బావుంది!”

“అది కిరణ్మయీ?” అని, చప్పున నుదుటి మీద చేయి ఆనించి, ఏదో గుర్తుకుతెచ్చుకుంటూ, “అబ్బ వాడు. . .చిచ్చరపిడుగు. . .వాడితో వేగలేం బాబూ. . .ఆ. . గుర్తొచ్చింది రాకేశ్! వాడు బాగున్నాడా?” అంది నా పిల్లల్ని గుర్తుచేసుకుంటూ.


“లక్షణంగా వున్నారు.” అన్నాను.

నిర్మల ముఖంలో క్రితంసారి నేజూసిన ఒంటరితనం, భయం తాలూకూ నీడలు లేవు. వయసు ఆమె శరీరాన్ని ఆకర్షనీయమైన మార్పులకి గురిచేసింది. విచ్చుకున్న పుష్పంలా ఆమె ముఖం అందంగా వికసించింది. సూర్యచంద్రులు ఉదయించి, అస్తమించడానికన్నట్టు నుదురు విశాలమయింది. శరీరం లోని మృదుత్వం, రక్తం చెంపల్లోకి వ్యాపించుకుని అవి ఎర్రబారి, చిన్నతనంలో నేను చేసిన గాయాన్ని మాయం చేసాయి. నిశీధిలోని నల్లదనాన్ని సంగ్రహించుకుని ఆ కనుబొమలు ధన్యత చెందాయి.

నేను తదేకంగా చూడడం గమనించి నిర్మల, “ఏంటలా చూస్తున్నావు?” అంది.

“నువ్వు లావయ్యేవు!” అన్నాను.

ఆమె సంబరపడింది. “అవునా?” అంటూ, ఒకసారి తన ఒళ్ళు చూసుకుని, “అయితే నేను సుఖంగా వున్నానంటావు.” అంది. . .పమిటని జాకెట్లోకి దోపుకుంటూ.

“లావవడమనేది సుఖానికి నిదర్శనమో కాదో నాకు తెలీదు.” అన్నా. ఆమె మాటని కావాలనే ఖండించినప్పచికీ నేనన్నమాట కూడా వాస్తవమే.

ఆమె నవ్వింది.

“పోన్లే. విజయని తీసుకురాలేక పొయ్యావా?” అంది.

నేను మాట్లాడలేదు.

“పాపం! విజయ ఎంత మంచిదోగదా?” అంది.

“మంచిచెడులనేవి వ్యక్తుల్లో వుండవు నిర్మలా. వాళ్ళని పరిశీలించే మనుషుల్ని బట్టే వుంటాయనుకుంటాను.” మరో చురక తగిలించాను. ఆ జడంలో చైతన్యం కలిగించడం నా వుద్దేశ్యం.

‘అవుననుకో!’ అని, మోకాలు మడిచి, విడిపోయిన జడని ముందుకేసుకుంది. మళ్ళీ దాన్ని అల్లుకుంటూ, “మరి విజయ మంచిది గాదంటావా?” అంది.

“అనను. మంచి చెడులనేవి వస్తువుల్లోనూ, వ్యక్తుల్లోనూ వుండవంటాను. వాటిని తూకం వేసి, విలువని ఆపాదించేవారి సంస్కారం మీద ఆధారపడతాయంటాను.”

“పోన్లే. విజయ కుట్లూ, అల్లికలూ యింకా చేస్తోందా?” అంది.

ఆమె అంతే! ఏ ఒక్క నిర్దుష్ట విషయం దగ్గరా నిలబడి ఆలోచించదు. చర్చని కొనసాగించదు. ‘పోన్లే!’ అనే మాటతో ఒక విషయం లోంచి మరో దాన్లోకి కప్పదాట్లు వేసుకుంటూ ఆమె సృష్టినంతటినీ కలియదిరుగుతుంది. ఆ స్వభావానికనుగుణంగానే ఆమె కనురెప్పలు చంచలంగా కదిలి చిత్ర విన్యాసాలు చేస్తాయి. నాలా వాక్యాన్ని ముందుగా నిర్మించుకుని, తర్వాత మాట్లాడడం ఆమెకి చేతకాదు. ఒక స్వాభావికమైన ఒరవడిలో, ఆమె నోటినుండి బయల్పడే ప్రతిమాటా సహజ రమనీయతను సంతరించుకుని మనల్ని కట్టిపడేస్తుంది. ఆమెతో మాట్లాడడం ఎప్పటికీ నాకు చిత్రంగానూ, కష్టంగానూ వుంటుంది.

“ఊ!” అన్నాను.

“కాఫీ తాగుతావా?. . . అయ్యో నామతిమండా!” అంటూ లోపలికి లేచి వెళ్ళింది. కాఫీ కలుపుకుని, మళ్ళీ తొందరగా తిరిగి వచ్చింది. గ్లాసు నాకందిస్తూ, “సుజాతకి పెళ్ళైంది తెలుసా?” అంది.

“ఏ సుజాత?”

“రామబ్రహ్మంగారమ్మాయి. మనం ఎనిమిదో తరగతిలో వుండగా దాని రవిక నువ్వు చింపేశావు గుర్తుందా?”

“ఆ. . గుర్తుంది!” అన్నాను.

“దానికి పెళ్ళయింది. బహుశా దానికి నువ్వంటే యిష్టమనుకుంటా. నీ ఫోటో ఒకటి ఎప్పుడూ దాని దగ్గరుండేది. మొగుడు నీలా బ్యాంకు ఆఫీసరయ్యుండాలనేది. కానీ, దానికి పాపం గుమాస్తా దొరికేడు. అయితే మంచివాడనుకో!” అంది.

నేనేమీ మాట్లాడలేదు. ఎందుకంటే. . .ఆమె ‘చెడ్డవాళ్ళు’గా ఆరోపించిన వాళ్ళని నేనింత వరకూ చూడలేదు.

“సుజాత పెళ్ళికి ముందు రోజు గిలకబావి దగ్గర జారి పడింది. ఎడమచెయ్యి విరిగింది. ఆ చేతికి కట్టు కట్టించుకుని మెడలో మూడు ముళ్ళు వేయించుకుంది. ఆరోజు పందిట్లో జనం ఒకటే నవ్వులు. అది కూడా నవ్వడమేననుకో. నువ్వుంటే నవ్వలేక చద్దువు!” నవ్వింది. నవ్వేప్పుడు రొమ్ములు నిండుగా, బరువుగా కదిలాయి. కళ్ళలో నీళ్ళు తిరిగాయి. పమిటతో కళ్ళు తుడుచుకుంది. కళ్ళు కొద్దిగా ఎర్రబారాయి.

“ఈ సారి మన పంచాయతీకి మోహనకృష్ణ పోటీ చేశాడు. చౌదరి వాళ్ళ గ్రూపు ఓడిపోయింది. పోనీలే యికనైనా ఊరు బాగు పడుతుంది.” అంది.

నేను వినడం లేదు. మాటలు నేర్చిన నిర్మలని గమనిస్తున్నాను.

“వెంకట్రావు వాళ్ళ నాన్న చనిపోయాడు తెలుసా?”

“అరె! ఎందుకని?” అన్నాను బాధా సూచకంగా.

“గుండెపోటు. సిగరెట్లు బాగా కాల్చేవాడనుకో” అంది. . . పెద్ద ప్రపంచ జ్ఞానం వున్నదానికి మల్లే. ఆపైన చీరని పాదాలమీదికి లాక్కుని, జడని ముడి పెట్టుకుంది.

“సురేష్ కి ఉద్యోగం వచ్చింది తెలుసా?” కళ్ళు చక్రాల్లా తిప్పుతూ అడిగింది.

నాకేం తెలుసు? ఒకటి మాత్రం తెలుసు! నా ఆలోచన, నా జ్ఞానం ఆమెని ఏమాత్రం ప్రభావితం చేయలేవని తెలుసు. మంత్రముగ్దుడినై నేనామె చేష్టలు అవలోకించడం తెలుసు. ఆమె ఒక కథా నాయకురాలు! తన యిష్టానుసారంగా కథను మలుపులు తిప్పుకుంటుంది. అమె అందమయిన స్త్రీ కాదని యింతకు ముందు అభిప్రాయపడేవాడిని. కానీ అది తప్పు. అమె అందం ముఖంలో వుండదు. ప్రవర్తనలో, శరీరంలో వుంటుంది. ఆ శరీరం నుండి వెలువడే ప్రతి కులుకూ, ప్రతి విరుపూ, ప్రతి కదలికా ఒక కదిలే స్త్రీత్వపు చిత్తరువుని పోలి చూపరుల్ని ఆకర్షిస్తుంది. సకల చరాచర సృష్టిలోని సౌందర్యాన్నంతా మూట కట్టుకుని మాటలతో ఆమె విశ్వ సంచారం చేస్తుంది.

“ఏ సురేషు?” అన్నాను. . . ఈ ప్రపంచంలోకి వస్తూ.

“అయ్యో. . .సురేషుని గూడా మరిచావా?” అని, “నీతోపాటు పెళ్ళయింది జూడు.” గుర్తుచేసింది.

నాకు అవకాశం దొరికింది.

“అందరి పెళ్ళిళ్ళ గురించి చెప్పడమేనా లేక నీదేమయినా వుందా?” అన్నాను. . .గంభీరంగా ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ.

( సశేషం )

Thursday, August 9, 2007

ప్రసంగి!..1 (కథ)

ప్రసంగి! (కథ)

నిర్మల పెళ్ళి మానుకుందన్నవార్త ఒక స్నేహితుడి ద్వారా విన్నప్పుడు జీవతంలో ఒక విలువైన మాట వింటున్నట్టు నేను శ్రద్దగా ఆలకించాను. ఆ మాట నిర్మల స్వతంత్రమైన వ్యక్తిత్వాన్ని తొలిసారిగా నాముందు ప్రదర్శించినప్పటికీ, ఆ తర్వాత అది నాలో చాలా వేదన కలిగించిన మాట వాస్తవం!

నిర్మల పెళ్ళి చేసుకోనంత మాత్రాన ఈ లోకానికి వాటిల్లే నష్టం ఏదీ వుండబోదని నాకు తెలుసు. కానీ, ఆమె నిర్ణయం జీవితంలో ఎదురైన చెడులో నుంచో, యింకేదయినా ప్రత్యేకతను సముపార్జించుకోవాలన్న అర్ధం లేని ఆతృత లోంచో జనించి వుంటుందేమోనని నా భయం! అట్లాగాక, జీవితం గమ్యాన్ని నిర్ధేశించుకున్న అవగాహన నుండీ, అది కలిగించిన స్థిరత్వంలో నుండీ రూపుదిద్దుకున్న నిర్ణయమైతే, ఆమెతో నాకు పేచీ లేదు.

నేనూ, నిర్మలా ఒకే పాఠశాల లోనూ కళాశాల లోనూ కలిసి చదువుకున్నాం. ఆమె ఏమంత అందమయిన స్త్రీ కాదు. అయినా, తమ తమ అందచందాలతో నన్ను పీడించి, ప్రభావితం చేసిన గొప్ప స్త్రీలతో సమానంగా సరితూగ గలిగే ఒక నిగూఢమైన వ్యక్తిత్వం నాకామెలో ఎప్పటికప్పుడు ప్రస్ఫుటమవుతూనే వుండేది. అయినా, నిర్మలని చూస్తే మౌనం పలకరించినట్టు మనసు ప్రశాంతంగా వుంటుంది. వెకిలితనమనేది ఏ కోశానా వుండదు. ఆమె సమక్షంలో నేనే గాక చాలా మంది. . . యువకులతో సహా భయంగా మసలుకోవడం నేను గ్రహించకపోలేదు. దానికి కారణం బహుశా ఏదీ వ్యక్తపరుచుకోక పోవడమంత గొప్ప వ్యక్తిత్వం ఈ లోకంలో మరోటి వుండదనుకుంటా!

నిర్మల వాళ్ళది అల్లూరులో మాపక్క యిల్లే! చిన్నప్పుడు కలిసి గవ్వలాటా, వెన్నెలకుప్పలూ ఆడుకునే వాళ్ళం. దుడుకు స్వభావం వల్లా, నిర్లక్ష్యం వల్లా ఆటలలో ఎక్కువసార్లు నేనే ఓడిపోయేవాడిని. ఓటమి వల్ల కలిగిన ఉక్రోషంతోనో, లేక సమాజం నుండి అప్పటికే పొందివున్న పురుషాధిక్యత వల్లనో నేనామెని కొట్టేవాడిని. తన్నేవాడిని. కానీ, నిర్మల నన్నేమీ అనేది కాదు. తన్నులన్నీ మౌనంగానే భరించేది. అయినా మళ్ళీ నాకెందుకో భయం వేసేది. ఆమె అసహాయత లోంచి ఒక శక్తివంతమయిన శాపం నన్ను వెంటాడుతున్నట్టు నాకు అన్పించేది.

అది నాకు బాగా గుర్తు! ఒకరోజు తొక్కుడుబిళ్ళాట మూలంగా జరిగిన ఘర్షణలో నేను నిర్మలని ఎడమ చెంప దగ్గర గట్టిగా కొరికేశాను. రక్తం వచ్చింది. వాళ్ళ నాన్న మా నాన్నతో గొడవ పడ్డాడు. మానాన్న నన్ను చితగ్గొట్టాడు. తర్వాత, ఆ గాయం మానడానికి ఆమెకి నెలరోజులు పట్టింది. గాయం ఏర్పరచిన గుర్తు ఆమె చెంప మీద ఈనాటికీ వుంది.

నిర్మల పుట్టగానే వాళ్ళ అమ్మ చనిపోయింది. అక్క పేరు ఇందిర. నాన్న పంచాయతీ ఆఫీసులో గుమాస్తా! వాళ్ళకి ఓ ఏడెకరాల పొలం వుండేది. కాస్త జరుగుబాటున్న కుటుంబపు మనుషుల్లో కనిపించే నిర్భీతి, దర్పం. . . బిగ్గరగా అరిచినట్టు మాట్లాడే ఆయన కఠంలో యిమిడి వుండేది. నిర్మల మౌనంలోని రహస్యం. . . బహుశా తండ్రి మాట్లాడే గుణం లోంచి పుట్టిన ఏహ్యతా భావనేయేమో నేను చెప్పలేను. పైగా మనుషుల వ్యక్తిత్వాల వెనుక లోపాల్ని, కారణాల్ని అన్వేషించడంలో నాకంత నమ్మకం లేదు. మేము డిగ్రీ చేస్తుండగా వదిలి పెట్టని టైఫాయిడ్ జ్వరంతో వాళ్ళ నాన్న చనిపోయాడు. అప్పటికే ఇందిరకి పెళ్ళయింది. భర్త ఇన్సూరెన్స్ కంపెనీలో వుద్యోగి. నిర్మల కొద్దిరోజులపాటు అక్కబావల ప్రాపకంలోనే పెరిగింది. ఆ తర్వాత కొంత కాలానికి వాళ్ళ బావ ట్రాన్స్ ఫర్ మీద భార్యతో సహా ‘చెన్నై’ వెళ్ళిపోవడం, నిర్మల బి.యిడి., టీచరుగా వుద్యోగం సంపాదించి, అల్లూరులోనే వుండిపోవడం, నేను బ్యాంకు ఆఫీసర్ గా హైదరాబాదులో సెటిలవడం, పెళ్ళి చేసుకుని యిద్దరు పిల్లల్ని కనడం కూడా వరుసగా జరిగిపోయాయి. అప్పటికి కూడా నిర్మల జీవితంలో చెప్పుకోదగ్గ మార్పేదీ నాకు కన్పించలేదు.

నా తల్లిదండ్రుల్ని చూడటం కోసం నేను హైదరాబాదు నుండి అల్లూరు వెళ్ళినప్పుడల్లా నిర్మలని తప్పకుండా కలిసేవాడిని. మేం రకరకాల విషయాల గురించి గంటలకొద్దీ ముచ్చటించుకునే వాళ్ళం. ఆ మాటల్లో కూడా నిర్మల ఏమంత ప్రత్యేకతని చాటుకునేది కాదు. రాజధాని విశేషాలు వింటున్నప్పుడు కళ్ళు పెద్దవి చేసి, చిత్రంగా వినేది. ఆమె ఎంత శ్రద్దగా, అమాయకంగా నా మాటల్ని వినేదంటే. . . భాగ్యనగరం అంతటికీ నేనొక్కడినే ఒక్కగానొక్క జమీందారీ మహారాజునన్నా ఆమె నమ్మేస్తుందనిపించేది. ఇందులో అతిశయోక్తి లేదు. ఎంతసేపు మాట్లాడినా, ఎన్నిసార్లు మాట్లాడినా ఆమెతో నాకింకా మాట్లాడాలనే అన్పిస్తుండేది. రేఖామాత్రంగానైనా ఒక అసంతృప్తి నాలో ప్రతిసారీ మిగిలిపోతుండేది.

ఒక పురుషుడి శరీరాన్ని పవిత్రం చేసి, కుటుంబాన్ని ఒక వెలుగు వెలిగించాల్సిన నిర్మల లాంటి స్త్రీ వివాహం లేకుండా మోడుగా జీవించడం నా హృదయంలో వెలితిని కలిగించేదనుకుంటా. . . పెళ్ళి గురించి ఒకటి రెండుసార్లు ప్రస్తావించాను. ఆ విషయం కదిలించగానే నిర్మల నవ్వి నేర్పుగా మాట తప్పించేది. అది వివాహం విషయంలో స్త్రీకి వుండే సహజమైన బిడియంగా, సిగ్గుగా భావించేవాడినేగానీ. . . స్థిరమైన నిర్ణయంతో కూడిన చర్యగా ఆనాడు నేను వూహించలేదు. ఒక సందర్భంలో ఎప్పుడో అన్నాను.

“ఇరవై ఆరేళ్ళొచ్చేయి!” అని.

ఆ మాటలో నిబిడీకృతమైన భావం తనకి అర్ధమైపోయినట్టుగా ఆమె ముఖం ఎరుపు వర్ణం దాల్చింది.

“అయితే ఏంజెయ్యాలంటావు?” విసుగ్గా, ఎరగనట్టు నటించినా, వెంటనే అడిగింది.

వయసులో వున్న ఒక స్త్రీ వివాహం గురించి మరో వయసులో వున్న పురుషుడు ఆమెతోనే ఆ విషయం చర్చించడం ఎంతైనా కొంచెం యిబ్బందికరం! మాటల్లో నిజాయితీ లోపించి, వ్యక్తుల బలహీనతలు చోటు చేసుకుంటాయనే మరో వైపు నిజం బహుశా ఆ యిబ్బందికి కారణమనుకుంటా!

“నీకు నిజంగా తెలీదా?” సూటిగా ప్రశ్నించినా, యిబ్బందిగానే అన్నాను.

“నా పెళ్ళి గురించా?” కళ్లు క్రిందికి వాల్చి, నెమ్మదిగా అడిగింది.

(సశేషం)

Wednesday, August 8, 2007

ధ్వజం! (కథ) -- దాని కథ!

"ధ్వజం!” కథ పూర్తయింది! కథ రాస్తున్నప్పుడు ఒకరిద్దరు స్నేహితులన్నారు ఎందుకలా కష్టాలూ, చావులూ. . .సరదాగా రాయొచ్చుగా అని. నిజమే రాయొచ్చు! సరదాగా వుండడమంటే ఎవరికి యిష్టం వుండదు? లక్ష రూపాయల విలువచేసే బైక్ మీద వెనక ఇద్దర్ని కూర్చోబెట్టుకుని నెక్లస్ రోడ్లు మీద వంద కిలోమీటర్ల స్పీడుతో వెళ్ళే కుర్రాడి సరదా, ఉల్లాసం ఎంత సేపు? రెప్పపాటు! ఆ సరదా సరైందనగలమా. మన సరదాలు కూడా యించుమించు ఈ మాత్రంలోనే వుంటాయనుకుంటా. ఎందుకంటే, బాగా జరుగుతున్నంత కాలం పొంగిపోతాం. పొరపాటున అనుకోనిది జరిగిందా కృంగిపోతాం! కానీ, ధ్వజం కథ ఏం చెపుతుంది. పదమూడు చావులూ.. ఒక భూకంప విపత్తు. . . అంతా ఏడుపుగొట్టు కథ. తెలుగు టీవీ సీరియల్ లాగా, అవార్డు సినిమాలాగా. . అంతేనా యింకేమయినా వుందా?

ఖచ్చితంగా కాదు! ఈ కథ ఒక ప్రయోజనాన్ని ఆశించి రాసింది. మీదో నాదో కాదు. విశ్వజనీన మానవుడి జీవన వైశాల్యం, అందులో ప్రమాదాల పారంపర్యతకున్నట్టి అపారమైన అవకాశం, ‘గతం’. . .భయానకమైన దాని విస్తృతి. . .మనిషి దాని పట్ల జాగరూకుడై వున్నప్పుడు కుంచించుకు పోయే దాని పరిధులు. ఈ మధ్య ఒకసారి యండమూరి వారన్నారు ఓ టీవీ ఛానల్లో. . . నాకిప్పుడు కోపం రావడం లేదు. కానీ, కోపం ప్రదర్శిస్తానని. దానర్ధం ఈ రోజుల్లో ఎంతమందికి తెలుసో లేదో నాకు తెలీదుగానీ, అంతర్ముఖుడై కోప స్వభావాన్ని తెలుసుకున్న వ్యక్తి. ఆ చెడుగు తనకి అంటకుండా దూరంగా వుంటాడనేది సారాంశం. అదే ‘ధ్వజం!’ చెప్పేది కూడా. మనిషి జీవితంలో బ్యాలెన్స్. . . మానసిక సంయమనం గురించి!

ఈ కథ ఎవరికి సంతోషాన్నిచ్చినా, యివ్వకపోయినా ఫర్లేదుగానీ చదివితే చాలు నాకదే పదివేలు! ఏ కారణంగానైనా బతుకులో భంగపడి నైరాశ్యంలో కొట్టుకుపోతున్న ఏ ఒక్క వ్యక్తి కయినా తన లోపలికి ఒకసారి చూసుకోవాలన్న స్పర్శ ఈ కథ కలిగించ గలిగితే నేను నేననుకున్నది సాధించినట్టే! మానవత్వం నా కథలకి ప్రాతిపదిక. దీనర్ధం. . . నేను సరదా కథలూ, హాస్యకథలూ రాయనని కాదు. అవీ రాస్తాను.

ఇక ఇందులో వాడిన భాష విషయం. కొంతమంది “ఎక్కువైంద”న్నారు. ఒకాయనైతే ఏకంగా “కొన్ని పదాలకి అసలు అర్దమేలేద”న్నారు. అలాంటి విమర్శ విసిరే ముందు ఒకసారి తెలుగు నిఘంటువు చూసి విసిరితే బావుంటుందని వారికి నా సూచన. ఏదేమైనా, సందర్భానికి తగినట్టే భాష ప్రయోగించానని నా ఉద్దేశ్యం. ఎందుకంటే 1996 లోనే విపుల వారి బహుమతి పొందిన నా తొలి కథ మహాపరాధి, యింకా బహుమతులందుకున్న స్వాతి కథలు యింతకంటే రెండితలు ఎక్కువ భాషతో భాసించినవే.

మొదటగా నాకు బ్లాగుల గురించి చెప్పిన స్నేహితుడు మదన్ గారికి, యిక కథ రాసేప్పుడు తమ కామెంట్లతో నన్ను ప్రోత్సహించిన ఎందరో మహానుబావుల్నీ, ఛాటింగ్ లోకొచ్చి సలహా యిచ్చిన వీవెన్ గారూ, కొన్ని సూచనలిచ్చిన సి.బి.రావు గారూ, ప్రదీప్ గారూ, కంప్యూటర్ ఎరా శ్రీధర్ గారూ. . .అన్నింటికీ మించి నేనెవరో తెలీకుండానే. . .నేనడక్కుండానే బ్లాగ్ డిజైన్ చేసి పెట్టి, నాచేత విసిగించబడ్డ మానవ చక్రం మరియూ మహిళా సవ్యసాచి వలబోజు జ్యోతమ్మలు గారూ. . . అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటూ. . . “రేపట్నుండి “ప్రసంగి” అనే కొత్త కధతో మీ ముందుకు రాబోతున్నాన”ని తెలియజేసుకుంటూ. . .వినమ్రతతో. . .

మీ . . . వింజమూరి విజయకుమార్